విశాఖలో న్యాయ విద్యార్థిపై గ్యాంగ్ రేప్ 

విశాఖపట్నంలో న్యాయవిద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగింది.  నలుగురు  యువకులు సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు.  విశాఖ పట్నం రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి న్యాయవిద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.  ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి న్యాయవిద్యార్థిని ఆ యువకులు కొన్ని నెలలుగా  బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం. గత రాత్రి కూడా అవే ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది.  రాత్రంతా నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ జరపడంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఘటనపై  రాష్ట్ర హోం మంత్రి   అనిత  సీరియస్ అయ్యారు. విశాఖ పోలీస్ కమిషనర్ పై అగ్రహం వ్యక్తం చేసారు.  ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని హోం మంత్రి హెచ్చరించారు. న్యాయ విద్యార్థితో సన్నిహితంగా ఉన్న యువకుడే ఈ గ్యాంగ్ రేప్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందరూ మేజర్లేనని అన్నారు. 

తెలంగాణ దిశ దశ మార్చేందుకు వస్తున్నాను

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వెళ్లారు.  ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరినట్టు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.   ‘‘తెలంగాణ చైతన్యపు రాజధాని... కాళోజీ నుంచి పివి వరకు.. మహానీయులను తీర్చిదిద్దిన నేల.. స్వరాష్ట్ర సిద్దాంతకర్త జయశంకర్ సార్ కు జన్మనిచ్చిన గడ్డ... హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్కక్క సారలమ్మలు నడయాడిన ప్రాంతం.. దోపిడికి  వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ద క్షేత్రం వరంగల్.  వీరందరి స్పూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దిశ దశ మార్చేందుకు నేడు వస్తున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు. 

విజన్... విజ్ డమ్ ల మేలుకలయిక చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో పదేపదే తనలో 1995 నాటి చంద్రబాబును చూస్తారని చెబుతున్నారు. ఆయన దూకుడు, ఆయన వేగం చూస్తుంటే అది నిజమేనని అనిపించక మానదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనను తాను ముఖ్యమంత్రిగా కంటే రాష్ట్రానికి సీఈవోగా ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఆయన ప్రణాళికలు, కార్యాచరణ అంతా హైటెక్ సీఎం అని అందరూ పిలిచేలా చేశాయి. అప్పట్లోనే ఆయన ఐప్యాడ్ లలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లను తీసుకుని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వెళ్లి వాటిని   హైదరాబాద్ కు రప్పించారు. బిల్ గేట్స్ లాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో గంటల తరబడి చర్చించారు. వారిని ఇంప్రెస్ చేయగలిగారు. అంతేనా తన విజన్ తో వారిని తన అభిమానులుగా మార్చేసుకున్నారు.  ఇప్పుడు 2024లో కూడా అయన అదే ఒరవడిలో ముందుకు సాగుతున్నారు.  మెటా సంస్థ‌తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి, ప్ర‌భుత్వ ప‌త్రాల‌ను వాట్సాప్ ద్వారా పంప‌డం, డ్రోన్ టెక్నాల‌జీతో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డం లాంటివి ఆరంభించారు. తొలిద‌శ‌లో ఈ నెలాఖ‌రుక‌ల్లా వంద‌ర‌కాల సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా అందించేలా గత నెల 22న మెటాతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్ బిజినెస్‌, లామా లాంటి ఏఐ టెక్నాల‌జీల‌తో ప‌రిపాల‌నా సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ ప‌త్రాల కోసం ప‌డుతున్న ఇబ్బందుల‌ను తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చూశాన‌ని, ఇప్పుడు వాట‌న్నింటి ప‌రిష్కారం చాలా సుల‌భంగా వాట్సాప్ ద్వారా దొర‌క‌డం అనేది చ‌రిత్రాత్మ‌క‌మ‌ని చంద్ర‌బాబు కుమారుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.  మ‌రోవైపు.. రాష్ట్రాన్ని డ్రోన్ హ‌బ్‌గా మారుస్తామ‌ని కూడా చంద్ర‌బాబు చెబుతున్నారు. క‌ర్నూలు స‌మీపంలో 300 ఎక‌రాల‌ను  ఇందు కోసం కేటాయించారు.  అమ‌రావ‌తిలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించి అందరినీ అబ్బురపరిచారు. అమ‌రావ‌తిని, బుద్ధుడిని కూడా డ్రోన్ల‌తో ఆవిష్క‌రించారు. ఆ వెంటనే ఆయన సీప్లేన్ సేవలపై దృష్టి పెట్టారు. దేశంలోనే తొలి సారిగా ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీకాకుళం వరకూ  ట్రయల్ రన్ నిర్వహించారు. స్వయంగా  సీ ప్లేన్‌లో విహ‌రించారు. విజ‌య‌వాడ నుంచి శ్రీశైలం వెళ్లి, అక్క‌డ రోప్ వే ద్వారా ప్ర‌యాణించి ఆల‌య ద‌ర్శ‌నం చేసుకుని, తిరిగి సీ ప్లేన్‌లోనే విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. ఇలా  ఆధునికతను అందిపుచ్చుకుంటూ.. టెక్నాలజీని ప్రజాప్రయోజనాల కోసం సమర్ధంగా వినియోగించుకుంటూ.. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తూ చంద్రబాబు 1995 నాటి సీబీఎన్ ను గుర్తు చేస్తున్నారు. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా చెరగని సంతకంలా కనిపిస్తున్నారు.   ,గ‌తంలో హైదరాబాద్‌కు ఎలాంటి ఇమేజి తెచ్చిపెట్టారో అంతకు మించి అమరావతిని అభివృద్ధి చేసి ఏపీ రాజధానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.  చంద్రబాబుకున్న  దూరదృష్టి, టెక్నిక‌ల్ విజన్ సమకాలీన రాజకీయాల్లో ఎవ్వరికీ లేదనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.  

వివేకా హత్య కేసు.. వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో  వైసీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్  అవినా‌ష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలంటూ,  వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం(నవంబర్ 19) విచారణ జరిపింది.  వివేకా హత్య కేసులో అప్రూవర్‌‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించారని.. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపారు.  ఒక ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని కోర్టుకు వివరించారు. డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకు రెగ్యులర్‌గా వెళ్లే వారా, కాదా అని సీజేఐ ధర్మాసనం ఆరా తీయగా..డాక్టర్‌ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని.. ఆయన రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్‌ కాదని లూథ్రా కోర్టుకు తెలిపారు. అలాగే ఈ కేసులో డాక్టర్‌ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలన్న లూథ్రా ధర్మసనాన్ని కోరారు. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి 8వ నిందితుడిగా ఉన్నారని.. దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని కోర్టుకు వివరించారు.   ధర్మాసనం ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకుని డాక్టర్ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించింది. అలాగే ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది. మరోవైపు సుప్రీం కోర్టులో సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్‌ చేయాలని కోరగా.. వివేకా హత్య కేసు పరిణామాలను సునీత తరఫు లాయర్ లూథ్రా కోర్టుకు వివరించారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిపై ప్రైవేటు ఫిర్యాదు చేయడం ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ హత్య కేసును తప్పుదోవ పట్టించాలని చూశారని.. ఆ తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారన్నారు. కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోన్న సమయంలో ప్రైవేటు ఫిర్యాదు చేశారన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది.  

వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం.. నిందితుల గుండెల్లో భయం!

గత ఐదేళ్లుగా డాక్టర్ వైఎస్ సునీత అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలనీ, అలాగే హత్య కుట్రదారులు, సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలన్న సంకల్పంతో ఆమె గత ఐదేళ్లుగా శ్రమిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు.  వైఎస్ సునీత న్యాయపోరాటం ఫలితంగానే వైఎస్ వివేకా హత్య జరిగిన నాడు ఎవరైతే అప్పటి విపక్ష నేతలపై ఆరోపణలు గుప్పించారో వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా   బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు.   అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు అంతు అనేది కనిపించకుండా ఎందుకు సా..గుతూ ఉండడానికి,  ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా  పురోగతి లేకుండా నిలిచిపోవడానికి కారణమేంటి, కారణం ఎవరు అన్న విషయంలో ఇప్పుడు ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేకుండా పోవడానికి  కూడా వైఎస్ సునీత అలుపెరుగని పోరాటమే కారణం.  అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతుండడానికి కారణం కూడా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మాత్రమే అనడంలో ఇసుమంతైనా సందేహానికి తావు లేదు.  తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం   నిస్సందేహంగా  చారిత్రాత్మకం. ఈ పోరాటంలో ఆమె ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు.  స్వయానా పెదనాన్న కుమారుడు, సోదరుడు అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి తన న్యాయపోరాటానికి అడుగడుగునా అవరోధంగా నిలిచినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ అండగా నిలిచి కాపాడుతూ.. తనను వేధింపులకు గురిచేసినా తట్టుకుని నిలబడ్డారు.  సరే ఇప్పుడు గత ఐదేళ్ల  జగన్ అరాచక పాలనకు ఇప్పుడు తెరపడింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక వివేకా హత్య కేసు దర్యాపు వేగం పుంజుకుని దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని అంతా భావించారు. అయితే కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి ఐదు నెలలైనా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ లోగా వివేకా హత్య కేసులో అరెస్టైన వారందరికీ బెయిలు వచ్చేసింది. వారు దర్జాగా బయట తిరుగుతున్నారు.   ఈ పరిస్థితుల్లో డాక్టర్ సునీత మరో సారి న్యాయపోరాటానికి కొంగు బిగించారు. తండ్రి హత్య కేసు పురోగతిపై ఆరా తీస్తున్నారు. సత్వర న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ఇటీవల ఆమె  కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా చేయడంలో సహరించాలని కోరారు. దీనికి ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత సునీత మంగళవారం (నవంబర్ 19) ఏపీ అసెంబ్లీకి వచ్చి  డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో భేటీ అయ్యారు. ఆయనతో వివేకా హత్య కేసు గురించి చర్చించారు. ఇప్పటికే ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత తో  భేటీ అయ్యారు. తండ్రి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసి దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలని కోరారు. వారిరువురూ కూడా సానుకూలంగా స్పందించారు.   తాజాగా అసెంబ్లీలోని పీఎంవో కార్యాలయానికి వెళ్లిన సునీత అక్కడి అధికారులతో తన తండ్రి వివేకా హత్య కేసు పురోగతిపై చర్చించారు. అంతకు ముందు ఇటీవల సచివాలయంలో చంద్రబాబుతో సునీత భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు హుకిల్డ్ బాబాయ్ అన్న సస్పెన్స్ కు తొందరలోనే తెరపడుతుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సునీత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, పీఎంవో అధికారులతో భేటీ అవ్వడం తండ్రి హత్య కేసు పురోగతిపై చర్చించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు రోజుల కిందట కడప ఎస్పీతో భేటీ సందర్భంగా వివేకా హత్య కేసుకు సంబంధించి కొన్ని కేసులు హైదరాబాద్ లో నమోదై ఉన్నాయనీ, వాటిని ఇక్కడకు బదలీ చేసి సత్వర దర్యాప్తు జరిపే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ హయాంలో పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయిన వ్యవస్థలు ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టు కుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు విచారణ, దర్యాప్తులో వేగంగా కదలికలు కనిపిస్తు న్నాయి. డాక్టర్ సునీత అలుపెరుగని పోరాటం ఒక తార్కిక ముగింపునకు వచ్చేలా ఉంది. ఔను త్వరలోనే హు కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు సమాధానం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

విచారణకు రామ్ గోపాల్ వర్మ గైర్హాజర్.. వ్యక్తిగత పనులున్నాయంటూ వాట్సాప్ మెసేజ్

వివాదాస్పద దర్శకుడు  రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజర్ అయ్యారు. మంగళవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు వాట్సాప్  మెసేజ్ పంపించారు.  తనపై నమోదైన కేసులో విచారణకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆ మెసేజ్ లో పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ  తన వ్యక్తిగత పనులు ఉండటం వల్ల విచారణకు హాజరు కావడానికి నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. ఆ తరువాత  తప్పకుండా విచారణకు వస్తానని రామ్ గోపాల్ వర్మ తన మెసేజ్ లో పేర్కొన్నారు.  సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తనపై కేసు క్వాష్ చేయాలని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టును రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల నోటీసుల మేరకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరౌతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా రామ్ గోపాల్ వర్మ చివరి నిముషంలో వ్యక్తిగత పనులంటూ డుమ్మా కొట్డడం సంచలనం రేకెత్తిస్తోంది. పోలీసులు ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

పవన్ కల్యాణ్ పై వాలంటీర్ల కేసు కొట్టివేత

పవన్ కల్యాణ్‌ వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. వాలంటీర్లు ఫిర్యాదు చేశారంటూ అధికారులపై ఒత్తిడి పెంచి మరీ కేసులు నమోదు అయ్యేలా చేసింది. అయితే ఇప్పుడు అవన్నీ ఉత్తుత్తి కేసులేనని తేలిపోయింది. తామెవరం పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు చేయలేదంటూ వాలంటీర్లు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీంతో న్యాయమూర్త ఆ కేసు కొట్టివేశారు.  వాలంటీర్ల పేరుతో పోలీసులే ఫిర్యాదు రాసుకుని కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఆ ఫిర్యాదుపై వాలంటీర్లు ఎవరూ సంతకాలు చేయలేదని తేలింది. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు కావడంతో అప్పటిలో వారి చేత ఇష్టానుసారంగా ప్రకటనలు ఇప్పించారు. పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేయించారు. ఇప్పుడు కేసు కోర్టు వద్దకు వచ్చేసరికి అప్పట్లో వాలంటీర్లమంటూ ఇష్టా రీతిగా  మాట్లాడిన వారంతా ఇప్పుడు మౌనం దాలుస్తున్నారు. కోర్టులో పవన్ కల్యాణ్ పై తాము ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని కుండబద్దలు కొట్టారు. నమోదైన ఫర్యాదులపై ఉన్నది తమ సంతకం కాదని చెప్పారు. దీంతో  పవన్ పై  వాలంటీర్ల కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది.  

పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ అనుచరులు!

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వల్లభనేని అనుచరులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి సూత్రధాని వంశి అన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కార్యాలయ ఆవరణలోని కారు దగ్ధం చేశారు. కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జగన్ సర్కార్ అధికారంలో ఉన్నంత కాలం కేసు దర్యాప్తు నత్తనడకన సాగింది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఒక దశలో వంశీ అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే కోర్టు నుంచి రక్షణ పొందిన వంశీ అరెస్టును తాత్కాలికంగా తప్పించుకోగలిగారు. తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడంతో వంశీ అరెస్టు కూడా అనివార్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తె లుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నేరుగా పాల్గొనకపోయినా, కార్యకర్తలను ప్రేరేపిం చింది వంశీయేనని పోలీసులు గట్టిగా చెబుతున్నారు.   వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం గన్నవరంలో పోలీసులు వంశీ సొంత మనుషుల్లా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరవాత పోలీసులు ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. పలువురిని అరెస్టు చేశారు.  ఒక దశలో వల్లభనేని వంశీని కూడా అరెస్టు చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే అవేమీ వాస్తవం కాదని తేలింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు వంశీ అనుచరులైన ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారించి తదుపరి వంశీని కూడా విచారణకు రావలసిందిగా నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు, మొత్తం మీద ఒకింత ఆలస్యమైనా వంశీ పాపాల పుట్ట పగలడం ఖాయమని, కటకటాలు లెక్కించక తప్పదని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. 

తెలంగాణలో కోల్డ్ వేవ్.. వణికిస్తున్న చలిపులి!

  తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. జనం చలిపులి పంజా దెబ్బకు గజగజలాడుతున్నారు. రాష్ట్రంలో సోమవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా సిర్పూర్ లో 12.3 డిగ్రీలు, వాంకిడిలో 12.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.మొత్తంమీద రాష్ట్ర వ్యాప్తంగా సగటున 12 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణంగా డిసెంబర్ మూడో వారం తరువాత ఉండే స్థాయిలో చలి తీవ్రత నవంబర్ రెండో వారంలోనే వణికించేస్తుండటంతో ముందు ముందు మరింతగా చలితీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  ఈ ఏడాది శీతాకాలం చలి ఎముకలు కొరికేయడం ఖాయమని అంటున్నారు. నవంబర్ రెండో వారంలోనే ఈ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయంటే వచ్చే రెండు నెలలూ మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రతకు తోడు పొగమంచు తోడై జనాలను ఇబ్బందులకు గురి చేయడం ఖాయమని అంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, చలి నంచి రక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.  

రామ్ గోపాల్ వర్మ అరెస్టు ఖాయమేనా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు మంగళవారం (నవంబర్ 19) విచారించనున్నారు. సామాజిక మాధ్యమంలో ఇన్డీసెంట్ పోస్టులపై తెలుగుదేశం నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదైన కేసులో రామ్ గోపాల్ వర్మ కు మద్దిపాడు పోలీసు స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా నోటీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా తనపై నమోదైన కేసు కొట్టివేయాలనీ, అలాగే అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలనీ కోరుతూ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. అవసరమైతే తరువాత బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అలాగే అందుకున్న నోటీసుల మేరకు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో కోర్టు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు లైన్ క్లియర్ చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిగా అసభ్య, అనుచిత పోస్టులు పెట్టి కోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి తప్పించుకోవచ్చని భావించిన రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఇంతకీ రామ్ గోపాల్ వర్మమీద కేసు ఎందుకు నమోదైందంటే.. గతంలో అంటే జగన్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. వీటిపైనే ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన తెలుగుదేశం నాయకుడు రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.  

ఇప్పుడేమంటావ్ జ‌గ‌న్ రెడ్డీ.. ర‌ద్దు చేద్దామా?

ఏపీలో శాస‌న స‌భ‌, స‌మావేశాలు స‌జావుగా సాగుతున్నాయి.  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితోస‌హా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది శాస‌న‌స‌భ‌కు రాకుండా బాయ్ కాట్ చేసిన‌ప్ప‌టికీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్నారు. త‌మ‌ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లను స‌భ‌లో లేవ‌నెత్తుతూ, వాటి ప‌రిష్కారాల కోసం మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు అర్ధ‌వంతంగా సాగుతున్నాయి. వైసీపీ హ‌యాంలో అసెంబ్లీ స‌మావేశాలు అంటే ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను బూతులు తిట్ట‌డానికే అధికార పార్టీ స‌భ్యులు, మంత్రులు ప‌రిమితం అయ్యారు. దీంతో ఆ ఐదేళ్ల కాలంలో ఒక్క‌సారిగా కూడా అసెంబ్లీలో అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. త‌ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌భ‌లో చ‌ర్చించిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. మ‌రో వైపు శాస‌న మండ‌లిలో వైసీపీకి మెజార్టీ స‌భ్యులు ఉండ‌టంతో స‌భ‌కు హాజ‌రువుతున్నారు. అయితే, మండ‌లిలో వైసీపీ స‌భ్యుల తీరు ప్ర‌జ‌ల‌కు చిరాకు తెప్పిస్తోంది. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం చెబుతున్న‌ప్ప‌టికీ వారు ఏదోఒక వంక‌తో మండ‌లి నుంచి వాకౌట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మంత్రులు స‌రియైన స‌మాధానం చెప్ప‌డం లేద‌ంటూ సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో ప్ర‌శ్న‌లు వేయ‌డం.. వాటికి మంత్రులు స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇస్తుంటే ఏదోఒక గొడ‌వ‌చేసి స‌భ‌ను వాకౌట్ చేయడం నిత్య‌కృత్యంగా మారింది. ఫ‌లితంగా మండ‌లిలో వైసీపీ స‌భ్యుల తీరు పట్ల జనంలో ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.  ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు వైసీపీకి కేవ‌లం 11 స్థానాలు మాత్ర‌మే ఇచ్చారు. త‌ద్వారా అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదాకుకూడా వారు అన‌ర్హులు అని తేల్చేశారు. కానీ  వైసీపీ అధినేత‌, క‌డ‌ప ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం వితండ‌వాదం చేస్తున్నాడు. ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వ‌స్తానంటూ మారం చేస్తున్నాడు. ప్ర‌తిప‌క్ష హోదాకు వైసీపీ ప‌నికిరాద‌ని ప్ర‌జ‌లు స్ప‌ష్టం చేసిన త‌రువాత కూడా.. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కావాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేస్తుండ‌టం విడ్డూరంగానే ఉంది. దీంతో జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌లు సైతం స‌మ‌ర్ధించ‌డం లేదు. మ‌రోవైపు శాస‌న మండ‌లిలో సంఖ్యాబ‌లం ఎక్కువ‌గా ఉండ‌టంతో వైసీపీ స‌భ్యులు స‌భ‌కు హాజ‌ర‌వుతున్నారు. దీంతో ఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఈ పేద రాష్ట్రానికి శాస‌న‌మండ‌లి అవ‌స‌ర‌మా అంటూ వ్యాఖ్య‌లు చేశాడు. మండ‌లిలో తెలుగుదేశం స‌భ్యుల సంఖ్యా బ‌లం ఎక్కువ‌గా ఉంద‌ని మండ‌లినే ర‌ద్దు చేసేందుకు జ‌గ‌న్‌ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ అది సాధ్యంకాలేదు. అయితే  ఇప్పుడు వైసీపీకి శాస‌న మండ‌లే దిక్క‌య్యిది. దీంతో ఇదంతా దేవుడి రాసిన‌ స్ర్కిప్ట్ అంటూ కూట‌మి నేత‌లు కామెంట్లు చేస్తున్నారు.  శాస‌న మండ‌లిలో ఎంతో మంది వివిధ వ‌ర్గాల‌కు చెందిన మేధావులు ఉంటారు. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఏ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుందో అటుంచితే. .శాస‌న మండ‌లిలో అర్ధ‌వంత‌మైన చ‌ర్చ‌ను జ‌రిపే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి మండ‌లిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ర‌ద్దు చేయాల‌ని చూశారు. మండ‌లి కోసం సంవ‌త్సరానికి రూ.60 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాం.. అస‌లే పేద‌రికంలో ఉన్న రాష్ట్రంలో ఇంత ఖ‌ర్చు అవ‌స‌ర‌మా అంటూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలో ఉన్న స‌మ‌యంలో ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఆ శాస‌న మండ‌లినే వైసీపీకి పెద్ద‌ దిక్కుగా మారింది. మండ‌లిలో మొత్తం 58 సీట్ల‌కుగాను వైసీపీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది నామినేటెడ్ స‌భ్యులు. తెలుగుదేశం నుంచి ఎనిమిది మంది, న‌లుగురు ఇండిపెండెంట్లు, పీడీఎఫ్ నుంచి ఇద్ద‌రు స‌భ్యులు ఉన్నారు. ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, గ‌తంలో మండ‌లిని ర‌ద్దుచేయాల‌న్న జ‌గ‌న్‌.. ఇప్పుడు అలా అన‌గ‌ల‌రా అంటూ కూట‌మి నేత‌లు, ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రో వైపు వైసీపీ ఎమ్మెల్సీలు శాస‌న మండ‌లికి వ‌స్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌భలో లేవ‌నెత్తేందుకు వారు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు. ప‌లు అంశాల‌పై మంత్రుల‌ను ప్ర‌శ్నిస్తున్న వారు.. తిరిగి మంత్రులు స‌మాధానం చెప్పే స‌మ‌యంలో నానా ర‌భ‌స చేసి స‌భ నుంచి వాకౌట్ చేస్తున్నారు. ప్ర‌తీరోజూ ఇదే తంతు జ‌రుగుతుండ‌టంతో ఈ మాత్రానికి మండ‌లికి పోవ‌డం ఎందుక‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

 లగ చర్ల దాడి కేసులో కొత్త కోణం

లగచర్ల దాడి కేసులో కుట్ర కోణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరగడంలో  బిఆర్ఎస్ నేత సురేశ్ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. అదే రోజు ప్రభుత్వ ఉద్యోగి రాఘవేందర్ ను  పోలీసులు అరెస్ట్ చేసి సంగా రెడ్డి జైలుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగి అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండదని ఒక వాదన వినిపించింది. కానీ రాఘవేందర్ పట్నం మహేందర్ రెడ్డి , సురేశ్ తో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు దర్యాప్తు అధికారులు  ఆధారాలు వెల్లడించారు.  వికారాబాద్ కలెక్టర్ వెంటనే రాఘవేందర్ ను సస్పెండ్ చేశారు.  వికారాబాద్ లో పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం చేస్తున్న రాఘవేందర్ లగచర్ల గ్రామస్థులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేసినట్లు  వెల్లడైంది 

బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ చార్జి కొణతం దిలీప్ అరెస్ట్

బిఆర్ఎస్  సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్క్రైబ్ , నిప్పు కోడి వంటి సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడైంది. సోమవారం  సైబర్ క్రైం పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేశారు. అటు ఏపీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా  విష ప్రచారం చేస్తున్న పలువురిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రభుత్వాన్ని బదనాం చేసే సోషల్ మీడియాపై ఉక్కు పాదం మోపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియాను కట్టడి చేయడానికి  చట్టం చేయనుందని  వార్తలు వెలువడుతున్నాయి.   

పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియోటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్  పోసాని కృష్ణమురళిపై  ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేశారంటూ తెలుగుదేశం రాష్ట్ర తెలుగుయువత ప్రతినిథి  బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. పోసాని వ్యాఖ్యలు చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయని బండారు వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోసానిపై సీఐడీ అధికారులు భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.   వైసీపీ హయాంలో అధికారం అండతో   సామాజిక మాధ్యమంలో ఇష్టారీతిగా చెలరేగిపోయి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసిన ఒక్కొక్కరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బూతులు, దూషణలే విమర్శలు అన్నట్లుగా చెలరేగిపోయిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. ఆ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిపై సైతం రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో, రాజమహేంద్రవరంలో ఇప్పటికే పోసానిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ సీఐడీ కూడా పోసానిపై కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద కూడా కేసు నమోదు కావడంతో పోసాని అరెస్టు అనివార్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మాజీ మంత్రి  విడదల రజనీ ముఖ్య అనుచరుడు అరెస్ట్ 

గత వైసీపీ  ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది.  మాజీ మంత్రి విడదల రజిని ముఖ్య అనుచరుడు, వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి ఏకంగా ప్రభుత్వ భూమిని కాజేసాడు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డిపై కేసు నమోదైంది.  నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు  కోటిరెడ్డిని అరెస్టు చేశారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కోటిరెడ్డి  ఇక్కడితో ఆగలేదు. ఒకే స్థలాన్ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు. మరొకరికి దీన్ని అక్రమంగా  డబుల్ రిజిస్ట్రేషన్‌ చేయించాడని, వాణిజ్య దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చారని గ్రామస్థులు ప్రజా వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించేందుకు రెండ్రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ఎంపీడీవో స్వరూపరాణిని, ఫిర్యాదుదారు, టీడీపీ స్థానిక నేత భవనం శ్రీనివాసరెడ్డిని కోటిరెడ్డి నానా బూతులు తిట్టాడు. దౌర్జన్యంగా వ్యవహరించాడు.  తనను కోటిరెడ్డి కులం పేరుతో అసభ్యంగా దూషించి కొట్టాడని ఎంపీడీవో నాదెండ్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఏజేసీజే న్యాయస్థానంలో ఆదివారం హాజరుపరచగా జడ్జి నిందితుడికి రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీవాణి ట్రస్ట్ రద్దు... టిటిడి పాలకమండలి నిర్ణయం

శ్రీవాణి ట్రస్ట్  కొనసాగింపు విషయంలో టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణల నేపథ్యంలో టిటిడి  మొదటి పాలకమండలి  సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. .  ట్రస్ట్ కార్యకలాపాలను రద్దు చేయాలని నిర్ణయంచినట్టు టిటిడి చైర్మెన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంలో ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హాయంలో టీటీడీ పూర్తిగా గాడి తప్పింది.  గత ఐదేళ్లలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1450 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలతో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. టిటిడి చైర్మెన్, ఈవో  అధ్యక్షతన బోర్డు భేటీ అయ్యింది. 

దేశంలో సైబర్ టెర్రర్.. బెంబేలెత్తిస్తున్న నేరగాళ్లు

దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.రోజూ ఎక్కడో అక్కడ బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షలు మాయం అయ్యాయని, బ్యాంక్ వారు చేతులెత్తేశారని వార్తలు వస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చిన తరువాత. ఈ నేరగాళ్లు మరీ విజృంభించేస్తున్నారు. ఏదో మెసేజ్ రావడం దానిని క్లిక్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఖాలీ అయిందని వింటూ ఉంటాం.ఇటీవల మీ కేవైసీ చెక్ చేస్తున్నామని ఫోన్ రావడం,ఓటీపీ చెప్పమనడం వంటి నేరాలు కూడా పెరిగిపోయాయి. కరోనా తరువాత మనీ డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. కూరగాయల నుంచి  ప్రతి వస్తువు కొనుగోలు విషయంలోనూ డజిటల్ ట్రాన్సాక్షన్స్ కే జనం మొగ్గు చూపుతున్నారు. జేబులో డబ్డులు ఉంచుకోకుండా.. ఫోన్ ద్వారానే కొనుగోళ్లు కానిచ్చేస్తున్నారు.  ఉద్యోగుల వేతనాలు,ఇతర ఆదాయాలు బ్యాంక్ ఖాతాలోకి జమ కాగానే దానిని డిజిటల్ సౌకర్యంతో స్వేచ్ఛ గా ఖర్చు పెట్టుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వాలు  కూడా డిజిటల్ లావాదేవీలను  ప్రొత్సహిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీల  వల్ల పెద్ద నోట్లు దగ్గర ఉంచుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అలాగే చిల్లర లేదు అన్న బాధ కూడా పూర్తిగా తొలగిపోయింది.  దీంతో దేశంలో డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ కు జనం సులువుగా వేగంగా అలవాటు పడిపోయారు.  ఫోన్ నంబరు బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానం చేయడంవల్ల డిజిటల్ లావాదేవీలు సులభమయ్యాయి.ఇది సైబర్ నేరగాళ్లకు ఓ అవకాశంగా మారిపోయింది. దీనికి తోడు ఆధార్   అన్ని బ్యాంకు అకౌంట్లకు సంధానం చేయడం కూడా సైబర్ నేరగాళ్లకు సులువుగా జనం ఖాతాలలోంచి సొమ్ము కాజేసే అవకాశాన్ని ఇచ్చింది.  వాట్సాప్,మెయిల్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేయడం సాధారణమై పోయింది.   ఇలా సైబర్ నేరగాళ్ల వలలో పడటంలో ప్రజల అలక్ష్యం, అమాయకత్వం ఎంత కారణమో అంతకంటే ఎక్కువగా బ్యాంకు నిర్లక్ష్యం, ఆర్బీఐకి జవాబుదారీ తనం లేకపోవడం కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. డిజిటల్ మనీ ట్రాన్స్ ఫర్ల విషయంలో బ్యాంకులకు సొంత చెక్ వ్యవస్థ ఉండాలి. అలాగే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా  మనీ ట్రాన్స్ఫర్  విషయంలో ఒక అంతర్గత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయంలో బ్యాంకులు, ఆర్బీఐ అవసరమైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే సైబర్ నేరగాళ్లు ఆటలు సాగు తున్నాయి.అమాయక ప్రజల సొమ్ములు ఖాళీ అవుతున్నాయి.  సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా సైబర్ నేరాల అదుపులో బ్యాంకులు చేతులెత్తేయడం దౌర్భాగ్యమనే చెప్పాలి.  

ఇంటా బయటా ఉక్కపోతతో విజయసాయి ఉక్కిరిబిక్కిరి!

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఇంటా బయటా ఉక్కపోత తప్పడం లేదు. విజయసాయిని ఇటు సొంత పార్టీకీ, అటు మీడియాకీ కూడా టార్గెట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది.  ఆయన ప్రకటనలకూ, వ్యాఖ్యలకూ కనీసం జగన్ రెడ్డి సొంత మీడియాలో కూడా ప్రాముఖ్యత లభించడం లేదు. పార్టీ నేతలూ కార్యకర్తలూ కూడా ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ ఇంత కాలం అవమానించినా, కాదు పొమ్మన్నా, పాపం ముసలోడైపోయాడంటూ చులకన చేసినా పెద్దగా పట్టించుకోకుండా, దులిపేసుకుని జగన్ పట్ల తన వీర విధేయతను శ్రద్ధంగా, భక్తిగా, భయంతో చాటిన విజయసాయిరెడ్డికి కనీసం జగన్ నుంచి కూడా సరైన గుర్తింపు లేకుండా పోయింది.  ఈ నేపథ్యంలోనే విజయసాయి ఇటీవల తరచుగా సంయమనం కోల్పోతున్నారు. మీడియాలో ఎక్కడా తన మాటలకు ప్రాధాన్యత లభించకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించి ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు.   గతంలో కూడా ఒక సారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా చానల్, పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటించేశారు. ఆ సందర్భంలో ఆయన మనసులో ఉన్న మాట అనుకోకుండా బయటకు చెప్పేశారు. వైసీపీలో కూడా తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందనీ, ఆ పార్టీ సొంత మీడియాలో కూడా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనీ ఆవేదన వ్యక్తం చేసేశారు. గతంలోనే తాను టెలివిజన్ చానల్ ప్రారంభిద్దామని అనుకున్నాననీ, అయితే అప్పట్లో జగన్ వారించడం వల్ల ఆగిపోయాననీ చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరి చెప్పినా వినే పరిస్థితి లేదనీ, చానెల్ ప్రారంభించడం తధ్యమనీ కుండబద్దలు కొట్టేశారు.  అంతే ఆ తరువాత ఆయన మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు.  అసలింతకీ విజయసాయిరెడ్డి ఆవేదనకు, ఆక్రందనలకూ కారణమేమిటంటే.. మొదటి నుంచీ వైసీపీలో నంబర్ 2గా ఉండే విజయసాయి రెడ్డికి  ఆ తరువాత పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆయన నంబర్ 2 స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేశారు. ఆ తరువాత విజయసాయికి పార్టీలో నామమాత్రపు ఉనికి మాత్రమే మిగిలింది.  ఆ సమయంలో  ఆయన సొంత చానల్, సొంత పత్రికా అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు.  అన్నిటి కంటే ముఖ్యంగా  విజయసాయిపై  ఒక మహాళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆయనకు మద్దతుగా వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఆరోపణలు ఖండించడానికి ముందుకు రాలేదు.  దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చాస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి సొంత మీడియా ఏర్పాటుపై ప్రకటన చేసేశారు. ఆ సమయంలోనే..  తాను ఏ పార్టీలో ఉన్నా తన చానల్ మాత్రం నిఖార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పి పార్టీ మార్పు సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ సంకేతం ఇవ్వడం ద్వారా   జగన్ కు దాదాపుగా ఓ హెచ్చరిక చేశారు. లేదా బ్లాక్ మెయిల్ చేశారని అప్పట్లో  పరిశీలకులు విశ్లేషించారు.    నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీలో ఆయనను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన సమయంలో కూడా ఆయనకు డిఫెన్స్ గా పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన సోంత చానల్ అంటూ హడావుడి చేశారు.   ఇదంతా జరిగి ఐదు నెలలు కావస్తోంది. అయినా విజయసాయి చానెల్  ఏర్పాటు విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.  ఇక తాజాగా విజయసాయి రెడ్డి మరో సారి ఇక్కట్లలో పడ్డారు. ఆయన హద్దూ ఆపూ లేకుండా ఓ మీడియా సంస్థ అధిపతిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన దీటుగా సమాధానం ఇచ్చారు. తన చానెల్ లోనే లైవ్ డిబేట్ కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దీంతో విజయసాయి మళ్లీ సొంత చానల్ ప్రకటన చేసి, తన చానెల్ ద్వారానే ఆ మీడియా ప్రతినిథికి బదులిస్తానని చెప్పి ప్రస్తుతానికి తప్పించుకోవడం కోసం చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.