స్వామి స్వరూపానంద ను టార్గెట్ చేసిన గరికపాటి 

వేదాంత జ్ఞానం రవ్వంతైనా లేని పీఠాధిపతులు రాజకీయ పార్టీల ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారే తప్ప.. అద్వైత స్వాములుగా కనబడటం లేదని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఆంధ్ర పురాణకర్త, మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి శతజయంత్యుత్సవ సభ లో గరికపాటి చేసిన వ్యాఖ్యలు సూటిగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి  స్వరూపానందేంద్ర సరస్వతి ని ఉద్దేశించి చేసినట్టు గా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.  నవరసాలు పండించిన మహాకవి మధునాపంతుల  సభలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు స్వరూపానంద ని మరో సారి వివాదాల్లోకి లాగినట్టు గానే కనిపిస్తోంది, మధునాపంతుల  కావ్యాలు ఆంధ్ర సాహిత్యంలో ప్రకంపనలు సృష్టించాయని శ్లాఘించిన గరికపాటి, హఠాత్తుగా ఆ వేదిక మీద పీఠాధిపతుల ప్రస్తావన తేవటం వెనుక జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు, అలాగే వాటిని సమర్థిస్తున్న స్వామి స్వరూపానంద వైఖరే ప్రధాన కారణం గా కనిపిస్తోంది.  అంతే  కాకుండా, విపక్ష తెలుగు దేశం తోనూ, మీడియా అధిపతి వేమూరు రాధ కృష్ణ తోనూ గరికపాటి కి ఉన్న సాన్నిహిత్యం కూడా ఆయన చేత ఆ రకంగా మాట్లాడించి ఉండవచ్చునని కూడా విశ్లేషకులు   అభిప్రాయపడుతున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం విశాఖ లో శారదాపీఠం ఏర్పాటు చేసుకున్న స్వామి స్వరూపానంద కు అద్వైత సంబంధ విషయాల్లో ఉన్న జ్ఞానం పరిమితమని గరికపాటి పరోక్షం గా చేసిన వ్యాఖ్యలు ఆధ్యాత్మిక రంగం తో అనుబంధం ఉన్న వారిలో ఆలోచన రేకెత్తించాయి. నిజానికి స్వామి స్వరూపానంద ఎన్నడూ ప్రవచనాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన సన్యాసాశ్రమం అంతా కూడా రాజకీయాలతో మమేకమైపోవటం ఒక ప్రధాన మైన అంశం గా ఆయన్ను దగ్గరి నుంచి చూసిన వారికి అనుభవైకేద్యమే. అయితే, స్వామి స్వరూపానంద దగ్గర ఉన్న గొప్ప లక్షణమేమిటంటే ..తన దగ్గరకు ఒక సారి వచ్చిన వారిని కుల, మతాలకు అతీతంగా అక్కున చేర్చుకోవటం. జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవాన్ని కూడా అక్కున చేర్చుకుని , ఆయన చేత తన పీఠం లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కుంభాభిషేకం చేయించటం ద్వారా ఒక్క సారిగా హిందూ ధార్మిక వ్యవస్థల దృష్టిని ఆకర్షించిన స్వామి స్వరూపానంద, ఆ క్రమం లో విపరీతమైన విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.  అయితే, దివంగత కాంగ్రెస్ మంత్రి, పూర్వ రాజ్య సభ్యుడు అయిన ద్రోణం రాజు సత్యనారాయణ ఒంట  పట్టించిన రాజకీయ ఎత్తుగడలు , స్వామి స్వరూపానంద ను రాటుతేలేలా చేశాయి. ఆ  తర్వాత,విశాఖ కె చెందిన కాంగ్రెస్ ప్రముఖుడు, కళాబంధు టి. సుబ్బరామి రెడ్డి సాహచర్యం  కూడా  స్వామి స్వరూపానంద కు బాగా కలిసి వచ్చింది. శ్రీ  శారదాపీఠాన్ని ఒక స్వతంత్ర పీఠంగా రాష్ట్రం లో విస్తరించడానికి ఒక వైపు అవిశ్రావంతంగా కృషి చేస్తూనే, మరో వైపు తిరుమల లోనూ, ఇతర రాష్ట్రాలు, ప్రత్యేకించి... మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో తమ పీఠం వ్యవస్థలను పరిపుష్టం చేసుకున్న స్వామి స్వరూపానంద , తన తర్వాతి పీఠాధిపతి గా స్వామి స్వాత్మానందేంద్ర ను ప్రకటించిన విధానం కూడా ఆధ్యాత్మిక వాసులను విస్తుపోయేలా చేసింది. చంద్రబాబు నివాసానికి అతిదగ్గరలో, కృష్ణా నది   కరకట్ట మీద అంగ రంగ వైభవంగా జరిగిన ఆ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు -కె చంద్ర శేఖర్ రావు, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవటమే కాకుండా, ఆ వేదిక మీదనే స్వామి స్వరూపానంద జగన్ మోహన్ రెడ్డి ని తన ఆత్మ గా అభివర్ణించటం, జగన్ నుదిటిని ముద్దాడటం కూడా రాజకీయ రంగ ప్రముఖులను విస్మయ పరిచింది.  ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు  గరికపాటి చేసిన వ్యాఖ్యలతో స్వామి స్వరూపానంద శీల పరీక్ష కు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ అధినేతనో, లేక ఆయన కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడో స్వామి ని  విమర్శించటమో,లేక ఆయనపై ఆరోపణలు చేయటమే జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక రంగంలో లబ్ధ ప్రతిష్టులైన గరికపాటి లాంటి వారిని నేరుగా రంగం లోకి దింపటం ద్వారా -ఏ బీ ఎన్ మీడియా అధిపతి రాధాకృష్ణ చేసిన దాడిని స్వామి స్వరూపానంద ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.  ఎందుకంటే,స్వామి పీఠం లో ఆద్యాత్మికత ను ప్రశ్నించటం ద్వారా , పీఠ వ్యవస్థను నడి  రోడ్డు మీద నుంచో  పెట్టి అవమానించటానికే తెలుగుదేశం అనుకూల శక్తులు, ఈ రకమైన ఎత్తుగడలకు దిగుతున్నాయని స్వామి స్వరూపానంద అనుయాయుల వాదన. నిజానికి, కాస్త అటూ ఇటూగా ..స్వామి స్వరూపానంద తో సమానంగా పీఠం నెలకొల్పిన స్వామి పరిపూర్ణానంద కు ఎదురుకానంత వ్యతిరేకతను స్వరూపానంద మూట కట్టుకుంటున్నారు. ఇది తిరుగులేని వాస్తవం.  

స్థానిక ఎన్నిక‌ల్లోనైనా పవర్ స్టార్ ప‌రువు ద‌క్కుతుందా?

స్థానిక ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాట‌డానికి ప‌వ‌ర్ స్టార్ సిద్ద‌మైయ్యారు. సినిమా స్టైల్‌లో డైలాగులు, స్రిప్ట్ ఆధారంగానే రాజ‌కీయ చ‌ర్చ‌లు, స‌మావేశాల్లో బిజీ అయిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రువు ఎక్క‌డ పోగొట్టుకున్నారో అక్క‌డే వెతుక్కుంటున్నార‌ట జ‌న‌నేత‌. క‌నీసం గాజువాక ప‌రిధిలోనైనా ఓటింగ్ శాతం పెంచుకొని ప‌రువు కాపాడుకోవ‌ల‌నే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్నార‌ట‌. స్థానిక ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు సినిమా షూటింగ్‌ను సైతం ప‌క్క‌న పెట్టి రాజ‌కీయ స‌మావేశాల నిర్వ‌హించ‌డంపై దృష్టి పెట్టారు. ఇప్పటికిపుడు అన్నీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ప్రక్రియలో తలమునకలౌతున్నారు. ముందుగా వ‌ల‌స‌ల‌పై దృష్టి పెట్టారు. విశాఖ‌ప‌ట్ట‌ణం కు చెందిన ప‌లువురు స్థానిక వైసీపీ నాయకులు, యువకులు దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని జనసేనలో చేర్చుకున్నారు. కండువాలు కల్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన సమయమని, ఈ తరుణంలో ఇంత మంది యువకులు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తునంటు త‌న‌దైన శైలిలో ఉప‌న్యాసాలు దంచుతున్నారు జ‌న‌నేత‌. ఆంధ్ర‌ప్ర‌జ‌ల్ని ఉద్ద‌రిస్తానంటూ మ‌రో సారి ఎన్నిక‌ల స‌మ‌రంలో దిగిన ప‌వ‌ర్‌స్టార్‌కు జ‌నం ఎలా స్పందిస్తారో అన్న అంశంపై రాష్ట్రంలో మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కాపు క‌మ్యూనిటీలో ప‌ట్టు వుంద‌ని చెప్పుకుంటున్న జ‌న‌సేన‌, ప్ర‌జారాజ్యం పార్టీల ప‌ట్ల గ‌తంలో ప్ర‌జ‌ల స్పంద‌న చూస్తే వాస్త‌వం ఏమిటో అర్థం అవుతుంది. 2008లో ప్ర‌జారాజ్యం పార్టీ 294 సీట్లు పోటీచేసి 17 శాతం ఓట్లు పొంది ఆ పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 6.7 శాతం ఓట్లు పొందింది. 136 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు గెలుచుకుంది. ఎ.పి.లో 17 స్థానాల‌కు పోటీ చేసి లోక్‌స‌భ‌కు 6.1 శాతం ఓట్లు మాత్ర‌మే పొందింది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో 5 శాతం కంటే త‌క్కువ ఓట్లు పొందింది. నోటా కంటే త‌క్కువ ఓట్లు జ‌న‌సేన‌కు ప‌డ్డాయి. నిజానికి రాష్ట్రానికి సంబంధించినంత వరకు మొన్నటి ఎన్నికల్లో బిజెపికన్నా జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువే. బిజెపికి కేవ‌లం 0.84 శాతం ఓట్లు వ‌చ్చాయి. అయితే జనసేనకు కొంతమంది కాపు సామాజికవర్గం ఓట్లు, మిగిలినవి అభిమానుల ఓట్లు వచ్చాయి. అంతే కానీ మామూలుగా జనాల వేసిన ఓట్లు తక్కువనే ఎన్నిక‌ల ఫ‌లితాలు చెబుతున్నాయి. ఇప్ప‌ట్టికీ జనసేనకు ఉన్న సమస్యేమిటంటే ఏ స్ధాయిలోనూ అసలు పార్టీ నిర్మాణమే జరగలేదు. ఏదో గాలివాటంగా నెట్టుకొచ్చేస్తున్నాడు జ‌న‌నేత‌. అందుకే బీజేపీతో క‌లిసి జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో త‌ల‌ప‌డాల‌నుకుంటోంది. రెండు పార్టీలు కలిసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయాలనే డిసైడ్ అయ్యాయి. అయితే వ‌చ్చిన చిక్కు ఏందంటే, బిజేపీ రాజకీయాలు ప‌వ‌ర్‌స్టార్‌కు అర్థం కావ‌డం లేద‌ట‌. బిజెపిని న‌మ్ముకొని రాజ‌కీయం చేస్తున్న జ‌న‌నేత‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కేంద్రంతో స‌ఖ్య‌త‌గా వుండ‌టం, బీజేపీ అధినాయకత్వం జగన్‌పై సాఫ్ట్‌గా ఉండటంతో ప‌వ‌ర్ స్టార్‌కు మింగుడుప‌డ‌టం లేదట‌. జగన్ బీజేపీతో స్నేహం చేస్తుంటే, స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పొరాటం చేస్తే జ‌నం ఎలా అర్థం చేసుకుంటారంటూ జనసేనాని గుర్రుగా ఉన్నారట. బిజెపి త‌న‌ను వెర్రి వెంక‌ళ‌ప్ప చేస్తున్న విష‌యం ఇంకా ప‌వ‌ర్ స్టార్‌కు అర్థం కావ‌డం లేదని జ‌నం అనుకుంటున్నారు. వైసిపికి గట్టి పోటి ఇస్తామని బిజెపి, జ‌న‌సేన‌ పార్టీల నేతలు ప్రకటించాయి. అసలు ఇంతకీ పవన్ ప్రచారానికి టైం కేటాయిస్తారా? అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా తయారైంది.

NPR రద్దు చేయ‌క‌పోతే స్థానిక ఎన్నిక‌ల్లో పోటీచేస్తాం!

24 గంటల్లో NPR రద్దు చేస్తూ ప్రకటన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలుపుతామంటూ C.M. జగన్ కి NPR,CAA వ్యతిరేక అలయన్స్ అల్టిమేటం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న NPR,CAA,MRC వ్యతిరేక‌ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ‌ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో NPR ను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు ప్రకటించడాన్ని స్వాగతించే లోపులోనే జిల్లా కలెక్టర్ ల ద్వారా ఏప్రిల్ ఒకటి నుండి NPR వివరాల సేకరణకు సంబంధించిన‌ ట్రైనింగ్ ఇవ్వడం తమకు ఓట్లేసిన ప్రజలను మోసగించడమేనని. ముస్లిం సంఘలు మండి పడుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పి కేరళ వలె NPR ను శాశ్వత ప్రాతిపదికపై నిలుపుదల చేయాలని విజ‌య‌వాడ‌లో జ‌రిగిన Alliance Against NRC NPR CAA సంఘాల సమావేశం డిమాండ్ చేసింది. అలయన్స్ రాష్ట్ర కన్వీనర్ షబ్బీర్ అహ్మద్ ఆధ్వ‌ర్యంలో ఈ స‌మావేశంలో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ లకు అతీతంగా అభ్యర్థులను నిలబెట్టి వారు గెలుపు కు ప్రజాసంఘాలు కృషి చేయాల‌ని నిర్ణ‌యించారు. NPR ను 2010 ప్రశ్నలతో చేసినా ప్రమాదమేనని అది NRC కి తొలిమెట్టు అని కేంద్రం స్పష్టంగా చెప్పిన నేపధ్యంలో NRC కి వ్యతిరేకమని ప్రకటించిన ప్రభుత్వం NPR ను పూర్తిగా నిలుపుదలచేసి తమ విశ్వసనీయతను చాటుకోవాలన్నారు. తక్షణమే రాష్ట్రంలో NPR ,CAA,NRC లను అమలు చేయబోమని అసెంబ్లీ తీర్మానం చేయాల‌ని, తీర్మానం చేసేంతవరకు‌ఈ పోరాటం ఆగదని ప్రకటించారు. లేకపోతే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన వారిగా ‌ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మిగిలిపోతారని ఈ స‌మావేశం అభిప్రాయ‌ప‌డింది. ముఖ్య‌మంత్రి స్థానిక‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటన చేశార‌ని, ఎన్నికలే లేకపోతే ఈ ప్రకటన‌కూడా వచ్చేది కాదని ఈ స‌మావేశంలో ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ‌ప్రభుత్వం అసెంబ్లీ లో NPR,NRC,CAA లను పూర్తిగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాల‌ని, సెప్టెంబరు లోపు ఎప్పుడు‌NPR నిర్వహించడానికి ప్రయత్నించినా ప్రజలు బహిష్కరించాలని స‌మావేశం పిలుపు నిచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అమరావతి గ్రామాలకు మినహాయింపు!

ప్రత్యేక కార్పొరేషన్ గా రాజధాని గ్రామాలు మరికొన్ని గ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో కలిపే ప్రతిపాదనలు ఆయా గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయిస్తూ ఆదేశాలు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ విడుదలైంది. అయితే, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోవని తెలుస్తోంది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తుండడం ఓ కారణమైతే, కొన్నిగ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండడం మరో కారణం. తుళ్లూరు మండలంలోని గ్రామాలతో పాటు నీరుకొండ, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాలను కలుపుకుని అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా, మంగళగిరి పురపాలికల్లో బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను కలపాలని, తాడేపల్లి మున్సిపాలిటీలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలను కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఆయా గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాజ‌కీయ కంపులో రాజ‌కుటుంబం

మాన్సాస్‌ ట్రస్ట్ వివాదంపై అమీతుమీకి సిద్ద‌మంటున్న రాజ‌కుటుంబం వేరే మతం వారిని చైర్మన్‌లుగా నియమిస్తారా? ప్రభుత్వ జోక్యం సరికాదంటున్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా? కుటుంబ‌స‌భ్యులే వేధిస్తున్నారంటున్నసంచైత. మాన్సాస్‌ ట్రస్ట్ వివాదం ముదురుతోంది. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నియామకంలో ప్రభుత్వ తీరుపై అశోక్‌ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం వైఖరి వింతగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు, దేవాలయం భూములపై ప్రభుత్వం కన్నేసిందని.. అందుకే దొడ్డి దారిన అర్థరాత్రి నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. వేరే మతం వారిని చైర్మన్‌లుగా నియమించడం మంచిది కాదని.. దాతల భూములు ఆలయానికే చెందాలని అభిప్రాయపడ్డారు. ట్రస్టు నిబంధనల ప్రకారం ఆడవాళ్లు పదవి చేపట్టకూడదన్నారు. అసలు జీవోలో ఏముందో బయట పెట్టకపోతే న్యాయపోరాటం చేస్తాను అన్నారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే ఎందుకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. దాతల భూములు ఆలయాలకే చెందాలని అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేశారు. ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. మాన్సాస్‌ చైర్మన్‌ పదవి మార్పు వింతగా ఉందన్నారు. భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని తెలిపారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారన్నారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?... ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలపై ఆ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌ సంచైత గజపతిరాజు ఘాటుగా స్పందించారు. చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కుటుంబ సభ్యులే తనపై ఆరోపణలు చేయడం బాధగా ఉందని సంచైత ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ట్ర‌స్టు బాధ్య‌లు త‌నకు అప్ప‌గించ‌డాన్ని ఆహ్వానించాల్సింది పోయి ఇలా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయ‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. తన నియామకంపై ఎవరైనా న్యాయస్థానానికి వెళ్లినా పోరాటం చేస్తానని తెలిపారు. ట్రస్ట్‌ భూములు, దేవదాయ భూములు ఎవరికీ చెందనివ్వమని ఆమె స్పష్టంచేశారు. తన తాతగారు స్థాపించిన ట్రస్ట్‌ ద్వారా పేదలకు సేవలందిస్తానని చెప్పారు.

నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు ఒకే నమూనాలో కాలనీలు

పేదలకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 30 లక్షల ఇళ్ల డిజైన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. బెడ్‌రూం, కిచెన్,పెద్ద హాలు, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో ఈ ఇళ్లను నిర్మించడానికి సమాయత్తమవుతోంది. గృహనిర్మాణంపై సమీక్ష సందర్భంగా పేదలకు కట్టించనున్న ఇంటి డిజైన్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తాము రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లు అత్యంత నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టంచేశారు. ఇంటి డిజైన్‌లో భాగంగా ఏం ఇవ్వబోతున్నామో అడిగి తెలుసుకున్నారు. బెడ్‌రూం, కిచెన్, హాలు, వరండా, టాయిలెట్‌లను డిజైన్‌లో పొందుపరిచామని అధికారులు తెలిపారు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా డిజైన్‌ రూపకల్పనలో జాగ్రత్తలు పాటించామన్నారు. వీటికి సీఎం కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడరాదని మరోమారు స్పష్టంచేశారు. సంవత్సరానికో 6.5 లక్షల ఇళ్ల చొప్పున నిర్మించడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీల్లో పచ్చదనం, పరిశుభ్రత, కరెంటు సౌకర్యం లాంటి కనీస వసతుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. కాలనీలన్నీ మార్గదర్శకంగా ఉండేలా చర్యలను తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు

కరోన వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొవిడ్ 19 నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. అధిక ధరలకు మాస్క్ లు గానీ , మందులుగానీ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లు కూడా రద్దు చేస్తాం. మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తాం వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి హెచ్చ‌రించారు. డ్రగ్స్ డిజి ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్ పెక్టర్లు 382 మెడికల్ షాపులపై దాడులు చేశారని ఆయ‌న చెప్పారు. కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి ఏపీకి వచ్చిన 378 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారు 153 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి ఆరోగ్యపరిస్థితి స్థిమితంగా ఉంది. 27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగటివ్ అని తేలింది. ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టాం. విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నాం. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. కొవిడ్ 19 లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్ ను ధరించాలని, కరోనా వైరస్(కొవిడ్19) విషయంలో ఆందోళన చెందొద్దు. వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలి వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరు సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఆర్టీసీ లో 5000 మంది అప్రెంటిస్ లకు అవకాశం

ఎ.పి.ఎస్‌.ఆర్‌ట‌.టి.సి. 4జోన్ల (విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్ల) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ఏ. కోటేశ్వర రావు ఈ మేరకు 03-03-2020న ఆదేశాలు జారీ చేశారు. వివిధ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసి తదుపరి సమాయత్తం కావలసిందిగా కూడా ఆదేశాలు జారీచేయబడినవి. మార్చి 7 వతేది లోపు నోటిఫికేషన్లు వెలువరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 15వ తేదీ లోగా పూర్తి చేయనున్నారు. అర్హత కలిగిన ఐ.టి.ఐ అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను www.apprenticeship.gov.in వెబ్సైట్ నందు అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. ఇందుకు గడువు తేదీ 21-03-2020. దరఖాస్తు చేస్తుకున్న అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన సంబంధిత జోన్ల శిక్షణా కళాశాలల కమిటీలు ఏప్రిల్ 9వ తేదీన జరుపుతారు. ఏప్రిల్ 13వ తేదీన ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. కాగా ఎంపికైన అభ్యర్థులను ఏప్రిల్ 15 న రీజియన్ /వర్కుషాపులకు కేటాయిస్తారు. సంస్థ 2017 నుండి ప్రతి ఏడాది 1390 మంది ఐ.టి.ఐ అర్హత కలిగిన అభ్యర్థులను అప్రెంటిస్ లుగా నియామకం జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్ రూ.1500/- , సంస్థ కాంట్రిబ్యూషన్ రూ.5431/-కలిపి మొత్తంగా ఒక్కొక్కరికీ రూ.6931/- చొప్పున వీరందరికీ ఏడాదికి సుమారు 9.06 కోట్ల మొత్తం స్టైపండ్ రూపంలో చెల్లిస్తున్నది. అంటే మొత్తంగా 5000 మందిని అప్రెంటిస్ లుగా తీసుకోవడం వలన సంస్థ ఇంకా అదనంగా రూ.25 కోట్ల మొత్తం స్టైపెండ్ రూపంలో వెచ్చించనున్నది. సంస్థ వి.సి అండ్ ఎం.డి మాదిరెడ్డి ప్రతాప్, ఇటీవల డిపోల పర్యటనలు జరిపారు. డిపో గ్యారేజీలలో మరియు వర్క్ షాపులలో పనిచేస్తున్న అప్రెంటిస్ ల ప‌నితీరును మెచ్చుకున్నారు. కేవలం తమ విధులు మాత్రమే కాకుండా సంస్థకు పనికి వచ్చే పలు విధాలైన నైపుణ్యాలను చూపుతూ సంస్థ కోసం ఇతోధికంగా కృషి చేస్తున్నట్లు గమనించారు. ఈ నేప‌థ్యంలో అప్రెంటిస్ ల సేవలను మరింతగా ఉపయోగించుకోవడంలో భాగంగా ఎం.డి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు మరో 5,000 అప్రెంటిస్ ల నియామకానికి చర్యలు ప్రారంభమయ్యాయి.

టెన్త్ విద్యార్ధులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టెంత్ విద్యార్ధినీ, విద్యార్ధులకు షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి పరీక్షల తేదీలను ఖరారు చేశారు. ఏపీలో పదవతరగతి పరీక్షల కొత్త టైంటేబుల్  ఎస్ఎస్సీ బోర్డు  విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. యధావిధిగా అయితే ఇంటర్ పరీక్షలు తర్వాత టెన్త్ పరీక్షలు మొదలుకావాల్సి ఉంది. కానీ ఇంటర్ తరువాత ఎన్నికల వ్యవహారాన్ని చక్కబెట్టి ఏప్రిల్ నెలలో టెన్త్ పరీక్షలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఏపీలో టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌ ఈ విధంగా ఉంటుంది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు టెన్త్‌ పరీక్షలు జరుగుతాయి. ఉ.9:30 నుంచి మ.12:15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, ఏప్రిల్‌ 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 3న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌, ఏప్రిల్‌ 4న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 6న ఇంగ్లీష్‌ పేపర్‌-2, ఏప్రిల్‌ 7న మ్యాథమేటిక్స్‌ పేపర్‌-1, 8న పేపర్‌ -2, ఏప్రిల్‌ 9న జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1, 11న పేపర్‌-2 పరీక్ష వుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఎలాగయినా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. దీనికి కారణం.. స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాది గడచిపోయింది. మార్చి 31 లోపు ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికసంఘం నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. ఒకవేళ ఆలస్యంగా ఎన్నికలు జరిగి నిధులు రావాలంటే కేంద్రాన్ని కాళ్ళు, గడ్డాలు పట్టుకోవాల్సి వస్తుంది. అసలే జగన్ నిర్ణయాలతో కేంద్రంలో మంత్రులు ఆగ్రహంతో ఉండగా రాష్ట్రంలో చేతిలో ఉండగా వదిలేసి గడువు తర్వాత కేంద్రాన్ని బ్రతిమిలాడుకోవడం ఎందుకనుకుంటే ఈ నెలలో ఎన్నికలు జరిపి తీరాల్సిందే. ఇప్పుడు ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్రానికి చాలా కీలకం అవసరం కూడా. అయితే పరీక్షల సమయానికి ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోలేకపోయింది. పరీక్షలు.. ఎన్నికలను అంచనా వేయలేకపోయిది. ఫలితంగా రాష్ట్రంలోని ఏడు లక్షల మంది టెన్త్ విద్యార్థులకు నెల రోజుల పాటు టెన్షన్ మిగిలింది. ప్రతి విద్యార్థి టెన్త్ పరీక్షలు, ఫలితాలు జీవితంలో అత్యంత కీలకం. అలాంటి వారికి ప్రభుత్వం పెట్టిన పరీక్షగా ఈ పరిణామాన్ని చెప్పుకోవాలి. ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తే ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేసేది. కానీ ప్రభుత్వనికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇంటర్ పరీక్షలకు అనేక జాతీయ ప్రవేశ పరీక్షలకు లింకు ఉంటుంది. జాతీయ స్థాయి పరీక్షలకు, వాటి షెడ్యూల్ కు ముందే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో ఇంటర్ పరీక్షలు జరిపించక తప్పలేదు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలకు వైసీపీ గ్రామకార్యకర్తలు అనబడే ఒక్క అర్హత కలిగిన గ్రామ వాలంటీర్లను ఇన్విజిలేషన్ కు నియమిస్తామని విద్యార్థుల వీపున జగన్ సర్కార్ బండ వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పడు టెన్త్ పరీక్షలను ఒక నెల రోజులు పొడగించి విద్యార్థుల కీలకమైన జీవితంలో నెల రోజుల కాలాన్ని రాజకీయాల కోసం, ఎన్నికల కోసం పణంగా పెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వమే దక్కించుకుంది.

రాజకీయనేతల ప్రవర్తనా నియ‌మావ‌ళిని విడుద‌ల చేసిన ఎన్నిక‌ల క‌మీష‌న్‌

స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు, పార్టీలు పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఎన్నిక‌ల‌ కమిషన్ జారీ చేసింది. 1.ఎన్నిక‌ల్లో పోటీ చేసే పార్టీలు, నేతలు అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్య‌వ‌హ‌రించ‌రాదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా జీవితంతో సంబంధంలేని, వ్యక్తిగత దూషణలు చేయరాదు. 2.రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయ‌డం నిషేదం. 3.ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభపెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగిస్తే శిక్ష త‌ప్ప‌దు. 4.పోలింగ్‌స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదు. 5.గడువు దాటాక కూడా ప్రచారం చేయడం, పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం... వంటివి నిషిద్ధం. ప్రశాంత గృహ జీవితాన్ని గడిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. దానికి భంగం కలిగేలా ప్రవర్తించకూడదు. ప్రజల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేయడం, పికెటింగ్‌లు చేయడం వంటివి నిబంధనలకు విరుద్ధం. 6.అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగరవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధం. 7.పార్టీలు సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా చెప్పాలి. దాన్ని బట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. 8.సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలనుకునే చోట ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. నిషేధా జ్ఞలు అమలయ్యే ప్రదేశాల్లోకి ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి 9.లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలి. 10.సభలకు ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే... నిర్వాహకులు వారిపై నేరుగా దాడులకు పాల్పడకూడదు. పోలీసులకు సమాచారం అందించాలి. 11. పార్టీలు.. ఊరేగింపులకు అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఏ మార్గం గుండా వెళుతుంది? తదితర వివరాలన్నీ ముందే సమర్పించాలి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకూ అందించాలి. దాన్నిబట్టి వారు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. 12.ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు పొడవుగా ఉంటే, దాన్ని మధ్యలో విడగొట్టి కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలి. 13.సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీల నాయకులు, వారి అనుచరులు వాటికి భంగం కలిగించకూడదు. నిలదీయకూడదు. కరపత్రాలు పంచరాదు. 14.ఒకపార్టీ వేసిన పోస్టర్లను వేరే పార్టీ వారు తొలగించకూడదు. 15.రెండు అంత కంటే ఎక్కువ పార్టీలు ఒకేదారిలో ఒకే సమయంలో ఊరేగింపు నిర్వహించాలనుకుంటే... ముందుగానే పోలీసులను సంప్రదించాలి. ఊరేగింపులు ఎదురెదురుగా రాకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. 16.ఊరేంగింపులో మూడు కంటే ఎక్కువ వాహనాలు వాడితే ఎన్నికల వ్యయంలో చూపించాలి. 17. పోలింగ్ రోజున ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించాలి. అన్ని పార్టీల నేతలు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సహకరించాలి. 18.పోలింగ్ బూత్‌లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందజేయాలి. వీటిపై పార్టీల గుర్తులు, పేర్లు ఉండకూడదు. 19.ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం చేయకూడదు. ప్రచార రూపంలో ఎస్ఎంఎస్‌లు కూడా నిషేధం. 20.పోలింగ్‌రోజు, అంతకు 24 గంటల ముందు మద్యం పంపిణీ చేయకూడదు. 21.అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్‌బూత్‌ల సమీపంలో ఏర్పాటుచేసే శిబిరాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకూడదు. 22.శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఇతర ఎన్నికల సామాగ్రి ఏమీ ఉండకూడదు. తినుబండారాలను కూడా పంపిణీ చేయకూడదు. అలాగే అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలన యంత్రాగాన్ని వినియోగించుకోకూడదు. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు. సి.ఎం.తో సహా ఎవరైనా సరే హెలికాప్టర్‌తోపాటు ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించాలి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు... తదితర సౌకర్యాలను కేవలం అధికారపార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకూ అవకాశం కల్పించాలి. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు. టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి. ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు.కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు.రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు.

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు పై ఛార్జ్ షీట్ దాఖలుకు కేంద్రం ఆదేశం

చీఫ్ సెక్రెటరీ కి లేఖ రాసిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏ బీ వెంకటేశ్వర రావు వ్యవహారం శనివారం మరో మలుపు తిరిగింది. అనూహ్యం గా , కేంద్ర హోమ్ శాఖ...రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ, ఏ బీ వీ పై ఏప్రిల్ 7 లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా, ఏ బీ వెంకటేశ్వర రావు ను సస్పెండ్ చేస్తూ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోమ్ శాఖ ఖరారు చేసింది. ఏ బీ వీ తప్పిదాలకు పాల్పడినట్టుగా ప్రాధమిక ఆధారాలు లభ్యమైనట్టు, ఏరోసాట్, యు వీ ఏ ల కొనుగోలు కోసం వెచ్చించిన 25. 5 కోట్ల రూపాయల వ్యవహారం లో భారీ అక్రమాలు జరిగినట్టు కేంద్ర హోమ్ శాఖ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారం తో, ఆంద్ర ప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే, ఏ బీ వీ వ్యవహారం ఈ స్థాయి వరకూ వెళ్తుందని ఎవరూ ఊహించకపోవటం ఒక కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వం ఏ బీ ఎపిసోడ్ లో తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేయటం  ద్వారా -చంద్రబాబు నాయుడు తో స్నేహానికి తాము సిద్ధంగా లేమనే సంకేతాన్ని కేంద్రం పంపించినట్టయిందని విశ్లేషకులు అంటున్నారు. నిరుడు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అక్రమాలకూ పాల్పడుతున్నారంటూ --ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై వైసిపి నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేసిన విషయం అందరికీ తెలిసిందే . ఫ‌లితంగా ఆయ‌న్ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. టిడిపి ప్ర‌భుత్వం లో ఇంట‌లిజెన్స్ చీఫ్ గా ప‌ని చేసిన ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై చాలా కాలంగా వైసిపి దృష్టి సారించింది. అందునా వైసిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. నంద్యాల ఎన్నిక‌ల స‌మమం నుండి నిరుడు సాధారణ  ఎన్నిక‌ల వ‌ర‌కూ ఏబి వెంక‌టేశ్వ‌ర‌రావు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కు మ‌ద్ద‌తుగా పార్టీ నేత‌గా ప‌ని చేస్తున్నార‌నేది వైసిపి నేత‌ల ఆరోప‌ణ‌. ఇక‌, నిరుటి  ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి కోసం ఇంట‌లిజెన్స్ చీఫ్ అనైతికంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వైసిపి నేత‌లు నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీంతో..ఇంట‌లిజెన్స్ చీఫ్ ను ఎన్నిక‌ల విధుల నుండి త‌ప్పిస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. దీనిని నిర‌సిస్తూ ఏపి ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. కోర్టు సైతం ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేయ‌టంతో అప్పటి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను రిలీవ్ చేసింది. ఆధార్ సంస్థ చేసిన ఫిర్యాదు పై స్పంద‌న‌గా మాట్లాడిన విజ‌య సాయిరెడ్డి ఏపిలో ఇప్ర‌గ‌తి ప్రాజెక్టు పేరుతో ఆధార్ స‌మాచారం మొత్తం సేక‌రించార‌ని.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు డిజిపి ఠాకూర్ తో పాటుగా ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఏబి వెంక‌టేశ్వ‌ర‌రావు సంబంధీకులు ద‌క్కించుకున్నార‌ని చెప్పుకొచ్చిన విజ‌య సాయిరెడ్డి స‌రైన స‌మ‌యంలో వివ‌రాల‌ను బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పారు. దీని పై స్పందించిన ఏబి వెంక‌టేశ్వ‌ర రావు త‌మ‌కు ప్ర‌భుత్వం లో ఎటువంటి కాంట్రాక్టులు..ఒప్పందాలు లేవ‌ని స్ప‌ష్టం చేసారు. త‌న పై హేయ‌మైన వ్యాఖ్య‌లు చేసిన విజ‌య సాయిరెడ్డి పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో... రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాల ఆరోపణల మీద ఏ బీ వీ ని సస్పెండ్ చేయటం, దాని మీద ఆయన క్యాట్ ను ఆశ్రయించటం, తర్వాత క్యాట్ ఆయన సస్పెన్షన్ ను సమర్ధించటం అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు తాజాగా..నేరుగాకేంద్ర హోమ్ శాఖ రంగం లోకి దిగటం బట్టి చూస్తుంటే, వై సి పీ , బీ జె పీ ల మధ్య ఒక అవగాహన దాదాపుగానే కుదిరిందని, ఇక తెలుగు దేశం మద్దతుదార్లయిన ఆఫీసర్లకు గడ్డు కాలం తప్పదనీ సంకేతాలు వస్తున్నాయి.

700 మిలియన్ డాలర్ల కంపెనీ 10 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందట!

వంద మంది సిబ్బంది దాటని కంపెనీ, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందం చేసుకోవడం విడ్డూరం కాదా .... రాష్ట్రానికి భారీ పెట్టుబడి పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి వెనుక డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. వైయస్సార్‌ కడప జిల్లాలో మరో స్టీల్‌ ప్లాంట్‌పై ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ ఐఎంఆర్‌ ప్రతిపాదన చేసిందనీ, ఏడాదికి 10 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం గా ఈ ప్లాంట్ పని చేస్తుందనీ, రూ. 12వేల కోట్లకుపైగా పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వం పటాటోప ప్రదర్శన చేసింది. ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌తో చర్చలు జరిపిన ఈ స్విస్ కంపెనీ -ఐ ఎం ఆర్ ఏ జీ ప్రతినిధులు ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ ఎదుట వైయస్సార్‌జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఈ ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో ఐఎంఆర్‌కంపెనీ ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఆర్‌ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగితెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుతున్నామంటూ వారు వివరించారు. ఇది వారి వివరణ అయితే, వాస్తవానికి ఆకంపెనీ ప్రొఫైల్ వేరే విధం గా ఉంది. 2001 లో స్విట్జర్లాండ్ లో ఏర్పాటైన ఈ కంపెనీ కార్యకలాపాలు- డెవెలప్మెంట్ కన్సల్టింగ్, సర్వీస్ ప్రొవైడర్లుగా మాత్రమే పరిమితం కాగా, ఇనుప ఖనిజం, బంగారం తవ్వకాల్లో తాము నిష్ణాతులమని ప్రకటించుకోవటమే ఇక్కడ పలు అనుమానాలకు తావిస్తోంది. వైయస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెప్పుకొచ్చిన ఆ కంపనీ ప్రతినిధులు - ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామంటూ వారికి వివరించారు. ఐఎంఆర్‌ కూడా మరొక స్టీల్‌ప్లాంట్‌ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు. పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందంన్నారు. రానున్నరోజుల్లో వైయస్సార్‌ జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో జరిగిన చర్చల సారాంశం అయితే, వాస్తవమేమిటంటే ఆ కంపెనీ సిబ్బంది సామర్ధ్యం కూడా వంద మందికి మించి లేదు. 700 మిలియన్  డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీ, ఇప్పుడు రాష్ట్రం లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్ధ్యం తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం ఏ మేరకు లాజిక్ కు అందుతుందనేది ఇపుడు పారిశ్రామిక వర్గాల ప్రశ్న. వినే వాడు అమాయకుడు అయితే , చెప్పేవాడు విజయసాయి రెడ్డి అన్నట్టు--హఠాత్తుగా తెర మీదకు వచ్చిన ఈ స్విస్ కంపెనీ తెర వెనుక డొల్ల తనం బయటపడటం తో ...సర్కారీ పెద్దలు ప్రస్తుతం తలలు పట్టుక్కూర్చున్నారు.

21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ... 23న మున్సిపోల్స్... 27, 29న పంచాయతీ ఎన్నికలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో... పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. అలాగే, మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేయనున్నారు. ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించి... 24న ఫలితాలను ప్రకటించనున్నారు. అలాగే, 23న మున్సిపోల్స్ నిర్వహించి... 27న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక, మార్చి 27న తొలి విడత పంచాయతీ ఎన్నికలు... 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. # జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మార్చి 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 12న నామినేషన్ల పరిశీలన మార్చి 14వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 21న పోలింగ్‌ మార్చి 24న ఓట్ల లెక్కింపు # మున్సిపల్‌ ఎన్నికలు మార్చి 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 14న నామినేషన్ల పరిశీలన మార్చి 16వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 23న పోలింగ్‌ మార్చి 27న ఓట్ల లెక్కింపు # తొలి విడత పంచాయతీ ఎన్నికలు మార్చి 17నుంచి 19వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 20న నామినేషన్ల పరిశీలన మార్చి 22వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 27న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు # రెండో విడత పంచాయతీ ఎన్నికలు మార్చి 19 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 22న నామినేషన్ల పరిశీలన మార్చి 24వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు మార్చి 29న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు

తమ్ముడు దాడి.. అన్నయ్య సర్దుబాటు...

ఒక్కో ఘటన చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన గోదావరి జిల్లాల్లో ప్రముఖ జర్నలిస్టు.. ఆషామాషీ జర్నలిస్టు మాత్రమే కాదు.. జగమెరిగిన జర్నలిస్టు నేత.. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ జర్నలిజాన్ని సామాజిక వర్గ ప్రయోజనాల పరిరక్షణకు విచ్చలవిడిగా వాడేసిన ప్రముఖుడు ఆయన. నిన్న మొన్నటి వరకు ఎక్కడ జర్నలిస్టుపై దాడి జరిగినా నేనున్నానంటూ తీవ్రంగా ఖండించే నేత ఆయన. కానీ ఆయన పైనే రాజకీయ ప్రముఖులు, అందునా తన సామాజిక వర్గం నుండే వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నేతలు దాడి చేస్తే కిక్కురుమనకుండా అన్నీ మూసుకుని కూర్చోవలసి వస్తోంది. శ్రీరామచంద్రా ఏమిటో ఈ దుస్థితి.   ఇంతకూ విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రజా చైతన్యయాత్రలో పాల్గొనేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బయలుదేరి వెళ్ళారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు శత విధాల ప్రయత్నం చేసి విఫలమయ్యారు. లోకేష్ కాన్వాయ్ అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆందోళన జర్నలిస్టులపైకి మళ్ళింది. లోకేష్ పర్యటన కవరేజి నిమిత్తం వెళ్లిన ప్రముఖ జర్నలిస్టులపై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ దౌర్జన్యం చేశారు. తెలుగుదేశం పార్టీకీ చెందిన మద్దతుదారులు ఈ విషయం గమనించి తీవ్రంగా ప్రతిఘటించారు. కాతేరు వద్ద జరిగిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన హెచ్ఎంటీవీ శ్రీరామ్ మూర్తి, టీవీ9 సత్య, మహా న్యూస్ సతీష్ పై వైకాపా కార్యకర్తల దాడి చేశారు. ఇంత దాడి జరిగితే మరుసటి రోజు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వచ్చి సర్దుబాటు చేసేశారు. తమ్ముడు దాడి చేస్తే అన్న సర్దుబాటు చేస్తారు. దాడికి గురయిన వారిలో ఒక్కరు కూడా ఇదేమీటో తెలియజేయలేని పరిస్థితి.  

తెలంగాణ అసెంబ్లీలో హైఓల్టేజ్ వార్... కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? ఒక ప్రాంతానికా?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇద్దరూ మాటకు మాట అనుకున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావంటే... నువ్వేం మాట్లాడుతున్నావంటూ తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో శాసనసభలో కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతుండగా ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. గవర్నర్ స్పీచ్ లో అన్నీ అబద్ధాలే చెప్పించారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నించారు. అధికారంలో చేతిలో ఉంది కదా అని గవర్నర్ చేత అసత్యాలు చెప్పిస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 100మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విర్రవీగొద్దన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... డబ్బుతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని, గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక సదుపాయల్లేవని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్లేనా అంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతేంటి? నిరుద్యోగ భృతి ఏమైంది? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంటింటికీ నీళ్లు ఎప్పుడిస్తారు? అంటూ నిలదీశారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామంటే... ముఖ్యమంత్రి, మంత్రులు సెక్రటేరియట్ లోనే ఉండరని మండిపడ్డారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు పెట్టడం లేదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? లేక ఒక ప్రాంతానికా? అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి అసలు ప్రజల్లో తిరుగుతున్నాడా? లేక రోడ్లపై తిరుగుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. ఏదైనా మాట్లాడితే అర్ధంపర్థం ఉండాలన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తానన్న ఎర్రబెల్లి... ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో స్వయంగా మాట్లాడి తెలుసుకుందా పదా అంటూ సవాలు విసిరారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పరుగెత్తిచ్చి కొడతారంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు.  ఎర్రబెల్లి వ్యాఖ్యలపై అంతే సీరియస్ గా రియాక్టయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఘాటు కామెంట్స్ చేశారు. ఇది ఎర్రబెల్లి తప్పు కాదు... తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్న కేసీఆర్ ది అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లిలాంటి తెలంగాణ ద్రోహులను నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడంతో అధికార టీఆర్ఎస్... ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కల్పించుకోవడంతో ఇరువర్గాలు శాంతించాయి.

ఎస్ బ్యాంకు లో ఇరుక్కుపోయిన  పూరీ జగన్నాధుడి సొమ్ము

547 కోట్ల  రూపాయల ఫండ్స్ వెనక్కు రావటం కష్టమే పూరీ జగన్నాధ స్వామి కి కష్టమొచ్చి పడింది. దాదాపు 547 కోట్ల రూపాయల సొమ్ము ప్రస్తుతం ఎస్ బ్యాంక్ లో ఇరుక్కుపోయింది. పూరీ దేవస్థానం ఆ సొమ్మును ఎస్ బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం ఎస్ బ్యాంక్ నుంచి ఉపసంహరణ  పరిమితి 50  వేల రూపాయలకే కుదించటం తో, ఇపుడు పూరీ ఆలయం డిపాజిట్ల పరిస్థితి అగమ్యగోచరం గా తయారైంది. వాస్తవానికి పూరీ ఆలయం డిపాజిట్లు ఈ నెలలో మెట్యూరిటీ అవుతాయి కాబట్టి, ఆ భారీ మొత్తాన్ని ఉపసంహరించాలని  కిందటి నెలలో జరిగిన ఆలయ బోర్డు సమావేశం లో తీర్మానం చేశారు. ఆ తర్వాత ఆ ఫండ్స్ ని జాతీయ బ్యాంక్ లలో డిపాజిట్ చేయాలని కూడా ఆలయ బోర్డు నిర్ణయించింది. ఎస్ బ్యాంక్ ఇప్పటికే ఈ విషయమై ఆలయ బోర్డుకు ఒక లేఖ రాస్తూ, మార్చ్ 19, 23, 29 తేదీలలో ఫండ్స్ ఆలయ బోర్డుకు వెనక్కు పంపిస్తామని స్పష్టం చేసింది. కానీ, తాజాగా ఆర్ బీ ఐ తీసుకున్న నిర్ణయం తో, ప్రస్తుతం ఎస్ బ్యాంక్ ఈ  547 కోట్ల రూపాయల నిధులను ఆలయ బోర్డుకు వెనక్కు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంతో అసలు అంత పెద్ద మొత్తం నిధులను ఒక ప్రయివేట్ బ్యాంక్ లో ఎలా డిపాజిట్ చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏ పరిస్థితుల్లో ఎస్ బ్యాంక్ లో ఆ ఫండ్స్ ని డిపాజిట్ చేయాల్సి వచ్చిందనే కోణం లో ఒక విచారణ చేపట్టాలని కూడా పూరీ ఆలయ కమిటీ సభ్యులు రామచంద్ర దాస్ మహాపాత్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్ పి ఆర్ అమలుపై విచిత్ర నిర్ణయంతో నష్టపోనున్న ఏపీ...

పిచ్చి ముదిరింది రోకలి తలకు కట్టండి అన్నట్టుంది ఏపీ ప్రభుత్వ ప్రవర్తన. అనుభవ రాహిత్యమో, అవగాహనా లోపమో తెలియదు కానీ నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్ పి ఆర్) ను ప్రస్తుత పద్ధతిలో అమలు చేయరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఎన్ పి ఆర్ అనేది జనాభా లెక్కలు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పలువురు విస్మయం చెందుతున్నారు. ఎన్ పి ఆర్ లో సాధారణ విషయాలు తప్ప మతానికి సంబంధించిన అంశాలు ఉండవు. పైగా ఎలాంటి ధృవపత్రాలు అడగరు. ఎన్ పి ఆర్ తో ఒక వ్యక్తి మతాన్ని నిర్ధారించే అవకాశం లేదు. ఇది స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దశాబ్దాలుగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ మాత్రమే. అలాంటి ఎన్ పి ఆర్ ను 2010 ప్రశ్నావళి ప్రకారం మాత్రమే చేపట్టాలని లేకపోతే తాము తిరస్కరిస్తామని మంత్రివర్గం తీర్మానించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అసలు ఎన్ పి ఆర్ ప్రశ్నావళిని మార్చే వరకూ రాష్ట్రంలో ఆ ప్రక్రియను నిలిపివేయాలని తీసుకున్న మంత్రి వర్గ నిర్ణయం వల్ల ఒరిగేదేమీ ఉండదు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది 1955 భారత పౌరసత్వ చట్టం ప్రకారం నిర్వహిస్తారు. 2003 పౌరసత్వ నిబంధనల ప్రకారం ఎన్ పి ఆర్ లో నమోదు చేసుకోవడం పౌరుల బాధ్యత, తప్పని సరి కూడా. దీన్ని ఏ పౌరుడు తిరస్కరించే వీలే లేదు. అలాంటిది రాష్ట్ర మంత్రి వర్గం తిస్కరించడం అవగాహనా రాహిత్యమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. దేశంలో ఎన్ పి ఆర్ అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.3941 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలలో ఎన్నికల సంఘం తన అధికారులను నియమించుకున్నట్లు ఎన్ పి ఆర్ అమలు కోసం ఆయా రాష్ట్రాల క్యాడర్ కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసుకుంటుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు ముగ్గురు అధికారుల ప్యానెల్ పంపడం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్ పి ఆర్ అసోం లో తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తారు. ఎన్ పి ఆర్ ను ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి అమలు చేస్తారు. ఈ సర్వే ద్వారా దేశంలో పేదరికాన్ని అంచనా వేస్తారు. చదువుకున్న వారి సంఖ్య తదితర వివరాలు తెలుస్తాయి. అక్షరాశ్యత తక్కువ ఉన్న రాష్ట్రాలు పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు గుర్తిస్తారు. అందుకు అనుగుణంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ఎన్ పి ఆర్ ను తిరస్కరించడం ద్వారా రాష్ట్రంలోని పేదల డేటా కేంద్రానికి అందకుండా పోతుంది. దీనివల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజల బయోమెట్రిక్ వివరాలను సేకరించరు.  అందువల్ల ఏ మతం వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2010 లో జరిగిన జనాభా లెక్కలలో 15 ప్రశ్నలు అడగగా ఈ సారి వాటి సంఖ్య 21కి చేరింది. ఎలాంటి ధృవపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేని ఈ జనాభా లెక్కలను రాజకీయాలకు వాడుకోవడం ఎంత వరకూ సబబో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించుకోవాలని కేంద్ర పెద్దలు అంటున్నారు.

రాహుల్ గాంధీకి కరోనా పరీక్షలు.. సంచలన విషయం బయటపెట్టిన కాంగ్రెస్...

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, అలాగే కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటూ బీజేపీ మిత్రపక్ష ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ లోక్ సభలో డిమాండ్ చేయడంతో పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినవారిలో ఎక్కువగా సోనియా పుట్టినిల్లు ఇటలీ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని, అందువల్ల సోనియా కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిన అవసరముందన్నారు. అయితే, సోనియా కుటుంబ సభ్యులు ఇటీవల ఇటలీ వెళ్లిరావడంతోనే ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ సమర్ధించింది. అయితే, ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో తీవ్ర నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ... ఇవాళ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇటీవల ఇటలీ వెళ్లివచ్చిన రాహుల్ గాంధీకి, ఢిల్లీ విమానాశ్రయంలో కరోనా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ.... ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారని తెలిపింది. ఫిబ్రవరి 29న విదేశీ పర్యటన తిరుగు ప్రయాణంలో భాగంగా రాహుల్ కూడా కరోనా స్క్రీనింగ్ టెస్ట్ లో పాల్గొన్నారని ఏఐసీసీ వెల్లడించింది. తన భద్రతను సైతం పక్కనబెట్టి, సాధారణ ప్రయాణికులతోపాటే అరగంటపాటు క్యూలో నిలబడి కరోనా స్క్రీనింగ్ లో పాల్గొన్నారని తెలిపింది. అయితే, ఇటలీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 80మంది మరణించగా, వేలాది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు, భారత్ లో నమోదైన కరోనా పాటిజివ్ కేసుల్లో కూడా ఇటలీ నుంచి వచ్చినవాళ్లే ఉండటంతో, రాహుల్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. పైగా రాహుల్ విదేశీ పర్యటనలో కరోనా సోకుండా తగు జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే పరీక్షలు చేయించుకోవాలని కోరామని బీజేపీ వ్యాఖ్యానించింది. బీజేపీ డిమాండ్ నేపథ్యంలోనే, రాహుల్ గాంధీ కరోనా స్క్రీనింగ్ పరీక్షలపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.

స్థానిక ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పండి... ప్రజలకు చంద్రబాబు పిలుపు...

జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇస్తేనే ఉన్నవి ఊడగొట్టారని, ఇక మరోసారి గెలిపిస్తే ఏమీ మిగల్చరని బాబు అన్నారు. వైసీపీ ఉన్మాద చర్యలకు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని బాబు మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే, కొత్తకొత్త జీవోలు ఇవ్వడమేకాకుండా, మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానంటూ జగన్ బెదిరింపులకు దిగారని చంద్రబాబు విమర్శించారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అడ్డుకోవాలని, అలాగే, ఫొటోలు, వీడియోలు తీసి పంపాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశామన్న బాబు.... ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపుతూ, అధికారులకు ఫిర్యాదు చేయాలని దిశానిర్దేశం చేశారు. సీఏఏ అండ్ ఎన్పీఆర్ పై జగన్నాటకాలు ఆడుతున్నారని బాబు విమర్శించారు. ఇక, అశోక్ గజపతిరాజు ఆస్తులపైనా, సింహాచల ఆలయ భూములపై కన్నేసి రాత్రికి రాత్రే రహస్య జీవోలు ఇచ్చారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతున్న టీడీపీ నేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే, వైసీపీ ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా పోరాడుతున్న టీడీపీ నేతలను చంద్రబాబు అభినందించారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై తాడోపేడో తేల్చుకుంటామో తప్ప, భయపడే ప్రసక్తే లేదన్నారు.