కడప జిల్లాలో టీడీపీ ఖాళీ

ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ రామసుబ్బారెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డి వెళ్లిపోవడంతో కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది. రామసుబ్బా రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నియోకవర్గంలో పలు మార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీని వీడాలని కొంతకాలంగా భావిస్తున్నారు. కార్యకర్తలు, అనుచరులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ మార్పుపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. చివరకు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ భవిష్యత్తుపై జగన్ భరోసా ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి పార్టీ మారినట్టు తెలుస్తోంది. వైసీపీలోకి రామసుబ్బారెడ్డి ఎంట్రీతో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయం మరో కీలక మలుపు తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ నియోజకవర్గాల వారీగా బలమైన నేతల్ని పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను వైసీపీలో జాయిన్ చేసుకుంది. ఇప్పుడు రామసుబ్బారెడ్డి కూడా అధికార పార్టీలోకి వెళ్లారు. రామసుబ్బారెడ్డి ఎన్నో ఏళ్లగా టీడీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీని వీడతారనే ప్రచారం జోరుగా జరిగింది. ఆయన వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. పార్టీ మారడం ఖాయమని ఊహాగానాలు కూడా వినిపించాయి. ఎప్పటి నుంచో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డిలు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులు కోల్డ్ వార్ నడిచింది. రంగంలోకి దిగిన చంద్రబాబు ఇద్దరు నేతలతో చర్చలు జరిపి రాజీ చేశారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి.. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు.. కానీ ఇద్దరికీ ఓటమి తప్పలేదు. తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లారు. , కడపలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. మొత్తంగా ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడడంతో కడప జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామసుబ్బారెడ్డి లాంటి కీలక నేత వైసీపీ కండువా కప్పుకోవడం చంద్రబాబుకు షాకింగ్‌గా మారింది.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్లుగా బలమైన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఏడెనిమిది మంది పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించినా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు దక్కింది. ముందు నుంచీ బీజేపీకి నిబద్ధత కలిగిన నేతగా కొనసాగుతుండటం, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న నేత కావడం వంటి కారణాల వల్ల బండి సంజయ్‌ను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీకాలం ముగియడంతో బండి సంజయ్‌ను నూతన అధ్యక్షుడిగా నియమితులైయ్యారు. ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కార్పొరేటర్ స్థాయి నుంచి ఆయన ఎంపీ స్థాయికి ఎదిగారు. తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు సామాజకవర్గానికి చెందిన నేత ఆయన. అన్ని కోణాల్లోనూ బండి సంజయ్ బలమైన నాయకుడని భావించిన పార్టీ ఆయనను అధ్యక్షుడిని చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. అయితే, కొత్తగా చేరిన నేతలకు ఇప్పుడు అధ్యక్ష పదవి అప్పగించడం సరికాదని అధిష్ఠానం భావించింది. ముందునుంచీ పార్టీలో కొనసాగిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాల అప్పగించింది. కేవలం కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో యువతలో సంజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా చాలారోజులుగా బీజేపీలో కొనసాగుతున్న ఆయనకు పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లు బాగా తెలుసు. బండి సంజయ్ సామాజకవర్గం తెలంగాణలో ప్రధానమైనది. ఇది కూడా ఆయనకు కలిసివచ్చింది.

కాల్ మనీ బ్యాచ్ కి మాచర్ల లో పనేమిటి: పిన్నెల్లి 

పల్నాడు లో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని మాచర్ల ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. విజయవాడ  నుంచి 10 కార్లలో బోండా, బుద్ధా వెంకన్న మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించాడని ఎమ్మెల్యే పిన్నెల్లి పెర్కొన్నారు. " మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఒక పిల్లాడికి తగిలింది: దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. వారిని సముదాయించాల్సింది పోయి టీడీపీ నాయకులు బోండా సహా ఇతర నాయకులు దుర్భాషలాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకం," అంటూ పిన్నెల్లి విమర్శించారు.  అందులో భాగంగానే 10 కార్లతో వచ్చి కావాలనే గొడవకు దిగారు. ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగింది... ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మాచర్ల ఎం ఎల్ ఏ ఆరోపించారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందక్భంగా అంబటి, ముస్తాఫాలపై దాడులు చేసి హతమార్చటానికి కుట్ర పన్నారని పిన్నెల్లి గుర్తు చేసారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు, అయినా సరే... మేం సంయమనంతో వ్యవహరించామని ఎం ఎల్ ఏ చెప్పుకొచ్చారు. అయినా, అసలు విజయవాడ కాల్ మనీ బ్యాచ్ కి మాచర్ల లో పనేమిటని ఆయన ప్రశ్నించారు.

ఈయన కూడా కోపం నరం తెంచేసుకున్నారా?

ఈయన కూడా తన తండ్రి మాదిరే కోపం నరం తెంచేసుకున్నారా? తన కుటుంబం మీద ఉన్న ఫ్యాక్షన్ ముద్ర చెరిగిపోవటానికి రాజీ ఫార్ములాను ఔపోసన పట్టేశారా ? గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి రూటే మొత్తంగా మారిపోయినట్టు కనిపిస్తోంది. తన మీద, తన వ్యవహార శైలీ మీద తెలుగు దేశం అనుకూల మీడియా, అలాగే జాతీయ మీడియా లోని కొన్ని ప్రభావశీల మీడియా సంస్థలు తాను అధికారం చేపట్టకమునుపు నుంచీ చేస్తున్న దాడులకు సమాధానం ఇవ్వటం కోసమే అన్నట్టుగా, జగన్ మోహన్ రెడ్డి చాలా వేగం గా పావులు కదుపుతూ ముందుగా తన సొంత జిల్లా నుంచే రాజకీయ వలసలను, అది కూడా ప్రత్యర్థి శిబిరాల నుంచి రాజకీయ వలసలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అసలు..తనను  చూసేందుకు  కూడా ఇష్టపడని వారిని సైతం ఆయన అక్కున చేర్చుకుంటున్న విధానం అందరినీ ఆశర్య పరుస్తోంది. అలాంటి వారికి ఇప్పుడు సొంత పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించటం పై ఆసక్తి కర చర్చ సాగుతోంది. నాడు వైయస్సార్ హయాంలోనే సతీష్ రెడ్డి తన తండ్రి హత్య కేసులో ముద్దాయి అయినా...తాము ఎటువంటి ప్రతీకార చర్యలకు పోలేదని పదే పదే చెప్పేవారు. ఇప్పుడు అదే సతీష్ రెడ్డి వై ఎస్ ఆర్ సి పి లో  చేరటానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమ్మల మడుగులోనూ రాజకీయ వర్గ పోరు రెండు వైపులా నష్టం కలిగించిన విషయాన్నీ గుర్తు చేసుకున్న జగన్ మోహన్  రెడ్డి,  ఫ్యాక్షన్ రాజకీయలకు ముగింపు పలికేందుకు వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు కదులుతున్నారు. నాడు వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఆయననూ ఫ్యాక్షన్ నేతగా విమర్శించేవారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తరువాత తన కోపం అనే నరాన్ని తెంచేశానని వైయస్ చెప్పుకొచ్చేవారు. ఇక, వైయస్ సీఎంగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న ఇద్దరు కీలక నేతల మధ్య తనంతటగా తాను రాజీ కుదిర్చి అక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేశారు. కర్నూలు జిల్లాలో కాట‌సాని, బిజ్జం కుటుంబాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ త‌గ‌దాలు ఉన్నాయి. అయితే అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి రెండు కుటుంబాల మ‌ధ్య రాజీ కుదిర్చారు. దీంతో అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న బిజ్జం వ్యాపారాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. 2019 ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీ చేయాలని ప్రయత్నించారు. జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో పార్టీ లో  సైతం చేరారు. పాణ్యం సీటు కాటసాని రాంభూపాల్ రెడ్డికి వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షుడు  కేటాయించారు. ఇహ, అలాగే, మొదటి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రామసుబ్బారెడ్డి కుటుంబం ఇప్పుడు జగన్ సమక్షంలో వై ఎస్ ఆర్ సి పి లో చేరుతోంది.  ఇలా, ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు, తన  కుటుంబంతో దశాబ్దాల తరబడి వైరం కొనసాగిస్తున్న రాజకీయ ప్రత్యర్థులను వై ఎస్ ఆర్ సి పి గొడుగు కిందకు తీసుకు రావటం ద్వారా, విపక్ష తెలుగు దేశాన్ని అయోమయం లో పడేయాలనేది జగన్ మోహన్ రెడ్డి వ్యూహం గా కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ మసాలా ఫ్లేవర్ లాంటివాడ‌ట‌!

ఇటీవలే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పవన్ కల్యాణ్ మసాలా ఫ్లేవర్ లాంటివాడని అభివర్ణించారు. బీజేపీకి ఉన్న క్యాడర్ పవన్ కల్యాణ్ కు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక, బీజేపీ భావాలకు అనుకూలంగా ఉన్నంతకాలం వైసీపీకి త‌మ మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. కర్నూలులో హైకోర్టును బీజేపీ స్వాగతిస్తుందని టీజీ తెలిపారు. బీజేపీ డిమాండ్ ను జగన్ అమలు చేస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించాలని అన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒంట‌రిగా పోటీ చేయ‌కుండా ప‌వ‌న్‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో దిగింది. అయితే ఏడాది క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్లు అయినా వ‌స్తాయా? అని బిజెపి నేత‌లు మ‌ద‌న‌ప‌డుతున్నారు. సినీ గ్లామర్ తో రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన పవన్ కళ్యాణ్ కు గత ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం దక్కించుకోవాలి. లేకుంటే కనీసం కింగ్ మేకర్‌గా ఉండాలనుకున్న పవర్ స్టార్‌కు ఆంధ్ర ఓటరు షాక్ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని నిలుపుకోవాలని భావించిన ఆయన బీజేపీతో జట్టుకట్టారు. రాష్ట్రంలో ఒక్కశాతం ఓట్లు కూడా లేని బీజేపీతో జట్టు క‌ట్టారు. ఇక స్థానిక సమరంలో తన పవర్ చాటాలనుకుంటున్నారు ప‌వ‌ర్ స్టార్‌. స్థానిక పోరులో తమ జట్టు గెలుపు సాధిస్తుందనే విశ్వాసంతో ఆయ‌న ముందుకు పోతున్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా ఇన్ ఛార్జిల నియామకం కూడా జ‌న‌సేన పార్టీ పూర్తి చేసింది. పవన్ ఎంతగా తాపత్రయపడినా స్థానిక సమరంలో విజయం అంత సులభం కాకపోవచ్చనేది రాజకీయ వర్గాల మాట. అందుకు కారణాలు కూడా చెపుతున్నారు. వెల్ఫేర్ స్కీంలతో మంచి దూకుడు మీదున్న వైసీపీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జ‌న‌సేన పార్టీకి కొంత పట్టున్నా, ఇటీవల పరిపాలనా వికేంద్రీకరణతో ఆ ప్రాంతంలో కూడా వైసీపీ బలం పుంజుకుంది. ప్రధాన ప్రతిపకం టీడీపీ కూడా ఎన్నికలను ఎదుర్కోవడంపై తర్జనభర్జనలు పడుతుండగా జనసేన సత్తా చాటాలనుకోవడం అత్యాశే అవుతుందంటున్నారు విశ్లేష‌కులు. స్థానిక ఎన్నికలు అయ్యేవరకు సినిమా షూటింగ్‌లను కూడా ఆపి రాజకీయ వ్యవహారాలలో తలమునకలవుతున్నారు జ‌న‌నేత‌. స్థానిక ఎన్నిక‌ల్లో ప్రశ్నించటానికి వస్తున్న జ‌న‌నేత‌ను, అదే.... మసాలా ఫ్లేవర్ ను ప్రజలు ఆదరిస్తారా? ప‌వ‌న్ తన ఉనికిని నిలబెట్టుకుంటాడా? ఈ విష‌యాన్ని టీజీ వెంకటేశ్ యే చెప్పాలి.

చిన్నాన్న చిన్నాన్నే.. టార్గెట్ టార్గెట్టే...

లోకల్ వార్ లో ప్రూవ్ చేసుకోవటం తప్పదని తేల్చి చెప్పిన జగన్! ముగ్గురు పెద్ద రెడ్లకూ ప్రాంతాల వారీగా బాధ్యతలు.... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హోమ్ వర్క్ తో అటు పార్టీ నాయకులూ, ఇటు మంత్రులు నానా కుస్తీలు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను నేరుగా మంత్రులకు అప్పగించటమే కాకుండా, ముగ్గురు పెద్ద రెడ్లు- విజయసాయి రెడ్డి, వై వి సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి లకు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, రాయలసీమ బాధ్యతలను అప్పగించారు. అంటే, సన్నిహితులైనప్పటికీ, రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఉంటేనే పదవులు గానీ, రాజకీయ మనుగడ గానీ ఉంటాయనే సంకేతాలను ఆయన చాలా బలంగా ఈ ముగ్గురు పెద్ద రెడ్లకూ కమ్యూనికేట్ చేశారు. చిన్నాన్న చిన్నాన్నే, వ్యవహారం వ్యవహారమే అని తేల్చి చెప్పేశారు.  వీళ్ళ సంగతే ఇలా ఉంటె, ఇహ మంత్రుల విషయం చెప్పనక్కర్లేదు మరి అంటున్నారు పార్టీ క్యాడరు, నాయకులూ కూడా. పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టారు. మంత్రులకైతే ఏకంగా పదవులకే ఎసరు పెట్టారు. ప్రతిఒక్కరు గెలుపు కోసం పని చెయ్యాలని సూచించారు . అంతే కాకుండా పార్టీలోని కీలక నేతలకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారు జగన్. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి, ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి, రాయలసీమ బాధ్యతలు సజ్జల రామకృష్టారెడ్డికి అప్పగించారు. కేవలం గెలుపు మాత్రమే కాదు.. బంఫర్ మెజారిటీ సాధించాలని , అది కూడా సార్వత్రిక ఎన్నికల కంటే గొప్పగా ఉండాలని భావిస్తున్న వైసీపీ ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకూడదని కసరత్తులు చేస్తోంది వై ఎస్ ఆర్ సి  . ఇంతకీ వైసీపీ బలం ఏంటి ? క్లీన్ స్వీప్ చేసేలా ప్రజలు వై ఎస్ ఆర్ సి పి ని ఆదరిస్తారని ఎలా అనుకుంటుంది ? అనే ప్రశ్నలు ప్రస్తుతం అమరావతి కారిడార్లలో షికార్లు చేస్తున్నాయి.  'లోకల్ వార్' కు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న వై ఎస్ ఆర్ సి పి,  ఈ ఎన్నికల ద్వారా ప్రతిపక్ష పార్టీల నోటికి తాళాలు వెయ్యటం . ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించటం అనే రెండు టార్గెట్లను మంత్రుల, కీలక నాయకుల ముందుఉంచింది.  క్షేత్ర స్థాయిలో మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఈ ఎన్నికల్లో బంఫర్ మెజారిటీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ అందుకు కావల్సిన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.   ఇక ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు చెక్ పెట్టేలా నిఘా యాప్ ను కూడా ప్రారంభించింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.  మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఎన్నికల క్షేత్రంలో వ్యూహాత్మకంగా అధినేత ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నారు.ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకు చెక్ పెట్టేలా ముందే ప్రతిపక్ష పార్టీల నేతలకు గాలం వేస్తూ వలసలను ప్రోత్సహిస్తోంది కూడా. . ముఖ్యంగా టీడీపీ ముఖ్య నాయకులను , మాజీ మంత్రులను పార్టీ లో  చేర్చుకుని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తుంది . పులివెందుల సతీష్ రెడ్డి చేరికతో కడప జిల్లాలో ఏకపక్ష విజయాలను ఆవిష్కృతం చేయాలనేది వై ఎస్ ఆర్ సి పి ఆలోచన.

వైఎస్ వివేకా హత్యకేసుపై హైకోర్టు సంచలన నిర్ణయం

మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించింది. సిట్‌ నివేదికను 2 సీల్డ్‌ కవర్లలో న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను కోర్టు కొట్టి వేసింది. అనంతరం కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు వేసిన పిటిషన్లపై హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి వేసిన పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఏడాది దాటినా కేసును సిట్ చేధించలేదన్న న్యాయస్థానం. కేసులో అంతరాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందన్న న్యాయమూర్తి. ఇతర రాష్ట్రాల నిందితులను పట్టుకునే శక్తి సామర్ధ్యాలు సిబిఐ కి ఉందని న్యాయస్థానం అభిప్రాయ పడింది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.. 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన సొంత ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయి అని వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం రాజకీయంగా పెను సంచలనానికి దారితీసింది. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్య వెనుక పలు రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అప్పట్లో వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సిట్ విచారణ వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జగన్ ప్రభుత్వం కూడా వైఎస్ వివేకా హత్య కేసును సిట్‌తోనే విచారించాలని నిర్ణయించింది. అయితే, వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులు మాత్రం ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉందని వైసీపీ ఆరోపించిన టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి కూడా ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, సీబీఐ విచారణ అవసరం లేదని, సిట్ విచారణ చివరి దశకు వచ్చిందని జగన్ ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. కానీ, కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది కావ‌స్తున్నా ఇంకా బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు బాగా పెరిగాయి. అయినా వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై జ‌గ‌న్ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. అయితే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవ‌డం ఎపిలో చ‌ర్చ‌నీయంశంగా మారింది.

కళ్యాణం తో పాటు ఎంపి పి పదవి కూడా ఆ అమ్మాయికి బోనస్!

కళ్యాణం వచ్చినా కక్కు వచ్చిన ఆగదు అని సామెత. అచ్చు గుద్దినట్టు ఈ సంఘటన దానికి సరిపోతుంది. కాకపోతే.. కాస్త అటూ ఇటూగా.. ఇక్కడ కళ్యాణం తో పాటు ఆ పెళ్లికూతురు ఎం పి పి పదవికి నామినేషన్ వేసే మహత్తర అవకాశం కూడా దక్కించుకుంది. కలిసొచ్చే కాలమొస్తే, అటు పెళ్లి తో పటు, ఇటు పదవి కూడా దక్కించుకోవచ్చునని ఆ యువతి ఉదంతమే నిరూపిస్తోంది.  వివాహ నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే ఓ యువతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ వేయాల్సి వస్తున్న సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడులో చోటు చేసుకుంది. నిన్న రాత్రి శిరీష అనే యువతికి నిశ్చితార్థం అయింది. ఈ రోజు ఆమె నామినేషన్‌ వేయనుంది. కాబోయే భర్త కుటుంబం తరఫున ఆమె పోటీకి సిద్ధమై ఎన్నికల బరిలో నిలుస్తోంది.  ఇలా హడావిడిగా జరగడానికి కారణముంది. కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది. వైసీపీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను దేకనకొండ గ్రామానికి చెందిన బెల్లం చంద్రశేఖర్‌ కు పార్టీ అప్పగించింది. దీంతో తన కుటుంబం నుంచే అభ్యర్థిని నిలపాలని ఆయన భావించారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. దీంతో ఆయన తన పెద్ద కుమారుడు సురేష్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుని, వెంకట నర్సయ్య అనే వ్యక్తి కుమార్తె శిరీషతో నిన్న రాత్రి హడావుడిగా నిశ్చితార్థం చేసుకున్నాడు. నేటితో ఎంపీటీసీ పదవులకు నామినేషన్‌ గడువు ముగుస్తుంది. దీంతో తనకు కాబోయే కోడలితో చంద్రశేఖర బుధవారం నామినేషన్‌ వేయించనున్నారు.

ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు: బోండా ఉమా, బుద్ధ వెంకన్న 

రాష్ట్రం లో వై ఎస్ ఆర్ సి పి  ప్రభుత్వం మద్దతుతో ఆ పార్టీ కార్యకర్తలు విద్వంసానికి పాల్పడుతున్నారని, మాజీ ఎం ఎల్ ఏ బోండా ఉమా మహేశ్వర రావు, ఎం ఎల్ సి బుద్ధ వెంకన్న ఆరోపించారు. మాచర్ల ఘటనపై పీఎస్‍లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్టు చెప్పిన మాజీ ఎం ఎల్ ఏ బోండా ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ -" మా వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు . మా వాహనాలతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు . కర్రలతో నన్ను, మా అడ్వొకేట్‍ను కొట్టారు . మాకు గాయాలయ్యాయి, రక్తం కూడా కారుతోంది . డీఎస్పీపై కూడా దాడి చేశారు . పోలీసు రక్షణ ఉన్నా మాపై దాడి జరిగింది. ప్రాణాలతో బయటపడతామనుకోలేదు," అని ఉమా మహేశ్వర రావు మీడియా తో చెప్పారు. ఇదిలా ఉండగా, ఎం ఎల్ సి బుద్ధ వెంకన్న మాట్లాడుతూ-" పల్నాడులో మా పర్యటన వివరాలను వైసీపీకి పోలీసులు అందించారు. అడుగడుగునా మాపై దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారు," అని వివరించారు.  విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న మాజీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి. మాచర్లలో నామినేషన్లు వేయడంలో వస్తున్న ఇబ్బందులను మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వెళ్లిన బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు.కారు అద్దాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడంతో ఉద్రీక్తత నెలకొంది. నిజానికి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ముందుగానే, తెలుగుదేశం పార్టీ నాయకులు చెపుతూ వస్తున్నారు. ఈ విషయమై డి జి పి కి కూడా ఫిర్యాదు చేశారు కూడా. అయినప్పటికీ, వై ఎస్ ఆర్ సి పి శ్రేణుల దాడుల పరంపరలో అటు తెలుగు దేశం తో పాటు, జన సేన, బీ జీ పి కార్యకర్తలు, నాయకులు గాయపడుతున్నారు.

వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీళ్లేదా?  మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా?   వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నాం: చంద్రబాబు నాయుడు  టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీళ్లేదా? మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు' అని ప్రశ్నించారు. తమ నేతల కారును వెంబడించి దాడి చేశారని చంద్రబాబు తెలిపారు. కశ్మీర్‌, బిహార్‌లోనూ ఎన్నడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. 'వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులను కూడా బంధిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారు. మాచర్లలో దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతున్నా ఆయనకు చీమకుట్టినట్లయినాలేదు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోండా ఉమా, బుద్ధా వెంకన్నపై వైసీపీ శ్రేణుల దాడి!!

వైసీపీ శ్రేణులు ఏకంగా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. బోండా ఉమ, బుద్దా వెంకన్న కార్లను అడ్డగించిన వైసీపీ శ్రేణులు వాటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ కార్యకర్తలు తమ వెంటపడ్డారని, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎవరూ లేరని బోండా ఉమ వెల్లడించారు.  నిజానికి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ముందుగానే, తెలుగుదేశం పార్టీ నాయకులు చెపుతూ వస్తున్నారు. ఈ విషయమై డి జి పి కి కూడా ఫిర్యాదు చేశారు కూడా. అయినప్పటికీ, వై ఎస్ ఆర్ సి పి శ్రేణుల దాడుల పరంపరలో అటు తెలుగు దేశం తో పాటు, జన సేన, బీ జీ పి కార్యకర్తలు, నాయకులు గాయపడుతున్నారు.

కార్పొరేట్లకు దోచిపెట్టి ప్రజలకు వాతలు పెడుతున్న కేంద్రం

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రతరం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో పెట్రో ధరలు భారీగా పతనమయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పట్రోల్ పై రూ.2.69, డీజిల్ పై రూ.2.33 తగ్గించింది. అయితే ఏప్రిల్ 1 నుంచి మాత్రం జీఎస్ 6 నిబంధనల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29కు చేరింది. పెట్రోల్‌పై రూ.2.69 తగ్గగా.. డీజిల్‌పై రూ.2.33 తగ్గింది. లీటర్ డీజిల్ రూ.63.01కి చేరింది. మంగళవారం (మార్చి 10, 2020) ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.98కి విక్రయించగా.. డీజిల్ రూ.65.34కి విక్రయించారు. సోమవారం (మార్చి 9, 2020) పెట్రోల్, డీజిల్ ధరలు రూ.71 మార్క్ చేరాయి. 8 నెలల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరింది. ఇది 2019 జూలై తర్వాత కనిష్ట ధరకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులతో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పెట్రో ఉత్పత్తలు ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2014-15లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 84.16 డాలర్లుగా ఉంది. ఇది 2019 డిసెంబర్‌ నాటికి 63.98 డాలర్లుగా, ప్రస్తుతం అంటే 2020, మార్చి నాటికి 37 డాలర్లకు చేరింది. మొత్తంమీద 2014తో పోల్చిచూస్తే దాదాపు 50 డాలర్లు తగ్గింది. ముడి చమురు 5 డాలర్లు తగ్గితేనే భారత్‌కు 12-13 బిలియన్‌ డాలర్ల(84 వేల కోట్లు) మేర విదేశీమాదక ద్రవ్యం ఆదా అవుతుంది. అంటే 2014తో పోల్చుకుంటే 2019 నాటికి బ్యారెల్‌కు దాదాపు 20 డాలర్ల మేర తగ్గింది. ఆ లెక్కన ఆయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు అయ్యే విదేశీ మారక ద్రవ్యం 3 లక్షల 50 వేల రూపాయలు మిగిలింది. దీనికి అదనంగా ఆయిల్‌పై 2014-15లో రూ.1.26 లక్షల కోట్లుగా ఉన్న పన్ను వసూలు, 2018-19 నాటికి అదనంగా దాదాపు రూ.1.53 లక్షల కోట్ల మేర పెరిగి రూ.2.79 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా రాష్ట్రాలు కూడా పన్నులను బాధేశాయి. రూ.1.6 లక్షల కోట్లుగా ఉన్న పన్ను ఆదాయం రూ.2.27 కోట్లకు చేరింది. అంటే అటు ఆయిల్‌ దిగుమతుల సమయంలో మిగిలిన విదేశీ మారక ద్రవ్యం, అటు పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం కలిపి దాదాపు రూ.5.7 లక్షల కోట్ల సొమ్ము మిలిలింది. ఈ సొమ్మునంత టినీ మోడీ సర్కార్‌ వివిధ రూపాల్లో కార్పొరేట్లకు దోచిపెట్టి సాధారణ ప్రజలకు మాత్రం వాతలు పెడుతోంది.

గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చిక్కుల్లో పడ్డారు. 220 కోట్ల రుణం రిక‌వ‌రీకి విష‌యంలో మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం వేయ‌డానికి ఇండియ‌న్ బ్యాంక్ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. బ్యాంకుకు భారీ రుణం ఎగవేత వ్యవహారంలో ఆయన ఆస్తుల వేలం వేస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంకు అధికారులు మరోసారి ప్రకటన జారీ చేయడం గంటాను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏప్రిల్ 16న ఇండియన్ బ్యాంకు ఈ వేలం పద్ధతి లో ఆస్తులను వేలం వేయనుంది. వేలం వేయనున్న ఆస్తుల్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్ లోని గంటాకు చెందిన ఫ్లాట్ ఉంది. వేలంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల 11 నుంచి 15 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను బ్యాంకు ఆహ్వానించింది. గంటా కి చెందిన ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు లో గతంలో నూట నలభై ఒక కోట్ల అరవై ఎనిమిది లక్షల ఏడు వేల అయిదు వందల నలభై ఎనిమిది రూపాయలు (రూ.1416807548.07) లోన్ తీసుకుంది. కానీ రుణం తీర్చకపోవడంతో ఇప్పుడు అసలు వడ్డీ కలిపి రెండు వందల ఇరవై కోట్ల అరవై ఆరు లక్షల తొంభై వేల నాలుగు వందల అరవై ఆరు (రూ.2206690446.70) రూపాయలకు చేరింది. రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్ వాటిని వేలం వేసి ఆ మొత్తం రాబట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ ప్రత్యూష కంపెనీ లో గంటా తో పాటు ఏడుగురు సభ్యులున్నారు. ప్రత్యూష సంస్థ డైరెక్టర్లు ఆస్తుల వేలానికి కూడా ఇండియన్ బ్యాంక్ రంగం సిద్ధం చేసింది.

రాణా కపూర్‌కు, ప్రియాంక గాంధీకి మధ్య సంబంధం ఏమిటి?

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రియాంక గాంధీ నుంచి పెయింటింగ్ ఎందుకు కొన్నారు? ఇప్పుడు ఈ వ్యవహారానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. దేశంలో ప్రతి ఆర్థిక నేరానికీ గాంధీల కుటుంబంతోనే లోతైన సంబంధాలు ఉంటున్నాయి. సోనియా గాంధీకి విజయ్ మాల్యా అప్‌గ్రేడెడ్ విమాన టికెట్లు పంపేవారు. మన్మోహన్ సింగ్, చిదంబరంతో ఆయనకు సంబంధాలు ఉండేవి. నీరవ్ మోదీ నగల కలెక్షన్‌ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఆయన బ్యాంకును మోసం చేశారు. ప్రియాంక వాద్రా నుంచి రాణా కపూర్ పెయింటింగ్స్ కొన్నట్లు ఇప్పుడు వెల్లడైంది'' అని అమిత్ మాలవీయ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ప్రియాంక గాంధీపై వచ్చిన ఆరోపణల గురించి కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ ఘాటుగా స్పందించారు. ఎమ్ఎఫ్ హుస్సేన్ రాజీవ్ గాంధీ చిత్రాన్ని వేశారు. దాన్ని గాంధీ కుటుంబం రాణా కపూర్‌కు రూ.2 కోట్లకు విక్రయించింది. ఇదంతా 2010లో జరిగిన వ్యవహారం'' అని వివరించారు. రాణా కపూర్ చెక్ రూపంలో ప్రియాంక గాంధీకి ఆ చెల్లింపు చేశారని, ఆ వివరాలను ప్రియాంక ఐటీ రిటర్న్స్‌లోనూ చూపించారని అభిషేక్ చెప్పారు. ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఒకటి ఇటీవల రూ.13.44 కోట్లకు అమ్ముడుపోయిందన్న విషయాన్ని అభిషేక్ గుర్తుచేశారు. బీజేపీ అసలు విషయం మీద నుంచి దృష్టి మరల్చేందుకే తాజా ఆరోపణలు చేసిందని అన్నారు. ''మోదీ నిర్వహించిన ప్రముఖ అంతర్జాతీయ సదస్సుకు 2020 మార్చి దాకా రాణా కపూర్ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న విష‌యాన్ని గుర్తు చేశారు. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈడీ కస్టడీలో తీసుకున్నారు. రాణా కపూర్ కుటుంబ సభ్యుల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రాణా కపూర్ కూతురు రోష్నీ కపూర్‌ను లండన్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెను ఆపేశారు.

ఎన్నిక‌ల వాయిదాపై గుస‌గుస‌లు రుస‌రుస‌లు!

  కొన్ని వివాదాల కారణంగా 3 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో ఎన్నికలను వాయిదా వేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్, అర్బన్ డెవలోపమెంట్ అథారిటీలో పలు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది. అలాంటి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించ‌డం లేదు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో పంచాయతీలలో కూడా ఎన్నికలు నిలిపివేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినందున ఆయా గ్రామాల్లో పంచాయతీ, ఎంపిటిసి, జడ్పీటీసిలకు ఎన్నికలు నిర్వహించ‌డం లేదు. ఎన్నిక‌లు వాయిదా వేసిన ప్రాంత‌ల గురించి రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో ఎలక్షన్ లేదు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లో ఎన్నికలు వాయిదా. బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో ఎన్నికలు వాయిదా. జనసేన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరంలో కూడా ఎన్నికలు వాయిదా. నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గం పాలకొల్లు లో ఎన్నికలు వాయిదా. నారా లోకేష్ మంగళగిరి లో ఎన్నికలు వాయిదా. దివంగ‌త డా.కోడెల శివ ప్రసాద్ గారి నరసరావుపేట లో ఎన్నికలు వాయిదా. తమ్మినేని సీతారామ్ (స్పీకర్) నియోజకవర్గం ఆముదాలవలస లో ఎన్నికలు వాయిదా. పేదల రేషన్ బియ్యం స్కామ్ చేసిన ఎవడమ్మ మొగుడి నానీ నియోజకవర్గం గుడివాడ లో ఎన్నికలు వాయిదా. చివరికి శుక్రవారం కోర్టు హాజరుదారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఇల్లు ఉన్న 'తాడేపల్లి'లో కూడా ఎన్నికలు వాయిదా ప‌డ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏమిట‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

కొత్త రిజ‌ర్వేష‌న్ లెక్కింపు విధానంలో ఓ.సి.ల‌కు అన్యాయం!

స్థానిక సంస్థ‌ల రిజ‌ర్వేష‌న్ ల‌కు సంబంధించిన గ‌తంలో వున్న లెక్కింపు విధానాన్ని పూర్తిగా మారుస్తూ 559, 560 జీవోలు ప్ర‌భుత్వం జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టం1994 పెట్టిన తరువాత, గత 25 సంవత్సరాలుగా, అవలంభించిన విధానాన్ని తప్పించి, పూర్తి భిన్నంగా, ఈ జీవో లను విడుద‌ల చేశారు. బహుశా భారత దేశంలో, ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి విధానం లేదు. దీనిపై రాజ‌కీయ పార్టీలు అంత‌గా దృష్టి పెట్ట‌లేదు. రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా మార్చిన విధానం, తేడాల‌ను గమనించ‌లేదు. ఈ జీవోల్లో తెలిపిన‌ట్లు కొత్త విధానంలో మేజర్ పంచాయితీలన్నీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కి వెళతాయి. ఆ తదుపరి పెద్ద పంచాయతీలు బి.సి. క్యాటగిరిలోకి వెళతాయి. మిగిలిన చిన్న పంచాయితీలు మాత్రమే జ‌న‌ర‌ల్ గా మిగులుతాయి. ఒక వేళ 100% ఎస్సీ జ‌నాభా ఉన్న చిన్న పంచాయితీలు కూడా జ‌న‌ర‌ల్‌ గా మిగులుతాయి. అంతే కాదు 100% బి.సి.లు ఉన్న చిన్న పంచాయితీలు కూడా జ‌న‌ర‌ల్‌గా మిగులుతాయి. ఆ చిన్నపంచాయితీల్లో ఓసీ లు నిలబడే అవకాశం ఉండదు. ఇందువలన ఓసీ లు నిలబడే అవకాశం ఉండదు. ఓసీలు ఇక్క‌డ న‌ష్ట‌పోవ‌ల్సిందే. ఇదొక రాజకీయ ఎత్తుగడలో భాగం. విపక్ష రాజకీయ పార్టీలు, ఈ తేడాని గమనించలేదు. గత 25 సంవత్సరాలుగా ఎస్టీ, ఎస్సీ, బి.సి.ల‌ ల, పంచాయతీ జ‌నాభా/ పంచాయతీ జ‌నాభా తో ప‌ర్సంటేజ్‌లు తయారు చేసి, వాటి ఆధారంగా, ఎక్కువ ప‌ర్సంటేజ్ ఉన్న పంచాయతీలను, సంబంధిత, క్యాటగిరీకి కేటాయించేవారు. ఇప్పుడు ఈ కొత్త జోవో ల ద్వారా, లెక్కింపు విధానాన్ని పూర్తిగా మార్చారు. ఈ కొత్త విధానం ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బిసి పంచాయతీ జ‌నాభా/ఎస‌్టీ, ఎస్సీ, బి.సి. మండ‌ల జ‌నాభాతో ప‌ర్సంటేజ్‌లు త‌యారు చేసి వాటిలో ఎక్కువ శాతం ఉన్న పంచాయతీలను కేటాయిస్తున్నారు. ఇది గత25 సంవ‌త్స‌రాలుగా అవలంభిస్తున్న విధానానికి భిన్నంగా ఉంది. ఈ తేడాను గమ యించగలరు. ఈ విధానంలో ఓ.సి.లు వారికి చెందవలసిన అవకాశాలు కోల్పోతున్నారు. కేవలం పంచాయితోల్లోనే కాదు, ఎం.పి.టి.సిలూ, జ‌డ్పీటిసిలు, ఎం.పి.పిలు, జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ మునిసిపల్ కౌన్సిలర్లు, చైర్మన్స్, అన్నింటిలో మార్పులు వస్తాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో బీసీలను వైసీపీ దారుణంగా మోసం చేసిందని కొన్ని జిల్లాల్లో రిజర్వేషన్లలో సగానికి పైగా కోతపెట్టిందని మండిపడ్డారు చంద్రబాబు. జడ్పీటిసి స్థానాల్లో నెల్లూరులో 13%, ప్రకాశంలో 19.64%, పశ్చిమ గోదావరిలో 18.75%, కృష్ణా 20.41%, తూర్పుగోదావరి 20.97%, విశాఖలో 20.51% కు బీసీలను పరిమితం చేశారని అన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 34% పైగా స్థానాలను బీసీలకు కేటాయించామన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకునేందుకు బీసీలందరూ ఏకంకావాలని పిలుపునిచ్చారు.

టీడీపీలో బాలకృష్ణ పట్టు కోల్పోతున్నారా ?

తన సొంత మ‌నిషి పార్టీ ఫిరాయింపుని ఆపుకోలేని హీరో బాల‌కృష్ణ పార్టీకి వారసుడు ఎలా అవుతాడు? పార్టీని ఏమి ఉద్ధరిస్తాడు? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తాను పదవులు సీట్లు ఇప్పించుకున్న నేతలు ఇప్పుడు ఆయన మాట వినడం లేదా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీలో ఒకప్పుడు తనను నమ్ముకున్న నేతలకు పదవులు సీట్లు ఇప్పించుకున్నారు బాలకృష్ణ. ఈ విషయంలో చంద్రబాబు కూడా బాలయ్యకు అడ్డు చెప్పలేదనే టాక్ ఉంది. అయితే టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత సీన్ మారిపోయింది. బాలకృష్ణ సహకారంతో ఎఫ్‌డీసీ చైర్మన్‌ అయిన సినీ నిర్మాత, టీడీపీ మాజీ నేత అంబికా కృష్ణ బీజేపీలో చేరిపోయారు. తాను పార్టీ మారే విషయాన్ని బాలకృష్ణకు ముందుగానే చెప్పానని ఆయన ఆ తరువాత చెప్పుకొచ్చారు. తాజాగా బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడిగా చెప్పుకునే కనిగిరి మాజీ ఎమ్మెల్యే బాబూరావు కూడా వైసీపీలో చేరిపోవడం బాలకృష్ణ, అభిమానులు, టీడీపీ శ్రేణులకు షాక్ ఇస్తోంది. 2014లో బాలయ్య సహకారంతోనే కనిగిరి టీడీపీ టికెట్ తెచ్చుకున్న బాబూరావు... ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2019లో చంద్రబాబుకు ఆయనకు కనిగిరి నుంచి కాకుండా మరో స్థానం నుంచి టికెట్ కేటాయించారు. దీంతో చాలాకాలంగా పార్టీ వ్యవహారాలకు బాబూరావు దూరంగా ఉంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం కాగానే పార్టీ మారుదామని బాబురావు భావించినా బాలయ్య టీడీపీలోనే ఉండమని కోరడంతో ఇన్నాళ్లు అయిష్టంగానే పార్టీలో కొనసాగారు. తనకు రాజకీయాల కంటే బాలయ్యతో సంబంధాల ముఖ్యమని కదిరి బాబురావు గతంలోనే తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి చేరడానికి ఇదే మంచి సమయమని బాబురావు భావించారు. వైసీపీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చూపిస్తే భవిష్యత్తు బాగుంటుందని బాబురావు అనుకుంటున్నారు. ఈ మేరకు వైసీపీలో చేరే విషయమై బాలయ్యతో మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. టీడీపీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని, అందుకే వైసీపీలో చేరుతున్నట్లు బాబురావు బాలయ్యకు ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య కూడా సరే..మీ ఇష్టం..అని ఒప్పుకున్నట్లు సమాచారం. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాబురావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా బాబురావుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాపు సామాజికవర్గానికి చెందిన కదిరి బాబురావు చేరికతో జిల్లాలో ప్రకాశం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ భావిస్తోంది. మొత్తంగా తనకు అత్యంత సన్నిహితుడైన బాలయ్యకు చెప్పి మరీ బాబురావు వైసీపీలో చేరడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. తన బావమరిది బాలయ్య దగ్గరుండి మరీ బాబురావును వైసీపీలోకి పంపించడం పట్ల చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. బాలయ్య రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడతారని టీడీపీ వర్గాలు భావించాయి. కానీ అలా జరగలేదు. బాబూరావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ నేతల బాలకృష్ణ మాటలు కూడా వినడం లేదనే చర్చ పార్టీలో మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడి అధికార వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కీలక నేతలంతా పార్టీని వీడుతుండటంతో చంద్ర‌బాబునాయుడికి దిక్కుతోచ‌ని స్థితి ఏర్ప‌డింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. సొంత పార్టీలోనే కాదు ప్ర‌భుత్వంలోనే ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించడం లేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే పార్టీలను పక్కన పెట్టి ప్రొటోకాల్‌ పాటిస్తారని అయితే లేపాక్షిలో నిర్వహించే ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటో ఎక్కడా కనిపించడం లేద‌ట‌. కేవలం ఆహ్వాన పత్రికలో పేరు తప్ప, సభావేదిక, ఆహ్వాన తోరణాలు, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఫొటో కనిపించడం లేదు.

నాటుసారా కేంద్రాల‌పై మెరుపు దాడులు

నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాను జల్లెడ ప‌డుతున్నారు. 10 వేల మంది సిబ్బందితో పోలీసు, ఎక్సైజ్ శాఖ మెరుపుదాడులు చేస్తూ హ‌డ‌లెత్తిస్తున్నారు. ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న మెరుపు దాడులు. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ డైరెక్ష‌న్‌లో ఇటీవ‌ల ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మెరుపు దాడులు ప్రారంభించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై బుధ‌వారం తెల్ల‌వారుఝాము 4 గంటల నుండి దాడులు కొన‌సాగుతున్నాయి. పదివేల మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో , అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సిఐలు,ఎస్సైలు, మొత్తం పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు చేస్తున్నారు. నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాను జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేశారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.