ఆట ఇంకా మొదలు కాలేదు.. రాజధానిని అంగుళం కూడా కదిలించలేరు
posted on Feb 4, 2020 @ 1:00PM
మూడు రాజధానుల అంశం ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారికి మద్దతుగా ప్రతిపక్షాలు నిలుస్తున్నాయి. ఇక ఎవరేమన్నా.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా లేదని అంటుంది జగన్ సర్కార్. ఈ సందర్భంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. రాజధానిని అమరావతి నుండి ఒక్క అంగుళం కూడా కదిలించలేరంటూ వైసీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆట ఇంకా మొదలు కాలేదని.. వీళ్ళు తీసుకునే నిర్ణయాలకు కేంద్రం ఏకీభవించదని తేల్చి చెప్పేశారు. సరైన సమయానికి కేంద్రం ఇందులో జోక్యం చేసుకుంటుందని చెప్పారు. రాజధాని విషయంలో రాజ్యాంగపరంగా , న్యాయపరంగానే ముందుకు వెళ్తామని.. అభివృద్ధి పేరుతో జగన్ కాలయాపన చెయ్యడమే కాకుండా ఉన్న పెట్టుబడిదారులను కూడా వెనక్కి పంపుతున్నారని అన్నారు. తమ సొంత తెలివితేటలతో కమిటీలు వేసి.. ఆ రిపోర్ట్ తామే ఇచ్చి ప్రజలను మభ్యపరుస్తున్నారని విమర్శించారు. నెగటివ్ కమిటీలను కాకుండా ధైర్యంగా ఒక పాజిటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని సుజనా సూచించారు. రాజధానిగా అమరావతిని స్వయంగా మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.