షాక్ మీద షాక్‌.. పాక్ షేక్!

ఓడించడమే యుద్ధం లక్ష్యం! ఇప్పుడు పాకిస్థాన్ విషయంలోనూ ఇండియా అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది.  ప్రతీకారమంటే విధ్వంసం మాత్రమే కాదు.. కోలుకోలేని దెబ్బకొట్టడం. భారత్ కొడుతున్న ఒక్కో దెబ్బకు  పాక్‌కు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. షాక్ మీద షాక్ తగులుతుండటంతో షేక్ అవుతున్నది.  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా  భారత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు.. పాకిస్థాన్‌కు మతిపోతోంది. ఇండియా మొదలు పెట్టిన ట్రేడ్‌ వార్‌తో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది ఆ దేశం.  పాకిస్థాన్‌ను భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. దాయాది దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే.. పాక్‌ను మరో చావుదెబ్బ కొట్టింది ఇండియా. పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందనీ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  దీని ప్రకారం పాకిస్థాన్ నుంచి భారత్ ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోదు. అలాగే.. పాకిస్థాన్‌కి కూడా అన్ని రకాల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యక్ష ఎగుమతులు, దిగుమతులతో పాటు పరోక్ష దిగుమతుల్ని కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయం వాణిజ్య, ఆర్థిక రంగాల్లో పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ చేపట్టిన దీర్ఘకాలిక వ్యూహాల్లో ఓ భాగంగా చెబుతున్నారు.  ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం, అట్టారీ-వాఘా సరిహద్దుని మూసేయడం, పాకిస్థాన్   రాయబార కార్యాలయ సిబ్బందిని తగ్గించడం లాంటి చర్యలు చేపట్టిన భారత్ ఇప్పుడు ఈ వాణిజ్య నిషేధంతో పాక్‌ని మరో గట్టి దెబ్బకొట్టిందనే చెప్పాలి.  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ నుంచి తగులుతున్న ఒక్కో దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో వాణిజ్య యుద్ధం కూడా తీవ్రమైంది. ప్రజా ప్రయోజనం, జాతీయ భద్రత ఆధారంగా.. పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులన్నింటినీ భారత్ నిషేధించింది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు కేంద్రం.. అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ని మూసేశారు. దాంతో.. భూమార్గం ద్వారా వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. పాకిస్థాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని కూడా మూసేసింది. దాంతో వాణిజ్య రవాణాకు సంబంధించిన విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. మొత్తంగా పాకిస్థాన్ నుంచి అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి అవకాశం లేకుండా పోయింది.  ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలహీనంగా ఉంది. ఇప్పుడు భారత్ ప్రకటించిన వాణిజ్య  నిషేధం ఆ దేశంపై తీవ్రాతితీవ్రమైన ప్రతికేల ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.   భారత్ తాజా నిర్ణయంతో   ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువులకు పాకిస్థాన్ లో తీవ్రమైన కరత ఏర్పడటం ఖాయం.  గత ఏడాది పాకిస్థాన్ నుంచి భారత్‌కు సుమారు 305 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి. ఆ లెక్కన చూస్తే.. పాకిస్థాన్‌ ఇప్పుడు భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక  భారత వస్తువులు.. దుబాయ్, సింగపూర్, శ్రీలంక దేశాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుతున్నాయి. పాకిస్థాన్ కూడా భారత వాణిజ్య ఆంక్షలను అధిగమించేందుకు.. కొన్ని వస్తువుల్ని దుబాయ్, సింగపూర్, కొలంబో ఓడరేవుల ద్వారా పంపుతోంది. ఇలా పరోక్షంగా జరిగే వాణిజ్యం విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నిషేధంతో ఇక ఈ తరహా వాణిజ్యం కూడా ఆగిపోనుంది. ఈ చర్యల వల్ల పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఆహార కొరతతో పాటు ఔషధాల కొరత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు. 2023-24 మధ్య అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్-పాక్ మధ్య 3 వేల 887 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఈ వాణిజ్య నిషేధంతో పాక్‌లో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడం. ఎగుమతి అవకాశాలు తగ్గడం లాంటి సమస్యలు తలెత్తనున్నాయి.  భారత్ - పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు 2019 నుంచే దాదాపుగా స్తంభించాయ్. పుల్వామా దాడి తర్వాత.. రెండు దేశాల మధ్య అంతంతమాత్రంగానే వాణిజ్యం కొనసాగుతోంది. అయినప్పటికీ.. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల ద్వారా ఇన్నాళ్లూ అనధికార వాణిజ్యం జరిగింది. ఇప్పుడు, ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే ఎగుమతులు, దిగుమతులపై భారత్ నిషేధం విధించింది.   ఈ వ్యూహాత్మక చర్యలు పాకిస్థాన్‌లోని ఉత్పత్తిదారులు, వ్యాపారులపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడి పతనం అంచుకు నెట్టేసింది. సరిహద్దులు మూసేయడం, సింధు జలాల ఒప్పందం రద్దు, పాక్ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించడం లాంటి చర్యలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలు చేయడం ఖాయం. 

యూట్యూబర్‌ అన్వేష్‌పై కేసు నమోదు..ఎందుకంటే?

ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ ప్రకటనల మీద అన్వేష్ వరుస వీడియోలు చేశారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతి కుమారి, ఐఏఎస్‌లు దాన కిషోర్, వికాస్ రాజ్‌‌లపై అన్వేష్ ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్వేష్ వీడియోలో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు, చట్టబద్దమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా అన్వేష్ కామెంట్స్ చేశాడని పేర్కొన్నారు. ఆవాస్తవంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అన్వేష్‌పై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై సుమోటో‌గా పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారుల విశ్వాసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా ఈ వీడియో ఉందని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ యాప్‌లను కొంతమంది సినీ ప్రముఖులు ప్రమోట్ చేశారు. వీరిపై కూడా  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వారు ఎంతవారైనా విడిచి పెట్టేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్‌ల‌ను హైదరాబాద్ మెట్రోరైలులో  ప్రమోట్ చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. 

పుస్తకాల చదువు కన్నా జీవితంలో విలువలు ముఖ్యం

చదువేరా అన్నిటికీ మూలం.. ఆ చదువు విలువ తెలుసుకొనుటే ధర్మం. ఇది అక్షర సత్యం. అయితే చదువుకోవడం అంటే మార్కులూ, ర్యాంకులూ కాదు. విలువలు, వివేకం. కేవలం పుస్తకాల పురుగులా బట్టీయం పడితే సరిపోదు. అలా బట్టీయం పట్టి ర్యాంకులు సాధించినా మనిషిగా విలువలకు దూరమైతే ప్రయోజనం లేదు. అటువంటి విలువలు లేని విద్యావంతులను చూసే చదవేస్తే ఉన్నమతి పోయింది, చదువుకు ముందు కాకరకాయ, చదివాకా కీకరకాయ వంటి సమేతలు పుట్టాయి. ఈ విషయాన్ని తెలుసుకోకుండా విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ కూడా మార్కులూ, ర్యాంకుల వెంట పడుతున్నారు. వ్యక్తిత్వ వికాసం కంటే.. పరీక్షల్లో వచ్చిన పర్సంటేజీ ఎంత, అధిక ప్యాకేజీతో కొలువులు సంపాదించడం ఎలా అన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. ఆ క్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచేస్తున్నారు. మంచి ర్యాంకు రాకపోతే ఎందుకూ పనికి రామన్న న్యూన్యతా భావం పిల్లలలో పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఆ కారణంగానే పరిక్షా ఫలితాలు వచ్చిన తరువాత విద్యార్థుల ఆత్మహత్యల వార్తలను ఎక్కువగా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువు అంటే కేవలం ఉత్తీర్ణత మాత్రమే కాదనీ, ఒక వైఫల్యం భవిష్యత్ విజయానికి మొదటి మెట్టన్న సంగతి మరిచిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చినా, ఒక వేళ పరీక్షలో ఫెయిలైనా జీవితం ముగిసినట్లు కాదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.  ఏపీజే అబ్దుల్ కలాం చదువులో సాధారణ విద్యార్థే.. అయినా శాస్త్రవేత్త అయ్యారు. రాష్ట్రపతిగా గౌరవాన్ని అందుకున్నారు. భారత రత్న పురస్కారం తీసుకున్నారు. అలాగే క్రికెట్ గాడ్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న   సచిన్ టెండూల్కర్ విద్యార్థిగా టెన్త్ ఫెయిలయ్యారు. అటువంటి వారు ఇంకెందరో ఉన్నారు. చదువు అంటే మార్కులూ, ర్యాంకులే కాదనీ, తమకు నచ్చిన, తమకు నైపుణ్యం ఉన్న రంగాలలో సాధన చేసి ఉన్నత స్థాయిని అందుకోవచ్చనీ చాటిన ఎందరో ఉన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువు అనేది విజ్ణానసముపార్జనకు సాధనమే కానీ, చదువంటే ర్యాంకులూ, మార్కులు, కొలువులేకాదని చెప్పాలి. చదువులో వెనుకబడిన పిల్లలలో ఆత్మస్థైర్యం పెంచి.. భవిష్యత్ లో మరింత కష్టపడి పైకి వచ్చే విధంగా ప్రోత్సహించాలి.  సరిగ్గా అలాంటి పనే చేశారు ఆ తల్లిదండ్రులు.. అసలేం జరిగిందంటే.. కర్నాటకకు చెందిన అభిషేక్ ఇటీవల జరిగిన టెన్త్ పరీక్షలు రాశాడు. అయితే అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. తోటి విద్యార్థల అవహేళలనతో కృంగిపోయాడు. ఇది గమనించిన అతడి తల్లిదండ్రులు.. అతడికి ధైర్యం చెప్పారు. ఈ సారి బాగా చదివి ప్యాసవ్వాలని బోధించారు. అంతే కాకుండా భవిష్యత్ విజయానికి ఈ ఫెయిల్యూల్ స్టెప్పింగ్ స్టోన్ గా భావించాలని చెబుతూ.. తమ కుమారుడి భవిష్యత్ విజయాన్ని కాంక్షిస్తూ కేట్ కట్ చేసి వేడుక చేశారు. ఈ వేడుకకు అభిషేక్ ను గేలి చేసిన తోటి విద్యార్థులనూ ఆహ్వానించారు. మొత్తంగా తమ కుమారుడిలో ఆత్మ స్థైర్యాన్ని ప్రోది చేయడమే కాకుండా, ఇతరులకూ ఆదర్శంగా నిలిచారు. 

బోరుగడ్డ అనిల్ కు బెయిలు మంజూరు.. పోలీసుల నిర్లక్ష్యమే కారణం!

వైసీపీ నేత నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కు అనంతపురం జిల్లా కోర్టు శనివారం ( మే3) బెయలు మంజూరు చేసింది.  ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ పై అనంతపురంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు శనివారం బెయిలు మంజూరైంది. 90 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ పై ఇంత వరకూ చార్జిషీట్ దాఖలు చేయకుండా అనంతపురం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే బెయిలు మంజూరు కావడానికి కారణం. ఈ విషయాన్ని కోర్టు తన తీర్పు లో స్పష్టంగా పేర్కొంది.   వైసీపీ  హయాంలో బోరుగడ్డ అనిల్  తెలుగుదేశం, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను అసభ్య పదజాలంతో దూషించారు.  దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు బోరుగడ్డ అనిల్ ను అరెస్టు చేశారు.  కాగా గతంలో కూడా ఓ సారి హైకోర్టు బోరుగడ్డ అనిల్ కు బెయిలు మంజూరు చేసింది. అప్పట్లో బెయిలుపై విడుదలైన ఆయన ఆ తరువాత అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత తల్లికి అనారోగ్యం అంటూ నకిలీ సర్టిఫికెట్ సమర్పించి బోరుగడ్డ అనిల్ బెయిలు పొందినట్లు తేలడంతో హైకోర్టు ఆయన ను తక్షణమే లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో బోరుగడ్డ అనిల్ అప్పట్లో బోరుగడ్డ అనిల్ కోర్టు విధించిన గడువులోగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు బెయిలు మంజూరైంది. అయితే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే అయినకు బెయిలు మంజూరైంది. దీనిపై తెలుగుదేశం శ్రేణులు అనంతపురం పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

జీహెచ్ఎంసీ ఆఫీసర్‌పై దాడి.. బీజేపీ కార్పొరేటర్ కేసు నమోదు

  జాంభాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్‌పై అబిడ్స్‌లో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సెక్షన్ అధికారి తన విధి నిర్వహణలో ఉండగా, కార్పొరేటర్ ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు అందింది. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం (బీఎన్ఎస్ సెక్షన్ 132), దాడికి పాల్పడటం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.  ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ స్పందించారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమన్నారు. అధికారులను పిలిచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసినట్లు అబిడ్స్‌ పోలీసులు కమిషనర్‌కు వివరించారు. ఉద్యోగులపై చై చేసుకోవడంతో విధులు బహిష్కరించి జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం

  హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.  మల్కాజ్ గిరి, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ బోడుప్పల్  పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఈరోజు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు నగరంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం షురూ అయ్యింది.  ఎండలతో  ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో వర్షం ఉపశయం కలిగింది. గత కొన్ని రోజులుగా నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. శనివారం సాయంత్రం వాతావరణం మారిపోయి వాన కురిసింది. వాన కురవడంతో నగరం చల్లబడగా.. ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని దక్షిణం, నైరుతి దిశ నుంచి ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై ఆంక్షలు..ఎందుకంటే?

  విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డును ఈ నెల 6 నుంచి 8 వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండచరియల నివారణకు మెష్ ఏర్పాటు తదితరుల మరమ్మతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులు కనదుర్గ నగర్ మార్గం నుంచి దేవస్థానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. అలాగే ఈ మూడు రోజులు పాటు పార్కింగ్ ప్రదేశాల నుంచి దేవస్థానానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు కనకదుర్గా నగర్‌ మార్గం నుంచి వెళ్లాలని సూచించారు. ఈ తరుణంలో భక్తులు కనకదుర్గానగర్‌ మార్గం నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు.  పున్నమిఘాట్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. విజయవాడలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వెళుతుంటారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు అలర్ట్ ప్రకటించారు.

అమరావతి రీలాంచ్ సరే.. జగన్ నిర్వాకంపై మోడీ మౌనమేల?

ఆంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి నిర్మాణానికి 2015లో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోడీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతో అన్నట్లుగా నిర్వహించారు. సరే మళ్లీ ఇప్పుడు అంటే మే 3న అదే అమరావతికి ప్రధాని మోడీ మరో సారి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని అమరావతి నిర్మాణ పనుల పున: ప్రరంభ కార్యక్రమం అని చెబుతున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. ప్రధానిగా నరేంద్రమోడీ, ఏపీ సీఎంగా చంద్రబాబు రెండు సార్లూ కూడా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామనే అన్నారు. అయితే ఈ మధ్యలో ఐదేళ్లలో ఏం జరిగింది? 2015లో అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి నిర్మాణ కార్యక్రమం 2019 నుంచి 2024 వరకూ ఎందుకు నిలిచిపోయింది. నిర్వీర్యమైపోయింది అన్నది అందరికీ తెలిసిన చరిత్రే.  అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. నాడు మోడీ కేవలం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మట్టీ, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. అమరావతి నిర్మాణం, పురుభివృద్ధి ఒక బాధ్యతగా భావించలేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంగానే భావించారు. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే అయినా, భాగస్వామ్య పక్షాల మద్దతు ఇసుమంతైనా అవసరం లేనంత బలం ఒంటరికగా బీజేపీకే ఉంది. అందుకే అప్పట్లో మోడీ మిత్రపక్షాల ఆకాంక్షలను, డిమాండ్లను పట్టించుకోలేదు.  అయితే ఇప్పుడు 2025లో మోడీకి ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో తన ప్రభుత్వం మనుగడ సాగించాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. అందుకే ఇప్పుడు  మోడీ మరో సారి అమరావతి నిర్మాణ పనులను రీ లాంచ్ చేశారు. అవును మళ్లీ అమరావతి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. అయితే ఈ సారి గతంలోలా దీనిని ఒక లాంఛనంగా కాకుండా ఒక బాధ్యతగా  తీసుకున్నారు. అమరావతి అభివృద్ధిలో కేంద్రం బాధ్యతగానే కాకుండా భాగస్వామిగా కూడా ఉంటుందని చెప్పడానికే 57 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ చేశారు. అంతే కాదు అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి గ్రాంట్లు అందేలా చూడటమే కాకుండా హుడ్కో నుంచి కేటాయింపులు కూడా వచ్చేలా సంపూర్ణ సహకారం అందించింది. దీంతో గతానికి భిన్నంగా ఈ సారి మోడీ చిత్తశుద్ధి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఆయన రాజకీయ అవసరం కూడా కారణం అనుకోండి అది వేరే సంగతి.  ఇంత వరకూ బాగే ఉంది.. 2015లో తానే స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి నిర్మాణం అర్ధంతరంగా ఐదేళ్ల పాటు నిలిచిపోవడానికీ, నిర్వీర్యమైపోవడానికీ కారణమైన జగన్ నిర్వాకం గురించి మోడీ శుక్రవారం (మే 2)న జరిగిన అమరావతి పనుల పున:ప్రారంభోత్సవ సభలో ఒక్కటంటే ఒక్క మాట అనలేదు. ఐదేళ్ల జగన్ అరాచక పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా వెనుకబడిపోవడం తెలిసిందే. అయితే ఇంతటి అరాచక పాలన సాగించి, కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు.. ఒక శక్తి అని చెప్పిన ప్రధాని మోడీ.. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి గత ఐదేళ్లలో విశ్వ ప్రయత్నం చేసిన జగన్ పాలనపై చిన్న పాటి విమర్శ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది.  మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి పూనుకున్న మాజీ ముఖ్యమంత్రి   జగన్  పాలనను కానీ, జగన్ సర్కార్ ప్రభుత్వ విధానాలపై కానీ చిన్నపాటి విమర్శ కూడా మోడీ చేయలేదు.  గత పదేళ్లుగా అమరావతి నిర్మాణాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అని చెప్పుకున్న మోడీ.. మరి గత ఐదేళ్లుగా అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ పాలన గురించి అసలు ప్రస్తావించనేలేదు.   ఇక్కడే ఇప్పటికీ మోడీ జగన్ ను షీల్డ్ చేస్తున్నారా? అన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్లుగా మార్చే ప్రయత్నం : కిషన్‌రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు డీపీఆర్ త్వరగా ఇవ్వాలని అధికారులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంతోపాటు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్లుగా నేషనల్ హైవేలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాలలో 32 జిల్లాల నుంచి జాతీయ రహాదారులు వెళ్తున్నట్టు వెల్లడించారు. రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రహదారుల అనుసంధానం అన్నింటికంటే చాలా ముఖ్యమైనది అన్నారు. అందుకే వాజ్ పేయి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణ చతుర్భుజి పథకాన్ని తీసుకొచ్చిందని.. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపివేసింది. రోడ్ల నిర్మాణం పై రూ.లక్షల కోట్లు ఎందుకు అని ఆనాడు విమర్శించారు. 2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులుండేవి. పదేళ్ల తరువాత అవి 5200 కిలోమీటర్లకు చేరుకున్నాయి. తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి జరుగుతోంది. అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోంది. పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తామని.. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించే రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

సింధు నదిపై డ్యామ్ కడితే కూల్చేస్తాం..పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

  సింధు నదిపై డ్యామ్ కడితే కూల్చేస్తామని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను అడ్డుకునేందుకు నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని ఓ ఇంటర్వ్యూలో ఖవాజాను మీడియా ప్రశ్నించింది. ఒక వేళ భారత్ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాకిస్థాన్ ధ్వంసం చేస్తుందని బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌‌‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇండియాలో ఉన్న దాయాదులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసంది. అదేవిధంగా పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఎప్పుడైతే మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేస్తుందో అప్పటి వరుకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. 

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

  తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు  400-600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని అలాంటి వాటికే బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకుంటున్నారని.. వాటికి బిల్లులు హోల్డ్ చేశామన్నారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని పొంగులేటి అన్నారు. ఈ పథకం నిరు పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు, తప్పులకు తావు ఉండొద్దని ఇంజనీర్లకు సూచించారు. ఆ బాధ్యతను ఇంజనీర్లపైనే పెడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయితే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఈ కామెంట్స్ చేశారు.  పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందని అన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.  నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ లో శిక్ష‌ణ పొందిన అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ స‌ర్టిఫికెట్లు అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో 350 మంది ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను సర్కార్ నియమించింది. హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లకు ఆరు రోజులపాటు అధికారులు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో 21 మందికి ప్రభుత్వం ప‌దోన్న‌తులు కల్పించింది. గ్రేడ్ -2లో ప‌నిచేస్తున్న‌10 మంది స‌బ్ రిజిస్ట్రార్ల‌ను గ్రేడ్‌-1కి, సీనియ‌ర్ స‌హాయ‌కులుగా ప‌నిచేస్తున్న 11 మందికి గ్రేడ్‌-2 ప‌దోన్న‌తులు కల్పించింది. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు స‌ర్టిఫికెట్ల‌ను మంత్రి పొంగులేటి అంద‌జేశారు. భారతదేశంలో పేదలకు ఏటా రూ.5 లక్షలతో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రమని రె మంత్రి పొంగులేటి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ ఏడాది రూ.22,000 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని, లబ్దిదారుల ఎంపిక త్వరలో పూర్తవుతుందని, పైలట్ గ్రామాల్లో నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు.

తిరుపతి బుగ్గమఠం భూముల్లో సర్వే..ఉద్రిక్తత

  తిరుపతిలోని దేవదాయ శాఖకు చెందిన బుగ్గమఠం భూముల్లో సర్వే చేపట్టారు. 261/1, 261/2 సర్వే నంబర్లలో 3.88 ఎకరాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మరో నలుగురు ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆక్రమణల గుట్టు విప్పేందుకు అధికారులు రంగంలోకి దిగారు. రోవర్‌తో బుగ్గమఠం భూముల వద్దకు అధికారులు వచ్చారు. డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ సర్వేయర్‌ చిట్టిబాబు, దేవాదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ రామకృష్ణారెడ్డి ఈ సర్వేలో పాల్గొన్నారు. 16వ ఆర్థిక సంఘం పర్యటన దృష్ట్యా గత నెలలో సర్వే వాయిదా పడింది. ఆక్రమిత బుగ్గమఠం భూముల సర్వే కోసం గత నెల 11న దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది.. అయితే.. ఆ భూములతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.  తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని చెప్పారు. సర్వే ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ పోలీసుల మధ్య సర్వే కొనసాగుతోంది.  అయితే ఆ భూముల అనుభవదారులు వెంకట్రాయులు, మునిరత్నం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. వెంకట్రాయులు, మునిరత్నంతో మాట్లాడారు. అనంతరం భూముల సర్వే కొనసాగుతోంది. 

పహల్గాం ఎఫెక్ట్.. అసియా కప్‌‌కు భారత్ దూరం?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌ కీలక పాత్ర పోషించిందనే విమర్శలు వచ్చాయి. క్రీడా సంబంధాలపైనా ఆ ఎఫెక్ట్‌ పడనుందని.. క్రికెట్‌ సహా ఇతర క్రీడల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌లోనూ ఇరు జట్ల మధ్య సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఈ విషయంలో ఐసీసీ కూడా దృష్టిపెట్టాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. దీంతో ఆసియా కప్‌ లోనూ భారత్ పాల్గొనడంపై ఇప్పుడు అనుమానాలు వెల్లువెత్తాయి. టోర్నీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఆసియా కప్ సాధారణంగా తటస్థ వేదిక పైనే నిర్వహిస్తున్నారు. ఈసారి ఇంకా షెడ్యూల్‌ను ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌ సిరీస్‌ అనంతరం సెప్టెంబర్‌లో వేదికను నిర్ణయించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆసియా కప్‌ వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ - పాక్‌ ల మధ్య ఇప్పుడు సంబంధాలు సరిగ్గా లేవు. ఇలాంటి దశలో నిర్వహించే అవకాశాలు తక్కువేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడేందుకు భారత్‌ అక్కడికి వెళ్లాల్సిఉంది. అయితే, బంగ్లా పర్యటనకూ టీమ్‌ఇండియా వెళ్లే అవకాశం తక్కువేనని సమాచారం. ఐసీసీ క్యాలెండర్‌ ఇయర్‌లో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు చోటుంది. కానీ, దానిని కొనసాగించే ఛాన్స్‌లు కనిపించడం లేదు. భారత్‌కు సంబంధించిన రాష్ట్రాలపై బంగ్లా నేత చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని తెలుస్తోందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

రాహుల్ ముందు చూపు.. తెలంగాణపై రూ.160 కోట్లు భారం

దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ పార్టీ అధినాయకుడు గాంధీ చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటుగా  కులగణన చేపట్టాలని  నిర్ణయం తీసుకోవడానికి రాహుల్ డిమాండే కారణమా;  లేక ఇతరాలు ఏమైనా ఉన్నాయో  తెలియదు కానీ,  కాంగ్రెస్ పార్టీ మాత్రం  అది తమ నాయకుడు రాహుల్ గాంధీ సాధించిన విజయంగా పేర్కొంటూ  సంబురాలు చేసుకుంటోంది.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే,ఇంకో అడుగు ముందుకేసి రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా వుంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ కూడా ఈ దేశానికీ ఏది కావాలో ముందుగానే గుర్తించి దానిని సాధించే వరకు వదిలి పెట్టరు అంటూ రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేశారు.  తప్పుకాదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో రాహుల్ గాంధీ ఒత్తిడి కూడా ఒక కారణం అయితే కావచ్చును.  కానీ..  అదొక్కటే కారణం అనుకుంటే రేవంత్ రెడ్డి తప్పులో కాలేసినట్లే  అవుతుంది. నిజానికి  మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్వాపరాలను గమనిస్తే..  రేవంత్ రెడ్డి  తమ నేత రాహుల్ గాంధీకి ఆపాదించిన ‘ముందు చూపు’  కంటే మోదీ నిర్ణయంలోనే మరింత ముందు చూపు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతవరకు బంతి సర్కార్ కోర్టులో వుంది. ఇకపై..  ఆ పరిస్థితి ఉండక పోవచ్చని కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్పవలసిన సమాధానాలు చాలానే ఉంటాయి. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముందో  స్పష్టంగా తెలియకుండానే తొందర పడి ప్రయోజనం ఉండందని  విశ్లేషకులు అంటున్నారు. నిజానికి  కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, సుదీర్ఘంగా అలోచించి, రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకునే ఈ  నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అంటే.. కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న కులగణన  అస్త్రాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడ ఉంటుందని అంటున్నారు.  ముఖ్యంగా  కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో  కులగణన గురించి ఎందుకు ఆలోచించ లేదు? ఎందుకు  నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ వరకు కులగణనను  వ్యతిరేకించారు?  ముఖ్యంగా  2011లో బీజేపీ సహా, ఆనాటి విపక్షాలన్నీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేసిన సమయంలో రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు, మన్మోహన సింగ్ ప్రభుత్వం పై వత్తిడి చేయలేదు. నిజానికి అప్పట్లో రాహుల్ గాంధీ తలచుకుంటే 2011 జనగణనతో పాటుగానే కులగణన కూడా పూర్తయ్యేది కదా? అని బీజేపీ ప్రశ్నిస్తోంది.    నిజానికి అప్పట్లో రాహుల్ గీసిన గీతను దాటే ధైర్యం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహా ఎవరికీ లేదనేది జగమెరిగిన సత్యం. కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్సును ప్రెస్ మీట్ పెట్టి మరీ చించి పారేసినా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహా ఎవరూ ఇదేమిటని ఆయన్ని ప్రశ్నించ లేదు. ప్రశ్నించే సాహాసం కూడా చేయలేదు.  నిజానికి,రాహుల్ గాంధీకి ఆ రోజుల్లో సాధ్యం కానిది ఏదీ లేదు. ఆరోజునే ఆయన ముందు చూపు కళ్ళు తెరిచి ఉంటే.. 2011 జనగణనతో పాటే కులగణన కూడా జరిగేది కదా? ఆ రోజున రాహుల్ గాంధీ ముందు చూపు, ఎందుకు కళ్ళు మూసుకుంది? వంటి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలాగే, కులగణనకు బదులుగా 2013లో చేసిన సామాజిక ఆర్థక సర్వే లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తప్ప మిగిలిన వివరాలు ఏవీ బయట పెట్టలేదు.  సో.. కాంగ్రెస్’ సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయని, విశ్లేషకులు అంటున్నారు. మరో వంక రేవంత్ రెడ్డి  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అంటున్నారు. అయితే అదంతా తప్పుల తడకని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న పెద్దల సభలోనే లెక్కలు చెప్పారు. నిజానికి తెలంగాణ సహా రాష్ట్రాలు నిర్వహించిన,  నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. కులగణన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదేనని, వివిధ రాష్ట్రాల్లో కులగణన సర్వేలను రాజకీయ కారణాలతోనే చేపట్టారని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు, అంటే, రూ.160 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి గత నవంబర్‌లో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన)ని కేంద్ర ప్రభుత్వం రోల్ మోడల్ గా తీసుకోవడం కాదు..  కనీసం పరిగణనలోకి కూడా తీసుకోదని తేలిపోయింది. సో.. రాహుల్ గాంధీ ముందు చూపు మోదీని ఏ మేరకు ప్రభావితం చేసిందో ఏమో కానీ రాహుల్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన అంటూ ఖర్చుచేసిన  రూ.160 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారిందని  అంటున్నారు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఆయన్ని ప్రశంసలలో ముంచెత్తినా, ముందు చూపు అసలు కథ ముందుందని అంటున్నారు.

కులగణన రూపంలో కలిసొచ్చిన అదృష్టం !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదృష్టం గురించి వేరే చెప్పనక్కర లేదు. ఇప్పుడే కాదు, ఆయన రాజకీయ జీవితంలో అడుగడుగునా అదృష్టం ప్రత్యేక ప్రేమ చూపిస్తూనే వుంది.  చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూనే వుంది. అది ఏమిటి ఎలా అన్నది పక్కన పెడితే..  ఇప్పడు మళ్ళీ మరోమారు కులగణన రూపంలో అదృష్టం ఆయన్ని వరించిందని అంటున్నారు. కలిసొచ్చే రోజులోస్తే.. నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. ఇదొకటే కాదు.. తెలుగులో అదృష్టం చుట్టూ అల్లుకున్న సామెతలు ఇంకా చాలానే ఉన్నాయి.  అదృష్టం కలిసొస్తే పోయింది కూడా వెతుక్కుంటూ వెనక్కి వస్తుందని, అదృష్టం చెప్పి రాదు, దురదృష్టం చెప్పి పోదు.. ఇలా అదృష్టం చుట్టూ అల్లుకున్న సామెతలు ఎన్నో ఉన్నాయి. అలా ఉన్న అన్ని సామెతలు ఒకేసారి కట్ట కట్టుకుని కలిసొస్తే ... ఇక అలాంటి ఆదృష్టం గురించి  అంతటి అదృష్టవంతుని గురించి వేరే చెప్పనక్కర లేదు.  అవును.. మనం ఇప్పుడు  మాట్లాడుకుంటోంది అలాంటి అదృష్ట వంతుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించే. ఆయనకు పట్టిన అదృష్టం గురించే మనం ఇప్పుడు మాట్లాడు కుంటున్నాము. అవును. అదృష్టం మరీ ఇలా ఫెవికాల్  కంటే బలంగా అతుక్కోవడం  ఎప్పుడో గానీ జరగదు. ముఖ్యంగా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అలాంటి అదృష్టవంతులు చాలా అరుదుగా కనిపిస్తారు. ముల్లు వెళ్లి అరిటాకు మీద పడినా, అరిటాకు వెళ్లి ముల్లు మీద పడినా అరటాకుకే నష్టం అన్నట్లుగా.. కాంగ్రెస్ పార్టీలో  అధిష్టానానికి ముఖ్యమంత్రి పై కోపం వచ్చినా, అధిష్టానంపై ముఖ్యమంత్రి కోపం వచ్చినా  ముప్పు ముఖ్యమంత్రి కుర్చీకే వస్తుందని అంటారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీలో పదవులు కాపాడుకోవడం కత్తి మీద సామని అంటారు.    ఒకటి రెండు నెలలు వెనక్కి వెళితే రేవంత్ రెడ్డి పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా ఉందనే ప్రచారం జోరుగా సాగింది.  రాహుల్ గాంధీకి  రేవంత్ రెడ్డికి  చెడిందనీ.. ఇద్దరి మధ్య దూరం పెరిగిందని పుంఖాను పుంఖాలుగా కథనాలు పుట్టుకొచ్చాయి.  రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ కుడా ఇవ్వడం లేదని..  ఇక ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రి కుర్చీలో ఉండరని విశ్లేషణలు, వ్యూహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ సమావేశంలో.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనను,మెచ్చుకున్న రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించ లేదు. దీంతో ముఖ్యమంత్రి మార్పు తధ్యమనే ప్రచారం అప్పట్లో జరిగింది.అయితే  అలాంటిది ఏమీ జరగక పోయినా..  అంతాబాగుందనే పరిస్థితి అయితే నిన్నమొన్నటి దాకా   లేదన్నది నిజం.  అయితే..  అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ సమావేశంలో ఏమి జరిగింది,  పక్షం రోజుల క్రితం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అన్నది పక్కన పెడితే, కులగణన పేరిట అదృష్టం మళ్ళీ మరో మారు ఆయన తలుపు తట్టిది. వచ్చే జనగణనతో పాటుగా కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పర్యవసానం..  తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అదృష్టం కలిసొస్తే పోయింది కూడా వెతుక్కుంటూ వెనక్కి వస్తుందనే   సామెతను నిజం చేస్తూ..  రేవంత్  రెడ్డికి కుర్చీ పోతుందనే భయాన్ని  తగ్గించిందని  అంటున్నారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో శుక్రవారం ( మే 2) హస్తినలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం, తెలంగాణలో జరిగినట్లుగా దేశమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనకబాటుతనాన్ని నిర్ధారిస్తూ కులగణన జరిపించాలని సీడబ్ల్యూసీ డిమాండ్‌ చేసింది. కులగణన విషయంలో తెలంగాణ నమూనానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసింది. అంతే కాకుండా, సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో చేపట్టిన కులగణనకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు చెపుతున్నారు.  అదొకటి అయితే.. ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఇమేజ్  పెరిగిందని అంటున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా.   రేవంత్ రెడ్డి ఆశా జ్యోతిగా కనిపిస్తునారని అంటున్నారు. అందుకే  రేవంత్ రెడ్డి అడక్కుండానే  ఒకే రోజు  శనివారం( మే3) కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ,  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. మరో కొందరు ముఖ్య నేతలు కూడా రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే..  బహుశా తొలిసారిగా తోడు పెళ్లి కొడుకు (భట్టి  లేదా ఉత్తమ్ కుమార్) తోడు కేకుండా కేంద్ర నాయకులతో సమావేశమవుతున్న రేవంత్ రెడ్డి ఏమి మాట్లాడతారు? కేవలం కులగణన వరకే పరిమితం అవుతారా?  చాలా కాలంగా పెండింగ్  లో ఉన్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ గురించి కూడా మడ్లదతారా?  అనేది  తేలక పోయినా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ పర్యటన, గుర్తుండిపోతుందని అంటున్నారు . నిజానికి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆరోపించినట్లుగా బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కులగణనను తెర పైకి తెచ్చిందా లేడా అన్నది  పక్కన పెడితే.. రేవంత్ రెడ్డికి మాత్రం మంచి చేసిందని అంటున్నారు.

ఏపీ భవన్ కు బాంబు బెదరింపు

ఢిల్లీలోని ఏపీ భవన్‌కు నిన్న రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. ఏపీ భవన్‌లోని ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ ఆమెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి  ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌కు మెయిల్‌ చేశాడు. ఈ మేరకు ఈమెయిల్ చేశాడు. సరిగ్గా ఏపీ భవన్ లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఫూలే జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినీమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఈమెయిల్ వచ్చింది. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సినీమా ప్రదర్శన ఉండగా.. అంతకు కొద్ది సేపటి ముందు ఈ ఈమెయిల్ వచ్చింది. లవ్ అగర్వాల్ ఈ మెయిల్ వచ్చిన సమయంలో ముంబైలో ఉన్నారు. వెంటనే ఏపీ భవన్ అధికారులు, పోలీసులకు ఆయన సమాచారం అందించి అప్రమత్తం చేశారు. దీంతో ఏపీ భవన్ లో భద్రతా విధులు నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు గంటకు పైగా తనిఖీలు నిర్వహించిన తరువాత బాంబు లేదని తేల్చారు. 

కమలం గూటికి శశి థరూర్?

ప్రధాని వ్యాఖ్యలతో  రాజకీయ దుమారం  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్  సొంత పార్టీలో అంత సుఖంగా  లేరన్న ప్రచారం చాలా చాలా కాలంగా  జరుగుతోంది. ఒక దశలో ఆయన కాంగ్రెస్ పార్టీకి  గుడ్ బై  చెప్పడం ఖాయమని జాతీయ మీడియాలో  కథలు, కథనాలు చాలానే వచ్చాయి.  కథలు, కథనాలు రావడం ఒకెత్తు అయితే..  స్వయంగా ఆయనే  కాంగ్రెస్ పార్టీ తనను పక్కన పెట్టిందని  ఆరోపించారు. ఇంకో అడుగు ముందుకేసి,  నేను కాంగ్రెస్  కు అవసరం అనుకుంటే కాంగ్రెస్ లో ఉంటాను  అవసరం లేదనుకుంటే నా ముందు చాలా ప్రత్యన్మాయాలున్నాయి  అంటూ సంచలన ప్రకటన కూడా చేశారు. అయితే.. ఆయన రాజకీయ ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడారా..  లేక రచనా వ్యాసంగం, ఉపన్యాసాల వంటి ఇతర అంశాల గురించి మాట్లాడారా? లేక రెండింటి గురించి మాట్లాడారా  అనే విషయంలో ఆయన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.   అదెలా ఉన్నా.. గత కొంత కాలంగా శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా ఆయన బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు మరింత క్లియర్ గా కనిపిస్తున్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో సెల్ఫి తీసుకోవడం, ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో  మోదీ అనుసరించిన విధానాన్ని తాను తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమాపణలు చెప్పడం వంటి అనేక పరిణామాలు, సంఘటనలు శశి థరూర్  బీజేపీకి దగ్గరౌతున్నారనే వాదానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇదలా ఉంటే..  ప్రధాని మోదీ తాజా కేరళ పర్యటన  శశి థరూర్  ను బీజేపీకి మరింత దగ్గర చేసిందని అంటున్నారు. అన్తునంరు. ముఖ్యంగా తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక విఝింజమ్‌ అంతర్జాతీయ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా  ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా  చర్చనీయాంశ మయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేరళ ముఖ్య మంత్రి పినరన్ విజయన్,  తిరువనంతపురం  ఎంపీ శశి థరూర్  పాల్గొన్నారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో శశి థరూర్ ఉన్నారు,  ఇది కొందరి నిద్రను భంగం చేస్తుందని  అన్నారు. నిజానికి, ప్రధాని మోదీ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ.. చాలా కాలంగా శశి థరూర్ బీజేపీలో చేరుతున్నారనే వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని లేపాయి. అంతే కాకుండా.. శశి థరూర్‌ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ప్రధాని మోదీకి స్వాగతం పలకడంతో పాటు  ఢిల్లీ  ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ సమయానికి చేరుకుని తన నియోజకవర్గానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికానని సంతోషం వ్యక్తపరిచారు.  దీంతో శశి థరూర్‌ బీజేపీలో చేరారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి సొంత నియోజక వర్గానికి వచ్చిన ప్రధానికి స్థానిక ఎంపీ స్వాగతం పలకడం పెద్ద విషయం కాదు, అలాగే.. ప్రధాని మోదీ సరదాగా చేసిన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. అయితే.. గత కొంతకాలంగా శశిథరూర్‌ కాంగ్రెస్ అధినాయకత్వంతో సఖ్యతగా లేరని, పార్టీలో ఆయన పాత్రపై అసంతృప్తితో ఉన్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ విషయం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.  అయితే..  కేరళ ముఖ్య మంత్రి పదవిని ఆశిస్తున్న శశిథరూర్‌ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. వచ్చే సంవత్సరం జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలల్లో తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారనీ, అందుకు  అధిష్టానం నో  అందనీ ప్రచారం జరుగుతోంది.  అందుకే  శశిథరూర్‌ ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుకొచ్చే వ్యూహంతో పావులు కదుపుతున్నట్లు చెపుతున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ కేరళ పర్యటన.. ఆ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన  వ్యాఖ్యలు మరోసారి శశిథరూర్‌  కాంగ్రెస్ సంబంధాల పై చర్చను తెరపైకి తెచ్చిందని అంటున్నారు.  మర్కట సందేశం  అదలా ఉంటే.. ఇటీవల  శశిథరూర్‌  తన ఢిల్లీ నివాసంలో బయట గార్డెన్ లో కూర్చుని పేపర్ చదువు కుంటున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ  ఒక కోతి వచ్చి ఆయన ఒడిలో కూర్చుంది. సిబ్బంది ఇచ్చిన అరిటిపండ్లు తిన్నది. ఆ తర్వాత శశి థరూర్‌ ఒడిలో ఆ కోతి సేదతీరింది. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో ఆయనే స్వయంగా పోస్ట్‌ చేశారు. ఈ అసాధారణ అనుభూతిని ఎక్స్‌లో పంచుకున్నారు. ఈరోజు ఒక అసాధారణ అనుభవం కలిగింది. ఉదయం నేను గార్డెన్‌లో కూర్చొని వార్తాపత్రికలు చదువుతున్నా. ఒక కోతి నేరుగా నా వద్దకు వచ్చింది. నా ఒడిలో కూర్చొంది. రెండు అరటి పండ్లు ఇవ్వగా చాలా ఆకలితో తిన్నది. నన్ను కౌగిలించుకుని నా ఛాతిపై తల ఆనించి నిద్రపోయింది. నేను మెల్లగా పైకి లేవగా కిందకు దూకి అక్కడి నుంచి వెళ్లిపోయింది అని పేర్కొన్నారు. మరోవైపు శశి థరూర్‌ ఒడిలో కోతి కూర్చోవడం, అరటి పండ్లు తినడం, ఆ తర్వాత ఆయనను హత్తుకుని నిద్రించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో కొందరు శశి థరూర్‌ పార్టీ మారాలని ఆ కోతి మర్కట సందేశం ఇచ్చిందని అంటున్నారు.

అమరావతి కేవలం నగరం కాదు.. ఒక శక్తి.. ప్రధాని మోడీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. అమరావతి పున: నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదనీ అదోక శక్తి అని ఉద్ఘాటించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న 18 కీల‌క ప్రాజెక్టుల‌కు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు.  వీటిలో అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో. ఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్రాజ‌క్టులూ ఉన్నాయి.  ఉన్నాయి. అమ‌రావ‌తి లో 58 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టారు. అలాగే ఏడు జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు. ఈ జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేస్తాయి.  ఈ ప్రాజెక్టులలో జాతీయ రహదారులలోని వివిధ విభాగాల విస్తరణ, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు సబ్ వే నిర్మాణాలు ఉన్నాయి.  రోడ్డు భద్రతను మరింత పెంచే లక్ష్యంతో వీటిని చేపడుతున్నారు. ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు సులువైన, తేలికైన, సజావైన ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.    అలాగే ఎలివేటెడ్ కారిడార్, హాఫ్ క్లోవర్ లీఫ్,  రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాపన చేశారు. ఇక రాజధాని అమరావతికి సంబంధించి...  శాసనసభ, హైకోర్టు, సచివాలయం,  పరిపాలనా భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.  అనంతరం హస్తినకు బయలు దేరి వెళ్లారు. అలా వెళ్లగానే తన అమరావతి పర్యటనపై ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తాను ఒక చారిత్రక అధ్యాయాన్ని ప్రారంభించాననీ, అందుకు ఎంతో ఆనందంగా ఉందనీ పేర్కొన్నారు.అమరావతి ఏపీ ప్రగతి పథాన్ని ముందుకు తీసుకువెడుతుందనీ, ఆది ఒక మహానగరంగా అవతరిస్తుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి పట్ల, ప్రజల పట్ల చంద్రబాబు నిబద్ధత ప్రశంసనీయమని మోడీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదనీ, అదోక శక్తి అని అభివర్ణించారు. అలాగే అమరావతి నిర్మాణం పట్ల, ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు  నిబద్ధత ప్రశంసనీయం అంటూ ఆ ట్వీట్ లో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు.