కంచగచ్చిబౌలి భూములపై బాలివుడ్ నటుడు జాన్ అబ్రహం స్పందన 

హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమి దేశ వ్యాప్త  చర్చనీయమైంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వివాదంపై స్పందించింది. చెట్లను కొట్టివేయడాన్ని తప్పు పట్టింది. చట్టపరంగా ఈ భూమి తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇక్కడ వన్య ప్రాణులైన పులులు, సింహాలు లేవని ప్రతిపక్ష గుంటనక్కలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణుదేశాయ్ మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం వదిలేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. రేణుదేశాయ్ తో పాటు మరికొందరు టాలివుడ్ నటులు స్పందించారు. తాజాగా బాలివుడ్ నటుడు జాన్ అబ్రహం స్పందించారు. 400 ఎకరాల్లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారికి బాసటగా నిలిచారు. ఇక్కడ డెవలప్ మెంట్ నిలిపివేయాలని  ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు.  చెట్లను నరికివేసే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని జాన్ అబ్రహం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఎక్స్ లో చేతులు జోడించి ఎమోజీ పోస్ట్ చేశారు. 

కేతిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. చెరువు భూమి ఆక్రమణపై నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువతీరిన తరువాత వైసీపీ హయాంలో ఇష్టారీతిగా చెలరేగిపోయిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ వరుసగా కేసుల్లోనూ, భూవివాదాల్లోనూ ఇరుక్కొంటున్నారు. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు అధికారలు సిద్థమయ్యారు. చెరువులు ఆక్రమించి గుర్రాట కోట నిర్మించి తోట సాగు చేస్తున్నట్లు కేతిరెడ్డిపై గతంలో ఆరోపణలు వచ్చాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్మవరం శక్తివడియార్ చెరువును చెరపట్టిన కేతిరెడ్డి అక్రమాల నిగ్గును తేలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పడు అధికారులు కేతిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగానే  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారు. ఆక్రమించిన చెరువు  వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు కేతిరెడ్డికి  నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో చెరువు భూములను కేతిరెడ్డి ఆక్రమించి బినామీలుగా బంధువులు, అనుచరుల పేర్లతో రికార్డులు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మవరం మండలంలోని శక్తివడియార్ చెరువు, దాని పరీవాహక ప్రాంత భూమికి సంబంధించి దశాబ్దాలనాటి రికార్డులను అధికారులు బయటకు తీస్తున్నారు.  చెరువు భూమి, అక్రమ నిర్మాణాలను నిగ్గు తేల్చడానికి రెవెన్యూ, చిన్ననీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూములను బినామీ పేర్లతో రికార్డులు సృష్టించిన వైనంపై రికార్డులు వెలికితీసిన అధికారులు, బినామీదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులు ఆక్రమిస్తున్నారని గత వైఎస్సార్సీపీలో ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం మారగానే చెరువును ఆక్రమించారంటూ నోటీసులిచ్చారు. చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్​లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి, తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమిత భూమి వివరాలను సమగ్రంగా నోటీసులో చూపుతూ 20.61 ఎకరాల భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. నోటీసులు నేరుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు. అయితే ఆ సమయంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి ఇంట్లో లేకపోవడంతో, వెంకట్రామిరెడ్డి పీఏ ముకేష్ నోటీసులు తీసుకున్నారు. చెరువుతో పాటు చుట్టూ పరీవాహక ప్రాంతంలోని నీటిపారుదలశాఖతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నోటీసులో చూపించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెరువును ఆక్రమించారని గతంలో జంగా రమేష్ అనే సామాజిక వేత్త అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా అప్పటి వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు.  అధికారుల అవినీతిని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆక్రమణలను ఎండగడుతూ రమేష్ హరిత ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. హరిత ట్రైబ్యునల్​లో కేసు విషయాన్ని కూడా తహసీల్దార్ నోటీసులో పేర్కొన్నారు. గుర్రాలకోటను బద్దలు కొట్టి, భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. 

ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవండి.. మావోలకు కేంద్ర హోంమంత్రి పిలుపు

వరుస ఎన్ కౌంటర్లతో  ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన తీసుకువచ్చిన వేళ.. అమిత్ షా వారికి ఓ పిలుపునిచ్చారు. అయితే శాంతి చర్చలు కాదనీ, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కి రావాలని కేంద్ర హోంమత్రి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి జనజీనవ స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులందరికీ పునరావాసం కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్న హామీ ఇచ్చారు. ఒక వైపు ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుండగా.. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదన చేయడం, అందుకు ప్రతిగా జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు నివ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నారు. నక్సల్స్ ముక్త భారత్ లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే వందలాది మంది నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో హతమైన సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా దాదాపు 86 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయిన ఘటన తెలంగాణలో జరిగింది.  భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు శనివారం (ఏప్రిల్ 5) లొంగిపోయారు.  వీరంతా బీజాపూర్, సుక్మ జిల్లా సభ్యులుగా గుర్తించారు.  ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పలు వురు పోలీస్ అధికారులు ఉన్నారు. 

 పాస్టర్ ప్రవీణ్ అనుమానా స్పద మృతి...  మాజీ ఎంపి హర్షకుమార్ పై కేసు 

గత నెల చివరి వారంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే.    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే  దర్యాప్తు దశలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే ప్రకటనలు ఒక్కోసారి దర్యాప్తు పక్కదారి పట్టిస్తాయి. కాంగ్రెస్ మాజీ ఎంపి హర్షకుమార్  కూడా దర్యాప్తు పక్కదారి పట్టే ప్రకటనలు చేశారు. పాస్టర్  పగడాల ను ఎవరో చంపి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారన్నారు. పైగా తన వద్ద బలమైన ఆధారాలున్నాయన్నారు. ఆధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు అధికారికి ఆ అధారాలను సబ్మిట్ చేయకుండా ఆలస్యం చేయడం నేరం.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కోణంలోనే హర్షకుమార్ ప్రకటనను చూస్తుంది. ఇప్పటికే నోరు జారిన హర్షకుమార్ పై పోలీసులు బిఎన్ ఎస్ 196, 197  సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఆధారాలతో విచారణకు హాజరుకావాలని  హర్షకుమార్ కు నోటీసులు జారి చేశారు

అమరావతిలో లులూ ప్రతినిథుల పర్యటన.. ఎందుకో తెలుసా?

ఒక్క‌చాన్స్ ప్లీజ్  అంటూ ప్రజలను వేడుకుని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించాడు. ఆయన ఐదేళ్ల పాలనలో  క‌క్ష‌పూరిత రాజ‌కీయాలతో ప్రత్యర్థి పార్టీల నేతలనే కాకుండా సామాన్య ప్రజలను కూడా వేధింపులకు గురి చేశారు.  అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను తన విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దణ్ణం పెట్టి మరీ తరలిపోయేలా చేశారు. అలా జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి, ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ప్రఖాతి చెందిన లూలూ సహా పలు పరిశ్రమలు జగన్ విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలివెళ్లిపోయాయి. అమరరాజా బ్యాటరీస్ కూడా తెలంగాణకు తరలిపోయింది. కొత్త పరిశ్రమల సంగతి అలా ఉంచితే ఉన్న పరిశ్రమలనే తరిమేసేలా జగన్ ఫారిశ్రామిక విధానం ఉంది. దీంతో జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం  పూర్తిగా పడకేసింది. కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉన్నవి మిగలలేదు అన్నట్లుగా అప్పటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే జగన్ సర్కార్ పతనమై నారా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిందో అప్పటి నుంచీ రాష్ట్ర పారిశ్రామిక రంగం పూర్వ వైభవం సంతరించుకునే దిశగా పరుగులు పెడుతోంది.  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ కు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత రాష్ట్యరానికి కొత్త కంపెనీలు వస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దిగ్గజ సంస్థల దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.   అంతే కాకుండా  గతంలో జగన్ దాష్టీకం, అస్తవ్యస్థ, అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలిపోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పు కోవలసినది లూలూ గ్రూప్ గురించి. హైపర్ మార్కెట్లు, మల్టిప్లెక్సల నిర్మాణం, నిర్వహణల్లో ప్రపంచంలోనే పెరెన్నిక గన్న లూలూ గ్రుప్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మళ్లీ ఏపీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే విశాఖలో దాదాపు 1500 కోట్ల పెట్టుబడులతో విశాఖలో ఓ మాల్, కన్వెన్షన్ సెంటన్ ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అదే సంస్థ ప్రతినిథులు శుక్రవారం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించారు. వీరి పర్యటనలో అడుగడుగునా సీఆర్డీయే అధికారులు దగ్గరుండి మరీ వారిని గైడ్ చేశారు. ఇప్పుడు లూలూ సంస్థ ప్రతినిథుల అమరావతి పర్యటనే టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది. ఒక్క విశాఖలోనే కాకుండా అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు లూలూ ఆసక్తి చూపుతోందనీ, అందుకోసమే ఆ సంస్థ ప్రతినిథులు అమరావతిలో పర్యటించారనీ అంటున్నారు. లూలూ ప్రతినిథులు తమ పర్యటలో అమరావతి భవిష్యత్ లో ఎలా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఏ నిర్మాణాలు జరగనున్నాయి, నవనగరాల రూపురేకలు ఎలా ఉంటాయి వంటి వివరాలను ఆరా తీసినట్లు చెబుతున్నారు.   విశాఖలో లాగే అమరావతిలోనూ ఆ సంస్థ రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

నియోజకవర్గానిక ఒక మల్టీ స్పెషాలిటీస్ ఆసుపత్రి.. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్లో  ప్రతి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కనీసం వంద నుంచి 300 పడకలతో ఆ మల్టీ స్పెషాలిటీస్ ఆస్పత్రి ఉండాలన్నారు. వీటి నిర్మాణం త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖపై సచివాలయంలో శుక్రవారం (ఏప్రిల్ 4) నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 70  మల్టీ స్పెషాలిటీస్ ఆస్పత్రులు ఉన్నాయనీ, మరో 105 నియోజకవర్గాలలో వాటిని ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు.  ఈ ఆస్పత్రుల నిర్మాణం పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో జరిగేలా ఆలోచన చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి అందుకోసం ముందుకు వచ్చే సంస్థలకు పరిశ్రమలకు ఇచ్చినట్లుగానే సబ్సిడీ ఇచ్చే విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్యసేవలను మరింత విస్తృత పరచాలని చెప్పారు.అదే విధంగా  అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రపంచ దేశాలకు వైద్య డెస్టినేషన్ అమరావతి అయ్యేలా మెడిసిటీ ప్రాజెక్టు ఉండలని చంద్రబాబు చెప్పారు.  తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతా రంగాలు విద్య, వైద్యమేనని స్పష్టం చేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలని అన్నారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత వైద్యసేవలు అందించే పరిస్థితి నుంచి.. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.  

 నడుస్తున్న భోగిలో రేప్ ,  సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరణ...  సికింద్రాబాద్ లో అరెస్ట్

నడుస్తున్న రైలులో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది.  సంబల్ పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రక్సౌల్ ఎక్స్ ప్రెస్   ఈ దారుణం చోటు చేసుకుంది. కుటుంబంతో కల్సి వస్తున్న ఆ బాలిక తనను విధి కాటేస్తుందని ఊహించలేకపోయింది. హార్రర్ సినిమాలను తలపించే ఈ సంఘటన అనేక ప్రశ్నలు తలెత్తేలా చేసింది. మరి కొద్ది సేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని బాలిక కుటుంబం భావించింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు కెల్తార్  రైల్వే స్టేషన్ సమీపంలో  ఉండగానే బాలిక కాల కృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. తెల్లవారు జామున తోటి ప్రయాణికులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బాలిక కుటుంబ సభ్యులు కూడా నిద్రలో జారుకోవడాన్ని నిందితుడు సంతోష్ కుమార్ (21) పసిగట్టాడు. నిందితుడు బీహార్ మంద్వాడ్ జిల్లాలో రైలెక్కాడు. అప్పటివరకు ఈ కుటుంబ సభ్యులతో మాటా మాటా కలపడంతో బాలిక కూడా ప్రమాదాన్ని ఊభించలేకపోయింది.  బాలిక టాయ్ లెట్ కు వెళ్లగానే వెంబడించి అదే టాయ్ లెట్ డోర్ వేసేసాడు.   బాలిక అరుస్తున్నప్పటికీ కేకలు భోగీలో వినిపించలేదు. బలవంతంగా రేప్ చేసిన యువకుడు ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించి వదిలేసాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే 139 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో రైల్వే పోలీసులు చేరుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్స్ కేసు నమోదైంది.అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినప్పుడు  నేరస్తులకు శిక్షలు కఠినంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో పోక్సో చట్టాన్ని పాలకులు తీసుకువచ్చారు అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ నేరాలు చేసే వాళ్లు నేరాల తీరు మార్చుకుంటున్నారే గానీ నేరాలను నియంత్రించుకోలేకపోతున్నారు. చట్టాలలో ఉన్న లొసుగులు వారికి వరప్రదాయిని అవుతుంది. పిల్లల పెంపకంలో కూడా లోపాలు వారిని సమాజంలో నేరస్థులుగా నిలబెడుతున్నాయి. దిశ, నిర్బయ, పోక్స్ చట్టాలు వారిలో మార్పు తేలేకపోతున్నాయి. నేరాల శాతం తగ్గుతున్నా నేరాలను అరికట్టడంలో చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా విఫలం అవుతున్నారు

ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ బిల్లు 2025కు రాష్ట్రపతి ఆమోదం!

దేశంలోకి అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకువచ్చి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2005 పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై శుక్రవారం (ఏప్రిల్ 4) సంతకం చేశారు. దీంతో ఇక ఇది చట్ట రూపం దాల్చినట్లే. ఓ వైపు అమెరికాలో ఆ దేశాధ్యక్షుడు అక్రమ వలసదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి వెళ్లగొడుతున్నారు. అలా వెళ్లగొట్టబడుతున్న వారిలో భారతీయ విద్యార్థలూ ఉన్నారు. ఇప్పుడు దేశంలో అక్రమ వలసల నిరోధానికి కేంద్రం తీసుకువచ్చిన ఈ  ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం కూడా దాదాపు దేశంలోని అక్రమంగా వలస వచ్చిన వారిపై అటువంటి చర్యలకే ఉద్దేశించింనదిగా ఉంది.  ఈ చట్టం ప్రకారం విదేశీయులను పర్యాటకులు, విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, వ్యాపార సందర్శకులు, శరణార్థులు, అక్రమ వలసదారులుగా  విభజిస్తారు.  ఇప్పటి నుండి భారతదేశంలోకి ప్రవేశించే ఎవరైనా ముందుగా వీసా పొందాలి. సరైన పత్రాలతో రావాలి. ఎవరైనా దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే వారికి రూ. 5 లక్షల వరకు జరిమానా, గరిష్టంగా  5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేందుకు ఈ చట్టం ఆస్కారం కల్పిస్తుంది. అలాగే నకిలీ వీసా లేదా పాస్‌పోర్ట్‌తో పట్టుబడిన ఎవరికైనా పది లక్షల రూపాయల జరిగామానా,  7 సంవత్సరాల వరకు జైలు శిక్షకు గురి కావాల్సి ఉంటుంది.  మొత్తం మీద ఈ కొత్త చట్టం  అక్రమవలసలను అరికట్టేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. అలాగే దేశ భద్రతకు పూచీపడుతుందనీ, అదే సమయంలో దేశంలోని విదేశీయులు చట్టబద్ధంగా ప్రవేశించేందుకు మార్గాన్ని సుగుమం చేస్తుందని అంటున్నారు. 

బీజేపీ అజెండా అమలు దిశగా కీలక ముందడుగు

ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు విషయంలో చాల పట్టుదలగా ఉంది. భాగస్వామ్య పార్టీలపై తనదైన ముద్ర వేస్తూ  మోడీ సర్కార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు దిశగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నది. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందింది.  వక్ఫ్ వ్యవస్థ లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం వల్లే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చామని స్వయంగా ప్రధాని మోడీయే ప్రకటించారు. లోక్ సభ, రాజ్యసభలలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడం కీలక పరిణామమనీ,ఈ బిల్లు ఆమోదంతో సామాన్య ముస్లింలకు మేలు చేకూరుతుందనీ మోడీ నమ్మకంగా చెబుతున్నారు.  కాంగ్రెస్,ఇతర ప్రతిపక్షాలు,ముస్లిం వర్గాల నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. లోక్ సభలో 288-232 గా,రాజ్యసభలో128-95 గా ఓట్లు వచ్చాయి. ఉభయసభల్లోనూ ఈ బిల్లుపై విసృతంగా చర్చ జరిగింది. లోక్ సభలో 14 గంటలు,రాజ్యసభలో 13గంటల పాటు చర్చ జరిగింది.  చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు  బిల్లులోని లోపాలను  బలంగా ఎత్తి చూపాయి. అనూహ్యంగా వక్ఫ్ బిల్లు ను వ్యతిరేకించే విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఏకతాటిపై నిలబడ్డాయి. అందుకే సునాయాసంగా పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందుతుని అంతా భావించినా వక్ఫ్ బిల్లు ను పాస్ చేయించుకోవడానికి కేంద్రం నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలోనే వక్ఫ్ బిల్లు విషయంలో అనుమానాలు ఉన్నాయి. కూటమి ధర్మంలో భాగంగా బిల్లును గట్టిగా వ్యతిరేకించకపోయినా, పట్టుబట్టి మరీ తమకు కావలసిన సవరణలు చేయించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించిన సవరణల్లో ఒక్కటి మినహా..మిగిలిన అన్నిటినీ మోడీ సర్కార్ అంగీకరించింది. ఆ మేరకు సవరణలు చేసింది. చంద్రబాబు మద్దతు కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు అత్యంత కీలకం కనుకనే మోడీ ఈ సవరణలకు ఓకే చెప్పారన్నది నిర్వివాదాంశం. ఇక ఇప్పుడు ఉభయసభల ఆమోదంతో వక్ బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ముస్సల్మాన్ వక్ఫ్ చట్టం1923 రద్దై కొత్త చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డు లు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్దారించుకోవడానికి కలెక్టర్ల వద్ద వాటిని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  దేశంలో 30 వక్ఫ్ బోర్డులున్నాయి. 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8.7లక్షల ఆస్తులు వక్ఫ్ బోర్డులో నియంత్రణలో ఉన్నాయి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తా కాదా అని నిర్ణయించే అధికారం ఇస్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ దానిని రద్దు చేయకపోతే బోర్డు నిర్ణయం అంతిమం అవుతుంది.వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారం కొత్త చట్టం కలెక్టర్లకు వర్తించేలా చేస్తుంది. నిర్ణయం వచ్చేవరకూ వివాదస్పద ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారు. ఈ బిల్లు మేరకు వక్ఫ్ కౌన్సిల్ లో22మందిలో ఇద్దరు ముస్లిమేతర వ్యక్తులు ఉండవచ్చు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు లో 11 మంది సభ్యుల్లో ఇద్దరు ముస్లిమేతరలు ఉండవచ్చు. రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వక్ఫ్ సంస్థలు ఆడిట్ చేయించాలి. ముస్లిం మతం కనీసం ఐదేళ్లు పాటించేవారు తమ ఆస్తిని వక్ఫ్ కు ఇవ్వవచ్చు. వక్ఫ్ ప్రకటనకు ముందే మహిళలు తమ వారసత్వం పొందాలని, విడాకులు తీసుకున్న మహిళలు,వితంతువులు,అనాధలకు ప్రత్యేక నిబంధనలు ఈ బిల్లు నిర్దేసిస్తుంది. ఈ బిల్లు ముస్లింలకే లాభమని,ముస్లీమేతరులు జోక్యం చేసుకోలేరని కేంద్రమైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా చెబుతున్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటన లో బిజీగా ఉండగా హోంమంత్రి అమిత్ షా 12 గంటలపాటు ఉభయ సభల్లో ఉండి ప్రణాళిక ప్రకారం బిల్లు ఆమోదం జరిగేలా చూసి తన వ్యూహ చతురతను, సామర్ధ్యాన్నీ మరోసారి చాటారు.   ఇదిలావుండగా వక్ఫ్ సవరణ బిల్లు2025పై తాజాగా కాంగ్రెస్,ఎంఐఎం సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఎంఐఎం  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేసారు.ఈ బిల్లు  రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సవాల్ చేసారు. ముస్లింసమాజ ప్రాధమిక హక్కులు ఉల్లంఘించే లా బిల్లు ఉందని  పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా  జగన్ నేతృత్వంలోని వైసీపీ వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకించి సంచలనం రేపింది. రాష్ట్రంలో మైనార్టీలకు కలుపుకుని టీడీపీ,జనసేనలను దెబ్బకొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. మొత్తంగా బీజేపీ తన అజెండా అమలు విషయంలో పడిన కీలక ముందడుగుగా వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగనన్న కాలనీల్లో భారీ అవినీతి!

ఒక్క నెల్లూరు జిల్లాలోనే 120 కోట్ల అవినీతి దందా మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపణ జగన్ హయాంలో కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా పాలన సాగింది. జగన్ ఐదేళ్ల పాలన అంతా దోచుకో.. దాచుకో అన్న తరహాలోనే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన తరువాత.. జగన్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతోంది. తాజాగా జగనన్న కాలనీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి ఆరోపించారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే జగనన్న కాలనీల్లో 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన తెలిపారు.  పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి తిప్ప వద్ద గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ఏర్పాటు చేసిన నాసిరకం ఇళ్ల నిర్మాణాలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి శుక్రవారం (ఏప్రిల్ 4) పరిశీలించిన మంత్రి కొలుసు, గత పాలకులు గృహ నిర్మాణాన్ని అవినీతి కూపంగా మార్చారని విమర్శించారు. జగనన్న కాలనీల్లో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 120కోట్ల అవినీతి జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా మరెంత  జరిగిందోనన్న విషయం తేలాల్సి ఉందన్నారు. పొదలకూరు చిట్టేపల్లి తిప్ప వద్ద  ఇళ్ళ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. అక్కడ నిర్మించిన పునాదులు నివాసయోగ్యం అని తేలితే ఇళ్ల నిర్మాణం  పూర్తి చేయిస్తామని, నివాసయోగ్యం కాదని తేలితే  కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తామని చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఇల్లు కట్టించే ఇవ్వాలన్నదే చంద్రబాబు ఆశయమన్న కొలుసు పార్థ సారథి,  గతంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో భాగంగా ఆగిపోయిన పేమెంట్లు మొత్తం చెల్లిస్తామన్నారు.   సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ చిట్టిపల్లి తిప్ప వద్ద జగనన్న కాలనీ లెవెలింగ్, నిర్మాణాల పేరుతో ఆరున్నర కోట్ల రూపాయలు వైకాపా నాయకులు  దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షులు దేగా రవి రాఘవేంద్ర, పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు, నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, కలిచేటి శ్రీనివాసులు రెడ్డి, పెంచల నాయుడు, ఆదాల సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

పవన్ భద్రాచలం పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రాచలం ప్రకటన రద్దైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాణ్ శనివారం (ఏప్రిల్ 5)మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో సాయంత్రానికి భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. శ్రీరామనవమి నాడు అంటే ఆదివారం ( ఏప్రిల్ 6) భద్రాద్రి సీతారామ స్వామి కల్యాణానికి హాజరై అదే రోజు సాయంత్రం భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దైంది. ఈ విషయాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీపీ తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖలకు ఆయన ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించారు. పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దుకు కారణాలు తెలియాల్సి ఉంది.  

భద్రాద్రి సీతమ్మకు బంగారు నేత చీర!

భద్రాచలం సీతారామ స్వామి కల్యాణానికి సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీరను నేసి బహూకరించనున్నారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ తల్లికి బంగారు పట్టుచీరను నేసిన హరిప్రసాద్.. ఈ చీర కొంగులో భద్రాద్రి మూల విరాట్ దేవతలను తీర్చి దిద్దారు. అలాగే బార్డర్ లో శంఖు చక్రాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా నేశారు. అత్యంత కళాత్మకంగా నేసిన ఈ చీర మొత్తం   శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 ఒక్కసార్లు ఉంది. ఈ చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించారు. చీర బరువు ఎనిమిది వందల గ్రాములు కాగా ఇది ఏడు గజాల బంగారు చీర. గతంలో ఇలాంటి అరుదైన ఎన్నో చీరలు నేసిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ కు సీతమ్మ వారి కోసం ఈ బంగారు చీర నేయడానికి పది రోజుల సమయం పట్టింది. ఈ అరుదైన సీతమ్మవారికి సమర్పించాలన్నది ఆయన ఆకాంక్ష, అభిలాష.  ప్రతి ఏటా భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని సిరిసిల్ల నేతన్నలకే ఇవ్వాలని ఆయన సీఎం రేవంత్ ను కోరుతున్నారు.  గత మూడేళ్లుగా సీతారాముల కళ్యాణానికి హరిప్రసాద్ ప్రత్యేకమైన చీరలు నేస్తున్నారు.

పాపం కమ్యూనిస్టులు!

ఖమ్మం లో తగ్గుతున్న ప్రాభవం జిల్లాలో బలహీన పడిన కామ్రేడ్స్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు జిల్లాలో రాజకీయాలను శాసించిన కామ్రేడ్లు నేడు దాదాపుగా జీరోకు చేరుకున్నారు. 1980 లో జరిగిన సమితి ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు (సీపీఎం,సీపీఐ) జిల్లా లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎన్టీఆర్ ప్రభంజనాన్ని  తట్టుకొని మరీ సముచిత స్థానాలు దక్కించుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేయడం, ఎన్నికలలోనూ ఐక్యంగానే పోటీ చేయడం ప్రారంభించారు. ఆ రకంగా 1994 వరకు కలసి పోటీ చేసి గణనీయంగా లబ్ధి పొందారు.  మధ్యలో ఒకటి రెండు సార్లు తెలుగుదేశంతో విభేదించినా పలు ఎన్నికల్లో కలసి పోటీచేశారు. 1999 నుంచీ ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.   ఆ తర్వాత 2004 లో కాంగ్రెస్ తో కలసి పోటీచేసి మంచి ఫలితాలు సాధించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తో కలసి పోటీచేసిన ప్రతిసారి కమ్యూనిస్టులకు జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా గా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టులు కాస్త దూరంగా ఉండటం ప్రారంభించారు. ముదిగొండ లో ఇళ్ల స్థలాల కోసం జరిగిన ఆందోళనలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు సీపీఎం కార్యకర్తలు చనిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం కు దూరం పెరిగింది. ఆ తర్వాత సీపీఎం జిల్లా నాయకత్వంలో జరిగిన పరిణామాలతో సీనియర్ కామ్రేడ్ లు కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటి నుంచి జిల్లాలో సీపీఎం బలహీనపడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో సీపీఎం ఆ ఉద్యమానికి దూరంగా ఉంది. సీపీఐ మాత్రం ఉద్యమంలో భాగస్వామి అయింది.  తెలంగాణ ప్రకటన నేపథ్యంలో 2014 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా పోటీచేసిన సీపీఎం ఖమ్మం జిల్లాలో  మాత్రం  విచిత్రంగా వైసీపీ తో పొత్తు పెట్టుకుంది. సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది . సీపీఎం ఒక్క భద్రాచలం అసెంబ్లీ ని మాత్రమే గెలుచుకుంది. సీపీఐ ఒక్క స్థానం కూడా గెలవలేదు.   అప్పటి నుంచి జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. సీపీఎం, సీపీఐ ల మధ్య కూడా సంత్సంభందాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  అంతేకాదు రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లో 7 స్థానాల్లో 2018  స్థానాల్లో 8, 2023 లో 8 స్థానాల్లో ఆ పార్టీ నే గెలిచింది. కొత్తగూడెం లో ఆ పార్టీ మద్దతు తో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుదారులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది.. సీపీఎం ఖమ్మం టౌన్, భద్రాచలం ప్రాంతంలో కాస్త క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తోంది. సీపీఐ ఖమ్మం రూరల్ ప్రాంతంతో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో కనిపిస్తోంది.. ఇక సీపీఐ (ఎంఎల్) పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగానే ఉంది. ఆ పార్టీ లో సైద్ధాంతిక విభేదాల తో విడిపోయి బలహీనపడున్నారు. జిల్లాలో ఇప్పట్లో కమ్యూనిస్టు పార్టీలు పూర్వ వైభవం సంతరించుకోవడమనేది అసాధ్యంగానే కనిపిస్తోంది. 

రేవంత్ మంత్రివర్గ విస్తరణ.. ఓ అంతులేని కథ !

ఏప్రిల్ 3 తేదీ వచ్చింది. వెళ్ళింది. కానీ  ఆ రోజున  జరుగుతుందని అనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసలు మూడున ముహుర్తమని మీకు ఎవరు చెప్పారు  అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు. అంతే కాదు.. మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం  సో ..అప్పడే కాదు, ఇప్పడు కూడా ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్న సత్యాన్ని చక్కగా తేల్చి చెప్పారు.  సో ... ఢిల్లీ ఎప్పుడు దయతలిస్తే అప్పుడే మంత్రవర్గ విస్తరణ ఉంటుంది. అంతవరకు  ఎవరు ఎన్ని ముహూర్తాలు పెట్టినా  అవి మురిగి పోతాయనే రీతిలో పీసీసీ చీఫ్ చక్కటి క్లారిటీ ఇచ్చారు.  అయితే  అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్  బీసీలకు మరో రెండు మంత్రిపదవులు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కోరామని  అందుకు ఆ ఇద్దరు, ఓకే చెప్పారని చెప్పుకొచ్చారు. అంటే  ఇప్పడు మంత్రివర్గం విస్తరణ కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లేనని పార్టీ నేతలు  పీసీసీ చీఫ్ చెప్పిన మాటలకు  భాష్యం చెపుతున్నారు. అవును  మళ్ళీ చర్చలు, సంప్రదింపులు, సమీకరణలు, లెక్కలు, కుడికలు, తీసివేతలు ఇలా చాలా తతంగం ఉంటుందనీ,  సో.. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదనే విషయం స్పష్టమైందని అంటున్నారు.   నిజానికి  మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని, ’తెలుగు వన్’ ఎప్పుడో చెప్పింది. ఇప్పడు అదే జరిగింది.ఇప్పటికే ఒకటి మూడు ముహూర్తాలు  మురిగి పోయాయి. ముందు మార్చి 29న అన్నారు. ఆ వెంటనే లేదు లేదు ఉగాది పండగ రోజు ( మార్చి 30) సాయంత్రం పక్కా అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 3 ముహూర్తం ఫిక్స్  అన్నారు. ఉగాది పండగ రోజున ముఖ్యమంత్రి, గవర్నర్ ను కలిశారు. అది కూడా అందుకే అంటూ ప్రచారం జరిగింది. అయితే అదీ.. ఇదీ.. ఏదీ ముడి పడలేదు. ఇక ఇప్పడు, బంతి పూర్తిగా ఢిల్లీ పెద్దల కోర్టులో ఉందనే విషయంలో టోటల్ క్లారిటీ వచ్చింది. అఫ్కోర్స్  ఇప్పుడనే కాదు.. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ  ఢిల్లీ పెద్దల ఇష్టం ప్రకామే జరుగుతుంది. నిజానికి  బీజేపీలో కూడా అంతే. అందుకే జాతీయ పార్టీలలో అదొక ఆచారంగా మారిన అపచారం అని పెద్దలు అంటారు. అయితే,ఇప్పడు తెలంగాణ విషయంలో జరుగుతున్నది అదేనా అంటే.. అదే అయినా  ఇంకా ఏదో ఉందనే అనుమానాలు కూడా గాంధీ భవన్  లో వినిపిస్తున్నాయని అంటున్నారు. అదలా ఉంటే ఇప్పడు కాంగ్రెస్ వర్గాల్లో మరో చర్చ మొదలైంది. మార్చి 24న  ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  మీనాక్షి నటరాజన్ లనుఉన్నపళంగా ఢిల్లీకి రమ్మని ఎందుకు పిలిచినట్లు?  నిజంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకే అయితే  అంత హడావిడి చేసి, ఇప్పడు ఇలా  కూల్ కూల్’గా సైలెంట్’ అయిపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధిష్టానం ఇంకెందుకో పిలిస్తే.. ఆ రహస్యం బయటకు చెప్పలేక చెప్పిన ‘విస్తరణకు పచ్చ జెండా’ కథ  బయటకు వచ్చిందా? అందుకే ఇప్పడు ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్దాలు ఆడవలసి వస్తోందా ? అందుకే  మంత్రి వర్గ విస్తరణ కథ ఇలా మలుపుల మీద మలుపులు తిరుగుతూ, డిమ్కీలు కొడుతూ ఒక ప్రహసనంగా మారిందా?  అన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.   అయితే  ఎవరిలో ఎన్ని అనుమానాలు ఉన్నా?  ఆసలు తెర వెనక ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియక పోయినా, ఆశావహులు ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే.. మరో పది రోజులకో, పక్షం రోజులకో  ఎప్పుడో అప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నఆశతో  ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. పెద్దలను కలుస్తూనే ఉన్నారు. ‘ఒక్క ఛాన్స్’ కోసం బరువైన దరఖాస్తులు  సమర్పించుకుంటూనే ఉన్నారు. ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. అదొకటి అలా ఉంటే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందర పాటు నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారి పోతోందని ఢిల్లీ పెద్దలకు విన్నవించుకుంటున్న  పార్టీ సీనియర్ నాయకులు మరో మారు, ‘మార్పు’ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఇదేమీ ఇప్పడు కొత్తగా మొదలైన ప్రయత్నం కాదు. అయితే  హెచ్‌సీయూ భూబాగోతం వంటి  తాజా పరిణామాల నేపధ్యంలో  ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు కూడా బద్నాం అవుతున్న నేపధ్యంలో సీనియర్ నాయకులూ అటుగా ఫోకస్ పెట్టి  ప్రయత్నాల స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.  అదెలా ఉన్నా మంత్రి వర్గ విస్తరణకు  సంబంధించి నంతవరకు  ఢిల్లీ గుప్పిట్లో దాగున్న నిజం ఏమిటో తెలిసే వరకు  ఇదొక  అంతులేని కథలా సాగుతూనే ఉంటుందని, అనుభవజ్ఞులైన పెద్దలు అంటున్నారు.

ఎస్‌బీఐకి తాళాలు!

ఖాతాదారులు ఏకంగా బ్యాంకుకే తాళాలు వేసిన సంఘటన ఇది. ఈ సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తిలో జరిగింది. కొందరు ఖాతాదారులు రాయపర్తిలోని ఎస్బీఐకు తాళం వేసి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ బ్యాంకులో గత ఏడాది నవంబర్ 19న చోరీ జరిగింది. ఆ చోరీలో బ్యాంకులో 497 మంది ఖాతాదారులకు చెందిన 16 కేజీలకు పైగా బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. అప్పటి నుంచీ తమ బంగారం తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఎంతగా మొరపెట్టుకున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు బ్యాంకు కస్టమర్లు, బాధితులు బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారులు ఇటీవల శనివారం (ఏప్రిల్ 4) చెల్లింపులు చేపడతామని  హామీ ఇచ్చారు. దీంతో శనివారం (ఏప్రిల్ 4) ఉదయం బాధితులు బ్యాంకు వద్దకు వెళ్లారు. అయితే బ్యాంకు అధికారులు మరో వాయిదా వేస్తూ, సోమవారం రావాల్సిందిగా చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. పోలీసులు, అధికారులు ఎంతగా చెప్పినా వినకుండా బ్యాంకు ఎదుటే ధర్నాకు దిగారు. తమ బంగారం తిరిగి ఇచ్చేంత వరకూ కదిలేది లేదంటూ బైఠాయించారు. 

చంద్రబాబుతోనే పోటీ అంటున్న లోకేష్

తండ్రితోనే తన పోటీ అంటున్నారు మంత్రి నారా లోకేష్. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ పంపిణీ చేవారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతీ విషయంలో చంద్రబాబుతో పోటీపడేందుకు ప్రయత్నిస్తానన్నారు. కుప్పం మెజార్టీ  కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చారు.  మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానన్నారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపించవనీ, భూగర్భ విద్యుత్‌తో పాటు, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. స్వచ్ఛ భారత్‌లో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పానని,  తాను ఎక్కడికి వెళ్లినా మంగళగిరి తన గుండెల్లో ఉంటుందని వెల్లడించారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తా అని చంద్రబాబుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించి 26 సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండగా అమలు చేశానని గుర్తుచేశారు.

 అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిణి

వివాదాస్పద లేడీ అఘోరీ  చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల  ఇంట్లో బస చేసిన  అఘోరీ మాయమాటలు చెప్పి  శ్రీ వర్షిణిని లోబరుచు కుంది. గత నెల రోజులుగా శ్రీవర్షిణి అఘోరీతో కలిసి ఉంటుంది. తమ కూతురుకి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్దు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తొలుత శ్రీవర్షిణి మేజర్ అని బుకాయించిన అఘోరీ  శుక్రవారం గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది. గుజరాత్ పోలీసులు తమ స్టైల్ లో మర్యాదలు చేయడంతో అఘోరీ లొంగిపోయింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు గుజరాత్ కు వెళ్లి ఆమెను విడిపించారు. 

నాగబాబు పర్యటనలో పిఠాపురం వర్మ అనుకూల నినాదాలు

ఎమ్మెల్సీగా  నాగబాబు తన తొలి అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొట్టమొదటి సారిగా అధికారికంగా పిఠాపురం నియోజకకవర్గంలో శుక్రవారం (ఏప్రిల్ 4) పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని గోల్లప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా నియోజకవర్గంలో తెలుగుదశం, జనసేన ల మధ్య ఉన్న విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. నాగబాబు సమక్షంలో ఇరు పార్టీల కార్యకర్తలు పోటీపోటీగా నినాదాలు చేశారు. జనసేన శ్రేణులు జై జనసేన అంటూ నినాదాలు చేయగా తెలుగుదేశం వర్గీయుల నుంచి పెద్ద పెట్టున జై వర్మ అంటూ పిఠాపురం వర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇటీవల జనసేన ఆవిర్భాత సభలో నాగబాబు వర్మకు సంబంధించి ఒకింత వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులకు ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నాగబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పిఠాపురం వర్మ ఫొటో లేకపోవడంతో తెలుగుదేశం శ్రేణులు పిఠాపురం వర్మకు అనుకూలంగా  నాగబాబు సమక్షంలో నినాదాలు చేశారు. పైగా నాగబాబు నియోజకవర్గ పరిధిలో చేసిన ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద పిఠాపురంలో నాగబాబు తొలి సారిగా జరిపిన పర్యటన నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలను బయటపెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.