జగన్ కంటే నీరోయే నయం!

రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారన్నది నానుడి. ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను చూస్తుంటే నీరో చాలా చాలా నయం అనిపిస్తుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోరాతి  ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అధికారంలో ఉండగా తమంత వారు లేరన్నట్లుగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు నోరు మెదపడానికి భయంతో వణికి పోతున్నారు. చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఇక ఎక్కడా అవకాశం లేని కొద్ది మంది మాత్రం త్వమేవ శరణం నాస్తి అన్నట్లు వైసీపీపి పట్టుకు వేళాడుతున్నారు. వారిలో కూడా అంబటి వంటి వారు తప్ప మరెవరూ పార్టీ కార్యక్రమాలలో  పాల్గొనడం లేదు. సాధ్యమైనంత వరకూ వార్తల్లో ఉండకుండా కౌపీన సంరక్షణార్థం అన్నట్లు మౌనాన్ని ఆశ్రయించి దాదాపు రహస్య జీవనం గడుపుతున్నారు.  ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కుమార్తెల దగ్గరకు అంటూ లండన్ చెక్కేశారు. సంక్రాంతి తరువాత నుంచీ జిల్లాల పర్యటన అంటూ ఊదరగొట్టేసిన ఆయన ఆ తరువాత ఆ మాటే ఎత్తడం లేదు. సరే అది అలా ఉంచితే తాజాగా వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించి, జగన్ తన బలుపుగా ఇంత కాలం చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి జగన్ కు షాక్ ఇచ్చారు. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా చడీచప్పుడు లేకుండా విజయసాయి తన దారి తాను చూసుకున్నారు. ఇక రాజకీయాలు మాట్లాడనుంటూ ట్వీట్ చేసేసి పనిలో పనిగా ఇంత కాలం తాను ఎవరిపై అయితే అనుచిత వ్యాఖ్యలు, అసంబద్ధ విమర్శలతో రెచ్చిపోయారో వారి పట్ల తనకు ఎలాంటి విరోధం లేదని కూడా చెప్పేసి తాను గతంలో చేసిన విమర్శలు, వ్యాఖ్యలూ అన్ని జగన్ స్క్రిప్టేనని అన్యాపదేశంలో వెల్లడించేశారు. ఎదో  మొక్కిబడికి జగన్ కు తాను రుణపడి ఉంటానని, వైఎస్ కుటుంబంతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  ఇదంతా సరే విజయసాయి రాజీనామాతో వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. అసలు ఎవరూ ఊహించని పరిణామం కావడంతో విజయసాయి రాజీనామాపై ఎలా స్పందించాలో కూడా ఆ పార్టీ నేతలకు తెలియలేదు. అందుకే విజయసాయి పార్టీ నుంచి నిష్క్రమించడంపై వైసీపీ నుంచి అధికారిక స్పందనే కరవైంది. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు పెదవి కదపలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. సాధారణంగా పార్టీ ఇంతటి సంక్షోభంలో ఉన్న తరుణంలో ఏ నాయకుడైనా పార్టీ నేతలు, క్యాడర్ లో ధైర్యం నింపడానికి వారితో భేటీ అవుతారు. భరోసా ఇస్తారు. నేను ముందుండి నడిపిస్తానన్న స్థైర్యాన్ని ఇస్తారు. కానీ జగన్ అవేమీ చేయలేదు. విదేశీ పర్యటన నుంచి ఆయన ఏపీకి  రాలేదు. బేంగళూరు వెళ్లి కూర్చున్నారు. పార్టీ పరిస్థితి గురించి కానీ, విజయసాయి రాజీనామా గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. విదేశీ విహారం తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు సైతం జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ మనుడగ కష్టమేనన్న అభిప్రాయం ఆ పార్టీ నుంచే వ్యక్తం అవుతోంది. ఇంకా జగన్ ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని బాహాటంగానే చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చి జిల్లాల పర్యటనలు ప్రారంభించినా ఆయన వెంట నడిచేవారూ, నిలిచేవారు ఎవరూ ఉండకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మరో మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత?!

కల్వకుంట్ల కుటుంబాన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా స్కాంలు చుట్టుముడుతున్నాయా? అవినీతి, అక్రమార్జన విషయంలో వారు ఆరోపణల ఊబిలో కూరుకుపోయారా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తుంటే ఔననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖరరావు కుమార్తె, కుమారుడూ కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే అరెస్టై బెయిలుపై ఉన్నారు. ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిండా మునిగి ఉన్నారు. ఈ విషయంలో నిధుల మళ్లింపు జరిగిందనీ, దానిలో కేటీఆర్ ప్రమేయానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనీ కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. ఆయనకు ముందస్తు బెయిలు తిరస్కరించాయి. ప్రస్తుతం ఆయన ఏసీబీ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్నారు.  ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై బెయిలుపై విడుదలైన కవితపై అదే మద్యం విషయంలో మరోమారు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సారి ఆరోపణలు కేరళ మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి వచ్చిన తరువాత చాలా కాలం పాటు మౌనాన్ని ఆశ్రయించిన కవిత ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ.. రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అంతలోనే కేరళ మద్యం విధానంలోనూ కుంభకోణం జరిగిందనీ, అందులో కూడా కవిత ప్రమేయం ఉందనీ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆరోపణలకు చేసింది కేరళ విపక్ష నేత వీడీ సతేషన్ చేశారు.   ఢిల్లీలో జరిగిన విధంగానే కేరళలోనే మద్యం విధానంలో పెద్ద కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రధాన పాత్ర పోషించారనీ ఆయన ఆరోపించారు. కవిత పలుమార్లు కేరళ వచ్చి ఓ కంపెనీకి మద్యం ప్లాంట్ల కోసం లాబీయింగ్ చేశారని సతేషన్ ఆరోపణలు గుప్పించారు. కేరళలో అధకారంలో ఉన్న వామపక్ష కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే ఇదంతా జరిగిందన్న నతేషన్ కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావించడం ప్రాధాన్యత  సంతరించుకుంది.  కేరళలో ఈ మద్యం కుంభకోణం 2023లో జరిగిందని చెప్పిన ఆయన  పాలక్కాడ్‌లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ లిమిటెడ్ పేరుతో భారీగా భూములు సేకరించారని , ఎక్సైజ్ చట్టంలో  మార్పులు చేసి మరీ ఆ సంస్థకు మద్యం తయారీ లైసెన్సు మంజూరు చేశారని సతేషన్ ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ లు ఏకపక్షంగా వ్యవహరించి మరీ లైసెన్సులు మంజూరు చేశారన్నారు.  ఇదంతా కల్వకుంట్ల కవిత కేరళ వచ్చి పెద్దలతో భేటీల తరువాతే జరిగిందని సతీష్ ఆరోపణ. ఈ ఆరోపణలను కవిత ఖండించారు. అయితే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టై బెయిలుపై ఉన్న నేపథ్యంలో తాజా ఆరోపణలపై ఆమె ఖండనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు సరికదా.. నిప్పు లేకుండా పొగరాదుగా అని వ్యాఖ్యానిస్తున్నారు. 

విజయసాయి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 10 నుంచి మార్చి పది మధ్యలో ఓ పది హేను రోజులు విదేశాలకు వెళ్లేందకు సీబీఐ కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.  ఇటీవల వైసీపీ పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. ఇక నుంచి పూర్తిగా రాజకీయాలకు దూరమౌతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తన వ్యాపకం రాజకీయం కాదనీ, వ్యవసాయం మాత్రమేననీ విజయసాయి స్పష్టంగా చెప్పారు. రాజకీయ సన్యాసం తరువాత కొద్ది కాలం పాటు విదేశాలకు వెళ్లాలని భావించిన విజయసాయి రెడ్డి ఫ్రాన్స్ , నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 కావడంతో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వాలి. దీంతో ఆయన తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును  ఆశ్రయించారు. కోర్టు ఆయన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ విదేశాలలో ఉన్న సమయంలో పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి, ఆయన స్వదేశానికి రాగానే విదేశాలకు చెక్కేస్తున్నారని సెటైర్లు పేలుతున్నాయి.    

సాక్షులు చనిపోతున్నారు – హైకోర్టులో వైఎస్ సునీత పిటిషన్

2019 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీత తాజాగా మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇంకెంత మాత్రం జాప్యం కూడదని కోరుతూ ఆమె సత్వరమే విచారణ పూర్తి చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని,  ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగడం లేదని  వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు.  తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ లో ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని.. ఆరు నెలల్లో ట్రయల్‌ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని  కోరారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని  పేర్కొన్నారు. . సీబీఐ సమర్పించిన డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్‌ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్‌ మాత్రమే ఓపెన్‌ చేశారన్నారు. రోజుకు 500 ఫైల్స్‌ చొప్పున ఓపెన్‌ చేసుకుంటూ పోతే మరో ఏడేళ్లయినా ట్రయల్‌ ప్రారంభం కాదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా తన పిటిషన్ లో ఈ కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని, వారి మరణాలు అనుమానాస్పద స్థితిలో సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  ఇప్పటికైనా ట్రయల్‌ ప్రారంభించాలని కోరారు. కాగా సునీత్ పిటిషన్ ను కోర్టు ఫిబ్రవరి 4న విచారించనుంది.   

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన సుప్రీం

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలనూ విన్న సుప్రీం కోర్టు తదుపరి విచారణకు వచ్చే సోమవారానికి వాయిదా వేచింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదిని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంత అని సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది. మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలంగాణ అసెంబ్లీ గడువు ముగిసే దాకా నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం రాదా అని నిలదీసింది. ఈ దశలో ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీ స్పీకర్ ను అడిగి చెబుతానని అన్నారు. దీంతో విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.  ఇలా ఉండగా పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులుఇప్పటి వరకూ  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని సుప్రీం ద‌ృష్టికి తీసుకువచ్చారు. స్పీకర్ రీజనబుల్ టైం అన్నారనీ, దానికి నిర్దుష్ట టైమ్ ఫ్రేమ్ ఉండాలని వాదించారు.  

ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో    ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావరి, కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోజ‌కవ‌ర్గాల‌కు, శ్రీకాకుళం-విజ‌య‌న‌గ‌రం-విశాఖ‌ప‌ట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆ ఎన్నికల నోటిషికేషన్ ఫిబ్ర‌వ‌రి 3న విడుదలౌతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ కూటమి పార్టీల నేతలకు దిశానిర్దేశం చేశారు.  ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రాజ‌శేఖ‌ర్‌ను భారీ మెజారి టీతో గెలిపించాల‌ని కోరారు. ఎన్‌డీఏ ప‌క్షాల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాలు పెట్టుకుని ప‌నిచేయాల‌ని సూచించారు. సుస్థిర పాలన కోసం ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను విజయపథంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనీ, రాష్ట్రం బాగు కోసం, ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.  

రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31) ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని నిర్దుష్ట సమయంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.  ఈ ప్రాజెక్టుకు కేంద్రం  ఇప్పటికే రూ.12,000 కోట్లు కేటాయించింద తెలిపారు.  పోలవరంతో పాటు ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను ఆమె తన ప్రసంగంలో వివరించారు. దేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  అందుకు దోహదం చేసే ఇండియా ఏఐ మిషన్ అన్నారు. ఇ  కృత్రిమ మేధస్సు రంగంలో భారతదేశం పాత్రను పెంచడం లక్ష్యంగా ఆ మిషన్ పని చేస్తున్నదని ముర్ము అన్నారు.  సైన్స్, స్టార్టప్‌ల నుంచి అంతరిక్ష పరిశోధన వరకు వివిధ రంగాలలో భారతీయ యువత అపార నైపుణ్యం చూపుతోందన్నారు.   అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్‌తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు.  దేశంలోని విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పారు. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చెసినట్లు చెప్పారు. మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం పట్ల ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. యువతకు విద్య, ఉపాధి కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని,  మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ముర్ము అన్నారు. 

బాబోయ్ అమెరికాలో ఉద్యోగం వద్దు ... ఇంటి బాట పడుతున్న తెలుగు విద్యార్థులు

ఉన్నత చదువుల కోసం ఎఫ్ 1 విసాపై అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగులు చేస్తున్న  తెలుగు విద్యార్థులు, యువకులు భయాందోళనకు లోనవుతున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ నినాదం ఇపుడు ఇండియన్స్  గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగువారిపై తీవ్ర ప్రభావం చూపింది. చదువు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు దాదాపు 7 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడు వేల విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ చట్టాలను పునరుద్దరించారు. రానున్న రోజుల్లో వీసా చట్టాలను మరింత కఠినతరం చేస్తామని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఒక వేళ ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుగు విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే.  వీసాలు  సాధారణంగా మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఎఫ్ 1, రెండోది జె 1, మూడోది ఎం 1   . ట్రంప్  అమెరికా అధ్యక్షుడుగా నియామకమైన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఆయన ఉక్కు పాదం మోపారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు ఉద్యోగం దేవుడెరుగు కనీసం ఇక్కడ ఉండనిస్తే చాలు అనే స్టేజికి వచ్చేశారు. తమను ఎక్కడ దేశబహిష్కరణకు గురి చేస్తారోనని వణికిపోతున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. రిస్క్ తీసుకుని స్టూడెంట్ వీసాలు తీసుకున్న వారంతా ఇంటి బాట పట్టే పరిస్థితి నెలకొంది. వీరంతా ఎఫ్ 1 వీసాపై ఉన్నవారే. వారానికి 20 గంటలు మించి పార్ట్ టైం ఉద్యోగం చేయకూడదు.  నిర్దేశిత స్థలంలోనే ఈ ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే దేశ బహిష్కారం తప్పదు. రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్ లు, రిటైల్ స్టోర్ ల్లో అక్రమంగా పని చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరి పరిస్థితి దారుణంగా ఉంది. 

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. స్థలం, సౌకర్యాలపై అధ్యయనం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ మాట తప్పను, మడమ తిప్పను అని చెబుతుంటారు. విశ్వసనీయత కోల్పోను అని కూడా చెబుతుంటారు. కానీ ఐదేళ్ల తన పాలనలో జగన్ రెడ్డి ఎన్నిసార్లు మాట తప్పారో.. మరెన్ని సార్లు మడమ తిప్పారో లేక్కలేదు. ఆయన మాట ఇవ్వడం తప్పడానికే అన్నట్లుగా నెటిజన్లు పలు సందర్భాలలో సెటైర్లు కూడా వేశారు. ఇక ఆయన విశ్వసనీయత ఏంత అన్నది 2024 ఎన్నికలలో జనం ఇచ్చిన తీర్పే చెప్పేసింది. అందుకు భిన్నంగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తన తరువాతే ఎవరైనా అని చాటుతున్నారు.  జగన్ మోహన్ రెడ్డి కర్నూలును న్యాయరాజధాని అని ప్రకటించి.. ఆ తరువాత ఆ విషయమే మర్చిపోతే.. చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ అని హామీ ఇచ్చి ఇప్పుడా హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో హైకోర్టు బెంచ్ కు అనుమతులు రాగా, అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలం వసతులపై అధ్యయనం ప్రారంభమైంది. తాజాగా కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ ేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, వసతులపై అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు ఇచ్చిన ఆదేశాల సారాంశం.  కర్నూలులో ‘హైకోర్టు బెంచ్’ ఏర్పాటు చేస్తామని ‘ప్రజాగలం’ సభలో  హామీ ఇచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా కసరత్తు ప్రారంభించి కీలక పురోగతిని సాధించింది.  కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. కర్నూలులో ఏపీ హైకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి పంపాలన్న తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.   కర్నూలులో లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలను ఏర్పాటు చేసేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణను రెడీ చేసింది.  

ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ.. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం (జనవరి 31) పదవీ విరమణ చేశారు.  ఈ సందర్భంగా ఆయనకు ఘన వీడ్కోలు లభించింది. మంగళగిరిలోని ఆరోబెటాలియన్ మైదానంలో జరిగిన వీడ్కోలు పరేడ్ లో ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై యూనిఫారంకు దూరమౌతున్నానన్న ఆలోచనే భరించలేకున్నానన్నారు. తన జీవితంలోనే ఇవి అంత్యంత ఉద్విగ్నభరిత క్షణాలు అన్న ద్వారకా తిరుమలరావు.. తన కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాన్నారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వరకూ అన్నీ చూశానన్నారు.  కాగా పోలీసు శాఖపై ద్వారకాతిరుమలరావు చెరగని ముద్ర వేశారని నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు.  ప్రజా భద్రత కోసం పలు సంస్కరణలు చేపట్టారనీ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్ ఏర్పాటు కూడా ద్వారకా తిరుమలరావు ఆలోచనేనని చెప్పిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తానన్న హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. 

కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. 990 కోట్ల వ్యయానికి వనరులశాఖ ఆమోదం

జగన్ ప్రభుత్వ నిర్వాకంతో  మూలన పడిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు అని ప్రకటించిన చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఆ ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని అప్పట్లో ప్రాజెక్టును సందర్శించి పనులను పరుగులెత్తించేవారు.  దక్షణ భారతదేశంలో అత్యధిక నీళ్లు ఉండే ఏకైక నది గోదావరి. యేటా 3 వేల టీఎంసీల నీరు వృధాగా ఉప్పు సముద్రం పాలౌతోంది. ఆ నీటిని ఒడిసిపట్టి వినియోగించుకుంటే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదు. అటువంటి పోలవరం కోసం చంద్రబాబు 2014 ఎన్నికలలో గెలిచిన తరువాత తన దృష్టినంతా కేంద్రీకరించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసే వరకూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది లేదని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు.  చంద్రబాబు హయాంలో ఒకే రోజున 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించారు.   31 సార్లు క్షేత్రస్థాయిలో పోలవరంలో పర్యటించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయానికి ఊతం వస్తుందనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ క్లియర్‌ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.11, 762.47 కోట్లు ఖర్చు చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్  ప్రభుత్వం పోలవరం పనులను నిలిపివేసింది. రివర్స్ టెండరింగ్ అంటూ అప్పటి వరకూ జోరుగా సాగుతున్న నిర్మాణాలను పడుకోపెట్టేసింది.   జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రాజెక్టు పనులు నిలిపేసింది.   ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే పని చేసే ఏజెన్సీలను తొలగించింది. 2019 జూన్‌ నుండి నవంబర్‌ వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు చూసే ఏజెన్సీ కూడా లేదు. ఆ కారణంగానే   ఆ తరువాత వరదలతో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు పోలవరం అతీగతీ పట్టించుకోకుండా వదిలేయడంతో అప్పటికే  72శాతం పనులు పూర్తైన పోలవరం పరిస్థితి మొదటికి వచ్చినట్లుగా అయ్యింది. జగన్ నిర్వాకం కారణంగా సర్వనాశనమైన పోలవరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టినా బాగుపడుతుందనే గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంతో పోలవరంకు మంచి రోజులు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టుకు జగన్ శాపంగా మారితే.. చంద్రబాబు ఆశాకిరణంగా నిలిచారు.  ఇప్పుడు మళ్లీ పోలవరం పూర్తిపై ఆశలు చిగురించాయి.  దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్ను నిర్మించేందుకు రూ.990 కోట్ల వ్యయం అవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు  సమర్పించిన అంచనాకు రాష్ట్ర జలవనరులశాఖ ఆమోదం తెలిపింది. కాగా కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందంలోని అమెరికాకు చెందిన డియాన్ ఫ్రాన్ కో డి కికో, డేవిడ్ బి పాల్ శనివారం(ఫిబ్రవరి 1) పోలవరానికి రానున్నారు.

హైదరాబాదులో క్రీ.శ. 7వ శతాబ్ది చాళుక్య ఆనవాళ్లు

మంచిరేవులలో బాదామీ చాళుక్య ఆనవాళ్లు!  కాపాడుకోవాలంటున్నప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ఈమని శివనాగిరెడ్డి  హైదరాబాద్ నగర శివారు గ్రామమైన మంచిరేవులలో చాళుక్య అనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మూసీ పరివాహక గ్రామాల్లో చారిత్రక అనవాళ్లను గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం నాడు మంచిరేవుల గ్రామంలో పర్యటించి ఆంజనేయస్వామి దేవాలయంలో రావి చెట్టు కింద ఉన్న క్రీ.శ. 7వ శతాబ్దికి చెందిన దేవాలయ మండపం గోడలకు బిగించే రాతి కిటికి, ఆలయంలోపల గోడ పక్కనే వినాయక విగ్రహం ఉన్నాయని చెప్పారు. వినాయకుడు రెండు చేతులు మాత్రమే కలిగి తలపై కిరీటం లేకుండా లలితాసనంలో కూర్చొని ఉన్నాడనీ, అలాగే ఎర్ర ఇసుకరాతితో చెక్కిన కిటికీ చుట్టూ సాదా చట్రం, మధ్యలో గాలి, వెలుతురు ప్రసరించడానికి మూడు వరుసలలో ప్లస్ ఆకారంలో 18 కంతలు, వాటి మధ్య చక్కటి పద్మం డిజైన్లు ఉన్నాయనీ, వినాయకుని ప్రతిమా లక్షణం, కిటికీ వాస్తు విన్యాసం, బాదామీ చాళుక్యుల కాలంనాటివని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ రెండు కళాఖండాల పైన రంగులు తొలగించి, పీఠాలపై నిలబెట్టి కాపాడుకోవాలని శివనాగిరెడ్డి ఆలయ ధర్మకర్తలకు, స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు కళాఖండాలు హైదరాబాద్ నగర చరిత్రను క్రీ.శ. 7వ శతాబ్దికి, అంటే ఇప్పటికీ 1300 సం||ల క్రితానికి తీసుకెళ్తున్నాయని , గతంలో బేగంబజారులో క్రీ.శ. 612 నాటి బాదామి చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి రాగిరేకు శాసనం దొరికిన నేపథ్యంలో, ఈ రెండు  ఆధారాలు నగర చరిత్రకు అద్దంపడుతున్నాయని శివనాగిరెడ్డి అన్నారు.

యుక్త వ‌య‌స్సులో అవినీతి.. వృద్ధ వ‌య‌స్సులో జైలు.. జ‌గ‌న్ రెడ్డిదీ అదేదారా?

న్యాయవ్యవస్థను మోసం చేయడం దేశద్రోహాన్ని మించిన నేరం. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావు లేదు.  దేశంలో సామాన్యులు చట్టాలని, న్యాయ తీర్పులను గౌరవిస్తూ శిక్షలు  అనుభవిస్తున్నారు. అయితే రాజకీయంగా ఉన్నత స్థాయిల్లో ఉన్న నాయకులు మాత్రం  వేల కోట్ల ప్రజా ధనం స్వాహా చేసి, న్యాయవ్యవస్థను తప్పుతోవ పట్టిస్తూ, చట్టాలను అడ్డు పెట్టుకొని  శిక్ష పడకుండా ఏళ్ల తరబడి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రాజకీయంగా ప‌లుకుబ‌డి క‌లిగిన నేత‌లు.. వారు దోచేస్తున్న ప్రజాధనం, వారు గ‌డుపుతున్న విలాసవంతమైన జీవితాల గురించి అనేక దేశాల న్యాయవిద్యలో పలు అంశాలు ప్రముఖ ఉదాహరణలుగా బోధిస్తుండ‌టం గ‌మ‌నార్హం. భార‌త‌దేశంలో పాల‌క వ్య‌వ‌స్థ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఆస్తులు కూడబెట్టిన వారు ఎందరో ఉన్నారు.  వారిలో చాలామంది జైలు శిక్షలు అనుభవించారు. అయితే, అటువంటి వారిపై కేసులు  13 నుంచి 20ఏళ్ల వరకూ సుదీర్ఘంగా విచారణ సాగడంతో అటువంటి వారు జీవిత చ‌ర‌మాంకంలో జైలు కెళ్తున్నారు. కోట్లాది రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డిన వ్య‌క్తి  66 నుంచి 78 ఏళ్ల మధ్య వయస్సులో కోర్టులు శిక్ష విధిస్తే లాభమేమిటి..?  అలాంట‌ప్పుడు అది శిక్ష కాదు.. ఒక విధంగా చూస్తే అది వారికి వరం అనే చెప్పాలి.  ఎందుకంటే.. వారికి జైలు శిక్ష ప‌డే స‌మ‌యానికి ఆలనాపాలనా చూసుకునేందుకు ఎవరూ ఉండని పరిస్థితి.  ఆ దశలో కోర్టు వీరిని జైల్లో కూర్చోబెట్టి వారికి సౌకర్యాలు కల్పించి వారి ఆరోగ్యపరమైన అలనాపాలనా చూసేందుకు సిబ్బందిని నియమించడంతో రాజభోగాలు అనుభవిస్తారు. దేశంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆర్థికపరమైన నేరాలకు పాల్పడిన ముఖ్య‌మంత్రులు ఉన్నారు. వారిలో కొంద‌రికి శిక్ష‌లు ప‌డ్డాయి. అయితే, వారిపై కేసుల విచార‌ణ సుదీర్ఘ‌ కాలం కొన‌సాగ‌డంతో వారికి శిక్ష‌లు ప‌డే స‌మ‌యానికి వారు వృద్ధాప్యానికి చేరుకుంటున్నారు. ఇలాంటి వారిలో కొంద‌రిని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. ఓం ప్రకాష్ చౌతాలా, లాలూ ప్రసాద్ యాదవ్,   జయలలిత వంటి వారి గురించి చెప్పుకోవాలి. ముందుగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాల గురించి  చెప్పుకుంటే.. ఈయన పాతికేళ్ల  కిందట హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999-2000లో జూనియర్ బేసిక్ ట్రెయిన్డ్  టీచర్ల నియామక కుంభకోణంలో  భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారు. ఈ కేసు విచార‌ణ న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో సుదీర్ఘ‌ కాలం సాగింది. ఎట్టకేలకు 2013 జనవరి 22న ఆయనకు 10ఏళ్లు జైలుశిక్ష ప‌డింది. శిక్ష పడిన సమయానికి  ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించి 2021లో విడుదలయ్యారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విష‌యానికి వ‌స్తే.. ఆమె 1991-1996 మధ్య కాలంలో 66.65 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులను క‌లిగి ఉన్నార‌నే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈకేసు 1996 నుండి 2014 వరకు కోర్టులో విచార‌ణ జ‌రిగింది. చివ‌రికి సుదీర్ఘ‌కాలం త‌రువాత 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్లు జైలు శిక్ష ప‌డింది. అయితే, 2015లో ఆమెను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆమెకు శిక్షప‌డిన స‌మ‌యంలో ఆమె వయస్సు 66 సంవత్సరాలు. కేవ‌లం 21 రోజులు మాత్రమే ఆమె జైలుజీవితం గ‌డిపారు.  ఆ తరువాత దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గడ్డి కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసు 1996 నుండి 2018 వరకు వివిధ కోర్టుల్లో విచార‌ణ జ‌రిగింది. సుదీర్ఘ‌కాలం విచార‌ణ త‌రువాత 2013లో ఐదేళ్ల పాటు కోర్టు ఆయ‌న‌కు జైలు శిక్ష విధించింది. అప్పుడు ఆయ‌న వ‌య‌స్సు 65ఏళ్ళు. మూడున్న‌రేళ్లు జైలు జీవితం గ‌డిపాడు.  ఇలా.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డిన వారంతా 10 నుంచి 20యేళ్ల సుదీర్ఘ విచార‌ణ త‌రువాత వృద్ధాప్యంలో జైలుకెళ్లిన ప‌రిస్థితి. ఇదే త‌ర‌హాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసును చెప్పుకోవ‌చ్చు. జ‌గ‌న్ రెడ్డిపై అనేక అక్ర‌మాస్తుల కేసులు ఉన్నాయి. ఆయ‌న‌పై ఎన్ని కేసులున్నా ఇప్ప‌టికీ బెయిల్ పై సుదీర్ఘ‌కాలం బ‌య‌ట‌నే ఉంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ఆయన కోర్టులో వాయిదాల‌కు కూడా హాజ‌రు కాలేదు. న్యాయస్థానానికి వెళ్లకుండా ఎలా మైంటైన్ చేస్తున్నారు. అ చట్టాలకు ఆయనేమైనా అతీతుడా.. సామాన్య ప్ర‌జ‌ల‌కు లేని న్యాయ‌ప‌ర‌మైన సౌల‌భ్యం ఆయ‌న‌కు ఎందుకు కోర్టులు క‌ల్పిస్తున్నాయ‌నేది ప్ర‌శ్న‌గా మారింది.  ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జగన్ రెడ్డి 2004-2009 కాలంలో 43వేల కోట్లకుపైగా ఆదాయానికి మించిన అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్నార‌నే ఆరోపణల‌తో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయన క్విడ్ ప్రోకో పద్ధతిలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారి నుంచి  త‌న‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించార‌ని ఆరోపణలపై న్యాయస్థానంలో కేసులు నమోదయ్యాయి. 14ఏళ్లుగా ఈ కేసులు కోర్టుల్లో విచార‌ణ జ‌రుగుతున్నాయి. ఈ కేసుల నేప‌థ్యంలో 2012లో ఆయ‌న అరెస్ట్ అయ్యారు. ఆ స‌మ‌యంలో ప‌ద‌హారు నెల‌లు జైలులో శిక్ష అనుభ‌వించి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి ఆయన బెయిల్ పైనే ఉన్నారు. జ‌గ‌న్ రెడ్డికి ప్ర‌స్తుతం 52ఏళ్లు. ఇప్ప‌టికే ఈ కేసుల విచార‌ణ‌లో 14ఏళ్లుగా సాగుతోంది. ఆ కేసుల విచారణ వేగం చూస్తుంటే మరో దశాబ్దం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.   అప్ప‌టికీ ఆయ‌న వ‌య‌స్సు అర‌వైయేళ్లు దాటుతుంది. ముఖ్య‌మైన కేసుల విచారణ కూడా నత్తనడకతో పోటీ పడుతుండటం వల్ల  స‌రైన స‌మ‌యంలో నిందితుల‌కు శిక్ష‌లు ప‌డ‌టం లేదు. జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్న సూక్తి రాజకీయనాయకులకు వర్తించదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ కేసుల విచారణ పూర్తి కావడానికి ఏళ్లూ పూళ్లు పడుతుండటంలో నేతలలో శిక్ష పడుతుందన్న భయం కనిపించడం లేదు. దీని వల్ల   మిగిలిన వారిలోనూ న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల పట్ల భయం, గౌరవం లేకుండా పోతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.  రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్ర‌మ‌ సంపాదనకు పాల్పడాలంటే భయపడేలా న్యాయ‌స్థానం వేగంగా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉందని మెజారిటీ ప్రజలకు డిమాండ్ చేస్తున్నారు.   -భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి  న్యాయవాదవిద్యార్థి. అమెరికా.

బడ్జెట్ సమావేశాలపై అఖిలపక్ష సమావేశం

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో 1925-26  వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి విదితమే. కాగా లోక్ సభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా జరిగే ఈ బడ్జెట్ సమావేశాలలో   మొదటి విడత సమావేశాలు శుక్రవారం (జనవరి 31)న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ జరుగుతాయి. ఇక రెండో  విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకూ సాగుతాయి. ఇలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (జనవరి 31) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.    రాష్ట్రపతి ప్రసంగం తరువాత ఆ రోజు కు సభ వాయిదా పడుతుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 1)న కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడతారు.  ఈ నేపథ్యంలో గురువారం (జనవరి 30) అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ పడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరు కాగా కాంగ్రెస్ నుంచి  జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. ఎన్డీయే, ఇండియా కూటమిలోని పార్టీల నుంచి పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు.  సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా రాజ్ నాథ్ సింగ్ సభ్యులను కోరారు. 

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాంటిసిపేటరీ  బెయిలు మంజూరు చేసింది. జగన్ హయాంలో  ఆయన పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని తన ఖాతాలో వేసుకున్నాన్న అభియోగాలపై కూటమి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలో ఆయన అరెస్టు భయంతో  ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.   మార్గదర్శి, చంద్రబాబుపై కేసుల్లో ఆయన చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీ సహా పలు చోట్ల మీడియా సమావేశాలలో మాట్లాడారు.   అయితే వాటిపై కాకుండా ఆయన అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున సొమ్ము దండుకున్నారన్న అభియోగాలపై కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లోనే సంజయ్ కు ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిలు లభించింది. 

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇక అంతే సంగతులా?

తెలంగణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఒకరి తరువాత ఒకరు బెయిలుపై బయటకు వచ్చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అమెరికా నుంచి వెనక్కు రప్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇంక ఈ కేసు నీరుగారిపోయినట్లేనా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక విషయం మాత్రం రూఢీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద పెద్ద తలకాయల ప్రమేయం ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎంత మంది ఫోన్లు ట్యాప్ చేశారన్నది తేలియరాలేదు కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారే కాదు, న్యాయమూర్తులు, సినీ తారలు ఇలా ఒకరనేమిటి  చాలా చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని తేలింది. ఇతర రాష్ట్రాలలో గవర్నర్లుగా ఉన్న వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు ఉన్నారు.  ఈ కేసు దర్యాప్తు ఆరంభంలో చాలా చాలా వేగంగా సాగింది. పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం కూడా జరిగింది. అయితే ఆ తరువాత కేసు దర్యాప్తులో పురోగతి మందగించింది. అందుకు ప్రధాన కారణం ఈ కేసులో అత్యంత కీలకమైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్  ప్రభాకర్ రావు. ఆయన చల్లగా అమెరికా జారుకున్నారు. ఆయనను అక్కడ నుంచి వెనక్కు రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. అలాగే ఇదే కేసులో కీలకమైన మరో నిందితుడు ప్రవీణ్ రావు కూడా పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కనిపెట్టడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో చార్జిషీట్ అయితే దాఖలైంది కానీ దర్యాప్తు పురోగతి లేకుండా పోయింది. దీంతో అరెస్టైన నిందితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు.   తిరపతన్నకు కండీషన్ బెయిలు లభించిన తరువాత   ఈ కేసులో మరో ఇద్దరు అధికారులకు కూడా తెలంగాణ హైకోర్టు బెయిలు ఇచ్చింది.  మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులకు  ఒక్కొక్కరికి రూ.లక్ష పూచికత్తుతో పాటు పాస్‌పోర్ట్‌లు అధికారులకు హ్యాండోవర్ చేయాలని,  సు దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని,  సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులు విధిస్తూ తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.  

మహా కుంభమేళాలో ఫైర్ యాక్సిడెంట్

మహాకుంభమేళాను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒకసారి భారీ అగ్నిప్రమాదం సంభవించి పెద్ద సంఖ్యలో గుడారాలు కాలిపోయాయి. ఆ తరువాత బుధవారం (జనవరి 29)తెల్లవారు జామున తొక్కిసలాట జరిగి 30 మంది మృత్యువాత పడ్డారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే తాజాగా గురువారం (జనవరి 30) ప్రయాగ్ రాజ్ సెక్టార్ 22లో ఛట్నాగ్ ఘాట్ వద్ద అగ్రిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 15 గుడారాలు కాలి బూడిదయ్యాయి. గ్యాస్ సిలెండర్లు పేలడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు. మహాకుంభమేళాలో వరుస ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. రానున్న రోజులలో మహాకుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగనుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. యూపీ సర్కార్ కుంభమేళా సందర్భంగా మరింత కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.