హైదరాబాద్‌లో రేపు మాక్‌డ్రిల్.. సైరన్‌ మోగితే సమప్తం బంద్‌

    హైదరాబాద్ నగరంలో రేపు సాయంత్రం  4 గంటలకు ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్‌డ్రిల్    నిర్వహించనున్నారు. దేశంలో నెలకొన్న భద్రత పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్, కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, మౌలాలిలోని ఎన్‌ఎఫ్‌సీ‌లలో ఈ భద్రతా విన్యాసాలు ఏకకాలంలో జరగనున్నాయని రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 259 సున్నిత ప్రదేశాలలో ఈ మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగ్రదాడులు జరిగినప్పుడు పౌరుల ఆత్మరక్షణకు ఎలా చేసుకోవాలని అనేది కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.మొత్తం 259 సున్నిత ప్రదేశాలలో ఈ మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది.  ఈ మాక్ డ్రిల్స్ నిర్వహణపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు కేటగిరీ-2లో ఉన్నాయి. దేశంలో నెలకొన్న భద్రత పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో రేపు కీలక భద్రతా విన్యాసాలు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పౌరులను, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు.   

ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో అబ్దుల్ కలాం విగ్రహాలు

  వైబ్రంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ  ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకుచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడుతూ...పదేళ్లుగా దేశ వ్యాప్తంగా అబ్దుల్ కలాం పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.  అబ్దుల్ కలాం స్ఫూర్తితో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ‘గ్రేట్ ఇండియన్ స్టాట్యూస్’ పేరుతో 20 అడుగుల ఎత్తుతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ కలాంను చంద్రబాబు అభినందించారు. భారతదేశ క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం అని, రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాంతో తనకున్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, సంస్థ సభ్యులు శివ, భాస్కర్, శ్రీను, రంజిత్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.  

మైనింగ్ మాఫియా డాన్ గాలికి ఏడేళ్ల జైలు

ఎట్టకేలకు మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్థనరెడ్డి పాపం పండింది. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం ( మే 6) తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం దాదాపు 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.  ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్‌ రెడ్డి,  బీవీ శ్రీనివాసరెడ్డి,  మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురికి ఏడుళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్‌తో రూ.వేల కోట్లు సంపాదించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరిన గాలి జనార్దన్‌రెడ్డికి చివరకు ఇదే ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఉచ్చు బిగుసుకుంది.  ఓబులాపురంలో సాగించిన  అక్రమాలు నిజమేనని సీబీఐ కోర్టు తేల్చింది. ఈ కేసులో ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్‌ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 కె.మెఫజ్‌ అలీఖాన్‌లను దోఖషులుగా తేల్చి కోర్టు.. ఏ8 కృపానందం, ఏ9 సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది.  ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. ఏ6గా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని 2022లో కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జి చేసింది.  దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కుంభకోణాల్లో ఓబులాపురం మైనింగ్ కుంభకోణం ఒకటి. ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కర్ణాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇనుప ఖనిజ తవ్వకాలలో జరిగిన అక్రమాలకు సంబంధించింది. ఈ స్కామ్ ప్రధానంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీతో ముడిపడి ఉంది. దీనిని రెడ్డి సోదరులు.. గాలి జనార్థన రెడ్డి, గాలి కరుణాకర రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి నడిపించి మైనింగ్ డాన్లుగా ప్రసిద్ధి చెందారు. వీరు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రులుగా కూడా పనిచేశారు. ఈ కుంభకోణంలో బళ్లారి , అనంతపురం ప్రాంతాలలో అక్రమ ఖనిజ తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ.. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అటవీ భూములలో అనుమతి లేకుండా ఇనుప ఖనిజాన్ని తవ్వినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతించిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి 29.30 లక్షల టన్నుల ఇనుము ఖనిజాన్ని ఓఎంసీ సంస్థ అక్రమంగా తవ్వినట్లు సీబీఐ ఆరోపించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ.. 2007-2010 మధ్య దాదాపు 60 లక్షల టన్నుల ఇనుము ఖనిజం అక్రమంగా తవ్విందని సీబీఐ అభియోగాలు మోపింది. దీని విలువ దాదాపు రూ. 42,000 కోట్లు ఉంటుందని చార్జిషీట్ లో పేర్కొంది. కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే 2011లో సమర్పించిన నివేదిక ప్రకారం.. ఖనిజ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. జీరో రిస్క్ సిస్టమ్అనే రక్షణ, దోపిడీ వ్యవస్థను సృష్టించి గాలి జనార్థన రెడ్డి ఈ కుంభకోణానికి తెరలేపినట్లు పేర్కొంది. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనుబంధంగా ఉన్న జీఎల్ఏ ట్రేడింగ్  జీజేఆర్ హోల్డింగ్స్ వంటి గాలి జనార్థన్ రెడ్డి సోదరుల సంస్థలు.. అక్రమ తవ్వకాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశీ కంపెనీలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగవేయడంతో పాటు ఆదాయాన్ని దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గాలి జనార్థన్ రెడ్డి సోదరులపై అభియోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సిఫార్సు మేరకు 2009లో సీబీఐ ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించింది. రెండేళ్ల విచారణ అనంతరం 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్థన రెడ్డి, అతని బావ బీ.వీ. శ్రీనివాస రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అలాగే ఈ కుంభకోణం కేసులోమాజీ ఐఏఎస్ అధికారి వీ.డీ. రాజగోపాల్,  ఏపీ ఇండస్ట్రీస్ మాజీ కార్యదర్శి వై. శ్రీలక్ష్మిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఓబులాపురం కంపెనీకి ప్రాధాన్యత ఇచ్చి ఇతర దరఖాస్తుదారులకు లైసెన్సులు నిరాకరించినట్లు రాజగోపాల్ ,  శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ఓబులాపురం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి 2015లో జనార్థన రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెలలో వాదనలు పూర్తయ్యాయి.

ఏపీలో బేబీ కిట్ల సరఫరా పథకాన్ని పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం

  వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన బేబీ కిట్లు పథకాన్ని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన 11 వస్తువులతో దోమ తెరతో కూడిన బేబీ బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్ షీట్, బేబీ డ్రెస్, వాష్ బుల్ నేప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సబ్బు, సోప్ బాక్స్, బేబీ రాటిల్ టాయ్ కూడిన ప్రతి కిట్ కు రూ.1,410లు ఖర్చు అవుతుంది. గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద కొంత మేర‌కు కేంద్ర సాయం అందేది.  ఈ సాయాన్ని ఇప్పుడు ఎన్డీయే సర్కార్ నిలిపివేసింది.  మాతృత్వ వందన యోజన, 15వ ఆర్థిక కమిషన్ నిధుల కింద కూడా ఈ కిట్ల సరఫరాకు కేంద్ర ప్ర‌భుత్వ సాయం ల‌భించే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఈ ప‌థ‌కానికి అవ‌స‌ర‌మైన నిధుల్ని కూటమి సర్కార్ నిధుల‌నుంచే అంద‌జేయాల‌ని వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌లో జ‌రిగి ప్ర‌స‌వాల్లో స‌గానికి పైగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనే జ‌రుగుతున్నాయి. 

ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి దోషి.. సీబీఐ కోర్టు తీర్పు

ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా  తేల్చింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఎఎస్ కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 14 ఏళ్లుగా సాగుతున్న ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మంగళవారం ( మే6)న సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో   గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బంధువు బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పీఏ మెఫజ్ అలీఖాన్,  గనుల శాఖ అప్పటి  డైరెక్టర్ వి.డి. రాజగోపాల్  సహా ఓబులాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా నిర్ధారించింది.   ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో   మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. వారిలో లింగయ్య అనే వ్యక్తి మరణించగా, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని   హైకోర్టు 2022లోనే నిర్దోషిగా ప్రకటించింది.  మిగిలిన ఏడుగురిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ అధికారి కృపానందంలను సీబీఐ కోర్టు నిర్దోషులుగా చేర్చింది. కాగా దోషులుగా తేల్చిన వారికి కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.  దాదాపు   884 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారంటూ ఓఎంసీపై ఆ చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. అప్పటి నుంచీ ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 మంది  సాక్షులను విచారించిన సీబీఐ 3,400 డాక్యుమెంట్లలతో  సీబీఐ 2011లో చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా

  రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసి సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్‌లో ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో కమిటీ చర్చలు జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే ఈనెల 7 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీజేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు.. తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.   

హీటెక్కిస్తున్న కులగణన రాజకీయం!

కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం చుట్టూ రాజకీయం హీటెక్కుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తుండగా, దీనిని ఎన్నికల్లో ఎలా ప్లస్ పాయింట్ గా మార్చుకోవాలన్న విషయంపై రెండు పార్టీలూ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.  నిజానికి నార్త్ ఇండియా దగ్గర్నుంచి సౌత్ ఇండియా వరకూ కులాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతుంటాయి. క్యాస్ట్ పాలిటిక్స్ గెలుపోటములపై ఎఫెక్ట్ చూపుతుంటాయి. ఇప్పుడు ఈ కులగణన మైలేజ్   తమ ఘనతే అని చెప్పుకునేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి.  కులగణనకు తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. సీడబ్ల్యూసీలోనూ తెలంగాణ మోడల్ నే కేంద్రం పరిగణలోకి తీసుకుని జనాభా లెక్కల సమయంలో ఉపయోగించాలని తీర్మానించింది.  అయితే ఇది బీజేపీకి ఏమాత్రం రుచించడం లేదు. అసలు రాష్ట్రాలకు కులగణన చేసే హక్కే లేనప్పుడు, అది చట్టబద్ధమే కానప్పుడు.. దాన్నెలా రోల్ మోడల్ గా తీసుకోవాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తేగానీ, ఇన్నాళ్లూ కులగణనపై నిర్ణయం తీసుకోని బీజేపీ ఇప్పుడు నిర్ణయం తీసుకుని రాజకీయం చేయడమేంటని కాంగ్రెస్ గరమవుతోంది.  కులగణన, సర్వేకు మధ్య తేడా ఏంటో అందరికీ వివరించాలని, ఇందులో కాంగ్రెస్ చేసిందేమీ లేదని తెలంగాణ బీజేపీ ప్రచారం చేసేందుకు డిసైడ్ అయింది. కులగణన క్రెడిట్ ఏ మాత్రం  హస్తం పార్టీకి వెళ్లకుండా ఇప్పటి నుంచే బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. అసలు ఉన్నట్లుండి కేంద్రమంత్రి వర్గం కులగణన చేయాలని నిర్ణయించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ కూడా పెరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. నిజానికి అక్కడ కుల రాజకీయాల జోరు చాలా ఎక్కువగా ఉంటుంది. 2023లో కుల గణన జరిపి, దాని ఆధారంగా రిజర్వేషన్ కోటాను పెంచే ప్రయత్నం చేసినా కోర్టుల్లో అడ్డుకట్ట పడింది. దీంతో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్న తమ నినాదానికి కులగణనతో పరిపూర్ణత చేకూరుతుందని బీజేపీ  లెక్కలు వేసుకుంటోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ పై పై చేయిసాధించాలంటే ఇంతకు మించి ప్లాన్ చేయాల్సిన పరిస్థితి.  బిహార్‌లో 36% అత్యంత వెనుకబడిన వర్గాలు , 27.1% మంది BCలు ఉన్నారని,  2023 కులగణన వెల్లడించింది. అటు 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కులగణన చుట్టూ గేమ్ నడిపేలా పొలిటికల్ పార్టీల వ్యవహారం నడుస్తోందంటున్నారు. సో క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా బీజేపీ ఎన్ని ప్లాన్లు వేసినా.. తెలంగాణలో కులగణన చేసి నిజాయితీ, చిత్తశుద్ధి నిరూపించుకున్నామన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తామే నిజాయితీతో ఉన్నామంటున్నారు. సో కులగణన అజెండా కులమే బలంగా మారుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఇంపాక్ట్ చూపేందుకు రెడీ అవుతోంది. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారన్నదే ఇప్పుడు హాట్ డిబేట్. కులగణన విషయంలో ఏ పార్టీని ఎక్కువగా నమ్ముతారన్న విషయంపైనే విజయావకాశాలు ఆధారప డ బోతున్నాయ్.

అంగన్ వాడీలకు తీపికబురు.. జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

  అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి వేతలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ టీచర్లను అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోట్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లు ఇకపై అంగన్‌వాడీ టీచర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్‌వాడీ అనే తేడా ఉండదు. కాగా, గతంలో మినీ అంగన్‌వాడీలకు రూ.7800 జీతం మాత్రమే ఇస్తుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ.13,650 జీతం అందనుంది.  పెంచిన వేతనం ఏప్రిల్ నెల నుంచి అకౌంట్లలో జమ కానుంది.  అయితే, శాలరీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 అంగన్‌వాడీ టీచర్లు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు జీతం పెంచినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్నికి వారు కృతజ్ఙతలు తెలిపారు.

అందాల పోటీలతో గ్లోబల్ అటెన్షన్ .. తెలంగాణ లక్ష్యం ఇదే!

సింగిల్ ఈవెంట్... 120కి పైగా దేశాల్లో బ్రాండింగ్.. ఇదే తెలంగాణ సర్కార్ ప్లానింగ్. అవును 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ గ్లోబల్ అటెన్షన్ సాధించేందుకు సిద్ధమైంది. సిటీలో సందడి షురు అయిపోయింది. విదేశాల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. జస్ట్ అందాల పోటీలంటే పోటీలు పెట్టేసి కథ ముగించడం కాదు. ఇందుకోసం ఖర్చుపెట్టే ప్రతి పైసాకు భారీ లాభం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసి పెట్టింది. ఎందుకంటే 120కి పైగా దేశాల నుంచి కంటెస్టెంట్లు.. వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు వస్తారు. వారి ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను హైలెట్ చేయడం,  ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణవైపే ఉండేలా చేయడం కీలకం.  అందుకే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. తొలిసారి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దాన్ని పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేలా రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసేసింది.   హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు కనీవినీ ఎరుగని విధంగా జరిపేలా డిజైన్ చేసింది.  ఈనెల 10 నుంచి జరిగే ఈవెంట్స్ కు హైదరాబాద్ రెడీ అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ ఉండబోతోంది. అటు అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు.  ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తెలంగాణ జరూర్ ఆనా నినాదాలు కనిపించేలా, వినిపించేలా టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. శంషాబాద్‌ విమా నాశ్రయం వస్తున్న సుందరీమణులకు టూరిజంశాఖ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతోంది. గ్లోబల్ సెలబ్రిటీల సందడితో శంషాబాద్ పరిసరాల్లో జోష్ పెరిగింది. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్, 3 స్టార్‌ హోటల్స్‌లో ముందస్తు బుకింగ్‌ చేశారు. అంతే కాదు.. టూరిజం శాఖ తరఫున పోటీదారులకు అందించేందుకు ఫుల్ డిటైల్స్ ఉన్న బుక్‌లెట్‌ను రెడీ చేస్తున్నారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాల్లో బ్యూటిఫికేషన్   ఫైనల్ స్టేజ్ కు వచ్చింది.   మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి.. దగ్గరుండి పర్యవే క్షిస్తున్నారు. ఏప్రిల్ 29న సీఎం సమీక్ష   నిర్వహించారు. అక్కడితో ఆగకుండా.. నిరంతరం పనులు సాగుతున్న తీరును, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  మే 10 తేదీ నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలూ, సలహాలూ ఇస్తున్నారు.   మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లు కేవలం  కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కు పరిమతమయ్యేలా కాకుండా,  షెడ్యూల్ ప్రకారం వారిని తెలంగాణలోని అన్ని టూరిజం స్పాట్లకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు.    మే 12న హైదరాబాద్ చారిత్రక, వారసత్వ గొప్పదనం చెప్పేలా చార్మినార్ ప్రాంతంలో  హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అదే రోజు నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్కును ప్రపంచానికి తెలిపేలా ఆధ్యాత్మిక పర్యటనకు తీసుకెళ్తారు. ఈనెల 13న హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న చౌమహల్లా ప్యాలెస్ తీసుకెళ్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంది.  ఇక మే 14న వరంగల్ లోని థౌజండ్ పిల్లర్ టెంపుల్, వరంగల్ పోర్ట్ కు తీసుకెళ్తారు. అదే రోజు రామప్ప ఆలయ సందర్శన కు కూడా తీసుకువెడతారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రత్యేకతలను వివరిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన అరుదైన పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు. మే 15న యాదగిరి గుట్ట ఆలయ సందర్శన ఉండనుంది. డివోషనల్ టూరిజంలో భాగంగా ఈ చోట్లకు తీసుకెళ్తారు. అదే రోజు గ్రూప్ 2లోని కంటెస్టెంట్లను పోచంపల్లికి తీసుకెళ్లి అక్కడ చేనేత తయారీ విధానాన్ని చూపుతారు. అలాగే  చేనేత వస్త్రాలతో వారు ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకే ఈ  షో ఏర్పాటు చేశారు.  మే 16న వివిధ దేశాల నుండి చికిత్సల కోసం వచ్చే వారిని ఆకర్షించేలా మెడికల్ టూరిజం ప్రోగ్రామ్ రెడీ చేశారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు గ్రూప్ 1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు హాజరవుతారు. తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్య చికిత్సలు అందించే పరిస్థితిని వివరిస్తారు. 16న పిల్లల మర్రి, అదే రోజు ఎక్స్ పీరియం ఎకో పార్క్ సందర్శన, 17న రామోజీ ఫిలిం సిటీ సందర్శన, 18న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సేఫ్టీ టూరిజంపై డెమో ఇస్తారు. జ అదే రోజు సచివాలయం తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ చరిత్ర గురించి వివరించనున్నారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్ కు తీసుకువెడతారు.  చివరగా ఈనెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించడంతో ఈ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా ముగిస్తారు. తద్వారా తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ తెలంగాణ సర్కార్ చేసింది.

ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లాగనే చూస్తారు...కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ముఖ్యమంత్రి రాష్ట్ర పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్నికి అణా పైసా అప్పు పుట్టడం లేదని.. అప్పుల కోసం బ్యాంకుల వద్దకు వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని సీఎం రేవంత్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇలా చెబితే ఎవరూ నమ్మడం లేదు.. కానీ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందని అన్నారు. స్వీయ నియంత్రణ మాత్రమే దీనికి సరైన పరిష్కారం అని అన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.   ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి.. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావుని కేటీఆర్ అన్నారు. నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారని ఆయన విమర్శించారు.  రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా? సర్కస్ నడుపుతున్నావా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు.. నిన్న రూ.8,29 లక్షల కోట్లు అని చెపుతున్నాడు.పూటకో లెక్క మాట్లాడుతూ, సంఖ్య పెంచుతున్నాడు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అని కేటీఆర్ క్లారీటీ ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఇది కాగ్ లెక్క..మీ లాగా కాకి లెక్క కాదని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి ? నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదని   కేటీఆర్ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు చివరిసారిగా చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

పొన్నవోలు అనుచరుడికి నామినేటెడ్ పోస్టు!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నియమకాలు ఎలా జరుగుతున్నాయన్న అయోమయం నెలకొని ఉంది. వైసీపీ సానుభూతిపరులకు పదవులు కట్టబెట్టడం, ఆ తరువాత తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో జరిగిన పొరపాటు తెలుసుకుని నాలుక కరుచుకుని ఆ పదవి నుంచి సదరు సానుభూతి పరుడిని పీకేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అదేమిటంటే ఒక న్యాయ వాదికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. అలా కట్టబెట్టిన ఒక రోజులోనే ఆ పదవి నుంచి ఆ న్యాయవాదిని పీకేసింది. ఎందుకయ్యా అంటే ఆ న్యాయవాది వైసీపీయుడు కావడమే. అసలు ఏదీ చూసుకోకుండా, ఎవరికి ఏ పదవి కట్టబెడుతున్నామన్నది తెలియకుండానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నియామకాలు జరుగుతున్నాయా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక ప్రహసనంగా మారిందా అంటే తాజా పరిణామాన్ని గమనిస్తే ఔనన్న సమాధానమే వస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం, మిత్రపక్షాల నేతల కంటే వైసీపీ సానుభూతి పరులకే పెద్ద పీట వేస్తున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా  ఒక న్యాయవాదిని ప్రభుత్వం కీలక నామినేటెడ్ పోస్టులో నియమించింది.  ఆ తరువాత  ఆ న్యాయవాది వైసీపీ సానుభూతిపరుడని పేర్కొంటూ కేటాయించిన నామినేటెడ్ పదవిని రద్దు చేసింది.   విషయంలోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన న్యాయవాది జి. దినేశ్ కుమార్ రెడ్డిని ఎస్‌పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఆపరేషన్ సర్కిల్ బోర్డు లీగల్ కౌన్సిల్ (బీఎల్‌సీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకంపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే సదరు న్యాయవాది జగన్ హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పని చేసిన పొన్నవోలు అసిస్టెంట్ కావడమే. పొన్నవోలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన వైసీపీ నేతల కేసుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాదిస్తుంటారు. అటువంటి పొన్నవోలు అసిస్టెంట్ దినేశ్ కుమార్ రెడ్డికి  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు కట్టబెట్టడమేంటి? అంటే తెలుగుదేశం శ్రేణులు ఓ రేంజ్ లో ఫైరయ్యాయి.   వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి పేరిట అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అంగళ్లు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం, వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘటనలో చంద్రబాబు సహా వందలాది మంది టీడీపీ శ్రేణులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనల విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, దినేశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అసలే పొన్నవోలు అసిస్టెంట్, ఆపై చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసులు వాదించిన వ్యక్తికి ముందు వెనుకలు చూసుకోకుండా నామినేటెడ్ పోస్టు ఎలా కట్టబెట్టారన్న ఆగ్రహం, అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల నుంచి వ్యక్తం అయ్యింది.  దీనిపై తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. దీంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్ ఈ వ్యవహారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన దీనిని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లడంతో దినేష్ కుమార్ నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దినేష్ కుమార్ నియామకం రద్దును స్వాగతిస్తూనే తెలుగుదేశం శ్రేణులు అసలా నియామకానికి సిఫారసు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పారు్టీ అధిష్ఠానం కూడా ఇదే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.   

మోదీ సర్కార్ కొత్త యుద్ధం!

అవును. ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు అన్నట్లు, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే వుంది. ఏప్రిల్ 22 న 26 మంది హిందువులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడి కూడా నడుస్తున్న యుద్ధంలో  భాగమే. నిజానికి  పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాల్లో కంటే.. గత 30 – 40 ఏళ్లకు పైగా పాకిస్థాన్ సాగిస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం, ఉగ్ర దాడుల వలన ఎక్కువ ప్రాణనష్టం జరిగిందన్నా ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త యుద్దానికి తెరతీశారు. కొత్త  యుద్ద తంత్రాన్ని తెర మీదకు తెచ్చారు. అందుకే  సరిహద్దుల అవతలి శత్రువులకే కాదు, అంతర్గత శత్రువులకు కూడా కంటి మీద కునుకు ఉండడం లేదు. అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అటు నుంచే కాదు ఇటు నుంచి  కూడా  సింధు జలాలను ఎలా ఆపుతారు? ఇప్పటికిప్పుడు డ్యాములు ఎక్కడ కడతారు? అసలు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం  చేయడం ఏమిటి ? ఇది జల తీవ్ర వాదం కాదా? యుద్ధం ప్రభుత్వాలతో చేయాలి, సేనలు చేయాలి అంతే కానీ సామాన్య  ప్రజలను నీరు లేకుండా చేయడం ఏమిటి? ఇది మానవత్వం అనిపించుకుంతుందా? అంటూ  నిలదీసే వారు,  ప్రశ్నించే వారు ఆ  పని చేస్తూనే ఉన్నారు.  అయితే.. ప్రధాని మోదీ  వెయ్యేళ్ళ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలనే దృఢ సంకల్పంతో, అడుగులు వేస్తున్నారు. దాయాది దేశం పేరున దశాబ్దాలుగా శత్రు దేశం పాకిస్థాన్ సాగిస్తున్న ప్రచ్చన్న యుద్దాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు  వ్యూహాత్మక యుద్దాన్ని సాగిస్తున్నారు. అందులో భాగంగ ఇప్పటికే పలు  కీలక  నిర్ణయాలు తీసుకున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. మోడీ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో యుద్ధం వస్తే దేశం వదిలి పారిపోతానని పాక్ మంత్రి బహిరంగంగా భయాన్ని వ్యక్త పరిచే స్థితికి తెసుకొచ్చిన మోదీ ప్రభుత్వం  శత్రు దేశం బలహీనతలు లక్ష్యంగా దెబ్బ మీద దెబ్బ తీస్తోంది. అందులో భాగంగానే, జల యుద్ధానికి శ్రీకారం చుట్టింది.  ఉభయ తారకంగా  చీనాబ్ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టులకు మళ్లీ జీవం పోయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది.  దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఇది  కీలక ముందడుగు అంటున్నారు పరిశీలకులు. ఈ ప్రాజెక్టుల ద్వారా భారత్‌లో తన నదులపై హక్కులను బలోపేతం చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవి.. బర్సర్ డ్యామ్, కిరు డ్యామ్, కిర్థాయ్ డ్యామ్,   రాట్లే డ్యామ్,   పాకల్ దుల్ డ్యామ్, సావల్కోట్ డ్యామ్  ఉన్నాయి. ఈ ఆరు ప్రాజెక్టులు పూర్తయితే.. జమ్మూ కాశ్మీర్‌కు 10,000 మెగావాట్ల విద్యుత్తు అందనుంది. అంతేకాకుండా.. మైదాన ప్రాంతాలలో నీటిపారుదలతో పాటు గృహ వినియోగానికి సంబంధించి అధిక నీరు అందుబాటులోకి రానుంది. ఈ ఆరు ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, విద్యుత్ శాఖ మంత్రి ఎంఎల్ ఖట్టర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ సమావేశమై చర్చించిన విషయం విదితమే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గతంలో పాకిస్థాన్‌తో జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని ఏప్రిల్ 24న నిలిపివేసింది. ఒక్క చుక్క నీరు సైతం దేశ సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించడానికి వీలు లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ నదితో పాటు దాని ఉప నదుల ద్వారా పాకిస్థాన్‌లోని 80 శాతం వ్యవసాయానికి నీరందుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి యుద్ధం అంటే తుపాకులు, ఫిరగులే కాదు  యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు మాత్రమే కాదు, శత్రువును అష్ట దిగ్బంధనం చేసి పలాయనం చిత్త గించేలా చేయడమే ఆధునిక యుద్ధ నీతి, ఆధునిక యుద్ద తంత్రం. మోదీ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ముందస్తు వ్యూహాలతో యుద్ద సన్నాహాలు సాగిస్తోందనీ, విశ్వాసంతో ముందుకు సాగుతోందని  యుద్ధరంగ నిపుణులు అంటున్నారు.

దేవాలయాల్లో వరస దుర్ఘటనల వెనక కుట్ర కోణం?

వారం రోజుల కిందట ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.  అంతకు ముందు రోజు రాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది.  ఆ తర్వాత మూడు రోజులకు మే 3న గోవాలో మరో ఘోర విషాదం జరిగింది. శిర్గావ్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు.  వివరాలలోకి వెళితే..  శిర్గావ్ లోని శ్రీ లైరాయ్‌ ఆలయంలో వార్షిక జాతర అదే రోజు ప్రారంభమైంది. దీంతో లైరాయ్‌ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న 'నిప్పులపై నడిచే' కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ కావడం వల్ల భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు నార్త్ గోవా పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత సోమవారం(మే 5) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని లో నెలకొన్ని ప్రపంచ ప్రఖ్యాత మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం చెలరేగింది. దట్టమైన పొగలు సుమారు కిలోమీటరు వరకూ వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆలయ శంఖ ద్వారం, సిసీటీవీ కంట్రోల్ రూమ్‌కు పైనున్న రూఫ్‌ వద్ద మంటలు చెలరేగగా, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. హుటాహుటిన నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.ప్రమాదంలో ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని అధికారులు తెలిపారు.  ఒక వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ మూడు సంఘటనలు (ఇంకా మన దృష్టికి రానివి ఉన్నా ఉండవచ్చు) వేటికవిగా చూస్తే, ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు, కానీ, ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఈ సంఘటనల పూర్వపరాలను, సమయ సందర్భాలను గమనిస్తే ఎంతో కొంత అనుమానాలకు ఆస్కారం లేక పోలేదని అంటున్నారు.  ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ  దేవాలయలాపై జరిగిన దాడులు, ఆ సందర్భంగా అప్పటి మంత్రులు స్పందించిన తీరును గుర్తుచేసుకుంటే, అవే కుట్రలు ఇప్పటికీ కోనసాగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు,అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరపతి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు ఆ పార్టీ, ఆపార్టీ ప్రచార మాధ్యమాలు కొనసాగిస్తూనే ఉన్నాయని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.  ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం సందర్భంగా జరిగిన  తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. ఈ దుర్ఘటన విషయంలో వైసీపీ స్పందించిన తీరు అనుమానాలకు ఆస్కారం కల్పించే విధంగా ఉందని అప్పట్లోనే ఆరోపణలు వినవచ్చాయి. ఇక గత నెల (ఏప్రిల్)లో వైసేపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో మూడు నెలల వ్యవధిలో ఏకంగా 100 కి పైగా ఆవులు నిర్వహణ లోపం కారణంగా చనిపోయాయని ఆరోపించారు.అంతే కాదు  తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగరాని ఘోరాలన్నీ జరిగిపోతున్నాయని భక్తులను తప్పు తోవట్టించేందుకు  భూమన, జగన్ ఇతర వైసీపీ నాయకులు సొంత మీడియాను వేదిక చేసుకుని పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారు.  నిజానికి..  వైసీపీ అధినేత జగన్ రెడ్డి హిందూ వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అన్యమతస్థులు, వెంకన్న దేవుని పై విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక రిజిస్టర్  లో సంతకం చేయాలన్న నిబంధన ఎప్పటి నుంచో వుంది. మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం వంటి ఎందరో పెద్దలు   దేవాలయ మర్యాదను పాటించారు. కానీ, జగన్ రెడ్డి మాత్రం ఏనాడు తమ విశ్వాసాన్ని ప్రకటించలేదు  సరి కదా, ఆ నిబంధనే తప్పని పరోక్షంగానే అయినా ఆయనేమి దేవుడు అనే అర్థం వచ్చేలా  వెంకన్న స్వామినే  నిందించారు. ఈ పరిణామాలను గమనిస్తే తిరుమల సహా రాష్ట్రంలో, దేశంలో ఉన్న హిందూ దేవాలయాల పవిత్రతను, హిందువుల విశ్వాసాని దెబ్బ తీసేందుకు నిరంతర కుట్రలు జరుగుతున్నాయా?  అంటే మొన్న తిరుపతిలో, నిన్న సింహాచలంలో, ఆ వెంట గోవా, ఉజ్జయిని (ఎంపీ) లో జరిగిన సంఘటనలు గమనిస్తే.. కుట్ర కోణాన్ని కొట్టివేయలేమని అంటున్నారు.

కృపారాణి ఏరీ? ఎక్కడ?

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు కిల్లి కృపారాణి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఈ సిక్కోలు నేత, ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా, వినిపించకుండా దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నట్లుగా ఎందుకున్నారు.  నిత్యం ప్రజల్లో ఉంటేనే ఓట్లు వెయ్యని ప్రజలు...  ఎన్నికల వరకూ మ్యూట్ గా ఉంటా అని అంటున్న కృపారాణి  వ్యూహానికి విలువ ఇస్తారా.. ?  కిల్లి కృపారాణి.. ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా కు చెందిన సీనియర్ పొలిటీషియన్. ఎపిలో కాంగ్రెస్ పార్టీ సుషుప్తావస్థ లోకి వెళ్ళడంతో 2014 సాధారణ ఎన్నికల సమయంలో వైకాపా తీర్ధం పుచ్చుకున్న ఈ కేంద్ర మాజీ మంత్రి, ఆ తరువాత ఆ పార్టీని వీడి బటయకు వచ్చారు. ఆమె వైసీపీలో చేరిక, నిష్క్రమణ రెండూ కూడా అనూహ్య పరిణామాలేనని అంటున్నారు పరిశీలకులు.  2009 లో అప్పటి కాంగ్రెస్ లో జగన్మోహన రెడ్డి, కిల్లి కృపారాణిలు ఇద్దరూ ఎంపిలుగా గెలిచి ఒకే దఫా పార్లమెంట్ కు వెళ్ళినవారు. దీంతో కిల్లి కృపారాణి వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. అయితే తానొకటి తలిస్తే మరోటి జరిగిందన్నట్లు తయారైంది ఆమె పరిస్థితి. వైసిపి లో  తనకు రెడ్ కార్పెట్   ఉంటుంది భావించిన కృపారాణికి అన్ని విషయాలలోనూ జగన్ తనను దూరం పెడుతూ రావడం జీర్ణించుకోలేకపోయారు.   చివరికి తాను ఆశించిన శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం కూడా 2024లో వేరొకరికి ఇవ్వడంతో షాక్ తిన్నారు.   వైసిపి లో తనకు ఒరిగింది ఏమి లేదు అని మీడియా ముందు చెబుతూ 2024 ఎన్నికలకు రెండు నెలల ముందు వైసిపిని వీడి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు కృపారాణి.  2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టెక్కలి అసెంబ్లీ బరిలో దిగి.. కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించి పరువు పోగొట్టు కున్నారు. ఇక్కడ కృపారాణి చేస్తున్న పొరపాటు ఏదైనా ఉంది అంటే అది అవసరం ఉన్నప్పుడు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుని,  అవసరం లేనప్పుడు తొందరగా నిర్ణయాలు తీసుకోవడం. మృదు స్వభావిగా పేరు సంపాదించిన కృపారాణికి అన్ని రాజకీయపార్టీల నేతలతో  మంచి సంబంధాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పొలిటికల్ పార్టీలలో సైతం కృపారాణికి  ఆమె స్థాయికి తగ్గ  పదవులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉన్నా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తో ఎన్నికల్లో గెలవడం కష్టం అని తన నోటితో తానే చెప్పి ఆ పార్టీని వీడిన కృపారాణి.. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ లో చేరారన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.  శ్రీకాకుళం జిల్లాలో వివిధ పార్టీలలో ప్రస్తుతం ఖాళీగా ఉండి, నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న స్థానాలు చూస్తే.. వైసిపి లో ఇంకొన్నాళ్ళు ఉండి ఉంటే.. ఈ దఫా ఆమెకు తప్పనిసరిగా స్థానం రిజర్వ్ అయ్యేది అన్నది పరిశీలకులు విశ్లేషణ. టెక్కలి వైసిపి స్థానం కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా మారడం.. దువ్వాడ, పేరాడ మధ్య వివాదం నేపధ్యంలో కృపారాణి ఉండి ఉంటే ఆమెకే ఆ స్థానం లభించేది అని చాలామంది లెక్కలు కడుతున్నారు. ఇంకోవైపు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో సైతం వైసీపీకి ఇప్పుడు సరైన నేత లేరు.  ఆమె అన్నట్టు వైసీపీలో అవమానాలు భరించలేననుకుంటే..    జనసేన సైతం శ్రీకాకుళం జిల్లాలో సరైన నేత కోసం ఎదురు చూస్తోందనే చెప్పాలి. అక్కడా ఆమె చేరికకు అభ్యంతరాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. ఎందుకంటే . కృపారాణికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో  ఈ రోజుకీ మంచి సంబంధాలే ఉన్నాయి.  ఇద్దరూ ఒక దఫా కాంగ్రెస్ లో కేంద్ర మంత్రులుగా చేసినవారు కావడంతో  ఆ ర్యాపో ఇంకా కంటిన్యు అవుతోంది.  సరిగ్గా నేగోషియేట్ చేస్తే.. శ్రీకాకుళం జనసేన లో కృపారాణికి  మంచి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. బిజెపి, తెలుగుదేశం కూడా  కృపారాణికి ఆప్షనల్ పార్టీలు. తన రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరినా కృపారాణికి పదవులు లభించే అవకాశం లేకపోలేదు.  హడావిడి నిర్ణయాల మధ్య  2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ లో చేరి, టెక్కలి అసెంబ్లీకి పోటీ చేసి చేతులు కాల్చుకున్న కృపారాణి  ప్రస్తుతం పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఊర్లో శుభకార్యాలకు హాజరవ్వడం తప్ప, రాజకీయంగా క్రీయాశీలంగా లేరు.  ఇన్ని అవకాశాలు ఉన్నా,   జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నా, కృపారాణి 2029 ఎన్నికల వరకూ సైలెంట్ గా ఉంటా.. అప్పుడు తన పొలిటికల్ స్ట్రాటజీ చెబుతా  అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే  ఈ వ్యూహం రాజకీయాలలో వర్కౌట్ అవుతుందా? తాబేలు, కుందేలు పరుగుపందెం నీతి కథలో మాదిరి.. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ వ్యూహం ఫలిస్తుందా? అంటే.. లెట్స్ వెయిట్ అండ్ సీ!

హరీష్ రావుకు పొగ.. బీఆర్ఎస్ లో సెగ!?

తెలంగాణ రాజకీయాలలో పేలనున్న బాంబు కేసీఆర్ రాజకీయవారసత్వం కోసం కేటీఆర్, కవిత పోటీ అన్నాచెళ్లెళ్ల పోరులో హరీష్ ను దూరం పెడుతున్న అధినేత నిప్పు లేకుండా పొగ రాదు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్  విషయంలో వినవస్తున్న వార్తలు కూడా అలాంటివేనా? బీఆర్ఎస్ లో త్వరలోనే నిట్టనిలువుగా చీలక ఏర్పడనుందా?   మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు విషయంలో వినవస్తున్న కథనాలు బీఆర్ఎస్ లో ముసలాన్ని సచిస్తున్నాయా?  ఇన్నాళ్లూ నివురు గప్పిన చందంగా ఉన్న పార్టీలోని విభేదాలు ఇప్పుడు బహిర్గతం కానున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లూ బీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉన్న మీడియా వర్గాల నుంచే ఇటువంటి లీకులు రావడంతో  అందరూ నిప్పు లేకుండా పొగరాదు.. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది అన్న అనుమానాలు  వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. బీఆర్ఎస్  పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లయిన సందర్భంగా వరంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆరే అని పార్టీ నేతలకు, క్యాడర్ కు పరోక్షంగా చాటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బహిరంగ సభ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లలో తన ఫొటోయే కాకుండా కేటీఆర్ ఫొటో కూడా ప్రముఖంగా ఉంచడం ద్వారా తన రాజకీయ వారసుడు, పార్టీ భవిష్యత్ అధ్యక్షుడు కేటీఆర్ అని చాటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఇప్పటి వరకూ కేటీఆర్ పాల్గొన్న సభలలో మాత్రమే కేసీఆర్ తో పాటు కేటీఆర్ చిత్రాలూ ప్రముఖంగా ఉండేవి. కేసీఆర్ పాల్గొన్న సభలో అయితే వేదికపై ఎందరున్నా బ్యానర్లలో కేసీఆర్ ఫొటో మాత్రమే ఉండేది. తొలి సారిగా వరంగల్ సభలో మాత్రమే కేసీఆర్, కేటీఆర్ లకు సమప్రాధాన్యత నిస్తూ బ్యానర్లు, ఫొటోలు వెలిశాయి. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసిందేమిటంటే.. మొత్తం సభా వేదిక, ప్రాంగణంలో ఎక్కడా హరీష్ రావు ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఆఖరికి సంత మీడియాలో కూడా హరీష్ రావు ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది.  ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా హరీష్ సెంట్రిక్ గా పార్టీలో చీలిక అంటూ లీకుల మీద లీకులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే హరీష్ రావు సొంతగా పార్టీ ఏర్పాటు చేయనున్నారనీ, దాని పేరు టీఆర్ఎస్ అనీ పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఒక మధ్యవర్తి ద్వారా హరీష్ రావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారనీ, త్వరలో ఆయన సైకిలెక్కే చాన్స్ ఉందనీ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.  కేవలం తెలుగుదేశం గూటికి చేరడమే కాకుండా.. ఆ పార్టీ తెలంగాణ సారథిగా పగ్గాలు అందుకుని..వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అత్యంత కీలకమైన, ప్రధానమైన పాత్ర పోషించనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.  వాస్తవానికి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ కూడా కేసీఆర్ వెన్నంటి ఉండి.. పార్టీ నిర్మాణంలో, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్రపోషించి, కేసీఆర్ రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందినది హరీష్ రావే. అయితే తెలంగాణ ఉద్యమం జోరందుకున్న తరువాత విదేశాల నుంచి కేటీఆర్ వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. మెల్లిమెల్లిగా హరీష్ రావు ప్రాధాన్యత పార్టీలో తగ్గడం మొదలైంది. ఉద్దేశ పూర్వకంగా హరీష్ రావును పక్కన పెట్టే ప్రయత్నం స్వయంగా కేసీఆర్ చేశారని పార్టీ వర్గాలే చెబుతూ వస్తున్నాయి. ముఖ్యంగా రెండో సారి బీఆర్ఎస్ విజయం సాధించిన తరువాత ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో తొలుత హరీష్ రావుకు స్థానం కూడా అభించలేదు. ఇవన్నీ హరీష్ రావును పక్కన పెట్టి, ఆయన ప్రాధాన్యత తగ్గించడానికి ఒక ప్రణాళిక మేరకు జరిగిన ప్రయత్నంగా పార్టీ వర్గాలే చెబుతూ వస్తున్నాయి. సరే ఇక ఇప్పుడు హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టేసి కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే హరీష్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారనీ, హరీష్ రావు పార్టీని వీడితే ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కేడర్, ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులూ కూడా నడుస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  త్వరలో కేసీఆర్ అమెరికా వెళ్లనున్నారు. కేసీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో పార్టీలో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   చూడాలి ఈ సారి కూడా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా హరీష్ పార్టీ మార్పు వ్యవహారం ప్రచారానికే పరిమితమౌతుందా? లేక కేసీఆర్ కు ఝలక్ ఇస్తూ నిజంగానే పార్టీ వీడి హరీష్ తన దారి తాను చూసుకుంటారా?

కమిటీ నివేదిక, చర్యలు సరే.. సమస్యల శాశ్వత పరిష్కారం సంగతేంటి?

ఎట్టకేలకు సింహాచలం అప్పన్న చందనోత్సవ సమయంలో  జరిగిన అపశ్రుతి విషయంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. చర్యల సంగతి సరే అసలు ఆలయంలో అవకతవకలకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం యోచన చేయాల్సి ఉంది.  గత నెల 30న సింహాచలం చంద్రయాత్ర సందర్భంగా 300 రూపాయల క్యూ లైన్ అనుకుని నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. దీనిపై ప్రభుత్వం ముగ్గురు   అధికారులతో కమిటీని నియమించింది.   ఆ కమిటీ నివేదిక ఆధారంగా దేవాదాయ, పర్యాటకశాఖ చెందిన ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.  సస్పెన్షన్ వేటు పడిన వారిలో సింహాచలం ఈవో కూడా ఉన్నారు.  మరోవైపు గోడ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని కాంట్రాక్టర్ తో సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్యలను ప్రజలు ఆహ్వానిస్తున్నారు.   అదే సమయంలో ఈ చర్యలతో సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టు ఎలా అవుతుందన్న ప్రశ్న కూడా సంధిస్తున్నారు.  మొదటి నుంచీ సింహాచలం దేవస్థానంలో కొందరు కాంట్రాక్టర్లు తిష్ట వేశారు.  తాత్కాలికంగా వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తోపాటు ఇతరులను మభ్యపెట్టో మాయచేసో  నిర్వహణ పనులతో పాటు కొత్త అభివృద్ధి పనులను నిర్లక్ష్యంగా చేస్తున్నారు.  ప్రసాదం స్కీం డిపిఆర్ సిద్ధమై చాలా కాలం అయింది.  కానీ ఇప్పటికీ ఆ డీపీఆర్ కుఅనుగుణంగా పనులు జరగడం లేదు మెట్ల మార్గం అసంపూర్ణంగా వదిలేశారు సహజ జలధారల ప్రవాహానికి నష్టం కలిగించే రీతిన పనులు జరుగుతున్నట్టు సింహాచలం స్థానికులు చాలా సార్లు ఫిర్యాదు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో టోల్ గేట్  నిర్మాణం పేరిట   కొండను తవ్వేశారు.  మట్టిని మింగేశారు.  ఇది మాత్రమే కాదు..  గత ప్రభుత్వ హయాంలో సింహాచలం పుష్కరిణిలో పూడిక  తీత  చేపట్టకపోవడంతో  పలువురు భక్తులు నీట  ప్రాణాలు కోల్పోయారు.  దైవదర్శనానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చి పుష్కరిణిలో ప్రాణాలు కోల్పోవడం చాలామందిని  ఆందోళన కలిగించింది. అప్పట్లో బాధ్యులపై అప్పటి వైసీపీ సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.   అప్పన్న స్వామికి   భక్తులు భక్తితో ఇచ్చిన కానుకల విషయంలో  కూడా అవినీతి తిమింగలాలు తమ చేతి వాటం చూపుతున్నాయి.   కొండ ఎగువన హిల్ టాప్ రోడ్డు మార్గంలో కొండపై  నివసిస్తున్న గిరిజన కుటుంబాల కోసం దశాబ్దం కిందటే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే గిరిజనులు దూరంగా వెళ్లడానికి నిరాకరించడం.. కొండకి రక్షణగా ఇక్కడే గిరిజలనులు ఉంచడం సరైందన్న అభిప్రాయం రావడంతో ఆ ఇళ్లను వదిలేశారు.  నిజానికి వాటిని భక్తుల సత్రాలుగా  వాటిని వినియోగించవచ్చు. కానీ ఇప్పటికీ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇలా అన్ని విధాలుగా అప్పన్న నిధులను దుర్వినియోగం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  క్యూ కాంప్లెక్స్ లు నిర్మాణం ప్రతిపాదన చాలా కాలంగా కాగితాలకే పరిమితమైంది.  అలాగే స్వామి ఆదాయం పోకుండా టికెట్ ఉన్నవారికి లోపలికి అనుమతించే రీతిన ఎలక్ట్రానిక్ గేట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా అమలుకు నోచుకోలేదు.   ఇక సింహాచలం కొండపై డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.   భారీ వర్షం కురిస్తే ఆ నీరు ఆలయంలో ఉండిపోవడం దిగువున   కొండను కోసుకుంటూ వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా వర్షం నీరు వృధా కాకుండా నిల్వ ఉంచుకునే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే  సింహాచలం అనుబంధంగా ఉన్న మాధవస్వామి ఆలయం పరిసరాల్లో తోటల ఫల సాయం కాంట్రాక్టు విషయంలో కూడా భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి విషయంలో గత జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కారణంగానే  అధికారులు కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా వ్యవహరించారని స్థానికులు  ఆరోపిస్తున్నారు.  భక్తున్ని రక్షించేందుకు వరాహ లక్ష్మీనరసింహస్వామిగా అవతరించిన శ్రీ మహా విష్ణువు ఉగ్రరూపం ఈరోజు ప్రభుత్వ నివేదిక రూపంలో మరోసారి బయటపడిందని ఉత్తరాంధ్రవాసులు భావిస్తున్నారు.  ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటుతో పాటు కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న చర్యలు అప్పన్న స్వామి ఆగ్రహానికి సంకేతంగా చెబుతున్నారు. 1970 ప్రాంతంలో చూస్తే సింహాచలం ఆలయంలో దోపిడీకి ప్రయత్నించిన దొంగల ముఠా చేతిలో బాంబులు పేలిపోయి వారంతట వారే గాయపడిన సంఘటనను ఇప్పుడు భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. సింహాచలం అప్పన్నకు అపచారం చేసిన వారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శిక్ష తప్పదని భక్తులు అంటున్నారు.  వైసీపీ  హయాంలో పాలకమండలి నియామకంలో కూడా విచ్చలవిడి వ్యవహారాలు జరిగాయి వంశపారంపర్యంగా అనువంశిక ధర్మకర్తగా ఆనంద గజపతి, అశోక్ గజపతి కుటుంబాలు రావాల్సి ఉండగా,  వైసీపీ ప్రభుత్వం అడ్డుగోలుగా ఆనంద గజపతి రెండో భార్య కుమార్తెను తెరపైకి తెచ్చారు.  ఆమె వస్త్రధారణ, వ్యవహార శైలి హిందూ ధర్మానికి విరుద్ధంగా ఉందని గతంలో చాలామంది ఆక్షేపించారు. ఇక పాలకమండలి విషయంలో కూడా అనర్హులకు అవకాశం కల్పించారు.  ప్రత్యేక ఆహ్వానితులు అంటూ మరికొందరిని అవకాశం కల్పించారు ఆ మాజీల దందా ఇంకా కొనసాగుతోంది.  వీరిలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అప్పన్న స్వామికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపం చాలా కాలంగా రక్షణ ఉద్యోగుల ఆధీనంలో ఉంది.  ఆ ప్రదేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భక్తుల డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు.    తాజాగా అప్పన్న సన్నిధిలో జరిగిన దుర్ఘటనతో చట్టానికి చిక్కిన అధికారులు గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన వారే. సింహాచలం దేవస్థానం ఈ ఈ శ్రీనివాసరాజు తోపాటు టూరిజం అధికారులు కూడా గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారే కావడం, అలాగే ఇప్పుడు క్రిమినల్ కేసు ఎదుర్కొనున్న కాంట్రాక్టర్ కూడా గత ప్రభుత్వ  హాయం నుంచి కొనసాగుతు వ్యక్తే కావడం గమనార్హం.  

ఓబులాపురం కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టు బుధవారం (మే 6) తీర్పు వెలువరించనుంది. దాదాపు 14 ఏళ్ల తరువాత  ఈ కేసులో తీర్పు వెలువడనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా అభియోగాలు ఉన్నాయి.  నిబంధనలను తుంగలోకి తొక్కి ఓబులాపురం మైనింగ్ కంపెనీ అడ్డగోలుగా, అక్రమ తవ్వకాలు జరిపిందన్న ఆరోపణలపై అప్పటి రోశయ్య సర్కార్ ఓబులాపురం మైనింగ్ తవ్వకాలపై నిషేధం విధిస్తే జీవో జారీ చేసింది. కాగా ఓఎంసీ పై 2011లో మొదటి చార్జిషీట్ దాఖలైంది.  దాదాపు  .884. కోట్ల ప్రజాధనం లూఠీ చేశారంటూ ఓఎంసీపై ఆ చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. అప్పటి నుంచీ ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 సాక్షులను విచారించిన సీబీఐ 3,400 డాక్యుమెంట్లలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది.  ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో  సీబీఐ కోర్టు 14 ఏళ్ల తరువాత ఇప్పుడు తీర్పు వెలువరించనుంది.    అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంలో 2009లో సీబీఐ ఒబులాపురం అక్రమ తవ్వకాల కేసు దర్యాప్తు చేపట్టింది. వైఎస్ హయాంలో అడ్డగోలు అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారన్నది అభియోగం. అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపల్ సహా తొమ్మండుగురిని సీబీఐ సహ నిందితులుగా పేర్కొంది. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు మాజీ ఐఏఎస్ కృపానందం, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి పీఏ మెఫజ్ ఆలీఖాన్ లపై కూడా అభియోగాలు నమోదు చేసింది.  

లండన్ లో గాయపడిన సృజనా చౌదరి.. హైదరాబాద్ లో చికిత్స

బీజేపీ సీనియర్‌ నేత, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్ రూంలో జారిపడిగాయపడినట్లు తెలుస్తున్నది.ఈ ఘటనలో ఆయన కుడి చేయి ఫ్రాక్చర్ అయినట్లు చెబుతున్నారు. లండన్ లో ప్రాథమిక చికిత్సఅనంతరం సుజనా చౌదరిని హైదరాబాద్ తరలించి, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కుడి చేతికి సర్జరీ చేయాల్సి ఉందంటున్నారు.  లండన్ నుంచి ఆయన బుధవారం (మే 6) తెల్లవారు జామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి చేరుకుని చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.  ఇలా ఉండగా లండన్ లోని ఓ సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తుండగా జారి పడ్డారని అంటున్నారు . మొత్తం మీద సుజనా చౌదరి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారనీ, ఆయన కుడి చేయి భుజానికి ఫ్రాక్చర్ అయ్యిందనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సుజనా చౌదరి గాయపడటంపై బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు కొద్ది సేపటిలో హెల్త బులెటిన్ విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  

చెట్టు కొమ్మ విరిగి పడి మహిళ మృతి

విధి రాత ఎవరూ తప్పించలేరన్న నానుడి ఆ మహిళ విషయంలో అతికినట్లు సరిపోతుంది.  కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. సరిగ్గా అలాగే జరిగింది విశాఖకు చెందిన పూర్ణిమ అనే మహిళ విషయంలో. నక్కలపాలెంలో నివాసం ఉంటున్న ఎస్బీఐ ఉద్యోగి భార్య పూర్ణిమ  తన ఇంటికి సమీపంలోనే ఉన్న బజారుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. . ఆమె వెడుతుండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి ఆమెపై పడింది. దీంతో పూర్ణిమ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది.  ఊహించని ఈ పరిణామంతో పూర్ణిమ కుటుంబ సభ్యులు విషాద సంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకూ తమతో నవ్వుతూ మాట్లాడి.. అంతలోనే ప్రమాదం బారిన పడి పూర్ణిమ మరణించిందంటూ భోరున విలపిస్తున్నారు. చాలా కాలంగా రోడ్డు పక్కన ఉన్న ఆ చెట్టు కొమ్మ ప్రమాదకరంగా వంగి విరిగిపడేటట్లుగా ఉన్నప్పటికీ జీవీఎంసీ సిబ్బంది పట్టించుకోలేదన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.