జగన్ కంటే నీరోయే నయం!
posted on Jan 31, 2025 @ 3:46PM
రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారన్నది నానుడి. ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను చూస్తుంటే నీరో చాలా చాలా నయం అనిపిస్తుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అధికారంలో ఉండగా తమంత వారు లేరన్నట్లుగా చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు నోరు మెదపడానికి భయంతో వణికి పోతున్నారు. చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఇక ఎక్కడా అవకాశం లేని కొద్ది మంది మాత్రం త్వమేవ శరణం నాస్తి అన్నట్లు వైసీపీపి పట్టుకు వేళాడుతున్నారు. వారిలో కూడా అంబటి వంటి వారు తప్ప మరెవరూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. సాధ్యమైనంత వరకూ వార్తల్లో ఉండకుండా కౌపీన సంరక్షణార్థం అన్నట్లు మౌనాన్ని ఆశ్రయించి దాదాపు రహస్య జీవనం గడుపుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కుమార్తెల దగ్గరకు అంటూ లండన్ చెక్కేశారు. సంక్రాంతి తరువాత నుంచీ జిల్లాల పర్యటన అంటూ ఊదరగొట్టేసిన ఆయన ఆ తరువాత ఆ మాటే ఎత్తడం లేదు. సరే అది అలా ఉంచితే తాజాగా వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించి, జగన్ తన బలుపుగా ఇంత కాలం చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి జగన్ కు షాక్ ఇచ్చారు. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా చడీచప్పుడు లేకుండా విజయసాయి తన దారి తాను చూసుకున్నారు. ఇక రాజకీయాలు మాట్లాడనుంటూ ట్వీట్ చేసేసి పనిలో పనిగా ఇంత కాలం తాను ఎవరిపై అయితే అనుచిత వ్యాఖ్యలు, అసంబద్ధ విమర్శలతో రెచ్చిపోయారో వారి పట్ల తనకు ఎలాంటి విరోధం లేదని కూడా చెప్పేసి తాను గతంలో చేసిన విమర్శలు, వ్యాఖ్యలూ అన్ని జగన్ స్క్రిప్టేనని అన్యాపదేశంలో వెల్లడించేశారు. ఎదో మొక్కిబడికి జగన్ కు తాను రుణపడి ఉంటానని, వైఎస్ కుటుంబంతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇదంతా సరే విజయసాయి రాజీనామాతో వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. అసలు ఎవరూ ఊహించని పరిణామం కావడంతో విజయసాయి రాజీనామాపై ఎలా స్పందించాలో కూడా ఆ పార్టీ నేతలకు తెలియలేదు. అందుకే విజయసాయి పార్టీ నుంచి నిష్క్రమించడంపై వైసీపీ నుంచి అధికారిక స్పందనే కరవైంది. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు పెదవి కదపలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. సాధారణంగా పార్టీ ఇంతటి సంక్షోభంలో ఉన్న తరుణంలో ఏ నాయకుడైనా పార్టీ నేతలు, క్యాడర్ లో ధైర్యం నింపడానికి వారితో భేటీ అవుతారు. భరోసా ఇస్తారు. నేను ముందుండి నడిపిస్తానన్న స్థైర్యాన్ని ఇస్తారు. కానీ జగన్ అవేమీ చేయలేదు. విదేశీ పర్యటన నుంచి ఆయన ఏపీకి రాలేదు. బేంగళూరు వెళ్లి కూర్చున్నారు.
పార్టీ పరిస్థితి గురించి కానీ, విజయసాయి రాజీనామా గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. విదేశీ విహారం తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు సైతం జగన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ మనుడగ కష్టమేనన్న అభిప్రాయం ఆ పార్టీ నుంచే వ్యక్తం అవుతోంది. ఇంకా జగన్ ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని బాహాటంగానే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చి జిల్లాల పర్యటనలు ప్రారంభించినా ఆయన వెంట నడిచేవారూ, నిలిచేవారు ఎవరూ ఉండకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.