బావిలో విషవాయువులు.. మధ్య ప్రదేశ్ లో ఎనిమిది మంది మృతి

పూడిక తీయడానికి బావిలోకి దిగి అందులోని విషవాయువుల కారణంగా ఎనిమిది మంది మరణించిన సంఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని కొండావత్ గ్రామంలోని పురాతన బావిలో బురద పేరుకుపోవడంతో దానిని శుభ్రం చేయాలని జిల్లాయంత్రాంగం భావించింది. ఈ బావి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. అది ఇప్పుడు వాడుకలో లేదు. అయితే గంగౌర్ పండుగ నేపథ్యంలో విగ్రహ నిమజ్జనానికి ఆ బావిని వినియోగించాలని భావించిన గ్రామస్తులు ఆ బావిని శుభ్రపరచాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు గురువారం బావి శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ఓ ఐదుగురు బావిలోకి దిగారు. అందులోని విషవాయువులు పీల్చి స్ఫృహ కోల్పోయారు. వారిని రక్షించేందుకు మరో ముగ్గురు బావిలోకి దిగారు. వారు కూడా విషవాయువుల కారణంగా స్ఫృహ కోల్పోయి బావిలోని బురదలో కూరుకుపోయారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందీ మరణించారు.   సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం  నాలుగు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బావి పూడిక తీత కార్యక్రమంలో ఎనిమిది మంది మరణించిన సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఆ పురాతన బావిని వెంటనే మూసివేయాలని ఆదేశించారు. 

మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు తిరస్కరణ.. వైసీపీ పునాదులు కదులుతున్నట్లేనా?

కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. వైసీపీ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నతలు కర్మఫలం అనుభవించడానికి రెడీ కావలసిన పరిస్థితి ఏర్పడింది.  ఐదేళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరించారు. అధికార మదంతో అక్రమర్జనకు పాల్పడ్డారు. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు   ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేశారు. సామాన్య ప్ర‌జ‌ల‌ను వదలకుండా వేధింపులకు పాల్పడ్డారు. అప్పటి విపక్ష నేతలపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చి పోయారు. అక్రమ కేసులు బనాయించి జైళ్లకు సైతం పంపించారు. ఆ పాపాలన్నిటికీ ఇప్పుడు ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల  అరాచకపాలనకు విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. కనీసం విపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదంటూ వారిని రాష్ట్రంలో కేవలం 11 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. తెలుగుదేశం కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టి అధికారం అప్పగించారు. దీంతో అధికారంలో ఉండగా హద్దులు మీరి ప్రవర్తించిన, అక్రమార్జనకు తెగబడిన నేతలపై ఇప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూటమి సర్కార్ సమాయత్తమైంది.  వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీసి వారిపైనా, అలాగే అధికార మదంతో నోరుపారేసుకున్న నేత‌ల‌పైనా కేసులు నమోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకునే కార్యక్రమం చేపట్టింది.   కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో అవినీతికి పాల్ప‌డిన పార్టీ నేత‌ల‌పై కేసులు న‌మోదు అవుతున్నాయి. అలాగే అధికారం అండతో కనీస విలువలకు తిలోదకాలిచ్చి బూతులతో రెచ్చిపోయిన నేతలపైనా కేసులు నమోదౌతున్నాయి.  వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి సహా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వీరిలో పోసాని కృష్ణ మురళి బెయిలుపై బయటకు రాగా, వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారు. అలాగే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా కటకటాలు లెక్కిస్తుండగా, మరి కొందరు కోర్టుల ద్వారా ముందస్తు బెయిలు పొంది విచారణలకు హాజరౌతున్నారు. ఇంకొందరు అజ్ణాతంలో ఉన్నారు. మరి కొందరు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  తాజాగా ఏపీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చుక్కెదురైంది.   జగన్ హయాంలో రాష్ట్రంలో మద్యం తయారీ, విక్రయాలలో భారీ ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంపై దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. దీంతో అరెస్టు భయంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిలు పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.  మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మిథున్ రెడ్డి ముందస్తు బెయిలును ఏపీ హైకోర్టు కొట్టివేయడం ఒక్క మిథున్ రెడ్డికి మాత్రమే కాకుండా మొత్తం వైసీపీకే పెద్ద ఝలక్ గా పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు వైసీపీ పునాదులు కదిలే అవకాశాలున్నాయని అంటున్నారు.  

 మరోసారి వివాదంలో నిత్యానంద స్వామి... బొలివియా దేశంలో భూ దందా 

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి తాజాగా  మరో వివాదంలో చిక్కుక్కున్నారు.  నిత్యానంద స్వామి చనిపోయినట్టు ఆయన మేనల్లుడు  ప్రకటన  చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలో  మేనమామతో వచ్చిన విభేధాల వల్ల మేనల్లుడు ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. సినీ నటి రంజితతో  నిత్యానంద స్వామి కి  అఫైర్ ఉందని వార్తలు గుప్పుమనడంతో  అప్పట్లో  దేశ వ్యాప్తంగా సంచలనమైంది. తమిళనాడు అరుణాచలంకు చెందిన నిత్యానంద స్వామి అమెరికాలోని ప్రత్యేక ఐలాండ్ లో కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశానికి తానే ప్రధాని అని చెప్పుకున్నారు. తన వారసురాలిగా సినీ నటి రంజిత అని ప్రచారం జరిగింది. ఆస్తుల విషయంలో నిత్యానందస్వామి మేనల్లుడికి రంజిత మధ్య విభేధాలున్నాయి. ఈ కారణంగా ఈ నెల ఏప్రిల్ ఒకటో తేదీన నిత్యానందస్వామి చనిపోయినట్టు మేనల్లుడు ప్రకటించారు.  మేనల్లుడు చేసిన ప్రకటనను నిత్యానంద స్వామి శిష్యులు ఖండిస్తూ ఓ వీడియో మీడియాకు విడుదల చేశారు.  ఈ వివాదం వారం రోజులు గడవకముందే బొలివియా దేశంలో నిత్యానందస్వామి భూ దందా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యానందస్వామి అనుచరులు బొలివియా దేశంలోని గిరిజనులు ఆవాసముండే భూములపై కన్నేశారు. గిరిజన ప్రజల అమాకత్వం, పేదరికం ఆసరాగా చేసుకుని నిత్యానంద స్వామి శిష్యులు భారీ స్కెచ్ వేశారు.  వందల ఎకరాల భూములను కొట్టేయాలని చూశారు. స్థానిక గిరిజన తెగలతో వందేళ్ల లీజు అగ్రిమెంట్లు చేసుకున్నారు. వెంటనే బొలివియా ప్రభుత్వం అప్రమ్తమైంది. ఈ లీజు ఒప్పందాలను రద్దు చేసింది. కైలాస దేశంలో ఉన్న 20 మందిని అరెస్ట్ చేశారు. అమెరికాలో ఐల్యాండ్ లో  కైలాస ఏర్పాటు చేసుకున్న నిత్యానంద స్వామి బొలివియాలో కూడా కైలాస దేశం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. 

తెలుగు రాష్ట్రాలలో నేడూ వర్షాలు

తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం (ఏఫ్రిల్ 4)   భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు తెలంగాణలో  వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, ములుగు, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని   అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.  కాగా గురువారం (ఏప్రిల్ 3) తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ అకాల వానల కారణంగా అన్నదాతలకు భారీ నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు.  గురువారం (ఏప్రిల్ 3)తెలంగాణలోని పలు జిల్లాలు వడగళ్ల వాన, పిడుగుపాటుతో కూడిన అకాల వర్షం అతలాకుతలం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా ప్రాణనష్టంతో పాటు పంట నష్టం కూడా సంభవించింది.  పిడుగుపాటు కారణంగా రాష్ట్రంలో ముగ్గురు మరణించారు.  నాగర్ కర్నూల్ జిల్లాలోని పదర్ మండలంలో, పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు  నిజామాబాద్‌లో ఒకరు పిడుగుపాటు కారణంగా మరణించారు. అలాగే  జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని గట్టు మాచర్ల గ్రామంలో, వడగళ్ల వానకు రెండు పశువులు చనిపోయాయి. పలు జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. మామిడికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.  ఇటిక్యాల మండలంలోని రావుల చెరువు గ్రామంలో 55 ఎకరాల్లో మామిడి పంట  దెబ్బతింది. ఉండవెల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి.   

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయం రెండో బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ లో శుక్రవారం (ఏప్రిల్ 4) తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో బ్యాటరీలు పూర్తిగా కాలి బూడదయ్యాయి. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ ఫైర్ అలారం మోగకపోవడంతో మంటల వ్యాప్తిని ఎవరూ గుర్తించలేకపోయారని తెలుస్తోంది.  ప్రమాదానికి కారణమేంటన్నది తెలయాల్సి ఉంది.  ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉద‌యం అగ్నిప్రమాదం జ‌రిగింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స‌మాచారం. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క‌ సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ లోనే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం శాఖ మంత్రి కందుల రమేష్, ఇంకా మునిసిప్  మంత్రి నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరుల కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద కారణాలపై ఆరా తీశారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. సచివాలయ భద్రతా సిబ్బంది అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.  

బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూత

ప్రతిష్ఠాత్మ దాదాసాహెబ్ ఫాల్కె పురస్కార గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాలీవుడ్ అగ్రదర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ శుక్రవారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మనోజ్ కుమార్ ముంబైలోని దీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.   మనోజ్ కుమార్ సినీ పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టారు. 1957లో ఫ్యాషన్ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన మనోజ్ కుమార్ అసలు పేరు హరికృష్ణ గోస్వామి. ఇక ఆయన 1995లో  మైదాన్ ఈ జంగ్ అనే చిత్రంలో నటించారు. అదే ఆయన చివరి సినిమా. నటన కంటే దర్శకత్వానికే ప్రాధాన్యత ఇచ్చిన మనోజ్ కుమార్ పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించారు. ఎక్కువగా దేశ భక్తి ఇతివృత్తంతోనే ఆయన ఎక్ువ సినిమాలు చేశారు. సినీ పరిశ్రమకు మనోజ్ కుమార్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లో ఆయకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేసింది. అంతకు ముందే ఆయన 2011 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన సినీ పరిశ్రమకు సేవలందించారు. అమితాబ్ బచ్చన్ హీరోగా ఆయన తీసిన రోటీ కపడా ఔర్ మకాన్ చిత్రం 1974లో విడుదలై సంచలనం సృష్టించింది. దిగ్గజ దర్శకుడు మనోజ్ కుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రగాభ సంతాపం వ్యక్తం చేశారు. ఇండియన్ సినీమాలో ఆయన ఒక ఐకాన్ అంటూ మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  

ఏ క్షణంలోనైనా రోజా అరెస్టు.. శాప్ ఎండీ రవినాయుడు

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అయ్యింది రోజా పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆధారాలు లేని ఆరోపణలతో, అనుచిత వ్యాఖ్యలతో   అందరిపై విరుచుకుపడిన మంత్రి రోజా ఇప్పుడు తన తీరుకు, మంత్రిగా ఉండగా చేసిన అక్రమ దందాలకు కేసుల ఉచ్చులో ఇరుక్కున్నారు. వరుస కేసులు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరౌతూ మౌనమే నాభాష అన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్న సమయంలో రోజాపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అధికారం అండతో ఇష్టారీతిగా నోరేసుకుని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేసిన రోజా పరిస్థితి ఆమె రాజీకీయ జీవితానికి ఎండ్  కార్డ్ పడబోతోందా అన్నట్లుగా తయారైంది. ఇప్పుడు ఆమెపై వస్తున్న ఆరోపణలేవీ నిరాధారమైనవి కావు.  అధికారం అండతో ప్రత్యర్థులపై మీడియా సమావేశాలు పెట్టి మరీ నిరాధార ఆరోపణలు చేసి నోరు పారేసుకున్న రోజాపై ఇప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   వైసీపీ హయాంలో పార్టీ అధినేత జగన్ ను మెప్పించి మంత్రి పదవి దక్కించుకోవడానిక రోజా అప్పటి విపక్ష నేత అయిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలోనే జగన్ మెప్పు పొంది మంత్రి పదవీ దక్కించుకున్నారు. అయితే మంత్రిగా రోజా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారనీ, దోచుకో.. దాచుకో అన్నట్లుగా పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనీ, ఆమె మంత్రిగా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆమెకు కలెక్షన్ క్వీన్ అంటూ కొత్త బిరుదు కూడా ఇచ్చారు. అప్పట్లోనే మీడియా సమావేశాలు పెట్టి మరీ రోజా అవినీతిని కళ్లకు కట్టారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో రోజాపై కేసులు నమోదు కాలేదు. అయితే జగన్ ప్రభుత్వం గద్దె దిగి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఒక్కటొక్కటిగా రోజా అనినీతి వ్యవహారాలపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమౌతోంది.    తాజాగా నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిపై తెలుగుదేశం యువనేత, శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రిగా ఉండగా రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఇష్టారీతిగా అవినీతికి పాల్పడ్డారని  తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. క్రీడా పరికరాల కోనుగోళ్లలో 119 కోట్ల రూపాయలకు పైగా నిధులను పక్కదోవపట్టించారని రవి నాయుడు ఆరోపించారు. అంతే కాకుండా తిరుమల దర్శనం టికెట్ల వ్యవహారంలో కోట్లాది రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ అవినీతి, అక్రమాల వ్యవహారంలో  వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా త్వరలోనే అరెస్ట్ కావడం పక్కా అని టీడీపీ యువ నేత, శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు.   వైసీపీ   హయాంలో   ఆడుదాం ఆంధ్ర లో అక్రమాలు, తిరుమల టికెట్ల దండా వ్యవహారాలలో విచారణ కొనసాగుతోందని రవి నాయుడు చెప్పారు. అలాగే  టూరిజం శాఖతో పాటు నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందన్న రవినాయుడు.. ఈ దర్యాప్తులో తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని రోజా భయపడుతున్నారన్నారు.  రోజా అక్రమాలు, అవినీతిపై పక్కా ఆధారాలు ఉన్నాయనీ, ఆమె   ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయనీ చెప్పారు.  అరెస్ట్ భయంతో నెల రోజులు అజ్ణాతంలో గడిపిన రోజా,  జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిడితో ఇప్పుడు బయటకు వచ్చి నామ్ కే వాస్తే ప్రెస్ మీట్లతో  ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు.ప్రెస్ మీట్లలో ఆమె మాటలు వింటేనే ఆమె ఎంత భయపడుతున్నారో అవగతమౌతుందన్నారు. 

చార్మినార్ పెచ్చులు ఊడి పడ్డాయి!

హైదరాబాద్‌లో గురువారం (ఏప్రిల్ 3) కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం చిగురుటాకులా వణికింది.  అంత వరకూ వేసవి ప్రతాపాన్ని చూపుతూ భుగభగలాడిన భానుడిని ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మేశాయి. ఆ వెంటనే కుండపోత వర్షం ఆరంభమైంది. రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులు వీచాయి, పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఈ వర్షం ప్రభావం చారిత్రక కట్టడం చార్మినార్ పైనా పడింది. ఈ చారిత్రక కట్టడంపై నుంచి పెచ్చులు ఊడి కిందపడ్డాయి. భారీ వర్షం కురుస్తుండటంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చార్మినార్ కు ఆనుకుని ఉన్న భాగ్యలక్మీ ఆలయం వైపు చార్మినార్ స్తంభంపైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చార్ మీనార్ పెచ్చులు ఊడిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.   అయితే  ఇలా చార్మినార్ పై నుంచి పెచ్చులు ఊడిపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలా జరిగింది.   426 సంవత్సరాల పురాతన చార్మినార్ పరిరక్షణ, మరమ్మత్తులను అర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నది.  కాలుష్యం కారణంగా పగుళ్లు ఏర్పడుతున్నాయనీ, ఆ కారణంగానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనీ చెబుతున్నారు. ఈ పురాతన కట్టడం పరిరక్షణకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

ఖమ్మం బీఆర్ఎస్ లో గందరగోళం

అధికారం పోయినా కొనసాగుతున్న వర్గపోరు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో  ముఠాల పోరు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది..అధికారం పోయినా నాయకుల్లో ఐక్యత కనిపించడం లేదు… కొన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు అడ్రెస్ లేకుండా పోయారు.. సత్తుపల్లి, పాలేరు మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై పని చేస్తున్నారు. మధిరలో మాజీ జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అప్పుడప్పుడు తాను ఉన్నానని నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హైదరాబాద్ లో ఉంటూ ఏదైనా పార్టీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో మాత్రమే వచ్చి పాల్గొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో అక్కడ పార్టీకి ఎవరూ దిక్కు లేకుండా పోయారు. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు కొద్దోగొప్పో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైరా నియోజకవర్గంలో గతంలో వర్గపోరుతో అధికార అభ్యర్థిని ఓడించి ఇండిపెండెంట్ ను గెలిపించారు. ఈసారి సిటింగ్ ఎమ్మెల్యే ను కాదని మాజీ ఎమ్మెల్యే మనల్ లాల్ కు టికెట్ ఇచ్చారు. దీంతో ఓవర్గం వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇప్పటికీ అక్కడ అదే పరిస్థితి కొనసాగుతోంది.  కొత్తగూడెం లో పార్టీలో ముఠా కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరావు ను మార్చాలనే డిమాండ్ ఎన్నికల ముందు నుంచి ఉంది. దీని పర్యవసానమే అక్కడ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా మూడో స్థానానికి పరిమితమయ్యారు. పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హల్ చల్ చేశారు. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.. ఖమ్మంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా మంత్రి అజయ్ కుమార్ అండ చూసుకొని కొందరు కార్పొరేటర్లు చేసిన దందాల వల్ల జరిగిన నష్టం ఇంకా పార్టీని వెంటాడుతూనే ఉన్నది. అధిష్ఠానం కూడా జిల్లాలో ఉన్న కుమ్ములాటలను అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు. దాని పర్యవసానంగా జిల్లాలో రెండు ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైంది. 2014 నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ ఒక్కసీటునే గెలిచింది.. 2014 లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్, 2023లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకొని బలమైన నాయకులు కూడా ఓడిపోయారు. ఆతరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. చివరకు 2023 ఎన్నికల్లో వారిద్దరికీ పార్టీ టికెట్లు నిరాకరించింది. దాంతో వారిద్దరూ కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రులు అయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో బలమైన నాయకత్వం లేదు. ఉమ్మడి జిల్లాలో కిందిస్థాయి నాయకులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చే నాయకులు లేరు. దీంతో అధికారం లేకపోవడం నాయకుల మధ్య సమన్వయం కొరవడటం వల్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంటోంది. కొందరు నాయకులు మాత్రం తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

వేషం మారింది సరే.. మరి భాషో.. అంబటి కొత్త అవతారం

వైసీపీలో సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు అందరూ సైలెంట్ అయిపోగా.. మాజీ మంత్రి, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో గట్టిగా మాట్లాడుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది అంబటి మాత్రమే. అటువంటి అంబటి రాంబాబు బుధవారం(ఏప్రిల్ 2) కొత్త అవతారంలో కనిపించారు. రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ ఒకే ఆహార్యంతో కనిపించే అంబటి రాంబాబు తాజాగా నల్ల కొటు ధరించి న్యాయవాది అవతారం ఎత్తారు. హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తానే స్వయంగా వాదించుకుంటానంటూ న్యాయవాది దుస్తులలో ఆయన కోర్టుకు వచ్చారు. తన పిటిషన్ ను తానే వాదించుకునేందుకు అంబటి కోర్టు అనుమతి కూడా పొందారు.  ఇంతకూ ఆయన వాదించుకోబోయే పిటిషన్ ఏదంటే.. గత ఏడాది నవంబర్ లో అంబటి రాంబాబు, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత పోస్టులు పెట్టారట. దీనిపై గుంటూరు పట్టభిపురం పీఎస్ లో  ఫిర్యాదు చేశారు. తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా అనుచిత పోస్టులకు సంబంధించి నాలుగు, వైసీపీ అధినేత జగన్ ఆయన  కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులకు సంబంధించి మరో ఫిర్యాదు మొత్తం ఐదు ఫిర్యాదులను అంబటి చేశారు. ఆ ఫిర్యాదులలొ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టుల ఫిర్యాదు మినహా మిగిలిన నాలుగు ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జగన్ విషయంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అంబటి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అలాగే కేసులు నమోదు చేసిన నాలుగు ఫిర్యాదులలోనూ కూడా తాను ప్రస్తావించిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు,లోకేష్ పేర్లు లేవంటూ అంబటి తన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ విషయంలోనే తాను వాదించుకుంటానంటూ అంబటి న్యాయవాది వేషధారణలో హైకోర్టుకు హాజరయ్యారు. అయితే..    

వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ 

అరెస్ట్ అయితే బెయిల్ కోసం కోర్టునాశ్రయించడం సరైన న్యాయ ప్రక్రియ. కానీ వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం  మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్ కాకముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునాశ్రయించి ఎదురు దెబ్బతిన్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో చీప్ లిక్కర్ ఏరులై పారింది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేసి అనేక ఆరోపణలు ఎదుర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమాలకు పాల్పడిన వారిపై కొరడా జులిపించింది. ఇందులో భాగంగా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిపై గతేడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభ కోణంలో వైకాపా ఎంపి మిథున్ రెడ్డి పాత్రను కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో మిథున్ రెడ్డి హైకోర్టు నాశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు  గత నెల 24న ముగియడంతో తీర్పును ఏప్రిల్ మూడుకు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ గురువారం తీర్పు చెప్పింది. 

నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు?.. శాఖ ఏది?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ కీలక నాయకుడు నాగేంద్ర బాబు ఎంట్రీ ఎప్పుడన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తోంది. కొణిదెల నాగబాబు బుధవారం (ఏప్రిల్ 2) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాగబాబును కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు ప్రకటించేశారు. అయితే ఇప్పటి వరకూ ఆయన చట్ట సభ సభ్యుడు కాకపోవడంతో కేబినెట్ బెర్త్ జాప్యం అవుతూ వచ్చింద. ముందుగా కేబినెట్ లోకి తీసుకుని ఆ తరువాత చట్ట సభ ఎంట్రీకి అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ అందుకు ఇష్ఠపడలేదు. ముందుగా ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించుకుని ఆ తరువాతే కేబినెట్ లోకి తీసుకోవాలని భావించారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో  ఇక ఆయన కేబినెట్ ఎంట్రీ ఎప్పుడంటూ చర్చ మోదలైంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒకే ఒక్క బెర్త్ ఖాళీగా ఉంది. దానిని నాగబాబుతో భర్తీ చేయడం అన్నది లాంఛనమే. ఆ లాంఛనం ఎప్పుడన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.  అంతే కాకుండా నాగబాబుకు కేబినెట్ లో ఏ శాఖ ఇస్తారన్న విషయంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్నశాఖలలో ఒక దానిని నాగబాబుకు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూటమి వర్గాలలో జరుగుతున్నది. అయితే నాగబాబుకు అప్పగించే శాఖ విషయంలో ఇప్పటి వరకూ ఒక క్లారిటీ అయితే రాలేదు. మరీ జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరలో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.   

బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన కర్నాటక హైకోర్టు

కర్నాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని  కర్నాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో రాపిడో, ఊబర్ సహా  అన్ని బైక్ ట్యాక్సీ కార్యకలాపాలు రాష్ట్రంలో నిలిచిపోనున్నాయి. ఇక పోతే మోటారు వాహనాల చట్టం కిందకు బైక్ ట్యాక్సీ సేవలను తీసుకు రావడానికి కర్నాటక ప్రభుత్వానికి కోర్టు మూడు  నెలల గడువు ఇచ్చింది.   మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 93 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించే వరకు బైక్ ట్యాక్సీలపై నిషేధం అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. తెలుపు నంబర్‌ ప్లేట్‌లతో కూడిన ద్విచక్ర వాహనాలను వాణిజ్యపరంగా వినియోగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. 

హైదరాబాద్ లో వర్షం.. ఒక్కసారిగా కూల్ అయిన వాతావరణం

గత కొన్ని రోజులుగా భానుడి భగభుగలతో, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరవాసులకు వరుణుడు ఒకింత ఉపశమనాన్ని ఇచ్చాడు. గురువారం మధ్యాహ్నం వరకూ చండ్ర నిప్పులు చెరుగుతున్నట్లుగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం తరువాత హఠాత్తుగా చల్లబడింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది.  నగరంలోని చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేటలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒక్క హైదరాబాద్ అనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.  నారాయణపేట జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. భూ ఉపరితలం వేడెక్కడంతో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ రెండు మూడు రోజులు వాతావరణం చల్లబడుతుందనీ, ఆ తరువాత ఎండలు ఠారెత్తిస్తాయని తెలిపింది. 

స్వతంత్ర సంస్థగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ను స్వతంత్ర సం్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకూ ఏపీ ఫైబర్ నెట్ లో భాగంగా ఉన్న డ్రోన్ కార్పొరేషన్ ను ఇక నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ గా స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే అనకాపల్లి జిల్లా డీఎల్ పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పోతే యువజన, పర్యాటక శాఖ జీవోలక రాటిఫికేషన్ కు మంత్రివర్గం ఆమెదం తెలిపింది. అలాగే 710 కోట్ల రూపాయల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  ఇక మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2025కు, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైలింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే జలహారతి కార్పొరేషన్  ఏర్పాటుకు, దాని ద్వారా పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కేబినెట్ చర్చించి ఆమోదించింది.  అదే విధంగా  త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజును పాతిక లక్షలకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  

సిఐడి కార్యాలయానికి చేరుకున్న పోసాని 

నటుడు  పోసాని కృష్ణ మురళి షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పోసానికి బెయిల్ ఇచ్చేముందు కోర్టు ప్రతీ  సోమవారం,  గురువారం  మంగళగిరి సిఐడి కార్యాలయానికి రావాలి. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని   బెయిల్ పై విడుదలైన తర్వాత మంగళగిరి  సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నప్పుడు రోజుకో కోర్టు , రోజుకో జైలు అన్నట్టు ఉండేది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై  ఆంధ్ర ప్రదేశ్ లోని 18 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఒక్కో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం అరెస్ట్ కావడం చకచకా జరిగిపోయాయి.  ఈ కేసుల్లోనే ఒక వేళ కోర్టు  పోసానికి బెయిల్ ఇచ్చినప్పటికీ పీటీ వారెంట్ పై పోసాని అరెస్ట్ అయ్యేవారు. మంగళగిరి సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిన నేపథ్యంలోనే పోసానికి బెయిల్ వచ్చింది. వైకాపా హాయంలో సకల శాఖా మంత్రి సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోసాని తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. చలన చిత్ర రంగంలో ఉన్నప్పుడు పోసాని స్వయంగా స్క్రిప్ట్ లు రాసేవారు. ప్రస్తుతం వేరే వాళ్లు రాసిచ్చే స్క్రిప్ట్ ప్రకారం రాజకీయాల్లో నటుడిగా మిగిలిపోయి కేసులు ఎదుర్కొంటున్నారు.  కోర్టు ఆదేశం ప్రకారం ఆయన గురువారం సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. 

దశాబ్దాల సమస్యకు పది నెలల్లో పరిష్కారం.. దటీజ్ లోకేష్

మాట తప్పను.. మడమ తిప్పను అని పదేపదే చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఇచ్చిన ఏ మాటనూ, చేసిన ఏ వాగ్దానాన్నీ పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టబడటం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదనిపించేలా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. విపక్షంలో ఉండగా అమరావతి రాజధానికి జై అన్న జగన్ అధికార పగ్గాలు అందుకోగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు.  అమ్మ ఒడి, పింఛన్లు ఇలా ఒకటనేమిటి.. తన పాదయాత్ర సందర్భంగా గల్లీ కో వాగ్దానం చొప్పున చేసిన జగన్ వాటిని నెరవేర్చాలన్న విషయాన్నే పూర్తిగా మరిచారు. అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగా ఆయన పాలన సాగింది.  అందుకు భిన్నంగా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీరు ఉంది. మాట ఇచ్చానంటే నిలబెట్టుకుంటాను అని చేతల్లో చూపుతున్నారు. తండ్రి చంద్రబాబుకు తగ్గ తనయుడిగా, ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడిగా ఆయన ఎదుగుదల సాగుతోంది.  వాస్తవానికి లోకేష్ రాజకీయాలలో తొలి అడుగు పడక ముందే వైసీపీ ఆయన నడకను ఆపేయాలని చూసంది. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు సాగించింది. రాజకీయంగా లోకేష్ అడుగులు ముందుకు పడకుండా నిలవరించడానికి నానా విథాలుగా ప్రయత్నించారు. పప్పు అన్నారు, బాడీ షేమింగ్ చేశారు. హేళనగా మాట్లాడారు. టార్గెట్ చేసి మరీ వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. అప్పట్లో రాజకీయవర్గాలలో వైసీపీ ఎందుకు లోకేష్ ను  టార్గెట్ చేసుకుంది. ఆయన మాట వినబడకూడదు, ఆడుగు ముందుకు పడకూడదు అన్న ట్లుగా ఎందుకు వ్యవహరిస్తోంది అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ సందేహాలన్నిటికీ సమాధానం దొరికేసింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా లోకేష్ రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే పార్టీ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్, పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకం ఇవన్నీ లోకేష్ మానస పుత్రికలే. దీంతో వైసీపీలో అప్పడే గాభరా మొదలైంది. లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికికే ప్రమాదం అన్న భయం ఏర్పడింది. దీంతో లోకేష్ టార్గెట్ గా అనుచిత విమర్శలకు తెరలేపారు. అయితే వాటిని లోకేష్ కుంగిపోలేదు. మరింత పట్టుదలతో పని చేశారు. తద్వారా తనను తాను మలచుకున్నారు. ఔను వక్రబుద్ధి నేతలు చెక్కిన శిల్పం.. పని తీరు చూడలేని కబోది నాయకుల విమర్శల నుంచి ఎదిగిన పరిణితి లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తనలోని నాయకత్వ లక్షణాలను, పట్టుదలను, సమస్యలను దీటుగా ఎదుర్కోవడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇప్పుడు ప్రత్యర్థులు సైతం లోకేష్ పై ప్రశంసల వర్షం కురింపిస్తున్నారంటే ఆయన తనను తాను ఎలా మలచుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.    ఇప్పుడు తాజాగా తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు లోకేష్. 2024 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తామని, నూతన వస్త్రాలు అందజేసి గౌరవిస్తానని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాల సమస్య నిన్నా మొన్నటిది కాదు.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్య. ఇప్పుడు ఆ సమస్యను నారా లోకేష్ కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల్లో పరిష్కరించేశారు. ప్రభుత్వ భూములలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తానంటూ గ తఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. ముందుగా   శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి ఏప్రిల్ 12 వరకు 'మన ఇల్లు.. మన లోకేష్' పేరుతో మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తొలి విడతలో మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు అందచేయనున్నారు.  శుక్రవారం (ఏప్రిల్ 4)  మంగళగిరి మండలం ఎర్రబాలెం, నీరుకొండ, కాజ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి లోకేష్ తన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు, కొత్త బట్టలు అందజేస్తారు. ఈ నెల 12 వరకు వేర్వేరు గ్రామాల వారికి పట్టాలు పంపిణీ చేస్తారు. ఈ నెల 7న తాడేపల్లి మండలం ఉండవల్లి, ఇప్పటం, పెనుమాక, పద్మశాలీబజారు, కొలనుకొండ ఈ నెల 11న సీతానగరం, తాడేపల్లి సలాం సెంటర్, నులకపేట డ్రైవర్స్‌కాలనీ వాసులకు.. 12న మహానాడు-1, ఉండవల్లి కూడలి ప్రాంతాలలోని అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తారు మంత్రి లోకేష్. లోకేష్ లోని ఈ చొరవ, ఈ వేగమే ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారింది. ఆయన రాజకీయ అరంగేట్రం సమయంలోనే లోకేష్ లోని ఈ ప్రజానాయకత్వ లక్షణాలను గమనించే ఆయనను అణచివేయాలని వైసీపీ కుట్రలెన్నో చేసింది. వాటన్నిటినీ అధిగమించి లోకేష్ ఇప్పుడు తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజాహృదయాలకు మరింత చేరువ అవుతున్నారు. 

 దొరికితే దొంగ దొరకకపోతే దొర ...సెలబ్రిటీల తీరు ఇదే

తెలంగాణలో బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో ఆరోపణలు  ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో విచారణకు హాజరు కావడం లేదని సెలబ్రిటీలు చెబుతున్నారు. నేరం చేయనప్పుడు అరెస్ట్ చేసే అవకాశమే లేదు . అయినా సెలబ్రిటిలు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించడమే. బెట్టింగ్ యాప్ ప్రోత్సహించడం హీనియస్ క్రైం. బెట్టింగ్ యాప్ ల వల్ల ఆత్మహత్యలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కూడా.   ఈ విషయం తెలుసుకాబట్టే సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ లకు రావడానికి భయపడుతున్నారు. అలా భయపడుతున్న వారిలో యూట్యూబర్ హర్షసాయి చేరాడు. ఆయనపై పంజాగుట్ట, మియాపూర్  పోలీస్ స్టేషన్లలో వేర్వురు కేసులు నమోదయ్యాయి. విచారణకు రావాలని పోలీసులు పిలిచినప్పటికీ హర్షసాయి ముఖం చాటేశాడు. నేరుగా  గురువారం ( ఏప్రిల్ 3) హైకోర్టును ఆశ్రయించాడు. తనపై మియాపూర్ , పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదయ్యాయంటూ న్యాయస్థానం ఆశ్రయించాడు. తనపై కక్ష్య కట్టిన కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. వాస్తవానికి సామాజిక కార్యకర్త ఒకరు  ఆధారాలతో బయట పెట్టడం వల్లే 15 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు విచారణ జరుపుతుంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తాము నిర్దోషులమని ప్రూవ్ చేసుకోవల్సి ఉంటుంది. అవేవి లేకుండానే సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టు నాశ్రయిస్తున్నారు. తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోర్టును అభ్యర్థిస్తున్నారు. కేవలం కేసు నమోదైతేనే కోర్టు నాశ్రయించడం అంటే తాము చేసిన నేరాన్ని పరోక్షంగా ఒప్పుకోవడమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. హైకోర్టునాశ్రయించిన సెలబ్రిటీలలో మొదటి స్థానంలో నిలిచిన వారిలో వైకాపా అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. కాసులకు కక్కుర్తి పడ్డ శ్యామల ఒక్కో బెట్టింగ్ యాప్ నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆమె హైకోర్టు నాశ్రయించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. యాంకర్ విష్ణు ప్రియ కూడా తెలంగాణ హైకోర్టు నాశ్రయించి భంగపడింది. తాజాగా యూట్యూబర్ హర్షసాయి హైకోర్టు నాశ్రయించినప్పటికీ ఫలితం శూన్యమని న్యాయనిపుణులు చెబుతున్నారు. క్వాష్ కొట్టివేస్తే అవమానమైనప్పటికీ హర్షసాయి హైకోర్టునాశ్రయించడం గమనార్హం. హర్షసాయిపై  ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్  అత్యాచార ఆరోపణలు  చేశారు. ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైనప్పటికీ పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్షసాయి మోసం చేసినట్టు ముంబైకు చెందిన యువతి కూడా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. డబ్బులు ఆర్జించడమే పరమావధిగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్నారు. దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుంది సెలబ్రిటీల తీరు.