జీవితంలో ఎదగాలన్నా, ఆగిపోవాలన్నా కారణం ఇవే!

మనిషి జీవితంలో వర్తమానం మాత్రమే చాలా ముఖ్యమైన అంశం. అయితే గతం అనేది అనుభవాలు మిగులుస్తుంది, అదే జ్ఞాపకాలను మనదగ్గర వదిలిపోతుంది. ఆ జ్ఞాపకాలను తలచుకుంటూ ఉంటే గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉన్నట్టే. చాలామంది గతంలో ఇలా అని వాటి గురించి ఆలోచిస్తూ వర్తమానంలో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. 

గతాన్ని, వర్తమానాన్ని రెంటినీ సరిచూసుకుంటూ గతాన్ని తలచుకుంటూ అక్కడే ఉండిపోతారు కొందరు. వర్తమానంలో లక్ష్యాలను నిర్ణయించుకోవాలి, ఆ లక్ష్యాలను సాధిస్తూ వ్యక్తిత్వాన్ని క్రమంగా ఒక ఉన్నత స్థాయికి చేర్చుకోవాలి. అప్పుడే వ్యక్తిత్వం ఎదిగినట్టు అవుతుంది. మనుషులకు సంస్కారం ఎంతో ముఖ్యం. ఒక సమాజ పౌరుడిగా, నాయకుడిగా, ప్రతిభ కలిగిన కళాకారులుగా, గొప్ప ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలుగా ఈ సమాజంలో రూపాంతరం చెందాలి. అప్పుడే సమాజం ముందుకు సాగుతుంది. గతాన్ని గురించి ఆలోచించే వ్యక్తుల వల్ల సమాజం, కులం, దేశం ముందుకు కదలకుండా అభివృద్ధి అనేది లేకుండా అక్కడే ఆగిపోతాయి. వారి అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. ఈ ప్రపంచం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం మనిషి ఆదిమకాలం నుండి అక్షరాస్యుడిగా ఎదగడం అనే విషయాన్ని అందరూ చూపిస్తారు. అయితే గతాన్ని గురించే ఆలోచించేవారు ఆధునిక సమాజంలో ఆదిమానవులు జీవించినట్లుగా ఉంటుంది. అంటే అభివృద్ధి శూన్యమని అర్థం.

ఎప్పుడూ గతానికి అనుకూలంగా బతకకూడదు. మనిషి జీవితం ఎలా ఉండాలంటే వర్తమానం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తున్నట్టు ఉండాలి. అంటే వర్తమానం నుండి గతం ఆలోచించడం అనేది ఇంకా వెనక్కు వెళ్తున్నట్టు అని అర్థం.  అనవసరమైన భయాలు, అనుమానాలు వదిలివేయాలి. ఈ ప్రపంచంలో సంస్కృతి, అలవాట్లు గతంనుంచి వస్తున్నవే. అవి ఇప్పక్టికిప్పుడు పుట్టి మనుషుల్ని నసహణం చేయలేదు. సంస్కృతి, అలవాట్లు అనేవి ఎప్పుడూ జీవితంలో ఎదుగుదలకు ఆటంకాలు కాకూడదు. జీవితంలో ఎదుగుదలకు ఇబ్బంది అయ్యే ఆలోచనలను, స్నేహాలు, న్యాయకత్వాలను వదిలేసుకోవాలి. 

 ఈకాలంలో మనిషి తనకు తాను ఎంపిక చేసుకోగలిగినన్ని అవకాశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇది రాజులకాలం నాటి పాలన కాదు, భూస్వాముల నాటి అజమాయిషీ కాదు, కుల వ్యవస్థలో కూరుకుపోయే దశ కాదు. ఇది మనిషి చైతన్యవంతుడై ఈ ప్రపంచాన్ని శాసించవలసిన పారిశ్రామిక సమాజం, ప్రజాస్వామిక సమాజం, ప్రపంచీకరణ పొందుతున్న ప్రజాస్వామిక సమాజం. జీవితాన్ని గెలుచుకోవడం వైపే మనుషుల ఆలోచనలుండాలి. జీవితాన్ని గెలుచుకోవడానికి స్ఫూర్తిని ఇచ్చే వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే మనిషి ఆలోచన మారుతుంది. 

ఈ ప్రపంచంలో మనిషిని ఒక వృత్తంలో ఉంచడానికి ఎన్నో పద్ధతులను, మరెన్నో విషయాలను నిర్ణయించారు. వీటిలో మతాలు, మతాల విశ్వాసాలు కూడా ఒకటి. ఎన్నో సిద్ధాంతాలు మనుషుల్ని కొన్ని అవకాశాలకు దూరం చేస్తాయి  వాటిని నమ్మితే మంచి, లేకుంటే చెడు అన్నట్టు అవి నొక్కి వక్కాణిస్తాయి. కానీ నిజానికి ఇలాంటి ఆలోచనలే నిజమైన సమస్యలు సృష్టిస్తాయి. ఈ ప్రపంచంలో మనిషి ఎదుగుదలకు తెలివి, కష్టం, ఆత్మవిశ్వాసం వంటివి మాత్రమే దోహదం చేస్తాయి తప్ప మతవిశ్వాసాలు, మతపరమైన నమ్మకాలు కాదు.

ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచించాలి. హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే విషయం పూర్తిగా అర్థమవుతుంది. మతపరమైన కారణాల వల్లనో, ఇతర కోణాల్లోనో ఆలోచిస్తే వాటిలో ఖచ్చితమైన సారాంశం అర్థం కాదు. ఏదైనా మనసును కల్లోలం చేస్తే దాన్నుండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడాలి. ఎదుగుదలకు తగిన నమ్మకాలు ఏర్పరుచుకోవాలి. నూతన జ్ఞానం అందిన కొద్దీ విశ్వాసాలను మార్చుకోవాలి. ఎంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటే అంత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంత మంచి ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకోగలుగుతాము. 

మానవ సంబంధాలలో ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. అవే  విలువలు. విలువలున్న చాలామందికి  లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు  ఉద్యోగం గురించి కావచ్చు, వేరే ఇతర విషయాలు కావచ్చు. ఇంకా జీవితం, స్నేహాలు, ప్రేమ ఇవన్నీ కూడా విలువలతో కూడుకుని ఉంటాయి. భారతీయ సంస్కృతి కూడా గొప్ప విలువలు కలిగినదే.  వీటి గురించి సరైన సమయంలో సరైనవిధంగా నిర్ణయాలు తీసుకోవాలి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మనిషి జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాయి. 

తీసుకునే నిర్ణయాలు సరైనవే అయినా ఆలస్యమైతే అవకాశాలు చేజారుతాయి కదా. ఏవో భయాలు, శకునాలు అడ్డుపెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోతే అపుడు జరిగేది నష్టమే. ఏఏ విలువలు, లక్ష్యాలు, మన సంస్కృతి మొదలైనవాటిని ఒక కోణంలో నుండి చూసే అలవాటు వల్ల అందరికీ ఆవైపు మాత్రమే అర్థమవుతుంది. అందుకే విషయాన్ని మొత్తం క్షుణ్ణంగా అన్ని కోణాల్లో నుండి చూడాలి, అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎదగడానికి, ఆగిపోవడానికి కూడా ఒక విషయాన్ని చూసే కోణం కారణమవుతుంది.

                                        ◆నిశ్శబ్ద.

Advertising
Advertising