జీవితంలో ఎదగాలన్నా, ఆగిపోవాలన్నా కారణం ఇవే!

మనిషి జీవితంలో వర్తమానం మాత్రమే చాలా ముఖ్యమైన అంశం. అయితే గతం అనేది అనుభవాలు మిగులుస్తుంది, అదే జ్ఞాపకాలను మనదగ్గర వదిలిపోతుంది. ఆ జ్ఞాపకాలను తలచుకుంటూ ఉంటే గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉన్నట్టే. చాలామంది గతంలో ఇలా అని వాటి గురించి ఆలోచిస్తూ వర్తమానంలో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు.  గతాన్ని, వర్తమానాన్ని రెంటినీ సరిచూసుకుంటూ గతాన్ని తలచుకుంటూ అక్కడే ఉండిపోతారు కొందరు. వర్తమానంలో లక్ష్యాలను నిర్ణయించుకోవాలి, ఆ లక్ష్యాలను సాధిస్తూ వ్యక్తిత్వాన్ని క్రమంగా ఒక ఉన్నత స్థాయికి చేర్చుకోవాలి. అప్పుడే వ్యక్తిత్వం ఎదిగినట్టు అవుతుంది. మనుషులకు సంస్కారం ఎంతో ముఖ్యం. ఒక సమాజ పౌరుడిగా, నాయకుడిగా, ప్రతిభ కలిగిన కళాకారులుగా, గొప్ప ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలుగా ఈ సమాజంలో రూపాంతరం చెందాలి. అప్పుడే సమాజం ముందుకు సాగుతుంది. గతాన్ని గురించి ఆలోచించే వ్యక్తుల వల్ల సమాజం, కులం, దేశం ముందుకు కదలకుండా అభివృద్ధి అనేది లేకుండా అక్కడే ఆగిపోతాయి. వారి అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. ఈ ప్రపంచం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం మనిషి ఆదిమకాలం నుండి అక్షరాస్యుడిగా ఎదగడం అనే విషయాన్ని అందరూ చూపిస్తారు. అయితే గతాన్ని గురించే ఆలోచించేవారు ఆధునిక సమాజంలో ఆదిమానవులు జీవించినట్లుగా ఉంటుంది. అంటే అభివృద్ధి శూన్యమని అర్థం. ఎప్పుడూ గతానికి అనుకూలంగా బతకకూడదు. మనిషి జీవితం ఎలా ఉండాలంటే వర్తమానం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తున్నట్టు ఉండాలి. అంటే వర్తమానం నుండి గతం ఆలోచించడం అనేది ఇంకా వెనక్కు వెళ్తున్నట్టు అని అర్థం.  అనవసరమైన భయాలు, అనుమానాలు వదిలివేయాలి. ఈ ప్రపంచంలో సంస్కృతి, అలవాట్లు గతంనుంచి వస్తున్నవే. అవి ఇప్పక్టికిప్పుడు పుట్టి మనుషుల్ని నసహణం చేయలేదు. సంస్కృతి, అలవాట్లు అనేవి ఎప్పుడూ జీవితంలో ఎదుగుదలకు ఆటంకాలు కాకూడదు. జీవితంలో ఎదుగుదలకు ఇబ్బంది అయ్యే ఆలోచనలను, స్నేహాలు, న్యాయకత్వాలను వదిలేసుకోవాలి.   ఈకాలంలో మనిషి తనకు తాను ఎంపిక చేసుకోగలిగినన్ని అవకాశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇది రాజులకాలం నాటి పాలన కాదు, భూస్వాముల నాటి అజమాయిషీ కాదు, కుల వ్యవస్థలో కూరుకుపోయే దశ కాదు. ఇది మనిషి చైతన్యవంతుడై ఈ ప్రపంచాన్ని శాసించవలసిన పారిశ్రామిక సమాజం, ప్రజాస్వామిక సమాజం, ప్రపంచీకరణ పొందుతున్న ప్రజాస్వామిక సమాజం. జీవితాన్ని గెలుచుకోవడం వైపే మనుషుల ఆలోచనలుండాలి. జీవితాన్ని గెలుచుకోవడానికి స్ఫూర్తిని ఇచ్చే వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే మనిషి ఆలోచన మారుతుంది.  ఈ ప్రపంచంలో మనిషిని ఒక వృత్తంలో ఉంచడానికి ఎన్నో పద్ధతులను, మరెన్నో విషయాలను నిర్ణయించారు. వీటిలో మతాలు, మతాల విశ్వాసాలు కూడా ఒకటి. ఎన్నో సిద్ధాంతాలు మనుషుల్ని కొన్ని అవకాశాలకు దూరం చేస్తాయి  వాటిని నమ్మితే మంచి, లేకుంటే చెడు అన్నట్టు అవి నొక్కి వక్కాణిస్తాయి. కానీ నిజానికి ఇలాంటి ఆలోచనలే నిజమైన సమస్యలు సృష్టిస్తాయి. ఈ ప్రపంచంలో మనిషి ఎదుగుదలకు తెలివి, కష్టం, ఆత్మవిశ్వాసం వంటివి మాత్రమే దోహదం చేస్తాయి తప్ప మతవిశ్వాసాలు, మతపరమైన నమ్మకాలు కాదు. ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచించాలి. హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది. మతపరమైన కారణాల వల్లనో, ఇతర కోణాల్లోనో ఆలోచిస్తే వాటిలో ఖచ్చితమైన సారాంశం అర్థం కాదు. ఏదైనా మనసును కల్లోలం చేస్తే దాన్నుండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడాలి. ఎదుగుదలకు తగిన నమ్మకాలు ఏర్పరుచుకోవాలి. నూతన జ్ఞానం అందిన కొద్దీ విశ్వాసాలను మార్చుకోవాలి. ఎంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటే అంత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంత మంచి ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకోగలుగుతాము.  మానవ సంబంధాలలో ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. అవే  విలువలు. విలువలున్న చాలామందికి  లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు  ఉద్యోగం గురించి కావచ్చు, వేరే ఇతర విషయాలు కావచ్చు. ఇంకా జీవితం, స్నేహాలు, ప్రేమ ఇవన్నీ కూడా విలువలతో కూడుకుని ఉంటాయి. భారతీయ సంస్కృతి కూడా గొప్ప విలువలు కలిగినదే.  వీటి గురించి సరైన సమయంలో సరైనవిధంగా నిర్ణయాలు తీసుకోవాలి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మనిషి జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాయి.  తీసుకునే నిర్ణయాలు సరైనవే అయినా ఆలస్యమైతే అవకాశాలు చేజారుతాయి కదా. ఏవో భయాలు, శకునాలు అడ్డుపెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోతే అపుడు జరిగేది నష్టమే. ఏఏ విలువలు, లక్ష్యాలు, మన సంస్కృతి మొదలైనవాటిని ఒక కోణంలో నుండి చూసే అలవాటు వల్ల అందరికీ ఆవైపు మాత్రమే అర్థమవుతుంది. అందుకే విషయాన్ని మొత్తం క్షుణ్ణంగా అన్ని కోణాల్లో నుండి చూడాలి, అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎదగడానికి, ఆగిపోవడానికి కూడా ఒక విషయాన్ని చూసే కోణం కారణమవుతుంది.                                         ◆నిశ్శబ్ద.

సమానతలు లేని సమాజమే మన ధ్యేయం.. 

    రాజుల కాలం నుంచి రాజ్యాంగాలు రాసుకున్న కాలం దాకా వచ్చిన మన సమాజంలో  ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం దొరకని అంశం ఒకటుంది. అదే సామాజిక న్యాయం.  ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం సాధించాల్సిన  ఆవశ్యకతని గుర్తించి  2007లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని  ప్రకటించింది.  2009 నుండి ప్రతి సంవత్సరం  ఫిబ్రవరి 20న అధికారికంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  ఈ దినోత్సవం ప్రధానంగా పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక అసమానతల తొలగింపు, లింగ సమానత్వం, ఉపాధి హక్కులు, సమానావకాశాల ప్రోత్సాహం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు  సహాయపడుతుంది. విభిన్న సంస్కృతులు, భిన్న సామాజిక స్థాయిలున్న భారతదేశంలో  సామాజిక న్యాయం అందించటం ఎంత అవసరమో, అది సాధించటంలో  ఉన్న సవాళ్లేమిటో, మన దేశం తీసుకుంటున్న చర్యలేమిటో తెలుసుకుంటే.. భారతదేశంలో సామాజిక న్యాయం.. చరిత్రపరంగా భారతదేశం సామాజిక అసమానతలు, కుల వివక్ష, లింగ వివక్ష, ఆర్థిక అసమానత వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. అయితే, భారత రాజ్యాంగ నిర్మాత అయిన  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం సామాజిక న్యాయం అనే భావనకి  ప్రత్యేక  స్థానాన్నిచ్చింది.  భారత రాజ్యాంగం కుల, మత, లింగ, ప్రాంత, ఆర్థిక వివక్ష లేకుండా సమాన హక్కులు కల్పించటం ద్వారా,   సంపద కొద్దిమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతం కాకుండా  ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా,  ప్రతీ పౌరుడికి సమాన రాజకీయ హక్కులు ఉండేలా చూస్తుంది. అలాగే  సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాలకి విలువనిచ్చింది.  ఈ లక్ష్యాలను అనుసరించి ప్రభుత్వం విభిన్న సంక్షేమ పథకాలు, చట్టాలు, విధానాలు అమలు చేస్తోంది. సామాజిక న్యాయం కోసం.. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం విద్య-ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, స్కాలర్‌షిప్లు, ఎస్సీ/ఎస్టీ సబ్‌ ప్లాన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను  అమలు చేస్తున్నారు. “ఎం‌జిఎన్‌ఆర్‌ఈజిఏ” పధకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని  పేదల కోసం 100 రోజుల పనిని కల్పించి,    లక్షలాది గ్రామీణ కుటుంబాలకి  ఉపాధినిస్తున్నారు.  మహిళలపై వివక్ష తగ్గించేందుకు, లింగ సమానత్వం పెంచేందుకు ప్రయత్నం చేస్తూనే,  ‘బేటీ బచావో, బేటీ పడావో’ వంటి పధకాల ద్వారా  బాలికల భద్రత, విద్య, ఆర్థిక స్వతంత్రతల మీద   దృష్టి పెట్టారు. "ప్రతి భారతీయుడికి గృహం" అనే లక్ష్యంతో ఉన్న  ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రీ ఆవాస్ యోజన’ పథకం ద్వారా పేదలకు తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణం చేస్తుంది. ఆర్థికంగా బలహీనమైన  కుటుంబాలకు 5 లక్షల రూపాయల  వరకు ఉచిత వైద్యం అందించే లాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా పేరు పొందిన ‘ఆయుష్మాన్ భారత్’ పధకాన్ని మన దేశం అమలు చేస్తుంది. అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్ భద్రత కోసం , ఉద్యోగ అవకాశాలు, బీమా వంటివి అందించటం కోసం  ‘ఇ-శ్రమ్ పోర్టల్’ నిర్వహిస్తుంది.   సమస్యలు-సవాళ్లు.. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ సమాజంలో మార్పు రాకపోవటంతో  భారతదేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం ఆధారంగా వివక్ష కొనసాగుతోంది.  అందుకే సామాజిక ఆలోచనని మార్చే ప్రయత్నం చేయాలి. విద్య, ఉపాధి, వేతనాల్లో మహిళలకు సమాన అవకాశాలు దొరక్క లింగ అసమానత కొనసాగుతూ ఉంది. భారతదేశంలో కోటీశ్వరులు ఉన్నప్పటికీ, పేదరికంలో బతికే కోట్ల మంది ప్రజలు కూడా ఉన్నారు. వీరిని దారిద్ర్య రేఖనుంచి పైకి తీసుకొచ్చి  ఆర్థిక న్యాయం చేయటానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి.  ఇప్పటికీ విద్య, వైద్య సేవల్లో అసమానత ఉంది.  కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో  నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం మనకు సమాజంలోని అసమానతలను గుర్తించి, వాటిని తొలగించే మార్గాలను అన్వేషించేందుకు ప్రేరణ కల్పిస్తుంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సామాజిక న్యాయం అమలు చేయడం అత్యంత కీలకం. సమాన అవకాశాలు, సమాన హక్కులు, సామాజిక సంక్షేమం అనే విలువలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ విధానాలు, చట్టాలు ఎంతగానో సహాయపడతాయి. అయితే ప్రతీ పౌరుడు సామాజిక న్యాయం అమలు చేయడంలో పాత్ర వహించాలి. కుల వివక్ష, లింగ వివక్ష, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమాజంగా కలిసి కట్టుగా పనిచేయాలి.                                          *రూపశ్రీ.

విద్యార్థులు విజయం సాధించాలి అంటే.. ఈ పనులు చెయ్యాలి!

  ప్రతీ విద్యార్థి సర్వసాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య పట్టుదల కోల్పోవడం. సాధారణంగా విద్యార్థి మనస్తత్వం ఎలా ఉంటుందంటే 'సినిమాకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వర్షం కురిస్తే దాన్ని ఆటంకంగా భావించడు. అదే వర్షం కళాశాలకు బయలుదేరుతున్నప్పుడు పడితే దాన్ని మాత్రం పెద్ద ఆటంకంగా భావిస్తాడు'. అందుకు కారణం అతడి అభిరుచి చదువుపై కన్నా సినిమాపైనే అధికంగా ఉండడమని మనకు అర్థమవుతుంది. అభిరుచి - ఉత్సాహం - మనోబలం = లక్ష్యసిద్ధి.  ముందు మనం చేసే పని మీద అభిరుచి కలిగి ఉండాలి. ఎప్పుడైతే పని పట్ల అభిరుచి ఏర్పడుతుందో అప్పుడు దాన్ని సాధించేందుకు ఉత్సాహం పెరుగుతుంది. అలాంటి ఉత్సాహం ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొనే మనోబలాన్ని సమకూరుస్తుంది. ఆ మనోబలంతో లక్ష్యాన్ని సాధించవచ్చు. విద్యార్థి అయినా, వ్యాపారవేత్త అయినా, శాస్త్రవేత్త అయినా, ఏ ఇతర రంగానికి చెందినవారైనా తమ లక్ష్యసిద్ధికి పైన తెలిపిన సూత్రమే అనుసరణీయం. మానవుని ప్రగతి సౌధానికి ఉత్సాహమే పునాది. ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చనే మనోబలం చేకూరుతుంది. అది లేకపోతే అంతా అసాధ్యంగా తోస్తుంది.  Enthusiasm is at the bottom of all progress. With it there is accomplishment. Without it there is only disappointment. Mary Mc Carthy ఉత్సాహం గమ్యాన్ని చేర్చే వాహనమైతే, దాన్ని నడిపించే ఇంధనమే మనోబలం. జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ సాధించ లేకపోవడానికి కారణం మనోబలం లేకపోవడం. ఏమీ లేకపోయినా దేనినైనా సాధించడానికి కారణం మనోబలం కలిగి ఉండడం. కాళ్ళు, చేతులు లేని అవిటివారైనా, చూపు లేని అంధులైనా, మాటరాని మూగవారైనా, కటిక దారిద్య్రం కబళించినా మనోబలంతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. అలాంటి మహాత్ముల గురించి తెలుసుకుంటే మన లక్ష్యసిద్ధికి కావాల్సిన అభిరుచి, ఉత్సాహం, మనోబలం పెంపొందుతాయి. అంధత్వం, మూగతనం, చెవుడు - మూడూ కలిసి పరిహాసం చేసినా దిగులుచెందక అంతరిక్షంలో తొలిసారిగా పయనించిన మహిళ తెరిస్కోవా. చెవిటివాడైనా సంగీత సామ్రాజ్యానికి సామ్రాట్గా నిలిచాడు బెతోవెన్. కటిక దారిద్య్రం కాఠిన్యం  ప్రదర్శించినప్పటికీ విద్యావంతులై భారత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి, అమెరికా అధ్యక్షునిగా అబ్రహం లింకన్లు ఖ్యాతి గడించారు. ఆగని కెరటాలలా ఒకదాని తరువాత ఒకటి వచ్చే అపజయాలకు నిరాశ చెందకుండా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగారు థామస్ ఆల్వా ఎడిసన్. ఇలాంటి స్ఫూర్తి దాతలు ఎంతోమంది ఉన్నారు. వీరందరినీ చరిత్ర పుటల్లో చిరస్మరణీయులుగా చేసిన ఒకే ఒక్క మహత్తరశక్తి 'మనోబలం'. అలాంటి మనోబలం, ఆత్మశక్తి మనలో కూడా వృద్ధి చెందాలంటే… మనోబలం పెంపొందడానికి  స్వామి వివేకానంద ఇచ్చిన సందేశాలు ప్రతి నిత్యం మననం చేయాలి. To succeed, you must have tremen- dous perseverance, tremendous will. "I will drink the ocean," says the perse- vering soul, "At my will mountains will crumble up". Have that sort of energy, that sort of will, work hard, and you will reach the goal. - Swami Vivekananda మనోబలానికి మారుపేరుగా నిలిచిన మారుతి వజ్రాసనంలో కూర్చొని ఉండడాన్ని చిత్రపటాల్లో మనం గమనించవచ్చు. వజ్రాసనం మనోబలాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాల పాటు 'వజ్రాసనం' అభ్యసించాలి. ఆత్మశక్తికి ప్రతీకలుగా నిలిచిన వీరహనుమాన్, ధీర వివేకానందలను ఆదర్శంగా తీసుకొని ఈ రెండు సూచనల్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే, మనోబలం తప్పక పెంపొందుతుంది. అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధించవచ్చు. ఇది విద్యార్థులందరికీ ఎంతగానో తోడ్పడుతుంది.                                        *నిశ్శబ్ద.

పెళ్లయ్యాక మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోకపోతే జరిగే నష్టాలు ఇవే..!

  పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చట్టపరమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.  ఇదివరకు పెళ్లి అనేది పెద్దల నిర్ణయం తో ముడి పడి.. పలువురిని ఆహ్వానించి అందరి ఆశీర్వాదాల మధ్య జరిగేది.  ఇప్పుడు కూడా ఇలానే జరుగుతున్నా అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు వచ్చాయి.  పెళ్లికి చట్టపరమైన భద్రత ఏర్పరిచారు. పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తారు.  అయితే చాలామంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు.  అసలు మ్యారేజ్ సర్ఠిఫికేట్ వల్ల కలిగే లాభాలు ఏంటి? పెద్దల సమక్షంలో అందరి అంగీకారంతో పెళ్ళి జరిగినా, ప్రేమ వివాహాలు చేసుకున్నా ప్రతి జంట మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటారు ఎందుకు? దీని వెనుక గల కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. వివాహ ధృవీకరణ పత్రం.. పెళ్లైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందుకోసం వివాహ పత్రిక,  పెళ్లి సమయంలో తీయించుకున్న ఒక ఫొటో ప్రభుత్వానికి సమర్పించాలి.  ఇవన్నీ చూశాక ప్రభుత్వం ఆ జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తుంది.  ఇది పెళ్లి చేసుకున్న జంటలకు వివాహ బంధం గురించి భరోసా ఇస్తుంది.  ఇందులో ఎవరూ మోసపోయే అవకాశం లేకుండా చేస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల మరిన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయి. ఇప్పటి భార్యాభర్తలు భవిష్యత్తు మీద చాలా ప్లానింగ్ తో ఉంటున్నారు.  భార్యాభర్తలు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసే వారు అయితే వారు విదేశాలకు వెళ్లాలనే ప్లానింగ్ తో ఉంటే వారికి తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి.  మ్యారేజ్ సర్టిఫికెట్ లేని పక్షంలో వారికి వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ధృవీకరణ పత్రం లేకుండా బ్యాంకు డిపాజిట్లు,  జీవిత భీమా, భీమా సౌకర్యాలు,  బ్యాంకు లోన్లు తదితర ప్రభుత్వ,  ప్రైవేటు ప్రయోజనాలు పొందలేరు.  అది చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా నామినీ పేరు నమోదు కాకపోతే చాలా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మహిళలకు మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా అవసరం.  ఒకవేళ భర్త మరణిస్తే అతనికి సంబంధించిన ఆస్తులపై తన హక్కులను క్లెయిమ్ చేయాలని అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.  అది లేకపోతే భర్తకు సంబంధించిన ఆస్తులపై హక్కుల కోసం ఆమే చాలా పోరాడాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్న తరువాత విడాకులు లేదా వివాదాలు ఏర్పడితే.. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా దాన్ని గెలిపించుకోవడం కష్టం.  ఆ వివాహం చెల్లుబాటును సవాలు చేయవచ్చు.  రిజిస్ట్రేషన్ లేకుండా సరైన ఆధారాలు లేని వివాహాలను ప్రభుత్వం చట్టవిరుద్ధమైనవిగా సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది కూడా. కాబట్టి ఇప్పట్లో వివాహాల చెల్లుబాటుకు సరైన ఆధారాలు, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. కొన్ని సార్లు వివాహం పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మోసపోతుంటారు.  వివాహం అనంతరం మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా.. సరైన ఆధారాలు లేకుండా చేసి వారిని మోసం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి మోసాలలో ఎక్కువగా నష్టపోతుంటారు. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డు కట్ట వేయవచ్చు.                                                 *రూపశ్రీ.  

ఇలా క్లీన్ చేస్తే ల్యాప్టాప్ మిలమిలా మెరుస్తుంది..!

ల్యాప్టాప్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి. దీని వల్ల ల్యాప్టాప్ జీవితకాలం పెరుగుతుంది. ల్యాప్టాప్ శుభ్రంగా ఉంటే దానికి ఎలాంటి ఫిజికల్ సమస్యలు రావు.  ల్యాప్టాప్ ను శుభ్రంగా ఉంచుకుంటే దుమ్ము,ధూళి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల నుండి రక్షణ ఉండటమే కాకుండా ల్యాప్టాప్ కొత్తదానిలా కూడా ఉంటుంది. కొన్ని సులభమైన చిట్కాలతో ల్యాప్టాప్ ను శుభ్రం చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ను క్లీన్ చేసేముందు ల్యాప్టాప్ ను ఆఫ్ చేయాలి.  పవర్ కార్డ్ ఉంటే దాన్ని కూడా తొలగించాలి.  ఇది డేటాకు రక్షణ ఇస్తుంది. స్క్రీన్ ను శుభ్రం చేయడానికి మైక్రో పైబర్ క్లాత్ ను ఉపయోగించాలి.  స్క్రీన్ మీద నేరుగా నీటిని కానీ ఏదైనా లిక్విడ్ కానీ వేయకూడదు. కీబోర్డ్ శుభ్రపరచడానికి వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించాలి.  కీబోర్డ్ లో అంటుకున్న దుమ్ము, ధూళిని తొలగించడానికి మౌత్ పిక్ లేదా మృదువైన క్లాత్ ను కూడా ఉపయోగించవచ్చు. ల్యాప్టాప్ స్క్రీన్ మినహా  ఇతర భాగాలను శుభ్రం చేయడానికి కొద్దిగా స్పిరిట్,  లేదా ఐస్ ఆల్కహాల్ వైప్ లను ఉపయోగించాలి.  మిగిలిన ల్యాప్టాప్ ను మైక్రో ఫైబర్ క్లాత్ తో తుడవాలి. కీబోర్డ్ లేదా స్క్రీన్ ను శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. ల్యాప్టాప్ లో ఏ వస్తువులను స్క్రాచ్ చేయకుండా ఇది జాగ్రత్తగా ఉంచుతుంది. ల్యాప్టాప్ లో నీరు చేరితే షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుంది. అందుకే నీటితో శుభ్రం చేయడాన్ని నివారించాలి. ల్యాప్టాప్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల ధుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి.  ల్యాప్టాప్ మెరుగ్గా ఉంటుంది. ల్యాప్టాప్ మోడల్ పై దాన్ని శుభ్రం చేసే తీరు ఆధారపడి ఉంటుంది.  ల్యాప్టాప్ శుభ్రపరిచే పద్దతులు విభిన్నంగా ఉంటాయి.  కాబట్టి ల్యాప్టాప్ మాన్యువల్ ను చదవిన తరువాతే ల్యాప్టాప్ ను శుభ్రం చేయాలి.                                                     *రూపశ్రీ.

మతాలన్నీ  మోక్షానికి వేర్వేరు మార్గాలు అని చెప్పిన ఆధ్యాత్మిక సాధకుడు.

  పుట్టిన ప్రతీ మనిషి ఈ సృష్టిని ఒక శక్తి నడిపిస్తుందని, ఆ శక్తి దేవుడే అని రకరకాల పేర్లతో, రూపాలతో కొలుస్తూ ఉంటారు. అయితే భగవంతుని గురించి అన్వేషించటాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లి, సాదారణ మనిషి భాషలో భగవంతుని రహస్యాన్ని వెల్లడించిన మహానుభావుడు శ్రీ రామకృష్ణ పరమహంస. సత్యాన్ని అన్వేషించడమెలాగో  ఆయన తన జీవితం ద్వారా చెప్పారు. ఉపనిషత్తులు, ఋషులు చెప్పే సత్యం ఒక్కటే.  వివిధ మత పండితులు దాన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారని రామకృష్ణ పరమహంస చెబుతారు. 19వ  శతాబ్దపు మధ్యలో జన్మించిన శ్రీ రామకృష్ణ  మతాలన్నీ కూడా తమ   ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆ పరమ సత్యం  తెలుసుకునే  వివిధ మార్గాలేనని  గ్రహించి, ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన జీవితం ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాల అని చెప్పవచ్చు.  ఫిబ్రవరి 18 , 1836లో జన్మించారు.  ఆయన జయంతి సందర్భంగా  ఆయన జీవిత విశేషాలు గురించి మరింత తెలుసుకుంటే..   శ్రీ రామకృష్ణ పరమహంస.... రామకృష్ణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ  విద్యలో మాత్రం అంతగా రాణించలేదు.  ఆయన బెంగాళీ భాష మాత్రమే మాట్లాడగలిగేవారు. ఇంగ్లీష్, సంస్కృత భాషలు తెలియవు. 1843లో ఆయన తండ్రి మరణించడంతో, ఆయన అన్నయ్య రామ్‌కుమార్ కుటుంబ బాధ్యతలు చేపట్టారు. పేదరికం వల్ల రాంకుమార్, రామకృష్ణలిద్దరూ కలకత్తా కాళికామాత ఆలయంలో పురోహితులుగా చేరారు.  రామకృష్ణ 23 ఏళ్ల వయసులో శారదా దేవిని వివాహం చేసుకున్నారు.  అప్పటికి ఆమె ఐదేళ్ల చిన్నారి. ఆ తర్వాత ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల ఈ వివాహం భౌతికంగా కొనసాగలేదు. అయినప్పటికీ మరణించేవరకు ఇద్దరూ కలిసి జీవించారు. 1856లో అన్నయ్య రాంకుమార్ మరణించడంతో, రామకృష్ణ పూర్తిగా కాళీ మాత ఆరాధనలో నిమగ్నమయ్యారు. ఆధ్యాత్మిక అన్వేషణ- కాళీ మాత దర్శనం.. ఆయన నిరంతరం కాళీమాత ఆరాధనలో ఉండేవారు.. కాళీమాతను అమ్మగా భావించేవారు.. అమ్మా అమ్మా అంటూ కాళీమాత  ప్రత్యక్ష దర్శనం కోసం గంటల తరబడి ఏడ్చేవారు. భగవంతుని దర్శనం కోసం ఆరాటపడ్డారు. ఆయన శరీరమంతా విపరీతమైన మంటని అనుభవించేవారు. ఆ మహాతల్లి ఎందుకు ప్రత్యక్షం కావడం లేదని బాధపడుతూ, ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్థితికి చేరుకున్నారు. చివరికి ఆయనకి కాళీమాత దర్శనమయ్యిందని, ఆ ప్రత్యక్ష  దర్శనాన్ని అనుభవించినప్పుడు అపారమైన కాంతి సముద్రంలో లీనమైపోయారని చెబుతారు.   వివిధ మతాల్లో సాధన- సర్వ మత సమానత్వ భావన.. తన తొలి దర్శనానంతరం, రామకృష్ణ అనేక ఇతర మత పద్ధతుల్లో కూడా ఆధ్యాత్మిక సాధన చేయటం  ప్రారంభించారు. వైష్ణవం, శక్త సంప్రదాయం, అద్వైత వేదాంతం, ఇస్లామిక్ సూఫీ సంప్రదాయం, రోమన్ కాథలిక్ క్రైస్తవం వంటి అన్ని మార్గాలను అనుసరించి అన్ని మతాలు సాధన చేసిన తర్వాత కూడా ఆయనకు ఒకేలాంటి పరబ్రహ్మం అనుభూతి కలిగింది. క్రైస్తవులు దేవునిగా కొలిచే యేసు ప్రభువు కూడా ఒక యోగిలాగానే  కనిపించి ఆయనను హత్తుకొని అనంతంలో కలిసిపోయినట్టు ఒక దివ్య దర్శనం కలిగింది. అందుకే శ్రీ రామకృష్ణ అన్ని మతాలు ఒక్కటే, అందరి అన్వేషణకి అంతిమ స్థానం ఒకటేనని చెప్పారు.  ఆయన సందేశం "అన్ని మతాలూ ఒకే దివ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి వేర్వేరు మార్గాలు" అనే దానికి పునాది వేసింది. గురువుకు తగ్గ శిష్యుడు   స్వామి వివేకానంద.. అన్ని మతాలూ ఒకే భగవంతుని వైపు దారి తీస్తాయని,  సనాతన ధర్మం ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియ పర్చాలని,  ప్రతి వ్యక్తిలోనూ ఉండే  దివ్యత్వాన్ని గుర్తించాలని,  కేవలం గ్రంథాల పరిశీలన కాకుండా ఆచరణ ద్వారా భగవంతున్ని అనుభవించాలని చెప్పిన రామకృష్ణ సందేశాన్ని ఆయన తర్వాత ఆయన  శిష్యులు గ్రంథాలు రాయటం ద్వారా, మఠాలు ఏర్పాటుచేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారు. వీరిలో స్వామి వివేకానంద ప్రముఖుడు.  స్వామి వివేకానంద జీవించినది చాలా తక్కువ కాలమే అయినా ఆయన భారతీయ సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా భారతీయ యువతను చాలా ప్రభావితం చేశారు.   శ్రీ రామకృష్ణ జీవితం, ఆయన బోధనలు ఆధ్యాత్మికతపై ఒక అపూర్వమైన అధ్యాయం. ఆయన హిందూమతానికి అతీతంగా, అన్ని మతాలకూ ప్రేరణనిచ్చే సమన్వయ దార్శనికుడు. అందుకే ఆయన ఒక పరమ పురుషుడు, నిజమైన వేదాంత జీవన మూర్తి!                                                *రూపశ్రీ

మరణమంటే జీవితంలో బాగమని చెప్పకనే చెప్పిన తత్వవేత్త.. జిడ్డు కృష్ణమూర్తి వర్థంతి..!

  జె.కె అంటే ఆధ్యాత్మికత, తత్వ చింతనల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తులు,  పుస్తకాలను అధ్యయనం చేసిన వారికి బాగా తెలిసి ఉంటుంది. కానీ చాలామందికి జె.కె అంటే జిడ్డు కృష్ణమూర్తి అని తెలియదు.  జిడ్డు కృష్ణమూర్తి భారతదేశపు ప్రసిద్ధ తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు. నిజానికి జిడ్డు కృష్ణమూర్తి ఒక గొప్ప గురువు అని చెప్పవచ్చు. కానీ ఆయన గురువు అని పిలిపించుకోవడానికి నిరాకరించారు. ఫిబ్రవరి 17,  1986లో జిడ్డు కృష్ణమూర్తి మరణించారు.  ఈ సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే.. జిడ్డు కృష్ణమూర్తి గొప్ప తత్వవేత్త,  ఆధ్యాత్మిక బోధనలు ఎన్నో ఈయన నుండి వెలువడ్డాయి.  ఈయన చేసిన బోధనలలో అశాశ్వతం అనే ఇతివృత్తం గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది. ఈయన ఇచ్చిన తొలి ఉపన్యాసం నుండి చివరి వరకు మరణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవశ్యత గురించి ఈయన ఎక్కువ మాట్లాడారు. మరణానికి భయపడకూడదని,  మరణాన్ని వాయిదా వేయకూడదని, మరణాన్ని తిరస్కరించకూడదని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారు.దీన్ని బట్టి మరణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలనేది జిడ్డు కృష్ణమూర్తి తత్వమని అర్థం అవుతుంది. అంటే.. మరణం గురించి అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.  ప్రతి మనిషి జీవించడం పట్ల ఎంత ఉత్సుకతతో.. ఎంత ఆశతో ఉంటాడో.. మరణం విషయంలో కూడా అంతే ఉత్సుకతతో ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి చెప్తారు. జిడ్డు కృష్ణమూర్తి మరణాన్ని గమనిస్తే.. ఆయన మరణం గురించి, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి ఆయన చెప్పిన విషయాలకు ఒక రూపం ఇస్తే ఆయన మరణం వైపు సాగిన ప్రయాణం కూడా అదే విధంగా ఉంటుంది. జీవితంలో ప్రతి అంశానికి ఒక స్పష్టత ఉంటుంది. అదే విధంగా మరణానికి కూడా ఒక స్పష్టత అనేది ఉంటుంది.  దాన్ని ఇతర విషయాల లాగే భావించినప్పుడు మరణం అంటే భయం,  బాధ, తప్పించుకోవాలని పారిపోవాలనే ప్రవర్తన అస్సలు ఉండవట. జిడ్డు కృష్ణమూర్తి మరణం గురించి చెప్పిన విషయాలు అక్షరాలా పాటించాడని చెప్పడానికి ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే సాక్ష్యులు.   జిడ్డు కృష్ణమూర్తి మరణాన్ని జీవితానికి విరుద్దమైన అంశంగా ఎప్పుడూ చూడలేదు. ఆయన మరణానికి చేరువ అవుతున్న కొద్దీ ఆయన శరీరం క్షీణిస్తూ ఉంటే.. ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవారట. చాలా తక్కువగా మాట్లాడేవారట, ఎలాంటి డ్రామా జరగకుండా చాలా ప్రశాంతంగా జిడ్డు కృష్ణమూర్తి మరణం జరిగిందని అంటారు. కాలం వల్ల,  మనిషి తాను ఊహించుకునే విషయాలు,  మనిషి తాను అనుభూతి చెందే ఎన్నో రాగద్వేషాల  నుండి విముక్తి పొంది అవగాహనతో జీవించడం, మరణించడం అనేది  జిడ్డు కృష్ణమూర్తి మాటల్లోనూ,చేతల్లోనూ కూడా చూపించారు.   ప్రముఖ వ్యక్తులు తమ చివరి రోజుల్లో లేదా చివరి ఘడియల్లో  కొన్ని విషయాలు ప్రధానంగా ప్రస్తావించి ఉంటారు. జిడ్డు కృష్ణమూర్తి చివరి మాటలు కూడా చాలా సరళమైనవే అయినా చాలా లోతుగా మాట్లాడారు.  ఆయన మాట్లాడిన చివరి మాటలలో ఒక వాక్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది."శరీరం ఇంకేమి తట్టుకోగలదో నాకు ఖచ్చితంగా తెలియదు" అని ఆయన అన్నారు.  ఈ మాట ఆయన శరీరం చివరి రోజుల్లో ఎంత బాధ అనుభవించి ఉంటుందో,  ఆయన ఎంత బాధపడి ఉంటారో చెప్పకనే చెబుతుంది. అయినా సరే.. అవన్నీ మానవ శరీరానికి తప్పవనే నిజాన్ని ఆయన అంగీకరించారు.  ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని ప్రతి మనిషిని అంగీకరించినప్పుడు మరణం గురించి అందరికీ అర్థం అవుతుంది. మరణం మీద అవగాహన వస్తుంది.  మరణం అంటే భయం పోతుంది.                                                *రూపశ్రీ.

లక్ష్యం సాధించాలంటే ఈ నియమాలు పాటించాలి..!

  జీవితంలో ఏ లక్ష్యము లేనివారిని సోమరిపోతులు అంటారు.  జీవితంలో గొప్ప లక్ష్యాలు సాధించాలని వాటి కోసం కృషి చేసేవారిని సమాజం,  సమాజంలో అందరూ కూడా గౌరవిస్తారు. కష్టపడేవారే లక్ష్యాలు చేరుకోవడంలో విజయవంతం అవుతారు. అందుకే వీరు విజేతలు కూడా అవుతారు.  కానీ లక్ష్యాలు సాధించాలనే తపన ఉండి, కష్టపడుతూ వాటిని సాధించలేనివారు కొందరు ఉంటారు.  అలాంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన నియమాలు పాటిస్తే జీవితంలో తప్పకుండా లక్ష్యాలు సాధించి విజేతలు అవుతారు. ఆచార్య చాణక్యుడు భారతదేశం గొప్పగా చెప్పుకోదగినవాడు.  ఆయన దేశంలోని గొప్ప  పండితులలో ఒకరు.  ఆయనను కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు.  ఆయన రాజికీయాల గురించి మాత్రమే కాకుండా  ఆర్థిక శాస్త్రం,  యుద్ద వ్యూహం,  జ్యోతిష్యశాస్త్రం, జీవితానికి సంబంధించిన చాలా విషయాల గురించి ఎన్నో వాస్తవాలను చెప్పారు. ఈ కారణంగా ఈయన నీతిశాస్త్రం చాలా పేరు పొందింది. లక్ష్యాలు చేరుకోవాలన్నా, విజేతలు కావాలన్నా మనసులో ఉన్న విషయాలను, ఆలోచనలను ఎప్పుడూ మాటల ద్వారా వ్యక్తం చేయకూడదట.  పనిని పూర్తి చేయడానికి ఏ వ్యూహాన్ని అయితే ఎన్నుకుంటారో అదే వ్యూహాన్ని అనుసరిస్తూ పని  చేయాలంట.  పని తొందరగా అవ్వడం లేదని ప్రతి సారి లక్ష్యాలను చేరుకోవడానికి వేరే మార్గాలు ఎన్నుకుంటే ఏ వ్యూహాన్ని ఆశిచినంతగా అమలు పరచలేరట.  అందుకే లక్ష్యం సాధించాలంటే పదే పదే మార్గాలు మార్చడం కాదు.. ఒక మార్గంలో ఎక్కువ శ్రమ చేయాలి. జీవితంలో సంతోషంగా ఉండటం వల్ల  లక్ష్యాలు సాధించడం వీలవుతుంది.  ఈ సంతోషం  ఎలా లభిస్తుంది అంటే మనసులో ఉన్న అన్ని విషయాలను అందరికీ చెప్పకుండా మౌనంగా ఉన్నప్పుడు.  కొందరికి మనసులో ఏ విషయం ఉన్నా దాన్ని దాచుకోలేరు.  పుటుక్కున బయటకు చెప్పేస్తుంటారు. అందుకే మనసులో ఉండే విషయాలను ముఖ్యంగా రహస్యాలను అస్సలు బయటకు చెప్పకూడదు. చేయాలని అనుకన్న పని గురించి తప్ప వేరే దేని గురించి ధ్యాస ఉండకూడదు.  దీని వల్ల విజయం సాధించడం సులువు.  లక్ష్యం వైపు ఎక్కువ దృష్టి పెట్టి శ్రమించవచ్చు కూడా. అలా కాకుండా లక్ష్యం ఒకటి అయితే మనసులో వేరే విషయాల గురించి ఆలోచన ఉంటే ఎప్పటికే లక్ష్యాన్ని చేరుకోలేరు.  పూర్తిగా సంపూర్ణ విజయం సాధించలేరు. ఈ నియమాలు తెలుసుకుని పాటిస్తే జీవితంలో విజేతలు కాకుండా ఎవరూ ఎవరినీ అడ్డుకోలేరు.                                       *రూపశ్రీ.  

తెరమీద ఆయన చూపిన బొమ్మ.. భారతీయ సినిమాకు ప్రాణం పోసింది..!

  దాదాసాహెబ్  ఫాల్కే అవార్డ్.. చాలా మంది నటుల కల ఇది.  భారతీయ చలనచిత్ర పితామహుడిగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే గుర్తుగా, ఆయన గౌరవార్థం ఈ అవార్డును ఎంపిక చేసిన నటులకు ఇస్తుంటారు.   చలనచిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్ తిరుగులేని వ్యక్తి. ఆయన భారతీయ సినిమాను విప్లవాత్మకంగా మార్చారు.  భవిష్యత్ చిత్రనిర్మాతలకు సృజనాత్మక నైపుణ్యాన్ని అందివ్వడంలోనూ,  చలనచిత్ర రంగాన్ని అబివృద్ది చేయడానికి తగిన అణ్వేషనలు జరపడంలోనూ ఈయన వేసిన మొదటి అడుగే తదుపరి వారికి మార్గం చూపింది.  ఫిబ్రవరి 16 వ తేదీన దాదాసాహెబ్ ఫాల్కే మరణించారు.  ఈ సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు,  విశేషాలు తెలుసుకుంటే..  దుండిరాజ్.. దాదాసాహెబ్.. దాదాసాహెబ్ ఫాల్కేగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు  ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఏప్రిల్ 30, 1870న మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచీ కళలపై ఆసక్తి ఉండేది.   ఈయన చాలా కళలు అభ్యసించారు. విద్య పూర్తి చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్ గానూ,  డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేయడం ప్రారంభించారు. తరువాత ఫాల్కే ప్రింటింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి బొంబాయిలో  తన సొంత ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించారు. ఈ అనుభవం ఆయన భవిష్యత్ చిత్రనిర్మాణ వృత్తిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఆసక్తికర ప్రయాణం.. 1911లో ఫాల్కే "ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్" అనే మూకీ చిత్రాన్ని చూశారు. ఇది  ఆయన జీవితాన్ని మార్చేసింది.  చిత్రకళతో ఆయనకు సంబంధం దీని వల్లనే ఏర్పడింది. ఆ చిత్రం ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.  చిత్రనిర్మాణంపై ఆయన మక్కువను రేకెత్తించింది.  ఈ ఆకర్షణ, ఈ ఆసక్తితోనే ఆయన చిత్రనిర్మాణంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో భారతదేశంలో చిత్రనిర్మాణానికి సౌకర్యాలు,  మౌలిక సదుపాయాలు లేవు. అయినా సరే  నిరుత్సాహపడకుండా ఫాల్కే చిత్రనిర్మాణ పద్ధతులు,  పరికరాల గురించి మరింత తెలుసుకోవడానికి లండన్‌కు వెళ్లారు. ఆయన సంపాదించిన  జ్ఞానం, చిత్రనిర్మాణంపై ఆయనకున్న  దృఢ సంకల్పంతో దేశంలో చలనచిత్ర నిర్మాణాన్ని స్థాపించాలనే  లక్ష్యంతో  భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశంలో సవాళ్లు.. 1920,  1930లలో దాదాసాహెబ్ ఫాల్కే ఆర్థికంగానూ,  సాంకేతికంగానూ  చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఈ అడ్డంకులు ఆయనను చిత్రనిర్మాణంపై తనకున్న మక్కువను ఆపలేకపోయాయి. ఫాల్కే 1913లో విడుదలైన భారతదేశపు మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రం " రాజా హరిశ్చంద్ర "తో సహా అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సంచలనాత్మక చిత్రం భారతీయ సినిమా ప్రారంభానికి నాంది పలికింది.  భవిష్యత్ చిత్రనిర్మాతలు వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీయడానికి   పునాది వేసింది. మరణం.. వారసత్వం.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిబ్రవరి 16, 1944న మరణించారు. ఆయన ఒక అద్భుతమైన వారసత్వాన్ని భారతదేశానికి అందించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి  గుర్తుగా నేటికీ ఆయన మరణాన్ని,  జయంతిని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్థాపించింది.  భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు వారి అత్యుత్తమ సేవలకు ఇచ్చే అత్యున్నత గౌరవాలలో ఇది ఒకటి. ఫాల్కే మార్గదర్శక ప్రయత్నాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమను స్థాపించడమే కాకుండా  భారతీయ సాంస్కృతికతను,  భారతీయ విలువలను ప్రజలకు తెలిజేయడంలో సహాయపడ్డాయి. ఇప్పటికాలంలో సినిమా అనేది చాలా శక్తివంతమైన సాధనంగా మారడం వెనుక దాదాసాహెబ్ కృషి, ఆయన వేసిన మొదటి అడుగు ఉన్నాయి.  భారతీయ విలువలను పరిరక్షించడానికి,  ప్రోత్సహించడానికి సహాయపడే భారతీయ పురాణాలు, ఇతిహాసాలు,  కథలను ఆయన సినిమాలుగా రూపొందించారు. అంతిమంగా.. ప్రింటింగ్ ప్రెస్ యజమాని నుండి భారతీయ సినిమా పితామహుడిగా మారే వరకు దాదాసాహెబ్ ఫాల్కే ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన అంకితభావం, అభిరుచి,  దార్శనికత నేడు మనకు తెలిసిన భారతీయ చిత్ర పరిశ్రమకు పునాది వేసింది.    తెర మీద ఆయన చూపిన బొమ్మ దాదాసాహెబ్ చేసిన మ్యాజిక్కే..!                            *రూపశ్రీ.

అంతరిక్షాన్ని అన్వేషించిన అతని చూపు....

    శాస్త్ర పరిశోధన పెద్ద పాపంలా భావించే కాలంలో ఆయన శాస్త్రీయ విప్లవంలో భాగమయ్యారు.  ఎన్ని విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ తన పరిశోధన ఆపకుండా వివిధ రంగాల్లో ఆయన చేసిన  శాస్త్రీయ పరిశీలనలు, ప్రయోగాత్మక విధానాల వల్ల, ఆయనను ఆధునిక ఖగోళ శాస్త్రపు పితామహుడు, ఆధునిక భౌతికశాస్త్ర, విజ్ఞానశాస్త్ర పితామహుడిగా  పిలుస్తారు. ఆయన శాస్త్రీయ పరిశోధనలు ప్రకృతి, విశ్వం యొక్క రహస్యాలను వెలికితీయడంలో మూలస్తంభంగా మారాయి.  ఖగోళ శాస్త్రం ఈనాడు ఇంతలా అభివృద్ధి చెందటానికి మూలమైన గెలీలియో గురించి తెలుసుకుంటే......  గెలీలియో గురించి....  గెలీలియో 1564  ఫిబ్రవరి 15న, ఇటలీలోని పిసా నగరంలో జన్మించారు. ఆయన పిసా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ మెడిసిన్ చదివి డాక్టర్ కావాలనుకున్నారు. కానీ కోర్సుని పూర్తి చేయలేదు. 1589లో ఆయన చదువును మానేశారు. ఐనాసరే  గణితశాస్త్రం పట్ల ఆసక్తితో ఆ విశ్వవిద్యాలయంలోనే గణితాన్ని బోధించారు.  ఆయన   చలనం, గురుత్వాకర్షణ  వంటి భౌతిక ఘటనలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. అనేక గ్రంధాలు , ఉపన్యాసాలు, సిద్ధాంత గ్రంథాలపై పని చేశారు.  అరిస్టోటిల్‌ ఆలోచనలని  విమర్శించారు. తన ప్రయోగాలు, పరిశీలన ద్వారా  ప్రకృతిని అర్ధం చేసుకోవటంలో  కొత్త విధానాలు కనుగొన్నాడు.  కోపర్నికస్ యొక్క హీలియోసెంట్రిక్ థియరీని  సమర్థించినందుకు చర్చి విచారణ ఆయనను గృహ నిర్బంధానికి గురి చేసింది. ఈ సమయంలో, ఆయన అప్ప్లైడ్ ఫిజిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరీయల్ ఇంజినీరింగ్ వంటి  రంగాల్లో తన పరిశోధనను కొనసాగించారు.  సైన్సు కోసం చేసిన కృషి......  గెలీలియో శాస్త్రీయ పరిశోధనలు కేవలం ఒక్క రంగానికే పరిమితం కాలేదు.  చంద్రుని లక్షణాలు, శుక్రగ్రహ దశలు , గురుగ్రహపు నాలుగు ఉపగ్రహాలు,  సూర్యుని మీదున్న మచ్చలు వంటి అనేక ఖగోళ పరిశీలనల్లో విశేషానుభవం సంపాదించాడు. ఆయన ఒక గొప్ప మేధావి.  టెలిస్కోప్‌ను శాస్త్రీయ ప్రయోజనాలకు మాత్రమే గాక సైనిక ప్రయోజనాల గురించి కూడా ఉపయోగపడేలా మెరుగుపరిచారు.  గణిత గణనల కోసం కూడా ఉపయోగించారు. ఆయన డిజైన్ చేసిన టెలిస్కోప్ అప్పట్లో సైనికులు ఉపయోగించే  బాలిస్టిక్, సైనిక కంపాస్ల  ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడింది. ఆయన 1632లో "డైలాగ్ కన్సెర్నింగ్ ది టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్”  అనే ప్రసిద్ధ గ్రంథాన్ని ప్రచురించారు.  ఈ గ్రంథంలో శాస్త్రీయ ప్రబోధం, గెలీలియో ఖగోళ పరిశీలనలు, సిద్ధాంతాలు, విశ్వం గురించిన  టాలమీ  సిద్ధాంతంపై  అరిస్టోటిల్ దృక్పథం ఏమిటనే  చర్చ కూడా ఉంటుంది.  ఎదుర్కొన్న  విమర్శలు..... అప్పట్లో సైన్సు అంతగా అభివృద్ధి చెందలేదు.   మూఢనమ్మకాలే తప్ప శాస్త్రీయ దృక్పధం లేని కాలం కావటంతో   గెలీలియో తన ప్రయోగాలు, పరిశీలనల వల్ల ప్రధాన వివాదాల్లో చిక్కుకుని  విమర్శలకు గురయ్యారు.  మతగ్రంధం పట్ల అతివిశ్వాసం ఉన్నవాళ్ళు,  ఆయన పరిశోధనలు, అభిప్రాయాలు చర్చి బోధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావించారు.  గెలీలియో తన టెలీస్కోప్ ద్వారా పరిశీలించిన  మొదటి శాస్త్రీయ   వివరణ అయిన  "స్టారీ మెసెంజర్”ను   పబ్లిష్ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత, చర్చి ఆయనపై కఠిన చర్యలు తీసుకుంది. 1615లో రోమన్ విచారణ  ముందు హాజరుకావాల్సిందిగా పిలిచారు. హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయకూడదని  హెచ్చరించారు. కానీ 1633లో కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసినందుకు ఆయనను దోషిగా ప్రకటించి,  జీవితాంతం గృహ నిర్బంధ శిక్ష విధించారు. అలా 1642 జనవరి 8న గృహ నిర్బంధంలోనే మరణించారు. గెలీలియో చేసిన విస్తృతమైన పరిశోధనలు ఆధునిక విజ్ఞానశాస్త్రం అభివృద్ధికి మార్గదర్శనమయ్యాయి. ఆయన సిద్ధాంతాలు, ప్రయోగాలు  సైన్సు అభివృద్ధిలో ఎంతో కీలకంగా మారాయని చెప్పటం అతిశయోక్తి కాదు. ఆయన చేసిన శాస్త్రీయ విశ్లేషణలు, పరిశోధనలు విజ్ఞానశాస్త్రంలో స్థిరంగా నిలిచిపోయాయి. ఆయన ప్రభావం ఆధునిక శాస్త్ర ప్రపంచాన్ని రూపొందించడంలో కీలకంగా మారింది.                                         *రూపశ్రీ

ప్రేమించే మనసు.. ప్రేమకై పరితపించే మనసు.. !

  ప్రేమ రెండక్షరాల పదం.  కానీ ఇందులో ఉన్న ఎమోషన్ జీవితానికి సరిపడినంత.  మరు జన్మలో కూడా దానిని వెంటబెట్టుకుని ప్రేమకై పరితపించేంత. అసలు ఏముంది ప్రేమలో అంటే.. జీవితం ఉంది.. ప్రాణముంటుంది.  అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమలో అంతుచిక్కని భావోద్వేగం ఉంటుంది.  ఇప్పటి కుర్రకారు ఎవరైనా నచ్చగానే ఐ లవ్ యూ అని చెప్పడం కాదు ప్రేమంటే.. అసలు ప్రేమకు ఈ జనరేషన్ వారికి సరైన అర్థం తెలియదు.  ఎవరికి తోచింది వారు.. ఎవరికి నచ్చింది వారు అన్వయించుకుంటారు. కానీ అసలైన ప్రేమకు అసలు జెండర్ అనే అవరోధం లేదు. ప్రేమంటే.. ప్రేమంటే ఒక మనిషిని ఇష్టపడటం,  ఒక మనిషి మనకు నచ్చింది కాబట్టి మనలా వారు కూడా మారాలని అనుకోవడం, మనకోసం వారి జీవితాన్ని మార్చేసుకోవడం,  వారికంటూ ఇక వేరే ప్రపంచం ఏమీ లేకుండా వారికి తామే ఎక్కువ అవ్వాలని అనుకోవడం. ఇదీ ఇప్పట్లో చాలామంది ఆలోచన. బయటకు స్పష్టంగా చెప్పరు. నిజానికి వారికే స్పష్టంగా అవగాహన లేదు కానీ.. ప్రేమ అంటే తాము కావాలని అనుకున్న ఒక వస్తువు తనకు దక్కించుకోవడం లాంటిది అనేది చాలా మంది అభిప్రాయం.  కానీ ప్రేమ అంటే ఒక ఆరాధానా భావం.  ప్రేమిస్తే వ్యక్తిని ప్రేమించాలి,  వ్యక్తి అలవాట్లను గౌరవించాలి.  వ్యక్తిలో లోపాలను అర్థం చేసుకోవాలి.  ఒకవేళ వ్యక్తిలో చెడ్డ గుణం ఉంటే ఆ వ్యక్తిని ప్రేమతో భరించాలి. తీసుకోవడం.. వదిలేయడం.. ఇంతేనా.. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక వ్యక్తిని ప్రేమిస్తే వెంటనే ప్రపోజ్ చేసేస్తారు. ఆ తరువాత తమకు నచ్చినట్టు వాళ్లు ఉండాలని కోరుకుంటారు.  వారి అటెన్షన్ మొత్తం తమ మీద ఉండాలని కోరుకుంటారు.  ఆ తరువాత వేరే ఎవరి గురించి వారు మాట్లాడినా అస్సలు నచ్చదు వారికి.  లేదు.. వారు తమకు నచ్చినట్టు, తమ అభిరుచులకు తగ్గట్టు ఉంటామంటే.. సింపుల్ గా బ్రేకప్ చెప్పేస్తారు.  ఇదీ నేటి సమాజం పోకడ. ఇలాంటివి చాలా జరగడం వల్లనే ప్రేమంటే.. ఓస్.. ఇంతేనా అనిపిస్తుంది. జెండర్ సంగతి.. ప్రేమంటే ఒక ఆడ,  ఒక మగ మధ్య ఉండేదని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రేమంటే ఇది కాదు.. ఒక ఆడ, మగ మధ్య ఉండేది ఆకర్షణతో కూడిన ప్రేమ.  కానీ భౌతిక  ఆకర్షణ లేకుండా కేవలం మనసును చూసి,  మనిషి గుణాన్ని చూసి ప్రేమించడం,ఎలాంటి స్వార్థం లేకపోవడం అనేది ఉంటుంది.  అదే ప్రేమ అనే కోవలోకి వస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ప్రేమ కలిగి ఉండటం అంటే కేవలం కేవలం మనసుకు మాత్రమే సంబంధించినది.  ఇక్కడ అమ్మ నాన్న ప్రేమ, తోబుట్టువుల ప్రేమ,  అవ్వతాతల ప్రేమ, గురువుకు శిష్యునికి మధ్య  ప్రేమ, దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న ప్రేమ.. ఇట్లా ఒక్కటనే కాదు.. మనిషితో సంబంధం లేకుండా కేవలం మనసుతో అనుబంధం ఏర్పడేదే ప్రేమ.  ఎప్పుడైనా, ఎక్కడైనా,  ఎవ్వరైనా కనీసం పరిచయంతో సంబంధం లేకుండా ఆప్యాయంగా మాట్లాడితే.. బాధను పంచుకుంటే.. అపన్న హస్తం అందిస్తే.. వారు ప్రేమను నింపుకున్న మనుషులు.. వారు చూపించేదే ప్రేమ.. అంతేకానీ తమ స్వార్థం కోసం తమకు నచ్చి దాన్ని సాధించుకోవడానికి ప్రేమ అనే పేరును వాడితే అది ప్రేమ కాదు.. వారిది ప్రేమ మనసు కాదు. అందుకే ప్రేమంటే ఇవ్వడమే.. తిరిగి ఆశించడం కాదు..                                             *రూపశ్రీ.

ప్రేమంటే ఇదే!

ప్రేమికుల రోజు వస్తోందంటే చాలు... ప్రేమ గురించి రకరకాల కబుర్లు వినిపిస్తాయి. రోమియో జూలియట్‌, లైలా మజ్నూల కథలెన్నో వినిపిస్తాయి. కానీ ప్రేమంటే ఎప్పుడూ స్త్రీ, పురుషుల మధ్య ఉండే ప్రేమేనా? ఎవరో ఒక మనిషి మీద ప్రత్యేకంగా ఏర్పరుచుకున్న భావనేనా! కాస్త ఓపికపట్టి చూడాలంటే కళ్ల ముందు రకరకాల ప్రేమలు కనిపిస్తాయి. ప్రేమ భౌతికమైనదే కాదంటూ వేరే ఎన్నో నిర్వచనాలు చెబుతుంటాయి. అందుకు ముచ్చటగా మూడు ఉదాహరణలు మీరే చూడండి... నిక్‌ వ్యూజిసిక్‌- శరీరం సగమే ఉన్నా, దాని మీద ప్రేమ మాత్రం 100% తరచూ యూట్యూబ్‌నీ, ఫేస్‌బుక్‌లనీ చూసేవారికి ఈ పేరు అంత కొత్త కాకపోవచ్చు. ఒకవేళ గభాలున స్ఫురణకు రాకపోయినా రెండు కాళ్లూ, రెండు చేతులూ లేని ఒక వ్యక్తి స్టేజి మీద నిల్చొని ఉపన్యాసాలు అదరగొట్టే సన్నివేశాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. నిక్‌ ‘ఫొసోమేలియా’ అనే అరుదైన వ్యాధి వల్ల కాళ్లూ, చేతులూ సరిగా ఎదగకుండానే పుట్టాడు. మొదట్లో తనని మామూలు మనిషిగా మార్చమంటూ దేవుడిని ప్రార్థించిన నిక్‌ లేనిదాని కోసం ఆశించడంకంటే, ఉన్నదానితో విజయాన్ని సాధించడం విజేతల లక్షణం అని గ్రహించాడు. ఆశ అనేది మనలో ఉంటే, ఎలాంటి పరిస్థితులలోనైనా సంతోషంగా జీవించవచ్చనీ, మన జీవితం గురించిన విలువను గ్రహించడమే నిజమైన విజయమనీ నిక్‌ అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే నిక్ తన అంగవైకల్యాన్ని సైతం అధిగమించి సాధారణ జీవితాన్ని గడపగగలుగుతున్నాడు. అంతేనా! తనను తానే ఒక ఉదాహరణగా మలచుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించగలుగుతున్నాడు. ‘life without limbs’ వంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలను రాయగలిగినా, 50కి పైగా దేశాలని పర్యటించి శ్రోతలను సమ్మోహితులను చేసినా... తన జీవితాన్ని ప్రేమించడం వల్లనే నిక్‌కి ఇదంతా సాధ్యమైంది. అంగవైకల్యంతో ఉన్నందుకు నిక్‌ తన దేహాణ్ని ద్వేషించలేదు. తన జీవితం పట్ల నిక్‌కి ఉన్న ప్రేమ ముందు వైకల్యమన్న మాటకు అర్థమే లేకుండా పోయింది. అజీమ్‌ ప్రేమజీ- ఈ ప్రేమ్‌జీకి తన దేశమంటే తగని ప్రేమ! డబ్బున్నవాడు మరింత డబ్బుని పోగుచేయాలని చూస్తాడు. తరతరాలుగా తన వారసులకు ఢోకా ఉండదని తెలిసినా, కాసుల రాశులను ఇంకా పోగుచేస్తూనే ఉంటాడు. ఎక్కడో మాత్రమే ఇలాంటి వారికి మినహాయింపులుంటాయి. అలాంటి కొద్దమందిలో మన దేశానికే చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ ఒకరు. నూనె వ్యాపారం చేసే ‘విప్రో’ అనే సంస్థ, తండ్రి మరణం తరువాత అజీమ్ ప్రేమజీ చేతికి వచ్చింది. అప్పటికి అతని వయసు కేవలం 21 ఏళ్లు. సంస్థ తన చేతికి వచ్చాక బెంబేలుపడిపోలేదు అజీమ్‌. నూనె, సబ్బులు, బల్బులు... ఇలా ఒక్కొక్క రంగంలోకీ తన వ్యాపారాన్ని విస్తరిస్తూ విజయారోహణం చేశాడు. రాబోయే రోజులలో కంప్యూటర్‌దే ప్రపంచం అని గ్రహించి సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి దూకాడు. సబ్బులమ్ముకునేవాడు సాఫ్ట్‌వేర్‌ వ్యాపారం ఏం చేస్తాడు అని వెక్కిరించిన వాళ్లే, ఆయన విజయాల గురించి రాయడం మొదలుపెట్టారు. ఈ దేశం పట్ల అజీమ్ కుటుంబానికి తగని ప్రేమ. అదే ప్రేమతో అజీమ్ తన దేశ భావితరాలకు ఏదైనా చేయాలని సంకల్పించుకున్నారు. భారతదేశంలో పిల్లలకి తగిన విద్య లభించేందుకు దాదాపు 200 కోట్ల వ్యక్తిగత ఆస్తులను ఆయన వెచ్చించారు. దీంతో దాదాపు 3,50,000 పాఠశాలలు లాభపడ్డాయి. భావితరాల విద్య కోసం ఇప్పటికే తన ఆస్తిలో 25 శాతాన్ని అజీమ్‌ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు రాసేసిన ఆయన, మరో 25 శాతాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధపడతున్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద విరాళంగా భావిస్తున్నారు. కానీ ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల తలమునకలు దాకా ప్రేమలో మునిగిఉన్న ప్రేమ్‌జీకి ఇదో లెక్కగా కనిపించడంలేదు. ప్రేమికులు ప్రియురాళ్ల కోసం తమ సర్వస్వాన్నీ అర్పిస్తే, ప్రేమజీ తన దేశం కోసం ఆస్తిని బహుమతిగా ఇస్తున్నాడంతే! సుందర్‌లాల్‌ బహుగుణ- పర్యావరణ గాంధి! గాంధీ వారసులమని చెప్పుకునేవారంతా, ఆయన పేరు చెప్పుకుని, అధికారాన్ని అనుభవించేందుకు ఉవ్విల్లూరుతున్నారు. కానీ స్వతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సుందర్‌లాల్ బహుగుణ ఎలాంటి పదవులనీ ఆశించలేదు. ప్రచారాన్నీ కోరుకోలేదు. తాను ప్రేమించిన పర్యావరణాన్ని కాపాడేందుకు తుదివరకూ పోరాడుతూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా సుందర్‌లాల్‌ దేశంలో గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆధునీకరణ పేరుతో విచ్చలవిడిగా చెట్లను నరికేయడం ఆయన గమనించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పచ్చని భారతావని కాస్తా బీడుగా మారిపోతుందని అర్థమైంది సుందర్‌లాల్‌కు. 1970లో దేశంలోని వృక్షసంపదను కాపాడేందుకు ‘చిప్‌కో’ అనే ఉద్యమం మొదలైంది. సుందర్‌లాల్ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు, ఉద్యమం పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఉత్తరభారతదేశంలో 5,000 కిలోమీటర్లు కాలినడకన యాత్ర సాగించారు. సుందర్‌లాల్ పోరాటం పుణ్యమాని చెట్లను ఎడాపెడా నరకకూడదంటూ ప్రభుత్వం కఠిన నిబంధనలను రూపొందించింది. భారీ ఆనకట్టల పేరుతో పర్యావరణానికీ, ప్రజలకూ నష్టం కలిగించడానికి కూడా సుందర్‌లాల్‌ వ్యతిరేకంగా ఉండేవారు. అందుకే ఉత్తరాఖండ్‌లో భగీరధి నది మీద తెహ్రీ అనే ఆనకట్టను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకోసం ఒకసారి 45 ఉపవాస దీక్షనీ, మరోసారి 74 రోజులపాటు ఉపవాసాన్నీ కొనసాగించారు. ఆయన మాటలు విన్నట్లే ఉన్న ప్రభుత్వాలు చివరికి తెహ్రీ ఆనకట్టను నిర్మించి పారేశాయి. కానీ తరచూ భూకంపాలు వచ్చే ప్రదేశంలో ఈ డ్యామ్‌ను రూపొందించడం వల్ల పెద్ద ప్రమాదం ఉందని ఇప్పుడు పర్యావరణవేత్తలంతా తలలు బాదుకుంటున్నారు. తెహ్రీ డ్యామ్‌ వల్ల జరిగే నష్టాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రేమంటే వెంటనే స్ఫురించే భౌతికమైన ఆకర్షణే కాదని చెప్పేందుకు, ఇవీ ముచ్చటగా మూడు ఉదాహరణలు. చెప్పుకున్నవి మూడు, కానీ కాస్త పరిశీలిస్తే ఇలాంటి భిన్నమైన ప్రేమలు, వాటికోసం తపించే ప్రాణాలు ఎన్నో కనిపిస్తాయి. హ్యాపీ వాలంటైన్స్‌ డే! -నిర్జర    

కిస్ డే.. ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే..!

  కిస్ డేని వాలెంటైన్స్ వారంలోని 7వ రోజు అంటే ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. ప్రేమలో తగినంత నమ్మకం,  సాన్నిహిత్యం ఉన్న దశకు చేరుకున్నప్పుడు, ప్రేమికులు  తమ ప్రేమను టచింగ్  లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా వ్యక్తం చేస్తారు.   ముద్దు అనేది కేవలం ప్రేమికుల మధ్య జిరిగే చర్య కాదు.. ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెట్టినా, ఒక స్నేహితుడు తన స్నేహితుడికి ముద్దు పెట్టినా, తోబుట్టువులు ఆత్మీయంగా ముద్దు పెట్టినా.. ప్రతి ఒక్కటి ఈ కిస్ డే లో భాగమే.. ముద్దు అనేది ప్రేమ,  ఆప్యాయతను వ్యక్తీకరించడానికి ఒక మార్గం మాత్రమే కాదు, ఇది శారీరక,  మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకోవడం,  ఆత్మీయంగా ఉన్నవారిని ముద్దు పెట్టుకోవడం మొదలైన వాటి వల్ల  చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే.. ముద్దు ఒత్తిడిని తగ్గిస్తుంది.. శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్,  సెరోటోనిన్ హార్మోన్లు చాలా ముఖ్యమైనవి. ఇవి  ఒత్తిడిని,  ఆందోళనను తగ్గిస్తాయి.  ఈ హార్మోన్లు శరీరంలో రిలీజ్ అవ్వడంలో ముద్దు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.  ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మనకు ఇష్టమైన వారిని   సంతోషంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.. మనం ముద్దు పెట్టుకున్నప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది ముద్దు పెట్టుకున్న  సమయంలో బ్యాక్టీరియా మార్పిడి జరుగుతుంది.  దీని కారణంగా శరీరంలో కొత్త ప్రతిరోధకాలు ఏర్పడతాయి.  రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఏదైనా అంటువ్యాధి సమస్య ఉన్నవారు ముద్దులకు కాస్త దూరం ఉండటం మంచిది. కేలరీలను బర్న్ చేస్తుంది.. ముద్దు నిమిషానికి దాదాపు 2-6 కేలరీలను బర్న్ చేస్తుందట. ఇది జీవక్రియను పెంచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, ముద్దు పెట్టుకునే పద్ధతి, వ్యవధిని బట్టి నిమిషంలో 2 నుండి 26 కేలరీలు బర్న్ అవుతాయట. ఎందుకంటే ముద్దు శరీరంలోని అనేక భాగాల పనితీరు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ కండరాలకు మంచిది.. ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖ కండరాలకు మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇది 34 ముఖ కండరాలకు పైగా వ్యాయామంలాగా పనిచేస్తుంది.  ముఖాన్ని టోన్ గా,  యవ్వనంగా ఉంచుతుంది. ఇది ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ముద్దు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.   గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనివల్ల గుండెపోటు,  ఇతర హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.                                                     *రూపశ్రీ.

బాధ్యతగా ఉంటున్నారా??

ప్రపంచంలో మనిషి ఏదైనా గొప్పగా చేయగలిగింది ఉందంటే అది బాధ్యతగా ఉండటమే అనిపిస్తుంది. వృత్తిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇతర పనులలో కావచ్చు పూర్తిస్థాయి బాధ్యతగా ఉండటం అనేది చాలామంది విషయంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఇదే విషయం మీద ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు.  ఎందుకీ ఫిర్యాదులు?? అని ఆలోచిస్తే ఎందుకంటే ఇంకేముంటుంది బాధ్యతగా లేకపోవడం వల్ల అని అందరికీ అర్థమైపోతుంది.  అయితే…. సమాజంలో దృష్టిలో బాధ్యత!! చాలామంది చాలా కోణాల్లో ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనలు అన్నీ అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు ట్రైన్ తన మెయిన్ స్టాప్ కు వచ్చి చేరినట్టు, మనిషి ఆలోచనలు కూడా అన్ని విధాలుగా ఆలోచించి చివరకు తమ దగ్గరే ఆగుతారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే బాధ్యత అనే విషయాన్ని  ప్రతి మనిషి తను ఆశిస్తున్న ప్రయోజనాలకు దగ్గరే నాటుకుంటాడు.  ఉదాహరణకు ఒక కాలేజీ కుర్రాడు తనకు కావలసిన అవసరాలను, వస్తువుల్ని తీర్చడం తన తండ్రి బాధ్యత అనుకుంటాడు. ఒకవేళ ఆ కుర్రాడు అడిగింది ఏదైనా అతని తండ్రి నిరాకరిస్తే బాద్యతలేని తండ్రి అనేస్తాడు. స్నేహితుల దగ్గర అదే మాట చెప్పేస్తాడు. ఇలాంటి వాళ్ళు ప్రస్తుత సమాజంలో బేషుగ్గానే ఉన్నారు.  నిజానికి బాధ్యతంటే ఏంటి?? బాధ్యత అనేది డిమండింగ్, కమండింగ్ ల మధ్య సాగేది కానే కాదు. అది మనిషిలో ఉండాల్సిన లక్షణాలలో ఒకటి. ఈ విషయం అర్ధం చేసుకుంటే ప్రతి ఇల్లు కూడా ఫిర్యాదులు లేకుండా హాయిగా ఉంటుంది. ఒక తండ్రి తన ఆర్థిక కారణాల వల్ల ఉన్నదాంట్లో తన పిల్లలని సంతోషపెట్టాలని చూస్తే పిల్లలు కూడా తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ పరిస్థితికి తగ్గట్టు సర్దుకుపోవాలి. వృత్తిలో సమర్థవంతమైన పనిని అందివ్వాలి. స్నేహితులు చుట్టాల దగ్గర  అనవసర డాబు పోకుండా మోహమాటాల కోసం సామర్త్యానికి మించిన పనులు ఒప్పుకోకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా ఏదైనా నిజాయితీగా చెప్పేయడం, చేయడం వంటివి చేస్తే వ్యక్తిత్వాన్ని చూసి అందరూ గౌరవిస్తారు.  ఒకరి మెప్పు కోసమో, ఒకరు గొప్పగా చెప్పుకోవడం కోసమో కాకుండా తాము చేయవలసిన పనిని తమ పూర్తి సామర్త్యంతో చేస్తే అప్పుడు మనిషి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినట్టు.  కొందరు ఏమి చేస్తారంటే!! కొందరికి సామాజిక స్పృహ చాలా ఎక్కువ(ఈ మాట కొంచం వెటకారంగా చెప్పబడింది). ఎంత ఎక్కువ అంటే, ఓ సంపాదన పరుడు ఆరంకెల జీతం తీసుకుంటూ గుడిలోనో, అనాథశ్రమంలోనో మరింకోచోటో అన్నసంతర్పణలు, వస్త్రధానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న కన్నతల్లికి ప్రేమగా ఓ ముద్ద అన్నం పెట్టరు. సమాజం ఇచ్చే అటెన్షన్ కోసం ఇలా చేసే వాళ్ళు చాలా బాద్యతకలిగిన వాళ్ళలా సమాజానికి మాత్రమే అనిపిస్తారు. కానీ ముఖ్యంగా బాధ్యత ఉండాల్సింది తమ ఇంటి విషయంలో, తరువాత కుటుంబసభ్యుల అవసరాల విషయంలో, ఆ తరువాత సమాజం విషయంలో. అంతేకానీ అన్నీ వదిలిపెట్టేసి తన వాళ్ళు దిగులుగా, లోటుతో, బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉంటే సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయడం బాధ్యత అనిపించుకోదు.  ఈ సమాజంలో ప్రస్తుతం మనుషుల తీరు గమనిస్తే చెప్పుకోవాల్సిన మాట ఒకటి ఉంది. ఎప్పుడూ అన్నిటికీ పెద్దల మీదనో, ఇంట్లో ఉన్న సంపాదనా పరుల మీదనో ఆధారపడటం మాని ఇంటికి సహాయంగా ఉండకపోయినా తమని తాము సరైన విధంగా ఉంచుకుని, మంచిగా తీర్చిదిద్దుకుంటే (దీన్నే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం అంటారు) ఎవరి జీవితం పట్ల వాళ్ళు బాధ్యతగా ఉన్నట్టే. అదే గనుక జరిగితే అన్ని విషయాలలోనూ అన్ని కోణాలలోనూ బాధ్యతగా ఉండటం అనేది క్రమంగా అలవాటైపోతుంది. మరి ఏవి బాధ్యతలు?? ఓ తండ్రి తన పిల్లలకు మంచి దారి చెప్పడం, చూపించడం, జీవితాన్ని గురించి వివరిస్తూ ఉండటం, చదువు, సంస్కారం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడం. ఇది తల్లికి కూడా వర్తిస్తుంది. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు కాదు. ఇంకా చెప్పాలంటే అదీ, ఇదీ అన్నట్టు ఇంటిని చక్కబెడుతూ, ఎన్నో రంగాలలో రాణిస్తున్న మహిళా ముత్యాలు బోలెడు ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులు తమ మీద ఇష్టాలు రుద్దుతున్నారు అనుకోకుండా పెద్దల ఆలోచనలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చదువు విషయంలో తమ ఇష్టాల్ని చెప్పి అందులో ఉత్తమంగా రాణించాలి. జులయిగా తిరగడం, అల్లరిగా మారిపోవడం వదిలి కాసింత పరిపక్వతతో ఆలోచించాలి. ఉపాధ్యాయులు ఈ సమాజానికి మంచి పౌరులను అందించడానికి ప్రయత్నం చేస్తే ఆ పౌరులే సమాజాన్ని శాసించే వ్యక్తులు అవుతారు. అంతేకానీ ఎప్పుడూ ర్యాంకులు, మార్కులు అంటే విద్యార్థులకు ఆ మార్కులు, ర్యాంకులు, చదివిన చుదువు తాలూకూ విషయం తప్ప వాళ్లకు ఇంకేమీ తెలియకుండా పోతుంది. ప్రభుత్వాల గురించి రాజకీయ నాయకుల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ.  అయినా బాధ్యతగా ఉండాల్సింది మనమైతే ప్రభుత్వాల గురించి ఎందుకు చెప్పండి!!                                                                                                          ◆వెంకటేష్ పువ్వాడ.  

పోరాటంలో భయమెరుగని మహిళా నేత, సాహిత్యంలో ‘భారత కోకిల’.. సరోజినీ నాయుడు జయంతి..!

  ఆమె స్వాతంత్ర్య పోరాటంలో  భయపడకుండా ధైర్యంగా నిలబడ్డ సివంగి. ఒక అసాధారణమైన కవయిత్రి, గొప్ప రాజకీయ నేత. మన దేశ స్వాతంత్ర్యం కోసం, సాహిత్యం, మహిళల హక్కుల కోసం ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా మన ప్రభుత్వం ప్రతీ ఏటా ఆమె జయంతిని ‘జాతీయ మహిళా దినోత్సవం’గా జరుపుకుంటుందంటేనే అర్ధం చేసుకోవచ్చు…. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, మహిళల హక్కుల సాధనలో ఆమె ఎంతలా ప్రభావం చూపించిందో.. అంత ధైర్యం, దేశభక్తి కలిగిన ఆమె ఎవరో కాదు,  ‘భారత కోకిల’ గా  ప్రసిద్ధి పొందిన సరోజినీ నాయుడు.. భారత చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సరోజినీ నాయుడు గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే.. సరోజినీ నాయుడు 1879, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి అఘోర్నాథ్ చటోపాధ్యాయ ఒక శాస్త్రవేత్త, తత్వవేత్త.  తల్లి బరద సుందరి దేవి కవయిత్రి. తల్లిదండ్రుల ప్రభావం వల్లనేమో ఆమె   చిన్నప్పటి నుంచే రచనలు చేసేది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్,  కేంబ్రిడ్జ్‌ లోని  గిర్టన్ కాలేజ్‌లో విద్యనభ్యసించింది. విదేశాల్లో చదువుకుంటున్న సమయంలోనే గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ వంటి నాయకుల ప్రభావం ఆమెపై పడింది. ఇదే ఆమెను స్వాతంత్ర్య పోరాటంలో భాగమవ్వటానికి స్పూర్తినిచ్చింది.   స్వాతంత్య్రానికి మునుపు, తర్వాత  రాజకీయ కృషి... సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్(ఐ‌ఎన్‌సి)లో చురుకుగా పాల్గొని స్వతంత్ర సాధన కోసం కృషి చేసింది. ఐ‌ఎన్‌సి‌ కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. మహాత్మా గాంధీ నడిపిన ఉప్పు సత్యాగ్రహం(1920), క్విట్ ఇండియా ఉద్యమం(1942) వంటివాటిలో పాల్గొని  21నెలల జైలుశిక్ష కూడా  అనుభవించింది. భారత స్వాతంత్య్రానంతరం దేశంలోనే  తొలి మహిళా గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సేవలందించింది.  ఆమె గవర్నరుగా ఉన్నప్పుడు మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు ఎంతో కృషి చేసింది. మహిళల ఉపాధి, చట్టపరమైన హక్కులను సమర్ధవంతంగా ప్రోత్సహించింది. విద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలని ప్రోత్సహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నాయకత్వం స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది.   సాహిత్యంలో కృషి..... సరోజినీ నాయుడి కవిత్వం.. సాహిత్యంలో సౌందర్యం, దేశభక్తి భావాలను నింపుకుని ఉంటుంది. భారతీయ ఇతివృత్తాలను, పాశ్చాత్య సాహిత్య శైలితో కలగలిపి  రచనలు చేయడంతో  భారతదేశపు గొప్ప కవయిత్రులలో ఒకరిగా నిలిచింది. "ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా" అనే కవితతో మొదటి  ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల సేవలకు నివాళులర్పించింది.  ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’,  ‘ది బర్డ్స్ ఆఫ్ టైమ్’, ‘ది బ్రోకెన్ వింగ్’, ‘ది సెప్టర్డ్ ఫ్లూట్’ వంటి ఎన్నో రచనలు చేసింది.  ఆమె మరణానతరం ప్రచురించబడిన “ది ఫెదర్ ఆఫ్ ది డాన్” ఆమె అద్భుతమైన కవితా ప్రతిభను సూచిస్తుంది. ఆమె సాహిత్య ప్రతిభకుగానూ “భారత కోకిల” అనే బిరుదు లభించింది. మహిళా హక్కుల పరిరక్షణలో.. సరోజినీ నాయుడు మహిళా హక్కుల కోసం తన జీవితాంతం పనిచేసింది. దేశ పురోగతికి మహిళా సాధికారత అవసరమని బలంగా నమ్మింది. ‘ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్’ సహవ్యవస్థాపకురాలిగా ఉంటూ  మహిళల విద్య, ఆరోగ్యం, చట్ట పరిరక్షణ కోసం పని చేసింది. ‘ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ అధ్యక్షురాలిగా మహిళల ఓటు హక్కు, చట్ట పరిరక్షణ కోసం ఉద్యమించింది. జాతీయంగానే గాక గ్లోబల్ సమావేశాల్లో కూడా మహిళల ఓటు హక్కు కోసం  భారతదేశానికి  ప్రాతినిధ్యం వహించింది. వారసత్వానికి గౌరవమివ్వాలి..... సరోజినీ నాయుడు కృషికి గుర్తింపుగా మన ప్రభుత్వం  ‘జాతీయ మహిళా దినోత్సవం’ జరుపుకుని నివాళులర్పిస్తుంది. అలాగే మహిళా సమస్యలపై పోరాడిన ఉత్తమ జర్నలిస్టులకి “సరోజినీ నాయుడు అవార్డు” ఇచ్చి, ఆనాడు ఆమె మహిళల కోసం చేసిన కృషిని గుర్తు చేస్తుంది. ఆమె పేరుతో అనేక విద్యా సంస్థలు కూడా  నెలకొల్పబడ్డాయి.  ఆమె వారసత్వం తరతరాల వారికి ప్రేరణగా నిలుస్తోంది. మనం ఆమెకు నివాళులర్పిస్తూనే సమానత్వం, సాధికారత, దేశభక్తి అనే  విలువలను ముందుకు తీసుకెళదాం..                                     *రూపశ్రీ.

వాలెంటైన్ వీక్.. కొండంత భరోసా ఇవ్వగలిగేది ఆత్మీయ కౌగిలింత..!

  కౌగిలి అనే పదానికి చాలా రకాల అర్థాలు చెబుతుంటారు.  చూసే దృష్టిని బట్టి అర్థం మారుతుంది అంటారు. అలాగే ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ హవా కొనసాగుతోంది. ఈ వాలెంటైన్స్ వీక్ అందరికీ సంబంధించినదే అయినా స్పెషల్ గా ప్రేమికులు ప్రాముఖ్యత ఇస్తారు.  వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే కూడా ఒకటి.  ఈ రోజును ఆరోగ్యకరంగా ఎలా జరుపుకోవాలంటే.. హగ్ చేసుకోవడం పరిస్థితిని బట్టి అర్థాలు ఇస్తుంది. కానీ ఒక అమ్మాయి, అబ్బాయి హగ్ చేసుకుంటారు అంటే చూట్టూ ఉన్న అందరి కళ్లు నానా రకాలుగా అర్థాలు వెతుక్కుంటాయి.  ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం అంటే.. వారి మధ్య ఉండే అపార్థాలు, దాపరికాలు చెరిపేసుకోవడమే.. వాలెంటైన్ వీక్ ను ఎంతో సంబంరంగా జరుపుకునే ప్రేమికులు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తిని తన సొంతం అనుకుని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంత మాత్రం చేత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు.  అందులో ఇంకా పెళ్లి చేసుకోకుండా ప్రేమ పేరుతో తొందర పడకూడదు. ప్రేమించిన అమ్మాయిని ఈ వాలెంటైన్స్ వీక్ లో భాగంగా  కౌగిలించుకోవడానికి ముందు అమ్మాయి అనుమతి తప్పక తీసుకోవాలి. అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ స్టెప్ వేయకూడదు.   ప్రేమికుల జంట  ఏదైనా పని చేసే ముందు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.  పబ్లిక్ లో ఎలాంటి  పనులు చేయకూడదు.  సమాజం పట్ల భాద్యగా ఉండాలి. కౌగిలి.. కౌగిలి అనేది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే కాదు.. వాలెంటైన్స్ వీక్ ఎలాగైతే ఇష్టమైన వారితో ఎలాంటి సంబంధం ఉన్నవారితో అయినా ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవచ్చో.. హగ్ డే కూడా అలాగే జరుపుకోవచ్చు. తల్లిదండ్రులు, స్నేహితులు, తోడబుట్టిన వారు..ఆత్మీయులు,  కష్టాలలో తోడుగా నిలిచేవారు,  మంచి దారి చూపించేవారు..ఇలా ఎవరిని అయినా మనసుకు దగ్గరా చేసుకుని ఆత్మీయంగా ఒక కౌగిలింత ద్వారా కొండంత భరోసాను ఇద్దరి బంధంలో నింపుకోవచ్చు.                                   *రూపశ్రీ.

ఆకాశవాణి మాట.. అందరినీ అలరించిన పాట..

  టెలివిజన్, ఇంటర్నెట్ ఇవేవీ రాక ముందే ప్రపంచాన్ని ఇది కలపగలిగింది.  అప్పటి వాళ్ళకి అదేదో మాయాజాలం జరుగుతుందేమో అన్నట్టు ప్రపంచ ముచ్చట్లన్నీ గాలిలోనే జనాల దగ్గరకి చేరవేసి అందరికీ  ఆశ్చర్యాన్ని,  ఆనందాన్ని కలిగించింది.  అంతలా అందరినీ ఆశ్చర్యపరిచినదేమిటో.. అననుకుంటున్నారా? ఆకాశం నుండి ఏదో మాట వినబడినట్టు.. ఒక బుల్లి పెట్టేలో నుండి లీలగా వినిపించే మాటలు, పాటలు, ముచ్చట్ల సమాహారం.. పెద్దవాళ్లకు మరచిపోలేని అనుభూతులను పంచిన వెలకట్టలేని బహుమానం.. అదే.. “రేడియో”. మన భారతదేశ ప్రజలకి మాత్రం   ‘ఆకాశవాణి’గా  బాగా పరిచయం. ఇప్పుడున్న చాలామంది తమ బాల్యంలో ఈ ఆకాశవాణి  మాట, పాట విననివారు  ఉండరు. టెక్నాలజీ పెరిగినా కూడా  ఇది మన జీవితాల్లో ఇప్పటికీ ఉంది.  ప్రతి ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన  ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భం జరుపుకుంటారు.  ఒకప్పుడు అందరినీ ఎంతగానో అలరించిన  చిన్ననాటి నేస్తమైన రేడియో గురించి తెలుసుకుంటే....  రేడియో.. 19వ శతాబ్ధపు తొలినాళ్లలోనే రేడియో ప్రపంచానికి పరిచయమైనప్పటికీ దానికంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆలోచన మాత్రం 2010లో ప్రారంభమైంది.  రేడియో ప్రాముఖ్యతను గుర్తించి, దీనికంటూ  ప్రత్యేకమైన రోజు ఉండాలని  మొదటగా స్పెయిన్ దేశం  ప్రతిపాదించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియో  ప్రభావాన్ని గుర్తించిన యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011, ఫిబ్రవరి 13న అధికారికంగా ప్రకటించింది. ప్రజలకు సమాచారం అందించడంలోనూ, విద్యను ప్రోత్సహించడంలోనూ,  సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తూ ప్రజలను ఏకం చేయడంలోనూ  రేడియో ఎంతగానో సహాయపడింది. వార్తలు, వినోదం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది.  పట్టణాలకే కాక  గ్రామాలకు కూడా  చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా విషయం పట్ల అవగాహనను వ్యాప్తి చేయడంలోనూ, ప్రజలకి  వర్తమాన విషయాల గురించి  సమాచారం  అందించటంలోనూ శక్తివంతమైన సాధనంగా పనిచేసింది. రేడియోతో భారతదేశ ప్రజలకున్న అనుబంధం.. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోయలు, విశాల మైదానాలతో ఎంతో భౌగోళిక వైవిధ్యం ఉన్న భారతదేశంలో ఎక్కడెక్కడో నివసించే ప్రజలందరికీ  సమాచారం అందించటం అంత సులువైన విషయం కాదు. కానీ రేడియో ఆ పనిని సాధ్యం చేసింది. అందుకే మన దేశంలో రేడియో ఒక ప్రాచీనమైన, అత్యంత నమ్మదగిన సమాచార మాధ్యమాలలో ఒకటిగా ఇప్పటికీ పరిగణించబడుతుంది. భారతదేశంలో మొదటిసారిగా  రేడియో ప్రసారం 1927లో ప్రారంభమైంది. 1936లో "ఆకాశవాణి"(ఆల్ ఇండియా రేడియో) ఏర్పడింది. అప్పటి నుండి, భారతదేశంలో సామాన్య ప్రజల రోజువారీ జీవితాల్లో రేడియో ఒక భాగమైపోయింది. సమాచారాన్ని అందించడంలోనూ, వినోదాన్ని పంచడంలోనూ, సంగీతం, వార్తలు, సమకాలీన అంశాలను అందించడంలోనూ రేడియో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నాటికీ కూడా భారతదేశంలో  ఇంటర్నెట్ అందుబాటులో లేని  మారుమూల  ప్రాంతాలలో నివసించే ప్రజలకు వార్తలు, వినోదం, విద్యా సంబంధిత సమాచారంతో పాటూ  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి  అవగాహన కల్పించడంలో రేడియో ఎంతో సహాయపడుతోంది. ఆపద సమయాల్లో, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, రేడియో అత్యవసర సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది.  ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ వంటి కార్యక్రమాల ద్వారా,  ప్రజలతో నేరుగా మాట్లాడటానికి, వారి సమస్యలు తెల్సుకోవటానికి  ఈ  రేడియో ఎంతగానో ఉపయోగపడుతోంది. రేడియో భవిష్యత్తు.... టెక్నాలజీ ఎంత పెరిగినా, మనమెంత ఎదిగినా  అమ్మ పిలుపులాంటి ఆకాశవాణి మాటని మర్చిపోలేము, మర్చిపోకూడదు. ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా ఈ రేడియో మన తరానికి అందించిన సేవలని గుర్తించి, ప్రశంసించాలి. ప్రస్తుతం ఎఫ్.ఎం రేడియోలు, కమ్యూనిటీ రేడియోలు, ఆన్‌లైన్ రేడియోలు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి.  డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ రేడియో, పాడ్ కాస్టులు  వస్తున్నాయి. ఎన్ని వచ్చినా  కానీ, ఇప్పటికీ ప్రజలకు అత్యంత నమ్మకమైన  సమాచార మాధ్యమంగా సంప్రదాయ రేడియో కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంటుంది.                                    *రూపశ్రీ.

ప్రామిస్ డే.. బంధంలో నమ్మకానికి పునాది ఇదే..!

  వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఈ వాలెంటైన్స్  వారంలో ప్రతి రోజు సంబంధాలు,  ప్రేమకు సంబంధించి విభిన్న అంశాలు రోజుకు ఒకటిగా ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయి. వాలెంటైన్స్ వీక్  రోజ్ డే తో ప్రారంభం అవుతుంది  ఇది వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది. ప్రేమించే ప్రతి ఒక్కరూ తమకు తమ భాగస్వామి ఎంత ముఖ్యమో, తమ భాగస్వామి పట్ల తమకున్న ప్రేమ ఎంత గొప్పదో తెలియజేయడానికి,  వ్యక్తం చేయడానికి ఈ వాలెంటైన్స్ వీక్ చాలా మంచి వేదిక అవుతుంది. ప్రామిస్ డే.. సంబంధాలలో నిబద్ధత,  విధేయత  ప్రాముఖ్యతను ప్రామిస్ డే నొక్కి చెబుతుంది. ప్రామిస్ డే అనేది వాలెంటైన్స్ వారంలో ఐదవ రోజు. ఇది సంబంధాలలో  బలాన్ని పెంచుతుంది.  ప్రామిస్ డే రోజు భాగస్వామికి వాగ్దానాలు చేయడం, బంధం పట్ల ఉన్న  నిబద్ధతను చాటిచెప్పడం,  బంధానికివిలువ ఇవ్వడం,  కష్టాల్లో ఒకరికొకరు అండగా ఉంటామని ప్రామిస్ చేసుకోవడం. ఇది  భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నమ్మకం, అవగాహన,  ఒకరి పట్ల మరొకరు విధేయతగా ఉండటం వంటి విషయాలను ప్రామిస్ తెలుపుతుంది.  ప్రేమను, బంధం పట్ల గౌరవాన్ని  తెలియజేస్తూ హృదయపూర్వకంగా  ఉత్తరాలు రాయడం, లేదా ప్రేమ లేఖలు రాయడం, మనసులో ఉన్న అమితమైన ప్రేమకు అక్షరరూపం ఇవ్వడం లేదా మనసులో ఉన్న ప్రేమను ఏదో  ఒక అందమైన చర్యతో వ్యక్తం చేయడం ద్వారా ప్రామిస్ డే ను అందంగా మార్చుకోవచ్చు. నమ్మకమే పునాది.. ఏ బంధానికి అయినా నమ్మకమే పునాది అవుతుంది.  స్నేహం, ప్రేమ,  ఇతర బందాలు ఏవైనా నమ్మకం అనే పునాదుల మీదనే బాగుంటాయి. ఆ పునాది సరిగా లేకపోతే బంధం కుప్పకూలిపోతుంది. ప్రేమికులకు, ప్రేమను మనసులో నింపుకున్నవారికి కూడా అంతే.. నమ్మకం అనే పునాది బాగుంటేనే వారి బంధం వివాహం వరకు వెళ్లగలుగుతుంది.  ఆ నమ్మకాన్ని ప్రామిస్ ఇవ్వగలుగుతుంది. అందుకే ప్రామిస్ డేకి అంత ప్రాముఖ్యత.                                      *రూపశ్రీ.

సైన్స్ రంగంలో మహిళల విజయ పతాకం..  

    ఆడవారు చదువుకి కూడా నోచుకోని ఆటవిక కాలం నుంచి మగవారితో సమానంగా ఉన్నతవిద్య పొందే కాలానికి వచ్చింది మన సమాజం. అయితే ఇప్పుడు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ఉంటున్నప్పటికీ ఇంకా వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అందుకే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్(STEM)  రంగాల్లో మహిళలు, అమ్మాయిలు సాధించిన విజయాలని,  వారి కృషిని గౌరవించటానికి,  శాస్త్ర-సాంకేతిక రంగాల్లో లింగ సమానత్వం, మహిళా సాధికారతకున్న  ప్రాముఖ్యతను గుర్తుచేయటానికి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి11న ‘అంతర్జాతీయ మహిళలు, బాలికల  విజ్ఞానశాస్త్ర దినోత్సవం’ జరుపుకుంటారు.   శాస్త్రీయ రంగంలో మహిళల భాగస్వామ్యం తగ్గడానికి ఎదురైన అడ్డంకులను, దురభిప్రాయాలను తొలగించడమే ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.  మరి ఈ దినోత్సవం మహిళా పురోగతికి ఎలా సాయపడుతుందో తెలుసుకుంటే...   ఎప్పుడు మొదలైందంటే.. మొదటి నుంచీ  సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్(STEM) వంటి రంగాలలో లింగ అసమానత్వం చాలా ఎక్కువగా ఉంటూ వస్తుంది. అయితే మహిళల సాధికారత, లింగ సమానత్వం ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని  ఐక్యరాజ్యసమితి భావించింది. 2015లో జనరల్ అసెంబ్లీ ద్వారా అంతర్జాతీయ మహిళలు, బాలికల విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని స్థాపించింది.  ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న జరుపుకుంటారు. మహిళా శాస్త్రవేత్తలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచిన  ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త ఐన మేరీ క్యూరీ  జన్మదినాన్ని గౌరవిస్తూ ఈ రోజుని ఎంచుకున్నారు. ఈ దినోత్సవం గత కొన్ని దశాబ్దాలలో ప్రపంచ సమాజంలోని మహిళలు, బాలికలను విజ్ఞానశాస్త్రంలో భాగస్వాములని  చేసేందుకు ప్రేరేపించింది.    సైన్సు రంగంలో మహిళా పురోగతి .. 2700బి‌సి కాలానికి చెందిన   మెరిట్-ప్తా సమాధిపై  “చీఫ్ ఫిజీషియన్” అని రాసి ఉండటంతో ఆవిడే మొదటి మహిళా శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచింది. 1876లో ఎలిజబెత్ బ్రగ్ అనే మహిళ తొలి ఇంజనీరింగ్ పట్టా పొందటంతో మహిళల ఉన్నత విద్యకి తొలి అడుగు పడినట్టయింది. మన ఇండియాలో అయితే 1919లో అయ్యల సోమయాజుల లలిత మొట్టమొదటి మహిళా ఇంజినీరుగా పట్టా పొందారు.  రేడియోధార్మికత మీద విశేష ప్రయోగాలు చేసిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1903లో మొట్ట మొదటి మహిళా నోబెల్ గ్రహీతగా నిలిచారు. 1970ల నాటికి ఇంజనీరింగ్  డిగ్రీలు పొందుతున్న మహిళల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగింది. 1980ల నాటికి యూనివర్సిటీల్లో సుమారు 37శాతం మహిళలు కంప్యూటర్ సైన్సుని ప్రధానంగా ఎంచుకున్నారు. మన భారతదేశానికి చెందిన  ప్రతిభావంతులయిన   మహిళలు చాలా మంది సైన్సురంగంలో దేశపురోగతికి ఎంతగానో దోహదం చేశారు. బ్రిటీష్ కాలం నుంచి నేటివరకూ ఎంతోమంది భారత మహిళలు తమకున్న అడ్డంకులన్నీ దాటుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్య చదవటంతో పాటూ, మన దేశ పురోగతిలో సాయపడ్డారు. నేడు మన దేశం గర్వంగా చెప్పుకునే ఇస్రో సంస్థలో కూడా మహిళల  ప్రాతినిధ్యం బాగా పెరిగింది. మంగళయాన్, చంద్రయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మహిళా శాస్త్రవేత్తలు కీలక భాద్యతలు చేపట్టారు. డి‌ఆర్‌డి‌ఓ లో కూడా వీరి కృషి అమోఘం. ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టరుగా పనిచేసిన టెస్సి థామస్ ‘మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా”గా పేరు పొందారు. ఇలా ఎంతోమంది మహిళలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు.   విజ్ఞానం, సాంకేతికత, ఇంజనీరింగ్, గణితశాస్త్రం(STEM) రంగాల్లో లింగ భేదం లేకుండా  పురుషులతో పాటూ మహిళలు, బాలికలు కూడా  శాస్త్రీయ విద్య-వృత్తుల్లో సమాన అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మహిళా శాస్త్రవేత్తల విజయాలను, పరిశోధనలో  సాంకేతిక పురోగతికి వారు చేసిన కృషిని గుర్తించి చాటి చెప్పటం కూడా దీని ముఖ్య ఉద్దేశమే.  ఆయా రంగాల్లో విశేషంగా రాణించిన మహిళల విజయాలకి గుర్తింపు, గౌరవమివ్వటం ద్వారా మరెంతో మంది ఈ రంగాల వైపు వెళ్లడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో కూడా ఉన్నత స్థానాల్లో నిర్ణయాలు తీసుకునేలా, నాయకత్వం వహించేలా  మహిళలని మరింతగా ప్రోత్సహించడం,  యువతకు స్ఫూర్తిని అందిస్తూ, STEM రంగాల్లో ఉన్న అవకాశాలను అన్వేషించేలా చేయడం వంటివి కూడా ఈ దినోత్సవ లక్ష్యాల్లో ఉన్నాయి.                                    *రూపశ్రీ.