అంబులెన్సులో మంటలు.. నలుగురు సజీవ దహనం

అంబులెన్స్ లో హఠాత్తుగా మంటలు వ్యాపించి నలుగురు సజీవదహనమైన దుర్ఘటన గుజరాత్ లో  మంగళవారం (నవంబర్ 18) ఉదయం జరిగింది. ఈ ఘటనలో అంబులెన్స్ లో ఉన్న నవజాత శిశువు, ఆ శిశువు తండ్రి, ఒ వైద్యుడు, నర్సు సజీవదహనమయ్యారు. గుజరాత్ లోని మొదాస పట్టణం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. జన్మించిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురైన నవజాత శిశువును మొదాసలోని ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా అంబులెన్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అంత హఠాత్తుగా అంబులెన్స్ లో మంటలు ఎలా వ్యాపించాయి అన్నదానిపై విచారణ జరుపుతున్నారు.  

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్?!

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. హిడ్మా తలపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఇంత కాలంగా భద్రతా దళాలు, పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న హిడ్మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైనట్లు తెలిసింది. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా తో పాటు మరో ఐదుగురు మావోలు కూడా హతమైనట్లు తెలుస్తోంది.   ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో మంగళవారం (నవంబర్ 18)  ఉదయం మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఈ ప్రాంతంలో నక్సల్ అగ్రనేతలు ఉన్నారన్న పక్కా సమాచారంతో  పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో  ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో  ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలంలో  పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వీధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కూబింగ్ ఇంకా సాగుతోందని తెలుస్తోంది.  

అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులెప్పుడంటే?

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిథుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. బుధవారం (నవంబర్ 19)న అర్హులైన రైతులందరి ఖాతాల్లోకీ నేరుగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను జమ చేయనుంది.ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతలో 46 లక్షల 85 వేల 838 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద అందించనున్న ఐదే వేల రూపాయలు కలిపి అర్హులైన రైతుల ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయలు జమకానున్నాయి.  ఈ పథకం కింద ఈ ఏడాది ఆగస్టులో తొలి విడత కింద రైతుల ఖాతాలలోకి సొమ్ము జమచేసిన ప్రభుత్వం.. ఇప్పుడు బుధవారం (నవంబర్ 19) రెండో విడత నిథులను జమ చేయనుంది.   రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్థానికంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  

ఢిల్లీ బ్లాస్ట్.. మరో కీలక నిందితుడి అరెస్టు

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో జరిగిన ఘోరమైన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ముందడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఢిల్లీ పేలుడు ఘటనలో 13 మంది మరణించగా, మరో 32 మంంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఎన్ఐఏ  కారు బాంబు పేలుడు ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయగా, తాజాగా మరో  కీలక నిందితుడిని అరెస్టు చేసింది. శ్రీనగర్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన ఎన్‌ఐఏ బృందం, కశ్మీర్‌కు చెందిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్ ను   అరెస్టు చేసింది. అతడు కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా, ఖాజిగుండ్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో జాసిర్ ఉగ్రవాద దాడులకు సాంకేతిక సహాయం అందించిన వ్యక్తిగా గుర్తించింది. డ్రోన్లను సమకూర్చడం, రాకెట్లు తయారు చేయడానికి ప్రయత్నించడం వంటి కీలక కార్యకలాపాలకు అతడు నేరుగా సహక రించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పేలుడు జరిగే ముందు ఉగ్రవాద చర్యలను అమలు చేయడంలో అతడి పాత్ర ఉందనిఎన్ఐఏ తెలిపింది.జాసిర్ బిలాల్ వాని పేలుడు  ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీతో కలసి ఈ దాడిని ప్లాన్ చేసినట్టు ఎన్‌ఐఏ తెలిపింది.   ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

అక్ర‌మ క‌ట్ట‌డాల‌ కూల్చివేత

శేరిలింగంప‌ల్లి మండ‌లం గ‌చ్చిబౌలి ప్ర‌ధాన ర‌హ‌దారికి ఆనుకుని  సంధ్యా శ్రీ‌ధ‌ర‌రావు నిర్మించిన ప‌లు అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను హైడ్రా సోమ‌వారం (నవంబర్ 17) కూల్చివేసింది. ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్  కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లో ర‌హ‌దారులు, పార్కుల‌ను ప‌ట్టించుకోకుండా.. చేప‌ట్టిన నిర్మాణాల‌పై హైకోర్టు ఉత్త‌ర్వుల ప్ర‌కారం హైడ్రా ఈ కూల్చివేతలకు పాల్పడింది.  40 ఫీట్ల ర‌హ‌దారిపై అడ్డంగా ఐర‌న్ ఫ్రేమ్‌తో నిర్మించిన 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని తొల‌గించి ర‌హ‌దారిని క్లీయ‌ర్ చేసింది. అలాగే 40 ఫీట్ల ర‌హ‌దారిని ప‌ట్టించుకోకుండా.. నిర్మించిన మ్యాంగో ఫుడ్ కోర్టును కూడా తొల‌గించింది. మ‌రో చోట 40  ఫీట్ ర‌హ‌దారిపై నిర్మించిన యూనో ఫుడ్ కోర్టును కూడా తొల‌గించి.. మార్గం సుగ‌మం చేసింది. 40 ఫీట్ల ర‌హ‌దారిని క‌లిపేసి నిర్మించిన పెట్రోల్ బంక్‌ను కూడా పాక్షికంగా తొల‌గించింది. రెండు చోట్ల  25 ఫీట్ల ర‌హ‌దారుల‌పై ఏర్పాటు చేసిన 40 వ‌ర‌కూ ఉన్న ఫుడ్ కంటైన‌ర్ల‌తో పాటు చైనా ఫుడ్ కోర్టుల‌ను తొల‌గించి మార్గాల‌ను క్లియ‌ర్ చేసింది.  40 ఫీట్ల ర‌హ‌దారిపైకి జ‌రిగి నిర్మించిన ఆసుప‌త్రి భ‌వ‌నం సెల్లార్ ర్యాంపుల‌ను హైడ్రా   తొల‌గించింది. ఇలా మొత్త‌మ్మీద 7 చోట్ల ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించి నిర్మించిన ప‌లు క‌ట్ట‌డాల‌ను తొల‌గించింది. ర‌హ‌దారుల హ‌ద్దుల‌ను నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు లే ఔట్‌లోని ర‌హ‌దారులను హైడ్రా పున‌రుద్ధ‌రించ‌డంతో అక్క‌డి ప్లాట్ య‌జ‌మానులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

సౌదీ బస్సు ప్రమాదం..ఒకే కుటుంబంలో ఏకంగా 18 మంది మృతి

ఏడ‌వ‌డానికి కూడా మ‌నుషులు మిగలకుండా ఓ కుటుంబం మొత్తం మృత్యు ఒడికి చేరింది. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో ఆ కుటుంబంలో మిగిలిన ఒకరిద్దరిలో కూడా.. తాము ఇంక ఎవరి కోసం, ఎందుకోసం బతకాలన్న నైరాశ్యం. వైరాగ్యం. చ‌నిపోయాక అంద‌రూ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లే వాళ్లే. కానీ..  ఒకేసారి అంద‌రూ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతే ఇక ఆ కుటుంబ‌మే లేకుండా పోతుంది. అదే జ‌రిగింది హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ కి చెందిన న‌సీరుద్దీన్ కుటుంబంలో. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి న‌సీరుద్దీన్ కుటుంబం న‌వంబ‌ర్ 9న సౌదీకి వెళ్లారు. ఆయ‌న భార్య అత్త‌ర్ బేగం, కొడుకు స‌ల్లావుద్దీన్, అత‌డి భార్య ఫ‌లానా.. వీరి ముగ్గురు పిల్ల‌లు జైన్,  ఫ‌రీదా, శ్రీజ ఉన్నారు. అలాగే న‌సీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ అమెరికాలో ఉంటాడు. అత‌డి భార్య స‌న‌, వీరి ముగ్గురు పిల్ల‌లు మొహ‌రీన్, మోజా, అజ‌ర్ సైతం యాత్ర‌కు వెళ్లారు.  నజీరుద్దీన్ కి ఇద్ద‌రు కొడుకులు.. ముగ్గురు ఆడ‌పిల్ల‌లున్నారు. వారు అమీనా బేగం, షమీనా బేగం, రిజ్వానా బేగం. వీరు సైతం హ‌జ్ యాత్ర‌కు వెళ్లారు. అమీనా బేగం కూతురు హనీష్ కూడా వీరితో పాటు వెళ్లారు. ఇక‌ షబానా బేగం కుమారుడు జాఫర్ సైతం యాత్ర‌కు వెళ్లాడు. రిజ్వానా బేగం పిల్లలు మరియాన, సహజ కూడా ఉమ్రాకు వెళ్లారు. ఈ మొత్తం 18 మంది ఒకేసారి సౌదీలో జరగిన ఘోర బస్సు   ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతి చెందారు.   దీంతో విద్యాన‌గ‌ర్ ప్రాంత‌మంతా ఒక్క‌సారిగా విషాద చ్ఛాయ‌ల్లో కూరుకుపోయింది. ఒక చెట్టు నుంచి ఒక ప‌క్షుల గుంపు గుంపే ఎగిరిపోతే ఆ చెట్టు ఎంత బోసిపోతుందో.. ఒక ప్రాంతం నుంచి ఇంత మంది పెద్దా చిన్నా మొత్తం ప్రాణాలు కోల్పోతే.. ఆ ప్రాంగ‌ణం మాత్ర‌మే కాదు, ఆ  ప్రాంత‌మంతా కూడా  ఒక్క‌సారిగా స్మ‌శాన  వైరాగ్యం అలుముకుంటుంది. ప్ర‌స్తుతం ఇక్క‌డి ప‌రిస్థితి అలాగే ఉంది.  ఇంట్లోని అంద‌రూ ఒక్క‌సారిగా వెళ్లిపోతే.. మిగిలిన ఆ ఒక‌రిద్ద‌రికి ఏం చేయాలో పాలు పోని ప‌రిస్థితి ఎదురు కాక త‌ప్ప‌దు. ఇది జీవితాంతం వెంటాడి వేటాడే విషాదం. ఇది విద్యాన‌గ‌ర్ ప్రాంతానికే కాదు హైద‌రాబాద్ మొత్తం అలుముకున్న విషాదం.  బస్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన 45 మందిలో.. 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డం ఒక విషాదం కాగా.. వారిని క‌డ‌సారి చూసుకోడానికి కూడా వీల్లేని విధంగా మ‌దీనాకు స‌మీపంలోని స్మ‌శానంలో అంత్యక్రియ‌లు నిర్వ‌హించ‌డం మ‌రో దారుణం. ఇది ప‌గ‌వాడికి కూడా రాకూడని  దుస్థితి.. వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూర్చాల‌ని మ‌న‌మంతా క‌ల‌సి ఆ భ‌గ‌వంతుడ్ని ప్రార్ధించ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌గ‌లం.

హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం

హైదరాబాద్‌ నగరంలో ఆదాయపు పన్ను శాఖ   విస్తృత సోదాలు కలకలం రేపుతున్నాయి.  మంగళవారం (నవంబర్ 18)  తెల్లవారు జాము నుంచి ఐటీ అధికారులు  నగరంలోని ప్రముఖ హోటల్ వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నాయి. మొత్తం 15 ప్రాంతాల్లో  ఏకకాలంలో ఈ ఐటీ సోదాలు సాగుతున్నాయి.  పాతబస్తీలోని పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ పై ఐటీ దృష్టి సారించింది. ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ హోటల్స్ ఆదాయంపై అసమానతలు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో  ఈరెండు హోటల్‌లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్య భాగస్వాముల ఇళ్లలో  కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హోటల్ రంగంలో భారీ స్థాయిలో జరుగుతున్న లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవడంతో ఈ దాడులు  నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరవ్యాప్తంగా జరుగు తున్న ఈ సోదాల్లో అధికారులు బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల రికార్డులు, డిజిటల్ డేటా, అకౌంటింగ్ వివరాలు, డాక్యుమెంట్లు వంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం.   

తెలంగాణపై చలిపులి పంజా

తెలంగాణను కోల్డ్ వేవ్ కమ్మేసింది. నిన్నమొన్నటి వరకూ ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలమైన జనం ఇప్పుడు చలి పులి పంజాకు చిక్కుకుని గజగజలాడుతున్నారు.  తెలంగాణలో నాలుగైదు రోజులలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల వరకూ పడిపోతున్నాయి. రానున్న రెండు రోజులలో చలితీవ్రత మరింత అధికమౌతుందంటున్నది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది.   చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు  జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.    ఈ  నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.   చలి తీవ్రత రానున్న రెండు మూడు రోజుల్లో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.   రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారుప్రాంతాల్లో చలి మరీ అధికంగా ఉంది. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు గ్రేటర్‌ పరిధిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. రానున్న రెండు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో చలి తీవ్రత మరీ అధికంగా ఉంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ లో ఆదివారం రాత్రి అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.1 డిగ్రీలు రికార్డయ్యింది.

సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సౌదీ అరేబియాలో సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన  45 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.   కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎమ్ఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందాన్ని తక్షణమే సౌదీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. మృత దేహాలను అక్కడే ఖననం చేయాలని, ఇందుకోసం బాధిత కుటుంబాల్లో ఇద్దరిని చొప్పున సౌదీ తీసుకు వెళ్ళాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొంది. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని పేర్కొంది.  కాగా సౌదీ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించిన దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన మృతుల కుటుంబాలను తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.   ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తాయని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. అలాగే సౌదీ ప్రమాదంలో 45 మంది తెలంగాణ వాసులు మరణించడం పట్ల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదం తన హృదయాన్ని కలచివేసిందని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాగా  ఈ ప్రమాద ఘటనపై  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన చంద్రబాబు పవిత్ర ఉమ్రా యాత్రలో తెలంగాణకు చెందిన మన సోదర సోదరీమణులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సౌదీ బస్సు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కూడా సౌదీ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీ అరేబియాలో  సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున జరిగిన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించినట్లు తెలంగాణ హజ్ కమిటీ అధికారికంగా ధృవీకరించింది. పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన వీరి ప్రయాణం విషాదాంతంగా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేసింది  మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉండటం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. ఈ దుర్ఘటనతో హైదరాబాద్ నగరంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఇలా ఉండగా  హైదరాబాద్ లోని రాంనగర్ లో నివసించే నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కుటుంబ యజమాని నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్   ఉద్యోగరీత్యా  అమెరికాలో ఉంటుండటంతో ఆయన ఒక్కరే ఈ యాత్రకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ ఘోర ప్రమాదంలో సిరాజుద్దీన్ కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరివాడయ్యారు.  

నితీష్ నేతృత్వంలో బీహార్లో 20న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

బీహార్‌లో ఎన్డీఏ గ్రాండ్ విక్టరీ తర్వాత కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరుతుందనే  చర్చకు ఎండ్ కార్డ్ పడింది.  బీహార్ లో కొత్త సర్కార్ ఏర్పాటుకూ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న నితీష్ నాయకత్వంలో బీహార్ లో  మళ్లీ ఎన్డీయే సర్కార్ కొలువుదీరనుంది.  దీంతో వరుసగా పదో సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే.  ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం  పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌ వేదిక కానుంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ  హాజరుకానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.  ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభను ఈ నెల 19న రద్దు చేయనున్నారు. అదే రోజు నితీష్‌ కుమార్ రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాతి రోజే మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం చేస్తారు. మరోవైపు ఎన్డీయే పార్టీలోని చిన్న పార్టీలు ఇప్పటికే తమకేం కావాలో బీజేపీ పెద్దలకు తెలియజేశాయి. అయితే హిందూస్థానీ అవామీ మోర్చా పార్టీ నుంచి మాత్రం వినూత్న ప్రకటన వచ్చింది. తాము ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని.. తమకు మంత్రి పదవి వచ్చినా.. రాకపోయినా బీహార్ ప్రజల కోసం పనిచేస్తామని తెలిపింది.   ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు దక్కుతాయి, ఏ శాఖ ఎవరికి దక్కుతుంది అన్న విషయంపై సస్పెన్స్ గా మారింది.   ఈ ఎన్నికలో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ19, హిందూస్థానీ అవామ్ మోర్చా 5, రాష్ట్రీయ లోక్‌ మోర్చా 4 సీట్లు గెలుచుకున్నాయి.  కేబినెట్ కూర్పుపై ఇప్పటికే భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు జరిగాయని సమాచారం.   

సజ్జనార్ కు ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు

సినిమాల పైరసీతో తెలుగుచలనచిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లేల చేసిన ఐబొమ్మ రవి అరెస్టు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను, పోలీసులను అభినందించారు.  డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించిన సినిమాలను ఇలా విడుదల అవ్వగానే అనే  ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ఐబొమ్మ రవి వంటి వారి వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నదని పేర్కొన్న పవన్ కల్యాణ్..   సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఒక పోస్టు షేర్ చేసిన పవన్ కల్యాణ్..  పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి,  వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామంగా అభివర్ణించారు.  పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి ఐబొమ్మ నిర్వాహకుడు వచ్చాడనీ, అటువంటి వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేయడం ముదావహమన్నారు.  బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్న సజ్జనార్ ను ఆయనీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.  సజ్జనార్ తో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారని గుర్తు చేసుకున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకు వచ్చిందన్నారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఇమ్మడి రవి మామూలోడు కాదు.. సజ్జనార్ నోట సంచలన విషయాలు!

ఇమ్మడి రవి.. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు మార్మోగుతోంది. రిలీజ్ అయిన సినిమాను రిలీజైనట్లుగానే నెట్ లో పెట్టేసి కోట్లు దండుకున్న ప్రముఖ పైరసీకారుడు. అతడి నేరం పైరసీ ఒక్కటే అనుకున్నారింత కాలమూ. అయితే ఆయన నేరాల చిట్టా చాల పెద్దదే ఉందంటున్నారు. బెట్టింగ్ యాప్ ల నుంచి మారుపేరుతో డ్రైవంగ్ లైసెన్సు, పాన్ కార్డులు పొందడం నుంచీ వేల సంఖ్యలో సబ్ స్క్రైబర్ల డేటా చోరీ చేయడం వరకూ ఐబొమ్మ రవి నేరాల చిట్టా చాలా పెద్దేదే ఉంది. ఈ వివరాలన్నీ హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరానికి చెందిన రవి.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అంతే కాదు అతడి పాన్ కార్డు కూడా ప్రహ్లాద్ అనే పేరుమీదే ఉంది. తొలి నుంచీ కూడా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఐబొమ్మ రవి, ఎంతో ముందు చూపుతో కరేబియన్ ఐలాండ్ పౌరసత్వం కూడా తీసుకున్నాడు.   ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు. తన పైరసీ నెట్ వర్క్ ను విస్తరించుకున్నాడు. అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లు పెట్టి.. టెలిగ్రామ్ యాప్ లో కూడా పైరసీ సినీమాలను అప్ లోడ్ చేశారు. ఈ పైరసీ ముసుగులో అన్లైన్ బెట్టింగ్ నూ ప్రమోట్ చేశాడు.   అదెలా అంటే.. ఐ బొమ్మ సైట్ ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు. అంతే కాదు.. ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చి పోలీసులు అతగాడి కోసం గాలింపు చేపడితే..  దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ చాలెంజ్ చేశాడు.  అయితే పోలీసులు వదలలేదు.. నెలల పాటు శ్రమించి, అతడి ఆచూకీ శోధించి ఎట్టకేలకు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు.  ఇక ఐబొమ్మను ఎంకరేజ్ చేసి ఫ్రీగా సినిమాలు చూసిన వారి డేటా మొత్తం చోరీ చేశాడు.  ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మ ను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీ కి గురైంది. ఈ వివరాలన్నీ సజ్జనార్ వెల్లడించిన తరువాత ఇంత కాలం ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసిన వారిలో ఆందోళన మొదలైంది. సినీ ప్రముఖులు చిరంజీవి సహా అందరూ ఐబొమ్మ రవి అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లేలా చేసిన ఐబొమ్మ రవి అరెస్టు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. పోలీసు శాఖకు కృతజ్ణతలు చెబుతున్నారు. అంత వరకూ బానే ఉంది. కానీ ఐబొమ్మ సబ్ స్క్రైబర్ల డేటా చోరీ ద్వారా ఇటు జనాలనూ దగా చేశాడు రవి.  సబ్ స్క్రైబర్ల డేటా అమ్ముకోవడం ద్వారా సంపాదించిన సొమ్ముతోనే  పెద్ద పెద్ద సర్వర్లను మెయిన్ టైన్ చేశాడు రవి. ఆ రకంగా చూస్తే సినిమా వాళ్ల కంటే జనమే ఎక్కువ నష్టపోయారని సజ్జనార్ చెబుతున్నారు. 

ఐ బొమ్మ ర‌వికి భార్యే బొమ్మాళి?

పెళ్లాం చెబితే వినాలి అంటారు. ఐ బొమ్మ నిర్వాహ‌కుడు ఇమ్మ‌డి  ర‌వి పెళ్లాం చెప్పింది విన‌క పోవ‌డం వ‌ల్లే  అడ్డంగా బుక్ ఐపోయాడా? అంటే అవుననే అనాల్సి వస్తోంది. ఇమ్మ‌డి ర‌వి ఫ్రాన్స్ లో ఉంటాడు. అత‌డి భార్య తో అత‌డికి విబేధాలున్నాయి. దీంతో అత‌డు న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో ప‌డ్డాడు. ఎలాగైనా స‌రే వాటి నుంచి బ‌య‌ట ప‌డ్డానికి ప్ర‌త‌య‌త్నం చేసిన అత‌డు ఇండియా వ‌చ్చాడు. ఇలాంటి అనైతిక‌ప‌రులు కూడా న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల నుంచి బ‌య‌ట  ప‌డాల‌నుకుంటారా? అన్న మాట అటుంచితే.. ఈ విష‌యం గుర్తించిన ర‌వి భార్య‌, అత‌డి జాడ పోలీసుల‌కు చూపించేసింది. దీంతో అత‌డ్ని అరెస్టు చేసి రిమాండ్ కి త‌ర‌లించారు పోలీసులు. ఇక్క‌డ  అంద‌రూ అంటోన్న మాట ఏంటంటే ఎంత వాళ్ల‌యినా స‌రే పెళ్లాం చెబితే వినాలి. భార్య‌ని కాద‌ని బ‌తికి బాగు ప‌డ్డ వారు చ‌రిత్ర‌లో లేరు అన్న కామెంట్లు చేస్తున్నారు. క‌నీసం భార్య‌తో సెటిల్మెంట్ చేసుకుని ఉన్నా స‌రిపోయేది త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు ఉన్నా  సెటిల్ చేసుకోకుండా ఇక్క‌డి పోలీసుల‌తో ఎదురు తిరిగిన‌ట్టు భార్య‌తోనూ ఎదురు తిర‌గాల‌ని ట్రై చేసిన ర‌వి తాను తీసిన గోతిలో తాను ప‌డడం  చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అప్ప‌టికీ ర‌వి అకౌంట్లో కోట్లాది రూపాయ‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందులో కొంత భాగ‌మైన భార్య‌కు ఇచ్చి వ్య‌వ‌హారం చ‌క్క పెట్టుకోకుండా ఇలా బుక్ అయిపోయాడేంట‌ని జ‌నం ఒక‌టే గుస గుస‌. ర‌వి ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే ఇప్ప‌ట్లో ఇత‌డు చిక్క‌డ‌న్న నిర్దార‌ణ‌కొచ్చారు సామాన్య జ‌నం. కానీ ఇక్క‌డే అత‌డి త‌ల‌రాత తిర‌గ‌బ‌డింది. బలవంతమైన సర్పం చ‌లి చీమ‌ల చేత చిక్కి చస్తుందని సమతీశతకంలో చెప్పినట్లుగా ఎంత తెలివిగ‌ల‌వాడైనా స‌రే ఒక్కోసారి త‌మ‌కు అత్యంత ద‌గ్గ‌ర్లో ఉండే భార్య‌ల ముందు బొక్క‌బోర్లా  ప‌డుతుంటాడ‌న‌డానికి ఐబొమ్మ రవి అరెస్టు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని అంటున్నారు చాలా మంది.

తెలంగాణ స్పీకర్ పై సుప్రీం సీరియస్

ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారల్లోగా నిర్ణయం తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు గడువు నిర్దేశించింది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు గతంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను గతంలోనే ఆదేశించింది.  అయితే ఆ సమయం పూర్తయినా స్పీకర్ నిర్ణయం తీసుకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ  బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సోమవారం విచారించిన సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఎమ్మెల్యేల అనర్హతపై రోజు వారీ విచారణ జరిపి.. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.   ఎమ్మెల్యేల అనర్హతపై  మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం ప్రకటించాలని సూచించినా.. ఆలస్యం చేయటం పైన సుప్రీం కోర్టు సీరియస్ అయింది.  విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. అప్పటి లోగా అనర్హతపై నిర్ణయం తీసుకుంటారా? లేక మేం తీసుకోవాలా? అంటూ ప్రశ్నించింది.దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది నాలుగువారాలలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేస్తామని చెప్పారు.  

రజనీ, బాలయ్యలకు ఇఫీ సన్మానం ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

ప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలను ఇఫీ సన్మానించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలో  గోవా వేదికగా జరగనున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ వేడులలలో వీరిని సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన  ఈ ఇరువురీ చలనచిత్ర పరిశ్రమలో అర్ధశతాబ్ధ ప్రయాణం పూర్తి చేసుకున్నారన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీరిని సన్మానించనున్నట్లు తెలిపారు.  రజనీకాంత్, బాలకృష్ణ  50 ఏళ్ల సినీ ప్రస్థానం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైలు రాయిగా పేర్కొన్న ఆయన..  వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నట్లు తెలిపారు.  ప్రతిష్ఠాత్మక ఇఫి వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి.

ఐబొమ్మ రవి అరెస్టు.. సజ్జనార్ కు చిరంజీవి సహా సినీ ప్రముఖుల ధ్యాంక్స్

తెలుగు సినీ పరిశ్రమ ఉనికికే ముప్పుగా ఐబొమ్మ వెబ్ సైట్ పరిణమించిన సంగతి తెలిసిందే. అటువంటి ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేయడంతో టాలీవుడ్ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఐబొమ్మ రవిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు నేడు అతడిని పోలీసు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ  నేపథ్యంలో ఐబొమ్మ రవిని  అరెస్టు చేసినందుకు సినీ ప్రముఖులు సీపీ సజ్జనార్ ను కలిసి థ్యాంక్స్ చెప్పారు.  మెగా స్టార్ చిరంజీవి,  నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు సోమవారం (నవంబర్ 17)న సీపీ సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు పోలీసుల పనితీరును ఈ  ప్రశంసించారు. కాగా ఆ తరువాత సీజీ సజ్జనార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా వీరు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జనార్ రవిని అరెస్టు చేసిన సమయంలో ఆయన వద్ద నుంచి మూడు కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. అయితే సినిమాల పైరసీ ద్వారా ఐబొమ్మ రవి 20 కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు తమ  వద్ద సమాచారం  ఉందని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మరింత లోతైన దర్యాప్తు జరుపుతామన్నారు. రవి అరెస్టు సందర్భంగా అతడి నుంచి కొన్ని హార్డ్ డిస్క్ లు, లాప్ టాప్ సీజ్ చేశామన్నారు. రవి వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లలో దాదాపు 21 వేల సినిమాలు ఉన్నాయన్నారు. అలాగే దాదాపు 50 వేల మంది సబ్ స్క్రైబర్ల డేటా కూడా ఉందని చెప్పిన సజ్జనార్.. ఇది చాలా ప్రమాదకరమన్నారు.  కాగా సినిమాల పైరసీ మాత్రమే కా కుండా.. రవి భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ న కూడా ప్రమోట్ చేసినట్లు సజ్జనార్ తెలిపారు. రవికి సంబంధించి ఎవరివద్దనైనా ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. 

ఆంధ్రా కాశ్మీర్ ఎక్కడుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ కూ ఒక కాశ్మీర్ ఉంది తెలుసా? ఏటా పెద్ద సంఖ్యలో పర్యటకులు ఇక్కడకు తరలివస్తుంటారు. ఆంధ్రాకాశ్మీర్ కు పర్యాటకులు వెల్లువెత్తేందుకు ఒక సీజన్ ఉంది. ఔను శీతాకాలంలో ఆంధ్రాకాశ్మీర్ ను వెతుక్కుంటూ పర్యాటకులు తరలివస్తారు.  చల్లటి వాతావరణం లో మరింత చలి ప్రదేశాలను సందర్శించాలని పర్యాటకులు భావిస్తుంటారు. ఇంతకీ ఆ ఆంధ్రాకాశ్మీర్ ఏదంటే.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత చలి ప్రాంతంగా ప్రాచుర్యం పొందిన లంబసింగి. ఔను ఉమ్మడి విశాఖ జిల్లాలోని లంబసింగిని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. శీతాకాలంలో ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. చలితిరగడంతో ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది.    ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న లంబసింగిలో   250 కుటుంబాలు నివసిస్తున్నాయి. అటువంటి చిన్న గ్రామమైన లంబసింగికి ఏటా   పది పదిహేను లక్షల మంది పర్యాటకులు  వస్తుంటారు.  శీతాకాలంలో సగటున రోజుకు పది నుంచి 20వేల మంది ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాక చలి తీవ్రత అధికంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి జనవరి మధ్య శీతాకాలంలో ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించడానికే పర్యాటకులు పోటెత్తుతుంటారు.  అసలు ఇక్కడ ఎందుకు ఇంత చలి ఉంటుందీ అంటే.. పలు కారణాలు చెబుతుంటారు.  ఈ గ్రామం రెండు కొండల మధ్య ఉండటం,  సహజంగా ఏటవాలుగా ఈ గ్రామంలోకి చలిగాలి రావడం మేఘాలు లోపలకు చొచ్చుకు వచ్చే  అవకాశం లేకపోవడంతో వాతావరణం చల్లగా ఉంటుంది.  దీంతో సహజంగా శీతాకాలంలో కనిపించే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు అవుతుంటాయి అయితే ఈ గ్రామానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయి.  లంబసింగి గ్రామంలో  శీతాకాలం నాలుగు నెలల పాటు చలి తీవ్రత  అధికంగా ఉంటుంది.  ఇక్కడ  మైనస్  డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం కద్దు. సీతాకాంలో సాధారణంగా  ఉదయం 10 గంటల వరకు సూర్యుడు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడు.  దీంతో చలి తీవ్రతతో పాటు చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు సుతిమెత్తగా తాకే  దృశ్యం ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3280 అడుగుల ఎత్తులో ఉంటుంది.   ఈ ప్రాంతంలో పర్యాటన శాఖతో పాటు   ప్రైవేట్ రంగంలో కూడా రిసార్ట్లు హోటల్స్ రావడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది.   నవదంపతులు లంబసింగిని హనీమూన్ స్పాట్ గా భావిస్తున్నారు.  ఇటీవలీ కాలంలో ఒడిస్సా ఛతిస్గడ్ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర నుంచి నూతన జంటలు పెద్ద సంఖ్యలో లంబసింగికి వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.  లంబసింగి విశాఖ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖ నుంచి నర్సీపట్నం వరకు 100 కిలోమీటర్లు మైదాన ప్రాంతంలో ప్రయాణం చేస్తే మిగిలిన 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది.    వెండి మబ్బుల పాల సంద్రం..  చెరువుల వెనం ఇక లంబసింగి పరిసరాల్లో కూడా బోలెడన్ని సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో  ఇండియా స్విట్జర్లాండ్ గా చెప్పుకునే చెరువుల వెనం గ్రామం ఒకటి.  లంబసింగికి  కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కొండ ఎగువనున్న ఈ గ్రామంలో ఉదయం 10 గంటల వరకు మంచు మేఘాలు, పాలసముద్రంలా కనిపిస్తాయి.  దీంతో చాలామంది పర్యాటకులు తెల్లవారుజామున లంబసింగి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆనందపరవశులౌైతారు.  ఇటీవలే ఏపీ టూరిజం అక్కడకు స్థానిక గిరిజనుల ద్వారా నేరుగా వాహనాలను నడుపుతోంది దీంతో వయసు పైబడిన వారు కూడా ఈ ప్రకృతి అందాలను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.   అలాగే లంబసింగికి సమీపంలో  ఉన్న తాసంగి రిజర్వాయర్ కూడా తప్పనిసరిగా వీక్షించాల్సిన దర్శనీయ స్థలం. ఇక్కడ రిజర్వాయర్ దాటుతూ జిప్ లైన్ ఏర్పాటు చేశారు.  రిజర్వాయర్ పైనుంచి జిప్ లైన్ లో  వెళ్లడం ఒక ప్రత్యేక అనుభూతిగా పర్యాటకులు చెబుతారు.  ఇక ఈ ప్రాంతంలోని చారిత్రాత్మక అవశేషాలు కూడా పర్యాటకులకు ఆసక్తికలిగిస్తాయి.  స్వతంత్ర పోరాట సమయంలో అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్టు ఆనవాళ్లు ఉన్నాయి ఇక్కడకు సమీపంలో రూథర్ఫర్డ్ అనే బ్రిటిష్ మేజర్ నివాసం ఉందనీ, అక్కడే  అల్లూరి సీతారామరాజును మట్టుపెట్టినట్టు చరిత్ర చెబుతోంది దీనికి తగ్గట్టు ఇప్పటికీ రూథర్ఫర్డ్ నివాసం ఉన్న గెస్ట్ హౌస్, శిబిరాలు కనిపిస్తాయి. ఇక మహాభారత కాలంలో పాండవులు కూడా ఇక్కడ సంచరించినట్టు స్థానికులు చెప్తుంటారు ఇక్కడ గిరిజన ప్రజల సంప్రదాయాలు నివాస వ్యవహారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి స్థానికుల థింసా  డాన్స్ మరొక ప్రత్యేక ఆకర్షణ.  స్థానిక గిరిజనులతో పాటు పర్యాటకులు థిసా డాన్స్ చేస్తూ ఆనందపరవశులు కావడం కద్దు. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఏపీ టూరిజం ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేసింది.  ఇతర హోటల్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి.  ఒకప్పుడు పరిమితంగా వచ్చే పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి.  చల్లని వాతావరణంలో వేడి వేడి టీ... టిఫిన్ లాంటి వంటకాలతో పాటు బెంబు చికెన్ ఇక్కడ పర్యాటకులు అత్యంత ఇష్టపడే వంటకం.  గిరిజనుల ఇళ్లల్లో కూడా నివాసం ఉండే రీతిన హోం స్టే లను   పర్యాటకశాఖ ఏర్పాటు చేసింది. ఇవి అదనపు ఆకర్షణగా మారాయి. 

భవిష్యత్ లో జ్ణానపీఠ్, పులిట్జర్ స్థాయికి రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు.. చంద్రబాబు

రామోజీరావును ఎక్స్ లెన్స్ కు ప్రతిరూపంగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. రామోజీ జయంతి సందర్భంగా ఆదివారం (నవంబర్ 16) రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ప్రసంగిస్తూ.. రామోజీరావు స్ఫూర్తితో తెలుగుభాష పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. రామోజీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు.  రామోజీ జయంతి సందర్భంగా ఆ అక్షరయోధుడికి ఘన నివాళులర్పిస్తున్నానన్న చంద్రబాబు  రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు.   రామోజీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధం అన్న చంద్రబాబు  ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు.  ఆయన జీవితంలో ఏ వ్యక్తిని చిన్న ఫేవర్ అడగిన సందర్భం లేదన్నారు. జనహితం కోసం ఏ పార్టీ నాయకులతోనైనా నిర్మొహమాటంగా మాట్లాడేవారనీ, నిఖార్సయిన జర్నలిజంతో తెలుగుభాషకు ఆయన చేసిన చేవలు చిరస్మరణీయమనీ చంద్రబాబు చెప్పారు.  ప్రతిపక్షం బలహీనంగా ఉంటే తానే అపోజిషన్ గా ప్రజల తరఫున పనిచేస్తానని రామోజీరావు చెబుతుండేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.   ఐదు దశాబ్దాలుగా విశేష ప్రజాదరణతో ఈనాడు నడుస్తోందంటే అందుకు రామోజీరావు సంకల్పమే కారణమన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా విలువల విషయంలో రామోజీ ఎన్నడూ రాజీ పడలేదనీ, ప్రజాహితం కోసం ప్రభుత్వాలతో పోరాడారనీ చంద్రబాబు అన్నారు.  50 ఏళ్ల తర్వాత ఏం చేయాలో ఆయన ఇవాళే ఆలోచించే దార్శనికత రామోజీ సొంతమన్న చంద్రబాబు.. ఆయన దూరదృష్టికి  రామోజీ ఫిల్మ్ సిటీ నిదర్శనమన్నారు.  జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సేవారంగం, కళలు, సంస్కృతి, యువ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారతలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డులు ఇవ్వడం స్పూర్తిదాయకమన్న చంద్రబాబు . ఈ రామోజీ  ఎక్సలెన్స్ అవార్డు భవిష్యత్తులో జ్ఞానపీఠ్, పులిట్జర్ స్థాయికి చేరుకోవాలని  చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలం గాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌ నాయుడు, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.