నక్సల్స్ రహిత భారత్ దిశగా గొప్ప ముందడుగు.. ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై అమిత్ షా

నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంతో కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మావోయిస్టులకు బలమైన పట్టు ఉన్న ఛత్తీస్ గఢ్ లో వారి పునాదులను పెకలించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. వరుస ఎన్ కౌంటర్లతో వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. తాజాగా  ఛత్తీస్ గఢ్- ఒడిశా సరిహద్దులో సోమవారం నుంచి మంగళవారం వరకూ జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. దీనిపై  కేంద్ర హోంమంత్రి స్పందించారు. ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులుకదలికలపై నిఘా ఉంచి వరుస ఎన్ కౌంటర్లతో  16 మంది నక్సల్స్ మరణించిన ఘటన భ్రదతాదళాలు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. నక్సల్ రహిత భారత్ దిశగా ఇదో గొప్ప ముందడుగని పేర్కొన్నారు. ఇలా ఉండగా ఇటీవలి కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్ లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశా సరిహద్దులో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు సోమవారం మొదలయ్యాయి. ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకూ 16 మంది మావోలు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.  

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున  ఐపీఎస్ అధికారులను   బదిలీ చేసింది. మొత్తం 27 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ సోమవారం రాత్రి   ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదలీలలో పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న కొందరికి పోస్టింగులు లభించాయి.  తిరుపతిలో తొక్కిసలాటకు బాధ్యులుగా భావిస్తూ బదిలీ కి గురై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కు ఈ బదిలీల్లో పోస్టింగ్ లు ఇచ్చారు. కేంద్రంలో డిప్యుటేషన్ ముగించుకొని వచ్చిన మధుసూదన్ రెడ్డి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పాలరాజుకు కూడా పోస్టింగులు దక్కాయి.  ఇక  ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు. రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఎన్ మధుసూదన్ రెడ్డి. ఐజీ ఆపరేషన్స్ గా సీహెచ్ శ్రీకాంత్ నియమితులయ్యారు.  అలాగే టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీగా  ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకపోతే ఏపీ ఎస్పీ బెటాలియన్ ఐజీగా బీ రాజకుమారి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా జీ పాల రాజుకు పోస్టింగ్ ఇచ్చారు.  తిరుపతి ఎస్పీగా హర్షవర్దన్ రాజు, తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడులను నియమించారు.  కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కర్నూలు ఎస్పీగా బదిలీ చేశారు. ఇక ఆయన స్థానంలో కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ ను నియమించారు. కడప ఎస్పీగా అశోక్ కుమార్, ఏసీబీ డైరెక్టర్ గా ఆర్. విజయలక్ష్మి, ఎపీఎస్పీడీజీపీగా ఫక్కీరప్పలను నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.  పీటీవో డీఐజీగా సత్యఏసుబాబు,  వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ డీఐజీగా అన్బురాజన్‌‌, ఏపీఎస్పీ కర్నూల్‌ రెండో బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎం దీపిక, అదే విధంగా ఎస్‌సీఆర్‌బీ, సీఐడీ ఎస్పీగా పి పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కో-ఆర్డినేషన్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ లీగల్‌ ఎస్పీగా కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి,  సీఐడీ ఎస్పీ లుగా ఎన్‌ శ్రీదేవి రావు, ఎస్‌ శ్రీధర్‌, కె చక్రవర్తి,  ఇంటెలిజెన్స్‌ ఎస్పీలుగా జె రామ మోహన్‌రావు, ఎ రమాదేవిలను నియమించారు. విశాఖపట్నం, విజయవాడ అడ్మినిస్ట్రేషన్ డీసీపీలుగా కృష్ణకాంత్‌ పటేల్‌, సరిత, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా ధీరజ్‌ కునుబిల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా జగదీశ్‌‌ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 

దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస భేటీలు.. దావోస్ లో చంద్రబాబు బిజీబిజీ

దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస భేటీలతో ఆయన బిజీబిజీగా ఉన్నారు. వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్- సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరితో వరుస సమావేశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.  వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ (జనవరి 21) వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.  దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి, భేటీలు నిర్వహించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ - గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు - రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ ఆయన మంగళవారం (జనవరి 21)   భేటీ అవుతారు.  బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. కాగా  మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌, సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్  , టీజీ భరత్ మంగళవారం (జనవరి 21) సమావేశమయ్యారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంగీకారం కుదిరిన విషయం తెలిసింద. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. కాగా సోమవారం  వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ఘనంగా ప్రారంభమైంది.  దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు  రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల అవకాశాలు, పొటెన్షియల్ కొలాబరేషన్స్‌పై చర్చించారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్లీనరీ హాలు లాబీలో ఏర్పాటు చేసిన నెట్ వర్కింగ్ డిన్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు వివరించారు.

దావోస్ వేదికగా చంద్రబాబులోని మరో కోణాన్ని బయటపెట్టిన లోకేష్

చంద్రబాబు అంటే అపర చాణక్యుడు, సంక్షోభంలో అవకాశాలు వెతుక్కుని ముందుకు సాగే వ్యూహకర్త, అపార అనుభవం ఉన్న రాజకీయవేత్త.. దార్శనికుడు అనే అందరికీ తెలుసు అయితే దావోస్ వేదికగా ఆయనలోని మరో కోణాన్ని ఆయన తనయుడు నారా లోకేష్ బయటపెట్టారు. తన తండ్రి చంద్రబాబు అంటే ఒక రాజకీయవేత్తగానే అందరికీ తెలుసు కానీ ఆయనలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడని చెప్పారు. అయితే  ఆ వ్యాపారవేత్త దారుణమైన నష్టాలను చవి చూశారని వెల్లడించారు. హెరిటేజ్ కు ముందు సీబీఎన్ అనుక వ్యాపారాలు చేశారనీ, వాటిలో దారుణంగా నష్టపోయారనీ చెప్పారు. అయితే నష్టాలకు వెరవకుండా ఆయన ముందుకే సాగారన్న లోకేష్ చివరకు హెరిటేజ్ ను స్థాపించారని వివరించారు. ఇప్పుడు హెరిటేజ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు.  అదే విధంగా ఆయన రాజకీయాలలోనూ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అనేక ప్రయోగాలు చేశారనీ, భవిష్యత్ ను ముందుగానే దర్శించిన దార్శనికుడని చెప్పిన లోకేష్.. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే అందుకు అప్పట్లో ఆయన విద్యావిధానంలో తీసుకువచ్చిన మార్పులే కారణమన్నారు. దావోస్ లో సోమవారం (జనవరి 20) నుంచి ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం వెళ్లిన నారా లోకేష్ జ్యూరిల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తల సదస్సులో ప్రసంగించారు. ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచీ దాదాపు 180 మంది తెలుగు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. వీరిలో మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. వీరిని ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో ఆయన ఇక్కడ ఇంత మంది తెలుగు వారిని చూస్తుంటే ఆనందంగా ఉంది.. అసలు జ్యూరిచ్ లో ఉన్నానా.. జువ్వలపాలెంలో ఉన్నానా అన్న ఆశ్చర్యం కలుగుతోందని చమత్కరించారు.   ఇక వైసీపీ హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టిన ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు గాడిలో పెడుతున్నారనీ, ప్రస్తుతం రాష్ట్రం కష్టాల నుంచి గట్టెక్కి అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందనీ చెప్పిన నారా లోకేష్.. ఇప్పుడు రాష్ట్రానికి మీరంతా సహకారం అందిచాలన్నారు. పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోందనీ, మీరంతా స్పందించి ముందుకు రావాలని కోరారు.  

చంద్రబాబు హెరిటేజ్ ఎందుకు ప్రారంభించారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయాలలో విలువలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. రాజకీయాల ద్వారా ఆస్తుల సంపాదన వల్ల చెడ్డ పేరు వస్తుందని మనసావాచా కర్మణా నమ్ముతారు. తాను రాజకీయాలలో ఉన్నందున కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులనూ ఎదుర్కోకూడదన్న భావనతో ఆయన వ్యాపారం ప్రారంభించాలని భావించారు. ప్రారంభంలో ఒకటి రెండు వ్యాపారాలు చేసినా అవి విఫలమయ్యాయి. చివరకు హెరిటేజ్ ను స్థాపించారు. అది సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ఎన్నడూ హెరిటేజ్ వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు. ఆయన సతీమణి భువనేశ్వరే హెరిటేజ్ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. రాజకీయాలలోకి రాక ముందు నారా లోకేష్ హెరిటేజ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన కూడా రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఆ బాధ్యతలను ఆయన సతీమణి బ్రహ్మణి చూసుకుంటున్నారు. దీని వల్ల ఇటు తన రాజకీయాలకూ, అటు కుటుంబానికీ ఎటువంటి ఇబ్బందులూ రావడం లేదని అన్నారు. హెరిటేజ్ వల్లనే తమ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఉందన్నారు.  దావోస్ వేదికగా చంద్రబాబు ఈ విషయాలను వెల్లడించారు.  అంతే కాదు.. తెలుగుదేశం పార్టీ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకూ గురి కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ తరఫున కూడా ఒక కంపెనీ ప్రారంభించాలని భావించాననీ, ఆ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజకీయాలకు ఖర్చు పెట్టాలని అనుకున్నాననీ తెలిపారు. అయితే అందుకు చట్టాలు అంగీకరించకపోవడంతో ఆ పని చేయలేదని చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటనలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ విత్ డయాస్పోరా పేరుతో తెలుగు పారిశ్రమిక వేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి దాదాపు 12 దేశాల నుంచి తెలుగు ఇండస్ట్రియలిస్టులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి తానా నాడు ఇంజినీరింగ్ కళాశాలు పెట్టాలని తీసుకున్న నిర్ణయం వల్లే మీరీనాడు ఇక్కడ ఉన్నారని చెప్పారు.  

ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో   లోని గరియాబంద్ జిల్లా మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో చత్తీస్ గఢ్ కోబ్రా బలగాలు, ఒడిశా ఎస్​వోజీ జవాన్లు సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం (జనవరి 20) నుంచి మంగళవారం (జనవరి 22) వరకూ ఇరు పక్షాల మధ్యా హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోల మృతదేహాలను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.  

పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.  పరవాడ ఫార్మా సిటీలో  తరచూ ఫార్మా సిటీలో అగ్నిప్రమాదాలు జరుగుతుండటంపై మాత్రం కార్మికులలో తీవ్ర భయందోళనలను కలిగిస్తోంది. మంగళవారం (జనవరి 21) ఉదయం ఫార్మా సిటీలోని మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది  ఘటనా స్థలానికి చేరుని   మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కార్మికులు ఎవరికీ ఎటువంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు.  

దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు.. పుష్ప నిర్మాతల నివాసాల్లోనూ!

టాలీవుడ్ ను ఆదాయపప్ను శాఖ దాడులు కుదిపేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్మొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలకు దిగారు. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇటీవల విడుదలౌన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా అంచనాలను అందుకోలేక చతికిల బడినా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం భారీ కలెక్షన్లతో విడుదలైన రోజుల వ్యవధిలోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దిల్ రాజు నివాసాలు, కార్యాలయాలతో పాటు.. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన మరో సినిమా పుష్ప2 నిర్మాత నవీన్ ఎర్నేని, చెర్నీ నివాసాలు కార్యాలయాలలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.   దాదాపు 200 మంది ఐటీ అధికారులు   బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దిల్‍రాజు, నవీన్ యెర్నేనీ, చెర్రీ నివాసాలు, కార్యాలయాలతో పాటు మరి కొన్ని చోట్ల కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.   అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2   భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.1,800 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటిందని మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రం హిందీలోనూ ఆల్‍టైమ్ రికార్డులను క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 చిత్రాలను కూడా దాటేసింది. ఈ తరుణంలో పుష్ప 2 నిర్మాత నవీన్, ఆ ప్రొడక్షన్ హౌస్ సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.   అదే విధంగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు  సంక్రాంతి సందర్భంగా ఈనెలలోనే విడుదలయ్యాయి.  ఈ రెండింటిలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో దిల్‍రాజు ఇంటిపై ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి.  

ఆ ప్రచారం ఆపండి.. పార్టీ నేతలకు తెలుగుదేశం హైకమాండ్ ఆదేశం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ పార్టీ నేతలూ, కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారానికి తెలుగుదేశం అధిష్ఠానం చెక్ పెట్టింది. ఇకపై ఎవరూ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటూ వ్యాఖ్యలు, డిమాండ్లూ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనవసర అంశాలను మీడియా ముందు లేవనెత్తవద్దని పేర్కొంది.  నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్న అంశంపై పార్టీ నాయకులు ఎవరూ బహిరంగంగా, లేదా  మీడియా ముందు మాట్లాడవద్దని ఆదేశించింది. ఏ విషయమైనా కూటమి అధినేతలు చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.  ఇటీవల కొంత కాలంగా తెలుగుదేశం కీల‌క నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ బహిరంగంగానే మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.  తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి మ‌హాసేన రాజేశ్, పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డితోపాటు డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న ర‌ఘురామ కృష్ణరాజు, ఫిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ప‌లువురు నేత‌లు ఒక్కొక్క‌రుగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పైనే శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపైనే తెలుగుదేశం హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. అనవసర విషయాలు మీడియా ముందు లేవనెత్తవద్దనీ, లోకేష్ డిప్యూటీ సీఎం అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనీ విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. 

పేరుకుపోయిన బకాయిలు.. తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!

పేదలు సంజీవినిగా భావించే ఆరోగ్య శ్రీ సేవలు తెలంగాణలో పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలను చెల్లించకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో వేయి కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ఈ పథకం కింద వైద్య సేవలు అందించడం తమ వల్ల కాదని తెలంగాణ నెట్ వర్క్ ఆస్పత్రిలు చేతులెత్తేశాయి. గత కొంత కాలంగా తెలంగాణ నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ బకాయిల గురించి ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయి పది రోజులకు పైగా గడిచినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో  రాష్ట్రంలో పేదల రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చాలా ఆర్భాటంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల పరిమితిని పదిలక్షల రూపాయలకు పెంచింది. అయితే దాని వల్ల ఉపయోగం ఏముందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచినట్లు గొప్పగా ప్రకటించిన రేవంత్ సర్కార్ పేరుకుపోయిన బకాయిలను పట్టించుకోకపోవడం వల్ల పరిమితి పెంపు ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం కింద వైద్య సేవలు నిలిచిపోయి పది రోజులు గడిచిపోయినా, పేరుకుపోయిన బకాయిల విడుదల ఊసెత్తకుండా, అసలు నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తో చర్చలు కూడా జరపకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ హెల్త్ స్కీం లు కూడా పని చేయడం లేదని, ఆయా కార్డుల పరిస్థితి విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్లుగా తరయారయ్యాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పేద ప్రజలకు శాపంగా మారిందని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. హరీష్ వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రస్తుత పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ప్రతి విమర్శ చేశారు.  రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మాని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

వర్మపై పిఠాపురం జనసేన క్యాడర్ గుర్రు.. కారణమేంటంటే?

పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కాయా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఈ విభేదాలకు కారణం తెలుగుదేశం నాయకుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎస్ వర్మ వ్యాఖ్యలే కారణమా అంటే జనసైనికులు ఔనని అంటున్నారు. అదే సమయంలో వర్మ వ్యాఖ్యలలో తప్పేముందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారంటే.. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని గట్టిగా కోరుకుంటే అదే జరుగుతుంది? అందులో తప్పేముందని అన్నారు.  అసలు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం క్యాడరే కాదు సీనియర్ నేతలు కూడా బాహాటంగానే కోరుతున్నారు. ఆయన ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనీ, ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల పార్టీ కూడా బలోపేతమౌతుందని గట్టిగా చెబుతున్నారు.  ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పై నుంచే తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. అక్కడితో ఆగకుండా ఇది తన ఒక్క‌డి అభిప్రాయమే కాదనీ,  టీడీపీ క్యాడ‌ర్  అభిప్రాయమనీ విస్పష్టంగా చెప్పారు. ఆ తరువాత ఒక్కరొక్కరుగా నాయకులు కూడా అదే విషయాన్నిబాహాటంగా వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసిన వారిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్    ర‌ఘురామ కృష్ణంరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక పార్టీ కార్యకర్తలైతే లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ ను చాలా చాలా గట్టిగా వినిపిస్తున్నారు. లోకేశ్ సార‌థ్యంలో టీడీపీకి బంగారు భ‌విష్య‌త్ ఉంటుంద‌ని తెలుగుదేశం క్యాడర్ చాలా చాలా బలంగా నమ్ముతోంది.   ఇందుకు కారణం లేకపోలేదు. లోకేష్ చొరవతోనే తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటైంద. కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ అరహరం పాటుపడుతున్నారు. కోటి మందికి పైగా ఉన్న తెలుగుదేశం సైన్యంలో అత్యధికులను లోకేష్ పేరుపెట్టి పిలవగలరంటే.. క్యాడర్ తో ఆయన ఎంతగా మమేకమయ్యారో అర్ధం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఐదేళ్ల జగన్ హయాంలో కేసులకు, వేధింపులకు భయపడి.. మౌనంగా ఉండిపోయి, ఇళ్లకే పరిమితమైన పార్టీ నేతలను బయటకు తీసుకువచ్చింది లోకేష్ యువగళం పాదయాత్రే అనడంలో సందేహం లేదు. ఆయన దూకుడు, ఆయన సాహసమే జగన్ అరాచకపాలన పతనానికి బీజం వేసిందని చెప్పడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.  ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటూ తెలుగుదేశం నుంచి వచ్చిన డిమాండ్ కు జనసేన నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని ఏముంది? చాలా రాష్ట్రాలలో ఒకరికి మించి డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అంతెందుకు జగన్ కేబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. దీంతో జనసేన వర్గాల నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం అన్న ప్రతిపాదనకు ఎటువంటి వ్యతిరేకతా రాలేదు.  ఒక్క పిఠాపురంలో మాత్రమే జనసైనికులు రుసరుసలాడుతున్నారు. ఇందుకు కారణంగా మాజీ ఎమ్మెల్యే వర్మ  డిప్యూటీ సీఎంగా లోకేష్ కు ప్రమోషన్ అంటూ గట్టిగా గళం వినిపించడమే. ఇందుకు కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి   జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ అనగానే వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళనలూ చేపట్టారు. అయితే చంద్రబాబు జోక్యంతో తన ఆందోళన విరమించి, అసంతృప్తిని మరిచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. దీంతో జనసేనా విజయంలో సింహభాగం వర్మ ఖాతాలో పడింది. సహజంగానే ఇది నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ కు ఒకింత ఆగ్రహానికి కారణమైంది. దీంతో వర్మతో నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ కు గ్యాప్ పెరిగింది. అదే ఇప్పుడు పార్టీలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు నారా లోకేష్ కు ప్రమోషన్ అంటూ డిమాండ్ చేసినా రాని వ్యతిరేకత వర్మ నోట ఆ డిమాండ్ రాగానే పిఠాపురం జనసైనికుల్లో ఆగ్రహం పెల్లుబకడానికి కారణమైంది.  జనసేన క్యాడర్ తో తనకు ఉన్న గ్యాప్ గురించి తెలిసి కూడా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అన్న మాటను అనాలోచితంగానో, పార్టీలోని సీనియర్లు కూడా చేస్తున్న డిమాండే కదా తాను చేస్తే తప్పేముందన్న భావనతోనో చేసి ఉండచ్చు. అయితే వర్మ చేసిన ఈ ప్రకటన ఇప్పటికే వర్మ పట్ల ఒక విధమైన వ్యతిరేకతను పెంచుకున్న జనసేన క్యాడర్ ను రెచ్చగొట్టింది.  

దావోస్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ప్రపంచ ఆర్థిక వేదిక  సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం అయ్యింది. సోమవారం (జనవరి 20) నుంచి గురువారం (జనవరి 24) వరకూ నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మంత్రులూ, అధికారుల బృందంతో అక్కడకు చేరుకున్నారు.  తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా దావోస్ చేరుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో కలుసుకున్నారు. బ్రాండ్ ఏపీ నినాదంతో చంద్రబాబు, రైజింగ్ తెలంగాణ అంటూ రేవంత్ తమ తమ రాష్ట్రాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తమ తమ ప్రభుత్వాలు కల్పించనున్న సౌకర్యాలు, రాయతీలను పెట్టుబడిదారలు, పారిశ్రామిక దిగ్గజాలకు వివరించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. రాజకీయాలలో గురు శిష్యులుగా ముద్ర పడిన చందరబాబు, రేవంత్ రెడ్డిల మధ్య పెట్టుబడుల కోసం జరిగే పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో జ్యూరిచ్ విమానాశ్రయంలో ఇరువురు ముఖ్యమంత్రులూ ఎదురుపడిన సందర్భంలో అప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

దావోస్ చేరుకున్న చంద్రబాబు బృందం.. పెట్టుబడుల వేటలో చంద్రబాబుకు తోడుగా లోకేష్!

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పెట్టుబడుల వేట ఆరంభమైంది. దావోస్ లో సోమవారం (జనవరి 20) నుంచి గురువారం (జనవరి 24) వరకూ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం అక్కడకు చేరుకుంది. కొద్ది సేపటి కిందట దావోస్ చేసిన చంద్రబాబు బృందానికి యూరోప్ టీటీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. దావోస్ చేరుకోగానే చంద్రబాబు పని ప్రారంభించేశారు. జ్యూరిచ్లో పెట్టుబడి దారులతో భేటీ అయ్యారు. దావోస్ లో ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు గతంలో కూడా చంద్రబాబు పలు మార్లు హాజరైన సంగతి విదితమే. చంద్రబాబు దార్శనికత, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాల పట్ల ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలకు స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో ఆయన దావోస్ పర్యటనల సందర్బంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ సారి చంద్రబాబుకు తోడుగా నారా లోకేష్ కూడా ఉన్నారు. ఉన్నత విద్యావంతుడు, అభివృద్ధిపై అవగాహన ఉన్న లోకేష్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ సదస్సులో కీలక భూమిక పోషించనున్నారు.  ఈ సదస్సులో రాష్ట్రం తరఫున ఐదు సెషన్ లలో ముఖ్యవక్తగా ప్రసంగించే అవకాశం ఉంది. అందులో మూడు సెషన్ లలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మిగిలిన రెండింటిలో నారా లోకేష్ ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. అంతే కాకుండా ఏపీ పెవిలియన్ లో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి భేటీలు, చర్చలలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు.   రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి  వివరించనున్నారు. అలాగే సీఎన్‌బీసీ, టీవీ 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ లో నారా లోకేష్ పాల్గొననున్నారు. 

కేటీఆర్ కు నేడో రేపో ఏసీబీ నోటీసులు?

ఫార్ములా ఈ రేస్ కేసులో  ఏసీబీ, ఈడీలు ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ కేసులో నిందితులను వరుసగా విచారణలకు పిలుస్తూ తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఏ1 బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఏసీబీ, ఈడీలు విచారించిన సంగతి తెలిసిందే. రెండు దర్యాప్తు సంస్థలూ కూడా ఆయన సుదీర్ఘంగా విచారించాయి. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి.   ఏ2గా  ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డిలను కూడా ఏసీబీ, ఈడీలు విచారించాయి.   ఇప్పుడు తాజాగా ఈ ముగ్గురినీ విచారించేందుకు మరో సారి నోటీసులు జారీ చేయడానికి ఏసీ సమాయత్తమౌతున్నట్లు సమాచారం. రేపో మాపో నోటీసులు జారీ చేసి వీరిని విచారణకు పిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ఫార్ములా కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ తొలుత కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీం కు వెళ్లారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టౌతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ అనివార్యంగా ఉపసంహరించుకున్న తరువాత ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగానే ఆయన అరెస్ట్ అవుతారని భావించినా ఈడీ ఆయనను ప్రశ్నించి వదిలేసింది.  ఇప్పుడు తాజాగా ఏసీబీ మరోసారి విచారణకు నోటీసులు జారీ చేయనుండటంతో ఈ సారి కేటీఆర్ అరెస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాల సంగతి ఎలా ఉన్నా.. ఈ కేసులో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు విశ్వసించినట్లే కనిపిస్తోంది. అందుకే ఆయన క్వాష్ పిటిషన్లను తిరస్కరించాయని న్యాయ నిపుణులు సైతం అంటున్నారు.   ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది.   ఈ నేపథ్యంలోనే ఆయన దర్యాప్తు సంస్థలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని తేటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోట్ట పీసు కేసు, రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ, ఈడీలు అడుగుతున్నాయంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా నగదు బదలీ జరిగిందని అంగీకరిస్తూనే.. దానితో తనకేం సంబంధం లేదనీ, తాను ఆదేశాలు మాత్రమే ఇచ్చాననీ, నిబంధనల ప్రచారం వాటిని అమలు చేయాలా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకోవలసింది అధికారులే అంటూ తాను తప్పించుకుందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ ఫార్ములా కార్ కేసులో కేసులో నిధుల బదలాయింపు జరిగిందనీ, అందుకు తానే ఆదేశాలిచ్చాననీ చెబుతూ కూడా కేటీఆర్ తప్పు జరగలేదని, తప్పు చేయలేదనీ దబాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆయనలో ప్రస్ట్రేషన్ పీక్స్ చేరిందనడానికి నిదర్శనంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. చివరి రోజైన ఆదివారం (జనవరి 19) శ్రీవారిని మొత్తం 70 వేల 826 మంది వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. వారిలో 22 వేల 625 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 68 లక్షలు వచ్చింది. కాగా వైకుంఠ ఏకాదశితో ఆరంభించి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పించింది. ఆదివారం (జనవరి 19) అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు అర్చకులు వైకుంఠ ద్వారాలను   ఈ పది రోజుల వ్యవధిలో 6 లక్షల 83 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6  భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భారీగా హుండీ కానుకలు వచ్చాయి.

కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలోని టెంట్ సిటీ 19వ సెక్టార్ లో ఆదివారం (జనవరి 19) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  గ్యాస్ సిలిండర్ల పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు దాదాపు 30 టెంట్లకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరగిన వెంటనే స్పందించిన పోలీసులు భక్తులను అక్కడ నుంచి తరలించారు.  దీంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. కాగా అగ్ని ప్రమాదం సంభవించిన స్థలానికి చేరుకున్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. తొలుత గీతా ప్రెస్ కు చెందిన సెక్టార్ 19లో మంటలు చెలరేగాయి.  ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రయాగ్ రాజ్ కలెక్టర్  తెలిపారు.

అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్

అయోధ్య బాలరామాలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆయన అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇలా అయోధ్యరాముడికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ చరిత్రలో ఇదే ప్రథమం. అయోధ్యలో పర్యటించిన టీటీడీ చైర్మన్ శనివారం (జనవరి 18) రాత్రి  అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నారు. ఆదివారం (జనవరి 19)న తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  అంతకు ముందు అయోధ్య ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్వాగతం పలికారు.  మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్ళి బీఆర్ నాయుడు అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అర్చకులు టీటీడీ బృందానికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు  భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ కార్యదర్శి   రామ్ రఘునాథ్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, ముఖ్య అర్చకుడు  గోపీనాథ్ దీక్షితులు, బొక్కసం ఇన్ ఛార్జ్ గురురాజ స్వామి తదితరులు పాల్గొన్నారు.