వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై టెక్కలి పీఎస్ లో ఫిర్యాదు

వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దువ్వాడ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే..  దివ్వెల మాధురితో ఆయన సాన్నిహిత్యం, అనుబంధం కారణంగా ఎపిసోడ్ గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కనిపిస్తోంది. ఆయన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా టెక్కలి పోలీసు స్టేషన్ లో జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్  ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై   అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.  పవన్ కల్యాణ్ పైనా, ఆయన  కుటుంబం దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. పలువురిని ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టులకు వెళ్లినా కూడా ఊరట లభించడం లేదు. ఇష్ఠారీతిగా నోరు పారేసుకుని శిక్షించవద్దంటూ కోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ఏపీ హైకోర్టు కూడా ఇటీవల వ్యాఖ్యానించింది. రామ్ గోపాల్ వర్మ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయిస్తే.. తరువాత అవసరమనుకుంటే బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోండి, అంతే కానీ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేయలేమని కోర్టు విస్పష్టంగా చెప్పింది. అలాగే సోషల్ మీడియా వ్యాఖ్యలపై అరెస్టులను ఆపాలంటూ సీనియర్ జర్నలిస్టు విజయబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగానూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడి, ఇప్పుడు  కోర్టును ఆశ్రయించి ఏం లాభం అంటూ చీవాట్లు పెట్టింది. న్యాయమూర్తులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసింది. దీంతో అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు, వైసీపీ నేతలకు ఇప్పుడు అరెస్టుల భయం వెంటాడుతోంది. ఆ క్రమంలోనే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలిలో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఆయనకు కూడా నేడో రేపో పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.  

పోలీసులపై తిరగబడిన అఘోరీ... మంగళగిరిలో అరెస్ట్

గత రెండు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరీని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సనాతన సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ కుచెందిన జనసేన కార్యాలయం  ఎదుట రోడ్డుపై అఘోరీ బైఠాయించారు. రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం వాటిల్లడంతో వెంటనే పోలీసులు రంగంలో దిగారు. వీరిలో మహిళా కానిస్టేబుళ్లు  కూడా ఉన్నారు. రోడ్డుపై బైఠాయించిన ఆమెను  కలవడానికిిి భక్తులు వచ్చి  సందర్శించారు. పోలీసులు నచ్చజెప్పినప్పటికీ ఎంతకూ అఘోరీ వినలేదు. పోలీసులపై ఆమె ఒంటి కాలిపై లేచారు. ఈ సమయంలో ఆమెను డిసిఎం వ్యానులో ఎక్కించే ప్రయత్నం చేశారు పోలీసులు. వ్యానులో నుంచి  ఒక్కసారిగా క్రిందకు  దూకేసిన అఘోరీని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో పోలీస్ అధికారులపై అఘోరీ చేయి చేసుకున్నారు. వపన్ కళ్యాణ్ ను తాను కలవడానికి వచ్చినట్టు ఆమె స్పష్టం చేశారు. ఈ నెల మొదటివారంలో ఎపిలో ఎంటర్ అయిన అఘోరీ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని  దర్శించుకున్నారు.దీంతో ఆమె ఎపి పర్యటన పూర్తి అయ్యింది. ఆమె తెలంగాణలో పర్యటించనున్నారని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా   మళ్ళీ ఎపిలో ఎంటయ్యారు.   సాత్విక చింతనలో ఉండాల్సిన  అఘోరీ పోలీసులపై తిరగబడటం చర్చనీయాంశమైంది. 

కరణం బలరాం హోం కమింగ్.. నిజమేనా?

ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో  కరణం బలరాం కూడా ఒకరు. చీరాల మాజీ ఎమ్మెల్యే అయిన కరణం బలరాం  గతంలో తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్,  కేసీఆర్, కరణం బలరాంలు నారా చంద్రబాబునాయుడికి అత్యంత విధేయులుగా, ఇంకా చెప్పాలంటే ఆయనకు సూసైడ్ స్క్వాడ్ గా గుర్తింపు పొందారు. అంటే చంద్రబాబు చూసి రమ్మంటే కాల్చివచ్చే నేతలు అన్న మాట. అలాంటి వారిలో  తరువాతి కాలంలో ముందు కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమై సొంతంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ స్థాపించి.. రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కరణం బలరాం కూడా 2019 తరువాత తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. అక్కడ సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడ్డారనుకోండి అది వేరే సంగతి. కరణం బలరాం తెలుగుదేశం తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా  గెలిచారు.   2019 ఎన్నికలలో చీరాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం ఆ తరువాత వైసీపీ గూటికి చేరారు. అంతకు ముందు వరకూ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కరణం బలరాం తెలుగుదేశం వీడి వైసీపీలో చేరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని 2024 ఎన్నికలలో తన స్థానంలో కుమారుడిని పోటీలో దింపాలన్న ఆలోచనతోనే కరణం బలరాం వైసీపీ గూటికి చేరారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. ఏది ఏమైనా కరణం బలరాం తెలుగుదేశం పార్టీని వీడి జగన్ పంచన చేరడంతో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పార్టీ నుంచి పదవులు, గుర్తింపు పొంది పార్టీ కష్టకాలంలో ఉండగా గోడదూకేయడంతో బలరాంకు చీరాల నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా క  నిరసన సెగలు తగిలాయి. అయితే వాటిని వేటినీ కరణం బలరాం పట్టించుకోలేదు. ఆయన కోరుకున్నట్లుగానే 2024 ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన కుమారుడు కరణం వెంటేష్ పోటీ చేశారు. అయితే ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ పార్టీ కూడా పరాజయం మూటగట్టుకుని రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.  ఆ తరువాత కరణం వెంకటేష్ కు జగన్ జిల్లా పార్టీ  అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కరణం బలరాం ఆశించారు. అయితే జగన్ మాత్రం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మేరుగ నాగార్జునకు కట్టబెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కరణం బలరాం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుమారుడితో సహా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూర్చే సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.  రాష్ట్రంలో వైసీపీ పరాజయం తరువాత ఎక్కడా బయటకు కనిపించని కరణం బలరాం విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో వరద బాధితులకు సహాయం అందించడానికి ఒక సారి బయటకు వచ్చారు. ఆ సమయంలో వైసీపీ నేతలు ఎవరూ కూడా వరద బాధితుల వైపు కనీసం తొంగి కూడా చూడలేదు. వైసీపీ అధినేత ఒక సారి వరద బాధితుల పరామర్శకు వచ్చినా కేవలం గంటా రెండు గంటల వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి మమ అనిపించేశారు. వరద బాధితులను పార్టీ తరఫున ఆదుకుంటామని ప్రకటించిన ఆయన సీఎం సహాయ నిధికి పార్టీ నేతలెవరూ విరాళాలు ఇవ్వవద్దని పిలుపు ఇచ్చారు. వైపీపీ తరఫున కోటి రూపాయలు సహాయం ప్రకటించేసి చేతులు దులిపేసుకున్నారు. అయితే పార్టీ అధినేత పిలుపునకు భిన్నంగా వరద సహాయ కార్యక్రమాలలో కరణం బలరాం పాల్గొన్నారు. తెలుగుదేశంతో కలిసి నడవకపోయినా, సొంత స్థాయిలోనే ఆయన అప్పట్లో సహాయ కార్యక్రమాలు చేశారు.  ఆ తరువాత ఇటీవల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి మనవడి వివాహ నిశ్చితార్థ వేడుకలో కరణం బలరాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. ఆ సందర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియకపోయినా అప్పట్లోనే కరణం బలరాం తెలుగుదేశం గూటికి చేరనున్నారని రాజకీయవర్గాలలో బలంగా వినిపించింది. అప్పట్లో కరణం బలరాం చంద్రబాబుతో ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   ఇక ఇప్పుడు తాజాగా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు కరణం బలరాం హాజరయ్యారు. ఆ సందర్భంగా తెలుగుదేశం నాయకులతో కలివిడిగా కనిపించారు. దీంతో కరణం బలరాం తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమంటూ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికీ దశాబ్దాల పాటు అత్యంత విధేయుడిగా ఉన్న కరణం బలరాం 2019 ఎన్నికల తరువాత కేవలం కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం అయిష్టంగానే తెలుగుదేశం గూటికి చేరారని అప్పట్లోనే వినిపించింది. ఇప్పుడు కరణం బలరాం కదలికలు, వ్యవహార శైలీ అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో కరణం బలరాం పట్ల తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో కూడా ఒకింత సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. బేషరతుగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సుముఖత చూపితే అహ్వానించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు.. ఇక అరెస్టేనా?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అంటే జగన్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కోసం రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అదే విధంగా ఆయన తీసిన వ్యూహం సినిమాలో కూడా వీరిని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. వీటిపైనే ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు రామలింగం ఫిర్యాదు మేరకు కూసు నమోదైంది. విచారణకు హాజరు కావాలంటూ ఏపీ పోలీసులు హైదరాబద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారు. ఆ నోటీసుల ప్రకారం రామ్ గోపాల్ వర్మ మంగళవారం (నవంబర్ 19) పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ తనపై నమోదైన కేసు కొట్టివేయాలనీ, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలనీ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  రామ్ గోపాల్ వర్మ పిటిషన్ సోమవారం (నవంబర్ 18) విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేస్తూ..  అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అంతే కాకుండా పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం (నవంబర్ 19)న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.   

నారా ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమేనా?

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన నారా వారి పల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు. అలాగే నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు అందరూ హైదరాబాద్ లో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. పలువురు నారావారి పల్లెకు చేరుకుని అంత్యక్రియలకు హాజరయ్యారు.  అయితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు మాత్రం నారా రామ్మూర్తి నాయుడి మృతి పట్ల కనీసం సంతాపం కూడా తెలపలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంతో దూరంగా ఉంటున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ తీరు పట్ల ఒకింత ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.  నారా రామ్మూర్తినాయుడి మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సంతాపం  వ్యక్తం చేయకపోవడం, అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్లైందిని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

హస్తినలో గాలి విషం!

దేశరాజధాని నగరం హస్తినలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ప్రజా క్షేమం కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరిన్ని ఆంక్షలు అమలు చేయడానికి నిర్ణయించింది.  ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) 4 కింద మరిన్ని నిబంధనలను సోమవారం నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది.   *ఢిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా) కు ప్రవేశాన్ని నిలిపివేయనుంది. ఈ ఆదేశాలు సోమవారం (నవంబర్ 18) నుంచే అమలులోకి వచ్చాయి. అవికూడా ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ – 4 డీజిల్ ట్రక్కులను మాత్రమే అనుమతిస్తుంది. ఇంకా ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపైనా,  ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ – 4 అంతక న్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశాలపైనా నిషేధం విధించింది.   అంతే కాకుండా  అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చే సింది.  ఎన్ఆర్‌సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని పేర్కొంది. *రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను మూసివేయడంతో పాటు సరి బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్  ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సిఫారసుపై ఒకటి రెండు రోజులలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోడీ

  మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్‌లో అడుగుపెట్టారు. రాజధాని నగరం రియో డిజెనీరో చేరుకున్న ఆయనకు అక్కడి భారత రాయబారి సురేష్ రెడ్డి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం ఘన స్వాగతం పలికింది.  బ్రెజిల్ వేదికగా సోమ, మంగళ (నవంబర్ 18, 19) వారాలలో  రెండు రోజుల పాటు జరిగే  19వ జీ20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా సభ్య దేశాల నాయకులతో మోడీ కీలక చర్చలు జరపనున్నారు. కీలకమైన ఈ సదస్సులో ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాల నాయకులు పాల్గొంటారు తాను బ్రెజిల్ చేరుకున్న విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డిజెనీరో నగరంలో అడుగు పెట్టానననీ, ఈ సదస్సులో సభ్యదేశాల నేతలతో  ఫలవంతమైన చర్చలు జరిపేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాననీ పేర్కొన్నారు. తనకు విమానాశ్రయంలో  లభించిన స్వాగతానికి సంబంధించిన ఫొటోలను ఆయన తన పోస్టుతో పాటు షేర్ చేశారు.  మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా సందర్శన అనంతరం ప్రధాని మోడీ బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్కడ ప్రవాస భారతీయ సమూహంతో కూడా ఆయన మాట్లాడారు. కాగా బ్రెజిల్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ గయానాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి.  

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా గద్దర్ కుమార్తె

రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించింది.  తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌ పర్సన్‌‌గా డాక్టర్‌ గుమ్మడి వి. వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్  ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో.. గద్దర్ కుమార్తెకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సముచిత గౌరవం లభించినట్లైంది.   2023 అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నెలకు కంట్మోనెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన సంగతి విదితమే. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌‌ నుంచి పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు. ఆ తర్వాత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా,  కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో  కాంగ్రెస్ వెన్నెలకు టికెట్ ఇవ్వలేదు. ఆ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి వచ్చి చేరిన శ్రీగణేశ్‌‌కు టికెట్‌ ఇవ్వగా.. ఆయన విజయం సాధించారు. అయితే.. గద్దర్ చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణాన్ని సాగించారు. ఈ క్రమంలోనే.. రాహుల్ గాంధీతో, రేవంత్ రెడ్డితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఎన్నికలకు కొద్ది రోజులు ముందే గద్దర్ కన్నుమూయగా.. ఆయన అంత్యక్రియలను కాంగ్రెస్ పార్టీయే దగ్గరుండి జరిపించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గద్దర్ సేవలను, ఆయన పోరాటాన్ని రేవంత్ రెడ్డి ప్రతిసారి స్మరించుకోవటమే కాకుండా,  ఆయన గుర్తుగా నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా పేరు మార్చారు. కేవలం గద్దర్ పోరాటాలను స్మరించుకోవటమే కాకుండా,  ఆయన కుటుంబ సభ్యులకు కూడా సముచిత స్థానం కల్పించి గౌరవించుకోవాలని భావించిన ప్రభుత్వం, ఇప్పుడు వెన్నెలకు సాంస్కృతిక సారథి చైర్‌ పర్సన్‌‌గా నియమించింది.  తెలంగాణ సాంస్కృతిక సారథి  ఏర్పాటు కేసీఆర్  బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే జరిగింది. అప్పట్లో  ఈ సాంస్కృతిక సారథికి ఛైర్మన్‌‌గా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌‌గా ఉండగా.. ఆయకు కేబినెట్‌ హోదా కల్పించారు. అయితే.. ఇప్పుడు గద్దర్‌ కుమార్తె వెన్నెలను ఛైర్‌ పర్సన్‌‌గా నియమించినప్పటికీ.. ఆమెకు కేబినెట్‌ హోదా మాత్రం ఇవ్వలేదు. 

 జైలుకెళ్లిన కస్తూరి 

తమిళనాడులో స్థిర పడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి, బిజెపి నేత కస్తూరిని   అరెస్ట్ చేసి చెన్నయ్ లోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు.  కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. డిఎంకే వల్లే తనపై రూమర్స్ వచ్చినట్లు కస్తూరి గతంలో వివరణ ఇచ్చారు. చెన్నయ్ పోలీసులు హైద్రాబాద్ పుప్పాల గుడా కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు నమోదైన తర్వాత ఆమె హైద్రాబాద్ కు చేరుకుని ఓ నిర్మాత ఇంట్లో ఉండిపోయారు. చెన్నయ్ పోలీసులకు ఉప్పందడంతో మాటు వేసి కస్తూరిని అరెస్ట్ చేశారు. నవంబర్ 3న ఆమె తమిళనాడులో తెలుగువారిని కించపరిచేలా మాట్లాడారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది. అప్పట్నుంచి ఆమె పరారీలో ఉన్నారు. 

కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందని  గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దపు  ప్రచారం చేసింది. లక్షన్నర కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో  ఈ ప్రాజెక్టు డ్యామేజి అయ్యింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అంశాలలో కాళేశ్వరం చేరింది.    కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి  చెప్పారు.ట్విట్టర్  వేదికగా  ఈ విషయాన్ని వెల్లడించారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు

లగచర్ల బాధితులు హస్తినకు

తెలంగాణ ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లోని లగచర్ల భూములను లాక్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందని బిఆర్ఎస్ శ్రేణులు  ఆరోపిస్తున్నాయి. వారి వాణిని ఢిల్లీలో వినిపించేందుకు  బిఆర్ ఎస్ నేతలు సిద్దమయ్యారు. వీరికి బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ లగచర్ల బాధితులను వెంట బెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు.  ఈ నెల 18(సోమవారం) ఆమె లగచర్ల బాధితులతో ఎస్ సి ఎస్ టి కమిషన్ ను ఆశ్రయయించనుంది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తూ వేలాది ఎకరాలు సేకరించింది.  అభివృద్ది పేరిట రైతుల భూములను సేకరించింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నాడు భూములను సేకరించిన బిఆర్ఎస్ భూముల సేకరణను వ్యతిరేకించడం ద్వంద వైఖరి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేయడానికి కెటీఆర్ ఉసిగల్పినట్లు ఆధారాలు బయటపడ్డాయి. తాజాగా లగచర్ల బాధితులను బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంటేసుకురావడం పలు అనుమానాలకు తావిస్తుంది.  

నారావారిపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామంలో జరుగనున్నాయి. రామూర్తి నాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.  శనివారం మధ్యాహ్నం రామ్మూర్తినాయుడు హైద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.  తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా నారావారిపల్లెకు చంద్రబాబు చేరుకున్నారు.  అంత్యక్రియలకు కూటమి నేతలతో బాటు మహరాష్ట్ర గవర్నర్ రాధాక్రిష్ణ తదితరులు పాల్గొననున్నారు.   కాగా నారా రామ్మూర్తి నాయుడు పార్దీవదేహం హైద్రాబాద్ నుంచి బయలు దేరి నారావారిపల్లెకు చేరుకుంది. మంత్రి లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్నిదగ్గరుండి తీసుకొచ్చారు.  మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు ప్రారంభమౌతాయి. 

 కుల గణనకు కవిత ఓకే

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకు  బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు. మొత్తం 8 పేజీల్లో 75  ప్రశ్నలతో కూడిన ఫామ్ ను ఆమె ఎంతో ఓపికగా నింపారు. కులగణను బిఆర్ఎస్ మొదట్నుంచి వ్యతిరేకిస్తుంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కులగణనను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.అయితే కవిత మాత్రం కులగణనను వ్యతిరేకించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  పేద, మధ్య తరగతి ప్రజానీకానికి ప్రయోజనం చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టింది.  ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నేతల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రజల గోప్యత పోతుందని బిఆర్ ఎస్ తొలుత ప్రచారం చేసింది.  శనివారం బంజారాహిల్స్ లోని తన నివాసానికి ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు కవిత ఎంతో ఓపికగా సమాధానాలు రాసిచ్చారు.    ఆధార్ కార్డు, పాన్ కార్డుతో బాటు అన్ని వివరాలు ఆమె ప్రభుత్వానికి సహకరించారు. 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి

మావోయిస్టులు  మరణించారు. భద్రతా బలగాలలో ఇద్దరు గాయపడ్డారు   కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో నక్సల్స్ భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కదలికలపై భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో తరచూ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.  బార్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​(బీఎస్​ఎఫ్), డిస్ట్రిక్ట్​ రిజర్వ్ గార్డ్(డీఆర్​జీ), స్పెషల్ టాస్క్​ ఫోర్స్​(ఎస్​టీఎఫ్) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోంది. సైన్యం, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

మరట్వాడలో పవన్ కళ్యాణ్ ప్రచారం

మహరాష్ట్ర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహరాష్ట్రలో ఈ నెల 20న పోలింగ్ ఉంది. ఈ నెల 23న  ఓట్ల లెక్కింపు ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో  కలిపి అదే రోజు కౌంటింగ్ జరగనుంది.  బిజెపి , శివసేన( ఏక్ నాథ్ శిండే )నేషనలిస్ట్  కాంగ్రెస్ పార్టీ (  అజిత్ పవార్ వర్గం)కు చెందిన మహాయుటీ, శివసేన(ఉద్దవ్ ఠాక్రే) ,నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్) కాంగ్రేస్ సారథ్యంలోని మహా వికాస్ అగాడీ పోటా పోటీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాయూటీ తరపును ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్  మహారాష్ట్రలో పర్యటించారు.  మరఠ్వాడా, విదర్భ, మహరాష్ట్ర పశ్చిమ ప్రాంత జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ నియోజకవర్గాలలో ఎక్కువగా తెలుగు ఓటర్లు ఉన్నారు.  మరో ఛత్రపతి పవన్ కళ్యాణ్  అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి.    

రేవంత్ వాహనంలో తనిఖీలు

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. డబ్బు ప్రవాహాన్ని ఆపడానికి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అనుమానం వస్తే తనిఖీల విషయంలో ఎటువంటి మొహమాటానికీ తావివ్వడం లేదు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సొమ్ములను పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో  పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. జాతీయ స్థాయి నాయకుల వాహనాలను సైతం ఆపి నిర్మొహమాటంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే జనసేన ఉద్ధవ్ థాక్రే వాహనాలను పలుమార్లు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం కోసం మహారాష్ట్రకు వచ్చిన సమయంలో ఆయన ప్రయాణించిన హెలకాప్టర్ ను కూడా తనిఖీ చేశారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందంటూ నెటిజనులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. 

చంద్రబాబుతో కేంద్ర మంత్రి జైశంకర్ భేటీ.. వైసీపీలో వణుకు ఎందుకంటే?

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్లారంటే.. కచ్చితంగా ఆయన కేంద్రం నుంచీ రాష్ట్రానికి ఏదో ఒక ప్రయోజనం సాధించుకు వస్తారు. ఇది ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరించే వాస్తవం. నిజానికి చంద్రబాబు కూడా హస్తిన పర్యటన అంటే ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ కంటే విత్త మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు మంత్రి కుమార స్వామి, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిలతో భేటీ అవుతారు. ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి ఏయే ప్రయోజనాలు అందే అవకాశం ఉందో వాటిపై వారికి వినతులు సమర్పిస్తారు. అలాగే ఆయన పర్యటన తరువాత ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి కేటాయింపులపై ప్రకటన రావడం కద్దు.  అయితే తాజా  చంద్రబాబు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు. చంద్రబాబు ఆయన వద్దకు వెళ్లి కలవడం కాకుండా స్వయంగా జయశంకర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. దీంతో చంద్రబాబు, జైశంకర్ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాకుండా వీరి భేటీ వైసీపీని వణికి పోయేలా చేస్తోంది.  వీరి భేటీ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించే అయి ఉంటుందన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసుల్లో విదేశాల నుంచి రావలసిన సమాచారం కోసం గతంలోనే సీబీఐ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పలు లేఖలు రాసింది. వాటికి సంబంధించిన సమాధానాలు వస్తే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుంటుంది. చంద్రబాబు జైశంకర్ ల మధ్యా తాజాగా జరిగిన భేటీలో జగన్ అక్రమాస్తుల కేసుల గురించే చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ భయంతో వణికి పోతున్నది.  రాష్ట్రంలో చంద్రబాబు  సర్కార్ కొలువుదీరిన తరువాత గత ప్రభుత్వ అవినీతిపై, అక్రమంగా సొమ్ముతరలించిన వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.  ఆ క్రమంలోనే రాష్ట్రం నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన సొమ్ముపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర సహకారం కోరేందుకే చంద్రబాబు విదేశాంగ మంత్రి జై శంకర్ తో భేటీ అయ్యారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  విదేశాంగమంత్రితో చంద్రబాబు భేటీ  వైసీపీని ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు.