అవినాష్ రెడ్డిని జగన్ వదిలించేసుకుంటారా?
తన కోసం, తన బాగు కోసం పని చేసిన వారిని కూరలో కరివేపాకులా తీసి పారేయడం జగన్ కు అలవాటే. తన రాజకీయ ప్రస్థానంలో అలా జగన్ కోసం పని చేసి ఆ తరువాత ఆయన చేత అవమానాలు ఎదుర్కొని దూరమైపోయిన వారు ఎందరో ఉన్నారు. ప్రధానంగా తన కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం కాలికి బలపం కట్టుకని మరీ రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన సొంత చెల్లి షర్మిల, తాను అరెస్టైనప్పుడు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన తల్లి విజయమ్మనూ అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఎలా పక్కన పెట్టేశారో రాష్ట్రం మొత్తం తెలుసు. చివరాఖరికి ఆస్తుల విషయంలో కూడా వారిపై కేసులు పెట్టి మరీ సాధిస్తున్నారు
జగన్. తన రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను వాడుకుని వదిలివేయడం జగన్ కు కొత్తేమీ కాదు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సహా పార్టీలో జగన్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిచ్చెనలా వాడుకుని వదిలివేసిన వారెందరో కనిపిస్తారు. ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా ఎక్కడకు వెళ్లినా ఆ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మంత్రిని చేస్తా అంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్నడూ భావించలేదు. మంగళగిరిలో 2019 ఎన్నికలలో లోకేష్ పై గెలిచిన ఆర్కే ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడు కూడా చిన్నబోయేంత పెద్దదిగా ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా జగన్ వదిలేసే, కాదు కాదు వదిలించుకునే వ్యక్తి ఎవరంటే వైసీపీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్న పేరు కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
ఔను వైఎస్ అవినాష్ రెడ్డిని వదిలించుకోవడం తప్ప జగన్ కు ఇప్పుడు మరో దారి కనిపించడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టిన వారిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. వారు ఏ కలుగులో దాగున్నా వెతికి పట్టుకుని చట్టం ముందు నిలుపుతోంది. కోర్టులు సైతం బూతు పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా దాఖలైన పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తప్పు చేసి బెయిలు అడిగితే ఎలా అని నిలదీస్తోంది. దీంతో ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అసభ్య, అసహ్య, అశ్లీల పోస్టులతో ప్రత్యర్థి పార్టీ నాయకులు, వారి కుటుంబీకులను వేధించి, మనో వేదనకు గురి చేసిన వారి గుండెళ్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. క్షమాపణలు చెప్పుకునో, కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకునే తప్పించుకునే వీలు లేదని అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తాను అసభ్య పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారంటూ ఇటీవల అరెస్టైన వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో తాను అసభ్య పోస్టుల వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడరి వర్రారాఘవరెడ్డి కుండబద్దలు కొట్టడంతో ఇప్పుడిక జగన్ కు ఆయనను వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
అలా కాకుండా ఇంకా అవినాష్ ను చిన్న పిల్లోడు, సాత్వికుడు అంటూ వెనకేసుకుని వస్తే.. స్వయంగా జగన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అసలు వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకుని రావడం వల్లే కంచుకోట లాంటి కడపలో వైసీపీ దెబ్బతింది. వర్రా వాంగ్మూలంతో జగన్ తల్లిని, చెల్లిని అసభ్యంగా దూషిస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి పిఎ, అతని వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని సందేహాలకు అతీతంగా తేలిపోయింది. అప్పటి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్ చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ ఉన్నారని వర్రా వాంగ్మూలంతో తేలిపోవడంతో ఇక జగన్ వారిని పట్టించుకునే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రానున్న రోజులలో జగన్ స్వయంగా తన తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని వైసీపీ వెనకేసుకు రాదని, వారిని సమర్ధించదనీ మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ విస్పష్టంగా చెప్పేశారు. జగన్ కూడా ముందు ముందు అదే చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పటికే తన ఐదేళ్ల అరాచక పాలనను ఛీ కొడుతూ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని ఇచ్చిన జనం ఇక ముఖం మీదే ఛీ కొట్టే పరిస్థితి వస్తుందని అంటున్నారు.