తాత దారికి భిన్నంగా వెళ్లి సంచలనం సృష్టించిన యువ కెరటం!!
posted on Oct 25, 2019 @ 3:13PM
మహారాష్ట్రకు కొత్త కుర్రాడొచ్చాడు. ఇరవై తొమ్మిది ఏళ్ల కుర్రాడు ఈ ఎన్నికల్లో చరిత్ర సృష్టించాడు. ఠాక్రే వారసుడిగా తొలిసారి ఎన్నికల్లో పాల్గొనడమే కాదు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేవలం వర్లీ నియోజకవర్గంలోనే కాదు ఆదిత్య ఠాక్రే ప్రభావం మహారాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. యువకుడిగా యూత్ ఓటర్లను ఆకట్టుకున్నారు.
శివసేనను బాల్ ఠాక్రే పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారు. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ ఠాక్రే కుటుంబంలో ఎవరూ ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా ఠాక్రే వారసుడు ఆదిత్య ఎన్నికల్లో పాల్గొన్నారు. వర్లీ నుంచి ఘన విజయం సాధించారు. అటు మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన అదరగొట్టింది. ఈ ఎన్నికల్లో పార్టీ గణనీయంగా పుంజుకుంది. అయితే దీని వెనుక యువనాయకుడి కృషి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా యూత్ ఓటర్లను ఆకర్షించడంలో ఆదిత్య ఠాక్రే కీలకంగా వ్యవహరించారని చెప్తున్నారు. యువకుడిగా యూత్ ఓటర్లను ఆకట్టుకోవడం మాత్రమే కాదు సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకున్నారు.
పక్కా మాస్ లీడర్ గా కనిపించే ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారనగానే ఆసక్తి పెరిగింది. అయితే శివసేన బలంగా ఉన్న నియోజక వర్గాల్లో వర్లీ ఒకటి. కానీ ఇక్కడ ఆదిత్య ఠాక్రే విజయం నల్లేరు మీద నడకలా సాగ లేదు. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఆదిత్య ఠాక్రే ప్రచారం కూడా వినూత్నంగా సాగింది. తన తాత బాల్ థాక్రేకు భిన్నంగా ప్రజల్లోకి వెళ్లారు ఆదిత్య ఠాక్రే. ఒకప్పుడు దక్షిణాది నుంచి ముంబైకి వచ్చిన వాళ్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాల్ ఠాక్రే. బజావో పొంగి హఠావో లుంగీ అంటూ దాడులు చేశారు. కానీ ఆదిత్య మాత్రం తన తాత మాటకు భిన్నంగా వ్యవహరించారు. వర్లీ ఎన్నికల ప్రచారంలో లుంగీతో కనిపించారు. ఈ వార్తను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం లోనూ కీలకంగా వ్యవహరించారు.
ముఖ్యంగా శివసేన మరాఠా పార్టీ అనే ముద్ర నుంచి తప్పించేందుకు ఆదిత్య ఠాక్రే ప్రయత్నాలు చేశారు. దక్షిణాది సెటిలర్ లను ఆకట్టుకునేందుకు లుంగీ కట్టడమే కాదు పాదయాత్రలు, బస్సుయాత్రలతో అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు. తాను అందరి వాడినంటూ చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. శివసేన బలంగా ఉన్న వర్గాల్లోకి పార్టీని మరింత ధృడంగా తీసుకుళ్లారు. అయితే ఆదిత్య మేకోవర్ మార్చడంలోనూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఆదిత్య ఠాక్రే జన ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ఆరే అటవిని రక్షించాలంటూ సాగుతున్న ఆందోళనకు మద్దతు పలికారు. చెట్ల నరికివేతను అడ్డుకుంటామని చెప్పారు. ముంబైలో బెస్ట్ బస్ సర్వీసుల కోసం ధర్నాలు చేశారు ఆదిత్య ఠాక్రే. ఇలా శివసేన యువ నాయకుడిగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.
ఇక ఇప్పుడు నేరుగా ఎన్నికలలోకి రావడంతో పార్టీలో మరింత కీలకంగా మారారు. జన ఆశీర్వాద యాత్రలో దాదాపు ఐదు వేల కిలోమీటర్లు తిరిగారు. ప్రజలతో మాట్లాడారు. వారితో మమేకమయ్యారు. వర్లీ ఎన్నికల్లోనే కాదు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఆదిత్య ఫేస్ ఫ్రెష్ గా ఉంది. అందుకే ఆయనకు మద్దతు లభించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో సింగిల్ పార్టీగా ఎదుగుతామని బిజెపి భావిస్తున్న సమయంలో శివసేన పుంజుకోవడం ఆదిత్య ఠాక్రే లాంటి యువ నాయకుడు తెరపైకి రావడం ఎన్నికల్లోనూ ఆ పార్టీకి కలిసొచ్చింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఆధిత్య ప్రభావం స్పష్టంగా కనిపించింది. సీఎం పదవిని పంచుకుంటే ఆదిత్య ఠాక్రేకు ఆ అవకాశం దక్కనుందని చెబుతున్నారు. ఠాక్రే సీఎం అయితే అది సంచలనమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.