అప్పుడు నంద్యాలలో... ఇప్పుడు హుజూర్ నగర్ లో... కానీ ఆ తర్వాత ఎన్నికల్లోనే తారుమారు...
posted on Oct 26, 2019 @ 4:03PM
ప్రజాతీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు... ఎందుకంటే ప్రజాస్యామ్యంలో ప్రజలే అత్యంత శక్తిమంతులు... అప్పటివరకు ఎదురులేని పార్టీని కనుమరుగు చేయగలరు... కనీసం డిపాజిట్ కూడా రాని పార్టీని అందలమెక్కించగలరు... ఇది ఎన్నోసార్లు రుజువైంది... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ... విభజన తర్వాత తెలంగాణ అండ్ ఏపీలోనూ అలాంటి తీర్పులెన్నో ప్రజలిచ్చారు. 2014వరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కి... తెలంగాణ ఏర్పాటయ్యే సమయానికి కేవలం రెండే రెండు ఎంపీ సీట్లుండగా, పట్టుమని పది అసెంబ్లీ స్థానాలు కూడా లేవు. ఇక, తెలంగాణ ఇచ్చిన పార్టీగా అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంకుతోపాటు మెరుగైన స్థితిలో ఉంది. కానీ 2014 ఎన్నికల్లో పార్టీల లెక్కలు తారుమారు అయ్యాయి. అప్పటివరకు పట్టుమని పది సీట్లు కూడా లేని టీఆర్ఎస్ అధికారంలో రాగా, అప్పటివరకు పవర్ లో ఉన్న కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింది. ఆ తర్వాత 2018లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు అదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఎవరూ ఊహించనివిధంగా మూడ్నెళ్ల తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, మరో రెండు మూడు స్థానాల్లో విజయానికి దగ్గర వరకు వచ్చింది.
ఇక, ఏపీలోనూ అదే జరిగింది. కాంగ్రెస్ ను, సోనియాను ఎదిరించిన నాయకుడిగా, వైఎస్ వారసుడిగా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆనాడు జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిచంగా, టీడీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. దాంతో నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీదే అధికారమని అందరూ భావించారు. కానీ 2014లో లెక్కలు మారిపోయాయి. ప్రజలు చంద్రబాబుకి జైకొట్టారు. ఎవరూ ఊహించనివిధంగా టీడీపీకి ఘనవిజయం కట్టబెట్టారు. అయితే, బాబు అధికారంలో ఉండగా, 2017లో జరిగిన నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ, టీడీపీ నువ్వానేనా అన్నాయి. తమ పాలనపై ప్రజావ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకు చంద్రబాబు.... 2019లో అధికారంలోకి వచ్చేది తానేనంటూ... సంకేతాలు ఇవ్వడానికి హోరాహోరీగా తలపడ్డారు. అయితే, మొత్తం టీడీపీ యంత్రాంగాన్నే రంగంలోకి దించిన చంద్రబాబు... ఇంటింటి ప్రచారంతో నంద్యాలలో ఘనవిజయం సాధించారు. అయితే, వందల కోట్ల రూపాయలు వెదజల్లి అక్రమంగా గెలిచారనే వైసీపీ ఆరోపించింది. అది నిజమో కాదో తెలియదు కానీ, సరిగ్గా ఏడాదిన్నర తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం పాలైంది. ఎన్నడూలేనివిధంగా దారుణ ఫలితాలను టీడీపీకి ప్రజలిచ్చారు. అయితే, నంద్యాలలో ఏం జరిగిందో... ఇప్పుడు హుజూర్ నగర్లోనూ అదే జరిగిందని టీకాంగ్రెస్ నేతలంటున్నారు. కేసీఆర్ వందలకోట్ల రూపాయలను పంచి అక్రమంగా గెలిచిందని ఆరోపిస్తున్నారు. మరి అది నిజమోకాదో తేలాలంటే నవంబర్ లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంతోకొంత బయటపడుతుంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు రాకపోతే మాత్రం టీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ స్టార్ట్ అయ్యినట్లే భావించాల్సి ఉంటుంది.