కృపారాణి ఏరీ? ఎక్కడ?
posted on May 6, 2025 @ 11:31AM
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు కిల్లి కృపారాణి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఈ సిక్కోలు నేత, ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా, వినిపించకుండా దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నట్లుగా ఎందుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటేనే ఓట్లు వెయ్యని ప్రజలు... ఎన్నికల వరకూ మ్యూట్ గా ఉంటా అని అంటున్న కృపారాణి వ్యూహానికి విలువ ఇస్తారా.. ?
కిల్లి కృపారాణి.. ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా కు చెందిన సీనియర్ పొలిటీషియన్. ఎపిలో కాంగ్రెస్ పార్టీ సుషుప్తావస్థ లోకి వెళ్ళడంతో 2014 సాధారణ ఎన్నికల సమయంలో వైకాపా తీర్ధం పుచ్చుకున్న ఈ కేంద్ర మాజీ మంత్రి, ఆ తరువాత ఆ పార్టీని వీడి బటయకు వచ్చారు. ఆమె వైసీపీలో చేరిక, నిష్క్రమణ రెండూ కూడా అనూహ్య పరిణామాలేనని అంటున్నారు పరిశీలకులు. 2009 లో అప్పటి కాంగ్రెస్ లో జగన్మోహన రెడ్డి, కిల్లి కృపారాణిలు ఇద్దరూ ఎంపిలుగా గెలిచి ఒకే దఫా పార్లమెంట్ కు వెళ్ళినవారు. దీంతో కిల్లి కృపారాణి వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. అయితే తానొకటి తలిస్తే మరోటి జరిగిందన్నట్లు తయారైంది ఆమె పరిస్థితి. వైసిపి లో తనకు రెడ్ కార్పెట్ ఉంటుంది భావించిన కృపారాణికి అన్ని విషయాలలోనూ జగన్ తనను దూరం పెడుతూ రావడం జీర్ణించుకోలేకపోయారు.
చివరికి తాను ఆశించిన శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం కూడా 2024లో వేరొకరికి ఇవ్వడంతో షాక్ తిన్నారు. వైసిపి లో తనకు ఒరిగింది ఏమి లేదు అని మీడియా ముందు చెబుతూ 2024 ఎన్నికలకు రెండు నెలల ముందు వైసిపిని వీడి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు కృపారాణి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టెక్కలి అసెంబ్లీ బరిలో దిగి.. కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించి పరువు పోగొట్టు కున్నారు. ఇక్కడ కృపారాణి చేస్తున్న పొరపాటు ఏదైనా ఉంది అంటే అది అవసరం ఉన్నప్పుడు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుని, అవసరం లేనప్పుడు తొందరగా నిర్ణయాలు తీసుకోవడం. మృదు స్వభావిగా పేరు సంపాదించిన కృపారాణికి అన్ని రాజకీయపార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అన్ని పొలిటికల్ పార్టీలలో సైతం కృపారాణికి ఆమె స్థాయికి తగ్గ పదవులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉన్నా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తో ఎన్నికల్లో గెలవడం కష్టం అని తన నోటితో తానే చెప్పి ఆ పార్టీని వీడిన కృపారాణి.. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ లో చేరారన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.
శ్రీకాకుళం జిల్లాలో వివిధ పార్టీలలో ప్రస్తుతం ఖాళీగా ఉండి, నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న స్థానాలు చూస్తే.. వైసిపి లో ఇంకొన్నాళ్ళు ఉండి ఉంటే.. ఈ దఫా ఆమెకు తప్పనిసరిగా స్థానం రిజర్వ్ అయ్యేది అన్నది పరిశీలకులు విశ్లేషణ. టెక్కలి వైసిపి స్థానం కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా మారడం.. దువ్వాడ, పేరాడ మధ్య వివాదం నేపధ్యంలో కృపారాణి ఉండి ఉంటే ఆమెకే ఆ స్థానం లభించేది అని చాలామంది లెక్కలు కడుతున్నారు. ఇంకోవైపు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో సైతం వైసీపీకి ఇప్పుడు సరైన నేత లేరు. ఆమె అన్నట్టు వైసీపీలో అవమానాలు భరించలేననుకుంటే.. జనసేన సైతం శ్రీకాకుళం జిల్లాలో సరైన నేత కోసం ఎదురు చూస్తోందనే చెప్పాలి. అక్కడా ఆమె చేరికకు అభ్యంతరాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. ఎందుకంటే . కృపారాణికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఈ రోజుకీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇద్దరూ ఒక దఫా కాంగ్రెస్ లో కేంద్ర మంత్రులుగా చేసినవారు కావడంతో ఆ ర్యాపో ఇంకా కంటిన్యు అవుతోంది. సరిగ్గా నేగోషియేట్ చేస్తే.. శ్రీకాకుళం జనసేన లో కృపారాణికి మంచి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. బిజెపి, తెలుగుదేశం కూడా కృపారాణికి ఆప్షనల్ పార్టీలు. తన రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరినా కృపారాణికి పదవులు లభించే అవకాశం లేకపోలేదు.
హడావిడి నిర్ణయాల మధ్య 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ లో చేరి, టెక్కలి అసెంబ్లీకి పోటీ చేసి చేతులు కాల్చుకున్న కృపారాణి ప్రస్తుతం పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఊర్లో శుభకార్యాలకు హాజరవ్వడం తప్ప, రాజకీయంగా క్రీయాశీలంగా లేరు. ఇన్ని అవకాశాలు ఉన్నా, జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నా, కృపారాణి 2029 ఎన్నికల వరకూ సైలెంట్ గా ఉంటా.. అప్పుడు తన పొలిటికల్ స్ట్రాటజీ చెబుతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వ్యూహం రాజకీయాలలో వర్కౌట్ అవుతుందా? తాబేలు, కుందేలు పరుగుపందెం నీతి కథలో మాదిరి.. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ వ్యూహం ఫలిస్తుందా? అంటే.. లెట్స్ వెయిట్ అండ్ సీ!