ఇవీ కొత్త సంవత్సరం వేడుకలే

ప్రపంచంలో ఒకో ప్రాంతానికీ ఒకో సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారం వారు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. తెలుగువారు ఉగాది నాడు, పంజాబీలు వైశాఖి రోజున... ఇలా ఒకో సంస్కృతికీ ఒకో కొత్త సంవత్సరం ఉంది. కానీ మన రోజువారి జీవితంలో ఇంగ్లిష్ క్యాలెండరుని పాటించడం మొదలుపెట్టాక, జనవరి ఒకటిని కూడా ఘనంగా స్వాగతిస్తున్నాం. మరి ఆ కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ ఎలా జరుగుతాయో చూడండి...   అమెరికా ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో నూతన సంవత్సర వేడుకలు జరిగే తీరే వేరు. డిసెంబరు నుంచే అక్కడ పండుగ వాతావరణం మొదలైపోతుంది. పార్టీలు, విందులు, వినోదాలతో దేశం యావత్తూ సందడిగా ఉంటుంది. ఇక డిసెంబరు 31న టైమ్‌ స్క్వేర్‌లో జరిగే బాల్‌డ్రాప్ అనే కార్యక్రమం ఆ దేశంలోని సంబరాలకు పరాకాష్ట. ఇందులో భాగంగా టైమ్‌ స్క్వేర్‌లో ఉన్న టైమ్స్‌ భవంతి మీద ఓ 140 అడుగుల ఎత్తున ఓ భారీ బంతిని ఉంచుతారు. 500 కిలోలతో వేలాది దీపాలతో ధగధగలాడిపోయే ఈ గాజు బంతి సరిగ్గా 11:59 నిమిషాలు వెలుగులు చిమ్ముతూ దిగడం మొదలుపెడుతుంది. 12:00 గంటలకల్లా భవంతి మీదకు చేరుకుంటుంది. ఆ సమయంలో హోరెత్తిపోయే సంగీతం, కళ్లు చెదిరిపోయే కాంతులని ఆస్వాదించేందుకు వేలాదిమంది టైమ్‌ స్క్వేర్‌కు చేరుకుంటారు.   ఇంగ్లండ్‌ అమెరికాలో జనం టైమ్‌ స్క్వేర్‌కు చేరుకున్నట్లే ఇంగ్లండు వాసులు ధేమ్స్‌ నది మీద ఉన్న వంతెన మీదకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రపంచ ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం ఎప్పుడు 12 గంటలు మోగిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు.  ఇంగ్లండ్ పక్కనే ఉన్న స్కాట్‌లాండ్‌లో ‘first footing’ అనే వింతసంప్రదాయాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగా కొత్త సంవత్సరం ఘడియలలో తమ ఇంట్లోకి అడుగుపెట్టే మొదటి వ్యక్తి నల్లటి జుత్తున్న అందమైన యువకుడై ఉండాలి. అతను బ్రెడ్డు, విస్కీతో పాటుగా కాస్త బొగ్గు ముక్కని కూడా తీసుకురావాలి. ఈ ఇంట్లో జరిగే కొత్త సంవత్సర వేడుక ముగిసిన తరువాత, ఆ యువకుడు వెనక గుమ్మం నుంచి వెళ్లిపోవాలి.   మెక్సికో మెక్సికోలో జనం కొత్త సంవత్సరానికి ముందు తమ ఇళ్లను వేర్వేరు రంగులతో తీర్చిదిద్దుతారు. తమ మనసులో ఎలాంటి కోరిక ఉంటే, దానికి అనుగుణమైన రంగుని ఇంటికి వేస్తారట. డిసెంబరు 31 రాత్రివేళ ఆ ఏడాది జరిగిన బాధాకరమైన సంఘటలన్నింటినీ ఒక కాగితం మీద రాసి, దానిని మంటల్లోకి విసిరివేస్తారు. తద్వారా తమ జీవితంలోని బాధలన్నీ ఇక మీదట తీరిపోతాయని ఆశిస్తారు. ఇక ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలు కొట్టే సమయంలో 12 ద్రాక్షలను తినడం సంప్రదాయం. తమ మనసులో ఉన్న ఒకో కోరికనీ గుర్తుచేసుకుంటూ ఈ 12 ద్రాక్షలూ తింటే తమ కోరికలు తప్పక నెరవేరతాయని వారి నమ్మకం.   గ్రీస్ కొత్త సంవత్సర వేడుకల కోసం గ్రీస్‌ ప్రజలు Vassilopita పేరుతో ఒక ప్రత్యేక బ్రెడ్డుని తయారుచేసుకుంటారు. ఈ బ్రెడ్డుని తయారుచేసే సమయంలో ఒక నాణాన్ని అందులో ఉంచుతారు. వేడుకలలో భాగంగా ఆ బ్రెడ్డుని కోసినప్పుడు, నాణెం ఎవరికైతే వస్తుందో వారిని అదృష్టం వరించినట్లు భావిస్తారు.   ఇవీ జనవరి 1నాడు జరుపుకొనే కొత్త సంవత్సరానికి సంబంధించి కొన్ని వింత ఆచారాలు. అయితే భారీగా బాణాసంచా కాల్చడం, పాత వస్తువులని పోగేసి చలిమంటలు వేయడం, రకరకాల పిండివంటలు తయారుచేసుకుని సుష్టుగా లాగించడం వంటి ఆచారాలు అన్నిచోట్లా కనిపించేవే.   - నిర్జర. 

2017లో ఆకలి చావులు ఉండవా!

  విజ్ఞానం ఇంతగా ఎదిగింది. శాస్త్రవేత్తలు ఇన్నేసి విషయాలను కనుగొంటున్నారు. అయినా ఏటా లక్షలాది మంది ప్రజలు ఆకలితో చనిపోతున్నారంటే వినడానికి బాధగా ఉంటుంది కదూ! సాటివాడి ఆకలిని మాన్పలేనప్పుడు విజ్ఞానం ఎంత ఎదిగి మాత్రం ఏంటి ఉపయోగం. అందుకు సమాధానంగా ఒక జవాబు లభిస్తోంది. ఆ జవాబుతో కోట్లాదిమంది ప్రజల ఆకలి తీరనుందని ఆశిస్తున్నారు.   అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతి 15 మందిలో ఒక పిల్లవాడు ఐదో ఏడు చూడకుండానే చనిపోతున్నాడట. తగిన ఆహారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలడం దురదృష్టకరం. ఇక ఆఫ్రికా సంగతి చెప్పనే అక్కర్లేదు. అక్కడ ప్రతి నలుగురు పిల్లల్లోనూ ఒక పిల్లవాడు తీవ్రమైన ఆకలితో అల్లల్లాడిపోతున్నాడని లెక్కలు చెబుతున్నాయి. పేదరికం, కరువు, అంతర్గత కలహాల వంటి రకరకాల కారణాలతో అక్కడి పిల్లలకి తిండే దొరకడం లేదు.   తేలికగా ఆహారాన్ని పండించడం, పండించిన ఆహారం అందరికీ చవకగా లభించడం, అలా లభించిన ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండటం అనే మూడు సమస్యలకీ సమాధానంగా ‘Harvest Plus’ అనే స్వచ్ఛంద సంస్థ కొన్ని పరిశోధనలని మొదలుపెట్టింది. దీనికి  International Potato Center కి చందిన శాస్త్రవేత్తలు కూడా తోడవ్వడంతో ఒక కొత్తరకం చిలగడదుంపను కనుగొన్నారు. అనేక రకాల చిలగడ దుంపల మీద అధ్యయనం చేస్తూ చివరికి ఓ సంకరజాతి చిలగడదుంపను సాధించారు.   కొత్తగా కనుగొన్న చిలగడదుంపలో కావల్సినంత విటమిన్‌ ఏ ఉంటుందట. ఈ విటమిన్‌ ఏ లభించకపోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదులక్షల మంది చూపుని పోగొట్టుకొంటున్నారనీ, వారిలో సగానికి సగం మంది ఏడాది తిరిగేలోపే మృత్యువాత పడుతున్నారనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆఫ్రికాలో అయితే ఏటా 4 కోట్ల మంది పిల్లల జీవితాలు విటమిన్ ఏ లోపంతో చిన్నాభిన్నమైపోతున్నాయని తేలింది. అంటే అలాంటి పిల్లల పాలిట వరంగా ఈ చిలగడదుంప మారబోతోందన్నమాట. అంతేకాదు మొజాంబిక్‌ వంటి దేశాలలో తరచూ వచ్చే కరువుని సైతం ఎదిరించి ఈ మొక్క ఎదుగుతుందట. ఇటు కరువునే కాదు అటు తెగుళ్లని కూడా ఈ మొక్క ఎదుర్కొంటుందని పరిశోధనల్లో బయటపడింది.   మొత్తానికి ఓ చిన్న చిలగడదుంపతో ప్రపచంపు ఆకలి తీరిపోతుందనీ, పోషకాల లోటుని నివారించవచ్చనీ విజ్ఞానప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. అందుకనే ఏటా ఆహార రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక ‘world food prize’ పురస్కారాన్ని ఈ చిలగడదుంపని కనుగొన్న శాస్త్రవేత్తలకీ, Harvest Plus అధినేతకీ అందించారు. టైమ్స్ పత్రిక 2016కి సంబంధించిన గొప్ప ఆవిష్కరణలలో ఒకటిగా ఈ చిలగడదుంపను కూడా పేర్కొంది. ‘ప్రాణాలను కాపాడే ఆహారం’గా వీటిని వర్ణించింది. అదే నిజమైతే అంతకంటే కావల్సింది ఏముంది.   - నిర్జర.  

Commitment – for a Happy Married Life

      A recent study has revealed that kissing and telling your partner "I love you" ten times a week is the secret to a happy marriage.   Going on three dates a month, with three romantic surprises and ten deep conversations also make for an ideal relationship, according to 1,000 married Americans who took part in the poll. Many said the perfect marriage is based on trust and being best friends through thick and thin. Having three arguments a month adds to the magic but, importantly, a couple must be able to say sorry. Others spoke of spending plenty of quality time with their spouses, being able to have fun and having three shared interests and taking two holidays a year together. Market researchers OnePoll.com, who commissioned the survey, said: “Anyone can get married, but it takes a lot of commitment and effort to make your marriage a perfect one. “If you are not prepared to put the work in and take the rough with the smooth, you are going to struggle to find that ideal...it seems that the little things such as kissing and cuddling really are important.” The survey found that 92 per cent of Americans considered themselves to be happily married. But of those who were not, almost a quarter said they had simply grown apart from their partner, while another 17 per cent blamed financial problems. Not having much in common, spending little time together and affairs also led to strife. More than half of those questioned were friends before they became an item. The survey also found that, in the perfect marriage, couples will make love three times a week and spend six nights a month cuddled up in front of the TV. But the biggest secret to a happy marriage, the couples said, was simply accepting each other’s faults and staying committed to each other.

జీసస్ చెప్పిన రెండు కథలు

ప్రపంచ చరిత్రలో క్రీస్తు జీవితం ఓ అసమాన ఘట్టం. తత్వవేత్తగా, దేవుని కుమారుడిగా, విప్లవకారునిగా... ఎవరు ఏ తీరున చూస్తే ఆ తీరుగా కనిపించే జీసస్ ప్రభావం అనంతం. జీసస్ జీవితమే కాదు, ఆయన బోధలు కూడా అసమాన్యంగానే తోస్తాయి. అప్పటి ఛాందసమైన ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడుతూనే ప్రేమ, కరుణ వంటి మానవ విలువలను బోధించారు. వాటివల్ల తన ప్రాణాలకు హాని ఉంటుందని తెలిసినా కూడా తను అనుకున్నది ప్రవచించారు. సందర్భాన్ని బట్టి క్రీస్తు బోధలు ఒకోసారి తీక్షణంగా ఉంటే, మరోసారి మృదువుగా సాగుతాయి. తాను చెప్పదల్చుకున్న విషయం శిష్యులకు అందించేందుకు ఒకోసారి నీతికథల ద్వారా కూడా బోధించేవారు. అలా ప్రేమ, క్షమాపణల గురించి క్రీస్తు చెప్పిన కథలలో రెండు ప్రముఖమైనవి ఇవిగో...   గుడ్ సమారిటన్ (Parable of the Good Samaritan) ఇతరుకు సాయపడే గుణం ఉన్నవారిని మనం ‘గుడ్ సమారిటన్’ అంటాం. ఆ పదానికి మూలం క్రీస్తు బోధలలో ఉందంటే ఆశ్చర్యం కలుగక మానదు. పొరుగువాడితో ఎలా ఉండాలి అని ఓ శిష్యుడు అడిగిన ప్రశ్నకుగాను క్రీస్తు చెప్పిన కథలో సమారిటన్ (ఓ స్థానిక తెగ) అనే మాట వినిపిస్తుంది. ‘‘ఒక వ్యక్తి జెరుసలేం నుంచి జెరికో అనే ఊరికి ప్రయాణిస్తున్నాడు. ఇంతలో దొంగలు అతడిని నిలువుదోపిడీ చేసి, కొనప్రాణాలతో ఉండేదాకా కొట్టి వెళ్లిపోయారు. ఆ దారినే ఒక పూజారి వెళ్లడం తటస్థించింది. కానీ అతను దారిపక్కన పడి ఉన్న మనిషిని పట్టించుకోకుండానే సాగిపోయాడు. మరో వ్యక్తి కూడా ఏమీ ఎరగనట్లే ఆ దోవ వెంట పడి ఉన్న వ్యక్తిని చూసుకుంటూ వెళ్లిపోయాడు.   ‘‘ఈలోగా అక్కడికి వచ్చిన ఓ సమారిటన్ మాత్రం, కొన ఊపిరితో పడి ఉన్న మనిషిని చూడగానే కదిలిపోయాడు. అతని గాయాలకు కట్టుకట్టి నూనె రాసి, ద్రాక్షరసాన్ని అందించాడు. తనతోపాటు అతన్ని కూడా ఓ సత్రానికి తీసుకువెళ్లి బాగోగులను గమనించుకున్నాడు. మర్నాడు తన దారిన తను వెళ్తూ సత్రపు యజమాని చేతిలో ఓ రెండు దీనార్లని ఉంచి, అతను కోలుకునేదాకా సేవ చేయమని అర్ధించాడు. ఆ రెండు దీనార్లు చాలకపోయినా ఊరుకోవద్దనీ, అతని కోసం ఎంత ఖర్చయితే అంతా తాను తిరుగు ప్రయాణంలో జమ చేస్తాననీ చెప్పి వెళ్లాడు.’’   పై కథ చెప్పిన తరువాత క్రీస్తు – ‘‘దొంగల బారిన పడ్డ ఆ మనిషికి తోడుగా ఎలాంటి స్వభావం ఉన్న మనిషి పొరుగువాడిగా ఉంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు!’’ అని తన శిష్యుని అడిగాడు. దానికి శిష్యుడు తడుముకోకుండా- ‘‘అతనికి సాయం చేసిన సమారిటన్లాంటి మనిషి పొరుగువాడిగా ఉంటే బాగుంటుంది,’’ అని చెప్పాడు. ‘‘అయితే ఇంకే! నువ్వు కూడా ఆ సమారిటన్లాగానే ప్రవర్తిస్తూ ఉండు,’’ అని సూచించారు జీసస్.   దయలేని నౌకరు కథ (Parable of the Unforgiving Servant) ‘‘ప్రభూ! నా సోదరుడు చేసిన తప్పులను నేను ఎన్నిసార్లు క్షమించాలి. ఏడుసార్లు క్షమిస్తే సరిపోతుందా?’’ అని జీసస్ను అడిగాడు ఓ శిష్యుడు. దానికి క్రీస్తు ‘‘ఏడు సార్లు కాదు ఏడు రెట్లు డెబ్భైసార్లు క్షమించినా తప్పులేదు,’’ అంటూ ఈ కథని చెప్పుకొచ్చారు. ‘‘ఓ సేవకుడు తన రాజుగారి దగ్గర కోట్ల దీనార్లు అప్పు చేశాడు. ఆ అప్పుని ఎంతకీ తీర్చకపోవడంతో రాజుగారు ఆగ్రహించారు. సేవకుడి కుటుంబంతో సహా అతని ఆస్తి యావత్తునీ వేలం వేసి, అతని నుంచి రుణాన్ని వసూలు చేసుకోమని ఆజ్ఞాపించారు. ఆ మాటలకు సేవకుడు వణికిపోయాడు. తన మీద దయ చూపమనీ, ఎలాగొలా ఆ రుణాన్ని తీరుస్తాననీ... రాజుగారి కాళ్లముందు పడి వేడుకున్నాడు. సేవకుడి వేడుకోళ్లకు రాజుగారు కరిగిపోయారు. సేవకుడిని క్షమించి అతని రుణాన్ని మాఫీ చేశారు.   ‘‘ఆ సేవకుడు సంతోషంగా ఇంటికి తిరిగివెళ్తుండగా అతనికి తన దగ్గర వంద దీనార్లు అప్పు చేసిన ఓ చిరు గుమాస్తా కనిపించాడు. వెంటనే అతని గొంతు పట్టుకుని తన బాకీ తిరిగి కట్టమంటూ దబాయించాడు సేవకుడు. తన మీద దయచూపమనీ, త్వరలోనే వంద దీనార్ల బాకీని తీరుస్తాననీ ఆ మనిషి ఎంతగా మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది. తన బాకీ తీరేదాకా అతడు శిక్ష అనుభవించాల్సిందే అంటూ అతడిని ఖైదు చేయించాడు సేవకుడు. ఈ విషయం రాజుగారి చెవిన పడగానే ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. వెంటనే సేవకుడిని పిలిపించి- ‘నేను నీ మీద దయతలిచి నీ రుణాన్ని మాఫీ చేశాను. నువ్వు కూడా అలాగే చేసి ఉండాల్సింది కదా! నువ్వు కూడా నాలాగే కరుణ చూపించి ఉండాల్సింది కదా!’ అంటూ అతను తన వద్ద బాకీ పడ్డ కోట్లాది దీనార్లని తిరిగి చెల్లించేదాకా చిత్రహింసలను అనుభవించాలని ఆదేశించారు.’’   ‘మనం చేసే ఘోరపాపాలెన్నింటినో ఆ భగవంతుడు క్షమించేస్తాడు. అలాంటిది మన తోటివాడు చిన్నచిన్న తప్పులు చేస్తే క్షమించలేమా’ అన్నది జీసస్ అభిప్రాయమని ఈ కథ సూచిస్తోంది.   - నిర్జర.

Tricks To Save Time

Every human on this earth has 24 hours a day at his disposal. It all depends on how they use it. Time is so elusive that it would slip between our fingers. Let’s find some time tested methods to save such precious time.   The 2 minute rule David Allen has mentioned about this rule in his bestselling book- Getting Things Done. Completion of tiny tasks such as disposal of garbage, sending an e-mail, changing a bulb... would all take around 2 minutes in time! Allen advices not to procrastinate such tasks as they would take much time and effort when postponed!   No commitments Some might need your help and some might just request your company. Just say NO to those commitments in which you aren’t interested. Let them know that you have some other work to do. But be aware that your declining of a request is not going to hurt your relation.   Wastage into productivity Life can be full of waiting. Waiting at a doctor’s clinic, waiting for the bus to reach destination, waiting for a friend to come... waiting kills much of our time. Devoting such time to productive works can save hours at the end of the day. Tasks such as checking out the mails or making important calls can be completed during such time.   Abuse of time Life has changed a lot. And we seem to have invented too many ways of entertainment. Television, Internet, Social media, Cell phones can all lead us to knowledge and communication. But they can kill our time as well. Watch out the time you are spending on such activities.   Shopping with sense Shopping can kill much of our time. Plan to shop all your requirements in one trip. You can also purchase in bulk to avoid frequent visits. If your intention is not to spend your time in shopping, then you can always plan it to be quick and perfect.   Scheduling Chalking down your priorities and scheduling them could avoid procrastination. Doing the right thing at the right time is the best way to reach success. And a schedule would always warn you to be accurate.   No leftovers Tasks that remain unaccomplished would always be a burden on our mind. They constantly hold us back and burn our confidence down. So be sure that you have no unfinished tasks from the past that has to be completed.   - Nirjara.

ప్రాక్టీస్‌ చేస్తే మార్కులు గ్యారెంటీ!

  చదువుకుంటే విజ్ఞానం వస్తుందో రాదో కానీ, మార్కులు మాత్రం వచ్చితీరాలనే రోజులివి. ఎందుకంటే మార్కులు, ర్యాంకుల ఆధారంగానే అవకాశాలు లభ్యమవుతున్నాయి. మరి ఎంతబాగా చదివినా కూడా, పరీక్ష రాసే ఒత్తిడిలో మన జ్ఞాపకాలన్నీ చెల్లాచెదురైపోతే?   రెండు మార్గాలు మనం చదివిన విషయాన్ని రెండు రకాలుగా గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. ఒకటి- అదే విషయాన్ని పదే పదే పునశ్చరణ చేసుకోవడం ద్వారా. రెండు- చదివిన విషయాన్ని తిరిగి రాసుకోవడం, పాత ప్రశ్నాపత్రాలకు జవాబులు ఇవ్వడం వంటి ప్రాక్టీసింగ్ పద్ధతుల ద్వారా. ఈ రెండు పద్ధతులలోనూ ఏది మెరుగైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు.   30 పదాలు- 30 చిత్రాలు పునశ్చరణా! ప్రాక్టీసా! అన్న విషయాన్ని తేల్చేందుకు ఓ 120 మంది విద్యార్థులను ఎన్నుకొన్నారు. వీరికి కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద ఓ 30 పదాలు, 30 చిత్రాలు చూపించారు. ప్రతి పదం లేదా చిత్రం తరువాత అభ్యర్థులు నోట్స్‌ రాసుకునేందుకు కాస్త సమయాన్ని ఇచ్చారు. ఆ తరువాత వీరిని రెండు రకాలుగా విభజించారు. మొదటి విభాగంలోని అభ్యర్థులని కేవలం పునశ్చరణ ద్వారా విషయాన్ని గుర్తుచేసుకునే ప్రయత్నం చేయమన్నారు. రెండో విభాగంలోని అభ్యర్థులని ప్రాక్టీసు చేసుకుంటూ ఆ పదాలను, చిత్రాలను గుర్తుచేసుకోమని ప్రోత్సహించారు.   ఒత్తిడిలోనూ – లేకుండానూ ఎవరు ఎంత బాగా గుర్తుంచుకున్నారన్న విషయం మీద ఓ 24 గంటల తరువాత పరీక్షించి చూశారు పరిశోధకులు. అయితే ఇందులో, ఎలా చదివితే బాగా గుర్తుంటుంది అన్న సమస్య ఒకటైతే... అది ఒత్తిడిలో కూడా గుర్తుంటుందా లేదా అన్నది మరో సమస్య. అందుకోసం పరిశోధకులు రెండు విభాగాలలోనూ సగం మందిని ఒత్తిడితో కూడిన వాతావరణంలో కూర్చోపెట్టారు. ఓ ఇద్దరు పరీక్షాధికారులు, ఓ ముగ్గరు తోటి విద్యార్థులు, ఎదురుగుండా కెమెరా... ఇలా ఉద్వేగపూరితమైన వాతావరణంలో సగం మందిని పరీక్షించి చూశారు.   ఫలితం ఊహించినదే! పునశ్చరణ చేసినవారితో పోలిస్తే ప్రాక్టీసు ద్వారా గుర్తుంచుకునే ప్రయత్నం చేసినవారే ఎక్కువ విషయాలను గుర్తుంచుకున్నట్లు తేలింది. ఒత్తిడిలో ఉన్నా లేకున్నా కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. ఇతరులతో పోలిస్తే వీరు దాదాపు 10 శాతం ఎక్కువగా విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోగలిగారు. ప్రాక్టీసు చేయడం వల్ల విషయం మన మెదడులో దీర్ఘకాలికంగా ఉండిపోతుందనీ, ఒత్తిడితో కూడిన సందర్భాలలోనూ అవి చెక్కుచెదరవనీ చెబుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఎలాంటి పరీక్షలోనైనా నెగ్గుకురావాలంటే ప్రాక్టీసు చేసి చూడమని భరోసా ఇస్తున్నారు. ఇంతకీ Practice makes a man perfect అని మన పెద్దలు చెప్పిన మాట పరీక్షలకి కూడా వర్తిస్తుందన్నమాట!   - నిర్జర.

మనిషనే వాడున్నాడా!

  పాపం ఆ పాప పార్కులో ఒంటరిగా దీనంగా కూర్చుని ఉంది. తన చుట్టూ ఎంతోమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఎందరో పెద్దలు కబుర్లు చెప్పుకొంటున్నారు. కానీ ఎవరూ ఆమెని అంతగా పట్టించుకోవడం లేదు. తమతో ఆడుకోమని పిల్లలు అడగడం లేదు. ‘దీనంగా ఉన్నావేంటి తల్లీ!’ అని పెద్దలూ విచారించడం లేదు. కారణం! ఆ పాపని చూడగానే తనో పేదరాలు అని తెలిసిపోతోంది. దానికి తోడు ఆమెని నిరంతరం వెక్కిరించే నీడలా, వీపు మీద పొడుచుకువచ్చిన గూని ఒకటి.   పిల్ల అలాగే దీనంగా కూర్చుని ఉంది. గంట.... రెండు గంటలు... మూడు గంటలు... మధ్యాహ్నం... ఎవరూ ఆ పిల్లని పెద్దగా గమనించినట్లుగా లేదు. ఒకవేళ చూసినా చూడనట్లు సాగిపోతున్నారేమో! అసలే పేదతనంతో చిరిగిన బట్టలు, ఆపై గూని... ఆ పాపని పలకిరించే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదేమో! కనీసం ‘అన్నం తిన్నావా?’ అని కూడా ఆ చిట్టి తల్లిని అడగాలని ఎవరికీ తోచలేదు.   సాయంత్రం అయ్యింది. పాప అలాగే కూర్చుని ఉంది. ఇంతలో ఒక యువకుడు నిదానంగా ఆ పాప వైపుగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. ‘చాలాసేపటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఇక్కడే కూర్చున్నావేంటి? నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లున్నావు. ఏంటి విషయం?’ అంటూ అడిగాడు.   తనని ఎవరో అజ్ఞాతవ్యక్తి పలకరించేసరికి ఆ పాప ఒక్కసారిగా కంగారుపడిపోయింది. ‘ఏం లేదు.. ఏం లేదు,’ అంటూ తడబడింది. కానీ ఆ మనిషి ఊరుకునేలా లేడు. నిదానంగా పాపని మాటల్లోకి దింపి ఆమె కుటుంబం గురించీ, ఆర్థిక సమస్యల గురించీ, చదువు గురించీ తెలుసుకున్నాడు. మాటల్లో పడి రాత్రివేళ కావడాన్ని వాళ్లిద్దరూ గమనించనేలేదు. తన చుట్టూ కమ్ముకుంటున్న చీకట్లని చూసి ఆ యువకుడు ఒక్కసారిగా కంగారుపడ్డాడు. ‘చూడూ! ఇంత రాత్రివేళ నువ్వు ఇలాంటి చోట ఉండటం అంత మంచిది కాదు. మీ ఇంటికి వెళ్లిపో!’ అంటూ ఆమెని సాగనంపాడు. పార్కు గేటుదాకా ఆమెకి తోడు వచ్చి చేతిలో ఓ వందరూపాయల కాగితాన్ని పెట్టాడు. అతని ప్రవర్తన చూసి పాప కళ్లలో నీళ్లు తిరిగాయి.   ‘నా అవతారాన్ని చూసి, అవకరాన్ని చూసీ జోలికి వచ్చేందుకు కూడా భయపడిపోతారు. మరి మీకెందుకు నన్ను పలకరించాలని అనిపించింది,’ అంటూ కన్నీటితో అడిగింది. దానికి ఆ యువకుడు చిరునవ్వుతో ‘నా దృష్టిలో నువ్వు ఒక దేవతవి. మనుషుల మనసులో ఇంకా జాలి ఉందో లేదో గమనించడానికి వచ్చిన దేవదూతవి. మనిషి అన్న మాటలో మానవత్వం మిగిలుందో లేదో పరీక్షించేందుకు వచ్చిన చిట్టి తల్లివి. నీలాంటి వారిని పట్టించుకోకపోతే సమాజం అన్న మాటకు విలువ లేదు,’ అంటూ వెళ్లిపోయాడు. తనని వీడి వెళ్లిపోతున్న ఆ యువకుడిని చూసిన ఆ పాప మొహంలో ఓ చిరునవ్వు విరిసింది. నిజంగానే ఆమె దేవదూతేనేమో! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

జ్ఞాపకాలు మోసం చేస్తాయా!

మనిషి అంటేనే జ్ఞాపకాల పుట్ట. అవి లేనిదే అతనికి అస్తిత్వం ఉండదు. అలాంటిది తన జీవితంలో ఎప్పుడూ జరగని దానిని, తనకి ఏమాత్రం సంబంధించని విషయాన్నీ అతను తన జ్ఞాపకంగా భావించడం సాధ్యమేనా! అసలు ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉందా అంటే... నూటికి యాభై శాతం అవకాశం ఉందంటున్నారు.   తప్పుడు జ్ఞాపకాలు ఇంగ్లండుకి చెందిన కొందరు పరిశోధకులు, జ్ఞాపకాలలో పొరపాటు జరిగే అవకాశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీని కోసం వారు ఒక నాలుగువందల మందిని ఎన్నుకొన్నారు. వీరందరి మీదా ఎనిమిది దఫాలుగా జ్ఞాపకానికి సంబంధించిన ప్రయోగాలను నిర్వహించారు. ఈ సమయంలో వారిని తమ జీవితంలో ఎన్నడూ జరగని విషయాలను ఊహించి చూడమన్నారు. బెలూన్లో ఆకాశంలో ఎగరడం, ఉపాధ్యాయులని ఏడిపించడం, పెళ్లిలో చిలిపిగా ప్రవర్తించడం... లాంటి విషయాలను ఊహించుకోమన్నారు.   నిజమనుకున్నారు బలవంతంగా తమవైన ఊహలలో తేలిపోయిన 400 మంది వ్యక్తులనీ తరువాత కాలంలో మళ్లీ ప్రశ్నించారు. ఆ సమయంలో తేలిందేమిటంటే... తాము ఇంతకుముందు ఊహించుకున్న విషయాలని వారు నిజమని భ్రమించడం మొదలుపెట్టారట. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు! ఒక 23 శాతం మంది, ఆ ఊహలన్నీ తమ జీవితంలో నిజమైన సంఘటనలకు సంబంధించినవే అని నమ్మారు. మరో 30 శాతం మందైతే అవి నిజమని నమ్మడమే కాదు... అవి ఎలా, ఎప్పుడు జరిగాయో పూసగుచ్చినట్లు వివరించారు!   కొత్త వెలుగులు మనిషి మెదడులో జ్ఞాపకాలు ఎలా నిక్షిప్తం అవుతాయి అనేదాని మీద ఈ పరిశోధన కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. మన జీవితంలో ఫలానా విషయం జరిగింది అని మనం ప్రగాఢంగా నమ్మేవన్నీ నిజం కాకపోవచ్చునని హెచ్చరిస్తోంది. ఒక అబద్ధాన్ని పదే పదే ఇతరుల మెదడులోకి చొప్పించే ప్రయత్నం చేస్తే అది నిజంగా మారిపోవచ్చునని సూచిస్తోంది. ఇంతకుముందులా ‘ఫలానా హత్యను నేను చూశాను,’ అని న్యాయస్థానంలో చెబితే న్యాయమూర్తులు తొందరపడి ఓ నిర్ణయానికి రాకపోవచ్చు. వేధించే జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ఓ కొత్త మార్గాన్ని వెతుక్కోవచ్చు. పరిశోధకుల మాటలోనే చెప్పాలంటే- ‘జ్ఞాపకాలు మన జీవితానికి చిహ్నాలుగానూ, మన అస్తిత్వంలో భాగంగానూ ఉండే మాట నిజమే! అయితే ఒకోసారి అవి కూడా మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.’     - నిర్జర.

సంతోషానికి మార్గం ఆదాయం కాదు, ఆరోగ్యమే!

  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది పెద్దల మాట. ఈ మాట నిజమే అన్న విషయం మన అనుభవం అప్పుడప్పుడూ రుజువు చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు కొందరు పరిశోధకులు సేకరించిన గణాంకాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.   నాలుగురెట్లు తేడా పేదరికం తగ్గితే సంతోషం పెరుగుతుందా అనే అంశం మీద ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్‌ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు కొన్ని గణాంకాలను సేకరించారు. దీనిలో భాగంగా మనుషులలో పేదరికం తగ్గితే సంతోషంలో కేవలం ఐదుశాతమే వృద్ధి కనిపించిందట. కానీ వారిలో మానసిక సమస్యలకు సంబంధించిన చికిత్సను నిర్వహించినప్పుడు ఏకంగా 20 శాతం మార్పు కనిపించిందట.   కారణం ఇదీ! సంపదతో సంతోషం ఎందుకు పెరగదు అనేదానికి పరిశోధకులు తమదైన విశ్లేషణను వినిపిస్తున్నారు. మన చుట్టపక్కలవారితో పోల్చుకోవడం వల్ల ఎప్పుడూ సంపదని నిర్ణయిస్తాము. అంటే ఇద్దరిలో ఒకరి సంపద పెరిగితే మరొకరికి తక్కువగా తోచడం సహజం. కానీ ఆరోగ్యం అలా కాదు! పోలికలతో సంబంధం లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చు.   మారిన ప్రపంచమే సాక్ష్యం పరిశోధకులు తమ విశ్లేషణ కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రటిన్‌, జర్మనీ దేశాలలోని వేలమందిని గమనించారు. నిజానికి ఇవన్నీ సంపన్న దేశాలే! కొన్ని దశాబ్దాలుగా ఆర్థికఅభివృద్ధిని సాధిస్తున్నవే! కానీ ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా ప్రజలలోని సంతోషపు స్థాయి పెరగలేదు. సంపదకీ సంతోషానికీ అంతగా సంబంధం లేదనేందుకు ఇదే తిరుగులేని సాక్ష్యం!   ప్రభుత్వాల తీరు మారాలి అటు సమాజమూ ఇటు ప్రభుత్వాలు ఎంతసేపూ విద్య, నిరుద్యోగం, పేదరికం, వైద్యం వంటి విషయాల మీద చూపిన శ్రద్ధ పౌరుల మానసిక సమస్యలని పరిష్కరించేందుకు చూపడం లేదన్నది పరిశోధకుల ఆరోపణ. ఫలితంగా గృహహింస, మద్యపానానికి బానిసగా మారడం, క్రుంగుబాటు, పరీక్షల పట్ల విపరీతమైన భయాందోళనలు వంటి కొత్త సమస్యలెన్నో ఇప్పటి తరాన్ని వేధిస్తున్నాయని చెబుతున్నారు. విద్యాసంస్థలు కూడా ఎంతసేపూ పిల్లవాడికి మంచి మార్కులు వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయికానీ, మానసికంగా దృఢమైన వ్యక్తిగా ఎదిగేందుకు అతనికి ఎలాంటి శిక్షణ అందించాలో ఆలోచించడం లేదు. అందుకే ఈ పరిశోధన ఫలితాలు గమనించిన ప్రజలన్నా కనీసం తమ ప్రాధాన్యతలను మార్చుకుంటారని ఆశిస్తున్నారు.   - నిర్జర.

పక్కవారి కోసం గొంతు విప్పండి

జీవితం చాలా కఠినంగా మారిపోయింది. కాదనలేం! ఎవడి బతుకు వాడు చూసుకోవడానికే తీరక చాలడం లేదు. తన పొట్ట నింపుకునేందుకే నానాపాట్లూ పడాల్సి వస్తోంది. అందుకనే వేరొకరి గురించి పట్టించుకునేందుకు మనసు రావడం లేదు. సమస్య తనదాకా వస్తే కానీ దానిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. ఐక్యరాజ్యసమితి కూడా ఈ విషయాన్ని గ్రహించినట్లుంది. అందుకే ఏటా డిసెంబరు 10న జరుపుకొనే ‘మానవహక్కుల దినోత్సవం’లో ఈసారి ఇతరుల హక్కుల కోసం కూడా ఆలోచించమంటూ పిలుపునిస్తోంది.   మనిషి మనిషిగా తలెత్తుకుని జీవించగలగడమే మానవహక్కు! రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఓ వ్యక్తి ఇతరులతో సమానంగా జీవించే అవకాశమే మానవహక్కు. ఇలాంటి మానవహక్కుల గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 1946లోనే ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్‌ 1948లో Universal Declaration of Human Rights అనే పత్రాన్ని రూపొందించింది. బైబిల్‌ తరువాత ప్రపంచంలో అత్యధిక భాషలలోకి అనువదించబడిన పుస్తకం ఇదే! దీని ఆధారంగానే 1950 నుంచి ఏటా డిసెంబరు 10న మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. ఇందులో భాగంగా ప్రతి ఏడూ మానవహక్కులకి సంబంధించి ఏదో ఒక అంశం మీద ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తోంది. అలా ఈ ఏడు ఇతరుల హక్కుల కోసం నిలబడమంటోంది.   ఇతరుల హక్కుల కోసం ఇలా గొంతు విప్పవచ్చు... - వికలాంగులు, వృద్ధులు, రోగులు... వీరికి ఎక్కడికక్కడ ప్రత్యేక సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తుంటుంది ప్రభుత్వం. ఈ సౌకర్యం అందుబాటులో లేకున్నా, లేదా మన కళ్ల ముందే దుర్వినియోగం అవుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. మన పక్కన ఉన్న అలాంటి నిస్సహాయుల కోసం ఒక మాట వాడటంలో తప్పులేదు.   - స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల పట్ల సమాజపు దృక్పధం చాలా విభిన్నంగా ఉంటుంది. వీరి పట్ల మన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ... వారు కూడా సమాజంలోనే భాగమని గుర్తించి, తగిన గౌరవం ఇవ్వడం అవసరం.   - మన చుట్టూ స్త్రీ పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా... అది వారి వ్యక్తిగత విషయం అనుకుని నిస్తేజంగా సాగిపోవడం మానవత్వం అనిపించుకోదు.   - దళితులు, మైనారటీలు, ఆదిమజాతివారు... ఇలా సమాజంలో అణగారిన వర్గాలకి కూడా ఈ భూమ్మీద మనతోపాటు సమానమైన హక్కులు ఉన్నాయి. మనం వారి అభ్యున్నతి కోసం పోరాడలేకపోయినా, వారి జాతి ఆధారంగా అవమానం జరిగినప్పుడు మాత్రం గొంతు విప్పడం సహేతుకం.   - పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుందనీ, పెద్దలతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామో... అంతకంటే జాగ్రత్తగా పిల్లలతో వ్యవహరించాలన్న విషయాన్ని చాలామంది గ్రహించరు. అందుకే పిల్లలు నిష్కారణంగా ఎవరో ఒకరి దౌర్జన్యానికి తలవంచాల్సి వస్తుంటుంది. మన కళ్ల ముందర ఇలాంటి సంఘటన జరిగితే అడ్డుకుని తీరాల్సిందే!   - ఉన్నవాడిని లేనివాడిని వేర్వేరుగా చూస్తుంది సమాజం. దానికి మనమేం చేయలేం. కానీ ఆ పక్షపాతంతో పేదవాడు మనిషే కాదన్నట్లు ఎవరన్నా ప్రవర్తిస్తే వారిని సరిదిద్దాల్సిందే!   ఏవో చెప్పుకోవాలి కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్పుకొన్నామే కానీ... ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు చాలా సందర్భాలే కనిపిస్తాయి. పోరాడటం అంటే కేవలం భౌతికమైన అర్థం మాత్రమే రాదు. ఒక మాట అడ్డువేయడం, కళ్ల ముందు జరుగుతున్న పక్షపాతాన్ని పరిష్కరించేందుకు ఒక అడుగు ముందుకి వేయడం, అవతలివారికి నచ్చచెప్పడం, మనలోని ఆలోచనను నలుగురితో పంచుకోవడం, శాంతియుతంగా మన నిరసనని తెలియచేయడం కూడా పోరాటం కిందకే వస్తాయి. అదీఇదీ కాదంటే మన కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సోషల్‌ మీడియా ఎలాగూ ఉండేనే ఉంది!   - నిర్జర.

మెదడుతోనే వీడియోగేమ్

  సాంకేతికత రోజురోజుకీ తెగ అభివృద్ధి చెందుతోంది. దాంతో ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలలోనే సాధ్యమనుకునే విషయాలు కళ్ల ముందే సాకారం అవుతున్నాయి. వాటిలో ఒకటి- కేవలం ఆలోచనలతోనే వీడియోగేమ్‌ను అడగలిగే శక్తి! వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఆ శక్తిని సాకారం చేసే దిశగా కొన్ని విజయాలు సాధించారు.   ఇదీ విధానం కళ్ల ముందు కదిలిపోయే సన్నివేశాలలో మనం కూడా భాగంగా కనిపించే వర్చువల్‌ ఆటలకి (Virtual games) కొదవలేదు. కానీ ఓ మనిషి మెదడులో మెదిలే ఆలోచనల సాయంతో అతని ఆటతీరు సాగే అవకాశం ఉందేమో అని శోధించే ప్రయత్నం చేశారు. అంటే ఇందులో ఆటగాడిలో ఎలాంటి శరీర కదలికా ఉండదన్నమాట. అతని తలకి కొన్ని పరికరాలు చుట్టి ఉంటాయన్నమాట.   ఇదీ ఆట ఆటలో భాగంగా తెరమీద 21 చతురస్రాలు కనిపిస్తాయి. వాటిని పైకి కానీ కిందకి కానీ జరుపుతూ ఆటని కొనసాగించాలి. అది ఎటువెళ్లాలో ఆటగాడు నిర్ణయించుకున్నప్పుడు అతని మెదడులోని ‘ప్రాస్పేన్’ అనే భాగంలో స్పందనలు కలుగుతాయట. ఈ ‘ప్రాస్పేన్‌’ను కాంతిసంకేతాలుగా మార్చి వాటి ద్వారా వీడియోగేమ్‌ ఆడించే ప్రయత్నం చేశారు. శరీరం నుంచి నామమాత్రమైనా సహకారం లేకుండా, కనీసం కంటిచూపుని కూడా అనుసరించకుండా చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అవుతుందో అని పరిశోధకులు కూడా అనుమానపడ్డారు. కానీ 92 శాతం సందర్భాలలో ఆటగాళ్ల మెదడు ఏ తీరులో అయితే స్పందించిందో, దానికి అనుగుణంగా ఆట కదలడం చూసి సంబరపడిపోయారు.     ఆట కోసం మాత్రమే కాదు వీడియోగేమ్‌ విజయవంతం అయ్యింది కదా అని ఈ పరిశోధన కేవలం ఆటలకే పరిమితం అనుకోవడానికి లేదు. మెదడులో ఆజ్ఞని అందించడం అనేది మన నిజజీవితంలో ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతుందంటున్నారు పరిశోధకులు. కారు తోలడం దగ్గర్నుంచీ కృత్రిమ అవయవాలని నియంత్రించడం వరకూ మెదడుతోనే పనికానిచ్చేయవచ్చు అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ కొత్త ఆవిష్కరణ మనకి ఆరో ఇంద్రియాన్ని ప్రసాదిస్తోందంటున్నారు.   ఇప్పటివరకూ మెదడు మీద జరిగిన ప్రయోగాలన్నీ అందులో ఉన్న సమాచారాన్ని ఎలా క్రోడీకరించాలి? అన్న దిశగానే సాగాయి. కానీ ఈ కొత్త ప్రయోగం ద్వారా మెదడుకి సమాచారాన్ని నేరుగా ఎలా అందించాలి? సమాచారాన్ని అందుకున్న తరువాత మెదడులో జరిగే ప్రతిస్పందనలకు ఎలా రూపం కల్పించాలి? అన్న తరహా పరిశోధనలకు దారితీసినట్లయ్యింది. మరి ఈ తొలి అడుగు మరెన్ని విజయాలకు దారితీస్తుందో!   - నిర్జర.  

ఏడుపు వల్ల బోలెడు లాభాలట

మగపిల్లలు ఏడిస్తేనేమో ‘ఎందుకలా ఆడపిల్లలా ఏడుస్తావు?’ అని తిడతారు. ఆడపిల్లలు ఏడిస్తేనేమో ‘ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం. ఏడిస్తే దరిద్రం!’ అంటూ వారిస్తారు. కానీ మనసుకి బాధ కలిగితే తనివితీరా ఏడవాలని ఎవరికి మాత్రం అనిపించదు. ఇకమీదట అలాంటి సందర్భం వస్తే తృప్తిగా ఏడ్చేయమంటున్నారు నిపుణులు. అలా ఏడవడం వల్ల బోలెడు లాభాలు కూడా ఉన్నాయంటున్నారు. అవేవిటంటే...   విషాలు బయటకు పోతాయి ఉద్వేగం వల్ల ఏడుపు వస్తుందన్న విషయం తెలిసిందే! అయితే ఈ ఉద్వేగాన్ని మనసులోనే అట్టిపెట్టేసుకుంటే... దాని వలన కార్టిసాల్, ఎన్‌కెఫలిన్ వంటి హానికారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. సుబ్బరంగా ఏడ్చేస్తే ఆ రసాయనాలన్నీ నిమ్మకుండిపోతాయి. అందుకనే ఏడ్చిన తరువాత మనసు మునుపటికంటే చాలా తేలికగా ఉండటాన్ని గమనించవచ్చు.   సృజనశక్తి పెరుగుతుంది త్వరగా కళ్లు చెమరుస్తున్నామంటే మనలో సున్నితమైన స్పందనలు ఇంకా మిగిలిఉన్నట్లు లెక్క. గుండెను రాయి చేసేసుకున్నవారి కళ్లలోకి తడి రాదు కదా! ఇలాంటి సున్నితత్వం ఉన్నవారు తమ స్పందనలకు చక్కటి రూపం ఇవ్వగలరని అంటున్నారు. ఒక బాధాకరమైన విషయాన్ని అక్షరబద్ధం చేయాలన్నా, ఒక ఆలోచనను చిత్రంగా మలచాలన్నా అప్పుడప్పుడూ కంటతడి పెట్టే అలవాటు ఉండాలంటున్నారు.   బ్యాక్టీరియాను చంపేస్తుంది తల్లిపాలు, లాలాజలం, వీర్యం వంటి అతికొద్ది పదార్థాలలో మాత్రమే కనిపించే ‘లైసోజైం’ అనే ప్రొటీన్‌ మన కన్నీరులో కూడా ఉంటుందట. ఇది మన శరీరంలోని బ్యాక్టీరియాను అతి సులువుగా చంపగలదని చెబుతారు. ప్రపంచాన్ని వణికించే ‘ఆంత్రాక్స్‌’ క్రిములను సైతం మన కంటినీరు నిర్వీర్యం చేయగలదట. హానికారక బ్యాక్టీరియా గోడలలోకి చొచ్చుకుపోవడంలో లైసోజైం తీరే వేరంటున్నారు.   బంధాలను నిలుపుతుంది ఇతరులతో మనకు ఉండే ప్రతిస్పందనలకు ఏడుపుని పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఒక కష్టాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు, ఇతరుల బాధని చేతల్లో మాన్పలేనప్పుడు... ఎదుటివారి భుజం మీద తల పెట్టి భోరున ఏడ్చేస్తే చాలు. మనకి వాళ్లు, వాళ్లకి మనం ఉన్నామన్న భరోసా ఏర్పడుతుంది. ఓ నాలుగు కన్నీటి చుక్కలు ఒకోసారి తెగిపోయిన బంధానికి కూడా చిగురునిస్తాయి.   ముందుకు సాగే ధైర్యం కష్టసుఖాలు ద్వంద్వాలు. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేకుండా జీవితం సాగడం అసంభవం. ఆ విషయాన్ని గ్రహించి కష్టంలో నిబ్బరంగానూ, సుఖంలో నేలమీదా నిలబడినవాడే ముందుకు సాగిపోగలడు. కష్టం వచ్చినప్పుడు ఓ ఏడ్పు ఏడ్చేస్తే, ముందుకు పోయేందుకు సాంత్వన లభిస్తుంది. ఎడతెగని బాద నుంచి తేరుకోవాలన్నా, మనసుని మళ్లీ కుదుటపరచుకోవాలన్నా అది ఏడుపుతోనే సాధ్యం. లేకపోతే ఆ కష్టం మనసులోనే తిష్ట వేసుకుని జీవితాన్ని అటకాయిస్తుంది. అందుకని జీవితం ప్రవహించాలంటే, ఒకోసారి కన్నీరు కూడా ప్రవహించాల్సిందే!   ఏడుపు వల్ల అటు ఆరోగ్యంగానూ, ఇటు మానసికంగానూ ఉన్న ఇలాంటి లాభాల గురించి చెప్పుకోవాలంటే పెద్ద జాబితానే తయారవుతుంది. ఏడుపులో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే జపానులో ‘rui-katsu’ పేరుతో బలవంతంగా ఏడ్చే సంఘాలు ఏర్పడుతున్నాయి. ఏడుపు వల్ల నానారకాల సమస్యలూ తీరిపోతాయని ఈ సంఘపు సభ్యులు నమ్ముతారు. అలా మరీ బలవంతంగా ఏడవక్కర్లేదు కానీ, సందర్భం వచ్చినప్పుడు కన్నీటిని దాచుకోకుండా ఉంటే చాలేమో!   - నిర్జర.

పసిపిల్లలు కోపాన్ని పసిగట్టేస్తారు

పసిపిల్లల ముందు కోపంగా ఏదన్నా ఒక మాట అంటే... వారు ఒక్క క్షణం బిత్తరపోవడాన్ని గమనించవచ్చు. ఇంకా పారాడే పసిపిల్లలే కదా! వారికి మన మాటల్లోని కోపం, ఉద్రిక్తత, చిరాకు, సంతోషం, ప్రేమ... వంటి అనుభూతులు ఎలా తెలుస్తాయి? అనుకోవడానికి వీల్లేదు. పసిపిల్లలకు ఇంకా భాష రాకపోయినా భావం తెలిసిపోతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. భాష - భావం మనం ఏ భావంతో మాట్లాడుతున్నామన్న విషయాన్ని పిల్లలు ఎంతవరకు గ్రహించగలుగుతారు అనే అనుమానంతో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు ఒకే తరహా వాక్యాన్ని వేర్వేరు ఉద్వేగాలతో పిల్లల ముందు పలికి చూశారు. అలా ఒకే వాక్యాన్ని వేర్వేరు రకాలుగా పలికినప్పుడు, పిల్లల మెదడులో ఎలాంటి ప్రతిస్పందనలు ఏర్పడుతున్నాయో గమనించేందుకు వారి మెదడుని స్కానింగ్ చేశారు. పట్టేశారు ఆశ్చర్యకరంగా వాక్యంలోని పదాలు మారకపోయినా... ఆ వాక్యాన్ని ఉచ్ఛరించిన తీరు ద్వారా పిల్లలు, ఆ మాట వెనుక ఉన్న ఉద్వేగాన్ని గమనిస్తున్నట్లు తేలింది. ఇది ఏమంత తేలికైన ప్రక్రియ కాదంటున్నారు పరిశోధకులు. ఎంత అధునాతనమైన రోబో అయినా కూడా తను వినే మాట వెనుక ఉన్న భావాన్ని గ్రహించడం కష్టమని అంటున్నారు. అలాంటి ఏడాది అయినా నిండని పసిపిల్లలు ఇలాంటి నేర్పు సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారీ పరిశోధనలకు మూలం పిల్లలు తాము వినే స్వరాల వెనుక దాగిన ఉద్వేగాలను గ్రహిస్తారన్న విషయం తేలిపోయింది సరే! మరి ఆ నేర్పు వారికి ఎలా అలవడుతుంది? ఏ లక్షణాల ఆధారంగా వారు శబ్దాలను విశ్లేషించగలుగుతున్నారు? అన్న విషయాల మీద ఇక పరిశోధన జరగవలసి ఉందట. దీని వలన భాషకు సంబంధించి, పిల్లల మెదడు ఎదిగే విధానానికి సంబంధించి, మనం ఉద్వేగాలను గ్రహించే తీరుని గురించి కొత్త విషయాలు తెలుస్తాయని ఆశిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త! పిల్లలోని ఈ నేర్పు వెనుక కారణాలు, దాని వలన ఉపయోగాలు గురించి శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు పరిశోధించేలోపల మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. పసిపిల్లలే కదా! వారికేం తెలుస్తుందిలే అని వారి ముందు ఎడాపెడా ప్రవర్తించడానికి వీల్లేదు. వారు నిస్సహాయులు కాబట్టి తిరిగి మనల్ని ఏమీ అనలేరు అని విరుచుకుపడటం భావ్యం కాదు. ఏమో వాళ్లేం గ్రహిస్తున్నారో ఎవరికి తెలుసు? వారి మనసులో ఎలాంటి అభిప్రాయాలు రూపొందుతున్నాయో మనమెలా ఊహించగలం? అందుకే, పిల్లల ముందు కూడా తస్మాత్ జాగ్రత్త! - నిర్జర.    

భక్తిలో మెదడు మారిపోతుంది

ఈ రోజుల్లో మన మెదడులో మెదిలే ప్రతి భావాన్నీ పసిగట్టే అవకాశం ఉంది. అత్యాధునిక స్కానింగ్‌ పరికరాల ద్వారా శాస్త్రవేత్తలు మన మెదడు లోతుల్లో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి భక్తిలో మునిగితేలే వారి మెదడులో ఎలాంటి చర్యలు ఏర్పడుతూ ఉండవచ్చు? అన్న ప్రశ్న వచ్చింది కొందరు పరిశోధకులకి. వచ్చిందే తడువుగా క్రైస్తవంలో ‘Mormon’ అనే శాఖకి చెందిన కొందరు భక్తుల మీద ఓ ప్రయోగాన్ని చేశారు. ఆ ప్రయోగం తీరు ఇలా సాగింది...   భక్తిని రేకెత్తించారు ప్రయోగంలో భాగంగా క్రమం తప్పకుండా చర్చికి వెళ్లే ఒక 19 మంది భక్తులను ఎన్నుకొన్నారు. వీరిలో 12 మంది మగవారు, ఏడుగరు ఆడవారు ఉన్నవారు. ఒక గంటపాటు వీరి మెదడుని పరీక్షించే ప్రయత్నం చేశారు. ఈ గంటలో కొంతసేపు వారి చర్చి గురించిన విశేషాలు చెప్పారు, కాసేపు ప్రపంచ ప్రసిద్ధ గురువుల మాటలు వినిపించారు, కొన్ని నిమిషాలు బైబిల్‌ నుంచి కొన్ని సన్నివేశాలు చూపించారు, ఇంకొంతసేపు తమ ప్రార్థనా పుస్తకం నుంచి సూక్తులు చదివారు... ఇలా రకరకాలుగా వారిలో భక్తిభావనలు రేకెత్తే ప్రయత్నం చేశారు.   పరిశుద్ధాత్మను గమనించారా! అభ్యర్దులలోని భక్తిని ఒక స్థాయికి రేకెత్తించిన తరువాత - మీకోసం వచ్చే రక్షకుడి గురించీ, మీ కుటుంబాల గురించీ, మీరు చేరుకోబోయే స్వర్గం గురించీ ఊహించుకుంటూ... భక్తి పారవశ్యంలో మునిగిపొమ్మంటూ సూచించారు. ఇలాంటి ప్రతీ సందర్భం తరువాత ‘మీకు పరిశుద్ధాత్మ చేరువలో ఉన్నట్లు భావిస్తున్నారా?’ అంటూ వారిని అడిగి చూశారు. చేరువలో ఉన్నట్లు భావిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతోందో తెలియచేయమన్నారు.   స్పందనలను గమనించారు చర్చిలో జరిగే ప్రార్థనా సమావేశంలో చాలాసేపు పాల్గొన్న తరువాత భక్తులు ఎలాంటి అనుభూతికి లోనవుతారో... ఈ ప్రయోగం తరువాత ఇంచుమించుగా అదే తరహా మనఃస్థితికి చేరుకున్నారు. మనసులో ప్రశాంతతని అనుభవించడం, కంటి నుండి నీరు ధారలు కట్టడం వంటి భక్తి పారవశ్యపు స్థితికి అనుభవించారు. ఈ సందర్భంగా వారి శరీరంలోనూ, మెదడులోనూ అనేక మార్పులు జరగడాన్ని గమనించారు పరిశోధకులు. శ్వాస మరింత గాఢంగా మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి భౌతిక మార్పులు కనిపించాయి. ఇక మెదడులో అయితే nucleus accumbens, medial prefrontal cortex అనే భాగాలలో స్పష్టమైన స్పందనలు కనిపించాయి. ఇందులో nucleus accumbens భాగాన్ని ఉత్తేజానికి కేంద్రంగా భావించవచ్చు. సంగీతాన్ని వింటున్నప్పుడు, ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు... మనుషులు ఉద్వేగానికి లోనవడానికి కారణం ఈ కేంద్రమేనట. ఇక medial prefrontal cortex అయితే విచక్షణ, విశ్లేషణ, నిర్ణయాధికారం వంటి లక్షణాలను ప్రభావితం చేస్తాయి.   అదీ విషయం! మంచో చెడో మనలోని ఆలోచనల తీరు, విచక్షణా శక్తి... భక్తి వల్ల ప్రభావితం అవుతాయని తేలిపోయింది. అయితే ఒకో మతంలోని ఆచారాన్ని బట్టి ఈ తీరు మారే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ఉదాహరణకు హిందు, బౌద్ధ మతాలలో ప్రార్థనా రీతులు వేరుగా ఉంటాయి. ఏదైతేనేం... భక్తిభావం అనేది మన మెదడు మీద ప్రభావం చూపుతుందన్న విషయం మాత్రం సుస్పష్టం!              - నిర్జర.  

వీరికి హెచ్.ఐ.వి ఉంది. కానీ...

తెలియక చేసిన పొరపాటు కావచ్చు, అనుకోకుండా దక్కిన శాపం కావచ్చు... హెచ్‌.ఐ.వి ఎవరి జీవితంలోకి అయినా ప్రవేశించవచ్చు. అయితే ఆ వైరస్‌ ప్రవేశించడంతోనే జీవితం అంతం కాదనీ, ఇక మృత్యువే ఏకైక మార్గం కాదనీ గ్రహించి తీరడం అవసరం. హెచ్‌.ఐ.వికి మందు లేకపోవచ్చు. కానీ హెచ్‌.ఐ.వి పాజిటివ్‌ మనుషులు కూడా ఇతరులలాగానే బిడ్డల్ని కనేందుకు, సుదీర్ఘకాలం జీవించేందుకు తగిన చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే హెచ్‌.ఐ.వి పాజిటివ్‌ ఉన్నవారు తమలోని రోగనిరోధక శక్తి క్షీణించకుండా గమనించుకోవడం ఎంత అవసరమో, ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకోవడమూ అంతే అవసరం! మహా మహా సెలబ్రెటీలు సైతం హెచ్.ఐ.వితో జీవిస్తున్నారని తెలిస్తే... సామాన్యులలో కూడా ఆశకి రెక్కలు రావడం ఖాయం.   ఛార్లెస్ షీన్‌   హాలీవుడ్‌కి చెందిన ప్రసిద్ధ నటులలో ఛార్లెస్‌ షీన్‌ ఒకరు. Wall Street, Two and a Half Men, The Three Musketeers వంటి చిత్రాలతో పాటుగా అనేక టెలివిజన్ సిరీస్‌ ద్వారా షీన్‌ ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమే! అలాంటిది గత ఏడాది తనకు హెచ్.ఐ.వి ఉందని బహిరంగంగా ఒప్పుకోవడం ద్వారా షీన్‌ వార్తల్లోకి ఎక్కాడు. తాను నాలుగు సంవత్సరాలుగా హెచ్.ఐ.వితో బాధపడుతున్నాననీ, ఇప్పుడు దానిని బహిరంగంగా ఒప్పుకోవడంతో తన మనసులోని బాధ తీరిపోయిందనీ షీన్‌ చెప్పుకొచ్చాడు. ఇతరులు కూడా తాము హెచ్.ఐ.వి పాజిటివ్‌ అన్న విషయాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకోవాలని పిలుపునిచ్చాడు.   మేజిక్‌ జాన్సన్‌   బాస్కెట్‌బాల్‌ చరిత్రలోనే మేజిక్‌ జాన్సన్‌ది ఒక ప్రత్యేక అధ్యాయం. 12 సార్లు NBA విజేతగా, ఒలంపిక్‌లో స్వర్ణ పతకాన్ని సైతం సాధించిన ప్రతిభావంతునిగా జాన్సన్‌ క్రీడాలోకానికి పరిచయం. అయితే 15 ఏళ్ల క్రితమే జాన్సన్‌ తనకు హెచ్.ఐ.వి సోకిందన్న విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. వెల్లడించడమే కాదు, హెచ్.ఐ.వి గురించి ప్రజలలో అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. Magic Johnson Foundation పేరుతో హెచ్.ఐ.వి మీద ఒక యుద్ధాన్నే చేస్తున్నాడు. మరోపక్క దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ ఒక ఆరోగ్యవంతమైన బిడ్డకి కూడా జన్మనిచ్చాడు.   జెర్రీ హెర్మన్‌   హెచ్.ఐ.వి సోకిన వ్యక్తులు ఎక్కువ రోజులు బతకరు అనే అపోహ ఒకటి ఉంది. దీనిని పటాపంచలు చేయాలంటే హెర్మన్‌ గురించి చెప్పుకోవాల్సిందే. అమెరికాలో అటు నాటకాలకీ, ఇటు సినిమాలకీ ఎడాపెడా సంగీతాన్ని సమకూర్చడంతో హెర్మన్‌ దిట్ట. అందుకుగాను ఆయనకు లభించిన పురస్కారాలకి లెక్కలేదు. అలాంటి హెర్మన్ 1984లో తనకు హెచ్.ఐ.వి సోకిందని తెలియగానే హతాశుడయ్యాడు. ఇక ఎంతో కాలం బతకనంటూ స్నేహితులకు వీడ్కోలు సైతం ఇచ్చేశాడు. కానీ పోరాడిచూద్దాం అనే ఆలోచన ఆయన జీవితాన్ని నిలిపింది. 1990ల్లో హెచ్.ఐ.వి తీవ్రతను తగ్గించే మందులు రావడంతో ఇప్పటికీ హెర్మన్‌ హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన వయసు – 85 ఏళ్లు మాత్రమే!   క్రిస్‌ స్మిత్‌   క్రిస్‌ స్మిత్‌ నటుడు కాదు, క్రీడాకారుడు కాదు, సంగీతకారుడు అంతకంటే కాదు. ఆయనో పక్కా రాజకీయనేత. ఇంగ్లండులోని లేబర్ పార్టీ తరఫున అద్భుతాలు సృష్టించిన నాయకుడు. తాను హెచ్.ఐ.వితో బాధపడుతున్నానంటూ బహిరంగంగా ఒప్పుకొన్న తొలి బ్రిటన్‌ పార్లమెంటేరియన్‌. 1987 నుంచీ హెచ్.ఐ.వితో సతమతమవుతున్నా, దానిని మీద పైచేయి సాధిస్తూనే ఉన్నారు. హెచ్.ఐ.వి కోసం విరాళాలను సేకరించే సంస్థకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. వీరంతా గతం తాలూకు జ్ఞాపకాలు కాదు. వర్తమానంలో మనతో పాటుగా జీవిస్తున్నవారే! హెచ్.ఐ.వి అనే మహమ్మారితో నిశ్శబ్దంగా పోరాటం చేస్తున్నవారే! మరి వారి జీవితాలు ఇతరులు గెలుపు గుర్రాలని ఎక్కేందుకు స్ఫూర్తిగా ఎందుకు మారకూడదు!   - నిర్జర.

ఇవ్వడంలో ఉన్న తృప్తి

అది మధ్యాహ్నం సమయం. ఓ పెద్దాయన ఏవో సరుకులు తీసుకుందామని సూపర్‌మార్కెట్‌లో తిరుగుతున్నాడు. అదే సమయంలో ఓ ఆరేళ్ల చిన్నపిల్లవాడు షాపు యజమానితో ఏదో బతిమాలుతూ కనిపించాడు. ఆ పిల్లవాడిలో కనిపించిన దైన్యం చూసి పెద్దాయనకి జాలి వేసింది. వెంటనే పిల్లవాడి దగ్గరకు వెళ్లి ‘ఏంటి విషయం?’ అంటూ అడిగాడు. ‘మా చెల్లికి ఈ బొమ్మంటే చాలా ఇష్టం. అందుకే తన పుట్టినరోజుకి ఈ బొమ్మని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ నా దగ్గర ఉన్న డబ్బులు అందుకు సరిపోవంటున్నారు,’ అన్నాడు పిల్లవాడు దీనంగా.‘ఓ మీ చెల్లిని నీతోపాటు తీసుకురాలేదా!’ అని అడిగాడు పెద్దాయన.   ‘లేదు ఇప్పుడు మా చెల్లి మాతో పాటు ఉండటం లేదు,’ అంటూ ఒక్క నిమిషం ఆగాడు పిల్లవాడు. ఆ తరువాత బాధగా... ‘మా చెల్లి దేవుడి దగ్గరకు వెళ్లిపోయిందట. మా అమ్మ కూడా తొందరలో దేవుడి దగ్గరకు వెళ్లిపోతుందట. అందుకనే ఈ బొమ్మని మా అమ్మకి ఇచ్చి చెల్లి దగ్గరకి పంపుదామని అనుకుంటున్నాను,’ అన్నాడు పిల్లవాడు. ఒకపక్క పిల్లవాడు ఆ విషయాన్ని చెబుతుండగానే అతని చెక్కలి మీదగా కన్నీరు ధారకట్టింది.   పిల్లవాడి మాటలు విని పెద్దాయన మనసు బద్దలైపోయింది. ‘ఏదీ నీ దగ్గర ఉన్న డబ్బుని ఇలా ఇవ్వు. దాంతో బొమ్మ వస్తుందేమో ఇంకోసారి అడిగి చూద్దాము,’ అంటూ అతని చేతిలో డబ్బుని తీసుకున్నాడు పెద్దాయన. ఆ పిల్లవాడు చూడకుండా తన జేబులో ఉన్న నోట్లని అందులో కలిపి షాపు యజమానికి అందించాడు. ‘అరే ఇందాక సరిగ్గా చూసుకున్నట్లు లేదు. నీ దగ్గర ఉన్న డబ్బులు బొమ్మ కొనేందుకు సరిపోతాయట. పైగా ఇంకో పదిరూపాయలు కూడా మిగిలింది,’ అంటూ మిగిలిన చిల్లరను పిల్లవాడి చేతిలో పెట్టాడు పెద్దాయన.   ఆ బొమ్మనీ, చేతిలో ఉన్న పదిరూపాయలనీ తృప్తి చూసుకున్నాడు పిల్లవాడు. ‘మా అమ్మకి తెల్లగులాబీలంటే చాలా ఇష్టం. ఈ పదిరూపాయలతో ఆమెకి తెల్లగులాబీలు తీసుకువెళ్తాను. అదిగో ఆ వీధి చివరగా కనిపిస్తున్న ఇల్లే మాది. మీరు ఎప్పుడు కావాలనుకున్నా మా ఇంటికి రావచ్చు,’ అంటూ తుర్రుమన్నాడు.   పిల్లవాడు పరుగులుతీసిన వైపే పెద్దాయన చూస్తూ ఉండిపోయాడు. ఆయనకి హఠాత్తుగా మొన్న పేపర్లో చదివిన ఓ వార్త గుర్తుకువచ్చింది. ఒక తల్లీకూతురూ రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఓ లారీ వాళ్లని గుద్దేసిందనీ... కూతురు అక్కడికక్కడే చనిపోగా, తల్లి మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందనీ. ‘బహుశా తను చదివిన వార్త ఈ కుటుంబానిదేనేమో’ అనిపించింది పెద్దాయనకి. ఒక మనిషి నిర్లక్ష్యంతో మరో కుటుంబం ఎలా చిన్నాభిన్నమైపోతుందో కదా! అనిపించి ఆయన కళ్లు చెమర్చాయి.   మర్నాడు ఆ పెద్దాయని ఎందుకో ఆ ఇంటికి వెళ్లి చూడాలనిపించింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో, తడబడే అడుగులతో ఆ ఇంటిని చేరుకున్నాడు పెద్దాయన. ఆ ఇంటి ముందు గుమికూడిన జనాన్ని చూసి ఆయన మనసు కీడు శంకించింది. ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పెద్దాయనకు అక్కడ ఓ శవపేటిక కనిపించింది. అందులో ఒక అందమైన యువతి. ఆ యువతి చేతిలో ఓ తెల్లగులాబీ, పక్కనే నిన్న తాను కొనిపెట్టిన బొమ్మా కనిపించాయి. ఇంతలో నిన్న కనిపించిన పిల్లవాడు పరుగులెత్తుకుంటూ ఆ పెద్దాయన దగ్గరకి వచ్చాడు.   ‘మా అమ్మ దేవుడి దగ్గరకు వెళ్లేలోపే ఆమెకి ఇష్టమైన తెల్లగులాబీలు ఇచ్చాను. దేవుడి దగ్గర చెల్లి కనిపిస్తే బొమ్మని ఇవ్వమని కూడా చెప్పాను. అమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్లిపొతుందంటే చాలా బాధగా ఉంది. కానీ పాపం చెల్లి నాకంటే చిన్నది కదా! అందుకని అమ్మ చెల్లి దగ్గర ఉండటమే కరెక్ట్‌,’ అని గబగబా చెబుతున్నాడు పిల్లవాడు.   పిల్లవాడి మాటలకి పెద్దాయన కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆ పిల్లవాడిది చావుని అర్థం చేసుకునే వయసు కాదు! కానీ ఇవ్వడంలో ఉన్న తృప్తిని మాత్రం తెలుసుకున్నాడు. పిల్లవాడి మనసు ఇక్కడితో ఆగిపోతే బాగుండు అనిపించింది పెద్దాయనకి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.  

The benefits of Jigsaw Puzzle

Who doesn’t love to play with a Jigsaw Puzzle? But have we ever thought that these puzzles are not just a sort of fun or a form of recreation! For centuries together, they have been an exercise to our mind. Let’s watch out for some of the benefits that come together along with a Jigsaw Puzzle.   Simplest In this world of digital mess, Jigsaw puzzles offer an inexpensive and long lasting entertainment. No screen, no battery, no plastic and no mechanism! That’s what a Jigsaw puzzle is all about. That is the reason why the popularity of Jigsaw puzzle reached new heights during the times of Great Depression.  If you want to keep your children from all versions of Idiot boxes, Jigsaw could be the perfect answer.   Food for mind Every corner of the mind gets activated while solving a Jigsaw puzzle. It allows the kids to recognise different shapes. It encourages them to tackle the problem and make a judgement. Their thought process gets matured. On a whole- solving a Jigsaw puzzle is like an exercise to our mind. It would enhance the memory and problem solving capacity of the grey matter.   Co-ordination Hand- eye coordination of a kid is an important aspect in his development. And Jigsaw puzzles could perfectly assist him in achieving such maturity. It’s not just the Hand- eye coordination that gets better with Jigsaw puzzle, motor skills such as the right movement of fingers would also gets enhanced while solving a Jigsaw.   Tranquillity Concentrating on a Jigsaw puzzle could be the best way to calm down a mind. A mind distracted over various problems could be assigned with a single task of solving the Jigsaw. This would not only improve our concentration, but would also strengthen our levels of patience. People who often play Jigsaw puzzles could be those who can face any task with tranquillity.   Game for everyone Every game has its own age restrictions. But Jigsaw could be a game for any generation. Depending on the number of pieces and the complexity of the picture... it could be anyone’s game. Which means that the members of a family could get together to solve a Jigsaw... and that could be a perfect occasion for them to spend their time together.   Some people say that Jigsaw encourages our creativity and some others suggest that it enhances our visual perception; some even argue that solving a Jigsaw puzzle would increase our goal setting abilities and management skills. Whatever might be the reason... no one can ever ignore that a Jigsaw puzzle is one of the best forms of entertainment that man has ever invented.     - Nirjara.

ఆడుకునే బొమ్మలు కూడా మెదడుని మార్చేస్తాయి

  అలా సూపర్‌మార్కెట్టులో సరుకులు కొనుక్కుంటూ తిరిగే సమయంలో మనకి అకస్మాత్తుగా ఎవరో తారసపడతారు. అతని మొహం ఎక్కడో చూసినట్లుందే అని అనిపిస్తుంది. అనిపిస్తుందే కానీ సదరు మొహం ఎవరిదో, దానిని ఇంతకుముందు ఎప్పుడు చూశామో గుర్తుకురాదు. ఈ సమస్య అందరిదీనూ! కానీ మొహాలను గుర్తుంచుకోవడం అనే కళలో ఆడవారికీ మగవారికీ మధ్య తేడాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు.   ఇప్పటివరకూ మగవారు ఆడవారికంటే ఎక్కువకాలం పరిచయస్థుల మొహాలను గుర్తుంచుకుంటారు అని నమ్మేవారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తేల్చుకోవాలనుకున్నారు. అందుకోసం ఓ 295 మంది అభ్యర్థుల మీద ఓ పరీక్షని నిర్వహించారు. వీరిలో 161 మంది మగవారు కాగా 134 మంది స్త్రీలు. వీరందరికీ ఆరు చిత్రాలని చూపించారు. ఈ చిత్రాలలో మగవారి మొహాలు, ఆడవారి మొహాలే కాదు... బార్బీ డాల్‌ మొహాలు, ట్రాన్స్‌పార్మర్ బొమ్మల మొహాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు రకరకాల కార్ల బొమ్మలని కూడా చూపించారు.   ఇలా ఆరు చిత్రాలను చూపించిన తరువాత, వారికి ఓ మూడు చిత్రాలు చూపించారు. ఈ మూడింటిలో రెండు కొత్తవి, ఒకటి మాత్రం ఇంతకుముందు చూసిన ఆరు చిత్రాలలో ఒకటి ఉండేట్లుగా అమర్చారు. ఈ ప్రయోగంలో తేలిందేమిటంటే... కార్లని గుర్తుపట్టడంలో మగవారు ఆడవారికంటే ఎక్కువ చురుగ్గా కనిపించారు. కానీ వ్యక్తుల మొహాలని గుర్తుపట్టడంలో మాత్రం ఇద్దరికీ సరిసమానంగా మార్కులు పడ్డాయి. కాకపోతే ఇందులో ఒక తిరకాసు ఉంది. బార్బీ బొమ్మలనీ, వాటిని పోలిన మొహాలనీ గుర్తుపట్టడంలో ఆడవారిది పైచేయిగా ఉంటే... ట్రాన్స్‌ఫార్మర్‌ బొమ్మలనీ, వాటిని పోలిన ముఖాలను గుర్తుపట్టడంలో మగవారిది పైచేయి అయ్యింది.   మొహాలను గుర్తుపట్టడంలో ఆడవారికీ, మగవారికీ మధ్య ఉన్న వ్యత్యాసానికి కారణం ఏమిటా అని పరిశోధించిన శాస్త్రవేత్తలకు ఊహించని జవాబు దొరికింది. చిన్నప్పుడు ఆడపిల్లలు బార్బీ బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి వారి మెదడులో అలాంటి రూపాలని త్వరగా నిక్షిప్తం చేసుకునే వ్యవస్థ ఏర్పడుతుందనీ... మగపిల్లలు కార్లు, ట్రాన్సఫార్మర్ బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి వారి జ్ఞాపకాలు అలాంటి మొహాల చుట్టూ పెనవేసుకుని ఉంటాయనీ తేలింది.   మన దేశంలోని పిల్లలు బార్బీ డాల్స్‌తోనూ, ట్రాన్సఫార్మర్‌ బొమ్మలతోనూ ఆడుకోకపోవచ్చు. కానీ ఏవో ఒక బొమ్మలతో ఆడుకోవడం అయితే ఉంటుంది కదా! అవి ఎలాంటివైనా కూడా వారి మనస్తత్వం మీదా మానసిక ఎదుగుదల మీదా ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనతో తేలిపోయింది. ‘పిల్లవాడు గ్రహాంతరవాసుల గురించి తీసిన ఒక సైన్స్‌ ఫిక్షన్‌ ధారావాహికను చూసినా కూడా, అది ‘మొహాలని గుర్తుపెట్టుకోవడం’ అనే అతని నైపుణ్యం మీద ప్రభావం చూపుతుంది,’ అంటున్నారు ఈ పరిశోధనను నిర్వహించిన శాస్త్రవేత్తలు. కాబట్టి పిల్లలు వేటితో ఆడుతున్నారో, ఏమేం చూస్తున్నారో కూడా మనం గమనించుకోవాలన్నమాట!   - నిర్జర. 

ఇలాంటి మాటలెందుకు!

  మనిషికి మాటే పరికరం. ఒక మనిషితో కలవాలన్నా, ఓ మనిషి మనసు విరవాలన్నా మాటతోనే సాధ్యమవుతుంది. అందుకే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దలు. విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వెలువడిన మాట వెనక్కి రావడం కష్టం కాబట్టి... ఆ జాగ్రత్త ముందే ఉండాలంటారు. ఎవరు ఎలా మాట్లాడతారు అనేది వారి నేర్పుని బట్టీ, వ్యక్తిత్వాన్ని బట్టీ ఆధారపడి ఉండవచ్చు. కానీ సంభాషణల్లో కొన్ని రకాల మాటలు లేకపోవడమే సంస్కారం అనిపించుకుంటుంది.   పరోక్షపు ఎత్తిపొడుపులు కొంతమందికి కోపం వస్తే దానిని నేరుగా వ్యక్తీకరించి విషయాన్ని తేల్చుకోరు. పరోక్షంగా సూటీపోటీ మాటలు అంటూ ఉంటారు. పిల్లి మీదా కుక్క మీదా పెట్టి దెప్పి పొడుస్తూ ఉంటారు. తమ మాటలు తగలాల్సినవారికి గుచ్చుకున్నాయి కదా అని వీరు సంబరపడిపోవచ్చుగాక. కానీ ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించినవారి మనసు మాత్రం తీవ్రంగా నొచ్చుకుంటుంది. నేరుగా అనే మాటలకంటే ఇలాంటి మాటలే ఎక్కువగా నొప్పిస్తాయి. ఆ మాటలు అన్న మనిషి పట్ల మనసులో ఓ చెడు అభిప్రాయాన్ని కలగచేస్తాయి.   వ్యక్తిగత వివరాలు అదేమిటో గానీ.. కొంతమంది పరిచయం అయిన కొద్దిసేపట్లోనే మీ జీతం ఎంత? మీ కులం ఏమిటి? వంటి వ్యక్తిగత వివరాలను అడిగేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే హద్దులు దాటుకుని ఇంట్లోని వివరాలను సైతం రాబట్టేందుకు ఆబగా ప్రయత్నిస్తారు. అవతలివారితో మనకు ఎంతవరకు చనువు ఉంది! వారి వ్యక్తిగత విషయాలలో మన జోక్యం ఎంతవరకు ఉండాలి! అన్న ఆలోచన లేకపోతే ఎంతటి పెద్దవారి మీదైనా ప్రతికూల అభిప్రాయమే ఏర్పడుతుంది.   ఉచిత సలహాలు విచక్షణ ఉన్న ప్రతివారికీ తన జీవితాన్ని ఎలా నడుపుకోవాలి అన్న అవగాహన ఉంటుంది. మరీ అవసరం అనుకుంటే అవతలివారిని సలహా అడుగుతాడు. అలాంటి సమయంలో మనకి తోచిన సలహాని ఇవ్వడంలో తప్పులేదు కానీ... అవతలి మనిషి జీవితం ఎలా నడవాలో మనమే సలహా ఇచ్చేందుకు ప్రయత్నిస్తే భంగపడక తప్పదు. ‘మీ నాన్నాగారిని మీతో ఉంచుకోకుండా పంపేయవచ్చుగా!’, ‘మీ కొడుకు ఇంజినీరింగ్ కాకుండా డాక్టరు చదివించవచ్చుగా!’, ‘మీరు ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టుకోవచ్చుగా!’ అంటూ ఇచ్చే సలహాల దగ్గర్నుంచీ పంటి నొప్పికి ఏం వాడాలి, పొట్ట తగ్గడానికి ఏం చేయాలి వరకూ ఇచ్చే సవాలక్ష సలహాలు స్నేహ బంధాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. సలహా అనేది ఒక ఆయుధం. అది అవసరం అనుకున్నప్పుడే ప్రయోగించాలి. లేకపోతే దానివల్ల వినాశనం తప్పదు.   సోత్కర్ష ప్రతి ఒక్కరి జీవితమూ విలువైనదే! అందులో అనుమానమేమీ లేదు. కొందరు కాస్త ఎక్కువ శ్రమపడి పైకి రావచ్చు. ఇంకొందరు అడ్డూఅదుపూ లేకుండా డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు. ఇలాంటి వారందరికీ తమ జీవితాన్ని చూసుకున్నప్పుడు చాలా గర్వంగా ఉండటం సహజం. కొండొకచో మిగతా వారిని చూస్తే చులకనా సహజమే! కానీ నిరంతరం తమ ఆత్మకథ గురించి కథలు కథలుగా డప్పు కొట్టుకుంటూ ఉంటే వినేవారి చెవులు చిల్లులుపడక తప్పదు. మొహమాటం కోసం మొహం మీద చిరునవ్వు పులుముకున్నా.... ఇదెక్కడి ఖర్మరా బాబూ అని తిట్టుకోకా తప్పదు.   పుకార్లు మనకి రూఢి కాని విషయం, అందునా ఇంకొకరి గురించి చెడుగా చెప్పుకునే విషయం, పైగా ఇతరులు ఎవ్వరికీ ఉపయోగం లేని విషయం... ఓ పనికిమాలిన పుకారు కాక మరేమవుతుంది. ఇలాంటివాటి వల్ల ఇసుమంతైనా ఉపయోగం లేకపోగా పనికిమాలిన చెత్తని పంచిన మకిలి మాత్రం మనకి అంటుకుపోతుంది. పైగా ఇలాంటి పుకారు వల్ల ఒకోసారి సదరు మనిషి జీవితమే చిక్కుల్లో పడిపోతుంది. మనమూ వివాదాల్లోకి ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడుతుంది.   ఇవే కాదు! గొప్ప కోసం అబద్ధాలు చెప్పడం, ఇతరులతో పోల్చి చూడటం, వెకిలి పదాలు ప్రయోగించడం, తాత్కాలికంగా పైచేయి సాధించేందుకు అవతలి మనిషిని ఎగతాళి చేయడం వంటి లక్షణాలని మన సంభాషణల నుంచి దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే అరగంటలో ముగిసిపోయే సంభాషణ కంటే కలకాలం నిలిచిపోయే బంధమే ముఖ్యం కదా! తాత్కాలికంగా తృప్తి పడే అహంకారంకన్నా, చెదిరిపోని సంస్కారం విలువైనది కదా!     - నిర్జర.