పిల్ల సజ్జలకు ముందస్తు బెయిలు దక్కేనా?
posted on Feb 13, 2025 @ 10:30AM
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు నిర్వహించిన సజ్జల భార్గవ్ రెడ్డి ఇష్టారీతిగా చెలరేగి పోయారు. సోషల్ మీడియా బాధ్యతలు చేతికి వచ్చీ రావడంతోనే సజ్జల భార్గవరెడ్డి పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా వ్యవహరించారు.
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలోని మహిళా నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన పోస్లులతో రెచ్చిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రిపుంతలు తొక్కింది. సరే వైసీపీ ఘోర పరాజయంలో ఆ పార్టీ సోషల్ మీడియా పాత్ర కూడా గణనీయంగానే ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ పరాజయం తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని కేసుల నుంచి తప్పించేందుకు ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేయగలిగినంతా చేశారు. పార్టీ ఓటమి పాలు కాగానే చడీ చప్పుడూ లేకుండా ఆయనను సోషల్ మీడియా పదవి నుంచి తప్పించి.. రాష్ట్రం దాటించేశారు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఎన్ని చేసినా చేసిన పాపం వదలదుగా.
సజ్జల భార్గవ్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందుస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సజ్జల భార్గవ్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై హైకోర్టు గురువారం (ఫిబ్రవరి 13) విచారించనుంది. దీంతో ఇప్పుడు సజ్జలకు కోర్టు మందస్తు బెయిలు ఇస్తుందా? ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. పిల్ల సజ్జలకు బెయిలా? జెయిలా అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఇటీవల కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పిల్ల సజ్జలకు యాంటిసిపేటరీ బెయిలు అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.