తిరుపతి ఎస్వీయు  క్యాంపస్ లో చిక్కిన చిరుత

కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరాల్లో  వన్య ప్రాణులు వచ్చేస్తున్నాయి.  తాజాగా  తిరుపతిలోని  ఎస్వీయు క్యాంపస్ లో చిరుతపులి చిక్కింది. గత కొంత కాలంగా ఈ చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది.ఎట్టకేలకు  అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. చిరుత సంచరిస్తుందని అటవీశాఖాధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమై ఎస్వీయు క్యాంపస్ లోబోనులు, కెమెరాలను ఏర్పాటు చేశారు. బోను వరకు వచ్చి వెళుతున్న చిరుత బోనులోకి రాలేదు. మేకను ఎరవేసినప్పటికీ పులి బోనువైపు చూడలేదు. ఇటీవల క్యాంపస్ ప్రధాన గ్రంధాలయం వెనుక ఒక జింక పిల్లపై చిరుత దాడి చేసి పట్టుకెళ్లింది. జింక పిల్ల రక్తం రుచి మరిగిన చిరుతకు ఎస్వీయు క్యాంపస్ బోనులో కూడా జింకను ఎరగా వేశారు. ఉదయం ఏడుగంటల లోపు సాయంత్రం ఆరు గంటల తర్వాత క్యాంపస్ లో  విద్యార్థులతో సహా ఎవరికీ ఎంట్రీ లేదు. నిన్న రాత్రి  క్యాంపస్ లోని ఓ బోనులో అమర్చిన బోనులో వచ్చి చిక్కింది. చిరుతకు మత్తు ఇచ్చి ఎస్వీ జూపార్క్ కు తరలించారు 

తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఇదే తొలిసారి. ఆదివారం (ఏప్రిల్ 6) ఉదయం జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి ఈవో శ్యామలరావు, ఆదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.  మేళతాళాల మధ్య అర్చకులు ఆయనకు వేదమంత్రోచ్ఛారణతో సంప్రదాయబద్ధంగా ఇఫ్తికాపాల్ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శన అనంతరం సీజేఐ సంజీవ్ ఖన్నాకు అర్చకులు స్వామి వారి శేష వస్త్రం కప్పి రంగనాయకుల మంటపంలో వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు సీజేఐకి తీర్ధప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. 

తెలుసా మీకు కోహినూర్.. మన తెలుగింటి వజ్రం!

కోహినూర్ వజ్రం గురించి మనం ఎక్కడో ఎప్పుడో వినే ఉంటాం. అవును చిన్నప్పడు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో చదువుకునే ఉంటాం. అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం ఇప్పడు ఎక్కడుందో, మనలో చాలా మందికి తెలియదు. ఇప్పడు ఎక్కడ వుందో అనే కాదు, అసలు ఎక్కడ పుట్టిందో, అక్కడికి ఎలా చేరిందో కూడా మనకు తెలియదు. అవును. ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం  పుట్టు పూర్వోత్తరాలు, కుల గోత్రాలు మనలో చాలా మందికి తెలియదు. తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే..  ఎక్కడెక్కడో తిరిగి, ఎన్నో చేతులు మారిన కోహినూర్ వజ్రం నిజానికి  మన తెలుగింటి వజ్రం. కోహినూర్ పుట్టిల్లు మన  రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ లోపుట్టిన అద్భుత వజ్రం కోహినూర్ వజ్రం. అందుకే,అందం, ఆస్తి, చదువు, అన్నీ ఉన్న వారిని, మన వాళ్ళు  కోహినూర్ వజ్రంతో పోలుస్తారు. వాడి కేంటి కోహినూర్ వజ్రం అనే నానుడి అలా పుట్టిందే.  అవును. కోహినూర్ వజ్రం, ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మన గుంటూరు జిల్లాలోని గోల్కొండ గనుల్లో పుట్టిన వజ్రం. కాకతీయ రాజుల కాలంలో గుంటూరు జిల్లా, (ప్రస్తుత పల్నాడు జిల్లా) బెల్లంకొండ మండలం కోళ్లూరు గనుల తవ్వకాలలో బయట పడిన వజ్రం కోహినూర్ వజ్రం. 186 క్యారెట్ల  అద్భుత కాంతులతో (కోహినూరు అంటే,పారశీక భాషలో కాంతి పర్వతం) చారిత్రిక వజ్రంగా చరిత్ర  పుటల్లో నిలిచి పోయింది.  కాకతీయ రాజుల కాలంలో గోల్కొండ గనుల తవ్వకాలలో బయట పడిన 186 క్యారెట్ల కోహినూర్ వజ్రం కాకతీయ రాజుల సొంతం. కాకతీయ రాజులే కోహినూర్ అసలు యజమానులు. ఆ కాకతీయ రాజులే కోహినూర్ వజ్రాన్ని తమ కుల దైవం వరంగల్ భద్రకాళీ  అమ్మవారి, ఎడమ కంటిలో ఉంచారు. అయితే అమ్మ వారి కంటి దీవెనగా  నిలిచిన కోహినూర్ వజ్రం  ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది. ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎందరో రాజులు, చక్రవర్తుల చేతులు మారింది.  కాకతీయ రాజుల నుంచి ఢిల్లీ సుల్తాన్.,అల్లావుద్దీన్ ఖిల్జీ, చేతుల్లోకి వెళ్ళింది. కాకతీయ సామ్రాజ్యం పై 14 వ శతాబ్దిలో ఖిల్జీ దండయాత్ర చేసి, కాకతీయ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కోహినూర్ వజ్రాన్నీ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అలా ఒకరి చేతిలోంచి మరొకరి  చేతిలోకి, మారుతూ, చివరకు ముఘల్ చక్రవర్తి,బాబర్ చేతికి చేరింది. అయితే, 1739లో, ముఘల్ చక్రవర్తి ముహ్మద్ షా ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నపర్షియన్ రాజు  నాదిర్ షా పోతూ పోతూ కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు పట్టుకు పోయాడు.  ఆ తర్వాత అక్కడి నుంచి  కోహినూర్ వజ్రం మళ్ళీ చేతులు మారి పంజాబ్  మహా రాజు రంజిత్ సింగ్ ఖజానాకు చేరింది. అయితే, 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ ను స్వాధీనం చేసుకుంది. కోహినూర్ వజ్రాన్నీ సొంతం చేసుకుంది.  అలా సొంతం చేసుకున్న వజ్రాన్నిఈస్ట్ ఇండియా కంపెనీ  బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియాకు కానుకగా బహుకరించింది. ఇప్పడు మన కోహినూర్ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్  ప్రదర్శనలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు చూసి సంతోషిస్తున్నారు. అయితే  కోహినూర్ తెలుగు వజ్రం  అనే నిజం సందర్శకులు ఎవరికీ తెలియక పోవచ్చును.  అదలా ఉంటే  కోహినూర్ వజ్రం గురించిన ఆసక్తికర విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందులో ఆశ్చర్య గొలిపే విషయం కోహినూర్ వజ్రం  (పురుష ద్వేషో ఏమో) ధరించిన పురుషులను దురదృష్టం వెంటాడు తుంది..ట.అందుకే, బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే కోహినూర్ వజ్రం ధరించారు..ట. అలాగే, కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారూ ఉన్నారు. ఎంతైనా .. ఎక్కడ ఉన్నా మన కోహినూర్ ..కోహినూరే.. కదా ..మీరు ఎప్పుడైనా లండన్ వెళితే ఒక లుక్కేసి .. ఇది  మాదే అని ఓ సారి కాలర్ ఎగరేసి.. రండి !

పార్లమెంట్ లో హాస్యోక్తులు!

పార్లమెంట్ సమావేశాలంటే, ఏముంది? మూడు వాయిదాలు, ఆరు వాకౌట్లు. కాదంటే, గౌరవ సభ్యుల అరుపులు, కేకలు.. నిరసనలు, నినాదాలు, ఇంతే కదా అని ఎవరైనా అనుకుంటే  అనుకోవచ్చును. తప్పు  కాదని చెప్ప లేము.  అవును మరి   సీయింగ్ ఈజ్ బిలీవింగ్  అని కదా అంటారు. సో.. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అందరం చూస్తున్నది అదే అయినప్పుడు.. కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్ర విచిత్ర, విన్యాస వికారాలను, కాదని అనడం కుదరదు. అందుకే, పార్లమెంట్ ను ఫిష్ మార్కెట్ అన్నా.. గౌరవ సభ్యుల ప్రవర్తనను సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చినా.. సభ లోపల కన్ను గీటడం, కౌగిలింతలు, ముద్దులు మురిపాలు ప్రదర్శించడం వంటి చర్యలను పిల్ల చేష్టలుగా కొట్టి వేసినా  తప్పు పట్టలేని పరిస్థితి పార్లమెంట్  ప్రతిష్ట దిగజారిందనే ఆవేదన  ప్రజల్లోనే కాదు పార్లమెంట్ సభ్యుల్లో కూడా  వ్యక్తమవుతోంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి పెద్దలు, పలు సందర్భాలలో పార్లమెంట్  పనితీరు పట్ల ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. నిజానికి  గత కొంత కాలంగా, పార్లమెంట్  పని తీరు   నానాటికి తీసికట్టు నాగం బొట్లు  అన్నట్లు దిగాజరుతోందనే విషయంలో రెండో అభిప్రాయం లేదు. అయితే, శుక్రవారం ( ఏప్రిల్ 4)తో ముగిసిన, పార్లమెంట్ బడ్జెట్  సమావేశాలు, ప్రారంభంలో ఎలా సాగినా, చివరి వారంలో  వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన చర్చ  సందర్భంగా కొంత భిన్నమైన, సంతోషకరమై వాతావరణం సభలో కన్పించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్త మవుతోంది. అవును  మన కళ్ళను మనం, మన చెవులను మనం నమ్మలేనట్లుగా ఉభయ సభల్లో చాలా లోతైన చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత ఉభయసభలు బిల్లును ఆమోదించాయి.  నిజమే  చర్చ సందర్భంగా  అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు షరా మాములుగానే ఉన్నాయి. అయినా ఈ సారి సభ  సమ్ థింగ్ స్పెషల్ ’ అన్న  ఫీలింగ్ అయితే మిగిలింది. అలాగే  పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల కాలంలో ఎప్పడూ లేని విధంగా,  డేట్  మారే వరకూ, మారిన తర్వాత కూడా బిజినెస్  కొనసాగింది. వక్ఫ్‌ బిల్లుపై లోక్‌సభలో 14 గంటలపాటు చర్చ జరగ్గా. రాజ్యసభలో 17గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. రాజ్యసభ చరిత్రలోనే ఇదో అరుదైన విషయమని ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. రాజ్యసభలో చర్చ ప్రారంభమైన మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు కొనసాగింది. అయితే ఇలాంటి పరిస్థితి, ఇంతటి సుదీర్ఘ చర్చ జరిగిన సందర్భాలు లేవా అంటే, ఉన్నాయి.  చరిత్రలోకి వెళితే, 1981లో రాజ్యసభలో ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ బిల్లుపైనా ఉదయం 4.43 గంటల వరకు చర్చ కొనసాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లోక్‌సభలో  స్టేట్‌ ఆఫ్‌ అవర్‌ డెమోక్రసీ పై గతంలో 20.08 గంటల పాటు సాగిన చర్చే ఇప్పటివరకు సుదీర్ఘమైనది .ఆ తర్వాత 1993లో రైల్వే బడ్జెట్‌పై 18.35గంటల చర్చ జరిగింది. 1998లో రైల్వే బడ్జెట్‌పైనా 18.04 గంటలు, మైనార్టీల భద్రతకు సంబంధించి బిల్లుపై 17.25గంటలు, 1981లో ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ బిల్లుపై రాజ్యసభలో 16.58 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది.  ఇదంతా, ఒకెత్తు అయితే, చాలా  రోజుల తర్వాత సభలో సరస సంభాషణలు, నవ్వులు కూడా వినిపించాయి. అది కూడా  ఎప్పుడూ సీరియస్ గా ఉండే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సమాజ వాదీ పార్టీ ( ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  కు సరదాగా అంటించిన చురక సభలో నవ్వులు పూయించింది. అఖిలేష్ యాదవ్ తన ప్రసనంలో భాగంగా    ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకునే, బీజేపీకి, పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం చేత కావడం లేదని  ఒక వ్యంగ బాణం వేశారు. అందుకు సమాధానంగా అమిత్ షా,  ఇతర పార్టీలలో అధ్యక్షుని ఎన్నిక అంటే, నలుగురైదుగురు కుటుంబ సభ్యులు కూర్చుని తమలో ఒకరిని అధ్యక్షుడు అనుకుంటే సరి పోతుంది. కానీ, బీజేపీ అధ్యక్షుని ఎన్నికలో 12 కోట్ల మంది సభ్యులకు భాగస్వామ్యం ఉంటుంది, సో, సహజంగా అధ్యక్షుని ఎన్నిక కొంత ఆలస్యం అవుతుందని, నవ్వుతూ  సమాధానం ఇచ్చారు.అంతటితో ఆగకుండా, అఖిలేష్ యాదవ్ ను ఉద్దేశించి,మరో 25 సంవత్సరాలు, మీ పార్టీకి మీరే అధ్యక్షులుగా ఉంటారు  అంటూ నవ్వేశారు. అమిత్ షా నవ్వుతో, అఖిలేష్ యాదవ్  సహా  సభ్యులు నవ్వులు కలిపారు. అలాగే  మంత్రి రామదాస్ అతవాలే  రాజ్యసభలో  కాంగ్రెస్ పార్టీ పై చురకలువేస్తూ చేసిన ప్రసంగం కూడా సభలో నిండుగా నవ్వుల పూయించింది. ఖర్గే సహా కాంగ్రెస్ అభ్యులను కూడా నవ్వించారు. ఇప్పడు ఈ రీల్స్  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి, ఒకప్పడు పార్లమెంట్ లో హస్యోక్తులకు కొదవ ఉండేది కాదు. ఇప్పడు ఎప్పుడో ఇలా.. జన్మానికో శివరాత్రి..

మళ్లీ పాదయాత్ర మూడ్‌లో జగన్

ఎండలు తగ్గాక జనంలోకి? వైయస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్ లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసిపి అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజుకు ఒకరి పైన కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వైసిపి నేతలు వరుసగా జైలు పాలు అవుతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు ఏపీని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి దాక్కుకుంటున్నారు. విజయసాయిరెడ్డి లాంటివారు రాజకీయాలకు గుడ్ బై చెప్పి, సేఫ్ జోన్ లోకి వెళ్లారు.  ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది.  కాబట్టి ఎలాగైనా పార్టీని కాపాడుకునేందుకు జగన్ బెంగళూరు ప్యాలెస్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారట . పార్టీ కీలక నేతలు, మరి కొంత మంది వైఎస్ కుటుంబ సభ్యులను పిలిపించుకొని జగన్ చర్చలు జరిపారంట. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి?  ఎలా పార్టీని ముందుకు  తీసుకువెళ్లాలి అనే దానిపైన మంతనాలు సాగించారంట. చివరికి  ఏపీలో మరోసారి జగన్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారంట. మరోసారి పాదయాత్ర నిర్వహిస్తే కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఓ నిర్ణయానికి వచ్చారట. మరో మూడు నెలల సమయం టిడిపి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత జగన్ జనాల్లోకి వెళ్లడానికి ఫిక్స్ అయ్యారంట. అంటే మాజీ ముఖ్యమంత్రి ఎండలు తగ్గాక రోడ్డెక్కుతారన్న మాట.

వైసీపీకి జక్కంపూడి ఫ్యామిలీ దూరం?

రాజమండ్రి వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య ఆధిపత్యపోరు పోరు తార స్థాయికి చేరుకుంది. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆ పార్టీ పరువుతో పాటు నాయకుల ప్రతిష్ఠను కూడా బజారున పడేస్తున్నది . ఎవరినీ సముదాయించలేక జగన్ సైలెంట్ అవ్వడంతో జక్కంపూడి రామ్మోహనరావు వారసుడు జక్కంపూడి గణేష్ పార్టీని వీడటానికి డిసైడ్ అయ్యారంట.  తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంట. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఆ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్యపోరుకు మాత్రం తెర దించలేకపోయింది. భరత్, గణేష్‌ల టార్గెట్ ఒకటే. రాజమండ్రి వైసీపీలో తమ ఆధిపత్యం మాత్రమే ఉండాలని. ఈ ఆలోచనే రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి రామ్మోహన్‌రావు చిన్న కొడుకు జక్కంపూడి గణేష్ మధ్య రాజకీయ వైరానికి కారణమైంది. జక్కంపూడి ఫ్యామిలీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి తూర్పుగోదావరి జిల్లాలో తెలియని రాజకీయ నాయకుడు ఉండడు. వైఎస్ సన్నిహితుడుగా జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జక్కంపూడి రాజకీయ వారసులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జక్కంపూడి రాజా, ఆయన తమ్ముడు జక్కంపూడి గణేష్ లు వైఎస్, జక్కంపూడి రమ్మోహన్‌రావు మరణాల తర్వాత వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు.  మరోపక్క 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మార్గాని భరత్ జగన్ అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. జగన్ ఆదేశిస్తే ఏం చేయడానికైనా రెడీ అన్నట్లు వ్యవహరిస్తుంటారు . జక్కంపూడి ఫ్యామిలీకి వైఎస్‌కు అనుబంధం ఉంటే, మార్గాని భరత్ కు వైసిపి అధినేత జగన్ కు ప్రత్యేక అనుబంధం కనిపిస్తుంది . ఒకరేమో తండ్రి వైపు నుంచి వచ్చిన వాళ్ళు ... మరొకరు తన ప్రమేయంతో వచ్చిన నేత కావడంతో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కాక జగన్ సైలెంట్ గా ఉండిపోతున్నారంట.  వైసిపి అధిష్టానం సైలెంట్ గా ఉండడమే రాజమండ్రి రాజకీయాల్లో జక్కంపూడి, మార్గాని కుటుంబాల మధ్య రాజకీయ వైరానికి కారణం అవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి    జక్కంపూడి రామ్మోహన్‌రావుకు ఆయన  రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి రాజమండ్రిపై పట్టుంది. జక్కంపూడి రామ్మోహన్‌రావు మరణం తర్వాత వైసీపీ నుండి బరిలోకి దిగి రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచిన జక్కంపూడి తనయుడు రాజా పక్క నియోజకవర్గానికి వెళ్లినా ఆ ఫ్యామిలీ రాజమండ్రి పై ఫోకస్ మాత్రం తగ్గించ లేదు. జక్కంపూడి రాజా రాజానగరంపై దృష్టి పెడితే ఆయన తమ్ముడు,  ప్రస్తుత ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మాత్రం పూర్తి ఫోకస్ రాజమండ్రి నగరం పైనే పెడుతూ వస్తున్నారు.  2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే గెలవడం, వైసీపీ నుండి పార్లమెంటరీ కమిటీలో మార్గాని భరత్ కు కీలకమైన పదవి రావడంతో జక్కంపూడి గణేష్, మార్గాని భరత్ లు ఎవరి ఆధిపత్యాన్ని వాళ్లు చలాయించే ప్రయత్నం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్షాలకు పలుచనవుతూ వచ్చారు. ఒకే పార్టీలో ఉన్న మార్గాని భరత్, జక్కంపూడి గణేష్ లు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ఆ పార్టీ నేతలకే మింగుడుపడటం లేదంట. మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వైరం పరిష్కరించలేని స్థాయికి చేరుకోవడంతో జక్కంపూడి గణేష్ వైసీపీలో కొనసాగడం కష్టంగా కనిపిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి రాజకీయాల్లో మార్గాని భరత్ వల్ల వైసీపీ ప్రతిష్ట దిగజారుతున్నదని, భరత్ వ్యవహార శైలి ఇదేవిధంగా ఉంటే వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని గణేష్ అంటున్నారు. అందుకే వైసీపీని వీడటానికి నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి అధిష్టానానికి చెప్పారంట. వైసీపీని వదిలి వేయడానికి గల కారణాలు, మార్గని భరత్ వల్ల వైసీపీకి జరుగుతున్న నష్టాలను బయట పెడతానని చెపుతుండటంతో ఆ పార్టీ మరింత డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జక్కంపూడి ఫ్యామిలీ సభ్యుడు వైసీపీని వీడనుండటంపై  పార్టీలో కూడా ఇంటర్నల్ గా చర్చ  మొదలైందంట. ఇప్పటికే జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న అనేకమంది నాయకులు పార్టీని వీడి వెళుతున్నారు. వైసీపీని వీడుతున్న వారిలో అత్యధికులు వైఎస్‌కు సన్నిహితంగా మెలిగిన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు జక్కంపూడి ఫ్యామిలీ నుండి మాస్ లీడర్ గా పేరున్న జక్కంపూడి గణేష్ వైసిపికి రాజీనామా చేస్తే,  మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రిలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా  జగన్ స్పందించకపోవడమే జక్కంపూడి గణేష్ అలకకు కారణంగా చెప్తున్నారు 

శ్రీ రామనవమికి భద్రాద్రిలో భారీ బందోబస్తు

16 మంది డీఎస్పీలు,66 మంది సీఐలు భద్రాచలంలో ఆదివారం (ఏప్రిల్ 6)జరగనున్న శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సీతారామస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు.   గత ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉండటంతో వీఐపీలు పెద్దగా హాజరు కాలేదు. ఈ సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సోమవారం జరిగే పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం, సోమవారం పట్టాభిషేకం జరగనుంది. కల్యాణోత్సవం జరిగే మిథిలా స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చలవ పంతుళ్లు వేశారు. వేసవి వేడికి భక్తులకు దాహార్తిని తీర్చేందుకు మంచి నీటి సౌకర్యం తో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. ఇదే సమయంలో భద్రతా ఏర్పాట్లు కూడా భారీగానే చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా పలువురు వీఐపీలు హాజరవుతుండటం,  సరిహద్దు రాష్ట్రంలో మావోల కదలికలు, తాజా ఎన్ కౌంటర్ల నేపథ్యంలో  రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది . శ్రీ రామనవమి కి భక్తులు కూడా భారీగానే హాజరవుతున్నారు . దీన్ని దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే 16 మంది డీఎస్పీలు,66 మంది సీఐలు,185 మంది ఎస్సైలు,ఏఎస్సైలు, 304 మంది హెడ్కానిస్టేబుళ్లు, 208 మంది మహిళా పోలీసుసిబ్బంది, 555 మంది కానిస్టే బుళ్లు, హోంగార్డులు 404 మంది ,డాగ్ స్క్వాడ్, రోప్ పార్టీ, 5 బృందాల ప్రత్యేక దళం ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.. ఎక్కడికక్కడ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, నిఘా విభాగం సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు.

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. భద్రాదిలో లొంగిపోయిన 86 మంది మావోలు

చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు చనిపోతున్నారు. ఇటీవల  తెలంగాణ జనగామకు చెందిన మావోయిస్టు అగ్రనేత అరుణక్క ఎన్ కౌంటర్ లో చనిపోయింది.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరిట వచ్చే మార్చి వరకు మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలనిస్తుంది. వందలాది మంది జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.  చత్తీస్ గడ్ లో గత వారం 50 మంది మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. శనివారం (ఏప్రిల్ 5)న 86మంది మావోయిస్టులు భద్రాది మునుగుజిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కోరికి 25 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఐజి చంద్రశేఖరరెడ్డి మావోయిస్టులను ఒప్పించి జన జీవన స్రవంతిలో కలిసేలా చర్యలు తీసుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో  లొంగిపోవడం మావోయిస్టులకు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. లొంగిపోయిన వారంతా చత్తీస్ గడ్ వాసులే. మరో వైపు కేంద్ర హోంమంత్రి చత్తీస్ గడ్ పర్యటనలో ఉండగానే మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం. 

విడదల రజనీకి లభించని ఊరట.. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

మాజీ మంత్రి, చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి హైకోర్టులో ఊరట లభించలేదు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదరించి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజని, ఆమె మరిది గోపీనాథ్ లపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసింది.  శుక్రవారం (పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ వాయిదావ వేసింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. మాజీ మంత్రికి అరెస్టు నుంచి ఎటువంటి రక్షణా కల్పించలేదు.   వైసీపీ హయాంలో  విజిలెన్స్‌ తనిఖీ పేరుతో తనను బెదిరించి, రూ.2.20కోట్లు అక్రమంగా వసూలు చేశారని పల్నాడుజిల్లా, యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్స్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ నల్లపనేని చలపతిరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎసిబి కేసు నమోదు చేసింది. కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విడదల రజని పీఏ దొడ్డా రామకృష్ణ దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ విచారణ కూడా ఏప్రిల్ 8కే వాయిదా పడింది.  

తిరుపతిలో గ్యాంగ్ వార్.. నలుగురికి తీవ్ర గాయాలు

తిరుపతిలో హోం స్టే నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ శుక్రవారం (ఏప్రిల్ 4) అర్ధరాత్రి జరిగిన గ్యాంగ్ వార్ సంచలనం సృష్టించింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రెండు స్టే హోంల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. కర్రలు రాళ్లతో హోంస్టేల నిర్వాహకులు ఘర్షణకు తలపడ్డారు. ఈ ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ గ్యాంగ్ వార్ కు కారణమేంటంటే.. ఒక స్టేహోంకు వచ్చే వారిని మరో స్టేహోం వారు బలవంతంగా లాక్కు వెడుతున్నారంటూ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే   డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోం స్టే యాజమాన్యం దాడికి దిగింది. ఈ  దాడిలో డెక్కన్ సూట్స్ హోం స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణిందర్ రెడ్డి లు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ స్టే హోంల నిర్వాహకుల మధ్య జరిగిన ఈ ఘర్షణతో స్థానికులు, శ్రీవారి భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసిన  పోలీసులు వారిని విచారిస్తున్నారు.  

కొలికపూడిపై వేటు తప్పదా? చంద్రబాబు సంకేతం అదేనా?

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై వేటు తప్పదా? ఆయన పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారా? అంటే తాజాగా ఆయన తిరువూరు ఎమ్మెల్యే ఎదురుపడినా పట్టించుకోకపోవడాన్ని బట్టి చూస్తే అవుననే అనాల్పి వస్తున్నది. తిరువూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన కొలికపూడి శ్రీనివాసరావు, ఆ తరువాత నిత్యం వివాదాల్లో ఉంటూ పార్టీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొలికపూడి తెలుగుదేశంకు మద్దతుగా తన విశ్లేషణలు, పంచ్ డైలాగులతో టీవీ డిబేట్లలో చురుకుగా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ క్రమంలోనే చంద్రబాబు దృష్టిలో పడ్డారు. తిరువూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా టికెట్ దక్కించుకుని పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆయన మాటలు, చేతలూ పార్టీకి ఇబ్బందిగా మారాయి. తాజాగా రాజీనామా చేస్తానంటూ 48 గంటల అల్టిమేటమ్ ఇచ్చి కొలికపూడి పార్టీ అధినేత ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే శనివారం నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో పర్యటించిన చంద్రబాబు తనకు ఎదురుపడిన కొలికపూడిని కనీసం పట్టించుకోలేదు. ఆయన అభివాదం చేసినా స్పందించలేదు.  కనీసం పలకరించలేదు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నేతలందరితో కరచాలనం చేసి నవ్వుతూ ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు కొలికపూడి వద్దకు వచ్చే సరికి కరచాలనం చేయలేదు సరికదా? కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడలేదు.  తిరువూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కొలికపూడి వ్యవహారశైలిపై పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహంగా ఉందన్న సంగతి ఇప్పటికే తెలిసిందే అయినా.. తాజాగా  చంద్రబాబు కొలికపూడిని గుర్తించడానికి కూడా ఇష్టపడకపోవడం చూస్తుంటే ఆయనపై వేటు తప్పదన్న విషయం అర్థమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వాస్తవానికి వైసీపీ హయాంలో అమరావతి రైతుల ఉద్యమానికి కొలికపూడి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. వందల డిబేట్లలో పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా డిబేట్లలో ఆయన వాగ్దాటి, ఆయన రాజకీయ పరిజ్ణానం, ఆయన విశ్లేషణా తీరుఆయను పార్టీ అధినాయకత్వంలో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తిరువూరు నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసే అవకాశం దక్కేలా చేసింది. ఆయన విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన పనితీరు, వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో పార్టీ అగ్రనాయకత్వం ఆయనను మూడు సార్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుని మరీ చీవాట్లు పెట్టింది.  అయినా కొలికపూడి తీరు మారలేదు.    తాజాగా తిరువూరు  తెలుగుదేశం నాయకుడు, మాజీ ఏంఎంసీ ఛైర్మన్‌ రమేష్‌ రెడ్డి ఓ గిరిజన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన కొలికిపూడి తన డిమాండ్ మేరకు ఆయనను సస్పెండ్ చేయకుంటే 48 గంటల్లో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అల్టిమేటమ్ జారీ చేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానం త్రిసభ్య కమిటీ వేసింది. తిరువూరు ఎమ్మెల్యే తీరుపై నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే నందిగామ పర్యటనలో  కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు పట్టించుకోలేదు.  ఇలా పట్టించుకోకపోవడం ద్వారా  కొలికిపూడిపై వేటు తప్పదని చంద్ర బాబు పరోక్షంగా హెచ్చరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 కంచగచ్చిబౌలి భూములపై బాలివుడ్ నటుడు జాన్ అబ్రహం స్పందన 

హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమి దేశ వ్యాప్త  చర్చనీయమైంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వివాదంపై స్పందించింది. చెట్లను కొట్టివేయడాన్ని తప్పు పట్టింది. చట్టపరంగా ఈ భూమి తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇక్కడ వన్య ప్రాణులైన పులులు, సింహాలు లేవని ప్రతిపక్ష గుంటనక్కలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణుదేశాయ్ మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం వదిలేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. రేణుదేశాయ్ తో పాటు మరికొందరు టాలివుడ్ నటులు స్పందించారు. తాజాగా బాలివుడ్ నటుడు జాన్ అబ్రహం స్పందించారు. 400 ఎకరాల్లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి బాసటగా నిలిచారు. ఇక్కడ డెవలప్ మెంట్ నిలిపివేయాలని  ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు.  చెట్లను నరికివేసే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని జాన్ అబ్రహం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఎక్స్ లో చేతులు జోడించి ఎమోజీ పోస్ట్ చేశారు. 

కేతిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. చెరువు భూమి ఆక్రమణపై నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువతీరిన తరువాత వైసీపీ హయాంలో ఇష్టారీతిగా చెలరేగిపోయిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ వరుసగా కేసుల్లోనూ, భూవివాదాల్లోనూ ఇరుక్కొంటున్నారు. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు అధికారలు సిద్థమయ్యారు. చెరువులు ఆక్రమించి గుర్రాట కోట నిర్మించి తోట సాగు చేస్తున్నట్లు కేతిరెడ్డిపై గతంలో ఆరోపణలు వచ్చాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్మవరం శక్తివడియార్ చెరువును చెరపట్టిన కేతిరెడ్డి అక్రమాల నిగ్గును తేలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పడు అధికారులు కేతిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగానే  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారు. ఆక్రమించిన చెరువు  వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు కేతిరెడ్డికి  నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో చెరువు భూములను కేతిరెడ్డి ఆక్రమించి బినామీలుగా బంధువులు, అనుచరుల పేర్లతో రికార్డులు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మవరం మండలంలోని శక్తివడియార్ చెరువు, దాని పరీవాహక ప్రాంత భూమికి సంబంధించి దశాబ్దాలనాటి రికార్డులను అధికారులు బయటకు తీస్తున్నారు.  చెరువు భూమి, అక్రమ నిర్మాణాలను నిగ్గు తేల్చడానికి రెవెన్యూ, చిన్ననీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూములను బినామీ పేర్లతో రికార్డులు సృష్టించిన వైనంపై రికార్డులు వెలికితీసిన అధికారులు, బినామీదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులు ఆక్రమిస్తున్నారని గత వైఎస్సార్సీపీలో ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం మారగానే చెరువును ఆక్రమించారంటూ నోటీసులిచ్చారు. చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్​లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి, తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమిత భూమి వివరాలను సమగ్రంగా నోటీసులో చూపుతూ 20.61 ఎకరాల భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. నోటీసులు నేరుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు. అయితే ఆ సమయంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి ఇంట్లో లేకపోవడంతో, వెంకట్రామిరెడ్డి పీఏ ముకేష్ నోటీసులు తీసుకున్నారు. చెరువుతో పాటు చుట్టూ పరీవాహక ప్రాంతంలోని నీటిపారుదలశాఖతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నోటీసులో చూపించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెరువును ఆక్రమించారని గతంలో జంగా రమేష్ అనే సామాజిక వేత్త అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా అప్పటి వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు.  అధికారుల అవినీతిని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆక్రమణలను ఎండగడుతూ రమేష్ హరిత ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. హరిత ట్రైబ్యునల్​లో కేసు విషయాన్ని కూడా తహసీల్దార్ నోటీసులో పేర్కొన్నారు. గుర్రాలకోటను బద్దలు కొట్టి, భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. 

ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవండి.. మావోలకు కేంద్ర హోంమంత్రి పిలుపు

వరుస ఎన్ కౌంటర్లతో  ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన తీసుకువచ్చిన వేళ.. అమిత్ షా వారికి ఓ పిలుపునిచ్చారు. అయితే శాంతి చర్చలు కాదనీ, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కి రావాలని కేంద్ర హోంమత్రి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి జనజీనవ స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులందరికీ పునరావాసం కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్న హామీ ఇచ్చారు. ఒక వైపు ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుండగా.. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదన చేయడం, అందుకు ప్రతిగా జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు నివ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నారు. నక్సల్స్ ముక్త భారత్ లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే వందలాది మంది నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో హతమైన సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా దాదాపు 86 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయిన ఘటన తెలంగాణలో జరిగింది.  భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు శనివారం (ఏప్రిల్ 5) లొంగిపోయారు.  వీరంతా బీజాపూర్, సుక్మ జిల్లా సభ్యులుగా గుర్తించారు.  ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పలు వురు పోలీస్ అధికారులు ఉన్నారు. 

 పాస్టర్ ప్రవీణ్ అనుమానా స్పద మృతి...  మాజీ ఎంపి హర్షకుమార్ పై కేసు 

గత నెల చివరి వారంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే.    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే  దర్యాప్తు దశలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే ప్రకటనలు ఒక్కోసారి దర్యాప్తు పక్కదారి పట్టిస్తాయి. కాంగ్రెస్ మాజీ ఎంపి హర్షకుమార్  కూడా దర్యాప్తు పక్కదారి పట్టే ప్రకటనలు చేశారు. పాస్టర్  పగడాల ను ఎవరో చంపి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారన్నారు. పైగా తన వద్ద బలమైన ఆధారాలున్నాయన్నారు. ఆధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు అధికారికి ఆ అధారాలను సబ్మిట్ చేయకుండా ఆలస్యం చేయడం నేరం.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కోణంలోనే హర్షకుమార్ ప్రకటనను చూస్తుంది. ఇప్పటికే నోరు జారిన హర్షకుమార్ పై పోలీసులు బిఎన్ ఎస్ 196, 197  సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఆధారాలతో విచారణకు హాజరుకావాలని  హర్షకుమార్ కు నోటీసులు జారి చేశారు

అమరావతిలో లులూ ప్రతినిథుల పర్యటన.. ఎందుకో తెలుసా?

ఒక్క‌చాన్స్ ప్లీజ్  అంటూ ప్రజలను వేడుకుని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించాడు. ఆయన ఐదేళ్ల పాలనలో  క‌క్ష‌పూరిత రాజ‌కీయాలతో ప్రత్యర్థి పార్టీల నేతలనే కాకుండా సామాన్య ప్రజలను కూడా వేధింపులకు గురి చేశారు.  అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను తన విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దణ్ణం పెట్టి మరీ తరలిపోయేలా చేశారు. అలా జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి, ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ప్రఖాతి చెందిన లూలూ సహా పలు పరిశ్రమలు జగన్ విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలివెళ్లిపోయాయి. అమరరాజా బ్యాటరీస్ కూడా తెలంగాణకు తరలిపోయింది. కొత్త పరిశ్రమల సంగతి అలా ఉంచితే ఉన్న పరిశ్రమలనే తరిమేసేలా జగన్ ఫారిశ్రామిక విధానం ఉంది. దీంతో జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం  పూర్తిగా పడకేసింది. కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉన్నవి మిగలలేదు అన్నట్లుగా అప్పటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే జగన్ సర్కార్ పతనమై నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిందో అప్పటి నుంచీ రాష్ట్ర పారిశ్రామిక రంగం పూర్వ వైభవం సంతరించుకునే దిశగా పరుగులు పెడుతోంది.  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ కు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత రాష్ట్యరానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దిగ్గజ సంస్థల దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.   అంతే కాకుండా  గతంలో జగన్ దాష్టీకం, అస్తవ్యస్థ, అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పు కోవలసినది లూలూ గ్రూప్ గురించి. హైపర్ మార్కెట్లు, మల్టిప్లెక్సల నిర్మాణం, నిర్వహణల్లో ప్రపంచంలోనే పెరెన్నిక గన్న లూలూ గ్రుప్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మళ్లీ ఏపీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే విశాఖలో దాదాపు 1500 కోట్ల పెట్టుబడులతో విశాఖలో ఓ మాల్, కన్వెన్షన్ సెంటన్ ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అదే సంస్థ ప్రతినిథులు శుక్రవారం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించారు. వీరి పర్యటనలో అడుగడుగునా సీఆర్డీయే అధికారులు దగ్గరుండి మరీ వారిని గైడ్ చేశారు. ఇప్పుడు లూలూ సంస్థ ప్రతినిథుల అమరావతి పర్యటనే టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ఒక్క విశాఖలోనే కాకుండా అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు లూలూ ఆసక్తి చూపుతోందనీ, అందుకోసమే ఆ సంస్థ ప్రతినిథులు అమరావతిలో పర్యటించారనీ అంటున్నారు. లూలూ ప్రతినిథులు తమ పర్యటలో అమరావతి భవిష్యత్ లో ఎలా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఏ నిర్మాణాలు జరగనున్నాయి, నవనగరాల రూపురేకలు ఎలా ఉంటాయి వంటి వివరాలను ఆరా తీసినట్లు చెబుతున్నారు.   విశాఖలో లాగే అమరావతిలోనూ ఆ సంస్థ రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

నియోజకవర్గానిక ఒక మల్టీ స్పెషాలిటీస్ ఆసుపత్రి.. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్లో  ప్రతి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కనీసం వంద నుంచి 300 పడకలతో ఆ మల్టీ స్పెషాలిటీస్ ఆస్పత్రి ఉండాలన్నారు. వీటి నిర్మాణం త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖపై సచివాలయంలో శుక్రవారం (ఏప్రిల్ 4) నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 70  మల్టీ స్పెషాలిటీస్ ఆస్పత్రులు ఉన్నాయనీ, మరో 105 నియోజకవర్గాలలో వాటిని ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు.  ఈ ఆస్పత్రుల నిర్మాణం పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో జరిగేలా ఆలోచన చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి అందుకోసం ముందుకు వచ్చే సంస్థలకు పరిశ్రమలకు ఇచ్చినట్లుగానే సబ్సిడీ ఇచ్చే విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్యసేవలను మరింత విస్తృత పరచాలని చెప్పారు.అదే విధంగా  అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రపంచ దేశాలకు వైద్య డెస్టినేషన్ అమరావతి అయ్యేలా మెడిసిటీ ప్రాజెక్టు ఉండలని చంద్రబాబు చెప్పారు.  తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతా రంగాలు విద్య, వైద్యమేనని స్పష్టం చేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలని అన్నారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత వైద్యసేవలు అందించే పరిస్థితి నుంచి.. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.  

 నడుస్తున్న భోగిలో రేప్ ,  సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణ...  సికింద్రాబాద్ లో అరెస్ట్

నడుస్తున్న రైలులో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది.  సంబల్ పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రక్సౌల్ ఎక్స్ ప్రెస్   ఈ దారుణం చోటు చేసుకుంది. కుటుంబంతో కల్సి వస్తున్న ఆ బాలిక తనను విధి కాటేస్తుందని ఊహించలేకపోయింది. హార్రర్ సినిమాలను తలపించే ఈ సంఘటన అనేక ప్రశ్నలు తలెత్తేలా చేసింది. మరి కొద్ది సేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని బాలిక కుటుంబం భావించింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు కెల్తార్  రైల్వే స్టేషన్ సమీపంలో  ఉండగానే బాలిక కాల కృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. తెల్లవారు జామున తోటి ప్రయాణికులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బాలిక కుటుంబ సభ్యులు కూడా నిద్రలో జారుకోవడాన్ని నిందితుడు సంతోష్ కుమార్ (21) పసిగట్టాడు. నిందితుడు బీహార్ మంద్వాడ్ జిల్లాలో రైలెక్కాడు. అప్పటివరకు ఈ కుటుంబ సభ్యులతో మాటా మాటా కలపడంతో బాలిక కూడా ప్రమాదాన్ని ఊభించలేకపోయింది.  బాలిక టాయ్ లెట్ కు వెళ్లగానే వెంబడించి అదే టాయ్ లెట్ డోర్ వేసేసాడు.   బాలిక అరుస్తున్నప్పటికీ కేకలు భోగీలో వినిపించలేదు. బలవంతంగా రేప్ చేసిన యువకుడు ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించి వదిలేసాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే 139 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో రైల్వే పోలీసులు చేరుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్స్ కేసు నమోదైంది.అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినప్పుడు  నేరస్తులకు శిక్షలు కఠినంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో పోక్సో చట్టాన్ని పాలకులు తీసుకువచ్చారు అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ నేరాలు చేసే వాళ్లు నేరాల తీరు మార్చుకుంటున్నారే గానీ నేరాలను నియంత్రించుకోలేకపోతున్నారు. చట్టాలలో ఉన్న లొసుగులు వారికి వరప్రదాయిని అవుతుంది. పిల్లల పెంపకంలో కూడా లోపాలు వారిని సమాజంలో నేరస్థులుగా నిలబెడుతున్నాయి. దిశ, నిర్బయ, పోక్స్ చట్టాలు వారిలో మార్పు తేలేకపోతున్నాయి. నేరాల శాతం తగ్గుతున్నా నేరాలను అరికట్టడంలో చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా విఫలం అవుతున్నారు