కిస్ డే.. ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే..!

  కిస్ డేని వాలెంటైన్స్ వారంలోని 7వ రోజు అంటే ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. ప్రేమలో తగినంత నమ్మకం,  సాన్నిహిత్యం ఉన్న దశకు చేరుకున్నప్పుడు, ప్రేమికులు  తమ ప్రేమను టచింగ్  లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా వ్యక్తం చేస్తారు.   ముద్దు అనేది కేవలం ప్రేమికుల మధ్య జిరిగే చర్య కాదు.. ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెట్టినా, ఒక స్నేహితుడు తన స్నేహితుడికి ముద్దు పెట్టినా, తోబుట్టువులు ఆత్మీయంగా ముద్దు పెట్టినా.. ప్రతి ఒక్కటి ఈ కిస్ డే లో భాగమే.. ముద్దు అనేది ప్రేమ,  ఆప్యాయతను వ్యక్తీకరించడానికి ఒక మార్గం మాత్రమే కాదు, ఇది శారీరక,  మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకోవడం,  ఆత్మీయంగా ఉన్నవారిని ముద్దు పెట్టుకోవడం మొదలైన వాటి వల్ల  చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే.. ముద్దు ఒత్తిడిని తగ్గిస్తుంది.. శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్,  సెరోటోనిన్ హార్మోన్లు చాలా ముఖ్యమైనవి. ఇవి  ఒత్తిడిని,  ఆందోళనను తగ్గిస్తాయి.  ఈ హార్మోన్లు శరీరంలో రిలీజ్ అవ్వడంలో ముద్దు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.  ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మనకు ఇష్టమైన వారిని   సంతోషంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.. మనం ముద్దు పెట్టుకున్నప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది ముద్దు పెట్టుకున్న  సమయంలో బ్యాక్టీరియా మార్పిడి జరుగుతుంది.  దీని కారణంగా శరీరంలో కొత్త ప్రతిరోధకాలు ఏర్పడతాయి.  రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఏదైనా అంటువ్యాధి సమస్య ఉన్నవారు ముద్దులకు కాస్త దూరం ఉండటం మంచిది. కేలరీలను బర్న్ చేస్తుంది.. ముద్దు నిమిషానికి దాదాపు 2-6 కేలరీలను బర్న్ చేస్తుందట. ఇది జీవక్రియను పెంచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, ముద్దు పెట్టుకునే పద్ధతి, వ్యవధిని బట్టి నిమిషంలో 2 నుండి 26 కేలరీలు బర్న్ అవుతాయట. ఎందుకంటే ముద్దు శరీరంలోని అనేక భాగాల పనితీరు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ కండరాలకు మంచిది.. ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖ కండరాలకు మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇది 34 ముఖ కండరాలకు పైగా వ్యాయామంలాగా పనిచేస్తుంది.  ముఖాన్ని టోన్ గా,  యవ్వనంగా ఉంచుతుంది. ఇది ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ముద్దు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.   గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనివల్ల గుండెపోటు,  ఇతర హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.                                                     *రూపశ్రీ.

బాధ్యతగా ఉంటున్నారా??

ప్రపంచంలో మనిషి ఏదైనా గొప్పగా చేయగలిగింది ఉందంటే అది బాధ్యతగా ఉండటమే అనిపిస్తుంది. వృత్తిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇతర పనులలో కావచ్చు పూర్తిస్థాయి బాధ్యతగా ఉండటం అనేది చాలామంది విషయంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఇదే విషయం మీద ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు.  ఎందుకీ ఫిర్యాదులు?? అని ఆలోచిస్తే ఎందుకంటే ఇంకేముంటుంది బాధ్యతగా లేకపోవడం వల్ల అని అందరికీ అర్థమైపోతుంది.  అయితే…. సమాజంలో దృష్టిలో బాధ్యత!! చాలామంది చాలా కోణాల్లో ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనలు అన్నీ అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు ట్రైన్ తన మెయిన్ స్టాప్ కు వచ్చి చేరినట్టు, మనిషి ఆలోచనలు కూడా అన్ని విధాలుగా ఆలోచించి చివరకు తమ దగ్గరే ఆగుతారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే బాధ్యత అనే విషయాన్ని  ప్రతి మనిషి తను ఆశిస్తున్న ప్రయోజనాలకు దగ్గరే నాటుకుంటాడు.  ఉదాహరణకు ఒక కాలేజీ కుర్రాడు తనకు కావలసిన అవసరాలను, వస్తువుల్ని తీర్చడం తన తండ్రి బాధ్యత అనుకుంటాడు. ఒకవేళ ఆ కుర్రాడు అడిగింది ఏదైనా అతని తండ్రి నిరాకరిస్తే బాద్యతలేని తండ్రి అనేస్తాడు. స్నేహితుల దగ్గర అదే మాట చెప్పేస్తాడు. ఇలాంటి వాళ్ళు ప్రస్తుత సమాజంలో బేషుగ్గానే ఉన్నారు.  నిజానికి బాధ్యతంటే ఏంటి?? బాధ్యత అనేది డిమండింగ్, కమండింగ్ ల మధ్య సాగేది కానే కాదు. అది మనిషిలో ఉండాల్సిన లక్షణాలలో ఒకటి. ఈ విషయం అర్ధం చేసుకుంటే ప్రతి ఇల్లు కూడా ఫిర్యాదులు లేకుండా హాయిగా ఉంటుంది. ఒక తండ్రి తన ఆర్థిక కారణాల వల్ల ఉన్నదాంట్లో తన పిల్లలని సంతోషపెట్టాలని చూస్తే పిల్లలు కూడా తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ పరిస్థితికి తగ్గట్టు సర్దుకుపోవాలి. వృత్తిలో సమర్థవంతమైన పనిని అందివ్వాలి. స్నేహితులు చుట్టాల దగ్గర  అనవసర డాబు పోకుండా మోహమాటాల కోసం సామర్త్యానికి మించిన పనులు ఒప్పుకోకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా ఏదైనా నిజాయితీగా చెప్పేయడం, చేయడం వంటివి చేస్తే వ్యక్తిత్వాన్ని చూసి అందరూ గౌరవిస్తారు.  ఒకరి మెప్పు కోసమో, ఒకరు గొప్పగా చెప్పుకోవడం కోసమో కాకుండా తాము చేయవలసిన పనిని తమ పూర్తి సామర్త్యంతో చేస్తే అప్పుడు మనిషి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినట్టు.  కొందరు ఏమి చేస్తారంటే!! కొందరికి సామాజిక స్పృహ చాలా ఎక్కువ(ఈ మాట కొంచం వెటకారంగా చెప్పబడింది). ఎంత ఎక్కువ అంటే, ఓ సంపాదన పరుడు ఆరంకెల జీతం తీసుకుంటూ గుడిలోనో, అనాథశ్రమంలోనో మరింకోచోటో అన్నసంతర్పణలు, వస్త్రధానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న కన్నతల్లికి ప్రేమగా ఓ ముద్ద అన్నం పెట్టరు. సమాజం ఇచ్చే అటెన్షన్ కోసం ఇలా చేసే వాళ్ళు చాలా బాద్యతకలిగిన వాళ్ళలా సమాజానికి మాత్రమే అనిపిస్తారు. కానీ ముఖ్యంగా బాధ్యత ఉండాల్సింది తమ ఇంటి విషయంలో, తరువాత కుటుంబసభ్యుల అవసరాల విషయంలో, ఆ తరువాత సమాజం విషయంలో. అంతేకానీ అన్నీ వదిలిపెట్టేసి తన వాళ్ళు దిగులుగా, లోటుతో, బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉంటే సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయడం బాధ్యత అనిపించుకోదు.  ఈ సమాజంలో ప్రస్తుతం మనుషుల తీరు గమనిస్తే చెప్పుకోవాల్సిన మాట ఒకటి ఉంది. ఎప్పుడూ అన్నిటికీ పెద్దల మీదనో, ఇంట్లో ఉన్న సంపాదనా పరుల మీదనో ఆధారపడటం మాని ఇంటికి సహాయంగా ఉండకపోయినా తమని తాము సరైన విధంగా ఉంచుకుని, మంచిగా తీర్చిదిద్దుకుంటే (దీన్నే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం అంటారు) ఎవరి జీవితం పట్ల వాళ్ళు బాధ్యతగా ఉన్నట్టే. అదే గనుక జరిగితే అన్ని విషయాలలోనూ అన్ని కోణాలలోనూ బాధ్యతగా ఉండటం అనేది క్రమంగా అలవాటైపోతుంది. మరి ఏవి బాధ్యతలు?? ఓ తండ్రి తన పిల్లలకు మంచి దారి చెప్పడం, చూపించడం, జీవితాన్ని గురించి వివరిస్తూ ఉండటం, చదువు, సంస్కారం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడం. ఇది తల్లికి కూడా వర్తిస్తుంది. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు కాదు. ఇంకా చెప్పాలంటే అదీ, ఇదీ అన్నట్టు ఇంటిని చక్కబెడుతూ, ఎన్నో రంగాలలో రాణిస్తున్న మహిళా ముత్యాలు బోలెడు ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులు తమ మీద ఇష్టాలు రుద్దుతున్నారు అనుకోకుండా పెద్దల ఆలోచనలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చదువు విషయంలో తమ ఇష్టాల్ని చెప్పి అందులో ఉత్తమంగా రాణించాలి. జులయిగా తిరగడం, అల్లరిగా మారిపోవడం వదిలి కాసింత పరిపక్వతతో ఆలోచించాలి. ఉపాధ్యాయులు ఈ సమాజానికి మంచి పౌరులను అందించడానికి ప్రయత్నం చేస్తే ఆ పౌరులే సమాజాన్ని శాసించే వ్యక్తులు అవుతారు. అంతేకానీ ఎప్పుడూ ర్యాంకులు, మార్కులు అంటే విద్యార్థులకు ఆ మార్కులు, ర్యాంకులు, చదివిన చుదువు తాలూకూ విషయం తప్ప వాళ్లకు ఇంకేమీ తెలియకుండా పోతుంది. ప్రభుత్వాల గురించి రాజకీయ నాయకుల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ.  అయినా బాధ్యతగా ఉండాల్సింది మనమైతే ప్రభుత్వాల గురించి ఎందుకు చెప్పండి!!                                                                                                          ◆వెంకటేష్ పువ్వాడ.  

పోరాటంలో భయమెరుగని మహిళా నేత, సాహిత్యంలో ‘భారత కోకిల’.. సరోజినీ నాయుడు జయంతి..!

  ఆమె స్వాతంత్ర్య పోరాటంలో  భయపడకుండా ధైర్యంగా నిలబడ్డ సివంగి. ఒక అసాధారణమైన కవయిత్రి, గొప్ప రాజకీయ నేత. మన దేశ స్వాతంత్ర్యం కోసం, సాహిత్యం, మహిళల హక్కుల కోసం ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా మన ప్రభుత్వం ప్రతీ ఏటా ఆమె జయంతిని ‘జాతీయ మహిళా దినోత్సవం’గా జరుపుకుంటుందంటేనే అర్ధం చేసుకోవచ్చు…. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, మహిళల హక్కుల సాధనలో ఆమె ఎంతలా ప్రభావం చూపించిందో.. అంత ధైర్యం, దేశభక్తి కలిగిన ఆమె ఎవరో కాదు,  ‘భారత కోకిల’ గా  ప్రసిద్ధి పొందిన సరోజినీ నాయుడు.. భారత చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సరోజినీ నాయుడు గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే.. సరోజినీ నాయుడు 1879, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి అఘోర్నాథ్ చటోపాధ్యాయ ఒక శాస్త్రవేత్త, తత్వవేత్త.  తల్లి బరద సుందరి దేవి కవయిత్రి. తల్లిదండ్రుల ప్రభావం వల్లనేమో ఆమె   చిన్నప్పటి నుంచే రచనలు చేసేది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్,  కేంబ్రిడ్జ్‌ లోని  గిర్టన్ కాలేజ్‌లో విద్యనభ్యసించింది. విదేశాల్లో చదువుకుంటున్న సమయంలోనే గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ వంటి నాయకుల ప్రభావం ఆమెపై పడింది. ఇదే ఆమెను స్వాతంత్ర్య పోరాటంలో భాగమవ్వటానికి స్పూర్తినిచ్చింది.   స్వాతంత్య్రానికి మునుపు, తర్వాత  రాజకీయ కృషి... సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్(ఐ‌ఎన్‌సి)లో చురుకుగా పాల్గొని స్వతంత్ర సాధన కోసం కృషి చేసింది. ఐ‌ఎన్‌సి‌ కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. మహాత్మా గాంధీ నడిపిన ఉప్పు సత్యాగ్రహం(1920), క్విట్ ఇండియా ఉద్యమం(1942) వంటివాటిలో పాల్గొని  21నెలల జైలుశిక్ష కూడా  అనుభవించింది. భారత స్వాతంత్య్రానంతరం దేశంలోనే  తొలి మహిళా గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సేవలందించింది.  ఆమె గవర్నరుగా ఉన్నప్పుడు మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు ఎంతో కృషి చేసింది. మహిళల ఉపాధి, చట్టపరమైన హక్కులను సమర్ధవంతంగా ప్రోత్సహించింది. విద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలని ప్రోత్సహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నాయకత్వం స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది.   సాహిత్యంలో కృషి..... సరోజినీ నాయుడి కవిత్వం.. సాహిత్యంలో సౌందర్యం, దేశభక్తి భావాలను నింపుకుని ఉంటుంది. భారతీయ ఇతివృత్తాలను, పాశ్చాత్య సాహిత్య శైలితో కలగలిపి  రచనలు చేయడంతో  భారతదేశపు గొప్ప కవయిత్రులలో ఒకరిగా నిలిచింది. "ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా" అనే కవితతో మొదటి  ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల సేవలకు నివాళులర్పించింది.  ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’,  ‘ది బర్డ్స్ ఆఫ్ టైమ్’, ‘ది బ్రోకెన్ వింగ్’, ‘ది సెప్టర్డ్ ఫ్లూట్’ వంటి ఎన్నో రచనలు చేసింది.  ఆమె మరణానతరం ప్రచురించబడిన “ది ఫెదర్ ఆఫ్ ది డాన్” ఆమె అద్భుతమైన కవితా ప్రతిభను సూచిస్తుంది. ఆమె సాహిత్య ప్రతిభకుగానూ “భారత కోకిల” అనే బిరుదు లభించింది. మహిళా హక్కుల పరిరక్షణలో.. సరోజినీ నాయుడు మహిళా హక్కుల కోసం తన జీవితాంతం పనిచేసింది. దేశ పురోగతికి మహిళా సాధికారత అవసరమని బలంగా నమ్మింది. ‘ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్’ సహవ్యవస్థాపకురాలిగా ఉంటూ  మహిళల విద్య, ఆరోగ్యం, చట్ట పరిరక్షణ కోసం పని చేసింది. ‘ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ అధ్యక్షురాలిగా మహిళల ఓటు హక్కు, చట్ట పరిరక్షణ కోసం ఉద్యమించింది. జాతీయంగానే గాక గ్లోబల్ సమావేశాల్లో కూడా మహిళల ఓటు హక్కు కోసం  భారతదేశానికి  ప్రాతినిధ్యం వహించింది. వారసత్వానికి గౌరవమివ్వాలి..... సరోజినీ నాయుడు కృషికి గుర్తింపుగా మన ప్రభుత్వం  ‘జాతీయ మహిళా దినోత్సవం’ జరుపుకుని నివాళులర్పిస్తుంది. అలాగే మహిళా సమస్యలపై పోరాడిన ఉత్తమ జర్నలిస్టులకి “సరోజినీ నాయుడు అవార్డు” ఇచ్చి, ఆనాడు ఆమె మహిళల కోసం చేసిన కృషిని గుర్తు చేస్తుంది. ఆమె పేరుతో అనేక విద్యా సంస్థలు కూడా  నెలకొల్పబడ్డాయి.  ఆమె వారసత్వం తరతరాల వారికి ప్రేరణగా నిలుస్తోంది. మనం ఆమెకు నివాళులర్పిస్తూనే సమానత్వం, సాధికారత, దేశభక్తి అనే  విలువలను ముందుకు తీసుకెళదాం..                                     *రూపశ్రీ.

వాలెంటైన్ వీక్.. కొండంత భరోసా ఇవ్వగలిగేది ఆత్మీయ కౌగిలింత..!

  కౌగిలి అనే పదానికి చాలా రకాల అర్థాలు చెబుతుంటారు.  చూసే దృష్టిని బట్టి అర్థం మారుతుంది అంటారు. అలాగే ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ హవా కొనసాగుతోంది. ఈ వాలెంటైన్స్ వీక్ అందరికీ సంబంధించినదే అయినా స్పెషల్ గా ప్రేమికులు ప్రాముఖ్యత ఇస్తారు.  వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే కూడా ఒకటి.  ఈ రోజును ఆరోగ్యకరంగా ఎలా జరుపుకోవాలంటే.. హగ్ చేసుకోవడం పరిస్థితిని బట్టి అర్థాలు ఇస్తుంది. కానీ ఒక అమ్మాయి, అబ్బాయి హగ్ చేసుకుంటారు అంటే చూట్టూ ఉన్న అందరి కళ్లు నానా రకాలుగా అర్థాలు వెతుక్కుంటాయి.  ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం అంటే.. వారి మధ్య ఉండే అపార్థాలు, దాపరికాలు చెరిపేసుకోవడమే.. వాలెంటైన్ వీక్ ను ఎంతో సంబంరంగా జరుపుకునే ప్రేమికులు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తిని తన సొంతం అనుకుని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంత మాత్రం చేత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు.  అందులో ఇంకా పెళ్లి చేసుకోకుండా ప్రేమ పేరుతో తొందర పడకూడదు. ప్రేమించిన అమ్మాయిని ఈ వాలెంటైన్స్ వీక్ లో భాగంగా  కౌగిలించుకోవడానికి ముందు అమ్మాయి అనుమతి తప్పక తీసుకోవాలి. అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ స్టెప్ వేయకూడదు.   ప్రేమికుల జంట  ఏదైనా పని చేసే ముందు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.  పబ్లిక్ లో ఎలాంటి  పనులు చేయకూడదు.  సమాజం పట్ల భాద్యగా ఉండాలి. కౌగిలి.. కౌగిలి అనేది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే కాదు.. వాలెంటైన్స్ వీక్ ఎలాగైతే ఇష్టమైన వారితో ఎలాంటి సంబంధం ఉన్నవారితో అయినా ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవచ్చో.. హగ్ డే కూడా అలాగే జరుపుకోవచ్చు. తల్లిదండ్రులు, స్నేహితులు, తోడబుట్టిన వారు..ఆత్మీయులు,  కష్టాలలో తోడుగా నిలిచేవారు,  మంచి దారి చూపించేవారు..ఇలా ఎవరిని అయినా మనసుకు దగ్గరా చేసుకుని ఆత్మీయంగా ఒక కౌగిలింత ద్వారా కొండంత భరోసాను ఇద్దరి బంధంలో నింపుకోవచ్చు.                                   *రూపశ్రీ.

ఆకాశవాణి మాట.. అందరినీ అలరించిన పాట..

  టెలివిజన్, ఇంటర్నెట్ ఇవేవీ రాక ముందే ప్రపంచాన్ని ఇది కలపగలిగింది.  అప్పటి వాళ్ళకి అదేదో మాయాజాలం జరుగుతుందేమో అన్నట్టు ప్రపంచ ముచ్చట్లన్నీ గాలిలోనే జనాల దగ్గరకి చేరవేసి అందరికీ  ఆశ్చర్యాన్ని,  ఆనందాన్ని కలిగించింది.  అంతలా అందరినీ ఆశ్చర్యపరిచినదేమిటో.. అననుకుంటున్నారా? ఆకాశం నుండి ఏదో మాట వినబడినట్టు.. ఒక బుల్లి పెట్టేలో నుండి లీలగా వినిపించే మాటలు, పాటలు, ముచ్చట్ల సమాహారం.. పెద్దవాళ్లకు మరచిపోలేని అనుభూతులను పంచిన వెలకట్టలేని బహుమానం.. అదే.. “రేడియో”. మన భారతదేశ ప్రజలకి మాత్రం   ‘ఆకాశవాణి’గా  బాగా పరిచయం. ఇప్పుడున్న చాలామంది తమ బాల్యంలో ఈ ఆకాశవాణి  మాట, పాట విననివారు  ఉండరు. టెక్నాలజీ పెరిగినా కూడా  ఇది మన జీవితాల్లో ఇప్పటికీ ఉంది.  ప్రతి ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన  ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భం జరుపుకుంటారు.  ఒకప్పుడు అందరినీ ఎంతగానో అలరించిన  చిన్ననాటి నేస్తమైన రేడియో గురించి తెలుసుకుంటే....  రేడియో.. 19వ శతాబ్ధపు తొలినాళ్లలోనే రేడియో ప్రపంచానికి పరిచయమైనప్పటికీ దానికంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆలోచన మాత్రం 2010లో ప్రారంభమైంది.  రేడియో ప్రాముఖ్యతను గుర్తించి, దీనికంటూ  ప్రత్యేకమైన రోజు ఉండాలని  మొదటగా స్పెయిన్ దేశం  ప్రతిపాదించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియో  ప్రభావాన్ని గుర్తించిన యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011, ఫిబ్రవరి 13న అధికారికంగా ప్రకటించింది. ప్రజలకు సమాచారం అందించడంలోనూ, విద్యను ప్రోత్సహించడంలోనూ,  సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తూ ప్రజలను ఏకం చేయడంలోనూ  రేడియో ఎంతగానో సహాయపడింది. వార్తలు, వినోదం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది.  పట్టణాలకే కాక  గ్రామాలకు కూడా  చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా విషయం పట్ల అవగాహనను వ్యాప్తి చేయడంలోనూ, ప్రజలకి  వర్తమాన విషయాల గురించి  సమాచారం  అందించటంలోనూ శక్తివంతమైన సాధనంగా పనిచేసింది. రేడియోతో భారతదేశ ప్రజలకున్న అనుబంధం.. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోయలు, విశాల మైదానాలతో ఎంతో భౌగోళిక వైవిధ్యం ఉన్న భారతదేశంలో ఎక్కడెక్కడో నివసించే ప్రజలందరికీ  సమాచారం అందించటం అంత సులువైన విషయం కాదు. కానీ రేడియో ఆ పనిని సాధ్యం చేసింది. అందుకే మన దేశంలో రేడియో ఒక ప్రాచీనమైన, అత్యంత నమ్మదగిన సమాచార మాధ్యమాలలో ఒకటిగా ఇప్పటికీ పరిగణించబడుతుంది. భారతదేశంలో మొదటిసారిగా  రేడియో ప్రసారం 1927లో ప్రారంభమైంది. 1936లో "ఆకాశవాణి"(ఆల్ ఇండియా రేడియో) ఏర్పడింది. అప్పటి నుండి, భారతదేశంలో సామాన్య ప్రజల రోజువారీ జీవితాల్లో రేడియో ఒక భాగమైపోయింది. సమాచారాన్ని అందించడంలోనూ, వినోదాన్ని పంచడంలోనూ, సంగీతం, వార్తలు, సమకాలీన అంశాలను అందించడంలోనూ రేడియో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నాటికీ కూడా భారతదేశంలో  ఇంటర్నెట్ అందుబాటులో లేని  మారుమూల  ప్రాంతాలలో నివసించే ప్రజలకు వార్తలు, వినోదం, విద్యా సంబంధిత సమాచారంతో పాటూ  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి  అవగాహన కల్పించడంలో రేడియో ఎంతో సహాయపడుతోంది. ఆపద సమయాల్లో, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, రేడియో అత్యవసర సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది.  ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ వంటి కార్యక్రమాల ద్వారా,  ప్రజలతో నేరుగా మాట్లాడటానికి, వారి సమస్యలు తెల్సుకోవటానికి  ఈ  రేడియో ఎంతగానో ఉపయోగపడుతోంది. రేడియో భవిష్యత్తు.... టెక్నాలజీ ఎంత పెరిగినా, మనమెంత ఎదిగినా  అమ్మ పిలుపులాంటి ఆకాశవాణి మాటని మర్చిపోలేము, మర్చిపోకూడదు. ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా ఈ రేడియో మన తరానికి అందించిన సేవలని గుర్తించి, ప్రశంసించాలి. ప్రస్తుతం ఎఫ్.ఎం రేడియోలు, కమ్యూనిటీ రేడియోలు, ఆన్‌లైన్ రేడియోలు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి.  డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ రేడియో, పాడ్ కాస్టులు  వస్తున్నాయి. ఎన్ని వచ్చినా  కానీ, ఇప్పటికీ ప్రజలకు అత్యంత నమ్మకమైన  సమాచార మాధ్యమంగా సంప్రదాయ రేడియో కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంటుంది.                                    *రూపశ్రీ.

ప్రామిస్ డే.. బంధంలో నమ్మకానికి పునాది ఇదే..!

  వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఈ వాలెంటైన్స్  వారంలో ప్రతి రోజు సంబంధాలు,  ప్రేమకు సంబంధించి విభిన్న అంశాలు రోజుకు ఒకటిగా ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయి. వాలెంటైన్స్ వీక్  రోజ్ డే తో ప్రారంభం అవుతుంది  ఇది వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది. ప్రేమించే ప్రతి ఒక్కరూ తమకు తమ భాగస్వామి ఎంత ముఖ్యమో, తమ భాగస్వామి పట్ల తమకున్న ప్రేమ ఎంత గొప్పదో తెలియజేయడానికి,  వ్యక్తం చేయడానికి ఈ వాలెంటైన్స్ వీక్ చాలా మంచి వేదిక అవుతుంది. ప్రామిస్ డే.. సంబంధాలలో నిబద్ధత,  విధేయత  ప్రాముఖ్యతను ప్రామిస్ డే నొక్కి చెబుతుంది. ప్రామిస్ డే అనేది వాలెంటైన్స్ వారంలో ఐదవ రోజు. ఇది సంబంధాలలో  బలాన్ని పెంచుతుంది.  ప్రామిస్ డే రోజు భాగస్వామికి వాగ్దానాలు చేయడం, బంధం పట్ల ఉన్న  నిబద్ధతను చాటిచెప్పడం,  బంధానికివిలువ ఇవ్వడం,  కష్టాల్లో ఒకరికొకరు అండగా ఉంటామని ప్రామిస్ చేసుకోవడం. ఇది  భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నమ్మకం, అవగాహన,  ఒకరి పట్ల మరొకరు విధేయతగా ఉండటం వంటి విషయాలను ప్రామిస్ తెలుపుతుంది.  ప్రేమను, బంధం పట్ల గౌరవాన్ని  తెలియజేస్తూ హృదయపూర్వకంగా  ఉత్తరాలు రాయడం, లేదా ప్రేమ లేఖలు రాయడం, మనసులో ఉన్న అమితమైన ప్రేమకు అక్షరరూపం ఇవ్వడం లేదా మనసులో ఉన్న ప్రేమను ఏదో  ఒక అందమైన చర్యతో వ్యక్తం చేయడం ద్వారా ప్రామిస్ డే ను అందంగా మార్చుకోవచ్చు. నమ్మకమే పునాది.. ఏ బంధానికి అయినా నమ్మకమే పునాది అవుతుంది.  స్నేహం, ప్రేమ,  ఇతర బందాలు ఏవైనా నమ్మకం అనే పునాదుల మీదనే బాగుంటాయి. ఆ పునాది సరిగా లేకపోతే బంధం కుప్పకూలిపోతుంది. ప్రేమికులకు, ప్రేమను మనసులో నింపుకున్నవారికి కూడా అంతే.. నమ్మకం అనే పునాది బాగుంటేనే వారి బంధం వివాహం వరకు వెళ్లగలుగుతుంది.  ఆ నమ్మకాన్ని ప్రామిస్ ఇవ్వగలుగుతుంది. అందుకే ప్రామిస్ డేకి అంత ప్రాముఖ్యత.                                      *రూపశ్రీ.

సైన్స్ రంగంలో మహిళల విజయ పతాకం..  

    ఆడవారు చదువుకి కూడా నోచుకోని ఆటవిక కాలం నుంచి మగవారితో సమానంగా ఉన్నతవిద్య పొందే కాలానికి వచ్చింది మన సమాజం. అయితే ఇప్పుడు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ఉంటున్నప్పటికీ ఇంకా వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అందుకే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్(STEM)  రంగాల్లో మహిళలు, అమ్మాయిలు సాధించిన విజయాలని,  వారి కృషిని గౌరవించటానికి,  శాస్త్ర-సాంకేతిక రంగాల్లో లింగ సమానత్వం, మహిళా సాధికారతకున్న  ప్రాముఖ్యతను గుర్తుచేయటానికి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి11న ‘అంతర్జాతీయ మహిళలు, బాలికల  విజ్ఞానశాస్త్ర దినోత్సవం’ జరుపుకుంటారు.   శాస్త్రీయ రంగంలో మహిళల భాగస్వామ్యం తగ్గడానికి ఎదురైన అడ్డంకులను, దురభిప్రాయాలను తొలగించడమే ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.  మరి ఈ దినోత్సవం మహిళా పురోగతికి ఎలా సాయపడుతుందో తెలుసుకుంటే...   ఎప్పుడు మొదలైందంటే.. మొదటి నుంచీ  సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్(STEM) వంటి రంగాలలో లింగ అసమానత్వం చాలా ఎక్కువగా ఉంటూ వస్తుంది. అయితే మహిళల సాధికారత, లింగ సమానత్వం ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని  ఐక్యరాజ్యసమితి భావించింది. 2015లో జనరల్ అసెంబ్లీ ద్వారా అంతర్జాతీయ మహిళలు, బాలికల విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని స్థాపించింది.  ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న జరుపుకుంటారు. మహిళా శాస్త్రవేత్తలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచిన  ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త ఐన మేరీ క్యూరీ  జన్మదినాన్ని గౌరవిస్తూ ఈ రోజుని ఎంచుకున్నారు. ఈ దినోత్సవం గత కొన్ని దశాబ్దాలలో ప్రపంచ సమాజంలోని మహిళలు, బాలికలను విజ్ఞానశాస్త్రంలో భాగస్వాములని  చేసేందుకు ప్రేరేపించింది.    సైన్సు రంగంలో మహిళా పురోగతి .. 2700బి‌సి కాలానికి చెందిన   మెరిట్-ప్తా సమాధిపై  “చీఫ్ ఫిజీషియన్” అని రాసి ఉండటంతో ఆవిడే మొదటి మహిళా శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచింది. 1876లో ఎలిజబెత్ బ్రగ్ అనే మహిళ తొలి ఇంజనీరింగ్ పట్టా పొందటంతో మహిళల ఉన్నత విద్యకి తొలి అడుగు పడినట్టయింది. మన ఇండియాలో అయితే 1919లో అయ్యల సోమయాజుల లలిత మొట్టమొదటి మహిళా ఇంజినీరుగా పట్టా పొందారు.  రేడియోధార్మికత మీద విశేష ప్రయోగాలు చేసిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1903లో మొట్ట మొదటి మహిళా నోబెల్ గ్రహీతగా నిలిచారు. 1970ల నాటికి ఇంజనీరింగ్  డిగ్రీలు పొందుతున్న మహిళల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగింది. 1980ల నాటికి యూనివర్సిటీల్లో సుమారు 37శాతం మహిళలు కంప్యూటర్ సైన్సుని ప్రధానంగా ఎంచుకున్నారు. మన భారతదేశానికి చెందిన  ప్రతిభావంతులయిన   మహిళలు చాలా మంది సైన్సురంగంలో దేశపురోగతికి ఎంతగానో దోహదం చేశారు. బ్రిటీష్ కాలం నుంచి నేటివరకూ ఎంతోమంది భారత మహిళలు తమకున్న అడ్డంకులన్నీ దాటుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్య చదవటంతో పాటూ, మన దేశ పురోగతిలో సాయపడ్డారు. నేడు మన దేశం గర్వంగా చెప్పుకునే ఇస్రో సంస్థలో కూడా మహిళల  ప్రాతినిధ్యం బాగా పెరిగింది. మంగళయాన్, చంద్రయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మహిళా శాస్త్రవేత్తలు కీలక భాద్యతలు చేపట్టారు. డి‌ఆర్‌డి‌ఓ లో కూడా వీరి కృషి అమోఘం. ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టరుగా పనిచేసిన టెస్సి థామస్ ‘మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా”గా పేరు పొందారు. ఇలా ఎంతోమంది మహిళలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు.   విజ్ఞానం, సాంకేతికత, ఇంజనీరింగ్, గణితశాస్త్రం(STEM) రంగాల్లో లింగ భేదం లేకుండా  పురుషులతో పాటూ మహిళలు, బాలికలు కూడా  శాస్త్రీయ విద్య-వృత్తుల్లో సమాన అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మహిళా శాస్త్రవేత్తల విజయాలను, పరిశోధనలో  సాంకేతిక పురోగతికి వారు చేసిన కృషిని గుర్తించి చాటి చెప్పటం కూడా దీని ముఖ్య ఉద్దేశమే.  ఆయా రంగాల్లో విశేషంగా రాణించిన మహిళల విజయాలకి గుర్తింపు, గౌరవమివ్వటం ద్వారా మరెంతో మంది ఈ రంగాల వైపు వెళ్లడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో కూడా ఉన్నత స్థానాల్లో నిర్ణయాలు తీసుకునేలా, నాయకత్వం వహించేలా  మహిళలని మరింతగా ప్రోత్సహించడం,  యువతకు స్ఫూర్తిని అందిస్తూ, STEM రంగాల్లో ఉన్న అవకాశాలను అన్వేషించేలా చేయడం వంటివి కూడా ఈ దినోత్సవ లక్ష్యాల్లో ఉన్నాయి.                                    *రూపశ్రీ.

నేచర్ లవర్స్ కోసం మినియేచర్ గార్డెనింగ్..!

మన ఇళ్లలోని పచ్చదనం మనకు ఆహ్లాదం, ఉత్తేజం కలిగేలా చేస్తుంది. అలాంటి అందమైన ఆలోచనకు మినియేచర్ గార్డెన్స్ సరిగ్గా సరిపోతాయి. మినియేచర్ గార్డెన్స్ సృజనాత్మకత యొక్క ఉత్తమ రూపాలలో ఒకటి మరియు వాటిని ఫెయిరీ గార్డెన్స్ అని కూడా అంటారు. ఈ గార్డెన్స్ కుర్చీలు, బల్లలు, బెంచీలు, చిన్న జంతువులు, పక్షులు, సీతాకోకచిలుకలు, మొక్కల స్టాండ్‌లు, మానవ బొమ్మలు మొదలైన రూపాలలో అలంకరించబడతాయి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలికైన గార్డెనింగ్ వల్ల రాత్రిపూట నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని వెల్లడైంది. 'పర్పస్ ఫుల్ యాక్టివిటీస్' అనే అధ్యయనం ప్రకారం, యోగా మరియు గార్డెనింగ్ వల్ల మంచి నిద్ర అలవాట్లు కలుగుతాయి. డ్వార్ఫ్ బటర్ ఫ్లై ఎగేవ్, క్రాసుల, కలబంద, సెడమ్, స్నేక్ ప్లాంట్, రివర్ యుఫోర్బియా కాక్టస్, యుఫోర్బియా రుబ్రా కాక్టస్ మరియు ఇతర సక్యూలెంట్‌లను మీ స్వం మినియేచర్ గార్డెన్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. చాలా మంది ఈ గార్డెన్ లో చిన్న మొక్కలను (బోన్సాయ్) పెట్టడానికి ఇష్టపడతారు.

సంగీతానికి ఊపిరి పోసిన వీణా తంత్రువు .. ఘంటసాల ..!

  మన దక్షిణాదిలో  ఏ  మారుమూల ప్రాంతంలో ఐనా రేడియో నుంచో,  టి.వి నుంచో భగవద్గీత వినిపిస్తుందంటే,  ఆ స్వరమాధుర్యం అందరికీ పరిచయమైనదై ఉంటుందని వేరేగా చెప్పక్కర్లేదు.  సాక్షాత్తు శ్రీకృష్ణుడే  ఆ గాత్రంతో మనకి గీతోపదేశం చేసినట్టు ఉంటుంది. అంత గొప్ప స్వరం కలిగిన స్వర మాంత్రికుడు ఇంకెవరో కాదు.. అందరూ ఘంటసాల అని ఎంతో ప్రేమతో పిలుచుకునే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు.  “గాయకుడు కావాలంటే కేవలం సంగీత జ్ఞానం మాత్రమే కాదు, కవి హృదయం కూడా  ఉండాలి. పాటలోని భావాన్ని అర్థం చేసుకుని, కథానాయకుడి మాదిరిగా తన గొంతుతో అభినయం చేయగలగాలి” అని తానన్న మాటని తనే నిరూపిస్తూ,  తన సినీ సంగీత కిరీటానికి  తన వజ్రపు స్వరంతో అలంకరించిన గొప్ప గాయకుని   ఘంటసాల గారు. తెలుగు భాషను సాహిత్య పరంగా మరో స్థాయికి తీసుకెళ్లిన ఘంటసాల గారు తన సంగీతాన్ని, తన గాత్రాన్ని పాటల రూపంలో అందరిముందు వదిలి దేహాన్ని ఫిబ్రవరి 11న వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలియని  విషయాలు తెలుసుకుంటే..... ఘంటసాల ఆంధ్రప్రదేశ్‌లోని చౌటపల్లి గ్రామానికి చెందిన రత్తమ్మ, సూరయ్యలకి డిసెంబర్ 4, 1922న జన్మించాడు. తండ్రి  సూరయ్య  ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు మాత్రమే కాకుండా, ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడిగా, తారంగాలను పాడే గాయకుడిగా, గురువుగా పేరుపొందారు. తండ్రి  సంగీత ప్రదర్శనల సమయంలో ఘంటసాల నృత్యం చేసేవాడు.  అలా ‘బాలభారత’ అనే బిరుదును పొందాడు.  ఘంటసాల 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి సూరయ్య మరణించారు. తండ్రి బ్రతికున్నప్పుడు  నాదోపాసన చేయాలని తనకి చెప్పిన మాటని  ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించాడు. సంగీతం నేర్చుకోవాలనుకునే తపనతో విజయనగరం సంగీత కళాశాలలో చేరి అక్కడ జరిగిన ఒక తప్పు కారణంగా  కళాశాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది.  ఆ కాలంలో భిక్షాటన చేసే సాధువుల్లాగానే ఘంటసాల కూడా కొన్ని ఇళ్లలో భిక్షాటన చేసి భోజనం చేసేవారు. ఆయనకి  అన్నం పెట్టి  ఆదరించిన మహిళల సహాయాన్ని ఎప్పుడూ  మరిచిపోలేదు. ఆ తర్వాత, కాలేజీలో తనపై వచ్చిన  ఆరోపణ తప్పు అని నిరూపించబడటంతో   కళాశాలలో తిరిగి చేరి 1942లో సంగీత డిప్లొమా పొందారు. స్వాతంత్ర్య పోరాటం సాగుతున్న రోజులలో  ఆయన కూడా అటువైపు ఆకర్షితుడయ్యాడు.  "భారత మాత పిలుపు నా జీవితం కన్నా ముఖ్యమైనది" అనే భావనతో ఆయన "క్విట్ ఇండియా" ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ కారణంగా ఆలీపుర్ జైలులో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. అయితే, జైలులో కూడా ఆయన తన పాటల ద్వారా సహచర ఖైదీలను, జైలు అధికారులను ఆకట్టుకున్నారు. సినీ సంగీత ప్రయాణం.. 1944లో ఘంటసాలకి తన బంధువైన సావిత్రితో పెళ్లి జరిగింది.  ప్రముఖ తెలుగు సినిమా రచయిత సముద్రాల రాఘవాచార్యుల పరిచయం ఈ పెళ్లి వల్లనే జరిగింది.సముద్రాల సూచనతో ఘంటసాల మద్రాస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఆయన సినీ సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. మొదట చిత్తూరు నాగయ్య నటించిన త్యాగయ్య వంటి సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. అదేవిధంగా, సినిమాల్లో  గుమ్మడి పాటల్లో  పాడే ఛాన్స్ పొందారు. మొదట్లో, గ్రామఫోన్ రికార్డింగ్ కోసం ప్రయత్నించినప్పటికీ, ఆయన గొంతు మైక్రోఫోన్‌కు సరిపోదని కొందరు అన్నారు.  అయితే, తరువాత తానే పాటలని  రికార్డు చేసి  చరిత్ర సృష్టించారు. ఆ కాలంలో, మద్రాస్ ఆకాశవాణి కేంద్రం ఘంటసాలకు శాస్త్రీయ సంగీతం, లలిత గీతాలను పాడేందుకు అవకాశం కల్పించింది. ఘంటసాల విజయాలు....  1945లో వచ్చిన స్వర్గసీమ చిత్రంలో భానుమతితో కలిసి పాడే అవకాశం ఆయనకు లభించింది. ప్రసిద్ధ దర్శకుడు బి.ఎన్.రెడ్డి,  సంగీత దర్శకుడు చిత్తూరు నాగయ్యలు   ఈ  అవకాశాన్ని ఇచ్చారు.  ఈ చిత్రం నుంచి ఘంటసాల ప్లేబ్యాక్ సింగర్‌గా తన స్థానాన్ని ఖరారు చేసుకున్నారు.  ఘంటసాల వారి  గానం తెలుగు పద్యాలకు, గీతాలకు భావవ్యక్తీకరణ పరంగా గొప్పగా సరిపోయేది.  తెలుగు సినిమా అగ్ర హీరోల పాటలకు ఆయన స్వరమే  మంచి విజయాలు ఇచ్చింది. . తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాలలో కూడా ప్రసిద్ధ గాయకుడిగా పేరొందారు. ఘంటసాల పాడిన కొన్ని చిరస్మరణీయమైన పాటలలో పాతాళ భైరవి, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసు, జయభేరి, మహాకవి కాళిదాసు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, మూగమనసులు, గుండమ్మ కథ, శ్రీకృష్ణావతారం, నిర్దోషి వంటి సినిమాలు అజరామంగా నిలిచాయి. ఘంటసాల పాడిన భక్తిగీతాలు, స్వతంత్ర గీతాలు ఇప్పటికీ వినేవారిని  ఆకట్టుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిపై పాడిన గీతాలు అపారమైన భక్తిని కలిగిస్తాయి. "పుష్ప విలాపం"లో ఆయన గానం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. భగవద్గీతను అర్ధంతో సహా ఆలపించిన ఘంటసాల తెలుగువారి గుండెల్లో  అమరునిగా నిలిచిపోయారు. ఈ గీతా పారాయణం ఆయన మరణించాక  విడుదలైనప్పటికీ అది ఘంటసాల పేరుతో సదా గుర్తుండిపోయే గొప్ప సంపద అయిపోయింది. ఘంటసాల నిర్మాతగా మారి "పరోపకారం", “సొంత ఊరు", "భక్త రఘునాథ"  చిత్రాలను నిర్మించారు. అయితే, ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. వాటి కారణంగా ఆయన ఆర్థికంగా కష్టాల్లో పడిపోయారు. అయినా సంగీత సామ్రాజ్యంలో మాత్రం మరణం వరకూ.. మరణం తర్వాత కూడా  మకుటం లేని మహారాజుగా నిలిచారు.                        *రూపశ్రీ.

టెడ్డీ డే.. టెడ్డీ బేర్ రంగును బట్టి అర్థాలు ఉన్నాయి తెలుసా?

  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న టెడ్డీ డే జరుపుకుంటారు. టెడ్డీ బేర్ కేవలం ఒక బొమ్మ మాత్రమే కాదు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక అందమైన మార్గం కూడా. ప్రతి టెడ్డి బేర్ రంగు వేర్వేరు భావోద్వేగాలను సూచిస్తుంది. ఎవరైనా  టెడ్డీని బహుమతిగా ఇస్తే, దాని రంగును బట్టి వారి మనసులో ఏముందో  అర్థం చేసుకోవచ్చు. టెడ్డీ బేర్ ను కేవలం ప్రేమికురాలికి, లేదా ప్రియుడికి మాత్రమే కాదు.. ఎవరికి అయినా ఇవ్వవచ్చు. అయితే అది ఎవరికి ఏ రంగు ఇవ్వాలనే విషయం తెలుసుకుని ఇస్తే ఎంతో మంచిది.  ఏ రంగు టెడ్డీ బేర్ ఏ విషయాన్ని తెలుపుతుందంటే.. ఎరుపు రంగు టెడ్డీ బేర్.. ఎరుపు టెడ్డీ బేర్  ఐ లవ్ యు అనే మాటను వ్యక్తం చేయడానికి ఇస్తారట. మాటలు లేకుండా  ప్రేమను వ్యక్తపరచడానికి ఎరుపు రంగు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఎవరైనా  ఎర్రటి టెడ్డీ బేర్ ఇస్తే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం. సంబంధాన్ని బలోపేతం చేయడానికి,  ప్రేమను వ్యక్తపరచడానికి ఎర్రటి టెడ్డీ బేర్‌ను ఇస్తారు. పసుపు టెడ్డీ బేర్.. పసుపు గులాబీల మాదిరిగానే, పసుపు టెడ్డీ బేర్లు కూడా స్నేహాన్ని,  కొత్త ప్రారంభాలను సూచిస్తాయి. పసుపు రంగు ఆనందం, స్నేహం,  సానుకూలతను సూచిస్తుంది. ఎవరైనా  పసుపు రంగు టెడ్డీని ఇస్తే, వారు మిమ్మల్ని మంచి స్నేహితుడిగా భావిస్తారని అర్థం. ఇది కొత్త సంబంధాన్ని ప్రారంభించే సంకేతం కూడా కావచ్చు. ఒక వేళ టెడ్డీ డే రోజు పసుపు రంగు టెడ్డీని ఎవరైనా ఇస్తే వారు ప్రేమిస్తున్నారనే అపోహలో పడకండి. బ్రౌన్ టెడ్డీ బేర్.. బ్రౌన్ రంగు టెడ్డీ బేర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది సంరక్షణకు,  బలానికి చిహ్నం.  ఎవరికైనా బ్రౌన్ టెడ్డీ బొమ్మను ఇస్తే, సంబంధం బలంగా,  నమ్మదగినదిగా ఉందని చూపిస్తుంది. ఎవరికైనా మద్దతుగా ఉండాలన్నా, వారికి  బలం కలిగించాలనుకున్నప్పుడు, ఇలాంటి టెడ్డీని బహుమతిగా ఇవ్వవచ్చు. నీలం రంగు టెడ్డీ బేర్.. నీలం రంగు నిజమైన ప్రేమ,  నమ్మకాన్ని సూచిస్తుంది. ఎవరైనా  నీలిరంగు టెడ్డీని బహుమతిగా ఇస్తే, వారు మిమ్మల్ని తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారని అర్థం. ఇది  సంబంధంలో నమ్మకాన్ని,   నిజాయితీ సూచిస్తుంది.  ఎవరికైనా ఎల్లప్పుడూ అండగా ఉంటారని చూపించాలనుకున్నప్పుడు, నీలిరంగు టెడ్డీ బేర్ ఇవ్వవచ్చు. పింక్ టెడ్డీ బేర్.. పింక్ టెడ్డీ  ఎవరైనా ఇస్తే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని.  మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నారని అర్థం. ఇది ఇష్టాన్ని,  ప్రేమ భావాలను సూచిస్తుంది. ఎవరైనా మీకు పింక్ టెడ్డీని ఇస్తే, వారు మీతో ఉన్న సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారని అర్థం. మీరు ఎవరికైనా ప్రత్యేకంగా అనిపించాలని, వారు మీకు ఇష్టమని చెప్పాలని అనుకున్నప్పుడు ఈ రంగు టెడ్డీ బేర్‌ను వారికి ఇవ్వవచ్చు.                                                    *రూపశ్రీ.

వివాహ బంధం బలంగా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ నియమాలు పాటించాలి..!

  ప్రతి మగాడు, ప్రతి మహిళ తమ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని, వారి జీవితంలో  ఎలాంటి సమస్యలు రాకూడదని కోరుకుంటారు. కానీ  ఎంత ప్రయత్నించినా సంబంధంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు కొన్ని చిన్నగా ఉండగానే పరిష్కారం అయిపోతే మరికొన్ని సమస్యలు పెద్దవిగా మారతాయి.  అటువంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు ఇచ్చిన కొన్ని సలహాల గురించి మాట్లాడుకోవాలి.  ఆచార్య చాణక్యుడు కేవలం రాజనీతిని,  తత్వశాస్త్రాన్ని మాత్రమే కాకుండా కొన్ని వ్యక్తిత్వ,  జీవిత విలువలను కూడా స్పష్టంగా తెలిపాడు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం బలంగా ఉండానికి ఆయన చెప్పిన అద్బుత సలహాలు ఈ కింద చదివి తెలుసుకోండి. అహంకారం.. అహంకారం ఏ సంబంధాన్నైనా చెడగొట్టగలదని చాణక్యుడు అందుకే  ఎట్టి  పరిస్థితిలో  వివాహం తరువాత ఇద్దరిది కలిసి ఒక  జీవితంలా మారిందని, ఆ జివితంలో  అహాన్ని వీలైనంత దూరంగా ఉంచాలని ఆయన చెప్పాడు.  అహాన్ని దూరం పెట్టి  తెలివిగా వ్యవహరించేవారి జీవితం ఎప్పుడూ బాగుంటుందట. ఓపిక.. వివాహ జీవితంలో ఓపిక కలిగి ఉండటం చాలా ముఖ్యం.  ఎందుకంటే చాలాసార్లు  భాగస్వామి కోపంలో నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో అవతలి వ్యక్తి ఓపికగా ఉండి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి, అప్పుడే  సంబంధాన్ని నిర్వహించడంలో విజయం సాధించగలరు. నమ్మకం.. వైవాహిక జీవితానికి నమ్మకం అతిపెద్ద ఆధారం.  భాగస్వామి దగ్గర ఏదైనా దాచిపెడితే అది  సంబంధాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి సంబంధంలో నిజం,  నిజాయితీ ఉండాలి. దీనితో పాటు, భార్యాభర్తలు ఒకరితో ఒకరు మంచిగా ప్రవర్తించాలి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మూడవ వ్యక్తి.. వివాహ జీవితంలో మూడవ వ్యక్తి ప్రవేశించడమే కాకుండా, మూడవ వ్యక్తి సలహా ఇవ్వడం, మూడవ  వ్యక్తి జోక్యం  చేసుకోవడం భార్యాభర్తల  సంబంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే  ఎల్లప్పుడూ  భాగస్వామితోనే అన్ని విషయాలను చర్చించడం,  గొడవ పడటం,  అరవడం,  తరువాత సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడం చేయాలి.   పరస్పర అంగీకారంతో వివాహ జీవిత నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడూ భాగస్వామిని కాదని ఇతరుల సలహాతో నిర్ణయాలు తీసుకోరాదు. చాణక్యుడి ప్రకారం వివాహ జీవితంలో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది  సంబంధంలో గందరగోళాన్ని,  అపార్థాన్ని సృష్టిస్తుంది. భార్యాభర్తలకు తమ తల్లిదండ్రుల తరపు కానీ స్నేహితులు, సన్నిహితులు ఎంత మంచివారైనా, ఎంత గొప్పవారైనా,  ఎంత ఎదిగిన వారైనా.. భాగస్వామిని కాదని వారి నుండి సలహాలు తీసుకుని ఏ పనులైనా చేస్తే ఖచ్చితంగా భాగస్వామికి విలువ ఇవ్వనట్టే లెక్క. ఇది బాగస్వామిని అవమానించినట్టే అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఇలాంటి అనుభవాలు ఎక్కువ అవుతుంటాయి. భర్త తన ఆధిపత్యం కోసం, భార్యను చులకనగా చూస్తూ తన తల్లిదండ్రులు,  తోబుట్టువులు, స్నేహితుల సలహాతో చాలా పనులు చేస్తారు. కానీ అలా చేసే పనుల గురించి భార్యకు చెప్పకపోవడం చాలా పెద్ద తప్పు.                                *రూపశ్రీ.  

వాలంటైన్స్ వీక్ మొదటి రోజే రోజ్ డే జరుపుకుంటారు ఇందుకే..!

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న రోజ్ డే జరుపుకుంటారు. ఇది వాలెంటైన్స్ వీక్ ప్రారంభంలో మొదటి రోజు. ఈ రోజున, ప్రేమికులు, స్నేహితులు,  బంధువులు తమ ఆప్యాయత,  భావాలను వ్యక్తీకరించడానికి గులాబీలను ఇస్తారు. రోజ్ డే కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు, స్నేహం, సామరస్యం ,  శాంతికి చిహ్నం కూడా. చిన్న చిన్న సంజ్ఞలతో మన సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని ఈ రోజు మనకు బోధిస్తుంది. రోజ్ డే ఎందుకు జరుపుకుంటాము? రోమన్ రాజు క్లాడియస్ II (3వ శతాబ్దం) పాలనలో ప్రేమ,  వివాహాలను ప్రోత్సహించడానికి సెయింట్ వాలెంటైన్ పోరాడాడని నమ్ముతారు. ఈ కారణంగా అతను శిక్షించబడ్డాడు కూడా.  అతని ప్రేమ,  త్యాగం జ్ఞాపకార్థం వాలెంటైన్స్ వీక్ జరుపుకోవడం ప్రారంభమైంది, దీనిలో మొదటి రోజు రోజ్ డే. రోజ్ డే ప్రాముఖ్యత.. గులాబీని ప్రేమ, స్నేహం,  భావోద్వేగాలకు చిహ్నంగా చూస్తారు. వివిధ రంగుల గులాబీలు వివిధ భావోద్వేగాలను సూచిస్తాయి.  ఉదా.. ఎర్ర గులాబీలు నిజమైన  ప్రేమకు చిహ్నం. పసుపు గులాబీని స్నేహం,  ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. తెల్ల గులాబీలను శాంతికి,  నూతన ప్రారంభాలకు చిహ్నంగా పరిగణించవచ్చు. గులాబీ రంగు  గులాబీలు కృతజ్ఞతను,  ప్రశంసలను సూచిస్తాయి. నారింజ రంగు గులాబీలు అభిరుచి, ఉత్సాహం,  ఆకర్షణను సూచిస్తాయి. అర్థమైందా.. రోజ్ డే రోజు గులాబీని ప్రేమికులకు మాత్రమే ఇవ్వాలనే రూల్ లేదు. ప్రియమైన వారికి, ఆత్మీయులకు, మనకు ప్రత్యేకం అనుకున్న ఎవరికైనా పైన చెప్పుకున్న రంగులను అనుసరించి గులాబీలు ఇవ్వవచ్చు.                                                 *రూపశ్రీ.

తియ్యని చాక్లెట్ డే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ప్రేమకు ప్రేమ..!

  వాలెంటైన్స్ డే హవా సాగుతోంది. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వాలంటైన్స్ వీక్ ను చాలా గొప్పగా జరుపుకుంటారు. నిజం చెప్పాలంటే విదేశాలలోనే వాలంటైన్స్ వీక్ ను బాగా గ్రాండ్ గా జరుపుకుంటారు.  అయితే వాలంటైన్స్ వీక్ లో భాగంగా  మూడవ రోజును టాక్లెట్ డే గా జరుపుకుంటారు. వాలెంటైన్స్ వారంలో మూడవ రోజు అంటే ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. చాక్లెట్  తీపిని ప్రేమ  మాధుర్యానికి చిహ్నంగా చూస్తారు. ఇది ప్రేమ, అనురాగాన్ని పెంచుతుంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.. మరొక కోణంలో చూస్తే కానీ చాక్లెట్ గుండెకు చాలా మంచిది.  అంతేకాదు మెదడు, చర్మ ఆరోగ్యంపై కూడా  ప్రభావాన్ని చూపుతుంది.  చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది, దానిని సరైన పరిమాణంలో, సరైన రకంలో తింటే ఆరోగ్యానికి ఉత్తమమైనది. అయితే అతిగా తియ్యగా  ఉండే చాక్లెట్‌కు దూరంగా ఉండాలి. చాక్లెట్‌ను సమతుల్య పద్ధతిలో తీసుకుంటే, అది గుండె, మెదడు, చర్మం..  ఇలా  మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ కే ఓటు.. వాలంటైన్స్ వీక్ లో భాగంగా ప్రేమికులు తమ బంధానికి గుర్తుగా చాక్లెట్ లు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే చాక్లెట్ లో కూడా డార్క్ చాక్లెట్ ఏ బెస్టు.. ఎందుకంటే డార్క్ చాక్లెట్ వల్ల ఆరోగ్యం బేషుగా ఉంటుంది.  ఎప్పుడైనా చిరాకుగా అనిపిస్తే ఒక ముక్క డార్క్ చాక్లెట్ తింటే వెంటనే  యాక్టీవ్ అయిపోచ్చట. చాక్లెట్ ఏ ఎందుకు? వాలెంటైన్స్ వీక్ లో చాక్లెట్ డేను ఎందుకు ఏర్పాటు చేసారు?  మన లడ్డు లేదా పాయసం లాంటివి ఎందుకు లేవు అనే డౌట్ కూడా వస్తుంది.  ఇది పూర్తీగా విదేశీయుల వేడుక. విదేశాలలో తీపి అంటే చాక్లెట్ ఏ.. వారి ఆహారంలో కూడా చాలా వరకు చాక్లెట్ ఆధారిత పదార్థాలు ఉంటాయి.  చాక్లెట్ సాస్,  చాక్లెట్ కేక్, చాక్లెట్ పుడ్డింగ్, చాక్లెట్ బ్రెడ్.. ఇలా అన్నివిధాలుగా చాక్లెట్ భాగం. ఇక చాక్లెట్ ఉత్పత్తి కూడా విదేశాలలో ఎక్కువ. దీనికి తగినట్టు చాక్లెట్ తయారీకి ఉపయోగించే కోకో బీన్స్ ఉత్పత్తి కూడా అక్కడే ఎక్కువ. దాన్నే ప్రపంచ మార్కెట్ గా ఇలా మార్చేశారు.  ఇక ఈ చాక్లెట్ లలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. డార్క్ చాక్లెట్ లో  ఫ్లేవనాయిడ్లు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే ఫ్లేవనాల్స్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడానికి ధమనుల లైనింగ్‌ను ప్రేరేపిస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ ధమనులను సడలించి, రక్త ప్రవాహానికి అడ్డు లేకుండా సాఫీగా జరిగేలా చేస్తుంది.  దీనివల్ల రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది.  ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కోకో బీన్స్,  డార్క్ చాక్లెట్ రక్త ప్రసరణ,  రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. చాక్లెట్‌లో సెరోటోనిన్,  డోపమైన్‌ను పెంచే అంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి,  నిరాశను తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మెదడు పనితీరును పెంచడం ద్వారా ఏకాగ్రత,  జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.   డార్క్ చాక్లెట్‌ను దాదాపు 5 రోజుల పాటు రోజూ ఓ ముక్క అయినా తినడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగని అతిగా తినకూడదు. రోగనిరోధక శక్తి మరియు జీర్ణక్రియను బలపరుస్తుంది.. చాక్లెట్‌లో ఉండే ఫైబర్,  ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం,  జుట్టుకు మేలు చేస్తుంది.. డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించి యవ్వనంగా ఉంచుతాయి. చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో డార్క్ చాక్లెట్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో లభించే బయోయాక్టివ్ సమ్మేళనాలు చర్మానికి కూడా గొప్పగా సహాయపడతాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో డార్క్ చాక్లెట్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.   డార్క్ చాక్లెట్ సరైన మొత్తంలో తీసుకోవడం వల్ల  జుట్టుకు పోషణనిచ్చి బలంగా,  మెరిసేలా చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. డార్క్ చాక్లెట్ తింటే జీవక్రియ మెరుగుపడుతుంది, ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నష్టాలు కూడా.. డార్క్ చాక్లెట్ వల్ల లాభాలే కాదు  నష్టాలు కూడా ఉంటాయి.  సరైన మొత్తంలో డార్క్ చాక్లెట్ తింటే బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ అదనపు చక్కెరతో కూడిన చాక్లెట్ బరువు పెరగడానికి దారితీస్తుంది. పాలు,  తెల్ల చాక్లెట్లలో ఎక్కువ చక్కెర, కొవ్వు ఉంటాయి, ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. తీపి చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది, ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొంతమందికి చాక్లెట్ తినడం వల్ల తలనొప్పి (మైగ్రేన్లు) రావచ్చు, ముఖ్యంగా  కెఫిన్ లేదా థియోబ్రోమిన్‌కు అంటే శరీరానికి పడని వారికి ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ,  కడుపులో చికాకు కలుగుతుంది. చిన్న పిల్లలకు అతిగా తీపి చాక్లెట్ ఇవ్వడం వల్ల దంతక్షయం,  హైపర్యాక్టివిటీ ఏర్పడతాయి. చూశారా వాలంటైన్ వీక్ లో ఎంతో హ్యాపీగా తియ్యగా వేడుక చేసుకునే వారు ఆ చాక్లెట్ పర్యవసానాలు  కూడా ఆలోచించుకోవాలి మరి.                                                 *రూపశ్రీ. 

వాలెంటైన్స్ వీక్ లో ప్రపోజ్ డే ఎందుకు జరుపుకుంటారంటే..!

  ఫిబ్రవరి 7 నుండి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఈ ప్రేమ వారంలోని రెండవ రోజున ప్రపోజ్ డే జరుపుకుంటారు. తమ ప్రేమికుడికి తమ భావాలను వ్యక్తపరచాలనుకునే వారికి ఈ రోజు ప్రత్యేకమైనది. ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రేమికులు తమ భాగస్వామిని వివాహం చేసుకోమని అడగడం లేదా తమ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం కోసం ప్రతిపాదిస్తారు. ఇది వారి సంబంధానికి కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రపోజ్ డే అనేది  ప్రేమను బహిరంగంగా వ్యక్తీకరించడానికి ఒక ప్రత్యేక అవకాశం. తమ సంబంధానికి కొత్త పేరు పెట్టాలనుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన రోజు. అయితే, ప్రపోజ్ చేసే సంప్రదాయం ఎక్కడి నుండి మొదలైంది?  ఎందుకు, ఎప్పటి నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారో తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపోజ్ డే వాలంటైన్స్ వీక్‌తో నేరుగా ముడిపడి ఉంది. యూరప్,  అమెరికాలో..  18, 19వ శతాబ్దాలలో, పురుషులు అధికారికంగా ఉంగరంతో వివాహాన్ని ప్రతిపాదించారు. 20వ శతాబ్దం చివరలో వాలెంటైన్స్ వీక్  ప్రజాదరణ పెరగడంతో, ప్రపోజ్ డే కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. పాశ్చాత్య సంస్కృతిలో పాత కాలంలో, పురుషులు మోకాళ్లపై కూర్చుని తాము ఇష్టపడిన అమ్మాయిలకు వివాహం కోసం ప్రపోజ్ చేసేవారు. అయితే ఈ సంప్రదాయం నేటికీ పాటిస్తారు. ఇది జంట మధ్య ప్రేమను పెంచుతుంది. భారతదేశంలో కూడా, గత కొన్ని దశాబ్దాలుగా వాలంటైన్స్ వీక్‌తో పాటు ప్రపోజ్ డే ట్రెండ్ చాలా పెరిగింది.  చాలా కాలంగా ఎవరినైనా ఇష్టపడి, తమ భావాలను వ్యక్తపరచలేని వారికి ఈ రోజు సరైన అవకాశం. ఎందుకంటే ఈ ప్రపోజ్ డే అనేక కొత్త సంబంధాలకు నాంది పలుకుతుంది, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తమ ప్రేమను మనస్ఫూర్తిగా  అంగీకరిస్తారు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు  తన లైఫ్ పార్ట్నర్ ను స్పెషల్ గా భావించడానికి,   సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రపోజ్ డే భలే మంచి అవకాశం ఇస్తుంది.  

కాలాన్ని ఆదా చేసే కళ ఇదిగో!

మనిషి జీవితంలో విజయం అనేది స్థాయిని పెంచుతుంది.  సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవం మొదలైనవి సంపాదించి పెడుతుంది. విజయం గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. అయితే విజయం సాధించిన వ్యక్తికి మాత్రం కష్టం అంటే ఏమిటి?? కష్టం ఎలా ఉంటుంది?? కష్టం తరువాత విజయం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?? విజయ సూత్రం ఏంటి?? ఇలాంటి విషయాలు తెలిసి ఉంటాయి.  ఒక విజేతను "మీ విజయరహస్యం ఏమిటి?" అని ప్రశ్నించినప్పుడు  "నేను జీవితంలో  విజయాలు సాధించడానికి కారణం నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే హాజరు కావటమే” అని అన్నాడట! మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నా, ఎంత కష్టపడేతత్వం ఉన్నా చేసే పని ఇంకా మిగిలుందే అని కాలాన్ని పట్టుకుని ఆపలేడు. నిరంతర ప్రవాహిని లాగా కాలం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే చేసే పనిపట్ల అవగాహన పెంచుకుంటే కాలాన్ని ఆదా చేయవచ్చు. నిర్ణీత సమయంలో పని పూర్తి కావాలంటే ఆ పనిని వేగంగా, సమర్థవంతంగా చేయడం ఒకటే మార్గం. చేసే పని గురించి అవగాహన పెంచుకుంటే సమయాన్ని ఆదా చేసే కళ తెలుస్తుంది. సమయాన్ని ఆదా చేయడం కూడా ఒక కళనా అని అనిపిస్తుందేమో!!  కాలాన్ని ఆదా చేయడమనే కళ!! మనం నిత్యం చేయవలసిన పనులను అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో రూపొందించుకోవాలి. ఈ ప్రక్రియనే కాలాన్ని ఆదాచేసే కళ అంటారు. క్రమపద్ధతిలో రూపొందించుకోవడం అంటే ప్రతిరోజూ చెయ్యాల్సిన పనులను సమయ ప్రణాళిక వేసుకుని ఒక పట్టిక రూపొందించుకోవడం. అయితే ఇలా రూపాందించుకోవటంతోనే సమేక్మ్ ఆదా అయిపోదు. రూపొందించుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. ఆచరించినప్పుడే సరైన ఫలితం. దక్కుతుంది.   “నిన్న జరిగిన దానిని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఈ రోజు కూడా వృధా చేసుకోవటం నిరర్ధకం. నిన్నటికంటే ఈరోజు మనిషిలో ఆలోచనాపరంగా బుద్ధి వికాసం కలగాలి. అలా కలగకపోతే  మన జీవితంలో మరొక రోజు వ్యర్ధమవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎంత గొప్పగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటాం అనేది మన ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది.  గడిచి పోయిన క్షణాలు తిరిగిరావు, అలాంటప్పుడు గడిచిపోయిన కాలంలో ఎలాంటి బాధపెట్టే విషయాలు ఉన్నా వాటిని తలచుకుంటూ బాధపడకూడదు.  ఏపుగా పెరిగిన పైరుని కోయకపోతే దాని పరమార్ధం దెబ్బ తింటుంది. అలాగే వికసించిన పూలను కోసుకోకపోతే వాటి ప్రయోజనమే దెబ్బ తింటుంది. అదే విధంగా వయస్సులో ఉన్నప్పుడే కష్టపడాలి. ఎందుకంటే ఆలస్యమయితే కాలం మన చేతిలో ఉండదు. గడిచిపోయే ప్రతి నిమిషం తన విలువను గుర్తుచేసే సందర్భాలు భవిష్యత్తులో అప్పుడప్పుడూ ఎదురవుతాయి. ఆ సందర్భాలలో " అయ్యో!! అప్పుడు ఆ కాలాన్ని అలా వృధా చేయకపోతే ఇప్పుడు ఇలా కలలను కోల్పోయి ఉండను కదా!!" అనుకునేలా ఉంటుంది మనసు పరిస్థితి. ఈ సెకను, ఈ నిమిషం, ఈ రోజు నాది. నేను ఏ పనినైనా చేయగలను అనుకునేవాడిదే ఈ ప్రపంచం. కాలానికి ఎదురుపడి ప్రయాణం చేసేవాడే విజేత. ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది అనే విషయం మర్చిపోకూడదు. కాలాన్ని సరిగా అర్ధం చేసుకున్నవాడే జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలడు.  మనం నిమిషాల గురించి జాగ్రత్త పడితే గంటలు అవే జాగ్రత్త పడతాయి. రూపాయలను పొదుపుచేస్తే వేలు అయినట్టు, కాలం ఆ విధంగానే పొదుపు అవుతుంది. కాలాన్ని దుర్వినియోగం చేసుకునే వారు ఎప్పుడూ పరాజితులుగా మిగిలిపోతారు. మరికొందరు పరాజయానికి, కాలం వృధా అవ్వడానికి సాకులు వెతికి వాటిని చూపిస్తుంటారు. వాటివల్ల ఇతరులను నమ్మించగలరేమో కానీ అలా తనని తాను మభ్యపెట్టుకోవడం తనని తాను మోసం చేసుకోవడం అవుతుంది. దానివల్ల ఇతరులకంటే అలా సాకులు చెప్పేవారికే నష్టం. అందుకే   ప్రతి ఒక్కరూ కూడా కాలాన్ని ఆదా చేసే కళ నేర్చుకుంటే జీవితంలో విజేతలుగా గుర్తించబడతారు.                                        ◆నిశ్శబ్ద.

పాత తరపు విలువల పాఠశాల, ఈ బుర్ర కథ వేదిక.....

  ఇప్పటి రోజుల్లో టీ.వీ, సినిమాలు, సోషల్ మీడియా, రికార్డింగ్ డ్యాన్సుల మైకంలో పడిన జనాలకి   ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ విలువ తెలియట్లేదేమో కానీ, ఒకప్పుడు ఊరిలో బుర్రకథ ఉందంటే చాలు  పిల్లా పిచ్చుకతో సహా ఊరు ఊరంతా ఆ స్టేజి ముందే వాలిపోయేవారు. అప్పట్లో బుర్ర కథని మించిన వినోదం లేదనే చెప్పాలి. అలాంటి బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన  షేక్ నాజర్ ఒక గొప్ప నటుడు, ప్రజారచయిత, గాయకుడు.   బుర్రకథ కోసం ఆయన  చేసిన కృషివల్ల  బుర్రకథా పితామహుడయ్యాడు.  “ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ,సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడాయన.. ఈ రోజు ఆయన జన్మదిన సంధర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే.....  షేక్ నాజర్ జీవిత విశేషాలు..... ఆయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద  ముస్లిం కుటుంబంలో, 1920, ఫిబ్రవరి 5 వ తేదీన జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". అతను కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణి, భక్త రామదాసులో ఛాందిని వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. హార్మోనిస్టు ఖాదర్ అతనిని "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించాడు. కానీ పేదరికం వల్ల నాజర్ అక్కడ  ఉండలేకపోయాడు. తరువాత అతను బాలమహ్మదీయ సభ పేరిట మళ్ళీ నాటకాలాడి మంచిపేరు తెచ్చుకున్నాడు. టైలరుగా కూడా పని చేశాడు.  ఆర్యమత సిద్ధాంతం నచ్చటంతో మాంసాహారం తినటం మానేసాడు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి పాత్రలు పోషించాడు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యాడు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు.  పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు చారిత్రక కథలకి  సమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు.   నాజర్‌ ఆత్మకథ  ‘పింజారి’ చిన్న పుస్తకమే అయినప్పటికీ తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్చుకోవటానికి  ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చింది అనే విషయాలన్నీ వివరంగా చెప్పాడు.  తనను చేరదీసి, అన్నం పెట్టిన, విద్య నేర్పిన  మహా పండితుల నుండి విద్యలో  తనకంటే  చిన్నవారి  నుంచి కూడా తానేం నేర్చుకున్నానో పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. చివరికి నలబై సంవత్సరాల నాటక ప్రస్థానం ముగిస్తూ, 1997లో  ఫిబ్రవరి 22 న అంగలూరులో మరణించారు.  కళకే ‘కళ’ తెచ్చిన ఆయన ప్రతిభ ...... షేక్‌ నాజర్‌ తన హావభావాలతో, ఆటపాటలతో  జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు. ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే  అనే పాత  సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి.  తెలుగు చిత్ర పరిశ్రమలో  గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారికి పూలరంగడు సినిమా కోసం ఈ  విద్యని నేర్పించాడు. అతని గళ గాంభీర్యానికి , మాధుర్యానికి మంత్రముగ్ధులైన సినీ ప్రముఖులు సినీ రంగంలో స్థిరపడమని చెప్పినా కూడా ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆయన రాసిన ఆసామీ  నాటకానికి 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ లభించింది.  ప్రశంసలు- సత్కారాలు..... తెలుగు సినీ నటకిరీటుల్లో ఒకరైన ఎన్‌టిఆర్ గుంటూరుకు వచ్చినప్పుడు నేను మీ అభిమానినని నాజర్ చెప్పిన మాటకి  ‘నేను... మీ అభిమానినని’ చెప్పి అందరినీ ఆనందపరిచారు. ప్రముఖ రచయిత  శివప్రసాద్ "నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది. హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు" అని అన్నారు. ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది. 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది. నేటి తరం మన జాతి కోసం కృషి చేసిన ఇలాంటి మహానుభావులెవరినీ మరవకూడదు. మన ప్రాచీన సంస్కృతిని, జానపద కలలని అసలే  మర్చిపోకూడదు. అలా మర్చిపోయామంటే మన ఉనికిని మనం మర్చిపోతున్నట్టే.                                        *రూపశ్రీ

నీ ఆత్మ బలం నీ  మరణాన్ని కూడా వెనక్కి నెడుతుంది...

  హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాక  క్యాన్సర్  ఉందని  నిర్ధారిస్తే లేనివాడయినా, ఉన్నవాడయినా వాళ్ళ కాళ్ళ క్రింద భూమి కదిలినట్టే ఫీలవుతారు.  ఏటా లక్షలమంది ప్రాణాలని పిండేస్తూ, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా కొనసాగుతోన్న ఆ మాయదారి రోగం క్యాన్సర్... ప్రపంచమంతటా ఇది చాపకింద నీరులా అల్లుకుంటుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెలువరించిన డేటా ప్రకారం, 2022లో క్యాన్సర్ దాదాపు కోటిమంది  ప్రాణాలను బలిగొంది. కాలక్రమేణా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.  ఇంతటి ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, తగిన  చర్యలకు ప్రేరేపించడానికి, క్యాన్సర్ భూతాన్ని నిర్మూలించడానికి  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి మరింత తెలుసుకుంటే..  ఎప్పుడు మొదలైంది.. 2000, ఫిబ్రవరి 4న పారిస్‌లో జరిగిన ప్రపంచ క్యాన్సర్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రకటించారు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ నిర్వహించిన ఈ కార్యక్రమం, క్యాన్సర్ ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చేందుకు, దీని నివారణకు చర్యలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2025 థీమ్.. ఈ సంవత్సరానికిగానూ,  "యునైటెడ్ బై యూనిక్"  అనే థీమ్ ఎంచుకున్నారు. ఇది 2025-2027 మూడేళ్ల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. ఈసారి జరిగే  ప్రచారంలో  క్యాన్సర్ చికిత్సలో వ్యక్తిగత అనుభవానికి ప్రాముఖ్యతనిస్తారు.  ప్రతి క్యాన్సర్ రోగి ప్రయాణం భిన్నమైనదని గుర్తించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అవగాహన చాలా ముఖ్యం.. క్యాన్సర్  వచ్చిందంటే ఇంకేమీ చేయలేము అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ ముందుగా గుర్తించగలిగితే చాలా మటుకు క్యాన్సర్లని  తగ్గించే వైద్యం అందుబాటులో ఉంటుంది. అందుకే దీనిపట్ల అవగాహన ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తించగలుగుతారు.  తక్కువ, మద్య ఆదాయ దేశాలు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా క్యాన్సర్ ముప్పును ఎదుర్కోవడంలో ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అలాగే, నిరక్షరాస్యత, క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం కావడం, ఖర్చుతో కూడుకున్న చికిత్స కారణంగా క్యాన్సర్‌ కు వైద్యం అందరికీ అందడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం నిర్ధారణను ఆలస్యం చేస్తుంది. 2020లో భారతదేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్యాన్సర్ రోగులలో చాలామంది ముందుగా చికిత్స పొందటానికి వచ్చే సమయానికి అప్పటికే వారి వ్యాధి తీవ్ర స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు. అందుకే శరీరంలో మార్పులని గమనించటంలో,  క్యాన్సర్ లక్షణాలు గుర్తించటంలో కాస్త అవగాహన అందరిలోనూ ఉండాలి. క్యాన్సర్ కేవలం పెద్దవాళ్లలోనే వస్తుంది తప్ప పిల్లలకి రాదు అని, షుగర్  వల్ల  క్యాన్సర్ పెరుగుతుందని, క్యాన్సర్ వైరస్ ద్వారా వస్తుందని.. ఇలా ఎన్నో అపోహలు, భయాలు సామాన్య జనంలో ఉంటుంటాయి. క్యాన్సర్ పట్ల తగిన అవగాహన లేకపోవటమే దీనికి కారణం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తక్కువ,  మధ్య ఆదాయ దేశాల్లో, క్యాన్సర్ స్క్రీనింగ్, నిరోధక చర్యలు, చికిత్సల గురించి అవగాహన తక్కువగా ఉంది. ఇది క్యాన్సర్ వ్యాప్తిని పెంచే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ నివారణ, ముందుగా గుర్తించడం, చికిత్స చేయడంలో ఉన్న ప్రాముఖ్యతను అందరికీ గుర్తు చేస్తుంది.  మంచి అలవాట్లు.. సిగరెట్, బీడీలు కాల్చే అలవాటున్నవాళ్ళు, మందు తాగేవాళ్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తీసుకునేవారు  అవన్నీ తక్షణమే మానుకోవాలి. టీవీల్లో ,సినిమాల్లో బయట ఇలా ఎన్నిచోట్ల ప్రచారం చేసినా వీటిని మానడం లేదు.  వీటిని మానేస్తే నోరు, గొంతు, కాలేయం వంటి భాగాలకి వచ్చే క్యాన్సర్ రాకుండా ఆపొచ్చు.  క్రమం తప్పకుండ వ్యాయామం చేయటం వల్ల బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ ముప్పునుంచి తప్పించికోవచ్చు.  హెచ్‌పి‌వి, హెపటైటిస్ బి వంటి వ్యాక్సిన్లు తీసుకోవటంవల్ల గర్భాశయ, కాలేయ క్యాన్సర్లను నిరోదించవచ్చు. మంచి పోషకాహారం తీసుకోవటం, శరీరంతో పాటూ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఒత్తిడిని తగ్గించుకోవటం, క్రమం తప్పకుండ వైద్య పరీక్షలు చేసుకోవటం వంటి అలవాట్ల వల్ల మనం ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. క్యాన్సర్ రోగులకి అండగా నిలవాలి..  క్యాన్సర్  దినోత్సవం సాక్షిగా నైతిక భాద్యతతో ప్రజలంతా క్యాన్సర్ రోగులకి మానసికంగా, ఆర్ధికంగా  అండగా నిలబడాలి.  క్యాన్సర్ రాకుండా ఉండేలా ఎలా జాగ్రత్తపడాలి, ఏం చర్యలు తీసుకోవాలి వంటివాటి గురించి అవగాహన కల్పించాలి. అందరూ మంచి జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించాలి.  ఆధునిక సమాజంలో క్యాన్సర్ కారకాలుగా మారుతున్న విషయాల మీద కలిసి పోరాడాలి.                                         *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని మీద ఆధారపడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా  జీవితాల్లో అతిపెద్ద మలుపు తీసుకునేది పెళ్లితోనే. సింపుల్ గా పెళ్లికి ముందు, పెళ్ళి తరువాత అనే  వ్యత్యాసాన్ని చెప్పేయచ్చు. ఉమ్మడి కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సర్కిల్ ఎక్కువగా  ఉంటే ఆటోమేటిక్ గా పెళ్లి వయసొచ్చిన యువతీయువకుల కోసం పెళ్లి సంబంధాలు అంటూ కబుర్లు వస్తూనే ఉంటాయి. కానీ యెవరికి ఎవరే యమునాతీరే అనేట్టు ఉన్న నేటికాలం జీవితాలల్లో సంబంధాల కోసం ముందుకొచ్చి సహాయం చేసే చుట్టారు, స్నేహితులు తక్కువే. పైపెచ్చు మంచి సంబంధాలు కావాలనే కారణంతో చాలామంది  దగ్గరలో ఉన్నవాటిని పట్టించుకోరు. మంచి సంబంధాల కోసం మ్యాట్రిమోనిలో వెతుకుతుంటారు. అయితే మ్యాట్రిమోనిలో సంబంధాలు వెతికేవారు ఈ కింది విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రోపైల్ గూర్చి అవగాహన ఉందా? పెళ్లి సబంధాల కోసం మ్యాట్రిమోనిలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో వరుడు లేదా వధువు ప్రోపైల్ విషయంలో అవగాహన ఉండాలి. వధువు లేదా వరుడి ఫ్రోపైల్స్ రెండు రకాలుంటాయి. ఒకటి ప్రీ ఫ్రోపైల్, రెండు పెయిడ్ ఫ్రోపైల్. ఫ్రీ ప్రోఫైల్ అనేది ముందునుండే ఉన్నది. పెయిడ్ ఫ్రోపైల్ అనేది మ్యాట్రిమోనికి డబ్బు కట్టి క్రియేట్ చేయించుకునేది. దీంట్లో చాలావరకు పేక్ ఉంటాయి. అధికశాతం మంది ఇక్కడే మోసపోతారు. సామాజిక మాద్యమంతో జాగ్రత్త.. సోషల్ మీడియా ఇప్పుడు చాలా భీభత్సంగా  మారింది.  కాస్త మాటలు మొదలైతే చాలు  ఎంతో సులువుగా దగ్గరైపోయేవారు ఉన్నారు. సన్నిహింతంగా మాట్లాడగానే వ్యక్తిగత సమాచారం షేర్ చేసేవారున్నారు. వీటి వల్ల  భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి పొరపాటున కూడా వివరాలు ఎవరికీ ఇవ్వకండి. దూరమే శ్రేయస్కరం.. పెళ్ళి ఖాయం అయినా పెళ్ళి పూర్తయ్యే వరకు కాబోయే భార్యాభర్తలను అస్సలు కలవనిచ్చేవారు కాదు ఒకప్పుటి పెద్దలు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి పిక్స్ అనే మాట వినగానే పెళ్లి జరగడానకి ముందు బోలెడు సార్లు కలుస్తారు. షాపింగ్ చేస్తారు. టూర్లకు కూడా వెళతారు. కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండటం మంచిది. పెళ్లి జరిగే వరకు అమ్మాయిలు తమను తాము సేప్టీగా ఉంచుకోవడం మంచిది. అదే విదంగా సోషల్ మీడియా పరిచయాలు ప్రేమ, పెళ్లికి దారితీస్తే పెద్దల నిర్ణయం తరువాతే వాటి విషయంలో ప్రోసీడ్ అవ్వడం మేలు. మనీ మాటర్స్.. పెళ్లి ఓకే అనగానే కొందరు, పెళ్లి వలలోకి లాగడానికి కొందరు, పెళ్లి పేరుతో మోసం చెయ్యడానికి మరికొందరు డబ్బును, బహుమతులను ఇవ్వడం, ఆశించడం చేస్తారు. అయిచే పెళ్లి  జరిగే వరకు ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిది.  

తీరమైనా, సముద్రమైనా  మీ రక్షణకి మేమున్నాం....

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలని పరిశీలిస్తే అవన్నీ  ఎగుమతులు, దిగుమతులు మీదనే ఆధారపడ్డాయని తెలుస్తుంది. మరి ఈ ఎగుమతులు, దిగుమతులు దేని మీద ఎక్కువ ఆధారపడ్డాయంటే దానికి  సమాధానం తీరప్రాంత ఓడరేవులు, సముద్ర మార్గాలనే  చెప్పాలి. మరి ఇంత ముఖ్యమైన తీరప్రాంతాన్ని, సముద్రాన్ని కాపాడటానికి రక్షకుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పొడవైన తీరప్రాంతం కలిగిన దేశాల్లో ఒకటైన  మన దేశ తీరాన్ని, మన సముద్ర సరిహద్దుని ఎల్లవేళలా కాపాడటానికి  మనకీ ఒక రక్షణ దళం ఉంది. అదే ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసిజి)....  ఈ ఐసిజి  స్థాపనను గౌరవిస్తూ,  వీరు సముద్ర భద్రత కోసం చేపట్టిన కీలక బాధ్యతలను గుర్తు చేసుకుంటూనే…  దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను రక్షించటం కోసం ఎన్నో  సాహసోపేతమైన పనులు చేస్తున్న కోస్ట్ గార్డుల  కృషిని గౌరవించేందుకు ప్రతీ సంవత్సరం  ఇండియన్ కోస్టుగార్డ్ డే జరుపుకుంటాము. 2025లో  ఐసిజి తన 49వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ  సంధర్భంగా మన కోస్ట్ గార్డ్ ప్రయాణం గురించి తెలుసుకుంటే….  ఇండియన్ కోస్టుగార్డ్(ఐసిజి)  ఎప్పుడు మొదలైంది....   ఫిబ్రవరి 1, 1977న తీర సంరక్షణ దళ చట్టం  చేయటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టాపించబడింది. అయితే 1978లో  భారత పార్లమెంట్  దీన్ని ఆమోదించటంతో  అధికారిక గుర్తింపు లభించింది.  అప్పటి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ సారథ్యంలో ఇండియన్ కోస్టుగార్డ్ ఏడు నౌకలతో అధికారికంగా స్థాపించబడింది. ఐసిజి  ఒక రక్షణ దళమే తప్ప మిలిటరీ విభాగం కాదు.  ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యలయం ఢిల్లీలో ఉంది.  ఐతే మొదట కేవలం ఏడు నౌకలతోనే  మొదలైన దీని ప్రయాణం ఇప్పుడు 158 నౌకలు, 78 విమానాలతో, సాంకేతిక పరికరాలతో శక్తివంతంగా మారి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద కోస్ట్ గార్డుగా నిలిచింది. ఇది 2030 నాటికి 200 నౌకలు, 80 విమానాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇండియన్ కోస్టుగార్డ్  ఏం చేస్తుంది..... ఈ దళం  నినాదం: “వయం రక్షామహ”,  అంటే దీనర్ధం “మేము రక్షిస్తాము” అని. ఈ మాట నిజం చేస్తూనే దాదాపు అర్ధ శతాబ్ధం నుంచి ఐసిజి మన తీరాన్ని, మనల్ని రక్షిస్తూ వస్తుంది.  సముద్ర ప్రాంతాల్లో కృత్రిమ ద్వీపాలు, ఆఫ్‌షోర్ టెర్మినల్స్, ఇతర నిర్మాణాల రక్షణ & భద్రతను చూసుకుంటుంది.  ఎల్లప్పుడూ భారత తీర రేఖను గస్తీ కాస్తూ, అక్రమ కార్యకలాపాలైన    స్మగ్లింగ్, సముద్ర దొంగతనాలు, ఇతర నేరాలను అరికడుతుంది. . తుఫాన్లు, సహజ విపత్తుల సమయంలో  సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులకు సహాయం అందించి రక్షిస్తుంది. సముద్ర  కాలుష్యం జరగకుండా  నియంత్రణ, నివారణ చర్యలు తీసుకుంటూ,   సముద్ర పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. అరుదైన సముద్ర జీవులను రక్షిస్తుంది. ఇది ఇండియన్ నేవీ,  మత్స్య శాఖ, కస్టమ్స్,  కేంద్ర-రాష్ట్ర పోలీసు విభాగాలతో సమన్వయం చేస్తూ  అక్రమ రవాణా జరగకుండా ఆపుతుంది. భారత సముద్ర పరిధుల చట్టం  అమలు జరిగేలా చూస్తుంది. మన సముద్ర పరిధిలోకి ఇతర దేశాలవారు  అక్రమంగా రాకుండా నివారిస్తుంది. సముద్రంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సైంటిఫిక్  డేటాను సేకరించి, యుద్ధ  సమయాల్లో నౌకాదళానికి మద్దతు అందిస్తుంది. భారత సముద్ర జలాల్లో చమురు లీకేజీ జరిగితే, దాన్ని తొలగించడానికి మొదటగా ఇండియన్ కోస్టుగార్డ్ స్పందిస్తుంది. ఇండియన్ కోస్టుగార్డ్ చేస్తున్న కృషిని గుర్తించాలి...... సముద్రంలో ఒక షిప్పులో ప్రయాణించటం అందరూ అనుకున్నంత సరదాగా ఏమీ ఉండదు. అదీ కాక దేశ రక్షణ కోసం పనిచేస్తున్న కోస్టల్ గార్డ్ షిప్పులో ఉన్నవారికి  అది ఎన్నో సవాళ్ళతో కూడుకున్న ప్రయాణం. ప్రతీరోజు కొత్తగా, సాహసోపేతంగా ఉంటుంది. ఈ విశాల నీలి సముద్రంలో  పగలు, రాత్రి అని చూడకుండా అహర్నిశలు మన దేశ సముద్ర సరిహద్దులని గస్తీ కాస్తున్న కోస్ట్ గార్డుల జీవితం అంత సులభంగా ఉండదు.  సముద్రంలో చిన్న చిన్న దారి దోపిడీలు చేసే దొంగల చేతికి కూడా ఆధునిక మారణాయుధాలు  అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో  ఒక కోస్టల్ గార్డ్  తన కర్తవ్యం నెరవేర్చటం ఎంత కఠినమో, ఎంత సాహసమో ఆలోచించాలి.  భారతదేశ తీరప్రాంతంలో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.  సుమారు 7516 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది కొత్త ఆధునిక సాంకేతిక లెక్కల ప్రకారం సుమారు 11000 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. పైగా మన భారతదేశం అనేక దేశాలకి దగ్గరగా ఉండటంతో పాటూ, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సంప్రదాయ సముద్ర వాణిజ్య మార్గం దగ్గరగా కూడా ఉంటుంది. మరి ఇటువంటి బౌగోళిక పరిస్థితులున్న  మన దేశ తీరాన్ని, సముద్ర సరిహద్దులని కాపాడటంలో మన కోస్టుగార్డులు  ఎంతలా కృషి చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి.  ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సంధర్భంగా  ఎంతో సేవ చేసిన, చేస్తున్న మన రక్షకులకి సలాం!                              *రూపశ్రీ.