Read more!

2017లో ఆకలి చావులు ఉండవా!

 

విజ్ఞానం ఇంతగా ఎదిగింది. శాస్త్రవేత్తలు ఇన్నేసి విషయాలను కనుగొంటున్నారు. అయినా ఏటా లక్షలాది మంది ప్రజలు ఆకలితో చనిపోతున్నారంటే వినడానికి బాధగా ఉంటుంది కదూ! సాటివాడి ఆకలిని మాన్పలేనప్పుడు విజ్ఞానం ఎంత ఎదిగి మాత్రం ఏంటి ఉపయోగం. అందుకు సమాధానంగా ఒక జవాబు లభిస్తోంది. ఆ జవాబుతో కోట్లాదిమంది ప్రజల ఆకలి తీరనుందని ఆశిస్తున్నారు.

 

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతి 15 మందిలో ఒక పిల్లవాడు ఐదో ఏడు చూడకుండానే చనిపోతున్నాడట. తగిన ఆహారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలడం దురదృష్టకరం. ఇక ఆఫ్రికా సంగతి చెప్పనే అక్కర్లేదు. అక్కడ ప్రతి నలుగురు పిల్లల్లోనూ ఒక పిల్లవాడు తీవ్రమైన ఆకలితో అల్లల్లాడిపోతున్నాడని లెక్కలు చెబుతున్నాయి. పేదరికం, కరువు, అంతర్గత కలహాల వంటి రకరకాల కారణాలతో అక్కడి పిల్లలకి తిండే దొరకడం లేదు.

 

తేలికగా ఆహారాన్ని పండించడం, పండించిన ఆహారం అందరికీ చవకగా లభించడం, అలా లభించిన ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండటం అనే మూడు సమస్యలకీ సమాధానంగా ‘Harvest Plus’ అనే స్వచ్ఛంద సంస్థ కొన్ని పరిశోధనలని మొదలుపెట్టింది. దీనికి  International Potato Center కి చందిన శాస్త్రవేత్తలు కూడా తోడవ్వడంతో ఒక కొత్తరకం చిలగడదుంపను కనుగొన్నారు. అనేక రకాల చిలగడ దుంపల మీద అధ్యయనం చేస్తూ చివరికి ఓ సంకరజాతి చిలగడదుంపను సాధించారు.

 

కొత్తగా కనుగొన్న చిలగడదుంపలో కావల్సినంత విటమిన్‌ ఏ ఉంటుందట. ఈ విటమిన్‌ ఏ లభించకపోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదులక్షల మంది చూపుని పోగొట్టుకొంటున్నారనీ, వారిలో సగానికి సగం మంది ఏడాది తిరిగేలోపే మృత్యువాత పడుతున్నారనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఆఫ్రికాలో అయితే ఏటా 4 కోట్ల మంది పిల్లల జీవితాలు విటమిన్ ఏ లోపంతో చిన్నాభిన్నమైపోతున్నాయని తేలింది. అంటే అలాంటి పిల్లల పాలిట వరంగా ఈ చిలగడదుంప మారబోతోందన్నమాట. అంతేకాదు మొజాంబిక్‌ వంటి దేశాలలో తరచూ వచ్చే కరువుని సైతం ఎదిరించి ఈ మొక్క ఎదుగుతుందట. ఇటు కరువునే కాదు అటు తెగుళ్లని కూడా ఈ మొక్క ఎదుర్కొంటుందని పరిశోధనల్లో బయటపడింది.

 

మొత్తానికి ఓ చిన్న చిలగడదుంపతో ప్రపచంపు ఆకలి తీరిపోతుందనీ, పోషకాల లోటుని నివారించవచ్చనీ విజ్ఞానప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. అందుకనే ఏటా ఆహార రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక ‘world food prize’ పురస్కారాన్ని ఈ చిలగడదుంపని కనుగొన్న శాస్త్రవేత్తలకీ, Harvest Plus అధినేతకీ అందించారు. టైమ్స్ పత్రిక 2016కి సంబంధించిన గొప్ప ఆవిష్కరణలలో ఒకటిగా ఈ చిలగడదుంపను కూడా పేర్కొంది. ‘ప్రాణాలను కాపాడే ఆహారం’గా వీటిని వర్ణించింది. అదే నిజమైతే అంతకంటే కావల్సింది ఏముంది.

 

- నిర్జర.