చర్చలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. సమ్మెకు ఫుల్ స్టాప్ పడనుందా?
posted on Oct 26, 2019 @ 12:41PM
కేసీఆర్ సర్కార్ వర్సెస్ ఆర్టీసీ సమ్మె అంశం ఓ కొలిక్కొచ్చేలా ఉందని అనిపిస్తోంది. మొన్నటివరకు ‘చర్చల్లేవ్.. సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ఫ్ డిస్మిస్’ అన్న సీఎం కేసీఆర్ కార్మిక సంఘాలతో చర్చలకు అనుమతించారు. విలీనం మినహా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిందిగా ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎర్రమంజిల్ లో చర్చలు జరగబోతున్నాయి.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త వేతనాల అమలు, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు ఈనెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. వీటిలో 21 డిమాండ్లు పరిష్కరించదగినవేనని, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు చేపట్టి, పరిష్కరించాలంటూ హైకోర్టు సూచించింది. ఈనెల 28న జరిగే తదుపరి విచారణ కల్లా చర్చల సారాంశాన్ని వివరించాలని ఆదేశించింది. దాంతో, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ డిమాండ్లపై అధ్యయనం చేసి పూర్తి నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్ సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సునీల్ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సమీక్షలో తేల్చారు. హైకోర్టు సూచించిన 21 డిమాండ్లలో 12 వరకు డిమాండ్లకు పెద్దగా ఆర్థికపరమైన చిక్కులు లేవన్న నిర్ధారణకు వచ్చారు. వీటిపై కార్మిక జేఏసీతో చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే.. చర్చల సందర్భంగా, కార్మిక సంఘాలు సూచించే ఇతర డిమాండ్లనూ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. ఈరోజుతోనైనా సమ్మెకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.