ఏపీ లిక్కర్ స్కాం..రంగంలోకి ఈడీ?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ దర్యాప్తునకు రంగం సిద్ధమైందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. ఈ కుంభకోణం నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు వివరాలు కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏపీ పోలీసులకు లేఖ రాసింది. ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ సహా కేసు వివరాలన్నీ సమర్పించాల్సిందిగా ఈ లేఖలో ఈడీ ఏపీ పోలీసులను కోరింది. ఈ మేరకు ఈడీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కు, విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖలు రాసింది.   ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన ఈ ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తునకు ఈడీ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఎఫ్ఐఆర్ తో పాటుగా ఈ కేసులో ఇంత వరకూ జరిగిన దర్యాప్తు వివరాలు, సీజ్ చేసిన అక్కంట్ల వివరాలు, అలాగే ఈ  నగదు లావాదేవీల వివరాలు,  ఇంత వరకూ జరిగిన అరెస్టులు తదితర సమాచారాన్ని అందించాలని ఈడీ సిట్ చీఫ్, బెజవాడ పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖలో కోరింది.  ఈ కేసు దర్యాప్తు ఈడీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వా చాలా కాలంగా కోరుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలు సందర్భాలలో ఈ కేసును ఈడీకి రిఫర్ చేస్తామని ెప్పారు. అవినీతి వ్యవహారంలో సిట్ చర్యలు తీసుకుంటుంది, కానీ మనీల్యాండరింగ్, అక్రమ నగదు లావాదేవీలు తదితర అంశాలు కూడా ఈ కేసులో బయటపడటంతో ఈడీ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

అమరావతి చట్టబద్దతపై ఏపీ మంత్రివర్గ తీర్మానం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత  కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపారు.  భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సిందూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్ చేశారంటూ మంత్రి‌వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల కాల పరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజిట్‌పై కేంద్రాలని కోరాలని కేబినెట్ నిర్ణయించారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం పెంపు,  రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్‌ నిర్వహించే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. మున్సిపల్‌ శాఖ 281 పనులను హైబ్రిడ్‌ యాన్యూటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునే ప్రతిపాదనకు అంగీకరించింది.  47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది.

ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కోసం సిట్ వేట

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల కోసం సిట్ వేట ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక నిందితులు రాజ్ కేసిరెడ్డి, అతడి సహాయకుడు దిలీప్ లు ఇప్పటికే అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉండగా, జగన్ హయంలో కీలకంగా వ్యవహరించిన మరో ముగ్గురి కోసం సిట్ ఇప్పుడు గాలింపు చర్యలు ప్రారంభించింది. ఈ ముగ్గురూ ఎవరంటే... మాజీ సీఎం జగన్ మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్పలు. వీరు ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో వారు యాంటిసిపేటరీ బెయిలు కోసం సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా వారికి అరెస్టు నుంచి ఎలాంటి రక్షణా కల్పించడానికి నిరాకరించడంతో ఇక వారి అరెస్టు లాంఛనమే అన్నట్లు మారింది. ఈ దశలో ఈ ముగ్గురి కోసం సిట్ వేట ప్రారంభించింది. విజయవాడ వెటర్నరీ కాలనీ లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని మాజీ సీఎం జగన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు చేపట్టింది. ఇప్పటికే మద్యం కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, పీఏ కృష్ణమోహన్ రెడ్డి , భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప లను సెట్ అధికారులు నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.  అయితే ముగ్గురు నిందితులు తమతమ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ కూడా దొరకకుండా తప్పించుకు పోయినట్టు సిట్ బృందాలు గుర్తించాయి. దీంతో ముగ్గురి నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్‌లో సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో అక్కడ తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో  సుప్రీం కోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు,  హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు. సుప్రీం ధర్మాసనం కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతు?!

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కి పెద్ద చరిత్రే ఉందని చెప్పక తప్పదు. వైసీపీ ఏర్పాటు నుంచి జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో  చక్రం తిప్పే పరిస్థితి ఉండేది.  కాని ఇప్పుడు  ఆ పరిస్థితి ఇసుమంతైనా ఎక్కడా కానరావడం లేదు.   కేవలం ఒక్కరు, ఇద్దరు మినహా  అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి, చక్రం తిప్పిన నేతలెవరూ ఇప్పుడు ప్రజలకు మొహం చూపించే పరిస్థితి లేదు.  ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో తిరుపతి, కుప్పం మినహా అన్నింటిలో వైసీపీ బలం స్పష్టంగా కనిపించేది.  2019 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ వైసీపీ జయకేతనం ఎగురవేసింది.  వైసీపీ అధినేత జగన్   ప్రభావం ఆ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపిందించి. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనతో ఆ పార్టీని జిల్లా జనం పూర్తిగా తిరస్కరించారు. అందుకే 2024 ఎన్నికలలో వైసీపీ  పరిస్థితి తలకిందులై పోయింది.  ఎ  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వరకానాథ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం విజయబావుటా ఎగుర వేసింది.   చంద్రగిరి, పూతల పట్టు నియోజకవర్గాలలో  చాల సంవత్సరాల తరవైక టీడీపీ జెండా ఎగురేసింది.  ఇక కూటమి ప్రభుత్వం  ఏర్పడిన తరువాత  జిల్లాలో వైసీనీ నేతల అడ్రస్ ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది.  అధికారం ఉందని ఇష్టారాజ్యంగా  ఇసుక  దందా నుంచి భూముల కబ్జాల వరకూ చెలరేగిపోయిన నేతలు ఇప్పుడు వారి నియోజకవర్గాలవైపు కూడా చడటం లేదు.  అది పక్కన పెడితే ఇంకా ఉన్నాం అని చెప్పుకుంటున్న ఇద్దరు ముగ్గురు నేతలు సైతం ఇంటి గడపదాటి ప్రజలలోకి వచ్చే పరిస్థితి లేదు. వీరిలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఒకరు. ఆయనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు జగన్.  దీంతో ఆ హోదాలో భూమన  తన ఇంటి నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప..  ఎక్కడా ప్రజలతో కలిసి లేదా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవని సొంత పార్టీ  శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. ఇక ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గ నాయకులతో అడపా దడపా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఇదివరకటిలా యాక్టివ్ గా లేరు.  పెద్దిరెడ్డి కుటుంబం అయితే నియోజకవర్గంలోని తమ సొంత గ్రామానికి వెళ్లడానికి కూడా పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిన పరిస్థితి ఉంది. వీరు తప్ప ఇక జిల్లాలో ఎక్కడా మరో వైసీపీ నేత కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  

హెలికాప్టర్ ప్రమాదంలో అనంతపురం ఎంపీ సోదరి మృతి

    ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి పెరిగింది. మృతుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి కూడా ఉన్నట్టు గుర్తించారు. మరణించిన వారిలో ఏపీకి చెందిన వేదవతి కుమారి, విజయారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వేదవతి భర్త భాస్కర్‌కు ప్రమాదంలో గాయాలయ్యాయి.   అతడిని రుషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం పర్యాటకులతో వెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. 

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : రాజ్‌నాథ్

    పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బదులు చెప్పింది. పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్‌ వివరాలను గురువారం ఆయన అఖిలపక్షానికి తెలియజేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించేందుకు కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మాట్లాడుతూ.. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు.  దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందన్న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమన్నారు. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం తమకు లేదని, కానీ, పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం.. వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని వెల్లడించారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు మీడియాతో మాట్లాడారు. పరేషన్‌ సిందూర్‌ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణమంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారు. అయితే, ఇది కొనసాగుతున్న ఆపరేషన్‌ గనుక.. సాంకేతిక అంశాలను ఆయన వెల్లడించలేకపోయారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయి. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంలో రాజకీయాలకు తావులేదని రిజిజు వెల్లడించారు.  

ఆపరేషన్ సిందూర్.. అసలు సినిమా ముందుంది!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం, బుధవారం (మే 7) తెల్లవారు జామున మెరుపుదాడి చేసింది. ఏక కాలంలో తొమ్మది ఉగ్ర  స్థావరాలపై జరిపిన ఈ దాడులలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోయారు. ఆరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌ భారతీయులలో ఆనందాన్ని నింపింది. ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.ఇంత కాలానికి పాకిస్థాన్  పెంచి పోషిస్తున్నఉగ్రవాదానికి శాశ్వత సమాధి కట్టే దిశగా స్థిరమైన అడుగు పడినందుకు సర్వత్రా సంతోషం వ్యకమవుతోంది.   అయితే..  ఇక్కడితో కథ ముగిసినట్లేనా అంటే కాదు. నిజానికి అసలు కథ ఇప్పుడే  మొదలైంది. అవును.. సినిమా ఇంకా అయిపోలేదు. నిజానికి అసలు సినిమా ఇంకా మొదలే కాలేదు. ఇంతవరకు చూసింది  ట్రైలర్ మాత్రమే. అసలు కథ ముందుంది. అయితే.. ఇంతలోనే పాకిస్థాన్  చేతిలేత్తేస్తే  ఎత్తేసి ఉండవచ్చును. కానీ..  ఏప్రిల్ 22 న  భారత మాత నుదుటి సిందురాన్ని చెరిపేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు జరిపిన పహల్గాం ఉగ్రదాడికి  ప్రతీకారం ఇంతటితో తీరేది కాదు. పసుపు పారాణి అయినా ఆరని నవవధువు, నేవీ అధికారి వినయ్ నర్వాల్  భార్య హిమాన్షి  సహా 26 మంది హిందూ మహిళల నుదుటి తిలకాన్ని చెరిపేసిన ఉగ్రదాడికి, ఓ వంద మంది ఉగ్రవాదులను హత మార్చడం ముగింపు కాదు.  ఉగ్రవాదాన్ని,ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్థాన్ ను శిక్షించే వరకు ఆపరేషన్ సిందూర్  ఆగదు.ఆగకూడదు.   ఇదే విషయాన్ని..  భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే తమదైన సైనిక భాషలో చక్కగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై నరవణే కీలకమైన హింట్ ఇచ్చారు. సినిమా అప్పుడే అయిపోలేదు..ఇంకా ఉంది' (పిక్చర్ అభీ బాకీ హై) అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో పాక్ ఉగ్రవాదులపై మరిన్ని చర్యలు భారత ఆర్మీ ప్లానింగ్‌లో ఉన్నాయని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పట్టుకునే దిశగా పావులు కదపవచ్చని ఇటు నెటిజన్లు, అటు నిపుణులు ఊహాగానాలు చేస్తున్నారు. నిజానికి, భారత విదేశాంగ మంత్రి  జై శంకర్  కొద్ది రోజుల క్రితం  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఆ దేశ చెర నుంచి విడిపించడం ఒక్కటే సరైన పరిష్కారమని స్పష్టం చేశారు.  సో.. తాజా పరిణామాలను గమనిస్తే, భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే చెప్పినట్లుగా పిక్చర్ అభీ బాకీ హై .. సినిమా ఇంకా వుంది. కాదు కాదు అసలు సినిమా ముందుంది. 

ఈ ఆలయాల్లో ఇక అపరిమిత అన్న ప్రసాద పంపిణీ!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 16 ప్రముఖ దేవాలయాలలో అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.    సెక్రటేరియట్లో దేవాదాయ శాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు.   ప్రస్తుతం  విజయవాడలోని కనకదుర్గా దేవాలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం వంటి   దేవాలయాలలో మాత్రమే ఈ పథకం అమలులో ఉంది. ఇప్పుడు మరో 16 దేవాలయాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.   ఆ నిర్ణయం మేరకు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యభగవానుడి ఆలయం, విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం,  కాకినాడ జిల్లా తుని పమీపంలోని   తలుపులమ్మ అమ్మవారి ఆలయాలలో నిరంతర అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే  కోనసీమ జిల్లాలో వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు   తిరుప తమ్మ అమ్మవారి ఆల యం,  కృష్ణాజిల్లా మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం,  గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయాల్లోనూ,  నెల్లూరు జిల్లా పెంచలకోన లక్ష్మీనరసిం హస్వామి, మాలకొండ మా ల్యాద్రి లక్ష్మీనరసిం హస్వామి,  కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయాలలోనూ కూడా అపరిమిత అన్న ప్రసాద పంపిణీ జరగనుంది. నంద్యాల జిల్లా  మహానందీశ్వరస్వామి, రంగాపురం మద్దిలేటి నరసింహస్వామి ఆలయాల్లోనూ, అలాగే అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనే యస్వామి,  శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఖాద్రి లక్ష్మీనర సింహస్వామి,  చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగమ్మ ఆలయాలలో కూడా అపరిమిత అన్నదాన వితరణ కార్యక్రమాన్ని అములు చేయనున్నారు.  

సరిహద్దుల్లో కొనసాగుతున్న కాల్పులు.. దేశ వ్యాప్తంగా హై అలర్ట్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మది ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా జరిపిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యింది. భారత్ నిర్వహించిన మెరుపుదాడులలో ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ  నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత భూభాగంపై కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులకు భారత్ సేనలు దీటుగా బదులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (మే7) పాకిస్థాన్ విచక్షణా రహితంగా, ఏకపక్షంగా భారత భూభాగంపైకి జనావాసాలు లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పది మంది సాధారణ పౌరులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సేనలు ఏకపక్షంగా, విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది.   పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది.  యూరీ, కుప్వారా, రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో పాక్ సేనల కాల్పులకు భారత్ సైన్యం దీటుగా బదులిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సన్నద్ధమౌతోంది. కాగా ఇప్పటి వరకూ పాక్ జరిపిన కాల్పులలో నలుగురు చిన్నారులు సహా పదిహేను మంది మరణించారు. భారత్ దీటుగా జరిపిన కాల్పులలో పలువురు పాకిస్థాన్ సౌనికులు మరణించినట్లు సమాచారం. 

చరిత్రను తిరగరాసిన సిందూర విజయం!

ఆపరేషన్ సిందూర్   కొద్ది నిముషాల వ్యధిలో విజయవంతంగా పూర్తయిన  సైనిక చర్య. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన అద్వితీయ, అత్యద్భుత సైనిక చర్య.  కేవలం 25 నిముషాల వ్యవధిలో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించడాన్ని దేశమే కాదు, ప్రపంచం మొత్తం హర్షిస్తోంది. ఎక్కడా, వీసమెత్తు అపశ్రుతి లేకుండా..  భారత సైన్యం, సంపూర్ణం చేసిన ఆపరేషన్ సిందూర్  చరిత్రలో సిందూరం శక్తికి, పవిత్రకు ప్రతీకగా నిలిచి పోతుంది.   నిజానికి  ఈ ఆపరేషన్ మొత్తం ఒకెత్తు అయితే, ఈ  పవిత్ర  ప్రతీకార చర్యకు పెట్టిన  ఆపరేషన్ సిందూర్  పేరు ఒక్కటీ ఒకెత్తుగా పేర్కొంటున్నారు. ఆపరేషన్ సిందూర్      ప్రతి భారతీయుడి గుండెను తట్టి లేపిందని అంటున్నారు పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు 26 మంది మాతృ మూర్తుల నుదుటి సిందూరాన్నిచెరిపేసిన  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన సైనిక చర్యకు పెట్టిన  ఆపరేషన్ సిందూర్  పేరు భారతీయుల గుండెలను తట్టి లేపడమే కాదు, పాకిస్థాన్ కు బలమైన సందేశాన్ని కూడా పంపింది. నిజానికి  ప్రతీకార చర్యకు ఇలాంటి పేరు పెడతారని ఎవరూ ఉహించి ఉండక పోవచ్చును. అయితే, మంగవారం (మే 6) రాత్రంతా  సైనిక దాడులను పర్యవేక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా  ఆపరేషన్ సిందూర్  పేరును సూచించారని, అధికార వర్గాలు పేర్కొన్నాయి.  ఏప్రిల్ 22 న  పహల్గాం లోని బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్ర వాదులు 26 మంది పురుషులను అత్యంత దుర్మార్గంగా హత మార్చారు. పుణ్య స్త్రీల నుదుటి సిందూరాన్ని కర్కశ మూకలు చెరిపేశాయి. ఉగ్ర పాపానికి మించిన మహా పాతకానికి,  ఘోర తప్పిదానికి ఉగ్రమూకలు పాల్పడ్డాయి. హిందూ సప్రదాయంలో వివాహిత మహిళలు నుదుటన ధరించే సిందూరానికి ఉన్న విలువేమిటో  ముష్కర మూకలకు తెలియక పోవచ్చును కానీ.. భారతీయులకు తెలియంది కాదు. ఆ సిందూరాన్ని దూరం చేసిన మహా పాతకానికి పాల్పడిన ముష్కర మూకలను భారత దేశం ఎట్టి  పరిస్థితిలోనూ వదిలి పెట్టదనే సందేశం  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకే కాదు, పాక్ పాలకులకు చేరాలని ప్రధాని మోదీ అధికారాలకు స్పష్టంగా చెప్పారు. అందుకే ప్రధాని మోదీ  ప్రతీకార ఆపరేషన్ విషయంలో సైన్యానికి  సంపూర్ణ స్వేచ్చను ఇచ్చినట్లు చెపుతున్నారు.ఇప్పడు విజయవంతమైనఆపరేషన్ కు ప్రధాని మోదీనే  నామకరణం చేశారు. ఇప్పడు  ఆపేరే  ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతి ధ్వనిస్తోంది. మహిళల్లో  విశ్వాసాన్ని నిపింది. భారతీయ సమాజానికి స్పూర్తిగా నిపిచింది. భారతీయ విలువలకు. భారతీయ మహిళల శక్తికి ప్రతీకగా నిలిచింది. ఒక విధంగా స్వాతంత్ర్య సంగ్రామంలో  వందే మాతరం  నినాదం ఎలాగైతే భారతీయులు అందరిలో జాతీయ ఐక్యతను తట్టిలేపిందో.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ భారతీయులు అందరిలో జాతీయ ఐక్యతా స్పూర్తిని మరోమారు తట్టి లేపింది.  ఇక్కడ  ఇంకొక్క విషయం కూడా చెప్పుకోవాలి.. భారతీయ హైందవ సంప్రదాయంలో  వివాహిత మహిళల నుదుటి సిందూరం ఒక అలంకారం కాదు  మహిళా శక్తికి ప్రతి రూపం.  అనే విషయాన్ని కూడా  భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలియచేసిందని అంటున్నారు. అవును. ఇంతవరకు భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్దాలు జరిగాయి, యుద్ధంతో సమానమైన సర్జికల్ స్ట్రైక్స్  జరిగాయి. పరస్పర దాడులు జరిగాయి కానీ, ఏ సందర్భంలోనూ మహిళలు ముందుండి సైనిక చర్యను నడిపించింది లేదు. ఇప్పుడు  ఆపరేషన్ సిందూర్ పేరిట జరిగిన సైనిక చర్యను ఇద్దరు మహిళలు.. కల్నల్ సోఫియా, కంమాండర్  వోమిక ముందుండి నడిపించారు. అంతే కాదు, ఆ ఇద్దరే, సైనిక చర్య వివరాలను మీడియాకు వివరించారు. అందుకే  ఆపరేషన్ సిందూర్ కేవలం మరో ప్రతీకార సైనిక చర్య కాదు.. సిందూరశక్తిని, సిందూర పవిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన సిందూర విజయం. 

హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

  ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.  రాష్ట్రంలో భద్రత కట్టదిట్టం చేయాలని అధికారులను సూచించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఎలా స్పందించాలనే దానిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అత్యవసర సేవలు నిరవధికంగా అందుబాటులో ఉండేలా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సీఎం సూచించారు.హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను అమలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేగాక, శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్ వద్ద భద్రతను మరింత బలపర్చాలన్న ఆదేశాలు జారీ చేశారు. విదేశీ రాయబార కార్యాలయాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించాలని అధికారులకు సూచించారు. భద్రతా సమాచార వ్యవస్థను సమర్ధవంతంగా సమన్వయం చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భాగ్య నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. 

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కీలక సమావేశం

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో అతుల్ జైన్‌తో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది. నీటిపారుదల శాఖ అధికారుల బృందం కూడా ఈ సమావేశానికి హాజరైంది. నేషనల్ డ్యామ్ సంరక్షణ సంస్థ సమర్పించిన నివేదికలో మేడిగడ్డ డ్యామ్ డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ లో భారీ లోపాలు ఉన్నాయని స్పష్టం చేయడంతో, దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు మేము పునరుద్ధరణ మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.  డీపీఆర్‌లో చూపిన ప్రదేశానికి భిన్నంగా వేరే ప్రాంతంలో నిర్మాణం జరగడం తగదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పలు ప్రతిపాదనలను ఆయన కేంద్రం ముందుంచారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. బ్యారేజీ మరమ్మతులు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలసంఘం ఛైర్మన్‌కు వివరించారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, డిజైన్‌లో స్పష్టమైన లోపాలున్నాయని ఆయన పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలి విడతకు 45 టీఎంసీల నీటిని, అలాగే సమ్మక్క-సారక్క బ్యారేజీకి 44 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

టెస్టులకు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత తరుపున టెస్ట్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు తనపై చూపిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతానని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 4301 పరుగులు చేశాడు రోహిత్.  ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధసెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2025 లో భాగంగా ముంబై జట్టు ప్లేయర్ గా ఉన్న కొనసాగుతున్నా రోహిత్ శర్మ తన ఆటలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంపై ఊహాగానాలు, చర్చలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. అయితే వాటిని బీసీసీఐ తోసిపుచ్చింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్  తీసుకుంటున్నట్లు హిట్ మ్యాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేశారు.   

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం పొడిగింపు

  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. నూతన సీబీఐ డైరెక్టర్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ పదవీకాలం పొడిగింపునకు అపాయింట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రవీణ్ సూద్ పదవీకాలం వాస్తవానికి ఈ నెల 24తో ముగియాల్సి ఉంది. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ గా తన పోలీస్ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.  సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో మే 2023లో సీబీఐ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.  

దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

  దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భద్రతకు భంగం కలిగిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించమని ఆయన అన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమాయకులను చంపిన వారినే మేము హతం చేశామని అన్నారు. పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులపై భారత సైన్యం తమ సత్తా ఏంటో చూపించింది. పౌరుల ప్రాణాలకు ఎలాంటి నష్టం చేయలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుత్రువులకు తగిన విధంగా బుద్ది చెప్పామని వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని.. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని తెలిపారు.  ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను హతం చేయడం చాలా రిస్క్ తో కూడిన విషయం అని.. భారత సైన్యం రిస్క్ అయినప్పటికీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయాలని భావించి దాడి చేసినట్టు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని.. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను హతం చేయడం చాలా రిస్క్ తో కూడిన విషయం అని.. భారత సైన్యం రిస్క్ అయినప్పటికీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయాలని భావించి దాడి చేసినట్టు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధుర్‌లో హనుమంతుడి లంకా దహనాన్నే ఆదర్మంగా తీసుకున్నమని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌లో త్రివిధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందన్నారు. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.  

హైదరాబాద్‌లో ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్.. నాలుగు ప్రదేశాలలో నిర్వహణ

  దేశంలో నెలకొన్న భద్రత పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్‌డీఓ మౌలాలిలోని NFC లో సైరన్లు మ్రోగాయి. రెండు నిమిషాల పాటు సైరన్లు మోగిన తరువాత  మాక్ డ్రిల్ లో  అవగాహన కల్పించారు.  15 నిమిషాల పాటు మాక్ డ్రిల్ కొనసాగుతుందని తెలిపారు. NCC, NSS క్యాడెట్స్, NDRF, SDRF రెస్క్యూ రిహార్సల్ చేపట్టబోతున్నట్టు  సీవీ ఆనంద్ తెలిపారు.  సైరన్ మోగిన తరువాత ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. సైరన్ మోగిన తరువాత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బయటికి రావద్దని సూచించారు. ఒకవేళ బయట ఉన్నవాళ్లు సురక్షిత నిర్మాణాల్లోకి వెళ్లాలని కోరారు. ప్రమాదాలు జరిగితే ఎలా అరికట్టాలని.. అక్కడ వైద్య సిబ్బందిని అంబులెన్స్ లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ప్రమాద ఎమర్జెన్సీ సమయంలో  ఏ విధంగా వ్యవహరించాలని సూచించారు మాక్ డ్రిల్ లోభవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.