వల్లభనేని వంశీ అరెస్టు.. స్వయంకృతమేనంటున్న వైసీపీ
posted on Feb 13, 2025 @ 10:56AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం టికెట్ పై 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించి.. ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీ.. పార్టీ ఫిరాయించి ఊరుకోలేదు. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ లక్ష్యంగా దాడులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే గన్నవరం నియోజకవర్గంలో నామరూపాల్లేకుండా చేయాలన్న కుట్రలు చేశారు. తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేశారని చెప్పవచ్చు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించి సానుభూతితో గెలిచేద్దామన్న ప్రయత్నాలూ చేశారు. అవేమీ ఫలితాన్నివ్వలేదు. జనం ఆయనను ఛీ కొట్టారు. సరే ఆ ఎన్నికలలో వంశీ పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయి..కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది.
పార్టీ ఓటమి పాలైన క్షణం నుంచీ వంశీ దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు. బయటకు వస్తే పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో నక్కినక్కి గడుపుతున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన అనుచరులపైనా కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అనుచరులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ కూడా అరెస్టు భయంతో యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించి, అరెస్టు భయం నుంచి తాత్కాలిక ఊరట పొందారు. ఆయనకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయలేదు కానీ, ఆయన పిటిషన్ విచారణ పూర్తై తీర్పు వెలువడే వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇలా ఉండగా ఇక్కడే వల్లభనేని వంశీ తన కుట్రలకు తెరతీశారు.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారును కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరణకు అఫడివిట్ దాఖలు చేసేలా చేశారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడే రివర్స్ అయ్యే సరికి అంతా వంశీపై కేసు వీగిపోయిందనే భావించారు. అయితే అధికారంలో ఉండగా ఇష్టారీతిగా వ్యవహరించినా సాగినట్లు.. అధికారం లేని సమయంలో కూడా సాగుతుందని వంశీ ఎలా భావించారో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన కిడ్నాప్, బెదరింపు కేసులో అరెస్టయ్యారు. దీంతో ఇప్పుడిక ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఇక ఇప్పుడు వైసీపీ నుంచీ వల్లభనేని వంశీకి ఎటువంటి మద్దతూ లభించడం లేదని పరిశీలకులు అంటున్నారు. కిడ్నాప్ చేసి బెదరించి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు, వైసీపీ కార్యాలయ డీటీపీ ఆపరేటర్ చేత కేసు వెనక్కు తీసుకునేలా చేయడం ద్వారా వంశీ గీత దాటేశారని వైసీపీ వర్గాలే అంటున్నాయి.