బౌలర్ల వైఫల్యం.. పేలవ ఫీల్డింగ్!
posted on Dec 4, 2025 5:59AM
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా బుధవారం (డిసెంబర్ 3) జరిగిన రెండో మ్యాచ్‌లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. అయితే 359 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. దీంతో వన్డే సిరీస్ లో భారత్, దక్షిణాఫ్రికాలు 1-1తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి భారత బౌలర్ల వైఫల్యం, పేలవ ఫీల్డింగ్ కూడా కారణం.
టాస్ కోల్పోయి భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టాల్సి రావడంతోనే మ్యాచ్ విజయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే శీతాకాలం కావడంతో రాత్రి వేళలో విపరీతంగా మంచుకురుస్తుంది. దాంతో బౌలర్లకు బంతిపై గ్రిప్ దొరకదు. అలాగే ఫీల్డర్లూ మంచులో తడిసిన బంతిని ఆపడం, క్యాచ్ పట్టడం కష్టమౌతుంది. బాల్ చేతుల్లోంచి జారి పోతుంది.
తొలి వన్డేలో కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పటికీ.. సౌతాఫ్రికా టాప్ ఆర్డర్డ్ ను బౌలర్లు మంచు ప్రభావం కనిపించడానికి ముందే పెవిలియన్ కు పంపడంతో విజయం సాధ్యమైంది. అయితే రెండో వన్డేలో ఆలా జరగలేదు. అంతే కాకుండా..తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ డెత్ ఓవర్లలో పరుగులు వేగంగా రాబట్టలేకపోవడం కూడా ఒక కారణం. చివరి పది ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 74 పరుగులే చేసింది. అలా కాకుండా మరో పాతిక ముఫ్ఫై పరుగులను చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఇక టీమ్ ఇండియా బౌలర్లు ఘోరంగా విఫలమవ్వడం టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఆ తరువాత పేలవ ఫీల్డింగ్ క్యాచ్ డ్రాప్ లు కూడా భారత ఓటమికి కారణమయ్యాయి. ముఖ్యంగా యశస్వి జైసవాల్ మార్క్‌రమ్ క్యాచ్‌ను డ్రాప్ చేయడం చాలా కాస్ట్లీగా పరిణమించింది. మార్కరమ్ 53 పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన సులభమైన క్యాచ్ ను యశస్వియాదవ్ నేలపాలు చేశారు. ఈ తరువాత మార్కరమ్ సెంచరీ చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్ కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి అని చెప్పవచ్చు. ఇక టీమ్ ఇండియా ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. భారత ఆటగాళ్లు మిస్ ఫీల్డింగ్, ఓవర్ త్రోలతో చేజేతులా మ్యాచ్ ను దక్షిణాఫ్రికాకు అప్పగించారు.