అవాక్కు చేసి చమక్కులు సృష్టించిన కాలం!!

సాంకేతికత ఈ ప్రపంచాన్ని మొత్తం పెద్ద మార్పులోకి తీసుకెళ్లింది. ఎక్కడి ఆదిమానవుడి కాలం ఎక్కడి 5జీ నెట్వర్క్ కాలం. ఉన్నచోటు నుండి కాస్త అంటే ఒక అయిదు ఆరు సంవత్సరాలు వెనక్కు తిరిగి చూస్తే పెద్ద వింతేమీ కాదు అన్నట్టు అనిపించవచ్చు కానీ ఒక్కసారి మన బాల్యానికి, ఇప్పటికి చోటు చేసుకున్న మార్పులు, ఆ మార్పులలో తళుక్కుమన్న మెరుపులు అన్నీ పరిశీలించుకుంటే ఔరా అనిపిస్తుంది. ఇక మరీ ముఖ్యంగా గత పదేళ్లలో జరిగిన మార్పులు అనుహ్యమైనవి. ఒకటి రెండు కాదు ఎన్నెన్నో అద్భుతాలు. వస్తువుల వీరవిహారం!! చిన్ని తెర మీద బొమ్మలు కదులుతూ, శబ్దాన్ని వినిపిస్తూ అందరికీ అద్భుతం కలిగిచింది టీవీ. ఈ టీవీ తెచ్చిన సందడి అంతా ఇంతా కాదు. రెండు మూడు దశాబ్దాల క్రితం టీవీ ఊరికొక్కటో రెండో ఇళ్లలో ఉండేది. మిస్టర్ పెళ్ళాం సినిమాలో అందరూ కట్టకట్టుకుని టీవీ ఉన్న ఇంటికి వచ్చేసినట్టు పిల్లా, జల్లా, ముసలి, ముతకా, కుర్రకారు, మహిళామణులు అందరూ కలసి వనభోజనాలు చేసినంత సంబరంగా చిత్రలహరి పాటలు, సప్తగిరి ఛానెల్ లో సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి టీవీ వచ్చి పడ్డాక, దానిలో ఉన్న అపురూపం ఏదో తగ్గిపోయింది. అది కూడా క్రమంగా మార్పులు చెందుతూ స్మార్ట్ టీవీ దశకు వచ్చింది.  సంచలన తరంగం!! ఇదేంటి అని అందరికీ అనిపించవచ్చు. అదే అదే అద్భుతం అని చెప్పుకున్న టీవీ ని కూడా తన్ని మొదటి స్థానం ఆక్రమించిన అరచేతి మాయాజాలం మొబైల్ ఫోన్. నిజానికి కేవలం పదే పది సంవత్సరాల కాలంలో ఈ మొబైల్ రంగంలో వచ్చిన మార్పులు గమనిస్తే ముక్కుమీద వేలేసుకుంటాం. చిన్ని కీప్యాడ్ మొబైల్ ఇంట్లో ఒకే ఒకటి, ఇంకా పక్కింటోళ్లు, ఎదురింటోళ్ల చుట్టాలకు కూడా అదే దిక్కు. అదొక్కటి ఉంటే ఆహా అదే పెద్ద విలాసవంతమైన జీవితం అనుకున్న రోజుల్ని తన్ని తగలేసి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లోనూ మొబైల్స్. అందునా స్మార్ట్ ఫోన్స్ బీభత్సం మాములుగా లేదు. కొందరు ఈ స్మార్ట్ ఫోన్స్ పుణ్యమా అని ఇంట్లో కూర్చునే డబ్బులు సంపాదిస్తున్నారు. అన్ని రకాల సామాజిక మద్యమాలకు అనుసంధానకర్తగా పెద్దరికం తెచ్చిపెట్టుకున్న అరచేతి బుల్లిపిట్ట మన స్మార్ట్ ఫోన్. వాహనాల వీక్షణం!! ఇంట్లో సైకిల్ ఉంటే అదే గొప్పగా అనుకున్న రోజుల నుండి ఎన్నెన్నో రకాల ఫోర్ వీలర్స్ వచ్చి తగలడ్డాయ్ ఇప్పుడు. బెకార్ గా తిరిగే అబ్బాయి చేతిలో తప్పనిసరిగా బైక్, స్మార్ట్ ఫోన్ ఉండనే ఉంటాయి. అవి కూడా సదరు సినిమాల్లో హీరోలు స్టంట్ లు చేసే కంపెనీలు అయి ఉంటాయి. ఇంటర్ పాసయితే అది, ర్యాంక్ వస్తే ఇది అని పిల్లలు అడగడం కొన్నిచోట్ల కనబడితే పెద్దలే లంచాలు ఆఫర్ చేసేస్తున్నారు. వాటిని ప్రేమగా బహుమతులు అనేస్తారు. అందమా అందమా…అమ్మో అందమా!! అవన్నీ ఒక ఎత్తు అయితే బ్యూటీ ట్రెండ్ మరొక ఎత్తు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత ట్రెండ్ కు కాసింత నూతనత్వాన్ని, తమదైన సొబగులను అద్ది రెచ్చిపోతున్నారు ఫ్యాషన్ డైజైనర్స్. వాటి ఫలితమే అమ్మాయిలు అందంతో తళుక్కుమని అబ్బురపరుస్తున్నారు. ఈ కోవలో ఒకటి కాదు రెండు కాదు అమ్మాయిలు అంగాంగం ధరించే ఎన్నో వస్తువులు వచ్చి పడ్డాయి. ఇందులో మేకప్ మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఇంకా ఇంకా!! సంకేతికంగా జరిగిన అభివృద్ధి మొత్తం మానవ జీవితాన్ని సులువు చేసిందని చెప్పవచ్చు. ఇంటిలో ఎన్నో రకాల పనులు సులువుగా జరిగిపోతున్నాయి, రోజులు, నెలల తరబడి సాగాల్సిన పనులు గంటలు, నిమిషాలలో అయిపోతున్నాయి. గ్రాఫిక్స్, విజువల్స్ పరంపరలో సినిమాల మ్యాజిక్ మరొక ఎత్తు. ఆరోగ్యం, విద్య, వైజ్ఞానికం, సమాచారాలు వినియోగాలు, ఒకటా రెండా?? అందరినీ అవాక్కు చేసి చమక్కులు సృష్టించింది కాలం, కాలంతో పాటు ఎన్నో……                                                                                    ◆వెంకటేష్ పువ్వాడ.  

మనిషిలో ఆలోచన ఎలా పెంపొందాలి??

మనిషికి జీవితంలో ఆలోకాహాన చాలా ముఖ్యమైనది. మంచిగా ఆలోచించడం, చెడుగా ఆలోచించడం ఆ మనిషి మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి ఆలోచనలో కూడా ఒక అంశం ఇమిడిపోయి ఉంటుంది. అదే ప్రేరణ. చాలామంది తమ ఆలోచనల్లో వ్యర్థమైన విషయాలు జొప్పించి ప్రేరణ కలిగించే విషయాలను అసలు తమ బుర్రలోకి రానివ్వరు. అయితే… ప్రేరణ కాని… ఆలోచన కాని అది ఇతరుల నుండి ఆశించడం చాలా పొరపాటు.  ఈ కాలంలో ఎవరికి వారే ప్రేరణ కలిగించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం అమాయకత్వమే అవుతుంది. మీకు మీరు ప్రేరణ కలిగించుకోవాలంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు అభిమానించుకోవాలి. మీలోని లోపాలను అవకాశాలుగా భావించుకోవాలి. ఇదంతా జరగాలి అంటే… ముందు మీ స్థాయిని, మీ పరిస్థితిని వాస్తవిక కోణంలో అంగీకరించాలి.  కులం, మతం, భాష ఏవైనా, శారీరకంగా మనిషి  పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, అందవికారంగా ఉన్నా, నలుపు, తెలుపు... ఎలా వున్నా భౌతిక రూపాన్ని మరియు ఆంతరంగిక మనసత్వాన్ని రెండింటిని కూడా ప్రేమించాలి. అదే మీలో ప్రేమించే, ప్రేరేపించుకునే తత్వాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మీరు అనుక్షణం అభినందించుకోవాలి. కాల్లో ముల్లు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోనందుకు సంతోషించాలి. ఒకరోజు ఇద్దరు స్నేహితులు దగ్గరలో ఉన్న పార్కుకు అలా నడకకు బయలుదేరారు. వారు అలా వెళ్లి కాస్త నడిచి ఒకచోట కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఎగురుకుంటూ పోతున్న పక్షులలో ఒక పావురం  రెట్టవేసింది. వెంటనే అతను చేత్తో తుడుచుకుంటూ పక్కనున్న స్నేహితుడితో "దేవుడు ఎంత గొప్పవాడు” అన్నాడు. ఆ స్నేహితుడు ఆ మాటకు విస్తుపోయి. “మీద రెట్ట పడితే అలా అంటున్నావేమిటి?” అన్నాడు.  అప్పుడు మొదటి స్నేహితుడు “నిజంగా దేవుడికి ఎంత దూరదృష్టి కదా?" అన్నాడు మళ్ళీ. ఈసారి రెండో స్నేహితుడికి కాస్త వెర్రెత్తి   “నువ్వు చెప్పేదేమిటో నాకర్థం కావటం లేదు” అన్నాడు చిరాగ్గా.  “పక్షులకు గాలిలోకి ఎగిరే శక్తి ఇచ్చిన దేవుడు నిజంగా ఎంతో అభినందనీయుడు" అన్నాడు రుమాలుతో తుడుచుకుంటూ. రెండవ స్నేహితుడి కోపం నషాళానికి అంటించి. “నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు నువ్వనేది ఏమిటి?” అన్నాడు స్నేహితుడు చిటపటలాడుతూ. "అహా! నా ఉద్దేశ్యమేమిటంటే దేవుడు పక్షులకు మాత్రమే ఇలా ఎగిరే శక్తి ఇచ్చాడు. ఆవులకు, గేదెలకు ఎగిరే శక్తి ఇవ్వలేదు” అంటూ వాష్ బేసిన్ వైపు వెళ్ళాడు. ఆ మాట విన్న రెండవ స్నేహితుడు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. పైన చెప్పనా సంఘటనలో వేరే వ్యక్తి అయితే “అంతా నా ఖర్మ” “ఆ దిక్కుమాలిన పావురం సరిగ్గా నా మొహం మీదే వెయ్యాలా?” “ఈరోజు లేచిన వేళావిశేషం బాగాలేదు” ఏదో అవుతుందని నాకు పొద్దున్నే అనిపించింది” లాంటి మాటలు చెప్పుకుని తనకు ఏదో పెద్ద ఉపద్రవం కలిగింది అన్నంతగా ఫీలైపోయి బాధలో మునిగిపోయేవాడు. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు మనకు ఇంతకంటే పెద్ద సమస్య రాలేదు కదా అని తనకు తాను చెప్పుకోవడంలో, అలా ఆలోచించడంలో ఎంతో గొప్ప పరిపక్వత ఉంటుంది. అలాంటి ఆలోచనను అందరూ పెంపొందించుకోవాలి.                                     ◆నిశ్శబ్ద.

భారత స్వాతంత్ర్య పోరాటానికి ఉగ్గు పోసింది ఈ ఉద్యమమే!

భారతదేశం ఈరోజు ఎంత స్వేచ్చగా ఉందో మాటల్లో వర్ణించలేనిది. బ్రిటీష్ పాలకుల చేతుల్లో నలిగిన భారతదేశం ఎలా ఉండేదో ఆ కాలంలో జీవించి, ఆనాటి పరిస్థితులు అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తాయి. నాటి పౌరులు తమ పరిస్థితులకు అక్షరరూపం ఇచ్చినా, నాటి పరిస్థితులకు దృశ్యరూపం ఇస్తూ సినిమాలు, డాక్యుమెంటరీలు రూపొందించినా అదంతా ఖచ్చితంగా నాటి భారతం అనుభవించిన క్షోభ కంటే తక్కువే.  తెల్లదొరల పాలన నుండి భారతదేశానికి  విముక్తి తీసుకురావడంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో తమ ప్రాణాలు  త్యాగం చేశారు. ఈ భారతదేశ పోరాటాల్లో ప్రథమంగా చెప్పుకోగలిగింది క్విట్ ఇండియా ఉద్యమం. భారత స్వాతంత్య్రమే ధ్యేయంగా సాగిన  ఈ ఉద్యమం 81ఏళ్ళ కిందట ఇదే నెలలో, ఇదే తేదీన ఊపిరిపోసుకుంది. అంటే క్విట్ ఇండియా ఉద్యమం పురుడుపోసుకుని ఈ ఏడాది ఆగష్టు 8వ తేదీకి 81ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ ఉద్యమ విశేషాలు, ఈ ఉద్యమం సాగిన తీరు తదితర వివరాలు తెలుసుకుంటే..  1942సంవత్సరం, ఆగష్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది.  ఈ ఉద్యమానికి అప్పటి బొంబాయిలోని ఆగస్టు క్రాంతి మైదానం కేంద్రకమైంది(ఇదే ఇప్పటి ముంబై). భారత జాతీయ కాంగ్రేస్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభించబడింది.  ఈ ఉద్యమాన్ని క్విట్ ఇండియా ఉద్యమం అనే కాకుండా ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు.  ఈ ఉద్యమంలోనే జాతిపిత గాంధీజీ  "డూ ఆర్ డై" నినాదాన్ని ఇచ్చారు. 'సాధించు లేదా మరణించు' అనే ఈ నినాదంతో  గాంధీజీ మార్గనిర్దేశకత్వంలో శాలనోల్లంఘన యాత్ర సాగింది.  భారతీయుల నిరసనను అడ్డుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆపరేషన్ జీరో అవర్ ప్రారంభించింది. ఎంతో మంది కాంగ్రేస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రేస్ కార్యాలయాలపై దాడులు చేయించింది. నివేదికల ప్రకారం దాదాపు లక్షమంది అరెస్ట్ చేయబడ్డారు. వీరందరూ చాలాకాలం పాటు ఖైదు చేయబడ్డారు. సుమారు 1000మంది మరణించారు. ఈ ఉద్యమంలో 2500మందికి పైగా గాయపడ్డారు.   ఉద్యమంలో కీలక సభ్యులైన గాంధీజీ, జవహార్ లాల్ నెహ్రూలను కూడా జైలులో పెట్టారు. ఇలా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. అయితే దీని తరువాత స్వాతంత్ర్యపోరాట ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ క్విట్ ఇండియా  ఉద్యమం చాలా కీలక పాత్ర పోషించింది. బ్రిటీషువారికి భారతదేశం మీద ఉన్న పట్టును బలహీనపరచడంలోనూ, వలసవాదవిదానాల పైన తీసుకోవలసిన నిర్ణయాలను, చేసుకోవలసిన మార్పుచేర్పుల అవసరాన్ని ఇది తేలతెల్లం చేసింది. 1945లో రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత రాజకీయంగా డీకోలనైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో భారతదేశ యోధుల పోరాటం మరింత ఊపందుకుంది.క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లే మార్పులు తక్షణమే తీసుకురాలేదు. అయినప్పటికీ, ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ ఉద్యమం స్వాతంత్య్రానికి అనుకూలంగా భారతీయ ప్రజాభిప్రాయాన్ని పెంచడానికి దోహదపడింది.  భారతీయ ప్రజలు తమ స్వేచ్ఛను సాధించడానికి నిశ్చయించుకున్నారని బ్రిటీష్ వారికి బలంగా నొక్కి వక్కాణించింది. ఈ ఉద్యమంలోనే  భారతదేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించే కొత్త తరం నాయకులు ఆవిర్భవించారు. జాతీయ ఐక్యతా భావాన్ని కూడా ఈ ఉద్యమం ద్వారా పెంపొందించగలిగారు. మహిళలు కూడా.. క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందరో  మహిళలు కీలక పాత్ర పోషించారు. అపారమైన ధైర్యాన్ని,  నాయకత్వాన్ని ప్రదర్శించారు. అహింసా యుద్దమనే కారణం ఈ  ఉద్యమంలో ఎంతో మంది మహిళలు చురుకుగా పాల్గొనడానేలా చేసింది.  సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ లాంటి మహా వీర వనితల స్పూర్తితో, వారి నాయకత్వం కింద ఎందరో మహిళలు ఈ ఉద్యమంలో అపర చంఢికలై  కదం తొక్కారు. ఈ ఉద్యమలోనే విద్య, సంస్కృతి ప్రాధాన్యతను దేశం యావత్తు గుర్తించింది. ఈ కాలంలో దేశంలో ఎన్నో చోట్ల విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు స్థాపించబడ్డాయి. ఇలా క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఊపందుకోవడానికి గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేసింది.  అలాగే విద్య,సంస్కృతి ప్రాధాన్యతను గుర్తించేలా చేసింది.  మొత్తం దేశ పౌరులను ఏకం చేసింది.                                                            *నిశ్శబ్ద.

శారీరక స్థితి కలలకు కారణం అవుతుందా?

శారీరక ప్రవృత్తికి, అంటే వాత పిత్త శ్లేష్మ ధర్మాలకు, స్వప్నాలకు(కలలకు) సంబంధం  ఉంటుందని అధర్వణవేదం చెప్పింది. అంటే ఈ మూడు ప్రవృత్తులలో ఏదైన ప్రకోపించినప్పుడు అంటే ఎక్కువైనప్పుడు దాని ఫలితం కలలో వ్యక్తం చేయబడుతుంది. అలాగే శరీరంలో ఏవైన అంతర్గతంగా మార్పులు జరిగినప్పుడు ఆ మార్పులు కూడా కలలో కనిపిస్తాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే శరీరంలో జరిగే మార్పులు సరిగ్గా గమనించుకునే మనుషులే తక్కువగా ఉన్నారు ఈ కాలంలో.  అతిభుక్త సిద్ధాంతం అని ఒకటి ఉంది. అది కూడా ఈ కోవకే చెందుతుంది. ఒక రోజు రాత్రి ఎప్పుడైన అతిగా తినడం వలన కడుపులో సంభవించే మార్పులు ఆరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చే కలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎక్కువగా తిన్న పదార్థాన్ని అరిగించుకోవడానికి, జీర్ణమండలం ఎక్కువ రక్తాన్ని రప్పించుకుంటుంది. ఇందువల్ల  మెదడుకు పోవలసిన భాగం తగ్గిపోతుంది. ఇది కలల మీద ప్రభావం పడటానికి కారణం అవుతుంది.   ఇంతవరకు బాగానే ఉంది, అయితే ఒకే రాత్రి ఒకే ఆహారం తిన్న నలుగురు వ్యక్తులకు నాలుగు రకాల కలలు ఎందుకు వస్తాయో అంటే….. నలుగురు తిన్నది ఒకే పదార్ధం, కలలు మాత్రం వేరు వేరు. దీని గురించి ఆలోచిస్తే ఆ కలలు కనిన రోజు ఉదయం సమయంలో  వారు ఆయా విషయాలను గురించి చర్చించడమో, ఆలోచించడమో, ఆసక్తి చూపడమో జరిగి ఉంటుంది. అందువల్ల అవి వారి వారి స్వప్న విషయాలుగా మారి ఉంటాయి. అయితే శారీరక స్థితి కలకు మూలం ఎలా అవుతుందో తెలుసుకుంటే…...  ఒక రోజు బాగా తీపి పదార్థాలు తిని నిద్రపోవాలి. పడుకోబోయే ముందు దప్పిక అయినా, మంచినీళ్ళు త్రాగవద్దు. అంటే ఎలాగైనా సరే దప్పికతో నిద్ర పోవాలి. అలా నిద్రపోయినప్పుడు తప్పకుండా కల వస్తుంది. ఆ కలలో మీరు నీటినో, చమురునో, రక్తాన్నో లేక మరొక ద్రవ పదార్థాన్నో త్రాగుతూ ఉంటారు. అంటే మనిషి శరీరానికి అవసరమైన దాహం అనేది కలలో అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. దీనిని బట్టి శారీరక స్థితి, దప్పికగొన్న స్థితి, కలకు మూలమవుతుంది అనే విషయం నిర్ధారిత మవుతుంది. అలాగే లైంగికంగా దాహంతో ఉన్న వ్యక్తి విషయంలోను, శారీరకంగా ఆరోగ్యవంతుడైన యువకుడు లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉంటే, ఆ విషయాలకు సంబంధించిన  కలలు కంటాడు. యువకులు తరుచు స్థలన స్వప్నాలకు గురి అవుతూ ఉంటారు. ఈ విషయం  తెలియనిదేం కాదు. శారీరక పరిస్థితి కల స్వభావాన్ని నిర్ణయించినా, కల ఎలాంటిది అనే  విషయాన్ని నిర్ణయించదు. కలలు మొత్తం మీద లైంగికాలే అయినా, అవి వేరు వేరు విధాలుగా ఉండవచ్చు. కలలకు శారీరక స్థితి ఆధారం అనడానికి మరొక కారణం కూడ చెప్పవచ్చు. మెదడులో కొన్ని ప్రదేశాలను ఎలెక్ట్రోడ్ తో గిలిగింతలు పెడితే కొన్నిసార్లు గిలిగింతలకు లోనైన వ్యక్తి కలగంటాడు. ఇది ఆ వ్యక్తి జాగ్రదావస్థలో ఉండగానే జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా పాతజ్ఞాపకాలు కలలో ఎందుకు పునరావృతం అవుతాయో వివరించవచ్చు. కలలు యాదృచ్ఛికాలని వీటికి మనోవైజ్ఞానిక ప్రాముఖ్యం ఏమీ లేదని, మెదడులో ఉద్దీపింపబడిన భాగాన్ని బట్టి ఆయా జ్ఞాపకాలు పునరావృతం  అవుతాయని చెప్పవచ్చు.  ఇలా మనిషి శారీరక స్థితిని బట్టి కలల ప్రభావం ఉంటుందని పరిశోధనల్లో నిరూపితమైంది కూడా.                                           ◆నిశ్శబ్ద.

స్నేహబంధం కలకాలం నిలవాలంటే.. ఈ నాలుగు పొరపాట్లు చేయొద్దు..

ఆగస్ట్ నెల వచ్చిందంటే స్నేహితులంతా యమా ఖుషీ అయిపోతారు. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి. ఏడాదిలో మిగిలిపోయిన 364 రోజులు ఒక లెక్క, ఈ ఒక్క రోజు ఒక లెక్క. 364 రోజుల్లో తం జీవితాల్లో జరిగిన సంఘటనలు, స్నేహితులు తమకిచ్చిన చేయూత, వారిచ్చిన ధైర్యం, అండ ఇవన్నీ ఫ్రెండ్షిప్ డే రోజు వొద్దన్నా గుర్తొస్తాయి. అంతేనా.. దోస్త్ మేరా దోస్త్.. అని పాటలు పాడకపోయినా అంతే రేంజ్ లో బంధాన్ని వ్యక్తం చేసుకుంటారు. నిజానికి స్నేహం గురించి మాత్రమే కాదు.. ఏ దినోత్సవానికి ప్రత్యేక రోజును కేటాయించి  దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అని స్నేహం గురించి పాటలతో ప్రపంచానికి చెప్పినట్టు, స్నేహితుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు..  సమాజంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక సంబంధానికి కట్టుబడి ఉంటాడు. పుట్టినప్పటి నుండి చాలా సంబంధాలు పిల్లలతో సంబంధం కలిగి ఉంటాయి. తాతలు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో సహా అనేక సంబంధాలు కుటుంబం రూపంలో వ్యక్తిని చుట్టుముట్టాయి. అయినప్పటికీ కుటుంబంతో సంబంధం లేకుండా కలిగేది,  ఎల్లప్పుడూ  నిలిచి ఉండేది స్నేహం మాత్రమే.  ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవానికి అంకితం చేయబడింది.  గొప్ప స్నేహితుడు దొరికితే మాత్రం వారితో  స్నేహాన్ని  ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాకి.   ఎలాంటి గొడవలు జరగకూడదంటే ఈ కింది నాలుగు విషయాల్లో పొరపాట్లు చేయకండి.. స్నేహితులతో అబద్ధాలు చెప్పకండి.. స్నేహం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే స్నేహానికి మొదటి నియమం అబద్ధాలకు దూరం. స్నేహితుడికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎవరితోనైనా స్నేహం చేస్తున్నప్పుడు, మీ స్నేహం మధ్య ఎప్పుడూ అబద్ధం రానివ్వమని మీకు మీరే వాగ్దానం చేసుకోండి. సంబంధంలో అబద్ధాలు చెప్పినప్పుడు, స్నేహం చెడిపోతుంది. డబ్బు స్నేహానికి దూరంగా ఉండండి.. స్నేహం  సంబంధం నిస్వార్థంగా ఉండాలి. స్నేహితుడి నుండి ఎప్పుడూ ప్రయోజనం పొందవద్దు. మీకు ఆర్థిక సహాయం అవసరం కావచ్చు, కానీ స్నేహంలోకి డబ్బు తీసుకురావద్దు. ఎందుకంటే మీరు మీ అవసరాల కోసం స్నేహితుడిపై అతని డబ్బుపై ఆధారపడటం ప్రారంభించినప్పుడు, దాన్ని స్వార్థం అని వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. స్నేహం విచ్ఛిన్నమయ్యే అంచుకు రావచ్చు. దాపరికం వద్దు.. సాధారణంగా  తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని స్నేహితులు తమ స్నేహితులతో పంచుకుంటారు. కానీ  స్నేహితులు తమ విషయాలను  దాచడం ప్రారంభించినప్పుడు సంబంధంలో దూరం రావడం ప్రారంభమవుతుంది.  అదే విధంగా స్నేహితుల విషయాలను ఇతరులకు చెప్పడం కూడా బంధానికి బీటలు వస్తుంది.  సహాయం చేయడంలో వెనుకడుగు వేయవద్దు.. స్నేహమంటే అర్థం  దుఃఖంలోనూ,  ఆనందంలో మద్దతు ఇవ్వడం. స్నేహితుడికి  అత్యంత అవసరమైనప్పుడు సహాయం చేయకుండా ఎప్పుడూ వెనుకడుగు వేయకండి. కొన్నిసార్లు  సాధ్యమైన మేరకు   సహాయం చేస్తానని స్నేహితులకు మాట ఇచ్చి, ఆ తరువాత సహాయం చేయాల్సిన సమయంలో వెనకడుగు వేయకూడదు.  స్నేహితులకు సహాయం చేయడానికి  తగినంత మార్గాలు లేకపోయినా, స్నేహితులను మానసికంగా, ఒంటరిగా ఉండనివ్వవద్దు. ధైర్యం ఇవ్వడం ద్వారా స్నేహితులను కష్టసమయంలో దృఢంగా ఉంచేలా చేయొచ్చు.                                     *నిశ్శబ్ద.

ఇలా చేస్తే స్నేహం పదిలం.. పదిలం...

ఒకసారి ఇద్దరు స్నేహితులు చాలా దూరం కలసి ప్రయాణం చేయాల్సివచ్చింది. అడవులు, ఎడారులు, మైదానాలు, కొండలు, గుట్టలు... ఇలా వారి ప్రయాణం సాగింది. ఇద్దరూ ఎంతో ప్రాణస్నేహితులు. ఈ ప్రయాణంలో కాలక్షేపానికి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. ఒకోసారి కొన్ని విషయాలపై ఇద్దరికి అభిప్రాయం కలవక తీవ్రస్థాయిలో వాదించుకునేవారు. ఆ వాదన కాస్తా కాసేపటికి విషయం నుంచి డైవర్ట్ అయ్యి వ్యక్తిగత విషయాలని విమర్శించే దాకా వెళ్ళేది. ఇలా జరిగినప్పుడల్లా అందులో ఒక స్నేహితుడు ఆ విషయాన్ని ఇసుకపై వేలితో రాసేవాడు. రాసిన కాసేపటికి తిరిగి తన స్నేహితుడితో మునుపటిలా ప్రేమగా మాట్లాడేవాడు. ఇలా వారి ప్రయాణం సాగిపోతోంది. స్నేహితుల్లో ఒక అతను ఇసుకపై వేలితో రాయటాన్ని గమనించిన మరో స్నేహితుడు ఏం రాస్తున్నావు? ఎందుకలా  రాస్తున్నావు అని అడిగితే ఇతను నవ్వేసి ఏం లేదు అని చెప్పేవాడు. ఒకసారి స్నేహితుల్లో  ఇలా రాసే వ్యక్తి ఓ ప్రమాదంలో పడతాడు. కొండ చివరి నుంచి లోయలోకి పడబోయే ఇతన్ని అతని స్నేహితుడు ఎంతో కష్టంగా రక్షిస్తాడు. ఆ క్రమంలో అతనికి ఎన్నో దెబ్బలు కూడా తగులుతాయి. ఓ క్షణం అతను కూడా లోయలోకి పడబోతాడు. అంటే తన ప్రాణాలని కూడా లెక్కచేయకుండా తన స్నేహితుడిని రక్షిస్తాడు. లోయలోకి పడబోతున్న అతని స్నేహితుడు ప్రాణాలు పణంగా పెట్టి రక్షించగానే, రక్షించబడ్డ వ్యక్తి వెంటనే చేసిన పని, తన స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పి, వెంటనే పక్కనే వున్న రాతిపై చెక్కటం మొదలు పెట్టాడు. మరో వ్యక్తికి ఇతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఏంటా అని చూస్తే, తను చేసిన సహాయాన్ని ఆ రాయిపై రాయటం గమనించి ఆశ్చర్యపోయాడు. అంతా అయ్యాక విషయం ఏంటని అడుగుతాడు అతను తన స్నేహితుడిని. అప్పుడు ఆ స్నేహితుడు ఇలా చెబుతాడు. చిన్నప్పటి నుంచి మనిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఎప్పుడు ఇలా కేవలం ఇద్దరమే ఇంత దూరం, ఇన్ని రకాల పరిస్థితులని, ప్రమాదాలని కలసి, దాటి ప్రయాణం చేయలేదు. మన ఈ ప్రయాణం గురించి తెలియగానే మా నాన్న నాకు ఓ మాట చెప్పారు. ఇంతవరకు మీరిద్దరు సరదాగా గడిపారు. కాబట్టి మీ మధ్య ఏ భేదాభిప్రాయాలు రాలేదు. ఒకరి కోసం ఒకరుగా ఉన్నారు. కానీ మీరు సాగించే ఈ ప్రయాణంలో మీరిద్దరే వుంటారు. పైగా ఎన్నో ప్రమాదాలు, ఒత్తిడులు. వీటి మధ్య ఎప్పుడైనా ఇద్దరి మధ్య తేడా వస్తే, నీ స్నేహితుడి వల్ల నీకు  బాధ కలిగితే ఆ విషయాన్ని వెంటనే మర్చిపో. అదే నీ స్నేహితుడు నీకు ఏ చిన్నపాటి సాయం చేసినా దానిని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఈ విషయం నువ్వు మర్చిపోకుండా ఉండటానికి నీకు అతనిపై కోపం రాగానే ఆ విషయాన్ని ఇసుకలో రాయి. నీకు చేసిన సహాయాన్ని రాయిపై రాయి. ఇసుకలో రాసినది చెరిగిపోవటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో ఎదుటి వ్యక్తి నీకు చేసిన చెడుని మర్చిపో. రాతిపై రాత ఎంతకాలం నిలుస్తుందో అంత శాశ్వతంగా అతని మంచితనాన్ని గుర్తుపెట్టుకో. అదే "ఇసుకపై రాత, రాతిపై రాత " అని చెప్పాడు అతని తండ్రి. మనం చాలాసార్లు పైన చెప్పుకున్న దానికి రివర్స్ లో ఎదుటివ్యక్తి మనకు చేసిన మంచిని ఇసుకపై, అలాగే చెడుని రాతిపై రాసి పెట్టుకుంటాం. అంటే ఎవరివల్లనైనా బాధ కలిగితే  శాశ్వతంగా గుర్తు పెట్టుకుని, వారు చేసే మంచిని ఆ బాధ మధ్య మర్చిపోతాం. అందుకే చాలాసార్లు, చాలామందిపై ఆరోపణలు వుంటాయి. అదే వారు చేసే చిన్నచిన్న పొరపాట్లని వెంటనే మర్చిపోతూ,  వారి వలన మనకి కలిగే మంచిని ఎప్పుడూ గుర్తుచేసుకోగలిగితే ఏ బంధంలోనైనా భేదాభిప్రాయాలు రావు.  ఏ ఇద్దరు వ్యక్తులైనా కలసి ప్రయాణం చేయాలంటే ఈ సూత్రం తప్పక గుర్తుపెట్టుకోవాలి.   రమ ఇరగవరపు  

‘అవయవదాతా.. స్పూర్తీభవ..’  మానవత్వపు హృదయాలు మరిన్ని చిగురించాలి!!

అన్నదాతా  సుఖీభవ.. అనే మాటలు ఎన్నోచోట్ల ఎంతోమంది నోట వినే ఉంటారు. మరీ ముఖ్యంగా ఆకలితో నకనకలాడే కడుపు నింపినప్పుడు అన్నదాతా సఖీభవా.. అని దీవించడం పరిపాటి. అయితే ఇప్పుడు మరొక కొత్త నినాదం దేశం యావత్తు స్మరించాలి. అవయవదాతా స్పూర్తీభవ అని కొత్తగా కొనియాడాలి. అన్నం పెడితే.. ఆకలి తీరితే.. అది ఒక పూట, ఒకరోజు మనిషికి శక్తినిచ్చి ప్రాణం నిలబెడుతుంది. కానీ అవయవదానం చేస్తే పునర్జన్మను ప్రసాదించినట్టే. ఒకప్పుడు అవయవదానం చెయ్యాలంటే ఎంతో కష్టం ఉండేది. ఎన్నెన్నో అపోహలు కూడా ఉండేవి. అవయవదానం చేసినవారు నరకానికి పోతారనే నమ్మకం పలువురిని అలాంటి మహోన్నతమైన అదృష్టానికి దూరం చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశం అభివృద్ది చెందుతూ మనిషి ఆలోచనా తీరును కూడా మార్చేస్తోంది. దేశంలో పెరుగుతున్న అవయవదాన సంఘటనలు ఎంతోమందికి జీవితాల మీద కొత్త ఆశ కలిగిస్తోంది.  భారతదేశంలో 13వ అవయదాన వేడుకల సందర్భంగా వెలువడిన మరణ గణాంకాలు, అవయవదాన లెక్కలు, దీన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన మార్పు చేర్పులు తెలుసుకుంటే.. అన్నం ఒక పూట కడుపు నింపితే అవయవదానం  ఒక జన్మాంతం ప్రాణాన్ని నిలబెడుతుంది. అందుకే అవయవదానం ఎంతో గొప్పదిగా పేర్కొనబడింది. పదేళ్ల కిందట అంటే 2013లో మన దేశంలో నమోదైన అవయవదానాలు 5000.  పదేళ్ళ తరువాత ప్రస్తుతం 2023లో ఈ సంఖ్య 15వేలకు చేరింది. అంటే 10ఏళ్ళలో మూడురెట్ల మెరుగుదల సాధ్యమైంది. అవయవదానం మీద అవగాహన పెంచడం వల్లనే ఈ గణాంకాల పెరుగుదలకు కారణమనే విషయం అందరూ ఒప్పుకుని తీరాలి.  భారతదేశంలో ప్రతి సంవత్సరం 95లక్షలమంది మరణిస్తున్నారు. వీరిలో కనీసం లక్ష మంది దాతలుగా నమోదైన వారున్నారు. అయినప్పటికీ అవయవాల వైఫల్యం కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రతి రోజూ 300మంది అవయాల వైఫల్యం కారణంగా మృతిచెందుతున్నారు. వీటన్నిటికి పరిష్కారం ఒకే ఒక్కటి. అదే అవయవదానాన్ని ప్రోత్సహించడం, అవయవదానం గురించి అవగాహాన పెంచడం. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు గానూ ప్రభుత్వం చట్టంలో కూడా కొన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా అవయవదానం కోసం వ్యక్తి నిర్ణీత  వయసు 65సంవత్సరాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని తొలగించారు. ఇంకా అవయవదానం గురించి అవగాహన పెంచి, దీన్ని ప్రజలలో వ్యాప్తి చేయడానికి మరిన్ని సవరణలు, సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉంది. దీని కారణంగా ప్రతి సంవత్సరం ఎంతో మందిని మృత్యువు నుండి బయటపడేయవచ్చు. భారతదేశంలో లివర్ ఫెయిల్, లివర్ క్యాన్సర్ కారణంగా ప్రతి ఏడూ 2లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో 10-15శాతం మందికి సకాలంలో కాలేయ మార్పిడి చేయడం ద్వారా రక్షించే అవకాశం  ఉంది.  ప్రతి ఏడూ 25 నుండి 30వేల మందికి కాలేయ మార్పిడి చేయాల్సి ఉండగా  కేవలం 1500 మందికి మాత్రమే మార్పిడి జరుగుతోంది. దీనంతటికీ కారణం అవయదానం కోసం ఎదురుచూసేవారికంటే అవయవదాతలు తక్కువగా ఉండటమే. ఇక గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, కంటిమార్పిడి గురించి చెప్పుకోవడం వృథా.. అందుకే భారతదేశంలో అవయవదానాన్ని ప్రోత్సహించాలి. అవయవదానానికి ముందుకొచ్చినవారిని అవయవదాతా స్పూర్తీభవా.. అని కొనియాడాలి.                                                    *నిశ్శబ్ద.

సమస్యలొచ్చినప్పుడు మీరూ ఇలాగే చేస్తారా?

మనం ఎప్పుడూ సమస్యల నుండి పారిపోవాలని చూస్తాం. ఆ సమస్యల నుండి తప్పించుకోవడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటాం. కొన్నిసార్లు కారణాలు సృష్టించుకుంటాం. ఇలా మన మనస్సు ఏర్పరచుకునే మరొక రక్షణ పద్ధతి అసలెటు వంటి సమస్యా మనకు లేదని అనుకోవడం! ఉదాహరణకు సమస్యతో సతమతమవుతున్న ఒక వ్యక్తిని చూడండి. అతడు చాలా అశాంతిగా, బాధతో ఉంటాడు. అతని కళ్ళల్లో అలజడి కనిపిస్తుంది. కూర్చున్నప్పుడు కూడా స్థిరంగా కూర్చోలేడు. చేతివేళ్ళను మాటిమాటికీ లాగుకుంటాడు. కాళ్ళను ఊపుతుంటాడు. అప్పుడప్పుడు నిట్టూర్పులు విడుస్తుంటాడు. ఇవన్నీ చేస్తున్నా బయటికి అందరితో తనకేమీ సమస్య లేదని అంటాడు. సమస్యను తిరస్కరించడమంటే ఇదే! తనను తానే మోసగించుకుంటున్నానన్న విషయం అతనికర్థం కాదు. అభద్రతా భావాలతోనూ, సందేహాలతోనూ కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇలాంటి పద్ధతి అవలంబిస్తాం. 'సమస్యలు లేవు' అని అనుకుంటే వాటిని ఎప్పుడూ  పరిష్కరించలేమన్న విషయం మరచిపోతాం. మొట్టమొదట సమస్య ఉన్నదన్న విషయాన్ని అంగీకరించాలి. మనం పిరికివాళ్ళం, బలహీనులం అయినందు వల్ల సమస్యలను తిరస్కరించడానికి 'వంద' మార్గాల్లో ప్రయత్నిస్తాం. లోలోపల అభద్రతాభావం ఉన్నా, పైకి అదేమీ లేనట్లుగా ఉంటాం. దాన్ని అంగీకరించం. దానికి బదులుగా అది లేదని బుకాయిస్తాం. అంతేకాదు, మనం చాలా శక్తిమంతులమైనట్లూ, పూర్తి భద్రతతో ఉన్నట్లు నటిస్తాం. సమస్య లేదని అనుకోవడం ఒక 'నిప్పుకోడి' ప్రవర్తించే విధంగా ఉంటుంది. తనను తినడానికి ఏదైనా జంతువు వస్తున్నదని చూడగానే, 'నిప్పుకోడి' తన తలను ఇసుకలో దూరుస్తుంది. అదేవిధంగా మనకు ఎవరిపైనైనా కోపం వస్తే, వారి నుంచి దూరంగా ఉందామని అనుకుంటాం. కానీ లోలోపల వారంటే అసలు ఇష్టమే ఉండదు. ఉడుక్కు పోతుంటాం. మనకు ఎవరిపై కోపం వచ్చిందో, ఆ వ్యక్తిని అసలు లెక్కచేయమని పైకి అన్నా, వ్యక్తపరచని కోపం మనల్ని నియంత్రిస్తుంది. లోపల మండిపోతూ, పైకి మాత్రం ప్రశాంతంగా, మంచివాడిగా ఉండడమన్నది కపటానికి గొప్ప నిదర్శనం. ఈ విధంగా హృదయంలో వంచన ప్రారంభమై, మన నైతిక జీవనాన్ని నాశనం చేస్తుంది. మానసిక తత్త్వశాస్త్రంలో దీనికొక ఉదాహరణ తరచూ చెబుతారు. ఒక త్రాగుబోతు వాని కొడుకు, తన తండ్రి త్రాగుబోతు అని అంగీకరించకపోవచ్చు. తండ్రి మద్యం త్రాగి క్రింద పడిపోతే, అనారోగ్యం వల్ల ఆయన ఆ విధంగా పడిపోయాడని ఇతరులు నమ్మాలని అతని కొడుకు అనుకుంటాడు. అంతే కాదు, తన తండ్రి అనారోగ్యానికి మందులు వేసుకున్నాడని కూడా అనవచ్చు. వాస్తవాన్ని అంగీకరించలేక దానిని పెడదోవ పట్టిస్తాడు. ఇదే విధంగా మన మనస్సు కూడా జీవిత సమస్యల నుండి తప్పించుకోవడానికి రకరకాల పద్ధతులను, మార్గాలను అవలంబిస్తుంది. పైన చెప్పిన దానికి వ్యతిరేకమైనది నిష్కాపట్యం. మనస్సులో ఉన్నదే చెప్పగలగడం, చెప్పిందే చేయగలగడం మనస్సు యొక్క మంచి లక్షణం. దృఢమైన మనస్సే ఇలా చేయగలదు. ఆ విధంగా సమన్వయమైన మనస్సు ఎలాంటి సందిగ్ధాలకూ లోనుగాక ప్రశాంతంగా ఉంటుంది.  కాబట్టి మనిషి ఎప్పుడూ నిష్కపటంగా తన సమస్యలను అంగీకరిస్తూ వాటిని అధిగమించాలి. అంతేకానీ తనకు సమస్య లేదని బయటకు చెబుతూ సమస్య నుండి పారిపోకూడదు.                                     ◆నిశ్శబ్ద.

రన్ రాజా రన్

ఇవ్వాలేమీ రన్నింగ్ డే కాదు. ఏ ఒలింపిక్స్ డే కూడా కాదు!! మరింకేదో అథ్లెటిక్స్ డే కూడా కాదు. మరి ఈ రన్నింగ్ స్లోగన్ ఏమిటో అని అందరికి అనుమానం వస్తుంది. అంతేకాదు విషయం పూర్తిగా చదవకుండా చాలామంది గూగుల్ లోకి జంప్ చేసి ఇవ్వాళ విశేషం ఏముందా అని సెర్చ్ చేస్తారు. అంతా మనిషి కుతూహలం.ఈ ప్రపంచం  చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మన జీవితకాలం అంతా గడిచినా దాన్ని చూడలేం.  ప్రపంచం వరకు ఎందుకు మన దేశాన్నే చూడలేం. అది కూడా వద్దు మన ఊర్లో జరిగే మార్పులనే సరిగ్గా చూడం. ఇది కూడా ఎక్కువే మన ఇంట్లో వస్తున్న మార్పులను కనుక్కోలెం. మార్పు మొత్తం వచ్చేదాకా మనిషి దాన్ని గమనించని స్థాయిలో ఉన్నాడు. కారణం ఏమిటంటే బిజీ.మన చుట్టూ ఉన్న జంతువులకే గనుక  మాటలు వస్తే "ఈ మనుషులున్నారే!! తిండి తినడానికి సమయం లేదంటారు, తాగడానికి అలస్యమైపోతుందని అంటారు, నిద్రపోవడానికి పనులున్నాయని చెబుతారు. స్నేహితులను కలవాలన్నా, బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా, పార్టీలు అన్నా, ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటారు. సంపాదనలో మునిగిపోతుంటారు. మళ్ళీ సంతోషంగా లేమంటారు. ఏమిటో వెధవ జీవులు ఈ మనుషులు" అని అంటాయేమో. మనుషులేం చేసారిప్పుడు!! మనుషులు మనుషులుగా ఉండటం లేదన్నది అందరూ గమనించుకోవలసిన మొదటి విషయం. వేగవంతమైన ప్రపంచంలో పరిగెట్టడమే పరమావధిగా పెట్టుకున్న మనుషులు జీవితాన్ని ఎంతవరకు ఆస్వాదించగలుగుతున్నారన్నది మొదటి ప్రశ్న. లక్ష్యాలు, పోటీల వలయంలో పడి, జీవితాన్ని ఎంతో మెరుగుదిద్దుకుంటున్నామని అనుకునేవాళ్లకు తమ జీవితం ఎంత మెరుగుపడిందో ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. బిజీ అవ్వడమూ, చేతిలో కాగితాల కట్టలు అందుకోవడమే ఎదుగుదల అనుకుంటే పొరపాటు.  మనుషులేం చేయాలిప్పుడు!! కాసింత జీవించడం అలవాటు చేసుకోవాలి. కాసింత మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోవాలి. కాస్త మానసికంగా తృప్తిని సంపాదించడం తెలుసుకోవాలి. తృప్తి అంటే డబ్బు పెట్టి కొంటేనో, డబ్బును కట్టలు కట్టలుగా పెట్టెల్లో దాచుకుంటేనో వచ్చేది కాదు. అది అనిర్వచనీయమైనది, అమూల్యమైనది. ఎటిఎం కార్డ్ తీసుకెళ్లి మిషెన్లో పెట్టి తీయగానే డబ్బు బయటకు వచ్చినట్టు తృప్తి రాదు. దానికి మనసనే ఓ గది ఉంది, దానికి తలుపులు ఉంటాయి. ఆ తలుపులను తెరవాలి. ఏమి కావాలో ఆలోచించుకోవాలిజీవితానికి కొన్ని అవసరాలు ఉంటాయి. మనిషి పుట్టిన, పెరిగిన పరిస్థితులు బట్టి ఆ అవసరాల జాబితా కూడా పెరుగుతుంది. ఇల్లు కొనాలి, కార్ కొనాలి, బైక్ కొనాలి, గోల్డ్ కొనాలి అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ జీవితంలో అవసరమే కానీ అవే జీవితం కాదు. అవి జీవితంలో ఒక భాగం మాత్రమే. వాటి కోసం అనవసరంగా ఒత్తిడిలో కూరుకుపోయి సంపాదిస్తే తరువాత పలితం చాలా బాధాకరంగా ఉంటుంది. చివరకు మిగిలేది?? చిన్న సంతోషాలను కూడా మిస్సవుతూ, ఒత్తిడితో పనిచేస్తూ పోటీ పేరుతో మానసికంగా నలిగిపోతూ ఉండటం వల్ల ప్రస్తుతం సమాజంలో అధిక శాతం కొనితెచ్చుకుంటున్నది అనారోగ్యమే. డిప్రెషన్ దాని వల్ల అతిగా తినేయడం, తద్వారా అధిక రక్తపోటు, ఉబకాయం, మధుమేహం వంటి సమస్యలు. అవన్నీ కూడా చిన్నవయసులో అటాక్ చేస్తుండటం మరొక బాధాకరమైన విషయం. అందుకే అందుబాటులో ఉన్నవరకు చిన్న చిన్న విషయాలను కూడా ఆస్వాదించడం. వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేందుకు, స్నేహితులతో, బంధువులతో కలుస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుతూ, బంధాలకు విలువ ఇస్తూ అదేవిధంగా వృత్తికి న్యాయం చేస్తూ సాగిపోవాలి.  మనసు తలుపులు తెరవండి బాస్అందుకే కేవలం పనిలో కాకుండా జీవితంలో పరిగెత్తాలి. రన్ రాజా రన్ అని ఎవరికి వారు ప్రోత్సాహాన్నిచ్చుకోవాలి, మరొకరికి ప్రోత్సాహాన్నివ్వాలి. కుదరకపోతే కనీసం ఈ ఆర్టికల్ ను షేర్ చేసి పరోక్షంగా ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నం చేయండి. ◆ వెంకటేష్ పువ్వాడ

మనిషికి స్పష్టత ఎలా చేకూరుతుంది?

మనందరిలోను ఒక ప్రవృత్తి వుంది అదేంటంటే…. అన్నిటితోనూ సర్దుకుపోవడం అని. దాన్నే అలవాటుపడిపోవడం అంటారు.  పరిస్థితులను నిందిస్తూ కాలం గడపడం, పరిస్థితులు వేరుగా వున్నట్లయితే, నేనూ మరో విధంగానే రూపొందేవాడిని అనో, నాకో అవకాశం ఇవ్వండి, యేం చేస్తానో చూడండి అనో, అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు అనో, ఇలా ఒకటి అని కాదు బోలెడు రకాల మన ఇబ్బందులను ఇతరులకు, పరిస్థితులకు, మన చుట్టూ ఉండే వాతావరణానికి, ఆర్థిక ఒత్తిడులకు ఇలా ఏదో ఒకదానికి అంటగట్టడానికి ప్రయత్నిస్తాము. ఈ చికాకులకు అలవాటు పడిపోయాడంటే వ్యక్తి మనసు బద్ధకంగా తయారయిపోయిందన్నమాట. మన చుట్టూ వున్న సౌందర్యానికి అలవాటు పడిపోయి దాని అస్తిత్వాన్నే గమనించకుండా వుండిపోతాము గదా! అలవాటు పడిపోకపోతే, దాన్నుంచి పరుగులు తీద్దామనుకుంటాము, ఏ మందో మాకో తీసుకుని, రాజకీయ ముఠాలలో చేరి, అరుస్తూ, వ్రాసుకుంటూ, ఆటలకు వెడుతూ గుడి గోపురానికో దర్శనానికి నడుస్తూ పారిపోదామనుకుంటాం. ఏదో మరో రకం వినోదం కల్పించుకుంటూ వాస్తవ విషయాల నుంచి ఎందుకని పరుగెత్తుకుపోదాం అనుకుంటాం?  మనకు మృత్యువు అంటే భయం. ఇది అందరికీ తెలిసిన విషయమే…. ఎవరూ మృత్యువుని ప్రేమించరు. దీనికోసం ఎన్నో రకాల సిద్ధాంతాలు, ఆశలు, విశ్వాసాలు కనిపెడతారు.  మృత్యువుకు ముసుగు వేయటానికి, అయినా వాస్తవం అలా ఇంకా నిలిచే వుంది. వాస్తవాన్ని అవగాహన చేసుకోవాలంటే మనం దానివంక చూడగలగాలి, దాని నుంచి పారిపోవడం మార్గం కాదు.  మనలో చాలమందికి బ్రతకాలన్నా భయమే, మృత్యువన్నా భయమే. మనకు కుటుంబం అంటే భయం, పదిమంది మాట అంటే భయం, ఉద్యోగం పోతుందేమోనని భయం, మన భద్రత  గురించి భయం, ఇంకా ఇలాంటివే వందలాది విషయాలను గురించి భయం. అసలు వాస్తవం ఏమిటంటే  మనకు భయం, దీన్ని చూసి దాన్ని చూసి కాదు.  వాస్తవాన్ని చూడలేక కలుగుతున్న భయం అది. మనం ఎందుకని ముఖాముఖి ఆ వాస్తవాన్ని చూడలేకపోతున్నాం??  వాస్తవాన్ని సందర్శించడం అనేది వర్తమానంలోనే సాధ్యం. కానీ  ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ దాన్ని ముందుకు రానివ్వడమే లేదు. పలాయన ప్రక్రియకు అనుగుణంగా మనమొక చక్కని వల తయారు చేసుకున్నాం కాబట్టి ఈ అలవాటులోనే చిక్కుబడి పోతున్నాం. మనుషులు అందరూ సునిశితులు, తీవ్రంగా ఆలోచించేవాళ్ళు అయితే, వారి నిబద్ధత వారికి తెలిసి రావడమే కాకుండా, అది తీసుకువచ్చే తదుపరి ప్రమాదాలు కూడా గమనించగలుగుతారు. అది ఎంత క్రౌర్యం, హింస, దుస్సహసస్థితి తీసుకు వస్తుందో తెలుసుకోగలుగుతారు. మీ నిబద్ధతలో వున్న ఈ ప్రమాదాలనన్నిటినీ గమనించినప్పుడు, పని చేయటానికి ఎందుకు పూనుకోరు?  సోమరిపోతులు కాబట్టినా ? సోమరితనం ఎలా కలుగుతుంది??  తగినంత శక్తి - జీవసత్వం లేకపోవడం వల్ల కలుగుతుంది. మీ కళ్లకు ఎదురుగా ఏదో పామో, మంటో, గుంటో వుంటే ఆ స్థూల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అవసరమయ్యే శక్తి మీకు తక్షణమే వాటిని చూసిన వెంటనే సమకూరుతుంది కదా! మరి కొన్ని జీవితకాల విషయాల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు. మాటమాత్రంగానే చూసినందువల్ల  మాటకు, ఆచరణకు వైరుధ్యం వస్తుంది. ఆ వైరుధ్యం శక్తి సంపదనంతా కొల్లగొట్టుకుపోతుంది. నిబద్ధతతో స్పష్టంగా చూసి దానిపల్ల వచ్చే ప్రమాదాలను తక్షణమే గమనించగలిగితే అప్పుడే మీరు కార్యాసక్తులవుతారు. కాబట్టి చూడడమే కార్యాచరణ.  మనలో చాలమందిమి జీవితాన్ని అశ్రద్ధగా తీసుకుంటాము. మనం పెరిగిన వాతావరణానికి అనుగుణంగా స్పందనలు, ప్రతిస్పందనలు చేస్తూ వుంటాము. ఇవన్నీ మరింత కట్టుబాటును, బంధనాన్ని తీసుకువస్తాయి. అలా వచ్చినప్పుడే మనిషికి తనమీద తనకు ఒక స్పష్టత చేకూరుతుంది.                                        ◆నిశ్శబ్ద.  

అసలీ హెపటైటిస్ జబ్బు ఏంటి... దీన్ని అంత ప్రమాదంగా పరిగణిస్తారెందుకు?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని జరుపుకోవడానికి కారణం ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, తద్వారా హెపటైటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చు. హెపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది రక్తంలో టాక్సిన్లను శుభ్రపరచడంతో పాటు ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో సహాయపడుతుంది. అయినప్పటికీ, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా కాలేయం వాపును కలిగిస్తుంది. దీని వల్ల కాలేయం ప్రభావితమవుతుంది. ఇది తీవ్రమైన  ప్రాణాంతక వ్యాధి, దీని చికిత్స సాధారణ రోగులకు  చాలా ఖరీదైనది. ఇలాంటి జబ్బు గురించి తెలుసుకుని, నివారణ చర్యలు పాటిస్తే ఈ జబ్బుకు దూరంగా ఉండొచ్చు. హెపటైటిస్ అంటే.. హెపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి, ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో కాలేయంలో వాపు ఉంటుంది. హెపటైటిస్ ఒక అంటువ్యాధిగా మారుతోంది. దీని కారణంగా ప్రతి సంవత్సరం మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇందులో కూడా రకాలు ఉన్నాయి.  ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా హెపటైటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చు. హెపటైటిస్ రకాలు.. హెపటైటిస్ వైరస్ ప్రకారం ఐదు రకాలు ఉన్నాయి. ఇందులో హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ . మొత్తం ఐదు రకాల హెపటైటిస్ ప్రమాదకరమైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం 1.4 మిలియన్ల మంది హెపటైటిస్ ఎతో బాధపడుతున్నారు. హెపటైటిస్  తీవ్రత ఆధారంగా గుర్తించబడుతుంది. తీవ్రమైన హెపటైటిస్‌లో , కాలేయం ఉన్నట్టుండి వాపుకు గురవుతుంది. దీని లక్షణాలు 6 నెలల వరకు ఉంటాయి. చికిత్స చేసినప్పుడు, వ్యాధి నెమ్మదిగా మెరుగవుతుంది. తీవ్రమైన హెపటైటిస్ సాధారణంగా HAV ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. రెండవదీర్ఘకాలిక హెపటైటిస్ ఉంది , దీనిలో HIV సంక్రమణ రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాలేయ క్యాన్సర్,  కాలేయ వ్యాధి కారణంగా ఎక్కువ మంది మరణిస్తున్నారు.   హెపటైటిస్ కారణాలు వైరస్ ఇన్ఫెక్షన్  అనేక కారణాల వల్ల వస్తుంది. కలుషిత ఆహారం, కలుషిత నీరు తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఎ వస్తుంది. హెపటైటిస్ బి సోకిన రక్తాన్ని మార్పిడి చేయడం,  వీర్యం  లేదా ఇతర ద్రవాలకు గురికావడం వల్ల కూడా సంభవించవచ్చు. హెపటైటిస్ సి రక్తం  సోకిన ఇంజెక్షన్ల వాడకం ద్వారా వ్యాపిస్తుంది హెపటైటిస్ డి హెచ్‌డివి వైరస్ వల్ల సంభవించవచ్చు. ఇప్పటికే HBV వైరస్ సోకిన వారు కూడా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అయితే, ఒకే రోగిలో HDV మరియు HBV వైరస్‌లు రెండూ ఉన్నప్పుడు పరిస్థితి తీవ్రంగా మారుతుంది. హెపటైటిస్ E అనేది HEV వైరస్ వల్ల వస్తుంది. చాలా దేశాల్లో ఈ హెపటైటిస్ వైరస్ విషపూరితమైన నీరు,  ఆహారం కారణంగా వ్యాపిస్తుంది. ఇది కాకుండా, ఎక్కువ మందులు తీసుకోవడం కూడా కాలేయ కణాలలో వాపును కలిగిస్తుంది, హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ నేరుగా మన కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది.  దాని ప్రసరణ శరీరంలోని ఇతర భాగాలలో కూడా ప్రారంభమవుతుంది ఇది ప్రమాదంగా మారుతుంది. హెపటైటిస్ యొక్క లక్షణాలు.. ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది, చర్మం పసుపు రంగులోకి మారుతుంది, కళ్ళు  తెల్లటి పసుపు రంగులోకి మారతాయి. ఆకలి లేకపోవడం, వాంతులు,  వికారం. కడుపు నొప్పి,  ఉబ్బరం. తలనొప్పి,  మైకము. మూత్రం రంగు మార్పు, ఆకస్మికంగా  బరువు తగ్గడం. కామెర్లు లేదా జ్వరం చాలా వారాల పాటు కొనసాగడం మొదలైనవి లక్షణాలు. వీటిలో ఏ కొన్ని లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.  *నిశ్శబ్ద.

మూఢనమ్మకాలు ముంచేస్తాయ్!

నమ్మకాలు మనిషిని బలంగా ఉంచేవి, అభివృద్ధికి దోహదం చేసేవి అయి ఉండాలి. అంతేకానీ మనిషిని పిచ్చోళ్ళలా మార్చేవి కాకూడదు. కొన్ని నమ్మకాల వెనక శాస్త్రీయ కారణాలు ఉంటాయి. వాటిని కొట్టి పడేయలేం. కానీ మరికొన్ని కారణాలు ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేకుండా కేవలం ఆచరించాలని చెబుతారు. అంతేనా వాటివల్ల మనుషులకు ఆర్థిక నష్టమే కాకుండా సమయానికి కూడా నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు జీవితంలో ఎంతో ముఖ్యమైన అవకాశాలు కోల్పోవచ్చు, మరికొన్నిసార్లు ఎంతో గొప్పవైన మానవ సంభంధాలకు నష్టం కలగచ్చు. మొత్తానికి మనుషులను మనుషుల అభివృద్ధిని సమాజాన్ని వెర్రివాళ్లను చేసే మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి.  బయటకు వెళ్తున్నప్పుడో లేక ముఖ్యమైన పనిమీద వెళ్తున్నప్పుడో పిల్లి ఎదురయ్యిందనో లేదా భర్త చనిపోయిన ఆడవాళ్లు ఎదురయ్యారనో, చనిపోయిన శవాన్ని ఎవరో తీసుకెళ్తున్నారనో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.  చాలామంది వీటిని అరిష్టం అని అపశకునం అని అనుకుంటారు. ముఖ్యమైన పనుల కోసమో, చాలా అవసరమైన వాటికోసమో ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఎదురవ్వగానే 90% ఖచ్చితంగా తిరిగి ఇంటికి వెళ్లడం, లేదా అలా ఎదురైన తరువాత సాదారణంగానే ఎక్కడో ఒకచోట కూర్చోవడం వంటివి చేస్తుంటారు. దానివల్ల వాళ్లకు ఆలస్యం అవడం, ముందున్నంత మానసిక దృఢత్వం తరువాత కోల్పోవడం జరుగుతుంది. ఒక్కసారి బాగా గమనిస్తే తుమ్ము వచ్చిందనో, పిల్లి ఎదురొచ్చిందనో చేసే ఆలస్యాలు, అపశకునం కాబట్టి ఏదో సమస్య ఎదురవుతుందని దానిగురించి చేసే ఆలోచనలు చెయ్యాల్సిన పనులను సరిగ్గా చేయనివవ్వు, సరిగ్గా జరగనివ్వవు. మనం చేసే ఆలస్యానికి సమయానికి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ లేదా బస్ ఎక్కడికీ వెళ్లకుండా మనకోసం స్టాప్ లోనే ఉంటాయా ఏంటి??  ముఖ్యమైన పనులు చెయ్యాల్సినప్పుడు మానసికంగా దెబ్బతింటే అప్పుడు చేసేపనిని సరైన ద్యాసతో చేయలేము. మనమే పనిమీద సరైన దృష్టిపెట్టకుండా ఎదురైన పిల్లుల మీద, చనిపోయిన మనుషుల మీద కారణాలు తోసేయడం ఎంతవరకు సరైనది. కాలం మారిపోయింది మూఢనమ్మకాలు ఇప్పుడెక్కడున్నాయిలే అని అందరూ అనుకుంటారు కానీ అభివృద్ధి చెందుతున్న, ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  అప్పుడెప్పుడో బాగా చదువుకుని లెక్చరర్ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు కూతురిని చంపేయడం మూఢనమ్మకం అయితే తాజాగా ఒక దినపత్రికలో అష్టమి నాడు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త భార్యను హింసించడం అనే సంఘటన గురించి తెలిసినప్పుడు  ఈ సమాజంలో నమ్మకాలు ప్రజలను ఎంతగా వెర్రివాళ్లను చేస్తున్నాయో అర్థమవుతుంది. నమ్మకాలు ఏవైనా మనిషి మానసిక స్థితిని దెబ్బకొట్టేవే. ఆ విషయం అర్ధం చేసుకున్నప్పుడు ఏదో ఎదురొచ్చిందని, మరింకేదో అడ్డొచ్చిందని ఆగిపోరు. ఎదురయ్యే జంతువుల్ని, మనుషుల్ని, సంఘటనలను చూసుకుంటూ తమ పనులను నిర్లక్ష్యం చేయరు. ప్రతిదాంట్లో మంచిని చూస్తూ ప్రతి సమస్యకు తమ నమ్మకమే బలం అని తెలుసుకున్నవాళ్ళు తాము మొదలుపెట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకుని కార్యశూరులు అవుతారు. అంతేకానీ మూఢనమ్మకాల మధ్య జీవితాన్ని ముంచేసుకోరు.                                 ◆ వెంకటేష్ పువ్వాడ.

లక్ష్మీ రావే మా ఇంటికి!

లక్ష్మీ అంటే మహావిష్ణువు భార్య, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపదలుంటాయి. ఆమె వెళ్లే ప్రతి చోట డబ్బు తిరగడుతూ ఉంటుంది. అందుకే పెద్దలు ఆంటారు డబ్బును, లకహ్మి దేవిని వేరు వేరుగా కాకుండా ఒక్కటిగా చూస్తారు. డబ్బు అంటే లక్ష్మీదేవినే అని అంటారు. డబ్బు దగ్గరుంటే ఈ కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కమర్షియల్ జీవితాల ప్రపంచంలో డబ్బు లేకుండా బతకడం కష్టమే కదా!! కాదని కొందరు వాదించవచ్చు. కానీ ఇలా బతకడం అలవాటు పడిపోయిన మనిషికి డబ్బు లేకపోతే ఏమీ తోచదు. అందరికీ మనసులో ఉంటుంది బోలెడు డబ్బు దగ్గరుండాలని. ఆ డబ్బుతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలని, ఎన్నో నచ్చినవి, అవసరమైనవి తీసుకోవాలని. కొన్ని కలలను తీర్చుకోవాలని. కానీ డబ్బులు ఏమీ చెట్లకు కాయవు కదా!! మరి డబ్బు మనదగ్గరకు ఎలా వస్తుంది?? కష్టపడినా తగినంత డబ్బు చేతికి రావడం లేదని, కష్టానికి తెగగా ఫలితం లేదని చెప్పేవాళ్ళ కోసం కొన్ని డబ్బులు చేతిలో ఒడిసిపట్టే చిట్కాలు!! అనవసరపు ఆడంబరాలు వద్దు!! కొన్ని విషయాల్లో పిసినారితనంగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది. కొన్నిసార్లు లేనిపోని మోహమాటాలతో కొన్ని ఆడంబరాలు చేయాల్సి రావచ్చు. అలాంటి సందర్భాలను సున్నితంగా ఏదో ఒక పని చెప్పి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎవరూ రూపాయి కూడా చెయ్యి చాచి ఇచ్చేవాళ్ళు లేరండి. సగటు మధ్య మరియు దిగువ తరగతి మనిషికి ఆడంబరాలు నెత్తిమీద కొండంత బరువులా ఉంటాయి.  సింప్లిసిటీ!! నిజం చెప్పాలంటే ఈ సింప్లిసిటీ మనిషిని కమర్షియల్ గా ఎదిగేలా చేస్తుంది. ప్రతిదాంట్లో అతిగా ఉండకపోవడం ఎన్నో ఖర్చులను అవుతుంది. కట్టు బొట్టు నుండి, తిండి విషయం వరకు. వాడే వస్తువుల నుండి ఎక్పెక్ట్ చేయడం వరకు అన్నింటిలోనూ సింప్లిసిటీ ఉన్నవాళ్లు ఖర్చుపెట్టడంలో కూడా అనవసరమైన వాటికి సున్నితంగా దూరం వెళ్ళిపోతారు. పొదుపు సూత్రాలు!! నిజానికి పొదుపు అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలసి చేసే ప్లాన్. అయితే ఒక రిలేషన్ లోకి వెళ్లే ముందు నుంచే పొదుపు ప్లాన్ చేయడం వల్ల రిలేషన్ తరువాత చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతకాలంలో పని చేయకుండా ఇంటిదగ్గరే ఉండే ఆడవాళ్లు చాలా తక్కువ. కాబట్టి పొదుపు చేయడం కూడా సులభమే. నిజానికి మగవాళ్ల కంటే ఆడవాళ్లే పొదుపు విషయంలో ముందుంటారు. అయితే ఆడవాళ్లు చేసే ఖర్చుల గురించి మాత్రం మాట్లాడకూడదు సుమా!! ఇన్వెస్ట్మెంట్!! చాలామంది బంగారం కొనడం, భూములు కొనడం ద్వారా తమ డబ్బును పెంచుకుంటారు. బంగారం, భూములు ఈ వేగవంతమైన కాలంలో అవి కూడా వేగంగా తమ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. బంగారం కేవలం పెట్టుకోవడానికి మాత్రమే కాదు ఆర్థిక స్థాయిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక భూములు కూడా క్రమంగా ధర పెరిగేవే. అపార్టుమెంట్లు తప్ప గతిలేని ఈ కాలంలో భూములు బంగారం పండించకపోయినా డబ్బులను పుష్కలంగా సమకూరుస్తాయి. వ్యాపారాలు!! ప్రజలు ఎక్కువగా ఆధారపడే ఏ విధమైన వ్యాపారం అయినా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సంపాదించడానికే తమ సమయాన్ని వినియోగిస్తూ కనీసం వండుకోలేని మనుషులున్న కాలంలో చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో మంచి రాబడి పొందుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఆడవాళ్లు అయితే తమకు రుచికరంగా వండటం వస్తే ఏదైనా బిజినెస్ గా మార్చేయచ్చు. రుచి దొరకక జనాలు చచ్చిపోతున్నారండి బాబు.  పైన చెప్పుకున్నట్టు కొన్ని పాటిస్తే లక్ష్మీ రావే మా ఇంటికి అని మరీ బతిమలాల్సిన అవసరం లేదు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

ఒత్తిడులను అధిగమించకపోతే జరిగే నష్టమిదే...

సమస్య ఎదురవగానే మనస్సు దానిని అసలు గుర్తించదు. అది ఒక గదిలో జంబుఖానా క్రింద దుమ్మును దులపడం లాంటిది. నేలపై బాహ్యంగా ఏమీ కనిపించకపోయినా, జంబుఖానా క్రింద చాలా దుమ్ము ఉంటుంది. కానీ దుమ్మును ఆ విధంగా కప్పి ఉంచడం వల్ల గది అంతా ఎంతో పరిశుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే విధంగా, సమస్య ఉత్పన్నమైనప్పుడు, శిక్షణ లేని మనస్సు ఆ సమస్యను తనకు తెలియకుండానే చైతన్యయుతమైన మనస్సు నుండి బయటకు త్రోయాలని అనుకుంటుంది. అప్పుడా సమస్య జంబుఖానా క్రింది దుమ్ము లాగా అచేతనమైన మనస్సు పొరలలోకి వెళ్ళి, అక్కడ స్థిరపడుతుంది. ఆ సమస్య తీరిపోదు కానీ, జరిగేది ఏమంటే అది మన కళ్ళ ముందు ఉండదు, కనిపించదు. ఏ సమస్య అయినా సరే పై స్థాయిలో కనిపిస్తూ ఉంటేనే మనం దాన్ని పట్టించుకోగలుగుతాం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. మనస్సు సమస్యలను ఎదుర్కోలేదు. ఎందుకు ఎదుర్కోలేదు అంటే.. సమస్యలను ఎదుర్కోవడం అంటే బాధాకరం కాబట్టి, సమస్యలు అంటేనే శారీరకంగానో.. మానసికంగానో.. భౌతికంగానో.. ఇబ్బంది పడటం. ఆ ఇబ్బందిని ఓర్చుకోవడం.. చాలామందికి అలా ఓర్చుకోవడంలో కష్టం, బాధ ఎదురవుతాయి. కాబట్టి సమస్యను ఎదుర్కోవడం మనిషికీ.. మనసుకు కూడా అసలు ఇష్టముండదు. కానీ సమస్య అలాగే ఉంటే ఏమి జరుగుతుంది?? అది అట్లాగే ఒక దొంతర కింద దాగిపోయి ఎప్పుడో ఆ దొంతర తొలగ్గానే దుమ్ము మురిగ్గా.. పరిసరాలను అపరిశుభ్రం చేసి, శ్వాసకు ఇబ్బంది కలిగించినట్టు సమస్య కూడా మనిషిని ఇబ్బంది పెడుతుంది.   కానీ మనసు ఏమి చేస్తుంది??  సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవిక పరిస్థితులను ఆ విధంగా అణచి వేయడం వల్ల సమస్యల పట్ల మనకున్న భయాలు, అపోహలు మనస్సులోని అచేతనమైన పొరకు త్రోసివేయబడతాయి. అప్పుడు ఈ అచేతనపు పొరలలో ఉన్న అచేతన ప్రేరణలు, శక్తులు మనస్సును నియంత్రించడం ప్రారంభిస్తాయి. అప్పుడది సమస్య పరిష్కారాలను అన్ని రకాల పద్ధతుల ద్వారా వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ రోజు ఎన్నడూ రాదు. సుదీర్ఘకాలం అట్లాగే దాన్ని పరిష్కరించకుండా ఉంచితే చిన్న సమస్యలు కూడా క్లిష్ట సమస్యలుగా మారతాయనే విషయం మనస్సు మరచిపోతుంది. సమస్యలను పరిష్కరించడం ద్వారానే వాటిని అధిగమించగలం. ఒక సామెతలో చెప్పినట్లు, "సరియైన సమయంలో ఒక కుట్టు వేస్తే, తొమ్మిది కుట్లు వేయాల్సిన అవసరం రాకుండా నివారించవచ్చు" ఒక చిన్న నిప్పురవ్వను ఆర్పకపోతే పెద్ద మంట అవుతుంది. నిప్పురవ్వగా ఉన్నప్పుడు దాన్ని ఆర్పడం తేలిక. కానీ సరైన సమయంలో ఆ పని చేయకపోతే, అది ప్రజ్వరిల్లుతుంది. దీని ఫలితంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్య నుండి పారిపోవడం, అసలు చూడకుండా ఉండడం, లేదంటే వాయిదా వేయడం అనే స్వభావాన్ని మానేయాలి. ఏదో ఒక భయంతో బయటకు చెప్పలేనిదాన్ని మనం తరచూ పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేస్తుంటాం. ఉదాహరణకు నలుగురితో చెడుగా ప్రవర్తించడం మర్యాద కాదు కాబట్టి మన కోపాన్ని వ్యక్తపరచం. కానీ అది ఎంతకాలం కొనసాగుతుంది? ఏదో ఒక రోజున అంతా బట్టబయలవుతుంది. ఇతరులపై కోపం చూపలేకపోతే అది మన ఆరోగ్యాన్నే దెబ్బ తీస్తుంది. అది కడుపులో పుండునో, అధిక రక్తపోటునో, లేదంటే గుండె ఆగిపోవడాన్నో, గుండె పోటునో కలగజేస్తుంది. అందుచేత మన లోపల ఉన్న ఈ ఒత్తిళ్ళను అధిగమించడం నేర్చుకోవాలి. అది కూడా ఇతరులను నొప్పించకుండా.. మన అసంతృప్తులు ఇతరుల మీదకు వెళ్లకుండా మన ఒత్తిడులను అధిగమించాలి.                                        ◆నిశ్శబ్ద.

పాలసీలు బహుపరాక్!! 

ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాలసీ అనేది కామన్ అయిపోయింది. ఏ రోజు సంపాదన ఆరోజు సరిపోయి ఏదో జీవితం అట్లా సాగుతున్నవాళ్ళు తప్ప పేదల నుండి, మధ్యతరగతి, ధనవంతుల వరకు ఈ పాలసీలలో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారి మీదనే ఈ పాలసీ సంస్థలు కూడా నడుస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ధనవంతులకు ఈ పాలసీలు ఉన్నా లేకపోయినా ఏమి సమస్య లేదు. పెద్దలు వెనుకేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, వ్యాపార లాభాలు వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల వారికి పాలసీల గురించి పెద్ద ఆసక్తి కూడా తక్కువే.  అయితే వ్యక్తి నుండి వాహనాలకు, వస్తువులకు, ఇళ్లకు, సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది మొదలయ్యాక ఈ ధనవంతులు కూడా వీటితో బాగానే ప్రయోజనాలు పొందుతున్నారు. ఇకపోతే చాలా చోట్ల చాలా కుటుంబాలలో కనిపించే అతి సాధారణ సమస్య ఒకటుంది. శ్రీరామ్ చిట్స్ ఎల్.ఐ.సి హెచ్.డి.ఎఫ్.సి ఇంకా ఇంకా వివిధరకాల బోలెడు సంస్థలు ఎన్నో ఇన్సూరెన్స్ లు అందిస్తున్నాయి. వీటిలో పాలసీలు తీసుకుని వాటిని కడుతున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య పాలసీ చెల్లింపు గడువు రాగానే పైసల కోసం వెతుక్కోవడం. నిజానికి ఈ పాలసీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో డబ్బు సమకూర్చుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిక్కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సగటు మధ్యతరగతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి మూడువేల రూపాయల పాలసీ కట్టడానికి నిర్ణయించుకుంటే అతడి నెలవారీ సంపాదనలో ఐదువందల రూపాయలను పక్కన పెడుతుండాలి. ఆ ఆరు నెలల మొత్తం పాలసీ చెల్లింపును ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ విషయం గూర్చి ఎక్కువ ఆలోచించరు. తీరా చెల్లింపు గడువు ముందుకొచ్చినప్పుడు అప్పు చేసో లేక వేరే చెల్లింపుల నుండి దీనికి డబ్బు మరల్చడమో చేస్తుంటారు. ఫలితంగానే ఒకవైపు ఇన్సూరెన్స్ లు కడుతూ మరోవైపు అప్పులు చేస్తూ ఉంటారు. ఇదీ సగటు మధ్యతరగతి పాలసీదారుని పితలాటకం. హెల్త్ ఇన్సూరెన్స్ లు వచ్చినప్పటి నుండి ఓ ఆలోచన పురుగులా మెదడును తొలిచేది. చావుకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు చస్తే ఆ ఇన్సూరెన్స్ తాలూకూ డబ్బులు బోల్డు వస్తాయని కదా ఇవన్నీ అని. కానీ నిజానికి  పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడూ ఇంతే కదా కుటుంబచట్రంలో ఇరుక్కుపోయిన జీవులు కదా అనిపిస్తుంది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలు చేసే మధ్యతరగతి జీవుల వల్ల హాయిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.  సంవత్సరంలో ఈ పాలసీలు కట్టాలనే కోణంలో తమ సంతోషాలు కూడా వధులుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. మనిషికోక పాలసీ, కానీ సంపాదన ఒకే ఒకరిది. ఇబ్బందులున్నా కట్టడానికే ముందుకు వెళ్తారు. కారణం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే.  పాలసీలతో జాగ్రత్త!! కొందరుంటారు. ఈ పాలసీ సంస్థలలో పనిచేసే ఎంజెంట్లు. వీళ్ళు పాలసీలు తీయించడం, డబ్బులు వసూలు చేయడం పనిగా చేస్తుంటారు. అదే వారి ఉద్యోగం కూడా. అయితే పాలసీ తీయించేటప్పుడు 90% మంది ఆ పాలసీ వల్ల లాభాలు మాత్రమే చెబుతారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు ఎవరూ ఏమీ చెప్పరు. చివరకు దానివల్ల ఏదో ఒక నష్టం ఎదురయ్యే దాకా దాని గురించి పాలసీదారుడికి తెలియదు కూడ. ఇలాంటి సంఘటనలు బోలెడు జరుగుతూ ఉంటాయి. సగటు మధ్యతరగతి ఒక సంస్థమీద ఎంతకని పోరాడతాడు. కాబట్టి ఒకటికి బట్టి నాలుగైదు సార్లు తిరుగుతాడు, ఆ తరువాత మోసం చేసిన వాడి నాశనం వాడిదే  అనుకుని కొన్నిరోజులు బాధపడి తిరిగి జీవితమనే పోరాటంలో పడిపోతాడు. కానీ నిజానికి ఆ సంస్థవాడు హాయిగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు అందులో ప్లస్ పాయింట్స్ మాత్రమే కాదు మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మొదట అందరూ తెలుసుకోవాలి. పైన చెప్పుకున్న విషయమంతా చదివాక పాలసీ అంటే భరోసా ఇవ్వాలి కానీ అది చిరాకు పెట్టించేదిగా ఉండకూడదని అందరికీ ఆర్గమయ్యే ఉంటుందనుకుంటా!! ◆ వెంకటేష్ పువ్వాడ  

సంతోషంగా ఉండాలంటే యువత తెలుసుకోవలసిన విషయమిదే!

ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలనే కోరుకుంటారు. అయితే సంతోషంగా ఉన్నామనే దానికి కొలమానం ఏమిటి? యువత సంతోషంగా ఉండాలంటే కావల్సింది ఏమిటి? అని  ఒక సర్వే నిర్వహించారు. సంతోషంగా ఉండడానికి కావాల్సినవి 'కీర్తి, సంపదలు, అందం, ఆరోగ్యం' అని చాలా మంది ఆ సర్వేలో వెల్లడించారు. ఒకరు భోగ భాగ్యాలతో జీవిస్తున్నప్పటికీ అతనికి ఉన్న ఐశ్వర్యం సంతృప్తిని ఇవ్వకపోతే సంతోషం లేనట్లే కదా? మరొక వ్యక్తి తనకున్న సంపదతో సంతృప్తిగా జీవించగలిగితే అతడు సంతోషంగా ఉన్నట్లే! సంతోషానికి అర్థం సంతృప్తిగా జీవించడం. సంతోషం, సంతృప్తి మనస్సుకు సంబంధించినవి. సాధారణంగా మనం కోరుకున్నది మనకు లభించినప్పుడు సంతోషం కలుగుతుంది. అలాంటి ఆనందం మరొక కోరికకు దారితీస్తుంది. ఆ సంతోషం స్వల్పకాలం మాత్రమే. మనలో కోరికలు ఉన్నంత వరకూ నిజమైన ఆనందం పొందలేమనడానికి  భాగవతంలోని ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది.  “ఒక రోజు కొంతమంది బెస్తలు చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద రివ్వున క్రిందికి వచ్చి ఒక చేపను తన్నుకుపోయింది. గ్రద్ద నోటిలో చేప కనపడేసరికి, కాకులు గుంపులు గుంపులుగా దాని వెంటపడ్డాయి. ఆ గందరగోళంలో గ్రద్ద నోటిలో నుంచి చేప జారి క్రింద పడిపోయింది. తక్షణమే కాకులన్నీ గ్రద్దను వెంబడించడం మానేశాయి. అప్పుడు ఆ గ్రద్ద ఓ చెట్టుకొమ్మ మీద వాలి ప్రశాంతంగా కూర్చుని 'ఛీ! నికృష్టమైన ఆ చేప ఈ అనర్థాలన్నిటికీ మూలం! దాన్ని వదిలేసరికి నాకు మనశ్శాంతి లభించింది" అని అనుకుంది. మనలో ప్రాపంచిక కోరికలు ఉన్నంత వరకూ అశాంతి మనల్ని వెంటాడుతూనే ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్వామి వివేకానంద తమ జ్ఞానయోగం పుస్తకంలో ఇలా వ్రాస్తారు: "మరణం అనేది ఉన్నంత వరకు సంతోషం కోసం పరుగులు, ప్రయాస జలగల్లాగ పట్టుకొని వేలాడతాయి. ఇవన్నీ కొంత కాలానికి అనిత్యాలుగా తోస్తాయి. జీవితమంతా ఎంతో బుద్ధిపాటవంతో, తదేక దీక్షతో, పరిశ్రమించి నిర్మించుకొన్న ఆశాసౌధాలు ఒక్క నిమిషంలో కుప్పకూలిపోతాయి.” సంతోషం బయటదొరికేది కాదు అని అర్థం అవుతుంది. కోరికల నుండి దూరమైనప్పుడే మనస్సు ప్రశాంతతను సంతరించుకొంటుంది. Happiness comes from being and not having సంతోషం అనేది మనలో ఉన్నదే కానీ బాహ్య వస్తువుల నుంచి వచ్చేదికాదు. కోరికలు లేకుండా ఉండడం అసాధ్యం కాబట్టి, జీవించడానికి అవసరమైనవాటిని, ఆత్మనిగ్రహానికి ఆటంకం లేనివాటిని మాత్రమే కోరుకోవాలి. ప్రకృతి ద్వారా వచ్చే ప్రతిబంధకాల నుండి అనాసక్తులమై ఉండగలగాలి. మనలో  ఉన్న సంతోషాన్ని, బాహ్యవస్తువుల ద్వారా వచ్చే సంతోషంతో అనుసంధానం చేయాలి. దానికై ధ్యానం క్రమం తప్పక చేయాలి. ఒక సాధువుగారు తన శిష్యుడితో సాయంకాలం ఊరి పొలిమేరలకు వెళ్ళారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. ఎదురుగా పొలంలో వాడిపోయిన మొక్కలు కనిపించాయి. శిష్యుడు వెంటనే ఆ విధంగా ఉండడం చూసి గురువుగారిని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సాధువు “నాయనా! ఈ చెట్ల వేర్లు భూమిలో నీటి మట్టం వరకు పోయాయి. కనుక ఈ చెట్లు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ చిన్న మొక్కల వేర్లు పైపైనే ఉన్నాయి. అవి నీటి మట్టాన్ని తాకలేవు కాబట్టి వాడిపోయాయి" అని సమాధానం ఇచ్చాడు. ఎవరైతే తమ మనస్సును అంతరాత్మతో అనుసంధానం చేస్తారో వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. ఎవరి మనస్సు అయితే నిత్యసత్యమైన ఆత్మను మరచి అనిత్యాలైన బాహ్యవస్తువుల వెంట పరుగులు తీస్తుందో అలాంటివారు. ఎన్నటికీ ఆనందంగా జీవించలేరు. కాబట్టి మనస్సును బాహ్య విషయాలపైకి పోనివ్వకుండా మనలో ఉన్న దివ్యత్వంతో అనుసంధానం చేసుకొని సంతోషంగా జీవించడానికి ప్రయత్నిద్దాం.                                        *నిశ్శబ్ద.

మనిషి అభివృద్ధికి అసలైన ఆటంకం ఇదే...

మనషి తన జీవితంలో గెలవలేకపోతున్నాడు అంటే దానికి కారణం అతను గెలుపు కోసం ప్రయత్నం చేయడం లేదని కాదు. అంతకు మించి ఆ మనిషిలో భయం ఉందని అర్థం. భయం మనిషిని ఓటమి అంచుల్లోకి తీసుకెళ్తుంది. ఎంత ప్రతిభావంతుడినైనా పరాజయుడిని చేస్తుంది. ఇంతకూ భయం మనిషికి శత్రువుగా ఎలా మారుతుంది?? అసలు భయం అంటే ఏంటి?? దాన్ని ఎలా జయించాలి?? ఈ విషయాలు నేటి తరం వారు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. మన సామర్థ్యం మీద మనకు నమ్మకం తగ్గిపోయి, గెలుపుకు వ్యతిరేకంగా ఉండే విషయాల ప్రభావానికి లోనైనప్పుడు మనిషిలో కలిగే ఒత్తిడిని, మార్పును, ప్రవర్తనను భయం అంటారు. మన పరాజయాలన్నింటికీ మూలకారణం భయమే!  భయం కలగడానికి ముఖ్య కారణాలు :  ఆత్మవిశ్వాసం లేకపోవడం :  మనం మన మీద విశ్వాసం కోల్పోయినప్పుడు ప్రతికూలభావాలు మనల్ని ఆవరిస్తాయి. "భయమే మరణం, భయమే పాపం, భయమే నరకం, భయమే దుఃఖానికి మూలకారణం. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రతికూల భావాలూ ఉత్పన్నమయ్యేవి భయం అనే దుష్టశక్తి నుంచే" అని అంటారు స్వామి వివేకానంద. పరులపై ఆధారపడడం :  మన స్వశక్తిపై ఆధారపడకుండా ప్రతిదానికీ ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మనల్ని నిస్సహాయులుగా, భయస్థులుగా మారుస్తుంది. ప్రతి విషయంలో ఇతరుల సహాయం అర్థించేవాడు స్వశక్తితో ఎన్నటికీ ఎదగలేడు. ఆధారపడటం అంటే మనిషిలో పిరికితనం పేర్చుకుంటూ పోవడమే. "Why are people so afraid? The answer is that they have made themselves helpless and dependent on others".- అంటారు స్వామి వివేకానంద. కాబట్టి నిస్సహాయత మనిషి భయానికి మూలం.  పని మీద నిబద్ధత, నమ్మకం కోల్పోవడం :  మనం చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ ఇతరులు చులకనగా చూస్తారనే భావన మనలో రానివ్వకూడదు. దానివల్ల మనం పని మీద నిబద్ధతనూ, నమ్మకాన్నీ కోల్పోతాం. అలాంటి ఊహాజనిత భయాలను వీడితేనే ప్రగతి సాధ్యం. పేపర్లు వేసి డబ్బు సంపాదించడం, టీ అమ్ముతూ డబ్బు సంపాదించడం, చిరిగిపోయిన దుస్తులను కుట్టుకుని వాటిని ధరించడం, ఇలాంటి వాటికి మనిషి చిన్నతనంగా ఎవరో ఏదో అనుకుంటారేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. విమర్శల గురించి అతిగా ఆలోచించడం:  ఇతరుల విమర్శలకూ, అభిప్రాయాలకూ భయపడితే ఏ కార్యంలోనూ విజయాన్ని సాధించలేం. కాబట్టి వాటి గురించి అతిగా ఆలోచించి భయపడకూడదు. We cannot succeed in anything, if we act in fear of other people's opinions.- భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు ఇలా చెబుతారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయపడితే మనం విజయం సాధించలేము. భయాన్ని పోవాలంటే అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి... భయం మానసిక బలహీనత వల్ల కలుగుతుంది. 'A sound mind in a sound body' అనే నానుడి మనందరికీ తెలిసిందే! దృఢమైన మనస్సు ఉండాలంటే దృఢమైన శరీరం అవసరం. అందుకు ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరానికి అయినా ఎది మనసును కూడా దృఢంగా మారుస్తుంది. వ్యాయామం తో పాటు ధ్యానం మంచిది. ప్రతిరోజూ మనిషి తనగురించి, తను చేసిన పనుల గురించి ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది. క్రమశిక్షణతో కూడిన నీతిబద్ధమైన జీవితాన్ని గడపడం అలవరచుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. అదే క్రమశిక్షణ లేకోతే మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. ఇతరుల విమర్శలను మనలోని బలహీనతల్ని తొలగించు కోవడానికి ఉపయోగించుకోవాలి. అంతేకానీ ఎవరైనా ఎదైనా అంటే వారిని కోపం చేసుకుని, నోరు పారేసుకోకూడదు. నెమ్మదితనం విజ్ఞుల లక్షణం. పోలిక మనిషిని దారుణంగా దెబ్బతీస్తుంది. అందుకే ఇతరుల శక్తి సామర్థ్యాలతో పోల్చుకొని బాధపడకుండా నిరంతర తపన, నిర్విరామ కృషితో దేనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ప్రతి మనిషిలో లోటుపాట్లు అనేవి ఉంటాయి. మొదట్లోనే ఎవరూ సంపూర్మణులు కాదు. మనలోని లోటుపాట్లను అధిగమించడానికి అనుభవజ్ఞులైన పెద్దల నుంచీ, సన్నిహితుల నుంచీ సలహాలను స్వీకరించాలి.                                        *నిశ్శబ్ద.

వావ్ ఎమోజీస్... స్క్రీన్ మీద చిలిపి ముసుగులు...

వాట్సాప్, ఫేస్ బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. ఓయబ్బో సోషల్ మీడియాకు  ఎన్ని అలంకార భూషితాలో..  పోస్టులు, ఆ పోస్టుల మీద రోస్టులు, పొగడ్తలు, వీటన్నింటికోసం విరివిగా చెక్స్ట్ కంటే ఎక్కువగా అందరూ ఇప్పట్లో ఉపయోగించేది ఎమోజీలే.. నవ్వు వ్చిచనా, ఏడుపు వచ్చినా, ప్రేమ పుట్టినా, అలిగినా, ముద్దు చేయాలన్నా ఇలా ఒకటనేమిటి నవరసాలకు మించి ఎమోజీలు ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉంటాయి. అయితే ఈ ఎమోజీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. వాటితో ఎంత సరదా చేయచ్చనేది తెసుసుకుందాం. మనిషి భావానికి బదులుగా ఇంటర్నెట్ యుగంలో ఎమోజీలను వాడుతున్నాం. అయితే ఈ ఎమోజీ అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ లో 2015లో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏడాది  జులై 17న ప్రపంచ వ్యాప్తతంగా ఎమోజీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఎమోజీలకు మొదటిరూపం ఎమోటికాన్. ఫుల్ స్టాప్, కమా, బ్రాకెట్ వంటి నమూనాలతో వీటిని రూపొందించేవారు. మొట్టమొదటి సారి 1862 సంవత్సరంలో అబ్రహం లింకన్ ప్రసంగానికి సంబంధించిన కాపీని ముద్రించడంలో జరిగిన పొరపాటుకు  - ':)' - అనే ఎమోటికాన్ వినియోగించబడింది. ఆ తరువాత 1881లో ఈ ఎమోటికాన్ లను అమెరికన్ వ్యంగ్య పత్రిక పక్ ద్వారా ప్రచురించింది.  ఆ తరువాత ఎమోజీలను చిన్న చిన్న బొమ్మల ఆకారంలో పరిచయం చేయడం మొదలుపెట్టారు. మొదటి ఎమోజీని జపనీస్ కళాకారుడు పిగెటకా కురిటా రూపొందించాడు. ఇది 1999నాటి ఆవిష్కరణ. 2010లో యూనికోడ్ లో ఎమోజీలను చూపించడం, కొత్త వాటిని జోడించడం మొదలుపెట్టారు. ఎమోజీల కోసం మొత్తం 198ఆకారాలు జత చేశారు. ఇదీ ఎమోజీ గురించి కొంత ఆసక్తికరమైన విషయాలు. అయితే ఈ ఎమోజీ రోజు స్నేహితులు, బంధుమిత్రులు ఎమోజీల ద్వారా సంభాషణ సాగించడం, కొత్త కొత్త ఎమోజీలు సృష్టించడానికి ప్రయత్నించడం వంటివి మంచి ఫన్ ను అందిస్తాయి.                                           *నిశ్శబ్ద.

అనుభవం ఎలా వస్తుంది?

ప్రతి మనిషి తన జీవోతంలో ఏదైనా సాధించాలి అంటే అనుభవం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అనుభవం ఉన్న వారు పని చేసే విధానానికి, అనుభవం లేనివారు పనిచేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. స్వామి వివేకానంద లాంటి గొప్పవాడే అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని అన్నారు. అయితే అనుభవం ఎలా వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అనుభవం అనేది దానికది వచ్చేది కాదు. అనుభవాన్ని సంపాదించుకోవాలి. ప్రతి పనీ ఒక అనుభవాన్ని పరిచయం చేస్తుంది. అందుకే చాలామంది తమపనులు తాము చేసుకోవాలి అని అంటారు. అంటే ఆ పని అనుభవం వ్యక్తికి పరిచయం కావాలని వారి ఉద్దేశ్యమన్నమాట. అయితే నేర్చుకునే అలవాటు ఉంటేనే అనుభవం వస్తుంది. మనిషి ఎలా బ్రతకాలో అనుభవమే నేర్పిస్తుంది. బోధనలు, శాస్త్రాలు అనేవి వినడానికే బాగుంటాయి. వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకునేది అవగింజ అంత మాత్రమే. అందుకే  భోధనల ద్వారా నేర్చుకోవడం కొంతవరకే సాధ్యమవుతుందని,  అన్నీ చదివిన వారికంటే అనుభవం ఉన్నవారు ఎన్నో రెట్లు మేలని విజ్ఞానవంతులు చెబుతారు.. ఒక పనిచేయటంలో అనుభవం ఉన్న వారికి ఆ పనిలో ఉన్న మెళకువలు అన్నీ తెలుస్తాయి. తద్వారా వారు ఆ పనిని త్వరగా చేయగలరు. అదే కొత్తగా ఆ పని చేయడానికి వచ్చినవారు చేసేటప్పుడు తడబడుతూంటారు. అనుభవం గలవారి వద్ద ఉంటే మనం ఆ పనిని త్వరగా నేర్చుకోవచ్చు. అలా కాకుండా వాడి దగ్గర నేను నేర్చుకునేదేమిటి నాకు నేనుగానే ఈ పనిని చేయగలను నేర్చుకుంటాను అనుకుంటే ఆ పనిని నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంతే కాకుండా కొన్ని కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో మనకున్న అహం అనేది మనల్ని ఇబ్బందులపాలు చేస్తుంది.  అనుభవం అనేది ఒక పనిని మనం చేసినప్పుడో లేదా నేర్చుకున్నప్పుడో వస్తుంది. అంతేకానీ ఊరికే రాదు. మనం ఒక పనిని నేర్చుకుంటున్నపుడు ఆ పనిలో అనుభవం ఉన్న వారికి మన సందేహాలను చెప్పొచ్చు, వారి ద్వారా పరిష్కారాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఏ విషయంలోనైనా మంచి చెడ్డలు, లాభనష్టాలు దానికి సంబంధించిన అనుభవం ఉన్నవారికే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు. అందువల్లే అనుభవాన్ని సంపాదించాలి. అనుభవం గలవారు చెప్పే మాటలు అప్పుడప్పుడూ కూడా వింటూ ఉండాలి. వారు అనుభవం కలవారు ఎందుకు చెప్తున్నారో అర్ధం చేసుకోవాలి.  పనిలోగానీ, ఉద్యోగంలోగానీ ఏ రంగంలోనైనా సరే అనుభవం సంపాదించటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటున్నాము మనం ఒక ఉద్యోగాన్ని మాని వేరే ఉద్యోగానికి వెళితే అనుభవం ఉందా అని అడుగుతారు. దానినిబట్టి మనకు ఉద్యోగం ఇవ్వాలా లేదా మనకు ఎంత జీతం ఇవ్వాలి అన్నది. ఆలోచిస్తారు. మనం ఒక పనిని లేదా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు దానిని మనం వృధా చేయకుండా కాలాన్ని వృధాగా గడవకుండా అనుభవం సంపాదించటం కోసమే పని చేయాలి. అనుభవం కోసం, పనిలో నైపుణ్యత సంపాదించడం కోసం పనిచేస్తూ పోతే ఖచ్చితంగా గొప్ప అనుభవాన్ని సంపాదించుకున్నవారిగా ఎదుగుతారు. జీవితంలో కావలసినవి అన్నీ ఆ అనుభవమే సమకూర్చుకునేలా సహాయపడుతుంది.                                        ◆నిశ్శబ్ద.