మనిషిలో విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా?

అనగనగా ఓ రాజ్యం ఉండేది.  ఆ రాజ్యానికి ఓ రాజున్నాడు, రాణి కూడా ఉంది. ఆ రాజ్యంలో ఓ సన్యాసి కూడా ఉన్నాడు. ఆ సన్న్యాసి ప్రత్యేకత ఏమిటంటే, అతడు అబద్ధం వినలేడు. అబద్ధం ఆయన చెవిన పడిన వెంటనే అది అబద్దం అని ఆయనకు తెలిసిపోతుంది. దాని కారణం వల్ల ఆయన తన తల మీదున్న ఓ వెంట్రుకని లాగి పడేసేవాడు. అది ఆయనకు అలవాటో లేక అది అందులో ఏదైనా రహస్యం ఉందొ ఎవరికీ తెలీదు. కానీ అలా అబద్దం వినగానే వెంట్రుక లాగి పడేయడం ఆ రాజ్య రాజుకి తెలిసింది. ఆయన గొప్ప సన్యాసి అనే కారణంతో పట్టణం పొలిమేరల్లో ఉన్న వనంలో ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చాడు రాజు.  అయినా సరే, ఏవో అబద్ధాలు ఆయన చెవిన పడుతూనే ఉన్నాయి. ఆయన వెంట్రుకలు పీక్కుంటూనే ఉన్నాడు. చివరికి ఆయన తలపై ఒకే వెంట్రుక మిగిలింది. అదొక్కటే పోతే ఆయన మరణిస్తాడు అని తెలిసి ఆ సన్యాసి ఉంటున్న ఆశ్రమ పరిసరప్రాంతాలలో ఎవరూ మాట్లాడకూడదని ఆజ్ఞ జారిచేసాడు రాజు.

రాజు ఆజ్ఞ ప్రకారం అక్కడ ఎవరూ తిరిగేవారు కాదు, ముఖ్ట్లాడేవారు కూడా కాదు. 

పట్టణం పొలిమేరలో ఆశ్రమానికి పక్కనే ఒక తోట ఉంది. అది రాజుగారి తోట. ఓ రోజు రాజు, రాణి తోటలో విహరిస్తున్నారు. శృంగారసరససల్లాపాలు ఆడుతున్నారు. రాణి మీదకు ఓ పువ్వు విసిరాడు రాజు, ఆ దెబ్బకు తట్టుకోలేక పడి పోయినట్టు నటించింది రాణి. వెంటనే రాజు ఆమెకు ఉపశమనాలు చేయటం ప్రారంభించాడు. ఇంతలో రాజుకు 'హుం'కారం వినిపించింది. 

"అంతా అబద్ధం నటన!" అంటూ అరుస్తూ రాజు, రాణి ఉన్నచోటుకు వచ్చాడు సన్న్యాసి.

"నాకు తెలుసు, రాణికి దెబ్బ తగలలేదు. అంత సుకుమారి కాదామె!" అని అరచి, తలమీద ఉన్న ఒక్క వెంట్రుక పీకేసుకుని అక్కడే పడి మరణించాడు సన్న్యాసి. జరిగిందానికి రాజు విచారించాడు. ముఖ్యంగా సన్న్యాసి విచక్షణరాహిత్యానికి మరింత విచారించాడు. ఎందుకంటే, రాణిది నటనే అయినా శృంగార సమయంలో అది చెల్లుతుంది. ఇది అర్థం కాని సన్న్యాసి మాటల అర్థం వెంట పడ్డాడు కానీ సందర్భాన్ని పట్టించుకోలేదు. సందర్భాన్ని బట్టి మనుషుల మాటల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలనేది ఇక్కడి విషయం.

పిల్లలకు బ్రహ్మభావన వివరించేటప్పుడు ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాలి. "ప్రపంచమంతా బ్రహ్మమయం" అన్న భావనను అపార్థం చేసుకునే  మూర్ఖులు ఉన్నారు ఈ ప్రపంచంలో.  ప్రపంచమంతా బ్రహ్మమయమై, అంతా ఆయన ఇష్టప్రకారం జరిగితే మనం చేసేదేం లేదు. అంతా కర్మప్రకారం జరుగుతుందని చేతులు ముడుచుకుని కూర్చునే ప్రయత్నాలు చేస్తారు కొందరు. అబద్ధాల విషయంలో సన్న్యాసి ప్రదర్శించిన మూర్ఖత్వం లాంటిదే ఇది కూడా.

కాబట్టి సృష్టికర్తపై మనుషులకు ఉన్న విశ్వాసం ఆ వ్యక్తిలో శక్తిలా ఎదగాలి తప్ప, బలహీనతలా మారకూడదు. బలహీనతలా ఎలా మారుతుందో మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం నిజజీవితంలో వాటిని  అనుభవిస్తూనే ఉంటాం కూడా.. దాన్ని శక్తిగా మార్చుకోవడమే మనుషుల్లో ఉండాల్సిన గుణం. 

                                   ◆నిశ్శబ్ద.

Advertising
Advertising