ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదు..!

అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు  చేసే ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి.  పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ  అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో ఇంటి’  హామీ గ్యారెంటీ’గా ఉంటుంది. అయితే, పేర్లు మారుతూ ఉంటాయి. ఒకరు ఇందిరమ్మ ఇళ్లు, అంటే ఇంకొకరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటారు. ఇంకొకరు  డబల్ బెడ్  రూమ్ హామీ ఇస్తారు.  అయితే  ఇచ్చిన హామీలను అమలు చేసే ఆచారం మన రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు పెద్దగా లేదు కనుక  పేదోడి సొంత ఇంటి కల, ప్రతి మేనిఫెస్టోలోనూ ఉంటుంది కానీ  భూమి మీద కనిపించదు. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ కల ఎప్పటికీ అలా పగటి కలగానే మిగలి పోతోంది. కొద్ది మంది అదృష్ట వంతులకు మినహా పేదలు అందరికీ ఇల్లు అనే లక్ష్యం  ఇంత వరకు నెరవేర లేదు. ఇక ముందు నెరవేరుతుందన్న ఆశ కూడా లేదు.  పేదల సంగతి సరే.. కానీ,ఇప్పడు సమస్య పేద ప్రజలది కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే ఇంటి సమస్య వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం లేక అవస్థలు పడుతున్నారు. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా  అధికార బాధ్యతలు చేపట్టి 50 రోజుల పైనే అయింది. అయినా ఇంతవరకు ఆమెకు అధికారిక నివాసం కేటాయింపు జరగలేదు. సో .. చేసేది లేక ఆమె షాలిమార్‌ బాగ్‌లోని తమ సొంత ఇంటి నుంచే’ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే  షాలిమార్ భాగ్  నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే  పాతిక కిలో మీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది ఆమెకు  మాత్రమే కాదు సామాన్యులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది.   ట్రాఫిక్ అంక్షల కారణంగా అదే దారిలో ప్రయాణించే సామాన్య ప్రజలకు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటోంది. అలాగ.. షాలిమార్ బాగ్ లో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న  ప్రాంతం భద్రతాపరంగా, ఇతరత్రా అంత అనువుగా లేదని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి  ప్రస్తుత వాసంలో  వాహనాల పార్కింగ్ కు తగినంత స్థలం లేదు. దీంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చి పోయే ప్రజలు,  వీఐపీలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే,ముఖ్యంత్రి రేఖా గుప్తా త్వరగా  ఓ ఇల్లు చూసుకోవాలని ఇటు ప్రజలు, అటు అధికారులు కూడా కోరుకుంటున్నారు.  నిజానికి  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ముందు చూపుతో సర్వ సదుపాయాలు, సర్వ సౌకర్యాలతో ముఖ్యంత్రి అధికార నివాసం  షీష్ మహల్  కట్టించారు. అయితే, షీష్ మహల్   నిర్మాణానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున  దుర్వినియోం చేసిందని  అప్పట్లో బీజేపీ ఆరోపించింది. ఆరోపణల్లో ఎంత నిజం వుందో  తెలియదు కానీ  మొన్నటి ఎన్నికల్లో ఆప్’ ఓటమికి షీష్ మహల్  (అద్దాల మేడ) పై వచ్చిన ఆరోపణలు కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచాయి.  సో.. అన్నిఅరోపణలు చేసి  అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి  ఇంచక్కా వెళ్లి షీష్ మహల్లో సెటిలైపోతే  పరువు అసలు దక్కదని  బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. నిజానికి  ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్  రాజీనామా చేసిన తర్వాత కొద్ది కాలం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి  కూడా షీష్ మహల్ లో కాలు పెట్టలేదు.  అదలా  ఉంటే ఇప్పడు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తమ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్‌ లైన్స్‌ లేదా లుటియెన్స్‌ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లుటియెన్స్‌ ప్రాంతంలో నివాసం కావాలంటే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి అవసరం. దీంతో అధికారిక నివాసం కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష నేత  మాజీ ముఖ్యమంత్రి అతిషి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు అందరికీ అధికార నివాసాలు కేటాయించిన అధికారులు, ముఖ్యమంత్రి ఇంటి సమస్యకు మాత్రం ఒక పరిష్కారం చూపలేక పోతున్నారు.

చంద్రబాబు నివాసంపై దాడి కేసు.. జోగి రమేష్ కు సీఐడీ నోటీసులు

ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపకా తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగి.. ఎదురేలేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్  ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితుల్లో పడ్డారు. గతంలో చేసిన తప్పిదాలకు   మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్ధితిలో ఉన్నారు. అగ్రీగోల్డ్ భూ కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్టై బెయిలు మీద ఉన్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో  ఇప్పటికే  పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్ కు సీఐడీ పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ సారి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కు  నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం (ఏప్రిల్ 11) విచారణకు హాజరు కావాల్సిందిగా  ఆ నోటీసులలో పేర్కొన్నారు.  జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురివింద గింజ సామెతలా.. తాను ఓ వైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ.. అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికారం అండతో పాల్పడిన అక్రమాలకు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితుల్లో పడ్డారు.  

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతటితో ఆగకుండా మాజీ సీఎం సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు.  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే  వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ చేబ్రోలు కిరణ్ పై వేటు ద్వారా స్పష్టంగా చాటింది.  

తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు వర్షాలే వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం   ఉత్తర దిశగా కదులుతోంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ అల్పపీడన ప్రభావం తమళనాడు వరకూ ఉంటుంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 10) నుంచి వాతావరణం 12వ తేదీ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  వర్షాలకు తోడు తీవ్రమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణలో అయితే తెలంగాణలో క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో గురువారం (ఏప్రిల్ 10) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌, పాలమూరు, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.   

కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్య

కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్యకు గురైంది. ఈ దారుణం బీహార్ లో జరిగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. సుష్మను కాల్చి చంపిన ఆమె భర్త రమేష్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ సింగ్ తన భార్య సుష్మను బంధించి ఆమె ఛాతి భాగంలో తుపాకీతో కాల్చి హత్య చేశాడు.  సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

ట్రేడ్వార్‌.. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్నచైనా

ట్రేడ్‌ వార్‌లో అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది.  డ్రాగన్‌ దేశం నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్‌ 104 శాతం సుంకం విధించిన నేపథ్యంలో అమెరికా ఉత్పత్తులపై తాము 84 శాతం సుంకం విధిస్తున్నట్లు బీజింగ్‌ తాజాగా ప్రకటించింది. గురువారం (ఏప్రిల్ 10)   నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా కూడా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్‌.. ఏప్రిల్‌ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనీ, లేదంటే  అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానని హెచ్చరించారు. అయితే ఆ గడువులోగా  చైనా స్పందించలేదు. దీంతో ట్రంప్ అన్నంత పనీ చేశారు. గతంలో విధించిన 54 శాతానికి అదనంగా 50 శాతం జోడించడంతో చైనాపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపించింది. అమెరికా చర్యకు ప్రతిగా తాను కూడా  మరో 50 శాతం సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి ట్రేడ్ వార్ కు సై అంది.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మంత్రం.. మల్లీప్లెక్స్ లలో మద్యం?

ఓటీటీలు వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అన్నది బాగా తగ్గిపోయింది.   ఒకప్పుడు సినిమా తప్ప వినోదానికి మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఇప్పుడు ఓటీటీ, మొబైల్స్‌ వంటివి థియేటర్ల ప్రాధాన్యాన్ని చాలా వరకూ తగ్గించేశాయి. ఒకప్పుడు కొత్త సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్త సినిమా విడుదలైనా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారన్న గ్యారంటీ లేదని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.   రోజురోజుకీ థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది. ఇందుకు కారణం ఓటీటీ.  ప్రతి సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తుండటంతో  ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా వరకూ తగ్గిపోయింది. దీంతో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలిన థియేటర్లకు కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది. అందుకే పివిఆర్‌ సంస్థ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు ఓ కొత్త ఆలోచన చేస్తోంది. మల్టీప్లెక్స్‌లలో మద్యం అమ్మకాలు  చేయాలనేది ఆ ఆలోచన. మద్యం సేవించి థియేటర్లలోకి ప్రవేశించకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సడలించాలని, షాపింగ్‌ మాల్స్‌లో మాదిరిగానే థియేటర్స్‌లో కూడా మద్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని పివిఆర్‌ భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు, గుర్గావ్‌ వంటి నగరాల్లో ఈ సంస్థ.. మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని ప్రభుత్వం ఆమోదిస్తే కొన్నిఎంపిక చేసిన థియేటర్లలో మద్యం అమ్మకాలు సాగించవచ్చని ఆ సంస్థ భావిస్తోంది.  విదేశాల్లోని లగ్జరీ థియేటర్స్‌లో ఈ సదుపాయం ఉంది.   ఇక్కడ కూడా అది అమలు అయితే థియేటర్లకు ప్రేక్షకులు తరలి వస్తారని మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఆశిస్తున్నాయి.  తద్వారా థియేటర్లకు ఆదాయం పెరుగుతుంది. దానితోపాటే ప్రభుత్వానికి కూడా ఆదాయం  ఉంటుంది. అలాగే సినిమాలు నిర్మించే నిర్మాతలకు కూడా ప్రోత్సాహంగా ఉంటుందని పివిఆర్‌ భావిస్తోంది. మరి ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

తెలుగుదేశం పగ్గాలు లోకేష్ కు.. పిఠాపురం వర్మ తాజా డిమాండ్

పిఠాపురం వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపుతు తిరుగుతున్నాయి. గత ఎన్నికలలో కూటమి ధర్మానికి కట్టుబడి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ జనసేనాని పవన్ కల్యాణ్ విజయానికి కృషి చేసిన పిఠాపురం వర్మ ఆ తరువాత జరిగిన పరిణామాల పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరులే  కాకుండా పిఠాపురం తెలుగుదేశం క్యాడర్ కూడా చెబుతోంది. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో నాగబాబు చేసిన కర్మ వ్యాఖ్యలతో నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన మధ్య గ్యాప్ ఏర్పడిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పిఠాపురం వర్మకు ఆహ్వానం అందలేదు. అయితే నాగబాబు పర్యటన ఆద్యంతం తెలుగుదేశం క్యాడర్ వర్మ అనుకూల నినాదాలు చేశారు. వాస్తవానికి పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు అప్పట్లో ఇచ్చిన మేరకు ఎమ్మెల్సీ పదవి   ఇప్పటి వరకు దక్కలేదు. నాగబాబు జనసేన సభలో వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య గ్యాప్ ను పెంచాయి. నాగబాబు పర్యటన వేళ వర్మ మద్దత దారులు, తెలుగుదేశం క్యాడర్ నిరసనలు చేశారు.  వర్మను ఆహ్వానించకుండా నాగబాబు కార్యక్రమాల్లో పాల్గొనటం పై ఆందోళన వ్యక్తం చేసారు. నాగబాబు చేసిన వ్యాఖ్యల తరువాత పిఠాపురంలో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గతంగా రచ్చ సాగుతున్నా, ఇప్పటి వరకూ  ఇటు తెలుగుదేశం అధినాయకత్వం కానీ, అటు జనసేనాని కానీ స్పందించలేదు.   ఈ నేపథ్యంలో పిఠాపురం వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంతకీ ఆయన అన్నదేమిటంటే.. తెలుగుదేశం పార్టీ పగ్గాలను నారా లోకేష్ చేపట్టాలని. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వర్మ వైఖరి ఏమిటన్న చర్చకు తెరతీశాయి. అదలా ఉంచితే..  గతంలో కూడా పిఠాపురం వర్మ  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా పార్టీ పగ్గాలు అప్పగించాలన్నారు.   కాకినాడ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో బుధవారం (ఏప్రిల్ 9) మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నాయకత్వం అవసరమన్నారు.  యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఆయన నూతనోత్సాహాన్ని నింపారనీ, అంతే కాకుండా అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాలుపంచుకోని సీనియర్లంతా అనివార్యంగా బయటకు వచ్చి ప్రజలలో మమేకం అయ్యేలా చేశారనీ  అన్నారు. విజన్ 2047తో పాటుగా పార్టీ భవిష్యత్ కోసం కూడా 2047 ప్రణాళికను రూపొందించాలని పిఠాపురం వర్మ అన్నారు.  

 వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ

వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.  గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని నిందితుడు.  ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ  సిఐడి ప్రత్యేక న్యాయస్థానం  తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించింది.  బుధవారం నాడు ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 9 మందిని  కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో పలుమార్లు రిమాండ్ ను పొడిగించిన న్యాయస్థానం మరో మారు పొడిగించడంతో వంశీ షాక్ లో ఉన్నారు. ఆయన పలు మార్లు బెయిల్ కోసం దరఖాస్తుచేస్తున్నప్పటికీ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం లేదు. టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో కూడా వంశీ నిందితుడు.

తైవాన్‌లో మళ్లీ భూకంపం

వరుస భూకంపాలతో తైవాన్ బెంబేలెత్తిపోతున్నది.  గత నెల 28న సంభవించిన భూకంపం సృష్టించిన విలయం నుంచీ, మారణహోంమ నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం (ఏప్రిల్ 9) మరోసారి తైవాన్ లో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. గత నెల 28న 7.7 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. అప్పటి భూకంపంలో 3600 మందికి పైగా మరణించారు. మరో 5 వేల 17 మంది గాయపడినట్లు తైవాన్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ మరో 160 మంది జాడ తెలియల్సి ఉందని పేర్కొంది. ఆ భూకంపానికి సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే తాజాగా మరోసారి భూకంపం సంభవించడంతో జనం భయాందోళనలకు గురౌతున్నారు. బుధవారం (ఏప్రిల్ 9)న కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   ఈశాన్య తీరంలోని యిలాన్‌కు ఆగ్నేయంగా 21 కిలోమీటర్లు దూరంలో భూమికి 69 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.  కు సిబ్బంది సహకారం అందించారన్నారు.

జగన్ క్షమాపణలు చెప్పకుంటే న్యాయపోరాటం.. పోలీసు అధికారలు సంఘం హెచ్చరిక

రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణలకు చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామని జగన్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. బట్టలూడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీసులు ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారన్న ఆయన జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పోలీసులు జనం కోసం పని చేస్తున్నారు తప్ప జగన్ వంటి నేతల కోసం కాదని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేవలం రాజకీయ మైలేజ్ కోసం జగన్ తీపత్రేయపడుతున్నారని జనకుల శ్రీనివాస్ అన్నారు.  పోలీసు యూనిఫారం ఉక్కు కవచం వంటిదనీ, రాజ్యాంగ హక్కును కాపాడేదనీ చెప్పిన ఆయన జగన్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  లేకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.   అంతకు ముందు జగన్ వ్యాఖ్యలను రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు యూనిఫారం జగన్ ఇస్తే వేసుకున్నది కాదు, కష్టపడి చదివి సాధించినది, ఎవడో వచ్చి ఊడదీస్తామనడానికి ఇదేమీ అరటి తొక్క కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు. పోలీసు యూనిఫారంలో ఉండి చేసిన ఈ వీడియోలో నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా ఛస్తాం అంతే కానీ ఎవడి కోసమో అడ్డదారులు తొక్కమంటూ సీరియస్ గా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగన్ ను హెచ్చరించారు.  

ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం... ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు 

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఐపిఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. అతని పాస్ పోర్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారి అయ్యాయి. ఈ విషయాన్ని సిట్ అధికారులకు సిబిఐ సమాచారమిచ్చింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ప్రభాకర్ రావు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే మకాంవేశారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వల్ల కేసీఆర్ ప్రభుత్వం అపఖ్యాతిని మూట గట్టుకుంది. 

జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. జగ్గారెడ్డి మల్టీరోల్స్!

జగ్గానందస్వామి.. జగ్గుభాయ్.. పాలిటిక్స్‌కు టెంపరరీగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు కనిపిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి పేరు చెబితేనే ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ అని అందరూ అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిస్తే మాత్రం కచ్చితంగా మంత్రి పదవి ఆయనకి దక్కేదన్న టాక్ ఉంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంగారెడ్డిలో గెలుపు మెట్లు ఎక్కిన జగ్గారెడ్డికి గత ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. పార్టీని, పార్టీ నేతలను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేసే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. దాంతో ఇప్పుడు ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ లు పెట్టి మైకును మోత మోగించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారోనని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారట. అకస్మాత్తుగా రాజకీయాలకు జగ్గారెడ్డి ఎందుకు దూరం అయ్యారోనని ఆరా తీస్తే రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆయన హైదరాబాద్ కి తిరుగు పయనం అయ్యారు. ఆ టూర్‌లోనే జగ్గారెడ్డిలో నిర్వేదం వచ్చి, కొత్త కొత్త అవతారాలు బయటపడుతున్నాయంట. ఇన్ని రోజులు ఓ పొలిటికల్ లీడర్‌గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా తనలో ఓ యాక్టర్‌ని రివీల్ చేస్తున్నారు.  వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం జగ్గారెడ్డి హైదరాబాద్‌ని పూర్తిగా వదిలేశారన్న ప్రచారం జరుగుతున్నది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికే ఎక్కువగా టైం కేటాయిస్తున్నారట. అది కూడా రాజకీయాలు వదిలేసిన ఆయన సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ రాం మందిరంలో రామభజన చేస్తూ భక్తిలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం పాలిటిక్స్‌ని పక్కన పెట్టి సంగారెడ్డిలో పండుగలు, భజనల్లో బిజీగా ఉన్నారంట. మహాశివరాత్రి రోజు సంగీత విభావరి పెట్టిన జగ్గారెడ్డి హొలీ వేడుకల్నీ అదే స్థాయిలో నిర్వహించారు. చిన్న, పెద్ద, మిత్రులు, అభిమానులతో కలిసి హోలీ ఆడారు. హొలీ అయ్యిందో లేదో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.  అది అయిపోగానే ఉగాది వేడుకలు, శ్రీ రామ నవమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇలా పండుగ ఏదైనా కేరాఫ్ జగ్గారెడ్డి  అనే విధంగా హడావుడి చేస్తున్నారంట. ఇక ఇన్నాళ్లు ఆయన్ని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనాలు త్వరలో ఇక సినిమా థియేటర్లలోనూ క్యారెక్టర్ యాక్టర్‌గా చూడనున్నారు. జగ్గారెడ్డి కాస్తా భక్తిలో జగ్గానంద స్వామిగా మారడం... సినిమాలో జగ్గూభాయ్‌లా ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు, అనుచరులు ఖుషీలో ఉన్నా కాస్త కన్ఫ్యూజ్‌లో పడ్డారట.   పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందోనని అనుచర గణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. కొందరేమో మార్పు మంచిదే అంటున్నారట. మరి కొందరు మార్పు వెనుక ఏదో మర్మం ఉందని ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నారు. ఎప్పుడూ రాజకీయాల్లో తన మాటలతో తూటాలు పేల్చే జగ్గారెడ్డి.. మౌనంతోను రాజకీయాల్లో మంట పుట్టిస్తున్నారిప్పుడు. మరి రాజకీయాలు వదిలేసి రామ భజన చేస్తున్న జగ్గారెడ్డి మళ్ళీ పొలిటికల్‌గా ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.

అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  అమరావతి నుండి హైదరాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించిన  సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని కేంద్రం రోడ్డు రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది.  ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సూచించింది.    గత నెల 3న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఏపీ ఎస్‌ఎఫ్‌సీ విభజన, విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10 లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయ ప్రాజెక్టులు, అప్పుల పంపకం, రోడ్డు, రైలు, విద్యా సహా పలు అంశాలపై ఈ సమావేశం చర్చించింది.  ఇరు రాష్ట్రాల మధ్యా అపరిష్కృత అంశాలపై రెండు రాష్ట్రాల  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపింది. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.  రెండేళ్లలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని రైల్వే బోర్డు ప్రకటించింది.   వెనుకబడిన జిల్లాలకు అందించే గ్రాంట్‌కు సంబంధించి ఏపీకి పెండింగ్ ఉన్న మరో రూ.350 కోట్లు విడుదల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక వ్యవసాయశాఖ వెల్లడించింది. దుగ్గరాజపట్టం వద్ద పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదిక అందిందని, కొద్ది రోజుల్లో పూర్తి ప్రాజెక్టు రిపోర్టు అందుతుందని దాని ఆధారంగా ముందకు వెళతామని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.  

క్రాప్ హాలీడే.. ఆక్వా రైతుల నిర్ణయం

ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో దారుణంగా నష్టపోతున్న రొయ్యాల రైతులు అక్వా సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆక్వా సంఘాలూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 1 తరువాతే సీడ్ స్టాకింగ్ ఆరంభించనున్నట్లు ప్రకటించాయి. రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై భీమవరంలో మంగళవారం (ఏప్రిల్ 8)న జరిగిన అక్వారైతుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచీ ఆక్వారైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రొయ్యల మేత నుంచి మద్దతు ధర వరకూ అన్ని విధాలుగా తమకు అన్యాయం జరుగుతోందని ఈ సమావేశంలో రొయ్యల సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు సెలవు ప్రకటించారు. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ వచ్చిన రైతులు స్పష్టం చేశారు.   

మెట్రో రైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డి.. ఫెవికాల్ బంధం

మెట్రో రైలు ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని తెలంగాణ సర్కార్ తిరిగి అదే నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ బుధవారం (ఏప్రిల్ 9) ఉత్తర్వలు జారీ చేశారు. మరో ఏడాది పాటు ఎన్వీఎస్ రెడ్డిని హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీగా  కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.     ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రీ అపాయింట్మెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో కొనసాగుతున్న వారిని తెలంగాణ సర్కార్ ఇటీవలే తొలగించిన సంగతి తెలిసిందే. అలా తొలగించిన వారిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే   మెట్రో సెకండ్ ఫేజ్  సత్వరమే, సజావుగా సాగాలంటే ఎన్వీఎస్  రెడ్డి సేవలు కీలకం, అత్యవసరం అని భావించి ఆయనను తిరిగి నియమించింది. 

పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి: ఖర్గే 

ఎఐసిసి చీఫ్ మల్లి ఖార్జున్ ఖర్గే బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్ట పడి పని చేయకపోతే ఇంట్లో కూర్చొండి అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని నేతలపై చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమైంది.  కష్టపడి పని చేసే వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు ఖర్గే చెప్పారు. బాధ్యతలు తీసుకోనివారు విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో   ఖర్గే మాట్లాడారు. బిజెపి మతకలహాలను ప్రోత్సహించిందన్నారు. ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలోనే బిజెపిని గద్దెదించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.  కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి పిలుపు నిచ్చింది. ప్రధాని మోది స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. 

అమరావతిలో బాబు ఇంటి నిర్మాణానికి భూమి పూజ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి బుధవారం (ఏప్రిల్ 9) భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు.  వేద పండితుల ఆధ్వర్యంలో  ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది. సచివాలయం వెనుక ఇ9  రహదారి పక్కనే ఇంటి నిర్మాణం జరగనుంది.రాజధాని కోర్ ఏరియాలో వెలగపూడి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండనుంది. 2024 డిసెంబరులో చంద్రబాబు ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం ఐదు ఎకరాల  రెసిడెన్షియల్ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు.  ఇటీవలే రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఐదు రోజుల కిందటే భూమి చదును పనులు  చేపట్టారు. ఆ పనులు మంగళవారం (ఏప్రిల్ 8)తో పార్తయ్యాయి. దీంతో బుధవారం (ఏప్రిల్ 9) భూమి పూజ నిర్వహించారు.  ఇంటి నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇలా ఉండగా కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజపై నారా బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా స్పందించారు.  పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నూతన అధ్యాయానికి ఇది ప్రారంభం అని పేర్కొన్నారు.