వాహ్.. క్యా సీన్ హై.. కేటీఆర్, జగన్ పక్కపక్కనే

బీఆర్ఎస్, వైసీపీల బంధం తెలిసిందే.  తెలుగుదేశం పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పట్ల వ్యతిరేకతే వారి మైత్రీ బందానికి అసలు, సిసలు కారణంగా  పరిశీలకులు చెబుతారు. ఆ వ్యతిరేకత కారణంగానే.. ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టడం కోసం అప్పటికి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేయగలిగినంత సాయం చేసింది. అందించగలిగినంత సహకారం అందించింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి అవసరమైతే జగన్ విజయం కోసం తాను ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తానని కూడా అన్నారు. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అయిన తరువాత జగన్ కేసీఆర్ తో సఖ్యంగా మెలిగారు. ఆ సఖ్యత ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు సహాయం చేయడానికి నాగార్జున సాగర్ జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చి ఆయనకు అనుకూలంగా ఆ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు జగన్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అదేమీ ఫలించ లేదనుకోండి అది వేరే సంగతి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేస్తే.. ఆయన అరెస్టు ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలను కేసీఆర్ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు చేయాలనుకుంటే అక్కడ చేయండి కానీ ఇక్కడ కాదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ పరాజయం పట్ల కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏపీలో జగన్ పార్టీ పరాజయం పాలు కావడం ఆశ్చర్యం కలిగించిందని ఆ ఫలితాల తరువాత కేటీఆర్ అన్నారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇరువురూ కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రాబాబుకు వ్యతిరేకంగా కుమ్మక్కు రాజకీయాలు నెరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో రెండూ పార్టీలూ అధికారం కోల్పోయిన తరువాత కూడా కేటీఆర్, జగన్ ల మధ్య అనుబందం అలాగే సాగుతోందనడానికి పలు ఆధారాలు ఉన్నాయి. ఇటీవల జగన్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని కితాబిచ్చారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ జగన్ పట్ల తమ అభిమానాన్ని ఎన్నడూ దాచుకోలేదు. తాజాగా జగన్, కేటీఆర్ లు ఇరువురూ బెంగళూరులో జరిగిన  ఒక కార్యక్రమంలో పక్కపక్కన కూర్చుని ముచ్చటించుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బెంగళూరులో శనివారం నవంబర్ 22) జరిగిన ఓ  కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   కలుసుకున్నారు.  పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు  వారిద్దరు కలిసి  ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

కుప్పంలో డ్వాక్రా మహిళల ఛాయ్ రాస్తా అవుట్ లెట్.. ప్రారంభించిన నారా భువనేశ్వరి

ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపార వేత్త రావాలని, అందులోనూ మహిళలు ఎంటర్ పెన్యూర్ లుగా ఎదగాలన్న చంద్రబాబు సంకల్పం సాకారం అయ్యే దిశగా కుప్పంలో అడుగుపడింది.  కుప్పంలో డ్రాక్రా మహిళల నెలకొల్పిన చాయ్‌ రాస్తా అవుట్‌లెట్‌ శనివారం ఆరంభమైంది. ఈ రాస్తా చాయ్ ఔట్ లెట్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు.  .ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్‌ రాస్తా  రూపొందిందన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోందనీ,  దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.   కుప్పం డెవలప్‌మెంట్ ఆధారిటీ (కడా) మద్దతుతో   కుప్పంలో ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్ ప్రారంభం కావడం శుభపరిణామంగా అభివర్ణించిన భువనేశ్వరి, మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అధునాతన వ్యాపారాలు ఎంతో దోహపదపడతాయన్నారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటైన ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌ను ప్రారంభించిన భువనేశ్వరి మొదటి ఛాయ్‌ని కోనుగోలు చేసి తాగారు.  చాయ్ రాస్తా అవుట్‌లెట్‌లో రుచి, శుచి చక్కగా ఉన్నాయని  ప్రశంసించారు.  ఐఐఎం, ఐఐటి గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యంతో రూపొందిం చిన చాయ్ రాస్తా  చాలా సరికొత్తగా ఉందని  ఆమె అభినందించారు. 

37 మంది మావోయిస్టుల లొంగుబాటు

మవోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీశివధర్ రెడ్డి సమక్షంలో 27 మంది మావోయిస్టులు శనివారం (నవంబర్ 22) లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్రకమిటీ, ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మండుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు.  వీరు కాకుండా మరో 22 మంది దళ సభ్యులు కూడా లొంగిపోయారు.   కాగా లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, మావోయిస్టు సాంకేతిక విభాగం ఇన్ చార్జి అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ పరిణామం తెలంగాణలో శాంతి స్థాపనకు మరో ముందడుగుగా డీజీపీ అభివర్ణించారు.  లొంగిపోయిన 37 మందిలో ఆజాద్ గత 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ  ఏవోబీ ( ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.   పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మావోయిస్టులను లొంగిపోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మావోయిస్టులపై ప్రభావం చూపిందనీ, అందుకే నక్సలైట్లు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారనీ ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు.  లొంగుపోయిన నక్సలైట్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందనీ, సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.  లొంగిపోయిన మావోయిస్టులకు సంపూర్ణ రక్షణతో పాటు పునరావాసం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

పుట్టపర్తి సాయిబాబా స్ఫూర్తితో ముందుకు సాగాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సత్యం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.  సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందన్నారు.. పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. అంతకు ముందు పుట్టపర్తి  విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము  సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం  తన మహాద్భాగ్యంగా చెప్పారు.   సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రగణ్యుడన్న రాష్ట్రపతి  నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారన్నారు.  బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు లవ్ ఆల్..సర్వ్ ఆల్ అన్నది పుట్టపర్తి సాయిబాబా సిద్ధాంతమన్నారు.  సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలని పేర్కొన్నారు. వాటిని పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నారు.  సత్యసాయి బాబాతో  తనకు  మంచి అనుబంధం ఉందన్న ఆయన  తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారని చెప్పారు.  ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు... పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారన్నారు.   సత్యసాయి భక్తులు ఇప్పటికీ  అదే స్ఫూర్తిని కొనసాగించడం  సంతోషాన్నిస్తోందన్నారు చంద్రబాబు.   భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలని చంద్రబాబు అన్నారు.

సజ్జనార్ పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ బహిష్కృత నేత,  తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న  హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్లన్నారు. ఐబొమ్మ రవి అరెస్టుపై మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న సజ్జనార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి దమ్మున్నోడనీ, అందుకే ప్రజల మద్దతు చూరగొన్నాడనీ పేర్కొన్నాడు.  తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. ఇంతకీ సజ్జనార్ పై మల్లన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడానికి . ఆయన సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడమే కారణంగా కనిపిస్తోంది. ఐబొమ్మ రవి అరెస్టుకు కారణం అతడి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడమేనన్న తీన్మార్ మల్లన్న ఆమె సమాచారం ఇవ్వకుంటే రవిని పట్టుకోగలిగేవారా అని నిలదీశారు.  సినీమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచేయడం వల్లనే అంత ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూడలేని వారు ఐబొమ్మ రవికి మద్దతుగా నిలుస్తున్నారన్న  తీన్మార్ మల్లన్న వంద రూపాయల సినిమా టికెట్ ను వేలల్లో అమ్ముకునే నిర్మాతలతో కలిసి సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటుచేయడాన్ని తప్పుపట్టారు.  ఐబొమ్మ రవి అరెస్టు కాదు..  దమ్ముంటే దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు, కిడ్నాప్‌లు, ఆర్థిక నేరాలను ఆపి చూపించాలని సవాల్ చేశారు.  సీవీ ఆనంద్ కూడా   సైబర్ మోసాలు ఆగవని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 

డ్రోన్ల ద్వారా ఆయుధాల స్మగ్లింగ్!

ఢిల్లీ ఢిల్లీలో ఎర్రకోట వద్ద బాంబు పేలుడుపై దర్యాప్తు కొనసాగున్న సమయంలోనే మరో కుట్రను పోలీసులు భగ్నం చేశారు.  పాకిస్ఠాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారీగా ఆయుధాలను తరలిస్తున్న స్మగ్లింగ్ రాకెట్ ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.   పాక్‌ ఐఎస్‌ఐతో నేరుగా సంబంధాలున్న ఈ ముఠా నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.    ఢిల్లీలో కొంతమంది భారీగా అక్రమ ఆయుధాలు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు డీసీపీ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని  పోలీసు  బృందం   పలు ప్రాంతాల్లో నిఘా ఉంచగా.. రోహిణిలో ఈ ఆయుధ మాడ్యూల్ గుట్టు బయటపడింది. నిందితులు డ్రోన్‌లను ఉపయోగించి పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పంజాబ్‌ సరిహద్దుల నుంచి తీసుకొచ్చిన ఈ ఆయుధాలను లారెన్స్‌ బిష్ణోయ్‌, బాంబిహా, గోగి వంటి గ్యాంగ్‌ సభ్యులకు అందజేయడానికి ఉద్దేశించినవిగా తేలింది.  నిందితుల నుంచి విదేశాల్లో తయారైన 10 అత్యాధునిక సెమీ ఆటోమెటిక్‌ పిస్టల్స్‌తో పాటు 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లభ్యమైన ఆయుధాలు టర్నీ, చైనాలో తయారైనవిగా తెలిపారు. ఈ ముఠాకు  చెందిన నలుగురిని అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆయుధాలను ఎవరికి విక్రయించారు, నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారనే వివరాలు రాబట్టేందుకు అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు.  నిందితులకు చెందిన మొబైల్‌ ఫోన్ డేటా, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

సుప్రీం మార్గదర్శకాల మేరకు  స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఎట్టకేలకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది.   బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్  అంశాన్నిపక్కన పెట్టేసింది.  ఇటీవలి జూబ్లీ ఉపఎన్నికలో ఘన విజయంతో కాంగ్రెస్ లో, కాంగ్రెస్ క్యాడర్ లో పెరిగిన జోష్ అలా ఉండగానే ఎన్నికలకు వెళ్లి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఇక జాప్యం లేకుండా స్థానిక ఎన్నికలకు రెడీ అయిపోయారు. దీంతో ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజాపాలన విజయోత్సవాలు వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్రప్రభుత్వం ఘనంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. అవి కాగానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేసింది. ఆ మేరకు శనివారం (నవంబర్ 22) జీవో జారీ చేసింది.   సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా   జీవో జారీ చేసింది.   ఈ జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్థతిలో అమలు చేస్తారు.   అన్నివర్గాలకూ సమాన న్యాయం జరిగేలా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని పేర్కొంది. గిరిజన గ్రామాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనను   ఈ జీవోలో చేర్చింది. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో  సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలన్నీ ఎస్టీలకే రిజర్వ్ అవుతాయి. ఈ ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక  ఘట్టం పూర్తైనట్లైంది. దీంతో త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేష్ త్వరలో అంటే డిసెంబర్ రెండో వారంలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.  

ఆరునెలలలోగా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం.. కేంద్రమంత్రి పెమ్మసాని

అమరావతి రైతుల సమస్యల పరిష్కారం విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే శనివారం (నవంబర్ 22) న త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సీఆర్డీయే కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో  గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ,  ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, రైతు జేఏసీ ప్రతినిధులు  పాల్గొన్నారు. భూముల రిజిస్ట్రేషన్, అభివృద్ధి పనులు వంటి వాటిపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు.  ఇటీవలే రైతు జేఏసీ ప్రతినిధులతో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమై రాజధాని రైతుల సమస్యలను సానుకూల దృక్ఫథంతో సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  రాజధానికి భూములిచ్చిన రైతులెవరికీ ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.  మొత్తం 69,421 మంది రైతులకు ఇప్పటి వరకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరు నెలలలోగా రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాస్పద భూముల్లో 20 ఎకరాలు కుటుంబపరమైనవి కాగా, మరో 45 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయన్నారు.  ఇప్పటికే రాజధాని పరిధిలో 90 శాతానికి పైగా కుటుంబాలకు ప్లాట్లను కేటాయించామని వెల్లడించారు. అన్ని సమస్యలనూ ఆరు నెలల్లోగా పూర్తి చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ఏ రైతుకూ అన్యాయం జరగకూడదన్నదే తమ లక్ష్యమని పెమ్మసాని స్పష్టం చేశారు. 

ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ ముందస్తు ప్రచారం.. దేనికి సంకేతం?

ఆలూ లేదు.. చూలూ లేదు అన్న సామెతలా ఉంది ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు రాజీనామా మార్గాన్ని ఎన్నుకుంటార్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో సందేహం లేదు. ఈ మేరకు ఇటీవల ఆయన తన అనుచరులతో, ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించి చర్చలు జరిపారు. అంత వరకూ నిజమే. కానీ తన రాజీనామా విషయాన్ని ఆయన ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేయే. ఆయన రాజీనామా చేసిన తరువాత మాత్రమే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది.  కానీ బీఆర్ఎస్ మాత్రం అప్పుడే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక  ప్రచారానికి తెరలేపేసింది. పోస్టర్లతో హడావుడి చేసేస్తోంది.  సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచార సందడి ప్రారంభించేసింది.  ఇక ఏపీలో వైసీపీ తరహాలో రప్పా రప్పా  అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటుతామంటూ నానా హంగామా చేస్తోంది.  ఇది చూసిన నెటిజనులు నిన్నటి జూబ్లీ ఉప ఎన్నిక, అంతకు ముందటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ ఇలాగే ముందస్తు హడావుడితో హోరెత్తించి ఫలితాల్లో చతికిల బడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

నేనలా చేస్తే.. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏక కాలంలో రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై విమర్శలు గుప్పిస్తూనే.. మరో వైపు ఫార్ములా ఈకార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి పై మండి పడుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, తన సోదరుడు కేటీఆర్ కు మద్దతు ఇస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.     ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి అనుచరులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమర్శించారు.  చెరువుల‌ను ఆక్ర‌మించి పెద్ద ఎత్తున భ‌వ‌నాలు నిర్మించుకుంటున్నార‌న్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.  ఇలా భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారన్న కవిత.. వీరి విషయంలో హైడ్రా నిద్రపోతోందా అంటు నిలదీశారు.  పేద‌ల‌  ఇళ్లను కూల్చేవేతలో ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్న హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.తన వద్ద ఉన్న ఆధారాలను హైడ్రాకు అందించడానికి తాను సిద్ధమే కానీ, తానా పని చేస్తే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపైపోతారని అన్నారు. అలా జంపైపోతే కాంగ్రెస్ వారికి క్లీన్ చిట్ ఇచ్చేస్తుందన్నారు.  

ఆదిని విమర్శించే స్థాయా మీది.. బీటెక్ రవి

వైసీపీ నాయకులకు ఆదినారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని తెలుగుదేశం నాయకుడు, ఆ పార్టీ పులివెందుల ఇన్ చార్జ్ బీటెక్ రవి అన్నారు. శుక్రవారం (నవంబర్ 21) విలేకరులతో మాట్లాడిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇంటికి వెళ్లాలంటూ ముందు తన ఇల్లు దాటి వెళ్లాలని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడితే సహించేంది లేదన్న బీటెక్ రవి.. నాడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని మీరే  హత్య చేసి  మా మీద కేసు మోపాలని ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అనవసర వాగాడంబరం మాని సత్తా ఉంటే పులివెంొదుల మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించండి సవాల్ విసిరారు.   సతీష్ రెడ్డి 5 సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయారని, ఆదినారా యణ రెడ్డి నాలుగు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లూ గెలిచారని చెప్పిన ఆయన రానున్న పులివెందుల మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు.  ఈ సందర్భంగా బీటెక్ రవి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తడిగుడ్డతో  గొంతులు కోసే రకమని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  

జైల్లో దస్తగిరికి బెదరింపుల కేసు.. అధికారులపై విచారణకు ఆదేశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన  దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి అప్పుడు కడప జైలు అధికారులుగా ఉన్న వారిపై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపై నాటి సూపరింటెండెంట్ ఐఎన్‌హెచ్ ప్రకాశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ కె.జవహర్‌బాబు, డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం (నవంబర్ 21) ఉత్తర్వులు  జారీ చేశారు.  విచారణాధికారిగా కోస్తాంధ్ర రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ   రవికిరణ్‌ను,  రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించారు. విచారణ పూర్తి చేసి మూడు నెలలలోగా  నివేదిక సమర్పించాలని వారిని ఆదేశించారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని, మరో కేసులో భాగంగా 2023 అక్టోబరు 31న కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబరు 28న జైలులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ముసుగులో వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిని జైల్లోకి అనుమతించారు. ఈ సమయంలోనే చైతన్యరెడ్డి  దస్తగిరిని బెదిరించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది.  ప్రస్తుతం ఐఎన్‌హెచ్ ప్రకాశ్ నెల్లూరులోని ఏపీ స్టార్స్‌లో, జవహర్‌బాబు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో, డాక్టర్ పుష్పలత కడప జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

గుడిలో దండల పెళ్లి.. యువ ఐఏఎస్ జంట ఆదర్శ వివాహం

కోట్లాది రూపాయల ఖర్చుతో ఆడంబరంగా, ఆర్భాటంగా వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో వాటన్నిటికీ దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు అత్యంత నిరాడంబరంగా వివాహబంధంతో ఒక్కటై ఆదర్శంగా నిలిచారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న టి.శ్రీ పూజ, మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆదిత్యవర్మల వివాహం శుక్రవారం (నవంబర్ 21) విశాఖలో జరిగింది. విశాఖ కైలాసగిరిపై  ఉన్న శివాలయంలో ఇరువురూ దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు.   ఈ వివాహ కార్యక్రమానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తరువాత వీరు నేరుగా విశాఖ వన్ టౌన్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలంలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు.  విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ  ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన ఈ ఇద్దరు అధికారులది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

విశాఖకు కాగ్నిజెంట్.. ఊహించిన దానికంటే ముందుగానే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్పీడ్  ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కృతిని పూర్తిగా వంటబట్టించుకుంది. అయితే  ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వాయువేగంతో ముందుకు సాగుతోందని మరోసారి నిర్ద్వంద్వంగా రుజువైంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు ఏదైనా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే.. వారి కంపెనీ కార్యకలాపలను వెంటనే ప్రారంభించేందుకు ప్రోత్సాహకాలు, అనుమతులు వంటివి అనూహ్య స్పీడ్ తో అందిస్తామని విస్పష్టంగా చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తున్నారు.   విశాఖలో భారీ పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాగ్నిజెంట్ ఊహించిన దాని కంటే చాలా ముందుగానే రాష్ట్రంలో తన కార్యకలాపాలు ప్రారంభించడం చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ అన్న మాటను చేతల్లో చూపిస్తున్నదని  స్పష్టంగా అవగతమౌతుంది   కాగ్నిజెంట్   విశాఖ సమీపంలోని కాపులుప్పాడలోని 21 ఎకరాల భూమిలో మెగా నిర్మాణాన్ని మొదట పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నందున, కాగ్నిజెంట్  వచ్చే ఏడాది  రెండవ త్రైమాసికం అంటే 2026 ఏప్రిల్ తురువాత వైజాగ్ లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా  వచ్చే ఏడాది జనవరి నాటితే తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందుకోసం తాత్కాలిక డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.   ప్రముఖ కంపెనీలను ఆహ్వానించడంలో ప్రభుత్వమే స్వయంగా ఇనీషియేటివ్ తీసుకుంటే..    పెట్టుబడిదారులు అంతకు మించి చొరవ, ఉత్సాహం చూపిస్తారు.  కాగ్నిజెంట్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.   కాగ్నిజెంట్  శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు వేచిచూడకుండా.. ముందుగా తాత్కాలిక భవనాల్లో కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఐటీ హిల్స్ లో   భవనాలను అద్దెకు తీసుకోడానికి రెడీ అయ్యింది. ఇందు కోసం తమకు అనువైన భవనాల ఎంపికకు కాగ్నిజెంట్ బృందం విశాఖకు చేరుకుంది కూడా. అంతే కాదు.. జనవరి  నుంచి 800 మందితో విశాఖలో ఆపరేషన్స్ కి కాగ్నిజెంట్ సమాయత్తం అవుతోంది. విశాఖలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న  వారు ముందుకు రావాలంటూ.. ఇప్పటికే తమ సిబ్బందికి సమాచారం ఇచ్చింది కూడా.   విశాఖలో  1,583 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తమ సంస్థ ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తామని కూడా ప్రభుత్వానికి తెలిపింది.  దీంతో రాష్ట్రంలో యువతకు  ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించడంతోపాటు పరోక్షంగా మరి వేల కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం కాగ్నిజెంట్ కు   భూములు కేటాయించింది. ఆ భూముల్లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. అయితే అంతకు ముందే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ ముందుకు రావడం చూస్తుంటే ఇన్వెస్టర్లకు రాష్ట్రప్రభుత్వంపై ఎంత విశ్వాసం ఉందో అర్థమౌతోంది. 

ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ విమానం

దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో  భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా..  దుబాయ్‌ ఎయిర్‌షోలో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్న వాయుసేన తేజస్ విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొంది.  ఇలా ఉండగా ఎయిర్ షోలో తేజస్ విమానం కూలిపోయి మంటలు చేలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

కుప్పంలో నారా భువనేశ్వరి ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సాధారణ ప్రయాణీకు రాలిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అందులోనూ రాష్ట్రంలో మహిళలకు ఉచిత  ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ స్త్రీ శక్తిపేర ప్రవేశ పెట్టిన పథకం కింద ఆమె ఆర్టీసీ బస్సులో తన ఆధార్ కార్డు చూపి ఉచితంగా ప్రయాణించారు. కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి  శాంతిపురం  నుంచి తుమ్మిసి గ్రామానికి వెళ్లేందుకు శుక్రవారం (నవంబర్ 21) ఆర్టీసీ బస్సు ఎక్కి మిగిలిన మహిళలతో పాటుగా తన ఆధార్ కార్డును  కండక్టర్ కు చూపి ఉచిత టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె  సహచర ప్రయాణీకులతో ముచ్చటించారు.  ఉచిత బస్సు పథకం ఎలా ఉందని ఆరా తీశారు.  ఈ పథకం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అదే సమయంలో వారు చెప్పిన విషయాలను ఎంతో శ్రద్ధగా ఆలకించారు.  జలహారతిలో  పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భువనేశ్వరి అభివర్ణించారు.  కుప్పం ప్రాంత ప్రజల దశాబ్దాల కలను చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. తాగు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎంతో శ్రమించి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చారన్నారు.   కేవలం నీటిపారుదలకే పరిమితం కాకుండా కుప్పం పారిశ్రామిక ప్రగతికి కూడా చంద్రబాబు బాటలు వేశారన్న భువనేశ్వరి,  ఈ ప్రాంతానికి  23,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలను తీసుకోచ్చారని వివరించారు.  పరిశ్రమలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుకు కుప్పం ప్రజల ఆశీస్సులు   ఎల్లప్పుడూ ఉండాలని   ఆకాంక్షించారు.

పాఠ్యాంశాలలో మళ్లీ నైతిక శాస్త్రం.. మంత్రి లోకేష్ ను ప్రశంసించిన నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం సంతోషంగా ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా సమగుట్ట పల్లిలోని విలువల బడిని ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆ పాఠశాల విద్యార్థులతో మమేకమయ్యారు.  ఈ సందర్భంగా విలువల బడి వ్యవస్థాపకుడు లెనిల్ ను అభినందించారు.  విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పించి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. తన చిన్నతనంలో  స్కూల్లో  నైతిక శాస్త్రం   ఒక పాఠ్యాంశంగా ఉండేదని గుర్తు చేసుకున్న ఆమె ఇప్పుడు రాష్ట్రపాఠశాలల్లో మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ను తీసుకువచ్చినందరకు లోకేష్ ను అభినందిస్తున్నాన్నారు.   రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డులు పెట్టడం చాలా సంతోషమన్న నారా భువనేశ్వరి నేటి సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. పిల్లలలో నైతిక విలువల పట్ల అవగాహన పెంపొందించే విషయంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలన్నారు.  తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తిని గమనించి  అందుకు అనుగుణంగా పిల్లల ఎదుగుదలకు దోహదపడాలన్నారు.  

రాజమహేంద్రవరానికి ఓఆర్ఆర్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి ఆకాశమే హద్దా అన్నట్లుగా దూసుకుపోతున్నది. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రం నుంచి కూడా సహకారం అందుతోంది. దీంతో రాష్ట్రప్రగతి నల్లేరుమీద బండి నడకలా సాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాలలో కూడా అత్యున్నత స్థాయి మౌలిక వసతుల కల్పనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.   ఇందులో భాగంగానే రాజమహేంద్ర వరం చుట్టూ కొత్త ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి బీజం పడింది. రాజమహేంద్రవరంకు ఔటర్ రింగ్ రోడ్డు వేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అభివృద్ధి వేగం పెరుగుతుందనీ, వైజాగ్, చెన్నై రోడ్డు కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందనీ భావిస్తున్నారు.  అంతే కాకుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య దాదాపు పూర్తిగా పరిష్కారమౌతుందని భావిస్తున్నారు.  రాజమహేందరవరం ఔటర్ రింగ్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. దీని కోసం అధికారులు డీపీఆర్ రెడీ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. డీపీఆర్ పూర్తికాగానే ఓఆర్ఆర్ కోసం భూమి సమీకరణ ప్రారంభించనున్నారు.   కాగా రాజమహేంద్రవరం ఔటర్ రింగ్ రోడ్డు విషయాన్ని మంత్రి నారాయణ ధృవీకరించారు. రాజమహేంద్రవరం మునిసిపల్  కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ మధురపూడి, రాజానగరం, దివాన్‌చెరువు, దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణతో పాటు రాజమహేంద్రవరం నగర, గ్రామీణ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్‌ రాహుల్‌ మీనా పాల్గొన్నారు.