మరిన్ని చిక్కుల్లో విడదల రజిని..మాజీ ఎంపీ గోరంట్లకు పట్టిన గతేనా?

  వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజినికి మరో చిక్కుల్లో పడింది. ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్న సమయంలో  విధినిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. వారి విధులకు ఆటంకం కలిగించింది. తన అనుచరుడు అరెస్ట్‌కు కారణం  చెప్పాలని సీఐ సుబ్బారాయుడును నెట్టేశారు. విడదల రజిని ప్రవర్తన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో వైసీపీ మాజీ ఎంపీ  గోరంట్ల మాధవ్‌ పోలీసుల అదుపులో ఉన్న  చేబ్రోలు కిరణ్ దాడిచేసి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జులుం ప్రదర్శించారు.  చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తుండగా మాధవ్‌ అటకాయించి దాడి చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద హల్‌చల్‌ సృష్టించారు. దీంతో గోరంట్ల పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వరుసగా వైసీపీ నాయకులు పోలీసుల పై వీధి రౌడీలా విరుచుకుపడుతున్నారు. అయితే ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వైసీపీ హయంలో పల్నాడు జిల్లాలో.. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని.. బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించారని రజినీపై ఆరోపణలు వచ్చాయి. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం కూడా ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు అయింది.

ఖజానా ఖాళీ.. సాయం అందే దారి లేదు.. పాక్ కింకర్తవ్యం!

భారత్‌ను కెలికి  పాక్ అన్నిరకాలుగా చావుదెబ్బ తింటోంది. అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్స్‌ ఏజన్సీ మూడీ అంచనాల ప్రకారం యుద్ధాన్ని భరించే పరిస్థితి పాక్‌కు ఏ మాత్రం లేదు. పాకిస్తాన్ ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలమైంది. ఆహార పదార్థాల నుంచి పెట్రోలు వరకూ అనేక నిత్యావసరాలకు దిగుమతులపైనే ఆధార పడే ఆ దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా అవసరం. అవిప్పుడు పూర్తిగా నిండుకున్నాయి. ప్రస్తుతమున్న నిల్వలు మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపో తాయంటున్నారు. యుద్ధం నేపథ్యంలో అదనపు వనరులు సమకూర్చుకోవాలి. కానీ పాక్‌ను ఆర్థికంగా ఆదుకోవటానికి  ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక వివరాలు అందించే  సీఈఐసీ ప్రకారం... డిసెంబరు 2024 నాటికి పాకిస్థాన్‌ అప్పు 131 బిలియన్‌ డాలర్లు.  తాజాగా పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మరోసారి సహాయం కోసం చేయి చాచింది. పాక్‌ జీడీపీలో అప్పుల వాటా ఇప్పటికే 75 శాతానికి చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచదేశాల్లో ముద్ర పడింది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం వంటి సామాజిక సమస్యలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడమే కష్టమైన తరుణంలో యుద్ధ సన్నాహాలు పాక్‌కు అసాధ్యంగా మారనున్నాయి. మరో వైపు బయట నుంచి నిధులు వచ్చే మార్గాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు కొండలా పేరుకుపోవడంతో వాటిని తీర్చేందుకు సతమతమవుతున్న దాయాది దేశం.. యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి లేదు. పరిమిత ఘర్షణలతో కూడిన సైనిక ప్రతిష్టంభన సైతం పాకిస్థాన్‌కు అంతులేని నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళుతున్న భారత్‌తో యుద్ధం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అటు ఆర్థిక ఇబ్బందులకు తోడు... రాజకీయంగా, సామాజికంగా కూడా పాక్‌లో పరిస్థితి అదుపు తప్పుతోంది. బలూచిస్థాన్‌లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమం ప్రభుత్వానికే కాదు, సైన్యానికీ సవాలు విసురుతోంది.  తరచూ జరుగుతున్న దాడులతో అక్కడ అదనపు బలగాలను మోహరించాల్సిన అనివార్య పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని అక్కడ వెచ్చిస్తోంది. ఇటీవల జరిగిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్‌తో ఆ ప్రాంతంపై పాకిస్థాన్ పట్టు కోల్పోయినట్లయింది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వంతోనూ పాక్‌కు పొసగటం లేదు. ఇంకోవైపు సింధ్‌లో ఇండస్‌ నదిపై కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒక రకంగా పాకిస్థాన్ అంతర్యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్నది.   దేశ భద్రతలో కీలకమైన రక్షణవ్యవస్థ కూడా బలోపేతంగా ఏమీ లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యంపైనా పడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కిరోసిన్, పెట్రోలు వంటి వాటినీ అవసరాలకు అందించలేకపోతున్నారు. అరకొర సౌకర్యాలతో భారత్‌ వంటి శక్తిమంతమైన దేశాన్ని ఎక్కువ రోజులు ఎదుర్కోలేమని పాక్‌ రక్షణ నిపుణులు తేల్చి చెబుతున్నారు. 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్‌ రూ.2.50 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని... పాకిస్థాన్‌ కూడా ఇదే స్థాయిలో ఆర్థిక వనరులు వినియోగించాల్సి ఉంటుందని ముంబయికి చెందిన థింక్‌ ట్యాంక్‌ స్ట్రాటజిక్‌ ఫోర్‌సైట్‌ గ్రూప్‌ విశ్లేషించింది. ఇదే జరిగితే పాక్‌పై కోలుకోలేని భారం పడుతుంది. ఆ దేశంలో ప్రజాజీవనం స్తంభిం చిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

అపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఆపరేషన్ కగార్ స్టాప్.. సరిహద్దులకు భద్రతా దళాలు

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌ నిలిచిపోయింది. మావోయిస్టుల ఏరివేతకు తాత్కాలికంగా విరామం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ కగార్ లో ఉన్న భద్రతా దళాలను వెనక్కు పిలిపించి, వారిని సరిహద్దుల్లో మోహరించనుంది. ఇందు కోసం ఆపరేషన్ కగార్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్థాన్ తో యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.   అపరేషన్ కగార్ లో నిమగ్నమై ఉన్న దాదాపు ఐదు వేల మంది  బలగాలను కేంద్రం వెనక్కు రప్పిస్తోంది. ఇందులో భాగంగానే  కర్రెగుట్టల్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ఈ బలగాలు రేపటికల్లా సరిహద్దులకు చేరుకోనున్నాయి.  కాగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌ దూకుడుగా సాగుతోంది. ఆపరేషన్‌ కగార్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలపై సెర్చ్‌ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ఆగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కూబింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పాక్ తో యుద్ధం కారణంగా ఈ కూంబింగ్ కు బ్రేక్ పడినట్లైంది. 

విడదల రజిని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్

  మాజీ మంత్రి విడదల రజిని  ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిను పోలీసులు అరెస్ట్ చేశారు. రజిని కారులోనే మానుకొండ తిరుగుతున్నాడని పోలీసులకి పక్కా సమాచారంతో మాజీమంత్రి కారులోనే నాదెండ్ల మండలం జంగాలపల్లికి  వచ్చిన శ్రీకాంత్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. ఆయను అరెస్ట్ చేయొద్దని పోలీసులని రజిని అడ్డుకున్నారు.  అతికష్టం మీద వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు  అదుపులోకి  తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి విడదల రజినీకి వాగ్వాదానికి దిగింది. అసలు ఏ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా విడుదల రజిని డిమాండ్ చేశారు. ఇప్పటికే  రజినిపై ఏసీబీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వైసీపీ హయంలో పల్నాడు జిల్లాలో.. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని.. బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించారని రజినీపై ఆరోపణలు వచ్చాయి. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం కూడా ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు అయింది.

జాతీయ రక్షణ నిథికి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విరాళం.. ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ రక్ణణ నిథికి విరాళంగా తన నెల వేతనాన్ని అందజేశారు. ఆన్ లైన్ పేమెంట్ విధానం ద్వారా ఆయన ఈ విరాళాన్ని జాతీయ రక్షణ నిథికి సమర్పించారు. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు తెలియజేసిన ఆయన  ఉగ్రవాద నిర్మూళన కోసం సాయుధ దళాలు అత్యంత సాహసోపేతంగా చేస్తున్న పోరాటం పట్ల ప్రతి భారతీయుడూ గర్వంతో పొంగిపోతున్నారని అన్నారు.  దేశ రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు  సంఘీభావంగా తన వంతుగా  నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా  ఇచ్చినట్లు తెలిపారు.  ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్ల చెప్పారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే జాతీయ రక్షణ నిథికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రక్షణ నిథికి విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రజా ప్రతినిథులకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక రోజు వేతనాన్ని జాతీయ రక్షణ నిథికి విరాళంగా ప్రకటించారు.  

డ్రగ్స్ డెలివరీ తీసుకుంటూ డాక్టర్ అరెస్టు

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్‌గా సేవలందిస్తున్న ఓ మహిళ.. డ్రగ్స్‌కు బానిసగా మారడం సంచలనం సృష్టిస్తోంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన డాక్టరే వాటిని తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక్క సంవత్సరంలోనే సుమారు  70 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను ఆ వైద్యురాలు సేవించినట్లు   పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. కచ్చితమైన సమాచారంతో ఆ వైద్యురాలిపై నిఘాపెట్టి   డ్రగ్స్​ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.   షేక్ పేటలోని ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) ఒమేగా హాస్పటల్ లో సీఈవోగా పని చేస్తున్నారు.  ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్‌ను వాట్సాప్​లో సంప్రదించి ఐదు లక్షల రూపాయల విలువైన  కొకైన్​కు ఆర్డర్ చేశారు. ఆన్​లైన్​లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ రాంప్యార్ రామ్ ద్వారా కొకైన్ పంపించాడు.  కొకైన్ ను రాంప్యార్ నుంచి డాక్టర్ నమ్రత తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   డాక్టర్ నమ్రతతో పాటు రాంప్యార్​ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  పోలీసులు వీరి నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం  చేసుకున్నారు.  

హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం : సీవీ ఆనంద్

  హైదరాబాద్ జంట నగరాల్లో బాణా సంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సిటీ పోలీస్ యాక్ట్ 1348 సెక్షన్ 67(C) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తక్షణమే నగరంలో బాణసంచా కాల్చడాన్ని నిషేదిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేసారు. సరిహద్దుల్లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున నగరంలో బాణసంచా కాల్చడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగే అవకాశం ఉందని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బాణసంచా శబ్దాలు పేలుళ్ల శబ్దాలను పోలీఉండటంతో ఇది ప్రజల్లో అనవసరమైన గందరగోళానికి దారితీయవచ్చు. శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిషేదాజ్ఞలు జారీ చేశారు.  ఈ నిషేదం తక్షణమే అమలులోకి వస్తుందని సీపీ వెల్లడించారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడే వరకు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉందని, నగర ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పోలీస్ శాఖ కోరింది.  బాణసంచా శబ్దాలు ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించవచ్చని, పేలుళ్ల శబ్దాలను తలపించి గందరగోళానికి దారితీయవచ్చని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం, పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే ఈ నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

పాక్ టూరిజం టు టెర్ర‌రిజం!.. ఏ వార్ ఫేర్

అవి మ‌న‌కు స్వాతంత్రం వచ్చిన రోజులు. భార‌త దేశంలోనే అతి పెద్ద సంస్థానం జ‌మ్మూ- కాశ్మీరం.  క‌శ్య‌ప మ‌హా ముని పేరిట వెల‌సిన  కాశ్మీర్ కి రాజు రాజా హరిసింగ్. వెళ్తూ వెళ్తూ బ్రిటీష్ ఇండియా చేసిన ప‌ని.. ఎవ‌రి  స్వేచ్ఛ‌ మేరకు  వారు భార‌త్- పాక్.. లలో ఏ దేశంలోనైనా అయినా క‌ల‌వ‌చ్చ‌న్న మెలిక పెట్టడం.   అప్ప‌టికి స్వాతంత్రం పొందిన దేశాలు భార‌త్, పాక్, శ్రీలంక‌, బ‌ర్మా. వీటిలో భార‌త్- పాక్ మ‌ధ్య ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌లు చాలానే. దానికి తోడు ఇక్క‌డున్న మ‌రో మెలిక ఏంటంటే.. హిందుస్థాన్ లో హిందువులు, పాకిస్థాన్ లో పాకిస్థానీయులు అంటే ముస్లిములు ఉండాల‌న్న‌ది ఒక ష‌ర‌తు కాగా.. మ‌న భార‌త దేశంలో ఇంకా మూడొంతుల్లో ఒక వంతు ముస్లిములు అలాగే ఉండి  పోయారు.  అయినా స‌రే ఇరు వ‌ర్గాల మ‌ధ్య హిందూ- ముస్లిం- సిక్ వంటి జాతుల మ‌ధ్య బీభ‌త్స‌మైన సంఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ్గా ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో 2 ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు.  అంతే స్థాయిలో నిరాశ్ర‌యులు అయ్యారు కూడా. ఈ లోగా రాజాహ‌రిసింగ్ నేతృత్వంలోని కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల‌పైకి గిరిజ‌న ఇస్లామిక్ గ్రూపులు పాక్ సైన్యం సాయంతో  దాడులు చేశారు. వీరి బాధ ఏంటంటే రాజా హ‌రిసింగ్ ఎక్క‌డ త‌న సంస్థానాన్ని భార‌త్ లో క‌లిపేస్తాడో అన్న‌దే. పాక్ అత్యుత్సాహం, గిరిజ‌న ఇస్లామిక్ గ్రూపుల దుందుడుకు త‌నం పెచ్చరిల్లి రాజా హ‌రిసింగ్ కి చిరాకు తెప్పించాయి. ఒక  ర‌కంగా  ఆందోళ‌న క‌లిగించాయి. ఇలాంటి వారి నుంచి ఈ  చ‌ల్ల‌టి క‌శ్మీరం ర‌క్ష‌ణ పొందాలంటే వీరికంటే అమేయ ప‌రాక్ర‌మ‌మైన భార‌త్ ప‌రిధిలో ఈ దేశం ఉండాల‌ని భావించారు రాజా హ‌రిసింగ్. అందులో భాగంగా భార‌త్ వైపే క‌శ్మీర్ సంస్థానం క‌లిసేలా ఒప్పంద పాత్రాల‌పై సంత‌కాలు చేశారు. దీంతో ఐక్య రాజ్య స‌మితి  సైతం తీర్మానం చేసింది. ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు చిక్కు. పాకిస్థాన్ కి ఒళ్లు మండింది. క‌శ్మీర్ లో అత్య‌ధికంగా ఉన్న ముస్లిమ్ జ‌నాభాను  అనుస‌రించి చూస్తే.. ఈ ప్రాంతం క‌ల‌వాల్సింది పాక్ లో. అంతే కాకుండా వారి మ‌రో కాంక్ష ఏంటంటే.. క‌శ్మీరం భూత‌ల స్వ‌ర్గం. స్విట్జ‌ర్లాండ్ ఆఫ్ సౌత్ ఏషియా. ఈ ప్రాంతం కానీ త‌మ గుప్పెట్లో ఉంటే.. మ‌నం ఎంచ‌క్కా ప‌ర్యాట‌కం ద్వారా విశేష‌మైన ఆదాయాన్ని స‌ముపార్జించుకోవ‌చ్చు. అన్న‌ది వీరి ఆశ. ఆశ‌యం. అయితే ఈ ఆశ‌ల‌పై రాజా హ‌రిసింగ్ నీళ్లు కుమ్మ‌రించ‌డంతో వీరికి ఆ నాటి  నుంచి ఈ నాటి వ‌ర‌కూ.. ఆ కోరిక అలాగే ఉండి పోయింది. కార‌ణ‌మేంటంటే వారికి ద‌క్కిన భూభాగమంతా ఎడారిని త‌ల‌పిస్తుంది. పేరుక‌ది ప‌విత్ర దేశ‌మే కానీ అంతా అప‌విత్రం కావ‌డానికి గ‌ల కార‌ణం.. ఆ దేశానికంటూ  సొంత కాళ్ల మీద నిల‌బ‌డే స‌త్తా లేక పోవ‌డం.  సింధూజ‌లాలు ఎక్క‌డో పుట్టి ఎక్క‌డి  నుంచో త‌మ దేశంలో ప్ర‌వ‌హిస్తేగానీ.. ఇక్క‌డ వారి  పంట‌ల‌కు దిక్కూ మొక్కూ లేదు. అంతే కాదు ఈ జ‌లాల ద్వారా పండే పంట‌లతో ఆ దేశ జీడీపీలో 24 శాతం ఆదాయం మాత్ర‌మే ల‌భిస్తుంది. అదే కాశ్మీర్ కూడా త‌మ సొంత‌మైతే.. వారు ప‌ర్యాట‌కంగానూ విశేష‌మైన ఆదాయ వ‌న‌రుల‌ను పొంద‌వ‌చ్చు. ఇక్క‌డే పాక్ ఆశ‌ల‌కు భారీగా చెక్ పెట్టిన‌ట్ట‌య్యింది రాజా హ‌రిసింగ్. అలాగ‌ని ఇది కేవ‌లం ఆయ‌న నిర్ణ‌య‌మ‌ని అనుకోవ‌డానికి వీల్లేదు. ఆ నాడు పాక్ ఇస్లామిక్ ట్రైబ‌ల్ గ్రూపుల‌కు త‌న ద‌ళాల సాయం అందించ‌కుండా ఉండాల్సింది. కానీ, రాజాహ‌రిసింగ్ హిందువు కావ‌డం. దానికి తోడు ఈ ప్రాంతం పేరు కూడా ఒక హిందూ ముని క‌శ్య‌పుడి పేరిట ఉండ‌టంతో.. ఆయ‌న కూడా హిందువులు అత్యధికంగా  ఉన్న హిందుస్తాన్ లో క‌శ్మీర్ క‌ల‌వ‌డ‌మే స‌మంజ‌సం అనుకున్నారు. అందుకే ఈ ప్రాంతంలోని క‌శ్మీరీ పండిట్ల‌ను బ‌ల‌వంతానా ఏరి పారేసింది క‌శ్మ‌రీ ముస్లిములు. అదే త‌ర్వాతి రోజుల్లో క‌శ్మీర్ ఫైల్స్ అనే సినిమా వ‌చ్చేలా చేసింది.  పాకిస్థానీయులు ఇక్క‌డే చావు దెబ్బ తిన్నారు. వారు త‌మ అత్యుత్సాహ ప్ర‌ద‌ర్శ‌న  చేయ‌కుండా.. దౌత్య ప‌రంగా ఎంతో సంయ‌మ‌నంతో ప్ర‌వ‌ర్తించి ఉండాల్సింది. ఆచీ- తూచి వ్య‌వ‌హ‌రించి ఉండాల్సింది. రాజు మీద ఒత్తిడి తేకుండా ఉండాల్సింది. అలా చేసి ఉంటే.. వారి బిహేవియ‌ర్ న‌చ్చి ఉంటే రాజా హ‌రి సింగ్ మ‌న‌సు మారి ఉండేదేమో కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. ఇక్క‌డే పాకిస్థాన్ కొంప  మునిగింది. అలాగ‌ని భార‌త్ కి వ‌రంగా ఏమీ మిగ‌ల్లేదు కాశ్మీర్. అదింకా ర‌క్త స్రావం చేస్తూనే ఉంది. ప్రాణ న‌ష్టానికి కార‌ణం అవుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు యుద్ధాలు జ‌ర‌గ్గా. వీటిలో 1971లో జ‌రిగిన యుద్ధ‌మొక్క‌టే కాశ్మీర్ కేంద్రంగా జ‌ర‌గ‌లేదు. అది తూర్పు పాకిస్థాన్ అలియాస్ బంగ్లాదేశ్ కోసం జ‌రిగింది. అది కూడా ఈస్ట్ వెస్ట్ పాకిస్తానీయులైన ముజ‌బుర్ రెహ‌మాన్, యాహ్యాఖాన్, భుట్టోల మ‌ధ్య సాగిన రాజ‌కీయ పోరు కార‌ణంగా జ‌ర‌గ్గా.. ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ ఆవిర్భావ‌మైంది. ఈ ప్రాంతంలోని కోటి మంది బెంగాలీలు భార‌త్ వైపున‌కు బ‌లవంతంగా రావాల్సి వ‌చ్చింది. ఈ యుద్ధ స‌మ‌యంలోనే పాక్ జ‌లంత‌ర్గామి ఘాజీ విశాఖ తీరంలో అనుమానాస్ప‌దంగా మునిగింది. మిగిలిన అన్ని యుద్ధాలు, ఘ‌ర్ష‌ణ‌ల‌కు క‌శ్మీరే కీల‌కం. అస‌లు 1947- 48లో జ‌రిగిన తొలి ఇండో- పాక్ యుద్ధాన్ని తొలి కాశ్మీర్ వార్ గా పిలుస్తారు. త‌ర్వాత కార్గిల్ వ‌ర‌కూ జ‌రిగిన  యుద్ధాల్లో ఇరు ప‌క్షాల‌కు అపార‌మైన ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. ఒక్క కార్గిల్ వార్ లోనే పాక్ 4 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.   ఈ ఆకాంక్ష‌తోనే పాక్ లో ఉగ్ర‌వాదం పురుడు పోసుకుంది. టూరిజం బ‌దులు టెర్ర‌రిజం పుట్టుకొచ్చింది. సౌత్ ఏషియా టెర్ర‌ర్ పోర్ట‌ల్ నివేదిక ప్రకారం ఒక్క పాకిస్తాన్ లోనే 80 నిషిద్ధ టెర్ర‌రిస్టు గ్రూపులుంటే వీటిలో 45 వ‌ర‌కూ ఉగ్ర ముఠాలు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. వీటిలోనూ ల‌ష్క‌రే తోయిబా, జైషే మొహ‌మ్మ‌ద్  భార‌త్ అంటేనే ర‌గిలిపోతాయి. ఈ ఉగ్ర సంస్థ‌లు భార‌త్ పై చేసే యుద్ధ‌మంటే.. దేశం కోసం చేసే యుద్ధంగా భావిస్తాయి. అందుకే వీరి  స‌హాయ స‌హ‌కారాల‌ను ఒక ప‌విత్ర కార్యంగా భావిస్తుంది పాక్ ఆర్మీ. ర‌వూఫ్ లాంటి టెర్ర‌రిస్టులు మ‌ర‌ణిస్తే.. వారికి త‌మ జాతీయ జెండాల‌ను క‌ప్పి మ‌రీ అంత్య‌క్రియ‌ల‌ను లాంఛ‌నంగా నిర్వ‌హిస్తుంది. ఎప్పుడైతే  కాశ్మీర్ టూరిజం కోల్పోయిందో పాకిస్థాన్.. ఈ అంశం ద్వారా ల‌బ్ధి పొందాల్సింది కాస్తా.. టెర్ర‌రిజం అనే దానికి కేంద్ర స్థానంగా నిలిచింది. దీంతో ప్ర‌పంచానికి టెర్ర‌రిస్టుల‌ను త‌యారు చేసే ఫ్యాక్ట‌రీగా మారింది. ర‌ష్యాతో యురోపియ‌న్ దేశాల పోరులో యురోపియ‌న్ల వైపు నిలిచి.. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా త‌న టెర్ర‌రిస్టు కార్య‌క‌లాపాల‌ను అరువుగా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇదే యురోపియ‌న్ దేశాలు పాక్ అంటేనే మండి ప‌డుతున్నాయ్. లాడెన్ అయితే ఈ కక్ష కొద్దీ.. అమెరికాపై దాడులు నిర్వ‌హించి.. త‌ద్వారా అమెరికా త‌దిత‌ర దేశాల‌కు బ‌ద్ధ శ‌తృవుగా మారాడు. యూఎస్ ఆర్మీ పాకిస్తాన్  అబోతాబాద్ లో ఆశ్ర‌యం పొందుతున్న అత‌డ్ని మ‌ట్టుబ‌ట్టి త‌మ క‌డుపుమంట చ‌ల్లార్చుకుంది. ప్ర‌స్తుతం ఈ దేశ టెర్ర‌రిజానికి రెండు క‌ళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు హ‌ఫీజ్ స‌యీద్, మ‌సూద్ అజ‌ర్.. కాగా.. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన అకృత్యాల కార‌ణంగా భార‌త్ కి కొన్ని వంద‌ల సంఖ్య‌లో ప్రాణ‌హాని జ‌రిగింది. మ‌న పార్ల‌మెంటు దాడి, ముంబై దాడి, పుల్వామా దాడి, తాజాగా జ‌రిగిన ప‌హల్గాం దాడి.. అన్నిటికీ వీరే బాధ్యులు. ఈ ఇద్ద‌ర్ని భార‌త్ కు అప్ప‌గించాల్సిందిగా పాక్ ను డిమాండ్  చేస్తోంది భార‌త్. అప్పుడే ఈ ఆప‌రేష‌న్ సిందూర్ ని ఆపుతామ‌న్న అల్టిమేటం జారీ చేస్తోంది. అయితే మ‌సూద్ అజ‌ర్ త‌న త‌మ్ముడు, అక్క‌తో స‌హా దాదాపు త‌న కుటుంబాన్ని కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తోంది. హ‌ఫీజ్ స‌యీద్ సైతం త‌న  కొడుకు త‌ల్హాను ముజ‌ఫ‌రాబాద్ దాడుల్లో కోల్పోయాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌ఫీజ్ సైతం ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చ‌న్న రిపోర్టులు అందుతున్నాయి. మ‌రి చూడాలి.. ఈ యుద్ధం ముగిసేనాటికి పాక్ కి ఏం మిగులుతుందో. భార‌త్ ఎలాంటి విజ‌యం సాధిస్తుందో తేలాల్సి ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన అనేక యుద్ధాలు, సంఘ‌ర్ష‌ణ‌ల్లో పాక్ ది ఘోర ప‌రాజాయ‌ల ప‌రంప‌రే సాగుతోంది. ప్ర‌స్తుతం కూడా ఆ దేశ పార్ల‌మెంటులో ఒక ఎంపీ ఇదే అంశాన్ని నిల‌దీశాడు. పాక్ ప్ర‌ధాని ఓ పిరికిపంద‌గా అభివ‌ర్ణించాడు. అంతే కాదు ఆ దేశ సైన్యాధ్య‌క్షుడు మునీర్ అసీం అల్లాపై భారం వేశాడు. నో ప్లాన్స్.. ఓన్లీ ప్రేయ‌ర్స్ అంటూ చేతులెత్తేశాడు. ఇక ఇమ్రాన్ ఖాన్ అనుచ‌రులైతే.. మీకంత ద‌మ్ము లేదు కానీ మా ఇమ్రాన్ని విడుద‌ల చేసి పాక్ ని కాపాడండీ అంటూ నినాదాలు జారీ చేస్తున్నారు. ఇటు చూస్తే బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ అయితే పాక్ ని ఇదే అదునుగా చావు దెబ్బ తీయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే క్వెట్టాతో స‌హా మూడింట రెండొంతులు తాము స్వాధీన  ప‌రుచుకున్నామ‌ని అంటోంది. ఈ క్ర‌మంలో అంత‌ర్యుద్ధం సైతం పాక్ ఫేస్ చేస్తోంది. ప్ర‌జ‌ల్లో కూడా ప్ర‌భుత్వం, సైన్యం మ‌ధ్య తీవ్ర నిరాశా నిస్పృహ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ర‌క్ష‌ణ మంత్రి ని పార్ల‌మెంటు ప్ర‌శ్నించ‌గా.. వ్యూహాత్మ‌కంగానే తాము భార‌త దాడులు తిప్పి కొట్ట‌డం లేద‌న్న డొల్ల స‌మాధానాలు చెబుతున్నాడు. ఇక  ఆర్ధికంగా మాకు సాయం చేయండంటూ చందాలు కోరుతూ.. ఎక్స్ లో ఒక పోస్టు పెట్టి మ‌రింత అభాసు పాలైంది.. పాకిస్థాన్. ఇలా ఎవ‌రైనా దేబిరిస్తారా? అని నిల‌దీస్తే.. త‌మ అఫిషియ‌ల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయిస్తోంది. ఇలా ఏ కోణంలో చూసినా కూడా పాకిస్థాన్ ప్ర‌స్తుతం స‌జావుగా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ మందుగుండు సామాగ్రి కొర‌త‌తో కొట్టుమిట్టాడుతోంది. ఒక ప‌క్క చూస్తే మ‌న  ఐఎన్ఎస్ విక్రాంత్ క‌రాచీ పోర్టును ధ్వంసం  చేసింది. కేవ‌లం ట‌ర్కీ ఇచ్చిన డ్రోన్ షూట‌ర్ల సాయంతో భార‌త్ ను ఇరుకున  పెట్టాల‌న్న కోణంలో తీవ్ర య‌త్నాలు చేస్తోంది పాక్. వాటిని కూడా మ‌న ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్ ధ్వంసం  చేస్తున్నాయ్. చైనా స‌హ‌కార‌మూ అంతంత మాత్ర‌మే. అవి ఇచ్చిన ఆయుధాలు ఎంత మాత్రం ప‌ని చేయ‌డం లేదు. పైపెచ్చు పేల్చిన చోటే పేలిపోతున్నాయ్... ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ ప్ర‌స్తుత ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రం. ఇక మిగిలింది  అణుబాంబు. నేష‌న‌ల్ ఫుడ్ జ‌ర్న‌ల్ రిపోర్ట్ ప్ర‌కారం ఈ రెండు దేశాల మ‌ధ్య అణుయుద్ధం వ‌స్తే జ‌రిగే  ప్రాణ న‌ష్టం 2 బిలియ‌న్ల వ‌ర‌కూ ఉంటుంది. అంటే  200 కోట్ల మేర ప్రాణ న‌ష్టం సంభ‌విస్తుందని అర్ధం. ఇలా భార‌త్ పాక్ మ‌ధ్య గొడ‌వ టూరిజం  నుంచి మొద‌లై టెర్ర‌రిజం వ‌ర‌కూ వ‌చ్చి.. ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ సిందూర్ క్లైమాక్స్ ఏంటో అర్ధంకాని ప‌రిస్థితి వ‌ర‌కూ వ‌చ్చింది. త‌ర్వాత ఏం  జ‌రుగుతుందో ఆ దేవుడికే  ఎరుక‌!!!

పెళ్లయిన మూడు రోజులకే ఆర్మీ జవాన్‌కు పిలుపు.. నా సిందూరాన్ని పంపుతున్నా భార్య ఉద్వేగం

  భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా  వివాహ సెల‌వుల‌కు ఇంటికొచ్చిన జ‌వాన్‌కు పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు వచ్చింది. దీంతో పెళ్ల‌యిన మూడు రోజుల‌కే భార్య‌ను వ‌దిలి విధుల కోసం దేశ స‌రిహ‌ద్దుకు వెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న పెళ్లి జరిగింది. అయితే, మంగళవారం యుద్ధంలాంటి పరిస్థితిలో, వెంటనే విధుల‌కు హాజరు కావాలని అతనికి ఆదేశం వ‌చ్చింది.  ఆ ఆదేశం మేర‌కు మే 8న  బార్డ‌ర్‌కు బయలుదేరాడు. జ‌వాన్ పాటిల్‌కు వీడ్కోలు పలికేందుకు నూతన వధువు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పచోరా రైల్వే స్టేషన్‌కు వ‌చ్చారు. దేశాన్ని రక్షించడానికి తన సిందూరాన్ని పంపుతున్నానని నూతనవ‌ధువు యామిని పాటిల్ కు వీడ్కోలు పలుకుతూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. వాటిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. దర్యాప్తు వేగం పెంచిన సిట్.. ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్

లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తులో భాగంగా నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ దక్కించుకున్న తమిళనాడు రాష్ట్రం దిండుగల్ కు చెందిన ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయలేదని తేలింది. మరి ఏం జరిగింది అంటే.. నెయ్యి ని ఉత్తరాఖండ్   రూర్కీలోని బోలేబాబ డైరీ నుంచి కొనుగోలు చేసి తిరుపతి జిల్లా లోని వైష్ణవి డైరీకి తరలించారు.  అక్కడ ఏఆర్ డైరీ సీల్   వేసి టీటీడీకి సరఫరా చేశారు. ఈ విషయం దర్యాప్తులో తేలడంతో సిట్ అధికారులు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.   అసలు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలుత ప్రకటించారు. ఒక సభలో ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ప్రకటించారు.   హిందువులు ఆరాధ్యదైవం అయిన తిరుమల వేంకటేశ్వరస్వామి. ఈ శ్రీవారి దర్శన భాగ్యం అదృష్టంగా భక్తులు భావిస్తారు. అంతే అదృష్టంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.  అందుకే స్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు అత్యంత ప్రీతిపాత్రం అయ్యింది.  స్వామి వారి దర్శనం లేకపోయినా లడ్డూ ప్రసాదం లభిస్తే స్వామి వారి దయ ఉన్నట్లేనని భావిస్తారు. అలాంటి ప్రసాదం అపవిత్రం చేస్తూ జగన్ హయాంలో లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ అయిందనిృ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సభా ముఖంగా ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగుదశం కూటమి పార్టీలూ, వైసీపీల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే  ఈ కేసులో సిట్ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమౌతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించి.. ప్రత్యేక దర్యాప్తు బృందం సీబీఐ ఆధ్వర్యంలో జరగాల్సిందేనని ఆదేశించిన సుప్రీం కోర్టు కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడా ప్రత్యేక సిట్ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.   సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో 12 మంది పేర్లు ఉన్నాయని చెబుతున్నారు.  ఏ1 గా ఏఆర్ డైరీ, ఏ2 గా ఆ సంస్థ ఎండీ రాజు రాజశేఖరన్, ఏ3గా పొమిల్ జైన్,  ఏ4గా  విపిన్ జైన్, ఏ5 అపూర్వ చవాడాలను చేర్చింది. ఈ ఆరుగురినీ సిట్ పలుమార్లు విచారించింది.  సిట్ అరెస్ చేసి పలు దఫాలు విచారణ చేశారు. ఏ6 బోలేబాబ డైరీ, ఏ7 వైష్ణవి డైరీని చేర్చారు. ఏ8 వైష్ణవి డైరీ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షబిల్ కలీముల్లాఖాన్ తో  పాటు టీటీడీ ప్రొక్యూర్ మెంట్ ఉద్యోగి, బోలేబాబ సీజీఎం, నెయ్యి ముడిపదార్ధాలు సరఫరా చేసే వారిని ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. త్వరలో మరింత మందిని విచారణ చేసే అవకాశం ఉంది.

ఎన్సీపీలో ... ఎన్సీపీ విలీనం?

ఓ వంక దాయాది దేశాలు భారత్ , పాకిస్థాన్ మధ్య యుద్ధం నడుస్తోంది. మరో వంక  మహారాష్ట్రలో విడిపోయిన దాయాది పార్టీలు మళ్ళీ ఏకమయ్యేందుకు రాయబారాలు, దౌత్య చర్చలు జరుగుతున్నాయి. అవును ఏప్రిల్  22 న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది హిందూ పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన నేపధ్యంలో..  ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే లక్ష్యంతో  భారత ప్రభుత్వం, భారత సైన్యం ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్  భారత – పాకిస్థాన్ దేశాల మధ్య మరో యుద్ధానికి తెర తీసింది.  ఆదే సమయంలో మహా రాష్ట్రలో రెండేళ్ళ క్రితం రెండుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మళ్ళీ ఒకటయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి,  2024  నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ గురించిన చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా  అధికార కూటమిలోని బీజేపీ,శివసేన,ఎన్సీపీల మధ్య సయోధ్య కొంత దెబ్బ తిన్న నేపధ్యంలో శివసేన, ఎన్సీపీలలో అంతర్మథనం మొదలైంది. అలాగే ఉప మఖ్యమంత్రి అజిత్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ  శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ(ఎస్పీ) పునః ఏకీకరణ గురించిన చర్చ తరచూ తెరపైకి వస్తూనే వుంది. అయితే.. కారణాలు ఏమైనా,ఇంతవరకు ముడిపడలేదు.    అయితే ఇప్పడు స్వయంగా శరద్ పవార్  రెండు ఎన్సీపీలు ఒకటయ్యే అంశాన్ని మరో మారు తెర పైకి తెచ్చారు. అయితే.. ఆ నిర్ణయం ఏదో తన తదుపరి తరం మరీ ముఖ్యంగా తన రాజకీయ వారసురాలు, బారామతి ఎంపి సుప్రియా సులే తీసుకుంటారని శరద్ పవార్ పరోక్షంగానే  తనకు అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పారని  అంటున్నారు. మరో వంక అజిత్ పవార్  సారథ్యంలోని ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే  శరద పవార్ అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ఆయన నుంచి అటువంటి ప్రతిపాదన వస్తే పార్టీ కోర్  గ్రూప్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటుంటామని, సానుకూల సంకేతాలు ఇచ్చారు.  అయితే.. ఇరు పార్టీలకు ఇష్టమే అయినా, రాజకీయ పరిశీలకులు మాత్రం ఆ రెండు పార్టీల కలయిక కష్టమే అంటున్నారు. ముఖ్యంగా  ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బీజేపీ సారథ్యంలోని మహాయుతి నుంచి బయటకు వచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరు. నిజానికి  తత్కరే కూడా  మేము మహాయుతిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం.  మా నిర్ణయం మారదు. మహాయుతి నుంచి బయటకు వచ్చే ప్రశ్నే లేదు  అని స్పష్టం చేశారు. నిజానికి  ఉభయ పార్టీల విలీనం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతున్నా.. శరద్ పవర్ బీజేపీతో చేతులు కలిపేందుకు అంగీకరించక పోవడం వల్లనే  విలీనం జరగ లేదని, ఇప్పడు కూడా ఉభయ పార్టీల విలీనానికి బీజేపీనే అడ్డుగా నిలిచిందని అంటున్నారు.  అయితే..  అధికార కూటమిలో చేరాలని పార్టీలో ముఖ్యంగా యువ నాయకుల నుంచి వత్తిడి పెరుగతునందునే పవార్  నిర్ణయాధికారాన్ని కుమార్తె  రాజకీయ వారసురాలు సుప్రియ సులే చేతిలో పెట్టారని అంటున్నారు. అందుకే ఆయన  గురువారం(మే 8) మీడియా సమవేశంలో మాట్లడుతూ.. రెండు ఎన్సీపీ వర్గాల మధ్య సిద్ధాంత విభేదాలు ఏమీ లేవు. అయితే  పార్టీలో  ఒక వర్గం నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు,ఇతర ముఖ్య నాయకులు తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు అమలు కావాలంటే  అజిత్ పవార్ పార్టీతో చేతులు కలపాలని అంటున్నారు. మరి కొందరు అందుకు అంగీకరించడం లేదు  అంటూ  పవార్ మనసులో మాటను మనసులోనే దాచుకున్నారు. అలాగే..  నిర్ణయం తీసుకునే అధికారం ప్రస్తుతం తనకు లేదనీ అన్నారు.  అందుకే నిర్ణయాన్ని నెక్స్ట్ జనరేషన్  కు వదిలేశారని శరద్ పవార్ అన్నారు.  అజిత్ పవార్ 2023లో 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని రెండుగా చీల్చారు.  అయితే ఈ మధ్య కాలంలో  బాబాయి – అబ్బాయి (పవార్’లు ఇద్దరు) దగ్గరవుతున్నారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గడచిన రెండు నెలల కాలంలో ఇద్దరు నేతలు మూడు నాలుగుసార్లు కలవడంతో ఉహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి.  అదలా ఉంటే..  శరద్ పార్టీ నాయకులలో చాలా మంది నాయకులు అజిత్  పవార్ తో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నారని, ఎన్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు సూరజ్ చవాన్   అంటున్నారు. పార్టీలు విలీనం అయినా  కాకున్నా  శరద్ పవార్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎన్సీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అలాగే.. మహాయుతిలో కొనసాగాలనే అజిత్ పవర్ నిర్ణయంతో ఏకీభవిస్తే సుప్రియా సులే  ఇతర నాయకులకు స్వాగతం పలికేందుకు ఎన్సీపీకి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో రెండు పార్టీలు ఒకటయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనీ ఉభయ పార్టీల నాయకులూ అంటున్నారు. అయితే..  అదే జరిగితే బీజేపీ  పొడ గిట్టని సీనియర్ నాయకులు కొందరు వేరే దారులు వెతుక్కోవచ్చని అంటున్నారు.

సి.రాజగోపాలాచారి సృష్టి.. టెరిటోరియల్ ఆర్మీ

గ్రౌండ్‌లో బ్యాటింగ్‌లో ఇరగదీసిన సచిన్, ధోని.. బార్డర్‌లో రైఫిల్ పట్టుకుని పాక్‌ను రఫ్పాడిస్తారా..? సూపర్ యాక్షన్‌తో ప్రేక్షకుల చేత సీటిలు కొట్టించుకున్న మోహన్ లాల్‌, నానా పటేకర్.. సరిహద్దుల్లోనూ శత్రుదేశంపై బుల్లెట్ల వర్షం కురిపిస్తూ.. దేశాభిమానాన్ని దక్కించుకుంటారా? బ్యాట్లతో పాకిస్థాన్‌ ను ఉతికారేసిన సచిన్, ధోని.. త్వరలో అదే పాకిస్థాన్‌ను ఏకే 47తో చిత్తు చేయడానికి సిద్దం అంటున్నారు. ఇన్నాళ్లు షూటింగ్‌లతో బిజీగా ఉన్న మోహన్ లాల్, నానా పటేకర్‌లు.. పాక్‌ సైన్యంపై గన్నులతో షూటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది..  త్వరలో బార్డర్‌లో ఈ సెలబ్రిటీలను.. ఆర్మీ డ్రెస్సులో  చూడబోతున్నామంటున్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి కీలక అనుమతినిచ్చింది.  పాకిస్థాన్, భారత్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పటిస్తున్న భారత ఆర్మీ.. శత్రుదేశం కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అయితే ఈ క్రమంలో దాయాదిపై దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు  కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దింపాలని అనుకుంటోంది. రెగ్యూలర్ ఆర్మీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని టెరిటోరియల్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది.  అయితే టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి రిజర్వ్ ఫోర్స్.  ఇది భారత సైన్యానికి సేవలందించే పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన ఒక వ్యవస్థ. ఇందులో సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే స్వచ్చందంగా ఆర్మీతో పని చేస్తుంటారు. టెరిటోరియల్ ఆర్మీలో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, భారత సైన్యంలో ఉన్నవారికి సమానమైన ర్యాంకులను కలిగి ఉన్న ఇతర సిబ్బంది ఉంటారు. ఈ ఆర్మీ ప్రధానంగా సాధారణ సైన్యాన్ని స్థిర విధుల నుండి ఉపశమనం కలిగించడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌర పరిపాలనలో సహాయం చేయడానికి ఉపయోగించబడుతుంది. దేశ ప్రజలు ప్రభావితమైనప్పుడు..దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు అవసరమైన సేవలను నిర్వహిస్తుంది. అలాగే అవసరమైనప్పుడల్లా రెగ్యులర్ ఆర్మీతో కలిసి పని చేస్తుంది.   1948లో టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించారు. మొదటి భారత గవర్నర్ జనరల్ సి.రాజ గోపాలాచారి అక్టోబర్ 9, 1949న టెరిటోరియల్ ఆర్మీని అధికారికంగా ప్రారంభించారు. టెరిటోరియల్ ఆర్మీ యూనిట్లు 1962లో ఇండియా-చైనా యుద్ధం, 1965లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం, 1971లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో చురుకుగా పాల్గొన్నాయి. శ్రీలంకలో ఆపరేషన్ పవన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో ఆపరేషన్ రక్షక్, ఈశాన్య భారతదేశంలో ఆపరేషన్ రైనో, ఆపరేషన్ బజరాంగ్‌లలో సైన్యం పాల్గొంది. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో దాదాపు 50 వేల మంది సిబ్బంది ఉన్నారు.  టెరిటోరియల్ ఆర్మీలో అనేక మంది క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీరిలో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, షూటర్ అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, యాక్టర్లు  మోహన్ లాల్, నానా పటేకర్ వంటి ప్రముఖులు దేశం కోసం పోరాటానికి సిద్దంగా ఉన్నారు. భారత్‌-పాక్ యుద్ధం నేపథ్యంలో ధోని, సచిన్ వంటి క్రికెటర్లు, మోహన్‌లాల్, నానా పటేకర్‌లను యుద్దరంగంలో దిగితే సైనికులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందంటున్నారు.

పాలు పోసిన చేతినే కాటేసిన విషనాగు .. టర్కీ!

పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది, అది సర్ప జాతి లక్షణం. కానీ.. మనిషన్నవాడు, మానవత్వం ఉన్న వాడు ఎవరైనా  చేసిన మేలును మరిచి పోడు. మరిచికూడదు. మరిచి పోతే వాడు మనిషి కాదు. విశ్వాస ఘాతుక విష సర్పం కంటే ప్రమాదకరమైన మానవ  మృగం అనవచ్చును.  ఈ  ధర్మం వ్యక్తులకే కాదు  దేశాలకూ వర్తిస్తుంది. కష్ట కాలంలో ఆదుకున్న దేశాన్నిఅవసర సమయంలో ఆదుకోకపోకా వెన్ను పోటు పొడవడం దుర్మార్గాలలో కెల్లా మహా దుర్మారం. అమానుషం. అవును..  సాయమ చేసిన వారికి తిరిగి సాయం చేయక పోయినా  ఫర్వాలేదు కానీ సాయం చేసిన దేశంపై కత్తులు దూస్తే, దుశ్చర్యకు, దుర్మార్గానికి పాల్పడితే  అలాంటి దేశాలను, అలాంటి పాలకులను విశ్వాస ఘాతుకులు, విష నాగులు, అంతకు మించిన దుర్మార్గ దురంధరులు అనవచ్చును.     ఇప్పడు భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కాని అప్రకటిత యుద్ధం జరుగతున్న సమయంలో టర్కీ, అలాంటి దుర్మార్గానికి పాల్పడింది. విష సర్పమై  పాలు పోసిన భారత దేశాన్నే కాటు వేసింది. రెండేళ్ళ క్రితం  2023లో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా టర్కీ లో భూకంప ప్రభావం చాలా ఎక్కువగా వుంది. ప్రాణ, ఆస్తి నష్టంకూడా టర్కీలోనే ఎక్కువగా జరిగింది.  భూకంప ప్రభావానికి  దేశంలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంచు మించుగా 50 వేల మందికి పైగా   చనిపోయారు.     అలాంటి సమయంలో.. అంతటి విపత్కర పరిస్థితిలో టర్కీకి నేనున్నానంటూ స్నేహ హస్తం అందించిన తొలి దేశం   భారత దేశం. ప్రపంచ దేశాలన్నీ మీన మేషాలు లెక్కిస్తున్న సమయంలోనే భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆపరేషన్‌ దోస్త్‌  పేరిట స్నేహ హస్తాన్ని అందించింది.  భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్‌ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపింది.  అంతటి  కష్ట కాలంలో  భారత దేశం, మోదీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో సాయం అందిస్తే ఇప్పుడు టర్కీ భారత దేశం చేసిన సహాయాన్ని మరిచి భారత్‌పై దాడికి పాకిస్థాన్‌కు  అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తోంది.  పాకిస్థాన్‌ గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో భారత్‌ పై డ్రోన్‌ దాడులు చేసింది. వందల సంఖ్యలో  డ్రోన్లను ప్రయోగించింది. అయితే మన సేనలు పాకిస్థాన్ ప్రయోగించిన ప్రతి డ్రోన్‌ ను గాలిలోనే  పేల్చి వేశాయి.  నేల కుల్చాయి.  పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీ సరఫరా చేసినవే కావడం  ఆ దేశ నిజరూపాన్ని ప్రపంచం ముందుంచింది.అవును. ఆ శకలాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీకి  చెందిన  అసిస్‌ గార్డ్‌ సోనగర్‌  డ్రోన్లుగా ధ్రువీకరించారు.  అయితే..  ఒక విధంగా ఇది అనూహ్య పరిణామంమ కాదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు తొలి నుంచీ భారత దేశం పట్ల  విపరీతమైన ద్వేషం వుంది. అదేమీ రహస్యం కాదు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను ఎర్దొగాన్‌ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు. అంతే కాదు..  ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి అయినా వ్యక్తం చేయలేదు.  పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్థాన్‌పై భారత దేశం దాడి చేస్తుందని టర్కీ ముందుగానే   ఊహించింది. ప్రపంచమంతా భారత్ దేశం పట్ల  సంఘీభావం తెలుపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను ఎర్డోగాన్‌ ప్రభుత్వం పంపింది. టర్కీ సి-130ఈ హెర్క్యూలస్‌ విమానం గత నెల 28న పాకిస్థాన్‌లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకొనేందుకు తమ యుద్ధ విమానం అక్కడ దిగిందని ప్రకటించి  ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేసింది.  తర్వాత ఓ యుద్ధనౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్‌పై పాకిస్థాన్‌ ప్రయోగిస్తోంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీ , అజర్‌ బైజాన్‌ మాత్రమే పాక్‌కు మద్దతిస్తున్నాయి. కాశ్మీర్‌ అంశంలో గతంలో ఎర్డోగాన్‌ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా  భారత దేశం పై విమర్శలు చేశారు. ఇప్పడు పాముకు పలు పోసినా విషమే చిమ్ముతుందని, టర్కీ మరో మారు రుజువు చేసింది.

జడ్ ప్లస్ భద్రత కోసం హైకోర్టుకు జగన్.. పిటిషన్ విచారణ వాయిదా

కిందపడ్డా నాదే పై చేయి అంటూ బుకాయించడంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ దిట్ట.  సానుభూతి కోసం తనపై తానే దాడులు చేయించుకున్న చరిత్ర ఆయనది. గులకరాయి దాడి ఆ కోవలోకే వస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు సైతం అప్పట్లో అంతర్గత సంభాషణల్లో అంగీకరించారు. అన్నిటికీ మించి అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జగన్ వ్యవహార శైలి ఉంటుందన్నది ఇప్పటికే పలుమార్లు రుజువైంది.   ఇక 2019 ఎణ్నికలలో విజయం కోసం బాబాయ్ హత్య, కోడికత్తి వంటి జగన్ డ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఇలా రకరకాల విన్యాసాలతో పాటు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన జగన్ ఐదేళ్లు ఏపీ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. జగన్ హ‌యాంలో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు ప‌నుల‌కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి ఏర్పడింది.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటూ వేధింపులు, ప్రతీకారమే పాలన అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను వేధించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ కూడా హ్యాపీగా లేదు. జగన్ అరాచక పాలనకు విసిగిపోయిన ఏపీ జనం,   2024 ఎన్నిక‌ల్లో ఏ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు.  కేవ‌లం 11 సీట్ల‌లో మాత్ర‌మే వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. అంటే.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఏపీ ప్ర‌జ‌లు ఇవ్వ‌లేదు. అయినా జగన్ ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు.   ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వ‌స్తాన‌ని భీష్మించుకు కూర్చున్నారు. తీరా అసెంబ్లీ సభ్యత్వం పోతుందన్న భయంతో మొక్కుబడిగా ఒక సారి అసెంబ్లీకి హాజరై మమ అనిపించారు. ఇప్పుడు తాను సీఎంగా ఉండగా ఏ విధంగా అయితే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా తనకు అటువంటి భద్రతే కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించాలంటూ ఆయన గురువారం (మే 8)న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, అందుకే సీఎంగా గతంలో తనకు ఏ విధంగా జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. అలాగే ఇప్పుడు కూడా దానిని కల్పించాలనీ, అలా జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ జగన్ ఆ పిటిషన్ లో కోరారు. జగన్ పిటిషన్ శుక్రవారం ( మే 9) విచారణకు వచ్చింది.  కోర్టు ఆ పిటిషన్ పై తక్షణ నిర్ణయం వెలువరిస్తుందని జగన్ ఆశించారు. అయితే కోర్టు మాత్రం పిటిషన్ విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది.  దీంతో జగన్ కు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. 

పెద్దన్నకు ఝలక్.. ట్రంప్ మధ్యవర్తిత్తం అక్కర్లేదని తేల్చి చెప్పిన ఇండియా!

నేను చేసేదేముంది? అది మీ గొడవ మీరే తేల్చుకోండి అంటూ చెబుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు.. పాక్  భారత్ లక్ష్యంగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం అణిచివేతకు కఠిన నిర్ణయం తీసుకుంటున్న వేళ.. తగుదునమ్మా అంటూ మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పెద్ద మనిషిని నేనున్నాను కదా? మధ్యవర్తిత్వం చేస్తాను.. నా మాట వినండి అంటూ భారత్ కు ప్రతిపాదన పంపారు. అయితే అందుకు భారత్ నిర్ద్వంద్వంగా నో చెప్పింది. అగ్రదేశాధినేతను అన్న దర్పాన్ని ప్రదర్శించిన ఆయనకు భారత్ తన సమాధానంతో దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. మోడీ నాకు మంచి మిత్రుడు అంటూ పదేపదే చెప్పే ట్రంప్ కు అదే మోడీ స్నేహం స్నేహమే.. కానీ అంతర్గత విషయాల్లో జోక్యాన్ని భారత్ ఇసుమంతైనా అంగీకరించదని కుండబద్దలు కొట్టేశారు. అసలింతకీ ఏం జరిగిందంటే.. ఇండియా, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఇక తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. దాదాపు 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేసింది. ఈ క్రమంలో వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అలా హతమైన ఉగ్రవాదులలో పాక్ తన ఇంటల్లుడికి చేసినట్లు రాచమర్యాదలు చేస్తూ అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తున్న ఉగ్రవాది మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్, బంధువులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో నిషేధత ఉగ్ర సంస్థ జై షే అహ్మద్ దాదాపు నామరూపాల్లేకుండా పోయింది.  దీంతో పాకిస్థాన్ భారత్ లక్ష్యంగా దాడులకు దిగింది. ప్రతిగా ఇండియా ఎదురుదాడులు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యా యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకా చెప్పాలంటే అప్రకటిత యుద్ధం  జరుగుతోంది.   సరిగ్గా ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దరికం అంటూ రంగ ప్రవేశం చేశారు.  ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకు వచ్చారు.    ఉగ్రవాదంపై పోరుకు నాయకత్వం వహిస్తానంటూ చెప్పుకునే అగ్రరాజ్యం.. ఇంత కాలం భారత్ లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులపై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడని ట్రంప్.. ఇప్పుడు పాక్ అన్ని విధాలుగా నష్టపోయి.. చేతులెత్తేస్తున్న వేళ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత్ ఉగ్రవాదంపై తుది పోరు సాగిస్తున్న సమయంలో దాడులు ఆపండి.. మధ్యవర్తిత్వం చేస్తానంటూ ముందుకు వచ్చారు. ఇందుకు భారత్ నిర్ద్వంద్వంగా నో చెప్పేసింది. మీ పెద్దరికం మీ వద్దే ఉంచుకోండంటూ సున్నితంగా కాదు.. ఒకింత నిష్కర్షగానే చెప్పింది. పాకిస్థాన్ తో తమ సమస్యలు పూర్తిగా ద్వైపాక్షికమని తేల్చేసింది. ఏది ఉన్నా పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని స్ఫష్టం చేసి ట్రంప్ నోరు మూయించింది. ఉగ్రవాదం మరియు సరిహద్దు సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలంటే ఫస్ట్ పాకిస్థాన్  ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపా లని అల్టిమేటమ్ ఇచ్చేసింది.  

తన కోసం మొక్కుకున్న వృద్ధురాలి కోసం పవన్ ఏం చేశారో తెలుసా?

పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత.. సినీ హీరో.. ఆయనది రాజకీయాలలోనైనా, సినిమాలలోనైనా ఒక ప్రత్యేక స్టైల్. సినిమాలలో పవర్ ఫుల్ డైలాగులు చెప్పినా, డ్యాన్సులకు స్టెప్పులేసినా, రాజకీయాలలో ఉన్నదున్నట్లు మాట్లాడినా, ఆ మాటలు కొన్ని సార్లు సొంత పార్టీ, సొంత కూటమి నేతలకే ఇబ్బంది కలిగించినా డోన్ట్ కేర్.. తనకు ఏదనిపిస్తే అది చేస్తారు. ఎ చెప్పాలనుకుంటే అది చెప్పేస్తారు అంతే. ఈ ప్రత్యేకతే ఆయనను రాజకీయాలలోనైనా, సినిమాలలో అయినా మిగిలిన వారి కంటే ఒకింత స్పెషల్ గా నిలుపుతోంది. తాజాగా ఆయన   పిఠాపురం  నియోజకవర్గానికి చెందిన ఒక వృద్ధు రాలిని మంగళగిరిలోని తన నివాసానికి విందుకు ఆహ్వానించారు.   96 ఏళ్ల ఆ వృద్ధురాలి పేరు  పోతుల పేరంటాలు. ఇంతకూ ఆమెను పవన్ కల్యాణ్ ఎందుకు ఆహ్వానించి అతిథిమర్యాదలతో విందు ఇచ్చారంటే..   గత ఏడాది జరిగిన ఎన్నికలలో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.  విషయం అది కాదు..పిఠాపురం నుంచి పవన్ గెలవాలని ఈ పోతుల పేరంటాలు మొక్కుకున్నారు. ఈమెది పిఠాపురం నియోజకవర్గం యుకొత్తపల్లి మండలానికి చెందిన ఇసుకపల్లి. ఇంతకీ పోతుల పేరంటాలు మొక్కు ఏమిటంటే.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే.. తన కులదైవం వేగులమ్మకి గరగ చేయిస్తాననీ, పొర్లు దండాలు పెడతానన్నది ఆమె మొక్కు. సరే పవన్ కల్యాణ్ విజయం సాధించారు. అలా ఇలా కాదు.. అద్భుత మెజారిటీతో. దాంతో పేరంటాలు తన మొక్కు తీర్చుకున్నారు. పేదరాలు కావడంతో వేగులమ్మ తల్లికి గరగ చేయించడం ఆమెకు అంత సులువు కాదు. అందు కోసం ఆమె చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. తనకు వచ్చే పెన్షన్ సొమ్ములలో పొదుపు చేసి మొత్తం మీద 27 వేల రూపాయలు కూడగట్టి గరగ చేయించి అమ్మవారికి సమర్పించి, పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకుంది. ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమెను అభినందించో, ఆర్థిక సహాయం చేసే ఊరుకుంటే సరిపోదని భావించారు. ఆమెను తన నివాసానికి ఆహ్వానించి, పక్కన కూర్చుని కొసరి కొసరిభోజనం వడ్డించారు. ఆమెకు చీర పెట్టి, లక్ష రూపాయలు నగదు ఇచ్చారు. అంతేనా ఆమెకు బయటవరకూ వెళ్లి మరీ వీడ్కోలు పలికారు.   ఇది తెలిసిన వారంతా దటీజ్ పవన్ అంటూ అభినందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పేరంటాలుకు స్వయంగా భోజనం వడ్డించి ఆప్యాయంగా అతిథి మర్యాదలు చేస్తున్నఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  

భార‌త్ కి ప‌ట్టిన ఉగ్ర పీడ తొలిగిన‌ట్టేనా?

పాకిస్థాన్ ఆర్మీ అంతా క‌ల‌సి జైష్- ఏ- మొహ‌మ్మ‌ద్ ఆప‌రేష‌న్స్ క‌మాండ‌ర్.. ర‌వూఫ్ అజ‌ర్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొని, పాకిస్థాన్ జెండా  అత‌డి శ‌వ‌పేటిక‌కు క‌ప్పి నానా బీభ‌త్సం చేసింది.  దీన్నిబ‌ట్టీ చూస్తే పాకిస్థాన్ ఆర్మీకి, ఐఎస్ఐకి,  ఉగ్ర‌వాదానికి మధ్య ఎంత గట్టి బంధం ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత్ లో ఉగ్రభూతాన్ని పెంచి పోషించడంలో ఈ మూడూ ఉగ్రవాదం, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఫెవికాల్ బంధంతో పని చేస్తున్నాయి.  ఇంతకీ పాక్ ఆర్మీ ఆ దేశ జెండా కప్పి మరీ అంత్యక్రియలలో పాల్గొన్న ర‌వూఫ్ ఎవ‌రో కాదు.. 1999 హైజాక్ ద్వారా భార‌త్ నుంచి విడుద‌లైన మ‌సూద్ అజ‌ర్ సోద‌రుడు. మ‌సూద్ అజ‌ర్ ను భార‌త్ నుంచి విడిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది ర‌వూఫే. అలాంటి ర‌వూఫ్ అండ చూసుకున్న మ‌సూద్ అజ‌ర్ త‌ర్వాతి  కాలంలో జైష్- ఏ- మొహ‌మ్మ‌ద్ అనే ఉగ్ర‌వాద సంస్థ‌ను స్థాపించాడు. 2000 సంవ‌త్స‌రంలో క‌శ్మీర్ అసెంబ్లీ అటాక్, 2001లో భార‌త‌  పార్ల‌మెంటు పై దాడి, 2008లో ముంబై దాడులు, 2016లో మ‌రో దాడి.. ఇక‌ 2019 పుల్వామా దాడి సంగ‌తి స‌రే స‌రి. ఈ దాడిలో ఏకంగా 46 మంది భార‌త  జ‌వాన్లు చ‌నిపోయారు. నాటి  నుంచి నేటి వ‌ర‌కూ వ‌ర‌కూ మ‌సూద్.. భార‌త్ పై చేసిన ఉగ్ర‌దాడుల‌దొక ర‌క్తసిక్త అధ్యాయం. ఒక ర‌కంగా  చెబితే ధ్వంస రచన.  విధ్వంస ర‌చ‌న.  అలాంటి మ‌సూద్ అజ‌ర్ కు ఆప‌రేష‌న‌ల్ క‌మాండ‌ర్ గా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన ర‌వూఫ్ ఆపరేషన్ సందూర్ అంటూ ఇండియన్ ఆర్మీ ఉగ్రస్థావరాలు టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ లో మరణించాడు. రవూఫ్ తో పాటు  మ‌సూద్ బంధువులు కూడా  చ‌నిపోయారు. వీరితో పాటు మ‌రో న‌లుగురు అజ‌ర్ స‌న్నిహితులు సైతం  బహా వ‌ల్పూర్ దాడుల్లో హ‌త‌మ‌య్యారు. దీన్నిబ‌ట్టీ చూస్తే మ‌సూద్ అజ‌ర్ ప‌ని ఖ‌త‌మై న‌ట్టే లెక్క‌. అందుకే అత‌డు ఈ దాడుల్లో తాను కూడా పోయి ఉంటే బావుండేద‌ని అంటున్నాడు. మోడీ త‌న కుటుంబంలోని చిన్నారులు, మ‌హిళ‌లు, వృద్ధుల‌ను కూడా వ‌ద‌ల‌కుండా హ‌త‌మార్చాడాని వాపోతున్నాడు. త‌న‌కు ఈ మ‌ర‌ణాల ప‌ట్ల ప‌శ్చాతాపం  కానీ, నిరాశ‌గానీ లేవ‌ని అంటున్నాడు. కానీ అత‌డిలో ఈ దాడులు, వాటి ద్వారా ఏర్ప‌డ్డ మ‌ర‌ణాలతో రావ‌ల్సిన బ‌ల‌హీన‌త‌ల‌న్నీ వ‌చ్చేసిన‌ట్టే. మ‌రీ ముఖ్యంగా త‌న కుడి భుజంగా  ప‌ని చేసిన సోద‌రుడు ర‌వూఫ్ మ‌ర‌ణంతో జైష్- ఏ- మొహ‌మ్మ‌ద్ క‌థ ముగిసిన‌ట్టే. మ‌సూద్ 18 ఎక‌రాల విస్తీర్ణంలో గ‌ల సుభాన్ అల్లా మ‌సీదులో కూర్చుని, తీవ్రంగా ఆలోచించి.. లేని  పోని మ‌త విద్వేషాల‌తో కూడిన ప్ర‌సంగాలు చేసి,  కొత్త వారిని వాటి  ద్వారా ఆక‌ట్టుకుని, త‌ద్వారా నిధులు సేక‌రించి.. ఉగ్ర వాదాన్ని వెర్రి త‌ల‌లు వేయించేవాడు. ఇప్పుడు వీట‌న్నిటికీ చెక్ ప‌డ్డ‌ట్టే లేక్క‌. మ‌సూద్ మ‌సీదులో కూర్చుని చేసే ఉగ్రాలోచ‌న అమ‌లు చేసేది ర‌వూఫ్. అలాంటి ర‌వూఫ్ లేక పోతే మ‌సూద్ రెక్క‌లు తెగిన ప‌క్షితో స‌మానం. పంజా కోల్పోయిన పులితో ఈక్వ‌ల్. ఇక త‌న‌కు తాను స్వ‌తంత్రంగా ఏమీ చేయ‌లేడు. ఒక వేళ చేసినా అదంతా త‌లా తోకా లేకుండా పోతుంది. ఒక ద‌శ దిశా క‌నుమ‌రుగు అవుతుంది.  మ‌సూద్ తాను మాత్రం ఇక ఎందుకు చేయాలి? త‌మ్ముడితో పాటు అక్క ఆమె కుటుంబంతా చేజారి  పోయింది? చివ‌రికి మిగిలేది ఏమిటో పూర్తిగా బోధ ప‌డ్డాక, త‌న ఉగ్ర బోధ‌న‌లు, ఆలోచ‌న‌లు మానుకోక ఏం చేస్తాడ‌న్న‌ది ఇప్పుడు అంద‌రి అభిప్రాయం. ఈ దాడుల్లో అస‌లు తానుంటాడో ఉండ‌డో కూడా తెలీదు. అలాంటి నైరాశ్యం మ‌న‌సు నిండా పేరుకుని క‌నిపిస్తున్నాడు జైష్- ఏ- మొహ‌మ్మ‌ద్ ఉగ్ర అగ్ర‌నేత మ‌సూద్ అజ‌ర్. ఒక స‌మ‌యంలో భార‌త్ అంటే ఊగిపోయి ఉగ్ర ప‌థ‌క ర‌చ‌న‌లు చేసి ఈ ర‌క్తపిపాసి.. ప్ర‌స్తుతం ఒంట‌రి. స‌ర్వం కోల్పోయిన వైరాగి.    ల‌ష్క‌ర్- ఏ- తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్ ప‌రిస్థితేంట‌ని చూస్తే..  ప్ర‌స్తుతం 75 ఏళ్ల వ‌య‌సుగ‌ల హ‌ఫీజ్ లాహోర్ లోని జ‌న‌స‌మ‌ర్ధ ప్రాంతంలో నివ‌సిస్తున్నాడు. ఇటు పాక్ ఆర్మీ అటు సొంత సైన్యం మ‌ధ్య క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ద‌ళాలు కాప‌లా కాస్తుండ‌గా అత‌డి కుటుంబం ఒకింత సేఫ్ గానే ఉంది.  అయితే ముజ‌ఫ‌రాబాద్ దాడుల్లో ఇత‌డి ల‌ష్క‌రే అలియాస్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ శిబిరం దాదాపు కుప్ప‌కూలింది. ఈ శిబిరాన్ని ద‌గ్గ‌రుండి న‌డిపిస్తోంది మ‌రెవ‌రో కాదు హ‌ఫీజ్ స‌యీద్ కొడుకు.. త‌ల్హా స‌యీద్. ఇత‌డు ప్ర‌స్తుతం ల‌ష్క‌రే ఆర్ధిక విభాగ‌పు క‌మాండ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఇత‌డు ఒక ఐదు మంది క‌మాండ‌ర్ల తో క‌ల‌సి ఇక్క‌డి నుంచే టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ల‌ను నిర్వ‌హిస్తుంటాడు. ఇత‌డి క‌మాండ‌ర్ల‌లో ఒక‌డైన రెహ‌మానే ప‌హెల్గాం దాడి సూత్ర‌ధారి.  ఈ విష‌యం గ్ర‌హించిన భార‌త బ‌ల‌గాలు.. ఇత‌డి స్థావ‌రంపై దాడి చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడుల్లో త‌ల్హా అత‌డి ఉగ్ర క‌మాండ‌ర్లు సైతం హ‌త‌మైన‌ట్టు ఒక పేరు చెప్ప‌ని అధికారి వెల్లడించారు. ఒక వేళ అదే నిజమైతే.. ల‌ష్క‌ర్- ఏ- తోయిబా ఖేల్ కూడా ఖ‌త‌మైన‌ట్టే. కార‌ణం హ‌ఫీజ్ ఉగ్ర నిధుల కేసుల త‌ర్వాత పూర్తి అండ‌ర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అప్ప‌టి నుంచి భార‌త్ కి వ్య‌తిరేకంగా మోడిని ఇర‌వైనాలుగ్గంట‌లూ తిడుతూ..   త‌న విశ్వ‌రూపం చూపిస్తున్నాడు.  అంతే  కాదు.. యువ‌కుల‌ను ఉగ్రవాదం వైపు ఆక‌ర్షిస్తున్నాడు  ల‌ష్క‌రే జూనియ‌ర్ చీఫ్ త‌ల్హా. అంతేనా టెర్ర‌ర్ స‌పోర్ట‌ర్ల ద్వారా నిధుల స‌మీక‌ర‌ణ చేసి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాడు. త‌న ల‌ష్క‌రే ఉగ్ర‌వాదుల‌కు అధునాత‌న ఆయుధాల‌తో కూడిన శిక్ష‌ణనిస్తున్నాడు. దీంతో ఇత‌డు తండ్రి త‌ర్వాత అంత‌టి  కిరాత‌కుడిగా మారి.. ప్ర‌పంచాన్ని మ‌రీ ముఖ్యంగా భార‌త్ ని అట్టుడికిస్తున్నాడు.. అలాంటి త‌ల్హా లాంటి  త‌ల‌ను ల‌ష్క‌రే కోల్పోతే.. ఈ ఉగ్ర సంస్థ కూడా దాదాపు క‌నుమ‌రుగై  పోతుంది. దానికంటూ ఒక డైరెక్ష‌న్ లేకుండా  పోతుంది. ఇక ఈ సంస్థ కార్య‌క‌లాపాలు సైతం పూర్తిగా స్తంభించి పోతాయి. ప్ర‌స్తుతం భార‌త్ విశ్వ‌రూపానికి జ‌డిసిన హ‌ఫీజ్ స‌యీద్.. పంజాబ్ ప్రావిన్స్ లో త‌ల‌దాచుకున్న‌ట్టు ఇటీవ‌ల త‌ల్హా మాట‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఏమో ఈ దాడుల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. కొడుకు  త‌ల్హాతో పాటు తండ్రి హ‌ఫీజ్ స‌యీద్ కూడా హ‌తం కావ‌చ్చు. ఇప్ప‌టికి అందుతున్న స‌మాచారాన్ని బ‌ట్టీచూస్తే.. ఇటు జేషే కి కీల‌క‌మైన ర‌వూఫ్ హ‌త‌మ‌య్యాడు. అధికారికంగా ఇంకా తెలీడం లేదు కానీ ల‌ష్క‌రేకి త‌ల‌లా వ్య‌వ‌హ‌రిస్తోన్న త‌ల్హా కూడా ఖ‌త‌మైతే.. ఈ సంస్థ కూడా దాదాపు నిర్వీర్య‌మై పోయినట్లే. వీటికి తోడు మ‌సూద్ హ‌ఫీజ్ సైతం హ‌త‌మారిపోతే.. భార‌త్ కి ప‌ట్టిన ఉగ్ర పీడ  వదిలిపోతుందని   అంటున్నారు పాక్ వ్య‌వ‌హారాల నిపుణులు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు .. సీఐడీ విచారణకు సజ్జల

మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం (మే9) సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా సజ్జలకు సీఐడీ నోటీసలు జారీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హజరయ్యారు. సజ్జలతో పాటు దేవినేని అవినాష్ కూడా విచారణకు హాజరయ్యారు. మరోవైపు సజ్జల విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. వైసీపీ మూకల దాడిపై టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అయితే వారి ఫిర్యాదును అప్పటి ప్రభుత్వంలోని పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. తిరిగి తెలుగు తమ్ముళ్లపైనే కేసులు పెట్టారు. ఇక వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి అటాక్‌‌పై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించింది. ఈ దాడికి సంబంధించి విచారణను వేగవంతం చేసిన సీఐడీ పలు కీలక ఆధారాలను సేకరించింది. అనేక మందిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురిని విచారించారు కూడా. విచారణలో భాగంగా ఈ దాడి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో సజ్జలను ఏ1గా చేర్చారు. అలాగే సజ్జల, అవినాష్‌‌లకు విచారణకు రావాల్సింది సీఐడీ నోటీసులు జారీ చేసింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లో శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఏ క్షణమైన బాంబుతో పేల్చేస్తామని, ప్రభుత్వానికి చెప్పాలని పాక్ స్లీపర్ సెల్స్ అంటూ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే తనిఖీలు చేపట్టారు.దీంతో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమై, హుటాహుటిన రంగంలోకి దిగారు.  డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ బృందాలను రప్పించి విమానాశ్రయ ప్రాంగణమంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల రాకపోకలు, లగేజీ స్కానింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాలు సహా కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు.