అనిల్ బ్రో .. పొలిటికల్ కెరీర్ క్లోజేనా?

ఏపీలో ఎన్నికలకు ముందు మీసాలు మెలేసి, తొడలు కొట్టిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. చంద్రబాబుతో పాటు పవన్‌పై విరుచుకుపడిన ఆ ఫైర్‌బ్రాండ్‌ నేత సడన్‌గా సైలెంట్ అయ్యారు.  ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోవడం నెల్లూరులో హాట్ టాపిక్‌గా మారింది. పదేళ్లు ఎమ్మెల్యేగా, దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన ఆ సారు ఇప్పుడు ఇంతకాలం తనకు అండగా ఉన్న అనుచరులకు కూడా అందుబాటులో లేరంట. దాంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్‌పై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన సింహపురి నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత అధికారంలో కొనసాగినప్పుడు అనిల్ దూకుడు అలా ఇలా  కాదు ఓ  రేంజ్ లో ఉండేది.  అసెంబ్లీలో సైతం చొక్కా గుండీలు విప్పుకుని బజారు గూండాలా టీడీపీ నేతలపై అవాకులు చవాకులు పేలుతూ, సవాళ్లు విసురుతూ నానా హడావుడి చేసేవారు. వైసీపీ బూతు మంత్రుల్లో ఒకరిగా ఫోకస్ అయ్యారు. అనిల్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత. తన చిన్నాన్న మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చారు. అప్పట్లో ఆనం ఫ్యామిలీ ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేటర్‌గా గెలిచారు.  నెల్లూరు సిటీ రాజకీయాల్లో మొదట్నుంచీ రెడ్డి సామాజిక వర్గం పెత్తనమే నడిచేది. 1972 నుంచీ అక్కడ వారిదే ఆధిపత్యం... అయితే 2014, 2019 ఎన్నికల్లో సీన్ మారింది. వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన అనిల్ యాదవ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మొదటి టర్మ్‌ మంత్రిగా పనిచేశారు. మొదట్నుంచీ అగ్రెసివ్‌గా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్, జగన్‌పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఎవరైనా జగన్‌ను విమర్శిస్తే, ముందూ వెనుకా చూడకుండా విరుచుకుపడేవారు. జగనన్నకు నమ్మిన బంటునని ఓపెన్‌గానే చెప్పుకునే వారు. ఆ దూకుడుతోనే జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి, జిల్లాలో సీనియర్ నేతలు కీలకంగా ఉన్నప్పటికీ, జగన్ క్యాబినెట్‌లో  స్థానం దక్కించుకోగలిగారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ధోరణి పూర్తిగా మారిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.  ఎవరినీ ఖాతరు చేయరనే విమర్శలు ఎక్కువయ్యాయి. పార్టీలోని నేతలపైనే పరోక్ష విమర్శలు చేసేవారు. తాను ఏం చెబితే జగన్ అదే చేస్తారని అనిల్ చెప్పుకునేవారంట. ఆయన మాట తీరుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. మంత్రిగా ఉన్నా, జిల్లా అభివృద్ధికి ఆయన ఏమీ చేయలేదనే విమర్శలున్నాయి. 2024 ఎన్నికలకు ముందు పార్టీలోని పలువురు నేతలు రకరకాల కారణాలతో అనిల్‌కు దూరమయ్యారు.  అయినా బీసీ సామాజిక వర్గం, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో జగన్ కూడా  అనిల్‌ని బానే ప్రోత్సహించారు. మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో పరిధులు దాటి ఓవర్ యాక్షన్ చేసిన ఆయన, ఒక రకంగా చెప్పాలంటే తన గొయ్యి తానే తవ్వుకున్నారంటారు.  నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేసిన అనిల్,  సొంత పార్టీలోనే అందరికీ శత్రువయ్యారు. తన తర్వాత జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డితో విభేధాలు,  ప్రస్తుత టీడీపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో గ్యాప్ వంటివి మూడో సారి అనిల్‌కు నెల్లూరు సిటీ టికెట్ దక్కకుండా చేశాయి. వైసీపీ తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్‌ను కాదని మరో గట్టి అభ్యర్థిని పోటీకి దించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించినా, అనిల్‌ కుమార్ తనకు అనుకూలంగా ఉన్న డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌కు దగ్గరుండి టికెట్ ఇప్పించుకున్నారు. దాంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఇక నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ టీడీపీ నుంచి పోటీ చేసిన నారాయణ చేతిలో దారుణంగా ఓడిపోయారు . అసలు టికెట్ల కేటాయింపు సమయంలోనే అనిల్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగింది.  అంత సీన్ లేదు, తనకు ఎవరూ అడ్డుకోలేరని.. అనిల్ ఘాటుగా రియాక్టయ్యారు. ప్రత్యర్థి నారాయణ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాల్ విసిరారు . అయితే ఎన్నికల సమయంలో ఆ ప్రచారమే నిజమైంది . జగన్ ఆదేశాలతో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నెల్లూరులో సవాల్ చేసిన అనిల్, రిజల్ట్ తర్వాత ఏమైంది మీ రాజకీయ సన్యాసం అని అడిగితే  తన సవాల్‌ని ప్రత్యర్థులు తీసుకోలేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు . అనిల్ మాట నిలబెట్టుకోకపోయినా,  పరిస్థితులు నిజంగానే ఆయన్ని రాజకీయ సన్యాసం తీసుకునేలా చేశాయంటున్నారు. ఓటమి తర్వాత అనిల్ కుమార్‌ సింహపురిలో కనిపించడమే మానేశారు. పార్టీ యాక్టివిటీస్‌కి కూడా పూర్తిగా దూరమయ్యారు. ఏమైపోయారా అని ఆరా తీస్తే ఆయన  నెల్లూరు నుంచి చెన్నైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేశారని తెలిసింది . అక్కడ ఆయనకి కొన్ని బిజినెస్‌లు ఉన్నాయంట. హైదరాబాద్‌లో కూడా వ్యాపారాలు ఉన్నాయని,  వాటినే ఫుల్ టైం చూసుకుంటున్నారని చెబుతున్నారు. అప్పుడప్పుడూ నెల్లూరుకు వస్తున్నా.. తన సన్నిహితులతో మాట్లాడి చాటుగా వెళ్లిపోతున్నారు తప్ప, పెద్దగా బయటకు ప్రొజెక్ట్ కావడం లేదంటున్నారు. ఈ వ్యవహారం అంతా చూస్తూ .. మా అనిల్ బ్రో.. పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిందని ... రాజకీయ సన్యాసం తీసేసుకున్నారని సింహపురిలోని ఆయన పాత అనుచరులు ప్రచారం మొదలు పెట్టడం విశేషం. ఇదికూడా చదవండి https://www.teluguone.com/news/amp/content/anil-kumar-yadev-obscand-39-178365.html

మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై నిషేధం

మూసీ సుందరీకరణ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకూ ఆ పరిసరాలలో నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.  మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకూ మూసి పరిసరాల్లో ఎటువంటి నిర్మాణాలకూ అనుమతులు ఇవ్వరాదని రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిధిలో నిర్మాణాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.   ఇలా ఉండగా మూసీకి 100 మీటర్ల పరిధిలో కొత్త నిర్మాణాలకు అనుమతులను తప్పని సరి చేసింది. ఈ పరిధిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తు అనుమతులు తప్పని సరని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.  పర్యావరణ పరిరక్షణ, క్రమబద్ధమైన అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ సర్కర్ ఈ నిర్ణయం తీసుకుంది.  

వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

 కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన  వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై బీఏసీలో ఎనిమిది గంటల చర్చకు అంగీకారం కుదిరినప్పటికీ, అధికార, విపక్ష కూటముల మధ్య తీవ్ర వాగ్వివాదాలలో చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు  12 గంటలకు పైగా చర్చ జరిగింది.  చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టారు. ఈ ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు, వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారు. దీంతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.  వాస్తవానికి ఈ బిల్లును గతంలోనే  కేంద్రం ప్రతిపాదించింది. అప్పట్లో ఈ బిల్లులోని కొన్ని అంశాలపై పలు పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ బిల్లులో సవరణల కోసం జేపీసీని నియమించింది. పలు దఫాలుగా భేటీలు నిర్వహించిన జేపీసీ ఆయా పార్టీలు చేసిన సూచనలలో కొన్నిటిని ఆమోందింది. ఈ సవరణలలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణలకు గాను జేపీసీ మూడింటిని ఆమోదించింది.  అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం గురువారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ చేపట్టగా ఎన్డీయే పక్షాలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరమేంటంటే.. వైసీపీ సభ్యులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ ఇప్పటి వరకూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన వైసీపీ తొలి సారిగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే బిల్లు ఆమోదం విషయంలో ఒకింత ఇబ్బందులను కేంద్ర సర్కార్ ఎదుర్కొనే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అలాగే అనూహ్యంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఏకతాటిపై నిలబడి లోక్ సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశాయి.  

ప్రధాని మోడీ థాయ్ ల్యాండ్ పర్యటన

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల ధాయ్ ల్యాండ్ పర్యటన కోసం గురువారం (ఏప్రిల్ 3) బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ థాయ్ ప్రధాని షఓటోంగ్ టార్స్ షినవ వ్రతాలతో భేటీ అవుతారు. వీరి మధ్య ద్వేపాక్షిక సంభంధాల మెరుగుదలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోడీ బెమ్ టెక్ శిఖరాగ్ర సదస్సులో  పాల్గొంటారు.  ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరుగుతాయి.  ఈ శిఖరాగ్ర సమావేశానికి థాయ్ ల్యాండ్ సీఎం పేటోంగ్‌టార్న్ షినవత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, శ్రీలంక పీఎం హరిణి అమరసూర్య  హాజరుకానున్నారు. 2 018లో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన నాలుగో బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ పద్ధతిన జరిగింది.  

నాగపూర్ వాలానే నూతన అధ్యక్షుడు?!

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా  పదవీ కాలం ఎప్పుడో  ముగిసి పోయింది. లోక్ సభ ఎన్నికలకు ముందే ఆయన సెకండ్  టర్మ్ కూడా పూర్తయింది.   అయితే లోక్ సభ ఎన్నికలతో పాటుగా అనేక ఇతర కారణాల వలన, దేశ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు వాయిదా పడడంతో  నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా లేటవుతూ  వస్తోంది. అయితే  ఇక వాయిదా ఉండదని ఈ నెలాఖరుకు నూతన అధ్యక్షుని ఎన్నిక క్రతువు పూర్తవుతుందని పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. ఏప్రిల్ 18,19, 20 తేదీల్లో  జరిగే జాతీయ కార్యవర్గ  సమావేశాలలో, లేదా సమావేశాలు ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ అధక్షుని ప్రకటన ఉంటుందని అంటున్నారు.  అయితే నడ్డా స్థానంలో వచ్చే కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంలో మాత్రం ఈ రోజు వరకు ఎవరికీ స్పష్టత లేదు. నిజానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సైతం కొత్త అధ్యక్షుడు ఎవరనేది తెలియదని పార్టీ కీలక నేతలే అంటున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్ రెడ్డి  అయితే కొత్త అధ్యక్షుడు ఎవరో దేవుడికి కూడా తెలియదని మీడియా ముఖంగానే చెప్పారు. అది కొంచెం అతిశయోక్తి అయినా నూతన అధ్యక్షుడి ఎన్నిక లేదా ఎంపిక విషయంలో ఏర్పడిన చిక్కుముళ్ళు ఇంకా పూర్తిగా విడి పోలేదనేది మాత్రం నిజం.  సో.. కౌన్ బనేగా  బీజేపీ అధ్యక్ష్ ? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని, సమాధానం తెలియని ప్రశ్నగానే  ఉందని అంటున్నారు.  అయితే అధ్యక్ష ఎన్నిక జాప్యానికి కారణాలుగా చెపుతూ వచ్చిన పార్లమెంట్,  అసెంబ్లీ ఎన్నికలు,పార్లమెంట్ సమావేశాలు, ఇతరత్రా బిజీ ..బిజీ వ్యవహారాలు ముగిసి పోవడంతో ఇక అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఉపందుకుంటుంది అంటున్నారు.  అవును  ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ ఆసెంబ్లీ ఎన్నికలతో ప్రస్తుతానికిఎలక్షన్ సీజన్ ముగిసింది. ఈ సంవత్సరం చివర్లో (అక్టోబర్, నవంబర్) జరిగే  బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకూ దేశం మొత్తంలో ఎక్కడా ప్రధాన ఎన్నికలు లేవు. అలాగే  ప్రస్తుతం జరుగతున్నపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  మార్చి4న పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడతాయి. సో పార్టీ అధిష్టానం సంస్థాగత వ్యహరాలపై, ముఖ్యంగా, జాతీయ అధ్యక్షుని ఎన్నికతో పాటుగా తెలంగాణ సహా మరి కొన్నిరాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల పై దృష్టిని కేద్రీకరిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  అయితే మరోవంక బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఇంతగా జాప్యం జరగడానికి వరస ఎన్నికలు, ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్  బడ్జెట్ సమావేశాలు మాత్రమే కారణమా? లేక  ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంటే, ఉన్నాయనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు, బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరగడం కూడా అద్యక్ష ఎన్నికల జాప్యానికి ఒక ప్రధాన కారణంగా పార్టీలో చర్చ జరుగుతోంది. అంతే కాదు  బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరగడానికి, ఎన్నికలకు ముందు పార్టీ అద్యక్షు జేపీ నడ్డా, చేసిన వ్యాఖ్యలు పైకి కనిపించే కారణం అయినా, బీజేపీలో పెరుగుతున్న వ్యక్తి ఆరాధనకు చెక్  పెట్టే ఉద్దేశంతోనే, ఆర్ఎస్ఎస్ పెద్దలు పార్టీ సంస్థాగత ఎన్నికల పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు నాగపూర్  వర్గాల సమాచారం.  అయితే, ప్రధాని మోదీ నాగపూర్ పర్యటన సందర్భంగా జరిగిన చర్చల నేపధ్యంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తిరిగి వేగం పుంజుకుంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.అందులో భాగంగానే,రానున్నవారం పది రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ సహా మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.ఆ వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభమవుతుంది. అయితే పార్టీ అధ్యక్షుని ఎన్నికతో పాటుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు, ఇటీవల బెంగుళూరులో జరిగిన,ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిథి సభలో నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఒక విధంగా వందేళ్ళ పండగ చేసుకుంటున్న సమయంలో, ఆర్టికల్ 370 రద్దు , రామ జన్మభూమి మొదలు ప్రస్తుత వక్ఫ్ సవరణ చట్టం వరకు ఆరఎస్ఎస్’ అజెండా’ లోని ఒక్కొక అంశం నెరవేరుతున్న నేపద్యంలో, ఆర్ఎస్ఎస్ – బీజేపీల మధ్య సైధాంతిక బంధం మరింత బలపడేందుకు దోహదం చేసే ... నాగపూర్ వాలనే బీజీపీ నూతన అధ్యక్షుడు అవుతారని అంటున్నారు.

మోదీ స్టెప్ డౌన్?

ప్రధాని నరేంద్రమోడీ తన పదవిని త్యాగం చేస్తారా? పార్టీ నిబంధనను అనుసరించి తనకు 75 సంవత్సరాలు నిండగానే ప్రధాని పదవి నుంచి స్టెప్ డౌన్ అవుతారా? ప్రధాని మోడీ తనకు తాను ఆ నిబంధనను వర్తింప చేసుకుంటారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది.  ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 75 ఏళ్ల పరిమితి నిబంధన మేరకే బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నాయకుల చేత పొలిటికల్ రిటైర్మెంట్ చేయించారు.  మరి ఇప్పుడు అదే నిబంధన మేరకు మోడీ తనంత తానుగా రాజకీయాలకు దూరమౌతారా? అన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క ొనసాగుతోంది.  శివసేన (ఉద్ధవ్ ధాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ అయితే త్వరలోనే మోడీ వారసుడు రాబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్ద కాలంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లని ప్రధాని నరేంద్రమోడీ  ఇటీవల అంటే గత ఆదివారం నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడానికి కారణం అదేనని ఆయన అంటున్నారు.  మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రారంభోత్సవమనో, మరోటనో కారణాలు చెప్పి ఉండొచ్చు కానీ, ప్రధాన కారణం మాత్రం తన పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్  చీఫ్ మోహన్ భగవత్ తో చర్చించడానికేనని సంజయ్ రౌత్ గట్టిగా చెబుతున్నారు.  మొత్తం మీద సంజయ్ రౌత్ మోడీ స్టెప్ డౌన్ పై ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా, ఆయన వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశంలో రాజకీయ హీట్ పెంచేశాయని చెప్పక తప్పదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు.  మోడీయే 2029లో కూడా ప్రధానిగా ఉంటారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ప్రధానిగా మోడీ యాక్టివ్ గా ఉన్నారనీ, అటువంటి సమయంలో ఆయనకు ప్రత్యామ్నాయం గురించి మాట్లాడటంతో అర్ధం లేదనీ ఫడ్నవీస్ అంటున్నారు.  ప్రధాని మోడీ నాగపూర్ ఆర్ఎస్ఎష్ కార్యాలయం సందర్శన సందర్భంగా ఆయన రాజకీయ వారసుడికి సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదనీ, అసలా ప్రస్తావనే రాలేదనీ ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.   అయితే ఏడున్నర పదుల వయస్సు నిండిన నేతల రాజకీయ విరమణ అంశంపై బీజేపీలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలెవరికీ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నోరెత్తే అవకాశం ఇసుమంతైనా లేదు. గతంలో  అడపాదడపా పార్టీ నాయకుడు ఎలా ఉండాలి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినా, ఇప్పుడు ఆయన నాయకత్వం మార్పుపై కానీ, 75 ఏళ్ల నిండిన వారు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించాలన్న విషయంపై కానీ మాట్లాడే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు పార్టీలో మోడీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ కూడా ఎదురు చూస్తున్నాయనడంలో సందేహం లేదు.  నితిన్ గడ్కరీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లలో ఎవరో ఒకరు మోడీ తరువాతి స్థానం అంట నంబర్ 2లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ, ఆ నంబర్ 2 యే మోడీ వారసుడన్న ప్రచారం జరుగుతోంది.  ఇప్పుడే కాదు. మోడీ రెండో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ యోగి ఆదిత్యనాథ్ రూపంలో ఆయన పోటీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ, షా ద్వయం యోగి పట్ల అంత సదభిప్రాయంతో లేరనీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అదే కారణంతో ఆర్ఎస్ఎస్ మాత్రం యోగికి మద్దతుగా నిలబడుతోందని అంటున్నారు.  హిందుత్వ భావాలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేయడం, ప్రచారం చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. అంతే కాకుండా తనదైన ప్రత్యేక   శైలితో శాంతి భద్రతలను పరిరక్షించడం ద్వారా యోగి పార్టీ నేతలు, క్యాడర్ నుంచి గట్టి మద్దతు సాధించారనీ అంటున్నారు.  అన్నిటికీ మించి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచే వచ్చారు. పలు సందర్భాలలో య ోగి తాను పదవులు ఆశించననీ, యూపీ సీఎంగా తనది పార్ట్ టౌం జాబ్ మాత్రమేనని పలు సందర్భాలలో యోగి చెప్పారు.  

రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం అభ్యంతరం.. కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తామంటూ హెచ్చరిక

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసు  సుప్రీంలో విచారణలో ఉండగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీం కోర్టు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అపహాస్యం చేసే వ్యాఖ్యలుగానే భావించాల్సి ఉంటుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్లపై బుధవారం (ఏప్రిల్ 2) విచారించిన సుప్రీం కోర్టు ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించేలా పది మంది బీఆర్ఎస్ సభ్యులు తమ పార్టీని వదిలి అధికార కాంగ్రెస్ లో చేరారన్నది బీఆర్ఎస్ వాదన. దీనిపై స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా, ఆయన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని బదులిచ్చారు.  దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లంటిపై విచారణ చేపట్టిన కోర్టు ఇప్పటికే పలు దఫాలుగా విచారించింది. తాజాగా బుధవారం విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది   పార్టీలు మారిన ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే సమస్యే లేదని ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రేవంత్ వ్యాఖ్య వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే… పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయన అపహాస్యం చేసినట్టేనని కోర్టు వ్యాఖ్యానించింది. రేవంత్ వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతటితో ఆగని కోర్టు… తెలంగాణ సర్కారు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తీరుపైనా ఒకింత అసహనం వ్యక్తం చేసింది.  

రైతులు, ప్రజల్లో మనోధైర్యం నింపేలా రజతోత్సవ సభ.. కేసీఆర్

చాలా రోజుల తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు విప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తనదైన స్టైల్లో విమర్శల వర్షం కురిపించారు. పనిలో పనిగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినందుకు జనం ఇప్పుడు బాధపడుతున్నారని కూడా అన్నారు.  అయితే ఇదంతా కూడా తెలంగాణ భవన్ కు వచ్చో, ఏదో బహిరంగ సభలోనో చేసిన ప్రసంగం కాదు. తన తన ఫామ్ హౌస్ లో కూర్చునే చేసిన ఉపదేశం.  ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరంగల్ జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఈ నెల 24న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై వరంగల్ జిల్లా పార్టీ నేతలకు సూచలను ఇచ్చారు.  సభకు పెద్ద ఎత్తు జనం స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పిన కేసీఆర్.. ఆ వచ్చే జనాలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  తెలంగాణ ప్రజలకు మనో ధైర్యాన్ని ఇచ్చే విధంగా రజతోత్సవ సభ ఉండాలని అన్నారు. ఈ సభ తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీలు వేస్తానన్న కేసీఆర్.. పార్టీ క్యాడర్ కు, నేతలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక  ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో రేవంత్ నియంత పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకుని కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయన్నారు. తెలంగాణ రైతులకు ఈ దుస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని విధాలుగా దగాపడి మనో ధైర్యాన్ని కోల్పోయిన రైతులు, వివిధ వర్గాల ప్రజలలో ధైర్యం నింపే విధంగా రజతోత్సవ సభ నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ నేతలు బుధవారం (ఏప్రిల్ 2) ఎల్కతుర్తిలోని సభా ప్రాంగణానికి భూమి పూజ నిర్వహించారు. కేసీఆర్ రజతోత్సవ సభకు సంబంధించి నేతలకు చేసిన దిశా నిర్దేశంతో.. రజతోత్సవ సభ వేదిక వరంగల్ నుంచి మేడ్చల్ కు మారుతుందన్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లైంది. 

ఏపీలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలుగు రాష్ట్రాలలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలోని ఐదు స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ నుంచి ఒకరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నిక్యారు. ఆమేరకు కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, అలాగే కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ లకు ఈసీ ధృవీకరణ పత్రం కూడా అంద జేసింది.  ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఐదు స్థానాలలోనూ  తెలుగుదేశం కూటమి అభ్యర్థులే ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం ఈ ఐదింటిలో ఒక స్థానాన్ని జనసేనకు, ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకూ తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ కూడా ఐదు స్థానాలకూ ఐదుగురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక్కాడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది.   దీంతో ఏపీలో తెలుగుదేశం కూటమి తరఫున ఎమ్మెల్సీలుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్, బీటీ నాయుడు, కొణిదల నాగేంద్రరావు (నాగబాబు), సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈసీ ప్రకటించి వారికి ధృవీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ ఐదుగురూ బుధవారం (ఏప్రిల్ 2)న ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.  వీరి చేత అసెంబ్లీ భవనంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

నాగర్ కర్నూల్ ఘటనలో కొత్త కోణం

తెలంగాణ లో సంచలనమైన  నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండ  రేప్ ఘటనలో  కొత్త కోణం వెలుగు చూసింది. మొక్కులు తీర్చుకునేందుకు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన  వారు భార్యభర్తలు  కాదని పోలీసుల దర్యాప్తులోవెల్లడైంది. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న జంట భార్యా భర్తలు కాదని  తెలుసుకున్న నిందితులు యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు.   నిందితుల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్లు, ప్రేమికులను బెదిరించి లైంగిక దాడులకు పాల్పడేవారని వెల్లడైంది.  మొక్కులు తీర్చుకునేందుకు ఈ జంట ఆలయానికి చేరుకుని రాత్రి అక్కడే ఉండిపోయారు. కాలకృత్యాల కోసం యువతి గుట్టలవైపు వెళ్లగానే అప్పటికే మాటు వేసిన ఏడుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు రాత్రంతా రేప్ చేశారు. యువతి గట్టిగా కేకలు వేయగానే వెంట వచ్చిన యువకుడిని చితకబాదారు. ఆలయంకు వచ్చే భక్తులతో బాటు ప్రేమికులను నిందితులు గతంలో లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  ఆలయ ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటికే ఈ రేప్ ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.  అత్యాచారాలను అరికట్టడానికి పాలకులు దిశ, నిర్భయ చట్టాలను తీసుకువచ్చినప్పటికీ రోజురోజుకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం  పలువురిని ఆందోళన కలిగిస్తోంది.   

కొడాలి నానికి బైపాస్ సర్జరీ

ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఏపీ మాజీ మంత్రి కొడాల నానికి బైపాస్ సర్జరీ జరుగుతోంది.  ఈ శస్త్ర చికిత్స పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్య పరీక్షలలో ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది. ఆయన హార్ట్ లో మూడు వాల్వ్ లు పూర్తిగా మూసుకుపోయాయని తేలడంతో  తొలుత స్టంట్ లు వేయాలని వైద్యులు భావించారు. అయితే మూడు వాల్వులు పూర్తిగా మూసుకుపోయి ఉండటంతో పాటు కిడ్నీ సమస్య కూడా ఉండటంతో నాని కుటుంబ సభ్యులు ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ కార్డియాక్ సెంటర్ తకు తరలించాలని నిర్ణయించుకున్నారు.   దీంతో నాని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ చేసి అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. అక్కడ ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు బుధవారం (ఏప్రిల్ 2) బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించింది. 

 రామాపురం అలల్లో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు... కొనఊపిరితో ఒకరు మృతి 

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో బుధవారం( 02 ఏప్రిల్) విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. పర్చూర్ నెహ్రూ కాలనీకి చెందిన చుక్కా వంశీ, రాజేశ్ అనే యువకులు సరదాగా బీచ్ లో గడుపుతున్నారు. ఉదయం నుంచి సముద్రంలో అలలు విపరీతంగా వస్తున్నాయి. మెరైన్ పోలీసులు సందర్శకులను అలర్ట్ చేసినప్పటికీ ఈ ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగారు. సముద్రం నుంచి భారీ తెప్ప ఒకటి తీరం వైపు దూసుకొచ్చింది. తెప్ప తిరిగి సముద్రంలో వెళ్లే క్రమంలో ఇద్దరు యువకులను తీసుకెళ్లింది. ఎంతో చాకచక్యంగా మెరైన్ పోలీసులు వారిని తీరంకు తీసుకొచ్చారు. ఇందులో వంశీ (27) నీళ్లను మింగడం వల్ల పరిస్థితి విషమించడంతో చీరాల ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే వంశీ తుది శ్వాస విడిచాడు. పంచభూతాలలో ఒకటైన నీటిని తక్కువ అంచనా వేస్తే  పరిణామాలు కూడా దారుణంగా ఉంటాయని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదహరణగా మిగిలింది.  

జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా.. పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు  చేపట్టిన నిరసనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు పలు పార్టీల నేతలు కూడా బీసీలకు రజర్వేషన్లకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి.   తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహనుమంతరావు, మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్, సినీ నటుడు సుమన్‌ తదితరులు జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ సంఘాల నిరసనలో పాల్గొన్నారు. అలాగే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ బిల్లును ఆమోదించి పార్లమెంటుకు పంపిందనీ, దానిని ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా జంతర్ మంతర్ వద్ద ఆందోళనక దిగారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు.  

వైసీపీలో జగన్ ఒంటరేనా?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా కొంద‌రు వైసీపీ నేత‌లు నోరుపారేసుకుంటున్నారు. ఇంకా మేము అధికారంలో ఉన్నామ‌న్న భ్ర‌మ‌ణ‌ల్లోనే ఉన్నారు. ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అవుతుంది. ఐదేళ్లు అధికారం మ‌త్తులో హ‌ద్దులుమీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూ ఒక‌వైపు.. అధికారం మ‌త్తులో నోరుపారేసుకున్న నేత‌ల‌పై మ‌రోవైపు కేసులు న‌మోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటుంది. దీంతో వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. చాలా మంది వైసీపీ నేత‌లు మ‌న‌వంతు ఎప్పుడొస్తుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం జగన్ మెప్పు కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు నోరెత్తేందుకే భయపడుతున్నారు.  ఈ పరిస్థితుల్లో కేసుల గురించి భయపడవద్దంటూ జగన్ పార్టీ క్యాడర్ కు ధైర్యం చెప్పడానికి చేసిన ప్రయత్నం ఏమంత ప్రభావం చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు.  రోజులు గడుస్తున్న కొద్దీ  వైసీపీ నేతలలోనూ, క్యాడర్ లోనూ నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టు తరువాత వైసీపీ నేతలు మరింతగా భయాందోళనలకు గురౌతున్నారు. ఆ పార్టీలో  నోరున్న నేతలుగా పేరున్న వారంతా దాదాపుగా అజ్ణాత వాసం గడుపుతున్నారని చెప్పవచ్చు. కొడాలి నాని తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలు కాగా, పెద్దిరెడ్డి బాత్ రూంలో జారిపడి చేయి విరగ్గొట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టి అరెస్టు భయంతో అండర్  గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఇక ఆర్కేరోజా, అనీల్ కుమార్ యాదవ్, పేర్ని నాని వంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు మౌనముద్ర వహించి.. నోరెత్తడానికే జంకుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  వైసీపీలో కీలక నేతలంతా తమను తాము కాపాడుకోవడం ఎలా అన్న ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీలో జగన్ ఒంటరిగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

శాంతి చర్చలకు సిద్ధం.. కేంద్రానికి నక్సల్స్ లేఖ

వరుస ఎన్ కౌంటర్లతో దెబ్బ మీద దెబ్బ తింటున్న నక్సల్స్ ఇప్పుడు శాంతి జపం చేస్తున్నారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి పేరిట కేంద్రానికి ఓ బహిరంగ లేఖ రాశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన  ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలలో తక్షణమే కేంద్ర బలగాలు కాల్పులను నిలిపివేయాలని ఆలేఖలో కోరారు. తాము కూడా కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఒక వైపు కేంద్రం నక్సల్స్ ముక్త భారత్ అంటూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్సల్స్ శాంత్రి ప్రతిపాదన చేయడం గమనార్హం. వరుస ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ మరణిస్తున్న నేపథ్యంలో శాంతి చర్చల ప్రతిపాదన చేయడం ద్వారా మావోయిస్టులు వ్యూహాత్మకంగా శక్తియుక్తులు కూడగట్టుకోవాలని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

 రేవంత్ రెడ్డికి రేణుదేశాయ్ వేడుకోలు 

తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన 400 ఎకరాల భూ వివాదంపై సినీ నటి, ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రాం వేదికగా  స్పందించారు. . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  ఓ రిక్వెస్ట్ పెడుతూ వీడియో షేర్ చేశారు. తనకు 44 ఏళ్లు  అని, రేపో మాపో చనిపోతానని  ఈ 400 ఎకరాల్లో చెట్లను నరికి వేస్తే వచ్చే తరాలకు  ఆక్సిజన్  దక్కదని పేర్కొన్నారు. ఆ భూమిని అలాగే వదిలేయాలని రేణుదేశాయ్ వేడుకున్నారు. ఆక్సిజన్ , నీళ్ల కోసం ఈ భూమి అవసరమని, అభివృద్ది కోసం అయితే మరో చోట వేలాది ఎకరాలు ఉన్నాయని రేణుదేశాయ్ వీడియోలో పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఉన్న ఈ భూమిని అన్యాక్రాంతం చేయకూడదని ఆమె కోరారు.   రేణుదేశాయ్ మాటల్లో.. ‘‘నాకు రెండ్రోజుల క్రితమే సెంట్రల్ యూనివర్శిటీ భూముల గూర్చి తెలిసింది. కొన్ని విషయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నాను. నాకు 44 ఏళ్లు వచ్చేశాయి. రేపో మాపో చనిపోతాను.  కానీ నా పిల్లలతో బాటు మనందరి పిల్లల భవిష్యత్ కోసం  ఆక్సిజన్ అవసరమని , మాకు  ఐటి పార్క్ , భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు  కావాలి. అయితే  అభివృద్ది 100 శాతం ముఖ్యం. అందులో అనుమానమే లేదు. కాని  ఒక్క శాతం  అవకాశం ఉన్నా ఆ భూమిని వదిలేయండి’’ అని రేణుదేశాయ్ చేసిన వేడకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

నిడదవోలులో వైసీపీకి చెక్.. జనసేన స్కెచ్

ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఛైర్మన్ పీఠం నిడదవోలు మునిసిపాలిటీలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. కౌన్సిల్‌ సభ్యులు ఎత్తుకు పైఎ త్తులు వేస్తున్నారు. ఎలాగైనా సరే చైర్మన్‌ కుర్చీని కైవశం చేసుకోవాలని అటు వైసీపీ,  వైసీపీని చిత్తుగా ఓడించాలని జనసేన వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇది లా ఉండగా గురువారం (ఏప్రిల్ 3)  మునిసిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీసీ కౌన్సిలర్లు ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. నిడదవోలు మునిసిపాలిటీలో 28 వార్డులకు 2021 మార్చి 15వ తేదీన ఎన్నికలు జరగగా 27 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. ఒక వార్డులో మాత్రమే తెలుగుదేశం విజయం సాధించింది. దీంతో నిడదవోలు కౌన్సిల్‌ వైసీపీ వశమైంది. ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మె ల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు చైర్మన్‌ పదవీ కాలాన్ని పంచుకునేలా ఒప్పందం కుదిర్చారు. మొదటి రెండున్నరేళ్లు మునిసిపల్‌ చైర్మన్‌గా భూపతి ఆదినారాయణ, తరువాత రెండేళ్లు కామిశెట్టి వెంకట సత్యనారాయణ తరువాత మిగిలిన కాలం పువ్వల రతీదేవి చైర్మన్‌గా  ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదిలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనివాస్‌ నాయుడు ఓటమి పాలయ్యారు. నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  అయితే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు,  చైర్మన్‌ భూపతి ఆదినారాయణకు మధ్య ఉన్న ఆర్థిక, ఆంతరంగిక వ్యవహారాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో భూపతి ఆది నారాయణతో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో చైర్మన్‌ ఒప్పందం వివాదం ముదిరి పాకాన పడింది. మునిసిపల్‌ కౌన్సిల్‌ ఏర్పడి ఈ నెల 18వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తవడంతో అవిశ్వాస తీర్మానానికి అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్‌ పి.ప్రశాంతి, కొవ్వూరు ఆర్డీవో రాణిసుస్మితలకు  వినతిపత్రం అందజేశారు.  చైర్మన్‌ పై అవిశ్వాసానికి తమకు అవకాశం ఇవ్వా లంటూ పలువురు వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు పెట్టారు.ఈ నేపథ్యంలో నిడదవోలులో ఎటు చూసినా చైర్మన్‌ కుర్చీపైనే చర్చ సాగుతోంది. తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. దీనితో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు సంఖ్య 28గా ఉంటే..  వైసీపీ నుంచి గెలిచిన 27 మందిలో ఇప్పటి వరకు 12 మంది కౌన్సిలర్లు పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్ సంఖ్య 16కు తగ్గింది. ఒక  టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు.  జనసేన పార్టీకి ఉన్న 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓటు వేసే అవకాశం లభిస్తుంది.  వీరికి తోడు కౌన్సిల్ లో  టీడీపీకి ఒక సభ్యుడు ఉన్నారు. దీనితో జనసేన బలం 16,  వైసీపీ బలం కూడా పదహాగా ఉంది. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన.. వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

ఇటీజ్ అఫీషియల్.. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల ఔట్

నెట్‌వర్కింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్ పరికరాలు, హై-టెక్నాలజీ సేవలను అభివృద్ధిలో దిగ్గజ సంస్థ అయిన సిస్కో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల రవిచంద్రారెడ్డిని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేయడం కాదు.. పక్కన పడేసింది అనడం సబబు. వైసీపీ హయాంలో అత్యంత నీచంగా, అంతకు మించిన విద్వేష భావంతో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నేతలపై సామాజిక మాధ్యమంలో  పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల ఇటీవల అనూహ్యంగా  సిస్కో బృందంలో ప్రత్యక్షమై లోకేష్ ఎదుట నిలిచారు. అదెలా అంటే.. సిస్కోతో  నైపుణ్యాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 25న అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ సందర్భంగా లోకేష్ తో సిస్కో బృందం భేటీ అయ్యింది. ఆ బృందంలో సిస్కో సౌత్ ఇండియా టెరిటరీ అక్కౌంట్స్ మేనేజర్ హోదాలో  ఇప్పాల రవిచంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఆ బృందంతో పాటు వచ్చిన ఇప్పాల.. లోకేష్ ఎదుట నిలిచారు. ఆయనతో ఫొటోలు కూడా దిగారు. అయితే ఇప్పాల రవిచంద్రారెడ్డి ఎవరన్నది లోకేష్ కు అప్పటికి తెలిసే అవకాశం లేదు. దిగ్గజ కంపెనీ ప్రతినిథిగా భావించి ఇప్పాలతో మాట్లాడారు. అయితే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో రాగానే ఇప్పాల చరిత్ర అంతా బయటపడింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా ఇప్పాల ఎంత విషం చిమ్మారో నెటిజన్లు సోదాహరణంగా బయటపెట్టేశారు.   దీంతో విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు.  వెంటనే సిస్కోకు  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ విధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాఇప్పాలను భాగస్వామిని చేయవద్దంటూ లేఖ రాశారు. ఆ లేఖలో ఇప్పాల వైసీపీ హయాంలో వ్యవహరించిన తీరును సోదాహరణంగా వివరించారు. వ్యాపార ఒప్పందాలకూ రాజకీయాలకూ సంబంధం లేదని పేర్కొంటూనే.. ఒక రాజకీయ పార్టీతో అంటకాగుతూ, ప్రభుత్వ వ్యతిరే కతను ప్రచారం చేస్తున్న వ్యక్తిని ఏపీ ప్రాజెక్టులలో భాగస్వామిగా అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీంతో సిస్కో కూడా అంతే వేగంగా రియాక్ట్ అయ్యింది. ఇప్పాల రవిచంద్రారెడ్డిని ఏపీ ప్రాజెక్టుల నుంచి తొలగించింది. ఆ మేరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.  అంతే కాకుండా లోకేష్ లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ సిస్కో  ఇప్పాలను ఏపీకి చెందిన అన్ని ప్రాజెక్టుల నుంచీ తొలగించినట్లు లోకేష్ పేషీకి  అధికారికంగా సమాచారం అందించింది.  అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాజెక్టులోనూ ఇప్పాలను భాగస్వామిగా ఉంచరాదని సిస్కో నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ఏపీ మంత్రి లోకేష్ లేఖ రాసిన తరువాత సిస్కో బృందం తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఓ ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమానికి ఇప్పాలను పక్కన పెట్టడమే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ  మంత్రి శ్రీధ‌ర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఒక్క ఇప్పాల రవిచంద్రారెడ్డి తప్ప.. ఏపీ సర్కార్ తో భేటీ సమయంలో ఉన్న బృందం అంతా కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి ఇప్పాలను సిస్కో పక్కన పెట్టేయడం, ఇప్పుడు ఏపీ ప్రాజెక్టుల నుంచి ఇప్పాలను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం చూస్తుంటే తెలుగు రాష్ట్రాలలో సిస్కో ప్రాజెక్టుల నుంచి ఇప్పాలకు ఆ సంస్థ ఉద్వాసన చెప్పినట్లేనని పరిశీలకులు అంటున్నారు.