అధ్యక్ష పదవి నుంచి అన్నామలై ఔట్?

తమిళ నాడులో బీజేపీకి ఒక గుర్తింపు వచ్చిందంటే, అందుకు కారణం ఒకేఒక్కడు. ఆ ఒక్కడు  మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అలాగే  కమల దళానికి రాష్ట్రంలో అంతో ఇంతో రాజకీయ విజయం దక్కిందంటే ఆ క్రెడిట్ కూడా అన్నామలై అకౌంటులోనే చేరుతుంది. అంతే కాదు  సూది మొలంత చోటు లేని రాష్ట్రంలో ఉరూరా కాషాయ జెండా ఎగురుతోందంటే అది కూడా ఆయన ఖాతాలోనే  చేరుతుంది.    అయితే  బీజేపే పెద్దలు దక్షిణాది రాష్ట్రాలలో పొత్తులు లేకుండా పప్పులు ఉండకవనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, ఎఐఎడిఎంకె తో పొత్తు కోసం, అన్నమలై ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చారు. అవును  బీజేపీ నాయకులు కథలు చాలానే చెప్పా వచ్చును కానీ  ఎఐఎడిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి అభీష్టం మేరకే  బీజేపీ పెద్దలు అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలానే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో బీజేపీతో పొత్తును తెంచుకుని వెళ్ళిన ఎఐఎడిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి తిరిగి ఎన్డీఎ గూటికి చేరేందుకు  గత కొంత కాలంగా పావులు కదుపుతున్నారు. రాజకీయ అవసరాలతో పాటుగా ఆయనకు ఇంకేమి  రక్షణలు  అవసరం ఉన్నాయో ఏమో  కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన ఎన్డీఎ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఈనేపధ్యంలో  బీజేపీ అధిష్టానం  పాళని స్వామి కోసం  అన్నామలైపై వేటు వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే  బీజేపీ పెద్దల నిర్ణయం అనూహ్యం అయితే కాదని అంటున్నారు. నిజానికి  గతంలో ఎఐఎడిఎంకె, బీజేపీతో పొత్తును తెంచుకోవడానికి,పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానూ అన్నామలై’ కారణం. ఇదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిన  బహిరంగ రహస్యమే. ప్రధాన ద్రవిడ పార్టీలు డిఎంకె, అన్నా డిఎంకె, రెండూ అవినీతి విషయంలో ఒకే తాను ముక్కలని అన్నామలై అనేక సందర్భాలలో ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పళని స్వామి సహా ఇతర నాయకుల అవినీతి ఫైల్స్ బయట పెట్టారు. అయితే అవసరార్ధం కుదిరే పోత్తులకు అంటూ, సొంటూ ఉండదని  మహరాష్త్రలో అజిత్ పవార్  తో పొత్తు పెట్టుకున్నసందర్భంలోనే స్పష్టం చేసిన  బీజేపీ పెద్దలు తమిళ నాడులో అన్నా డిఎంకె తో  మళ్ళీ పొత్తుకు పచ్చజెండా ఊపారు.    కొత్త పొత్తు చర్చల్లో భాగంగా  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలోనే పళని స్వామి పొత్తుకు అన్నామలై అడ్డవుతారని అనుమానం వ్యక్త పరిచారు. రాష్ట్ర స్థాయిలో ఉభయ పార్టీల మధ్య పొత్తు చర్చలు, సీట్ల సర్దుబాటు తదితర ఉమ్మడి వ్యవహారాలను చర్చించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పళనిస్వామి అమిత్ షాను  కోరినట్లు వార్త లొచ్చాయి. ఈ నేపద్యంలో  అధ్యక్ష పదవి నుంచి అన్నామలై’ తప్పుకోవడం అనూహ్యం కాదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే  అన్నా డిఎంకె తో పొత్తు కారణంగా  కుల సమీకరణలో వచ్చిన మార్పు(పళని స్వామి,అన్నామలై ఇద్దరిది ఒకే కులం) కారణంగా అన్నామలైని  అధ్యక్ష పదవి నుంచి తప్పించడం శిక్షగా భావించరాదని అంటున్నారు. మరో వంక అన్నామలై పొత్తు తనకు ఇష్టం లేదనే విషయాన్ని చెప్పకుండా  పొత్తుకు సంబంధించి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఆనందంగా స్వీకరిస్తానన్నారు. అంతే కాదు సాధారణ కార్యకర్తగా పనిచేయడానికి అయినా సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా, ఎఐఎడిఎంకెతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అనే విషయంలో మాత్రం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. గతంలో వాజపేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటు తేడాతో ఓడించడం మొదలు 2023లో పళని స్వామి పొత్తును ఏక పక్షంగా తెంచుకోవడం వరకు  ఎఐఎడిఎంకె’తో  బీజేపీకి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. అయినా పునరపి జననం పునరపి మరణం అన్నట్లు  రెండు పార్టీల ఎత్తు పొత్తులు  చస్తూ బతుకుతూ వస్తున్నాయి.ఇప్పడు ఉభయ పార్టీలు మరో మారు మరో మూడు ముళ్ళకు సిద్దమయ్యాయి. ఇది ఎన్నాళ్ళ ముచ్చటో.. ఎప్పుడు పుటుక్కు మంటుండో ఏమో కానీ, ఒక మంచి నాయకుడి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది.

ఖమ్మం కాంగ్రెస్ లో నైరాశ్యం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. తొలివిడతలో మాత్రం పాత కొత్త వారికి ఓ మూడు పదవులు ఇచ్చారు. తొలి నుంచి కాంగ్రెస్ లో ఉన్న పొదెం వీరయ్య, రాయల నాగేశ్వర రావులకు, ఎన్నికల ముందు పార్టీలో చేరిన మువ్వా విజయబాబు కు పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. అయినా ముగ్గురు మంత్రుల మధ్యా సఖ్యతా లోపం కారణంగా అధిష్ఠానానికి జాబితాలు పంపడంలో  తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో కార్యకర్తలు నష్టపోతున్నారు. భద్రాచలం దేవస్థానానికి చైర్మన్ ను నియమించలేదు.  గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఖాళీగానే ఉన్నాయి. పదేళ్లు అధికారం లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు పదవుల విషయంలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో తీవ్ర నిరాశకు గురౌతున్నారు.  బీఆర్ఎస్ పాలనలో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొంటున్న తమను పార్టీ పట్టించుకోలేదని ఆవేదన చెందు తున్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారి పెత్తనమే నడుస్తోందన్న విమర్శలు కూడా ఎక్కు వగా వినిపిస్తున్నాయి.  పొంగులేటి మాత్రం తన మద్దతుదారుడు విజయ్ బాబు కు పదవి ఇప్పించు కున్నారు. తుమ్మల నాగేశ్వరావు తొలివిడతలో పాత కాంగ్రెస్ వాళ్లకే పదవులని తనతో వచ్చిన అనుచరులకు స్పష్టం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి  భట్టి  బిజీగా ఉంటున్నారు. కార్యకర్తలలో  నైరాశ్యం పేరుకుపోతున్నది.    

రాములోరి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

భద్రాద్రి రామయ్యకు  తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్  దక్షిణ అయోధ్యగా భాసిల్లు తున్న భద్రాద్రి రాములోకి కల్యాణం కోసం  ముస్తాబైంది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, కల్యాణమండపం పరిసర ప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరి స్తున్నారు. ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఏప్రిల్ 6 న సీతారాముల కల్యాణం,7 న రాములోరి పట్టాభిషేకం జరగనుంది. రాములోరికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సిఎం రాక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.  శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల తిరు కల్యాణం, శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 8న సదస్యం నిర్వహించనుండగా 12న చక్రతీర్థం, ద్వాదశ ప్రదక్షిణాలు, ద్వాదశ ఆరాధనలు, శ్రీపుష్ప యాగంతో ఉత్సవం సమాప్తి కానుంది. బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకొని ఏప్రిల్ 12 వరకు ఆలయంలో నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. భద్రాచలంలోని శ్రీసీతారామచం ద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు మెచ్చే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవ స్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు.ఆలయ  భద్రాచలం, పర్ణశాలల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 6న శ్రీరామనవమికి, 7న శ్రీరామ మహాపట్టాభిషేకానికి కలెక్టరు జితేష్ పాటిల్ పర్యవేక్షణలో అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు రూ.2.50 కోట్లతో బడ్జెట్ రూపొందించారు.  ఇందులో సుమారు రూ 1.50 కోట్లు ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనుల కోసం కేటాయించడం జరిగింది.  మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపాన్ని 24 సెక్టార్లుగా విభజించగా అందులో 31వేల మంది ప్రత్యక్షంగా కల్యాణం తిలకించడానికి వీలుంది. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో భక్తుల కోసం మిథిలా స్టేడియంలోని అన్ని సెక్టార్లలో పొగమంచు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భక్తులకు వేడి నుంచి ఉపశమనం లభించనుంది...భక్తుల రద్దీ ఈసారి ఎక్కు వగా ఉంటుందని భావిస్తున్నారు..అందుకు గాను పటిష్ట సౌకర్యాలు, సదు పాయాలూ కల్పిస్తున్నారు. కల్యాణ మండపంలో 50 టన్నుల ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు . భద్రాచలం, పర్ణశాలల్లో నాలుగు లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లను వేస్తున్నారు. సెక్టార్లలోని భక్తులకునేరుగా మజ్జిగ, తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేస్తున్నారు..ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వైద్యశాఖ సహకారంతో ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. నవమికి తరలివచ్చే భక్తుల కోసం 19 ప్రసాదాల కౌంటర్లు, 60 తలంబ్రాల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నవమి అనంతరం కార్గో, పోస్టల్, ఆన్లైన్, ప్రచార శాఖల ద్వారా ముత్యాల తలంబ్రాలను పంపేందుకు చర్యలు చేపడుతున్నారు..అదేవిధంగా పరోక్ష సేవలు పొందేవారికి తలంబ్రాలను పంపనున్నారు. ఈసారి నవమికి 200 క్వింటాల్ ముత్యాల తలంబ్రాలు , రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు . ఇందుకోసం 30 మంది సిబ్బంది తయారీలో నిమగ్నమయ్యారు. లడ్డూ తయారీ సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వ హించారు. పెద్ద లడ్డూలను 10 వేలు తయారు చేయ నున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరవాత ఇది రెండవ శ్రీరామ నవమి..గత ఏడాది లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా సిఎం రేవంత్ రాలేదు..ఈసారి సీఎం ముత్యాల తలంబ్రాలు,పట్టు వస్త్రాలుసమర్పించనున్నారు. మంత్రులు ,ఎమ్మెల్యేలు ,అధికారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది..అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు..

ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తాం: రాజాసింగ్ 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం  గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన  సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే మహరాష్ట్ర హిందువులకు తెలంగాణ హిందువులు మద్దత్తు గా నిలుస్తారని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యాక ఔరంగజేబు, బాబర్  వారసులు ఆందోళనకు గురయ్యారన్నారు. భారత్ ను హిందూ దేశంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించాలని రాజాసింగ్ అభిలషించారు. గతేడాది  ధూల్ పేట నుంచి  శ్రీరామనవమి శోభాయాత్రను ఎంఐఎం అడ్డుకుందని  ఈ యేడు  ఎవరి అనుమతులు, ఆదేశాలు లేకుండానే శ్రీరామనవమి శోభాయాత్రను నిర్వహిస్తామని రాజాసింగ్ చెప్పారు.  ఔరంగ జేబు ఆఖరి మొఘల్ చక్రవర్తి.   ఆరో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు ఉన్న చక్రవర్తులు మతసామరస్యానికి పెద్ద పీట వేస్తే ఔరంగజేబు మాత్రం హిందువులపై జిజియా పన్ను వసూలు చేసిన  చక్రవర్తిగా పేరుతెచ్చుకున్నాడు.  ముస్లింల నుంచి జకాత్ పన్ను, హిందువులనుంచి జిజియా పన్ను వసూలు చేసేవాడని అంటారు. మొఘల్ చక్రవర్తి అయినప్పటికీ  ఇస్లాం ను అనుసరిస్తూ టోపీలు కుట్టి జీవనం సాగించేవాడు. హైద్రాబాద్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మహరాష్ట్రలో ఉన్న ఔరంగ జేబు సమాధిని  ఔరంగాబాద్ లో సందర్శించడంతో భారతీయ జనతాపార్టీ నేతలతో బాటు హిందుత్వ వాదులు తీవ్రంగా ప్రతిఘటించారు.  రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలకు   ఔరంగ జేబు సమాధి కేంద్రబిందువయ్యింది.  మొఘల్ చక్రవర్తుల సమాధులకు ఔరంగ జేబు సమాధి భిన్నంగా ఉంటుంది. కేవలం మట్టితో కప్పిన ఈ సమాధి  అతి నిరాడంబరంగా ఉంటుంది.  సమాధిని పరిరక్షించే బాధ్యత షేక్ షుకుర్ పూర్వికులు తీసుకున్నారు. షేక్ షుకుర్ ఆరోతరానికి చెందిన వారు. సమాధి మీద  వనమూలికలను  మాత్రమే పెంచుతున్నారు.  ఔరంగ జేబు సమాధిని చూడటానికి ప్రపంచనలుమూలలనుంచి పర్యాటకులు ప్రతి నిత్యం వస్తుంటారు. చత్రపతి శంభాజీ మహరాజ్ ను 45 రోజుల పాటు హింసించి చంపేసినట్టు విహెచ్ పి, భజరంగ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  ఔరంగజేబు మతగురువు షేక్ జైనుద్దీన్ సమాధి పక్కనే ఈ సమాధిని నిర్మించారు.   

ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్.. విభేదాల ప్రచారానికి ఫుల్ స్టాప్!

గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తి ప్రచారమేనా అంటే నందమూరి కుటుంబం నుంచి వస్తున్న సంకేతాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల ఒక సందర్భంలో నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడం, తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా చేతబట్టి అభిమానులను అలరించడం చూస్తుంటే నందమూరి కుటుంబంలో విభేదాలు అన్నది వట్టి ప్రచారమే అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఇటీవల కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ ఆరంభించారు. ఆ సందర్భంగా నూజివీడు మండలం సీతారామపురంలో తెలుగుదేశం మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించారు. తద్వారా తమ మధ్య విభేదాలన్నవేవీ లేవని చాటారు. ఇది నందమూరి అభిమానుల్లో జోష్ పెంచింది. లోకేష్ ఎన్టీఆర్ ప్లెక్సీని పట్టుకున్న ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా నందమూరి హీరో కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా పట్టుకుని హల్ చల్ చేశారు. నరసరావు పేటలో పర్యటించిన హీరో కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా  చేతపట్టుకుని సందడి చేశారు. దీంతో తెలుగుదేశం అభిమానులు, నందమూరి అభిమానులు ఫుల్ జోష్ అయ్యారు. ఈ రెండు సంఘటనలూ కలిపి చూస్తే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబానికి ఒకింత దూరం మెయిన్ టైన్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని అవగత మౌతుంది.  అయితే గతంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలే ఈ విభేదాల ప్రచారానికి కారణమయ్యాయనడంలో సందేహం లేదు. గతంలో ఒక సారి నందమూరి కల్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూతో  మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అన్న ప్రశ్నకు ఇంకే పార్టీకి మా తాత స్థాపించిన తెలుగుదేశానికే అని చెప్పకుండా.. తన సోద రుడు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం. కుటుంబ కార్యక్రమాల్లో నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు పెద్దగా కనిపించకపోవడం ఈ ప్రచారానికి కారణమయ్యాయి. అయితే పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని విస్పష్టంగా చెప్పినా.. ఈ ప్రచారానికి తెరపడలేదు. ఇందుకు కారణం ఈ విషయంలో బాలకృష్ణ స్పందించకపోవడమేనని అంటారు. అంతే కాకుండా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేయమంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా విభేదాల ప్రచారానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పడు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది.  ఇందుకు బాలయ్యే చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ.. సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అలాగే ఎన్టీఆర్ మనవడిగా సీనీ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగారు.  అయితే వీరి మధ్య విభేదాల ప్రచారం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ , బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య గొడవలకు కూడా కారణమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ పదేపదే  తనకి బాబాయ్ బాలకృష్ణకి ఎలాంటి విబేధాలు లేవు చెబుతూ వస్తున్నా.. ఈ ప్రచారానికీ, ఫ్యాన్స్ మధ్య గొడవలకూ తెరపడలేదు. అయితే ఇప్పుడు ఎటువంటి అరమరికలూ లేకుండా బాబాయ్- అబ్బాయ్ లు ఒకే వేదికపై కనిపించి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇందుకు మే 28న ఘనంగా జరగనున్న ఎన్టీఆర్ జయంతి వేడుక వేదిక కానుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ పెద్ద ఎత్తున వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వేడుకకు ఆయన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను ఆహ్వానించనున్నారని చెబుతున్నారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండుగలా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి కూడా మహానాడును కడప వేదికగా నిర్వహించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆ మహానాడుకు బాలకృష్ణ కూడా హాజరౌతారు. మరి బాలకృష్ణ నిర్వహించే కుటుంబ వేడకకు కూడా మహానాడే వేదిక అవుతుందా?  మహానాడు వేదికగా జరిగే కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు హాజరౌతారా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. దీంతో ఒకే వేదికపై బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు అన్నది ఒట్టి ప్రచారం మాత్రమేనని తేలిపోవడమే కాకుండా, తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వదం తులకు కూడా చెక్ పడుతుందని తెలుగుదేశం, నందమూరి అభిమానులు ఆనందంగా చెబుతున్నారు.  

లక్ష్మి పార్వతికి హైకోర్టులో షాక్ 

వైకాపా నేత లక్ష్మి పార్వతికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని 2009లో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. 1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసిన  సప్లిమెంటరి విల్లు చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో  సిటి సివిల్ కోర్టు  చట్టబద్దంగా వ్యవహరించలేదని పేర్కొంది. విల్లుపై సాక్షి సంతకం చేసిన  జె. వెంకట సుబ్బయ్య  వారసుడు జెవి  ప్రసాదరావు సాక్షిగా పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చట్టవిరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది.  సాక్షి సంతకం చేసిన ప్రసాదరావు  కనీసం తన తండ్రి డెత్ సర్టిఫికేట్ కూడా సిటి సివిల్ కోర్టులో  ప్రొడ్యూస్ చేయలేదని అయినప్పటికీ దిగువ కోర్టు ప్రసాదరావు నోటి మాట ఆధారంగా సాక్షిగా పరిగణలో తీసుకోవడం చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానింది. క్రింది కోర్టు ఇచ్చిన తీర్పుపై లక్ష్మిపార్వతికి అనుకూలంగా రావడాన్ని ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ లు హైకోర్టులో సవాల్ చేశారు. దిగువ కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారి చేసింది. 

కుంభమేళా మోనాలిసాకు సినిమా చాన్స్ ఇచ్చిన దర్శకుడి అరెస్టు

తేనెకళ్ల సుందరి, మహాకుంభమేళా మోనాలిసాకు సినిమా చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించి ఓవర్ నైట్ సెలెబ్రిటీగా మారిపోయిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిత్రా ఇప్పుడు మరో కారణంతో పాపులర్ అయ్యాడు. అత్యాచారం, అసభ్య  వీడియోలు తీసి బెదరించడం ఆరోపణలపై అరెస్టై మరో సారి వార్తల్లో నిలిచాడు.  ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేలాలో.. జీవనోపాధి కోసం పూసల దండలు అమ్ముకుంటున్న ఓ యువతి కుంభమేళా మోనాలిసాగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆమెను అంతా తేనెకళ్ల సుందరి, మహాకుంభ్ మోనాలిసా అంటూ పిలవడం మొదలు పెట్టారు. దీంతో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన కొత్త సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ లో నటిగా ఎంపిక చేసుకున్నాడు. మోనాలిసాకు సినీ చాన్స్ ఇచ్చి సనోజ్ మిశ్రా కూడా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ పాపులారిటీ మసకబారిది. అత్యాచారం, అసభ్య వీడియోలు చిత్రీకరించి ఓ యువతిని వేధించిన కేసులో అరెస్టయ్యాడు. విషయమేంటంటే.. ఉత్తరప్రదేశ్ లోని 'ఝాన్సీ'నగరానికి చెందిన ఒక యువతి సనోజ్ మిశ్రా తనకు 2020 లో టిక్ టాక్,ఇన్ స్టాగ్రామ్ ద్వారా  పరిచయం అయ్యాడనీ,  సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడనీ, ఆ తర్వాత రిసార్ట్ కి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అసభ్య వీడియోలు చిత్రీకరించాడు.ఆ వీడియో లను చూపుతూ తనను  బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడనీ, పెళ్లి చేసుకుంటానని ప్రమాణాలు చేసి మోసం చేశాడనీ ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సనోజ్ మిశ్రాను అరెస్టు చేశారు.  2014 లో  బేతాబ్ తో దర్శకుడిగా పరిచయమైన సనోజ్ మిశ్రా 'గాంధీగిరి, రామ్ కి జన్మ భూమి, లఫంగే నవాబ్,శ్రీనగర్,ది డైరీ ఆఫ్ బెంగాల్ వంటి చిత్రాలు తీశాడు. ఆయన తాజా చిత్రం కాశీ టూ కాశ్మీర్  విడుదలకు సిద్ధంగా ఉంది. 

గుజరాత్ గర్జన.. టార్గెట్ నమో.. షా!

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  బీజేపీకి బలమైన సవాల్ విరారు. గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని శపథం చేశారు. ఎక్కడో కాదు.. లోక్ సభ వేదికగా  బీజేపీని ఉద్దేశించి  రాసి పెట్టుకోండి  ఈ సారి గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి తీరుతాం  అని సవాల్ విసిరారు. చక్కటి హిందీలో ఒకటికి రెండుసార్లు   ఆప్ లిఖ్కే లేలో.. లిఖ్కే లేలో  ఔర్ ఆప్ కో హమ్, గుజరాత్ మే హరాయింగే ఇస్ బార్   అని  సవాల్ విసిరారు.  అయితే  ఆయన ఆ సవాలు విసిరిన కొద్ది రోజులకే  అదే గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో  ప్రజలు ఇచ్చిన తీర్పు పాత చరిత్రనే తిరగ రాసింది. రాష్ట్రం మొత్తంలో 1912 వార్డులకుకు ఎన్నికలు జరిగితే  బీజేపీ 1402 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ 260 వార్డులతో సరిపెట్టుకుంది.  తాలుకా పంచాయత్ ల విషయానికి వస్తే..  55 తాలుకా పంచాయత్ లు బీజేపీ సొంతం చేసుకుంటే, కాంగ్రెస్ కు దక్కింది 17 మాత్రమే. అలాగే  68 నగర పాలికలకు ఎన్నికలు జరిగితే 63 బీజేపీ గెలుచుకుంటే, కాంగ్రెస్ ఖాతాలో చేరింది ఒకే ఒక్కటి. ఈ ఫలితాలను బట్టి చూస్తే గుజారాత్  రాజకీయ ముఖచిత్రంలో  రాహుల్ మార్క్ మార్పునకు స్కోప్ కనిపించడం లేదని  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  తర్వాత ఎప్పుడో జరిగే  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను స్థానిక సంస్థల ఫలితాలు ఆధారంగా లెక్కలేస్తున్నారు. అయినా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పైగానే సమయం వుంది. సో ఈ సంవత్సరం పై చిలుకు కాలంలో ఏమైనా జరగ వచ్చు.  గుర్రం ఎగరా వచ్చు.. కాంగ్రెస్ పార్టీ గెలవా వచ్చు అనే ఆశా జీవులు  రాహుల్ గాంధీకీ జై కొడుతున్నారు.  అయితే  కేవలం స్థానిక సంస్థల ఫలితాల ఆధారంగానే  రేపటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లెక్క కడుతున్నారా అంటే లేదు. కాంగ్రెస్ పార్టీ 1995 నుంచి ఇంతవరకు వరసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయింది. అలాగే  వరసగా 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకోలేక పోయింది.  2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 26 లోక్ సభ స్థానాలకు గానూ, కాంగ్రెస్ ఒకే ఒక్క సీటులో గెలిచింది. మిగిలిన పాతిక సీట్లూ బీజేపీ  సొంతం చేసుకుంది.  నిజానికి  కాంగ్రెస్ పార్టీ వరసగా ఓడిపోతున్న రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి, కానీ, అలాంటి వరస ఓటమి రాష్ట్రాల జాబితాలో గుజరాత్  ముందు వరసలో ఉంటుంది. గుజరాత్ లో ఇంచుమించుగా మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అందని దక్షాగానే మిగిలి పోయింది. 1995లో మొదలైన వరస ఓటముల పరంపర ఈ రోజుకూ కొనసాగుతూనే వుంది. అంతకు ముందు పదేళ్ళ కాలంలోనూ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం పడుతూ లేస్తూనే సాగింది. ఇక ఆ తర్వాత  2001లో నరేంద్ర మోదీ ఎంట్రీతో  గుజరాత్  రాజకీయ ముఖచిత్రమే మారిపోయంది. మోదీ ఎంట్రీ తర్వాత జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ వరస విజయాలను సొంతం చేసుకుంది. ఓటమి కాంగ్రెస్ ‘చేయి’ వదలలేదు.  అయితే  రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.  ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి. కొత్తేమీ కాదు. చూస్తున్నదే. సో  వరసగా ఏడు సార్లు ఓడిన హస్తం పార్టీ ఎనిమిదో  సారీ ఖాయంగా ఓడిపోతుందని గానీ ఏడు సార్లు గెలిచిన బీజేపీ ఎనిమిదో సారి కూడా గెలిచి తీరుతుందని గానీ అనుకోలేము. అలా అనుకుంటే అది అయితే రాజకీయ అజ్ఞానం, కాదంటే అహంకారం అవుతుంది. అందుకే రాహుల్ గాంధీ లోక్ సభ  వేదికగా బీజేపీకి విసిరిన సవాల్ ను అంత తేలిగ్గా తీసుకోరాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  అదలా ఉంటే  రాహుల్ గాంధీ  వ్యూహం, అంతిమ లక్ష్యం ఏమిటో కానీ  ఆయన వైఖరి చూస్తుంటే  దేశం మొత్తం ఒకెత్తు, గుజరాత్ ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బహుశా కొడితే బీజేపీ (మోదీ – షా జోడీ సొంత గడ్డ) కుంభ స్థలాన్నే కొట్టాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ  గుజరాత్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లున్నారు. అందుకే  ఈ మధ్య కాలంలో ఇంటా,బయట, పార్లమెంట్ లోపల వెలుపల. తరచూ గుజరాత్ ప్రస్తావన తెస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే  రాహుల్  గత జూన్ లోనే  గుజరాత్ లో ల్యాండ్ అయ్యా రు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చాలా గంభీర ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా, ఆయన  లోక్ సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని  ఓడించాం, రేపటి  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తాం అని విశ్వాస ప్రకటన లాంటిది చేశారు. అలాగే  ఇటీవల మరోమారు గుజరాత్  వెళ్లిన రాహుల్ గాంధీ  అక్కడి నుంచే   కాంగ్రెస్ లో కమల దళం కోవర్టులున్నారు అనే సంచలన ప్రకటన చేశారు. అలాంటి ఇంటి దొంగలను ఏరి పారేస్తామని హెచ్చరించారు. అందుకే  రాజకీయ విశ్లేషకులు సర్వ శక్తులు ఒడ్డైనా గుజరాత్ లో  మోదీ – షాల జోడిని  ఓడించి తీరాలనే కసి  రాహుల్ గాంధీలో కనిపిస్తోందని అంటున్నారు.  అందుకే  ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్’లో ఏఐసీసీ’ సమావేశాలు, నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 64 సంవత్సరాల తర్వాత తొలి సారిగా గుజరాత్’ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ పార్టీ  టార్గెట్ అర్థమవుతోందని అంటున్నారు. మోదీ- షా జోడీని సొంత గడ్డపై ఓడించాలానే లక్ష్యంతోనే ఎఐసీసీ  సమావేశంతో పాటుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) విస్తృత స్థాయి సమావేశం కూడా అహ్మదాబాద్ లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందనీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గుజరాత్ నుంచే కాంగ్రెస్ పార్టీ పునర్జీవన ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించారని అంటున్నారు. అందుకే  ఏప్రిల్ 8,9 తేదీలలో  కాంగ్రెస్ సంసారం మొత్తం అహ్మదాబాద్ లో ఉండేలా  ఏఐసీసీతో పాటు, సిడబ్ల్యుసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శనకు, ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దమవుతోందని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలో మరో  శక్తి పీఠంగా ఎదిగి వస్తున్న ప్రియాంకా వాద్రాతో పాటుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు,ఉప ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు,ఇతర సీనియర్ నాయకులు, ఎఐసీసీ ప్రతినిధులు, ఒకరనేమిటి  కాంగ్రెస్ యోధాను యోధులంతా   గుజరాత్  గర్జనకు సిద్ధమవుతున్నారు.  అయితే మిషన్ 27  ప్రధాన ఎజెండా గా జరుగుతున్న ఈ సమావేశాలలో.. నమో షా ..ను టార్గెట్ చేస్తారా? చేస్తే, ఏమవుతుంది? ఇంతా చేసిన తర్వాత మళ్ళీ చరిత్ర పునరావృతం అయితే ... ?

కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నియామకం!

కుప్పం గంగమ్మఆలయ పాలక మండలి చైర్మన్ గా బీఎంకే రవిచంద్రబాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు.. ఆయనతో పాటు 10 మంది సభ్యులను కూడా ఎంపిక చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమైన ఆలయం కావడంతో ఈ ఆలయ పాలకమండలి నియామకం విషయంలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన స్వయంగా పాలకమండలి చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి నియమించారు.   ఇక బీఎంకే రవిచంద్రబాబు విషయానికి వస్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన రెండేళ్ల పాటు కుప్పం నియోజకవర్గంలో అన్న క్యాంటిన్ నిర్వహించారు. జగన్ ప్రభుత్వ దమనకాండను, దాష్టీకాన్ని గట్టిగా ఎదిరించి నిలబడ్డారు.  ఆలయ ప్రతిష్ఠ, పవిత్రతకు భంగం కలగకుండా గంగమ్మదేవాలయ పాలక మండలి ఉండాలన్న భావనతో చం్దరబాబు స్వయంగా కమిటీని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. కాగా బీఎంకే రవిచంద్ర చైర్మన్ గా 11 మందితో గంగమ్మ ఆలయకమిటీని నియమించిన చంద్రబాబు నేడో, రేపో అధికారికంగా ప్రకటించనున్నారు.  ఇక ఈ కమిటీ ఎంపికలో చంద్రబాబు సామాజిక సమతుల్యత పాటించారని చెబుతున్నారు. 

చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం.. ఆనంద్ మహీంద్రా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ కేఫ్ లు విస్తరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ ఆయనీ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.  చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయనీ, ఆయన ఆచరణ అంతకంటే గొప్పగా ఉంటుందనీ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.   పారిస్‌లో తమ రెండో అర‌కు కాఫీ స్టాల్ అంటూ ఒక వీడియోను కూడా ఆ పోస్టుతో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా పోస్టుపై స్పందించిన సీఎం నారా చంద్రబాబునాయుడు  ప‌చ్చ‌ని అర‌కులోయ నుంచి పారిస్ న‌డిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్ప‌త్తి చేర‌డం, వ‌ర‌ల్డ్‌వైడ్‌గా త‌గిన గుర్తింపు ల‌భించ‌డం ర్తిదాయ‌క‌మ‌ని పేర్కొన్నారు.

తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..మూడు రోజుల పాటు వానలు

వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. భూ ఉపరితలం వేడెక్కడం వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి గురువారం (ఏప్రిల్3)  వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకూ తగ్గుతాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మొదక్, కామారెడ్డి, జోగులాంబ, వనపర్తి, వికారాబాద్, గద్వాల్ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. 

ఏపీలో 51 కరవు మండలాలు

గత ఏడాది ఏపీలో సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు అయినా కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరువు మండలాల ప్రకటన సరిగా జరగలేదు. ఎదో మొక్కుబడి తంతుగా జగన్ సర్కార్ నాడు కరువు మండలాలను ప్రకటించి ఊరుకుంది.అయితే కూటమి సర్కార్ రైతుల ఇబ్బందులు, సమస్యలు, అలాగే స్థానిక పరిస్థితులు అన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని కరువు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా ఏపీలోని ఆరు జిల్లాల్లో 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఆర్పీ సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకటించిన 51 మండలాల్లో 37 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు.  అందుకు అనుగుణంగా 2024-25 సంవత్సరానికి కరువు మండలాలను వెల్లడిస్తూ ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు  జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను నిశితంగా పరిశీలించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను తాము దృష్టిలో ఉంచుకుని, వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ  స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటించింది కూటమి ప్రభుత్వం.  

పైలట్ అవతారమెత్తిన కేతిరెడ్డి

ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్ అయిన వైసీపీ నేతలు ఎవరి వ్యాపాకాల్లో వారు పడ్డారు. తమకు నచ్చింది చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ  కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నయా అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేతల్లో కేతిరెడ్డి ఒకరు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు.. తన నియోజకవర్గం, పార్టీ సమావేశాలు, ఇతర కార్యక్రమాల గురించి .. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండేవారు.  2024 ఎన్నికల్లో కూటమి గాలికి కొట్టుకుపోయారు. ప్రస్తుతం ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.  కేతిరెడ్డి తాజాగా పైలట్ అవతారం ఎత్తారు. తానే స్వయంగా ప్రైవేట్ జెట్‌ని నడిపిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కల నిజమయ్యింది అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కల నిజమైంది. అధికారికంగా పైలట్ అయ్యా. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసాలు మరెన్నో ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ప్రైవేట్ జెట్‌ నడిపి తన కల నెరవేర్చుకున్నారు.

మాజీ మంత్రి కాకాణికి పోలీసుల సీరియస్ వార్నింగ్

పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొడలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సోమవారం విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని కాకాణి ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే మాజీ మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని.. లేకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు.  కాగా.. కాకాణి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అక్రమ మైనింగ్ కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కాకాణిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. తనను ఏమీ చేయాలేరు.. అక్రమ కేసులు బనాయించినా జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్న కాకాణి.. ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఈ కేసులో కాకాణితో పాటు ఐదుగురు నిందితులు కూడా పరారీలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చేందుకు కాకాణి ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆయన ఇంటి గేట్లకు నోటీసులు అతికించారు. ఆ తరువాత కొద్దిసేపటికే తాను ఎక్కడికీ పారిపోలేదంటూ కాకాణి ఓ పోస్టు పెట్టారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేశారు. వెంటనే పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లాగా.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ కూడా కాకాణి లేరని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన సమీప బంధువుకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాణి హాజరుకావాల్సి ఉంది. అయితే పోలీసుల విచారణకు కాకాణి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

విశాఖ ఐకానిక్ క్యాపిటల్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించి నానా హడావుడి చేసిన జగన్ సర్కారు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో తన నివాసం కోసం రుషికొండను తొలిచి ప్రజాధనంతో ఒక భారీ ప్యాలెస్ మాత్రం జగన్ కట్టించారు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో కూటమి సర్కారు ఉంది. మరో వైపు విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటూ కూటమి సర్కారు , విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చే పనిలో పడింది.  విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామనీ, విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చుతామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల్లో తనకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలలో స్థానాల్లో మూడవ స్థానం వచ్చినందుకు కొంచెం బాధనిపించిందనీ,  కానీ మొదటి రెండు అత్యధిక మెజారిటీ స్థానాలు విశాఖకు వచ్చాయన్నారు. దీన్ని బట్టి విశాఖ ప్రజలు తమపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారని అర్థమైందన్నారు. విశాఖను అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.  వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు... భారతదేశంలోనే ఒక ఐకానిక్ ప్లేస్‌గా మిగులుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారన్నారు. చంద్రబాబును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోకి నగరంలోకి రాకుండా అడ్డగించారన్నారు. విజయనగరం తీర్థాలు గుడికి వెళుతుంటే బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి రాకుండా చేయాలని చేశారని మండిపడ్డారు. లులు గ్రూప్ కూడా త్వరలో విశాఖకు వస్తుందన్నారు. గడిచిన 10 నెలల్లోనే విశాఖకు టీసీఎస్, మెటల్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ వంటి సంస్ధలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా తీసుకున్నామని చెప్పారు.  మన ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ చేయమంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోనే ట్రిలియన్ డాలర్ ఎకానమీని తీసుకొస్తామని గర్వంగా చెప్తుతున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలని... 9 నెంబర్లలో లార్జెస్ట్ ఎకనామికల్ సిటీగా ఉన్న విశాఖను పదోవ స్థానానికి దించారని విమర్శలు గుప్పించారు. ఎంపీ భరత్, విశాఖ శాసనసభ్యులపై దృష్టి సారించి విశాఖను 5వ లార్జెస్ట్ ఎకనామికల్ సిటీగా నిలబెడతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఐటీ డెస్టినేషన్‌గా మారుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని... ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా పూర్తయిందని వెల్లడించారు. విశాఖ అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతమన్నారు. హోటల్స్, కాన్సెర్ట్స్, క్రికెట్ మ్యాచ్ లు జరిగే వైబ్రెంట్ సిటీ విశాఖపట్నం అని తెలిపారు. అమరావతి భవనాల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.  ఇప్పుడు వరుణ్ గ్రూప్ చేపడుతున్న హోటల్  రెండేళ్లలోనే పూర్తి చేస్తారని నమ్మకం ఉందన్నారు. 2027 మార్చి 31 లోపు వరుణ్ గ్రూప్ చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్‌ను పూర్తి చేయాలన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సంవత్సరంలోపు ప్రారంభం చేస్తామన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు కన్నా ముందే... భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

అవి విష వృక్షాలు.. ప్రాణాలకు ముప్పు!

వరసగా పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరిత హారం కార్యక్రమం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఎంత  ప్రాధాన్యత ఇచ్చిందో, హరిత హారం ప్రాజెక్టుకు  కూడా అంతే  ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో పచ్చదనాన్నిపెంచాలనే లక్ష్యంతో 2015 లో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు స్వహస్తాలతో  చిలుకూరు బాలాజీ సన్నిధిలో ప్రారంభించిన హరిత హరం పథకాన్ని  బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి వరకూ కొనసాగించింది.  ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్స్  ఫిక్స్  చేసుకుని మరీ కోట్లలో మొక్కలు నాటారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయ్యింది.  అవును  అధికారిక లెక్కల ప్రకారమే  2023 జూన్ నాటికి తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం రూ. 10,822 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 273.33 కోట్ల మొక్కలు నాటింది. అయితే  ముఖ్యమంత్రి మానస పుత్రికగా  ప్రచారం చేసుకున్న  హరిత హారం ప్రాజక్ట్  ఆశించిన లక్ష్యం నెరవేరిందా? అంటే అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది.   అయితే  ప్రభుత్వ లెక్కల ప్రకారం పదేళ్ళ కాలంలో  13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. 1,00,691 కిలో మీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు విస్తరించాయి.  ఈ లెక్కలు చక్కగా ఉన్నాయి. అందుకే, అప్పుడే కాదు.. ఇప్పటికీ బీఆర్ఎస్  తెలంగాణ హరిత హారాన్ని తమ పదేళ్ళ పాలన సాధించిన విజయ హారం గా పేర్కొంటున్నారు. రెండు మూడు రోజుల క్రితం ముగిసిన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనూ, మాజీ మంత్రి  బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని దీనివల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7 శాతం పెరిగిందని చెప్పారు. అయితే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది  అన్నట్లుగా  ప్రశాంత రెడ్డి ప్రసంగం పూర్తి కాకముందే   స్పీకర్ గడ్డం ప్రసాద్ హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో ప్రజలకు పక్షులు, ఇతర జీవరాసులకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ చెట్లు  వృక్ష ధర్మానికి విరుద్ధంగా, ఆక్సిజన్  గ్రహించి, కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయని, వాతావరణాన్ని విష పూరితం చేస్తున్నాయని స్పీకర్ వివరించారు. ఈ కారణంగా  పక్షులు, ఇతర జీవుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని  వివరించారు.  అదలా ఉంటే,  తాజాగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, హరిత విధ్వంసంలో కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కోసం భారాస 25 లక్షల చెట్లను నరికి వేయడంతో పాటుగా, హరితహారం ముసుగులో కోనోకార్పస్‌ను విష వృక్షాలను కానుకగా ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో ‘కంచ గచ్చిబౌలిలో ఏకంగా 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేసి  పర్యావరణానికి పాతర వేస్తోందని అరోపించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని ఆనుకుని చాలా వృక్ష జాతులు, పక్షిజాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని బండి సంజయ్  చెబుతున్నారు.  సంజయ్ ఆరోపణల విషయం ఎలా ఉన్నా..  స్పీకర్ సూచనను   ప్రభుతం సీరియస్  తీసుకుని కోనోకార్పస్‌  విష వృక్షాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ శాస్త్ర వేత్తలు, ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు.

తెలంగాణకు చల్లటి కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు

వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.  రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి గురువారం (ఏప్రిల్ 3) వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం పేర్కొంది. ఈ వర్షాల కారణంగా వాతావరణం చల్లబడు తుందనీ, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2, 3 తేదీల్లో వాన‌ల కార‌ణంగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డి గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 3 నుంచి 4 డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది.  ముఖ్యంగా   నిజామాబాద్‌, కామారెడ్డి, మెద‌క్, వికారాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌, వ‌న‌ప‌ర్తి, నిర్మ‌ల్‌, జోగులాంబ గ‌ద్వాల్   జిల్లాల్లో  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.