అధికార విపక్షాలకు వక్ఫ్ పరీక్ష !

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో  అంటే ఏప్రిల్ 4 తో ఈ సమావేశాలు ముగుస్తాయి. అయితే,ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు  అయితే ఈ చివరి నాలుగు రోజుల కథ మరొక ఎత్తు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును  ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా  కూటమి నాయకులు  వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు  విషయంలో పట్టు బిగిస్తున్నారు. ఇంతదాక ఒక లెక్క ఇక పై మరో లెక్క అంటున్నారు. ఒకరు గెలుస్తాం అంటుంటే  మరొకరు అదే జరిగితే అల్లకల్లోలమే అని హెచ్చరిస్తున్నారు.  నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు నుంచీ వివాదాస్పద వక్ఫ్‌ సవరణ బిల్లు అంశం  రాజకీయ వర్గాల్లో, రాజకీయ చర్చల్లో రగులుతూనే వుంది. ఎంఐఎం సహా అనేక ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలు వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.  మరోవంక  ఎన్డీఎ ప్రభుత్వం, తగ్గేదే లే అంటోంది. పద్దతిగా  పనిచేసుకు పోతోంది. గతంలో విపక్షాల డిమాండ్ చేసిన విధంగా  వక్ఫ్‌ సవరణ బిల్లు పై ఏర్పాటు చేసి  జేపీసీ ఇచ్చిన నివేదికను  సవరణలతోసహ  కేంద్ర మంత్రి వర్గం  ఫిబ్రవరిలో ఆమోదించింది. అప్పుడే  బడ్జెట్ సమావేశాల్లో  వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశ పెట్టాలనే నిర్ణయం జరిగిపోయింది. మరో వంక ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత షా, గత శుక్రవారం  ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశ పెడుతుందని  స్పష్టం చేశారు.   ఈ నేపథ్యంలో ఇప్పడు దేశ  రాజకీయ, మీడియాలో  సవరణ బిల్లుకు ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్డీఎ భాగస్వామ్య  పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు  సామాన్య జనంలోనూ ఉత్కంఠ వ్యకమవుతోంది. ఆసక్తికర చర్చ జరుగుతోంది. వక్ఫ్ బిల్లును ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయు), జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్),లోక్ జనశక్తి(ఎల్జీపీ) రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది ఆసక్తి కరంగా మారింది.  ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు జరగనున్న బీహార్ లో ముస్లిం సమాజం నుంచి ముఖ్యమంత్రి నితీష్ కుమార్  పై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్  ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించడంద్వారా ప్రధాన ముస్లిం సంస్థలు జేడీయు పట్ల తమ అసంతృప్తి స్పష్టంగా వ్యక్తం చేశాయి. ఒక విధంగా చూస్తే  ఇఫ్తార్ విందును బహిష్కరించడం ద్వారా ముస్లిం సంస్థలు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అటో ఇటో తెల్చుకోమని  అల్టిమేటం ఇచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే ముస్లిం సంస్థలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిం చట్ట సవరణకు ఒప్పించినట్లు  జేడీయు వర్గాలు చెపుతున్నాయి. తాజాగా  ఆదివారం (మార్చి 30) న రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంమక్షంలో  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయనని, ఎన్డీఎ, మోదీ  చేయి’ వదలనని, చేతిలో చెయ్యేసి చెప్పినట్లు  చెప్పినట్లు వార్తలొచ్చాయి. అలాగే  ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని  గట్టి హామీ ఇచ్చారు. మిగిలిన ఎన్డీఎ భాగసామ్య పక్షాలు బిల్లుకు మద్దతు తెలిపే విషయంలో కొంచెం అటూ ఇటుగా ఉన్నా, బిల్లును వ్యతిరేకించక పోవచ్చునని అంటున్నారు.  అయితే, అంత మాత్రం చేత ఎన్డీఎలో అంతా బాగుందని కాదు కానీ బిల్లు గట్టెక్కుతుందని బీజేపీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. మరో వంక  ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కూడా అటూ ఇటూ తేల్చుకోలేకుండానే  ఉన్నాయని అంటున్నారు. నిజానికి  ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనూ వక్ఫ్  బిల్లు విషయంలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు. అందుకే  ఇండియా కూటమి పార్టీలు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఇటు అధికార ఎన్డీఎ కూటమికి అటు విపక్ష ఇండియా కూటమికి వక్ఫ్ బిల్లు పే..ద్ద.. పరీక్ష.. అంటున్నారు.

ఏఐజీ ఆస్పత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్

మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 26న తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని సోమవారం (మార్చి 31)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ హెల్త్ బులిటిన్ మేరకు కొడాలి నానికి హార్ట్ లో మూడు బ్లాక్స్ ఉన్నాయి. ఆయనకు స్టంట్ అమర్చడం కానీ ఆపరేషన్  కానీ చేయాల్సి ఉంది. అయితే కొడాలి నాని కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తీసుకువెళ్లాలని నిర్ణయించుకోవడంతో వారి అభ్యర్థన మేరకు కొడాలి నానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.  కొడాలి నానికి హార్ట్ లో మూడు బ్లాక్ లు పూర్తిగా మూసుకుపోవడంతో ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.  అయితే కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని భావిస్తున్నారు. కొంత కాలం చికిత్స అందించి, ఆ తరువాత అవసరం మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కొడాలి నాని విశ్రాంతి తీసుకోనున్నారు.  

పిఠాపురం వర్మపై వైసీపీ సోషల్ మీడియా పోస్టులు.. ఉన్న కాస్త పరువూ పోతోందంటూ

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తాను పిఠాపురం సీటు త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం పని చేసిన వర్మ.. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచీ ఆయనను అంతా పిఠాపురం వర్మ అనడం మొదలైంది. పవన్ కల్యాణ్ కూడా తన విజయం వెనుక పిఠాపురం వర్మ ఉన్నారంటూ ఎక్ నాలెడ్జ్ చేశారు. అయితే  ఆ తరువాత పరిణామాలు వర్మకు, జనసేనకు మధ్యగ్యాప్ వచ్చేందుకు కారణమయ్యాయి. ఇటీవల జనసేన ఆవిర్భావం సందర్భంగా మెగా బ్రదర్, ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన నాగబాబు చేసిన ఖర్మ వ్యాఖ్యలు ఈ దూరాన్ని మరింత పెంచాయి. అయితే పిఠాపురం వర్మ మాత్రం తాను చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో, వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో పిఠాపురం వర్మ మాత్రం సంయమనాన్నే పాటిస్తున్నారు.   అయితే వర్మ విషయంలో వైసీపీ మాత్రం నానా హంగామా చేస్తున్నది. వర్మకు తామే శ్రేయోభిలాషులం అన్నట్లుగా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నది. ఆయన నోటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా రాకపోయినా... వర్మ వైసీపీ గూటికి చేరనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. వచ్చే ఎన్నికలలో  అంటే 2029లో పవన్ కల్యాణ్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ పోటీ చేస్తారంటూ వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నది.  ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు గట్టి పట్టు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయనను అభిమానించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గతంలో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మది.  ఆ తర్వాత తెలుగుదేశంలో  చేరిన వర్మ… పార్టీకి,  పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పినంతనే… వర్మ పోటీ నుంచి తప్పుకోవడంతో పాటుగా జనసేనానికి మద్దతుగా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి ఆయన విజయంలో  కీలక పాత్ర పోషించారు.  అయితే…పవన్ కోసం తన సీటును త్యాగం చేస్తే,..ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని వర్మకు ఇచ్చిన హామీని చంద్రబాబు అనివార్య కారణాల వల్ల నిలబెట్టుకోలేదు.  దీంతో  వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనీ, ఆయన త్వరలో వైసీపీ గూటికి చేరతారనీ ఆ పార్టీ  సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నది. 2029 ఎన్నికలలో పిఠాపురం వర్మ వైసీపీ అభ్యర్థిగా పవన్ కు ప్రత్యర్థిగా నిలబడతారంటూ ఊదరగొట్టేస్తోంది. అయితే  ఈ ప్రచారంపై వర్మ నుంచి స్పందన లేదు. ఆయన తెలుగుదేశం పట్ల తన విధేయతను పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తన అనుచరులను సముదాయిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టి పని చేసుకుపోతున్నారు. జనసేనతో తనకు విభేదాలు లేవని చాటుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. అనవసర, అసత్య ప్రచారాలతో వైసీపీ ఉన్న కాస్త పరువునూ పోగొట్టుకుంటోందంటూ పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. 

పరారీలో మాజీ మంత్రి కాకాణి?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారా?  అక్రమ మైనింగ్  కేసులో నోటీసులు అందజేయడానికి ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన ఇల్లు తాళం వేసి ఉండటం కనిపించింది. దీంతో ఆయనకు పోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. పోనీ ఆయన పీఏకైనా సమాచారం ఇద్దామని భావించిన పోలీసులకు పీఏ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అని రావడంతో చేసేదేం లేక కాకాణి నివాసానికి నోటీసులు అందించి వెనుదిరిగారు.  దీంతో మాజీ మంత్రి కాకాణి పరారీలో ఉన్నారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఉగాది పర్వదినం రోజున అంటే ఆదివారం (మార్చి 30)న కాకాణి నివాసానికి పోలీసులు వెళ్లారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై కేసు నమోదు కావడంతో పోలీసువిచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసులను అందించడానికి ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం స్వాగతం పలికింది. ఆయన ఫోను, ఆయన పీఏ ఫోను కూడా స్విచ్ఛాఫ్ అయ్యి ఉన్నాయి. దీంతో కాకాణి నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆ నోటీసుల మేరకు అక్రమ మైనింగ్ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు కాకాణి హాజరుకావాల్సి ఉంది. మరి నోటీసులు తీసుకునేందుకే వెనుకాడిన కాకాణి.. సోమవారం విచారణకు హాజరవుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే కాకాణి గంభీరంగా కేసులకు భయపడేది లేదంటూ ప్రకటనలు గుప్పించారు. ఇప్పుడు ఆయన నోటీసులు అందుకోవడానికే వెనకాడి అజ్ణాతంలోకి వెళ్లిపోవడంతో నెటిజనులు ఆయనపై సెటైర్లు గుప్పిస్తున్నారు. కేసులకు కాకాణి భయపడరు.. కానీ నోటీసులు అందుకోవడానికి మాత్రం వణికి పోతారు. పరారైపోతారు అంటూ ఎగతాళి చేస్తున్నారు.   కాకాణి సోమవారం (మార్చి 31) విచారణకు గైర్హాజరైతే.. ఆయన పరారీలో ఉన్నట్లు భావించి గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.   ఇంతకీ కాకాణిపై కేసు ఏమిటంటే.. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని మైన్స్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాలో క్వార్ట్జ్‌ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి రుస్తుం మైన్స్‌ లీజు గడువు ముగిసి పోయిన తరువాత  సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారన్న ఆరోపణలున్నాయి. మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.  తాజాగా ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ4గా చేర్చడంతో పాటు మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో  వైసీపీ తరఫున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డిని ఏ1గా,  వైసీపీ నేత వాకాటి శివారెడ్డినిఏ2గా, మరో నాయకుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డిని ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే కేసులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఇద్దరు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఈ కేసులో ఏ1 నుంచి ఏ4 వరకూ అందరినీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాకాణి పరారీ అయ్యారని అంటున్నారు.  

 మావోయిస్టులకు కోలుకోని దెబ్బ...బీజాపూర్ లో లొంగిపోయిన 50 మంది మావోలు

చత్తీస్ గడ్ లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఏకంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  ఈ విషయాన్ని  బీజాపూర్ ఎస్ పి  జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు. సిఆర్ పిఎప్ అధికారుల ఎదుట లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా బీజాపూర్ లో వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్ పోలీసులు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టారు. లొంగిపోయిన మావోయిస్టులకు పరిహారం ఇస్తామని ఆశచూపారు. ఆదివారం రోజే చెక్కులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. మావోయిస్టులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని  ఇప్పటికే ప్రభుత్వం  ప్రకటించింది.లింగిపోయిన వారిలో 10 మంది మహిళా మావోలున్నారు.  లొంగిపోయిన 14 మంది తలలపై రూ 68 లక్షల రివార్డు ఉంది. తమ ఆయుధాలతో   మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలినట్లయ్యింది. 

 కడపలో వింత ఆచారం.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీగా ముస్లింల పూజలు 

మనదేశం సెక్యులర్ దేశం. హిందువులు ముస్లింలు కల్సి మెల్సి చేసుకునే పండగలు అనేకం. షియాముస్లింలు చేసుకునే పీర్ల పండుగకు హైద్రాబాద్ పాత బస్తీలో ముస్లింలకంటే హిందువులు ఎక్కువ సంఖ్యలో  పార్టిసిపేట్ అవుతుంటారు. ఈ సంవత్సరం ఉగాది మరుసటి రోజే రంజాన్ రావడం విశేషం . కడప జిల్లాలో ఉగాది రోజు జరిగే క్రతువుకు హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ. కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి  దేవాలయంలో ప్రతీ ఏడాది ముస్లింలు పూజలు చేస్తారు. తెల్లారితే రంజాన్ ఉన్నప్పటికీ పూజలు చేసే ముస్లింల సంఖ్య ఏం తగ్గలేదు. భారీగా ముస్లింలు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.  పురాణ ఇతిహాసాల ప్రకారం బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకున్నాడు. బీబీనాంచారమ్మ తమ ఇంటి ఆడపడుచు. శ్రీ వెంకటేశ్వరస్వామి తమ ఇంటి అల్లుడు. అని ముస్లింల నమ్మిక. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతుంది. 

శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మ హత్య 

పండుగ పూట  శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విషాదం  చోటు చేసుకుంది.   ఆర్థిక బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. బంగారం దుకాణం యజమాని కృష్ణ చారి భార్య సరళ, కుమారులు సంతోష్, భువనేశ్ లు  ఆదివారం ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు స్థానికులు మొదటి  గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  పెద్ద కుమారుడు సంతోష్ పదో తరతి పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేశ్ తొమ్మిదో తరగతి చువుతున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ఉగాది రోజు  రూ  38 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు 

ఉగాది పర్వ దినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు  తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. పండుగ పూట చేసిన తొలిసంతకం వల్ల 3,456 మంది కుటుంబాల్లో ఆనందం నింపింది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఈ కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రూ 38 కోట్లను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఈ కుటుంబాలకు లబ్ది చేకూరవిధంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు 23, 418 మంది పేద కుటుంబాలను ఆదుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పేదల వైద్యం కోసం రూ, 281. 38 కోట్లు రిలీజ్ చేసినట్టు పేర్కొంది.   

ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అంధాకారం:  ఉగాది వేడుకల్లో చంద్రబాబు

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దశ దిశ లేకుండా పోయిందని, రాష్ట్రం కళ తప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకని విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో కూటమి ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ వే డుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కూటమి అధికారంలో రాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు. సంక్షేమవ, అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కోటి విప్పాల్సివస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అవసరం ఏర్పడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ఐటికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ రోజు ఐటి అవసరం లేదని చాలామంది విమర్శించి చివరకు ఐటి మాత్రమే దిక్కయ్యిందని చంద్రబాబు అన్నారు. సెల్ ఫోన్ తిండిపెడుతుందా అని వ్యాఖ్యానించిన నేతల వద్ద ప్రస్తుతం సమాధానం లేకుండా పోయిందన్నారు. వర్క్ ఫ్రం హోం సంస్కృతి పెరగడానికి ఐటీ విప్లవమేనన్నారు. కూటమి ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిట్లో తేవడానికి వాట్స ప్ గవర్నెన్న్ తీసుకొచ్చినట్లు చెప్పారు. వివిధ సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సెకన్ల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికేట్లను సెల్ ఫోన్ ద్వారా తీసుకునే వెసులు బాటు కల్పించినట్లు చంద్రబాబు చెప్పారు.  పేదరిక నిర్మూలనకు మార్గదర్శి బంగారు  కుటుంబం, పీ 4 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  పేదరికం లేని సమాజం చూసినప్పుడే తన జన్మ  చరితార్థమవుతుందని చంద్రబాబు అన్నారు

తిరుమలలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం

విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్నిపురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో విశేష పూజలు, కార్యక్రమాలను నిర్వహించడానికి టీటీడీ సమాయత్తమైంది.  ఉగాది ఆస్థానం, ఉగాది కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టా గోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనుంది. శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జ‌రిగింది. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఈ ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, ఉగాధి అస్దానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.  ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం కార్యక్రమం ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది.  కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (మార్చి 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నభక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (మార్చి 29) శ్రీవారిని మొత్తం 76 వేల 5 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 686 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80లక్షల రూపాయలు వచ్చింది.    తెల్లవారు జామునుంచే భక్తులు బారులు తీరి నిల్చున్నారు. 

బస్టాండ్‌లు ఎత్తుకెళ్తున్న బాహుబలులు

శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు.. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చాడు.. ఇవన్నీ పురణాల్లో విన్నాం.. అయితే బెంగళూరులో దొంగలు బాహుబలి అవతారమెత్తి బస్టాండ్‌లకు బస్టాండులనే ఎత్తుకుని పోతున్నారంట. సిలికాన్ సిటీ  బెంగళూరులో ఆ విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ జనాలతో  రద్దీ ఉండే ఓ బస్టాప్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. హఠాత్తుగా  ఇలాంటి విచిత్రమైన ఘటన జరగడంతో రోజూ అక్కడొచ్చి బస్సెక్కే  ప్రయాణీకులు ఆశ్చర్యపోతున్నారు. రోడ్డుపై బస్టాండ్ కనిపించకుండా  పోయిందని తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఇందుకు కారణమేంటో తెలియక  భయాందోళనలతోఉక్కిరిబిక్కి రవుతున్నారు. ఎందుకంటే కేవలం ఒక్క  బస్టాప్ మాత్రమే కాదు. సిటీలో చాలాచోట్ల బస్టాండ్లు ఒకదాని తర్వాత  మరొకటి మాయమైపోతున్నాయి మరి. చాలా ప్రాంతాల్లోలాగే బెంగళూరు  కూడా బైక్‌ దొంగతనాలు, పిక్ పాకెటింగ్, ఇళ్లలో దొంగతనాలు  సర్వసాధారణంగా జరుగుతుంటారు. కానీ, ఇప్పుడా జాబితాలోకి  బెంగళూరులోని బీఎంటీసీ బస్ స్టాప్ కూడా చేరింది. విచిత్రంగా బస్టాండ్లపై  కన్నేసారు బెంగళూరు దొంగలు. బీబీఎంపీ నిర్మించిన అనేక బస్ షెల్టర్లను  ఒకటొకటిగా లేపేస్తున్నారు. ఆ బహుబళులు. నిత్యం జనాలతో నిండి ఉండే  ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చోటు చేసుకోవడమే అందరినీ దిగ్భ్రాంతికి  గురిచేస్తోంది. ఈ వరస బస్టాప్ దొంగతనాలపై కార్పొరేషన్ చీఫ్ కమిషనర్  తుషార్ గిరినాథ్‌కు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్‌కు  ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన బస్ షెల్టర్ల విషయమై త్వరగా దర్యాప్తు  చేయాలని కోరారు.  విజయనగరంలోని గోవిందరాజనగర్ వార్డులో అనేక బస్  స్టాప్‌లు అదృశ్యమయ్యాయి. లేఅవుట్ లోని 14వ కూడలిలో సర్వజ్ఞ స్కూల్  ముందు ఉండే బస్ షెల్టర్ కూడా మాయమైంది. ఈ బస్ షెల్టర్‌ను ఐదు  సంవత్సరాల క్రితం రూ.16 లక్షల రూపాయల ఖర్చు చేసి నిర్మించారు. నగరంలో నిర్మించిన మొట్టమొదటి హైటెక్ బస్ షెల్టర్‌గా కూడా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ స్టేషన్ గుండా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతాయి. ఎప్పుడు ప్రయాణీకులతో రద్దీగా ఈ బస్టాప్ దాదాపు నెల రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైంది. విలువైన కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్, ఇనుప వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అదేవిధంగా, ఆదిచుంచనగిరి ఆట స్థలం సమీపంలోని మరో రెండు బస్ షెల్టర్లు కూడా కనిపించకుండా పోయాయి. బస్టాండ్లు లేకపోవడంతో ప్రయాణీకులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలబడుతూ తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది పాపం.

ఒకే కానుపులో నలుగురు పిల్లలు.. కంటికి రెప్పల్లా కాపాడిన నీలోఫర్ వైద్యులు

కేవలం హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ, ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో  ఏ పసిపాపకు ఆరోగ్యం బాగా లేకపోయినా.. ఆ పాప తల్లిదండ్రులకు  వెంటనే గుర్తొచ్చే హాస్పిటల్ నీలోఫర్.  ఆస్ప‌త్రులు దేవాల‌యాలు, డాక్ట‌ర్లు దేవుళ్లు అన్న ప్రజల విశ్వాసం ఇటీవలి కాలంలో సన్నిగిల్లుతోంది. ధనార్జనే ధ్యేయంగా రకరకాల పరీక్షలు అంటూ ప్రజల జేబులు కొల్లగొడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు, నిర్లక్ష్యం నీడన వైద్యం కోసం వచ్చే వారి పట్ల ఆమానుషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాస్పత్రుల కారణంగా ఆస్పత్రులను దేవాలయాలుగా, వైద్యులను దేవుళ్లుగా భావించే పరిస్థితి క్రమంగా తగ్గిపోతున్నది. అయితే ప్రజలలో ఆస్పత్రుల పట్ల, వద్యుల పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. తల్లీ బిడ్డల ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 1953లో ఏర్పాటైన నీలో ఫర్ ఆస్పత్రి అప్పటి నుంచీ ఆదే ఆశయం, స్ఫూర్తితో పని చేస్తున్నది. తాజాగా హైదరాబాద్‌లోని హస్తినాపూర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో నీలోఫర్ ఆస్పత్రికి గత 22న  వచ్చింది. ఏడున్నర నెలల గర్భధారణ సమయంలో అకాల ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఆమెకు ఆదే రోజు అక్కడి వైద్యులు సిజేరియన్ ద్వారా కనుపు చేశారు నీలోఫర్ వైద్యులు. ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఇద్దరు ఆడశిశువులు కాగా ఇద్దరు మగశిశువులు. దీనిని క్వాడ్రాపుల్ ప్రెగ్నెన్సీ అంటారు.  ఆమెకు జన్మించిన పిల్లల బరువు తక్కువగా ఉన్నారు. అకాల ప్రసవం కారణంగా ఆ శిశువులకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వెంటిలేటర్ పై ఉంచాల్సిన పరిస్థితి. నీలోపర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, నియోనాటాలజీ విభాగం చీఫ్ ల పర్యవేక్షణలో ఆ నలుగురు శిశువులనూ ఆస్పత్రిలోని ఎన్ఐసీయూలో చేర్చి వైద్య సేవలు అందించారు.  దాదాపు పది రోజుల పాటు వారిని మెకానిక్ వెంటిలేటర్ లో ఉంచారు. మొదటిలో నలుగురు శిశువులకూ తల్లి పాలు సరిపోయేవి కాదు. దీంతో ఆస్పత్రిలోని హ్యూమన్ బిల్క్ బ్యాంక్ సహాయంతో పిల్లలకు పాలు అందించారు. రోజులు గడిచే కొద్దీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో వారిని ఎన్ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు. పిల్లల బరువు కూడా పెరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులూ తగ్గాయి.   సెప్సిస్, కామెర్లు, అప్నియా, ఆర్‌ఓపి వంటి సమస్యలతో బాధపడిన ఆ నవజాత శిశువులను వైద్యులు కంటికి రెప్పల్లా కాపాడారు. వారిలో ఒక శిశువు కంటికి ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇలా అన్ని సమస్యలనూ ఒక్కటొక్కటిగా అధిగమించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచారు. దాదాపు నెల రోజులపైన ఆస్పత్రిలో ఆ శిశువులకు వైద్య సేవలు అందించిన తరువాత శనివారం (మార్చి 29) డిశ్చార్జ్ చేశారు. ఇప్పటికీ పిల్లలు కొంత తక్కువ బరువుతోనే ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఇబ్బందులేవీ లేవని వైద్యులు చెప్పారు. ఇప్పుడు నలుగురు శిశువులకూ తల్లి పాలు అందుతున్నాయనీ తల్లీ, నలుగురు పిల్లలూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని నిర్ధారించుకున్న తరువాతే డిశ్చార్జ్ చేశామని నీలోఫర్ వైద్యులు తెలిపారు.   

మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏప్రిల్ 3 ముహూర్తం  అని కూడా ప్రచారం జరిగింది. అలాగే  కొత్త మంత్రులు వీరే అంటూ నాలుగు పేర్లు, నాలుగు ముఖాలు తెరపైకి వచ్చాయి.  అయితే  రోజు రోజుకూ సీన్ మారుతున్న సంకేతాలు వస్తున్నాయి. నిజానికి, ఓ వంక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను రాత్రికి రాత్రి ఢిల్లీ పిలిపించుకుని మరీ మంత్రివర్గ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది అన్న అనుమానాలు  వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ కాదు  మరేదో  ఉందనే  కథనాలూ వచ్చాయి. అయితే  ఆ అనుమానాలు అంతగా నిలవలేదు.  అయితే ఈ ఐదారు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ స్వరూప స్వభావాలు మెల్ల మెల్లగా మారుతూ వస్తున్నాయి. నిజానికి  రేపు  ఎప్పుడైనా  జరిగేది  కేవలం మంత్రి వర్గ విస్తరణ మాత్రమే కాదు. మంత్రి వర్గంలో ఉన్న ఖాళీలను నింపే క్రతువు మాత్రమే కాదు, మంత్రి వర్గంలో  భారీగానే   మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అవును జరిగేది, మంత్రి వర్గ విస్తరణ కాదు,   మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ అంటున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం  ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అనే నిర్ణయానికి వచ్చిందని కాంగ్రస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, దీర్ఘకాల ప్రణాళికతో దేశ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించిన రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని  తెలంగాణను రోల్ మోడల్ గా చూపించాలని రాహుల్ సంకల్పించారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చి పట్టుమని పదిహేను నెలలు అయినా  కాకముందే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతున్నట్లు వస్తున్న వార్తల విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉందని అంటున్నారు. అందుకే  మంత్రి వర్గం సర్జరీ కి సిద్దమయినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒక విధంగా, డిఫరెంట్ సోర్సెస్  నుంచి సేకరించిన   గ్రౌండ్  రిపోర్ట్స్ ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు  చేపట్టేదుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తే చేసినట్లు చెపుతున్నారు.  అంతే కాదు  మార్చి 24న ఢిల్లీలో జరిగిన చర్చల్లోనే, మంత్రి వర్గ పని తీరును సమీక్షించినట్లు చెపుతున్నారు. కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య సరైన సమన్వయం లేక పోవడంతో ఈ శాఖల్లో మార్పులు తప్పవని  కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి  అన్నిటికంటే ముఖ్యంగా మంత్రివర్గంలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో కొందరు మంత్రుల శాఖలు మార్చడంతో పాటుగా  అవసరమైతే ఉద్వాసనలు వెనకాడరాదనే నిర్ణయానికి అదిస్థానం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.  అదొకటి అలా ఉంటే, మూడవ తేదీ ముహూర్తం విషయంలోనూ ఇంకా పూర్తి స్పష్టత రాలేదని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీకి దగ్గరైన రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు కీలక మార్పుల విషయంలో  తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, అధిష్టానం పునారలోచనలో పడిందని అంటున్నారు. ఈ సందర్భంగా సదరు సీనియర్ నాయకుడు గతంలో ఫిర్యాదుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన విషయాన్నీ గుర్తు చేసిన మీదట, మరో సారి రాష్ట్ర నాయకులతో మరింత లోతుగా చర్చించిన తర్వాతనే  ముహూర్తం ఖరారు  చేయాలనే ఆలోచనకు అధిష్టానం వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే, మూడవ తేదీ ముహూర్తం మిస్సయ్యే అవకాశం లేక పోలేదని అంటున్నారు.ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసీసీ  రెండు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాతనే, ముహూర్తం ఖరారు అవుతుందని అంటున్నారు.

కొలికపూడి యాక్షన్ ఓవర్ అయ్యిందా?

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు. ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారింది. ఆ గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్.  గంటల్లో రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని  అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ  అధిష్ఠానానికి 48 గంటల డెడ్‌లైన్‌ విధిస్తూ అల్టిమేటం జారీ చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల దుమారం కాక రేపింది.  కొలికపూడి యాక్షన్‌పై అధిష్ఠానం వెంటనే రియాక్ట్‌ అయ్యింది. టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ను రంగంలోకి దింపిన రాష్ట్ర నాయకత్వం వెంటనే నివేదిక కోరింది. ఏఎంసీ మాజీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డిపై ఆరోపణలు, ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలపై ఆయన వివరాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక పంపారు. అంతేకాదు.. రాష్ట్ర కార్యాలయం నుంచి తిరువూరు నాయకులకు ఫోన్లు వస్తుండటంతో ఇక్కడి రాజకీయంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ టీడీపీలో హీట్ పుట్టిస్తోంది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే  రాజీనామా చేస్తానని రెండు రోజుల క్రితం కొలికపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలతో కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఐవిఆర్ఎస్, ముగ్గురు సభ్యులతో కూడిన నివేదికను అధిష్టానం తెప్పించుకుందంట. తిరువూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు .. రెండు సార్లు ఎమ్మెల్యేగా  పనిచేశారు.. స్వామిదాసు గత ఎన్నికల ముందు కేశినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్ధి కరువయ్యారు. దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీమ్‌ని ఓడించడానికి కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. కొలికిపూడి వాగ్ధాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబునాయుడు అతనికి టికెట్ ఇచ్చారు. కూటమి వేవ్‌లో కొలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు. అమరావతి ఉద్యమ నేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతలా ఆదరిస్తే, గెలిచాక ఆయన తనలోని మరో కోణం చూపిస్తున్నారంట.  తాజాగా కొలికపూడి తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేశినేని చిన్ని అనుచరుడు రమేష్‌రెడ్డిని టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కొలికపూడి వ్యవహారం వైసీపీకి ఆయుధంగా మారుతోంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమిషన్ల పంచాయితీ సాగుతోందని,  వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే పరోక్షంగా చిన్నిని కొలికపూడి టార్గెట్ చేస్తూ,  చిన్ని అనుచరుడైన రమేష్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హడావుడి చేస్తున్నారని వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది.  అదలా ఉంటే టీడీపీ శ్రేణుల్లో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏవో అవసరాల కోసం రమేష్‌రెడ్డిని కొలికపూడి అప్పుగా సాయం చేయమని కోరారంట. అయితే రమేష్‌రెడ్డి రియాక్ట్ అవ్వకపోవడంతో తిరువూరు ఎమ్మెల్యే కోపమొచ్చి కొత్త డ్రామా మొదలుపెట్టారంట. ఈ క్రమంలో టీడీపీలో కొలికిపూడికి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయిందని... ఇక ఆయనకు పార్టీలో సీన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో

నైట్ రైడర్స్ మ్యాచ్‌కి రాములోరి బ్రేక్.. !

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీరాముడు చిన్నబ్రేక్ వేశారు. శ్రీరామనవమి ఎఫెక్ట్‌తో ఒక మ్యాచ్ పోస్టు పోన్ అయింది. ఐపీఎల్ హైటెన్షన్ మ్యాచులతో ఉర్రూత లూగిస్తోంది లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, భారీ స్కోర్లు.. వెరసి అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది. ఈ తరుణంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో సడన్ చేంజెస్ చేసింది బీసీసీఐ. అయితే అదేమంత పెద్ద మార్పు కాదనీ,  కేవలం ఒక మ్యాచ్ విషయంలో మాత్రమే మార్పు చోటుచేసుకుందని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.  ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ మధ్య ఏప్రిల్ 6వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో భారీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సెక్యూరిటీ ఇష్యూస్ తప్పవని, ఫుల్ ప్రొటెక్షన్ కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు కోల్‌కతా పోలీసులు స్పష్టం చేశారు.  ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో చేంజెస్ చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 8వ తేదీన అదే ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 6న డబుల్ హెడర్ స్థానంలో కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో పైఒక్క మ్యాచ్‌లో తప్పితే ఇతర మార్పులేవీ లేవు.

తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు

అన్న నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం నినాదంతో  జన్మించి, విజనరీ నారా చంద్రబాబునాయుడు  చేతుల్లో రూపు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి  43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతిగతి మార్చేసింది. ఎన్టీఆర్ తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగు వారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి  తెలుగుదేశం  చరిత్ర సృష్టించింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎగతాళి మాటలకు ఎన్టీఆర్ గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఏపీలోని 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని తొలిసారే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి చరిత్ర సృష్టించింది. 1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ హవా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టిన  రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పేదవాడి కడుపు నింపుతూ.. అన్ని పార్టీలకూ ఆదర్శ మైంది. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపి, మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన టీడీపీ రాజకీయ ఓనమాలు తెలియని వారిని లీడర్లుగా తయారు చేసి పొలిటికల్ యూనివర్సిటీగా పేరు గాంచింది.  పేద ప్రజల గుండెలలో ఛిర స్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజ పరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ, యుగపురుషుడు నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది ఆయనకు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఇందిరాగాంధీ సాయంతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు తెలుగోడి ఆవేశాన్ని, చైతన్యాన్ని యావత్తు ప్రపంచం చూసింది. అప్పట్లో పార్టీ నేతలను సమన్వయపరుస్తూ, ప్రజాందోళనలతో కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చిన చంద్రబాబునాయుడు తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200కి పైగా స్థానాలతో ఎన్టీఆర్‌ను రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించడంలో సీబీఎన్ కీరోల్ పోషించారు.  1994లో టీడీపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి పెత్తనం కారణంగా పార్టీలో ఎన్టీఆర్ శకం ముగిసి, చంద్రబాబు మార్క్ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం వీపీ సింగ్‌ను ప్రధానిని చేసి కాంగ్రెస్ ఆధిపత్యానకి గండి కొట్టగలిగింది. 1998లో టీడీపీ హయాంలో చంద్రబాబు విజన్‌తో సాంకేతికత పరుగు పెట్టడం ప్రారంభించి, సైబర్ టవర్స్‌తో హైటెక్ సిటీకి అంకురార్పణ జరిగింది. 1999లో టీడీపీ నాలుగోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హైటెక్ స్పీడ్‌తో అభివృద్ధి పరుగులు పెట్టి, చంద్రబాబుకి హైటెక్ సీఎం బ్రాండ్ ఇమేజ్ సాధించిపెట్టింది.  తర్వాత పదేళ్లు టీడీపీ అధికారానికి దూరమవ్వడం, రాష్ట్ర విభజన జరగడం, చంద్రబాబు రెండు ప్రాంతాలు ముఖ్యమేనంటూ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకోవడంతో  తెలుగుదేశం పనైపోయిందని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. అయితే రాజధాని లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కాముకుడు, హైటెక్ దార్శనికుడు చంద్రబాబునే నెత్తినపెట్టుకుని, 2014లో తెలుగదేశానికే అయిదో సారి పట్టం కట్టారు. అటు తెలంగాణలోనూ రాష్ట్ర విభజన తర్వాత 12 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం గెలుచుకున్న టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ప్రస్తుతం ఏపీలో ఆరో సారి రికార్డు మెజార్టీతో గెలిచిన టీడీపీ నుంచి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ , అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కీరోల్ పోషిస్తూ తెలుగువాడి ఆత్మాభిమానాన్ని చాటుతున్నారు.  మొత్తం 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఆరు సార్లు అధికారంలోకి వచ్చి, కేవలం నాలుగు సార్లు మాత్రమే అధికారానికి దూరమైందంటే ఆ పార్టీ ప్రజల మనస్సుల్లో ఎంతగా పాతుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు రెండు తెలుగురాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొని, జై ఎన్టీఆర్, జైజై చంద్రబాబు అన్న నినాదాలు హోరెత్తాయి.

టీటీడీ ట్రస్టులకు 10 రోజుల్లో 30 కోట్ల విరాళాలు

గత పది రోజులలో తిరుమలేశునికి దాదాపు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దాతలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పది ట్రస్టులకు గత పది రోజుల్లో భారీ విరాళాలు అందాయి. వాటిలో శ్రీవేంకటేశ్వర ఆలయ  నిర్మాణం ట్రస్ట్ కు 11 కోట్ల 67 లక్షల 15 వేల 870 రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు. అలాగే అన్నప్రసాదం ట్రస్ట్ కు గత పది రోజులలో దాతలు 8 కోట్ల 14 లక్షల 90 వేల958 రాపాయలు విరాళంగా అందాయి.  ఇక శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని ట్రస్ట్ కు 4 కోట్ల 88 లక్షల 50 వేల 391రూపాయలు,  శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ కు రూ. 1,15,83,653లు దాతల నుంచి విరాళంగా అందాయి. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ 1,14,36,016లు.  శ్రీ వెంకటేశ్వర విద్యా దాన ట్రస్ట్ కు రూ.1,65,85,417లు బర్డ్ ఆసుపత్రి ట్రస్ట్ కు రూ. 54,92,050లు విరాళంగా అందాయి. ఇక  శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్సు ట్రస్ట్ కు రూ. 37,48,526లు, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ, 29,60,968లు స్విమ్స్ ఆసుపత్రి ట్రస్ట్ కు రూ. 2,05,326లను దాతలు విరాళంగా ఇచ్చారు. అదే విధంగా శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్ట్ కు కూడా విరాళాలు అందాయి. మొత్తం పది ట్రస్టులకు కలిపి పది రోజుల వ్యవధిలో 29 కోట్ల, 90 లక్షల, 71 వేల 331రూపాయలు విరాళాల రూపంలో జమ అయ్యాయి.