వైజాగ్ లో విజ‌య‌సాయిరెడ్డి ప‌రువు నిల‌బ‌డుతుందా?

‘వైజాగ్‌’ మున్సిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. సిటీలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి చెందిన వారు. ఎమ్మెల్యేల‌కు స్థానికంగా గట్టి పట్టు వుంది. అయితే ఇక్కడ అధికార పార్టీకి విజయం అంత సులువేమీ కాదు. పాల‌నా రాజధానిని ఇక్కడకు తెస్తున్నామనే ప్రకటన, నవరత్నాలు తమకు ఓట్లు తెచ్చి పెడతాయని అధికారపార్టీ భావిస్తోంది. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై నెల‌కొన్న అసంతృప్తి తమ విజయావకాశాల‌పై అనుమానాలు క‌ల్గిస్తున్నాయ‌ని స్వంత‌పార్టీ నేత‌లే చెపుతున్నారు. తీసేసిన పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, బీసీ రిజర్వేషన్ల తగ్గింపు, శానిటరీ వర్క్‌ర్ల జీతాలు పెంచకపోవడం, రేషన్‌కార్డుల‌ తొగింపు వంటి అంశాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్ర‌తిప‌క్షం ఆశ పెట్టుకుంది. టిడిపి సీనియర్‌ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెల‌గపూడి రామకృష్ణబాబు. పి.వి.వి.నాయుడు, గణేష్‌కుమార్‌ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. వీరి దూకుడుకు అడ్డుకట్టవేసే బాధ్యతను ‘విజయసాయిరెడ్డి’ తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థును గెలిపిస్తే సి.ఎం. వద్ద ఆయన పరపతి మరింత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే ఆయన పరువుపోవడం ఖాయం. పాల‌నా రాజధానిగా ‘విశాఖ’ను ప్రకటించిన తరువాత కూడా అక్కడ అధికారపార్టీ ఓడిపోతే ప్రతిపక్షం చెప్పినట్లు ‘విశాఖ’ పౌరులు అక్కడకు రాజధాని రావడం ఇష్టం లేదనే విషయం స్పష్టం అవుతుంది. గుంటూరు, విజ‌య‌వాడ‌, వైజాగ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది? రాజధానిని ‘అమరావతి’ నుంచి ‘విశాఖ’కు త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజల‌ నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అయింది. ఇక్క‌డ జ‌రిగే ఎన్నిక‌ల్లో దాని ప్ర‌భావం క‌నిపిస్తుంద‌ని రాజ‌ధాని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని ప్రకటన రావడంతో ‘వైజాగ్‌’ ప్రజల్లోనూ ఆనందం కనిపించింది. అయితే ‘వైజాగ్‌’ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని, అక్కడ అభివృద్ధి జరిగితే చాల‌నే విధంగా ఉన్నారని ప్రతిపక్ష టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘వైజాగ్‌’ మున్సిపాల్టీకి జరుగుతున్న ఎన్నికల‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తినెల‌కొంది. వైకాపా స్థాపించిన దగ్గర నుంచి ‘వైజాగ్‌’ పట్టణం ఆ పార్టీకి క‌ల‌సి రావ‌డం లేదు. 2014లో పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌ స్వయంగా ‘విశాఖ’ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. తరువాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా భారీ స్థాయిలో 151 స్థానాలు గెలిచిన‌ప్ప‌ట్టికీ ‘వైజాగ్‌’ పట్టణంలో ఆ పార్టీకి మళ్లీ షాక్‌ తగిలింది. అసెంబ్లీ స్థానాల్లో సిటీలో ఉన్న నాలుగు స్థానాల్లో ఓడిపోయింది. ముక్కోణపు పోటీలో పార్టీ ఎంపీ విజయం సాధించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ‘మున్సిపల్‌’ ఎన్నికల్లో తమ సత్తా చాటి ‘వైజాగ్‌’లో జెండా పాతాల‌ని వైకాపా ఆశిస్తోంది. విజయసాయిరెడ్డి గత కొంత కాలంగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టిసారించి చక్రం తిప్పుతున్నారు. ‘వైజాగ్‌’ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. విశాఖ‌లో గెలిచి అధికార‌పార్టీ ప‌రువు కాపాడుకుంటుందా?

ప్రియాంక తలకు చుట్టుకుంటున్న హుస్సేన్ పెయింటింగ్ విక్రయ వ్యవహారం!

  కాని కాలం లో పైన వేసుకున్న బట్టే పామై కరుస్తుందని సామెత. అలా అయింది ప్రస్తుతం గాంధీ కుటుంబం పరిస్థితి. అప్పుడెప్పుడో ఎఫ్ ఎం హుస్సేన్ వేసిన పెయింటింగ్ రాజీవ్ గాంధీకి బహుమతిగా ఇవ్వటమేమిటి... దాన్ని తర్వాత ప్రియాంక గాంధీ రాణా కపూర్ కి విక్రయించటమేమిటి ... అది ఈ రోజు ఎస్ బ్యాంక్ వ్యవహారం తో లింక్ అవటమేమిటి..... ఏమిటో పాపం గాంధీల ఫ్యామిలీకి అన్నీ సినిమా కష్టాలే .....  ఎస్  బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌‌కు రెండు కోట్లకు పెయింటింగ్ విక్రయించిన విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.  ప్రియాంక నుంచి ఈ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మిలింద్ దేవరా తనపై ఒత్తిడి తెచ్చారని ఈడీకి రాణా కపూర్ వాంగ్మూలం ఇచ్చారు. పెయింటింగ్ కోసం తాను ఇచ్చిన రెండు కోట్లతో ప్రియాంక సిమ్లాలో కాటేజ్ కొనుగోలు చేసిందని చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఓ కేసులో నిందితుడి నుంచి తీసుకున్న డబ్బుతో ప్రియాంక కొనుగోలు చేసిన కాటేజ్‌ను ‘నేరం ద్వారా వచ్చిన ఆదాయం’గా పరిగణించాల్సి ఉంటుందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆస్తిని తమ అధీనంలోకి తీసుకునే అధికారం ఈడీకి ఉంటుందని  అంటున్నారు. కపూర్‌‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రియాంకకు త్వరలోనే సమన్లు జారీ చేయడంతో పాటు సిమ్లాలోని కాటేజ్‌ను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రియాంక నుంచి రాణా కపూర్ కొనుగోలు చేసిన పెయింటింగ్‌ను  సీజ్‌ చేసినట్టు ఎన్ఫోర్స్‌మెంట్ (ఈజీ) అధికారులు ప్రకటించారు. ముంబైలోని రాణా కపూర్‌‌ నివాసం నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తాను గీసిన చిత్రపటాన్ని 1985లో కాంగ్రెస్‌ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజీవ్ గాంధీకి బహూకరించారు. అయితే, 2010లో దీన్ని ప్రియాంక గాంధీ రెండు కోట్లకు రాణా కపూర్‌‌కు విక్రయించారు. ఈ పెయింటింగ్‌ను కొన్నందుకు ధన్యవాదాలు చెబుతూ రాణా కపూర్‌‌కు అప్పట్లో ప్రియాంక లేఖ రాశారు. ఏది ఏమైనా కమలనాధులు ఉద్దేశ పూర్వకంగా గాంధీ ఫ్యామిలీ ని ముప్పతిప్పలు పెడుతున్నారా అనే సందేహాలయితే ఢిల్లీ 10, జనపథ్ కి బలంగా ఉన్నాయి.

ఎస్ బ్యాంక్ వ్యవహారం నుంచి బయటపడ్డ తిరుపతి బాలాజీ.. పూరీ జగన్నాధుడికి మాత్రం చుక్కలు...

ఎస్ బ్యాంక్ వ్యవహారం పై సోషల్ మీడియా మండిపడిపోతోంది. సత్యం కంప్యూటర్స్ అనే ప్రయివేట్  కంపెనీ సంక్షోభ సమయంలో టెక్ మహీంద్రా అనే ప్రైవేటు సంస్థ ద్వారా అప్పట్లో నష్ట నివారణచర్యలు చేపట్టిన విషయాన్నీ గుర్తు చేస్తున్న నెటిజన్లు, ఇప్పుడు  ఎస్ బ్యాంక్ అనే ప్రయివేట్ బ్యాంక్ తాలూకు ఉద్యోగుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం కోసం కార్పొరేట్ బ్యాంక్ లైన -ఐ సి ఐ సి ఐ, యాక్సిస్, హెచ్ డి ఎఫ్ సి ల సాయం కోరకుండా, ప్రభుత్వం ఇప్పుడు -స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ ఐ సి లాంటి జాతీయ సంస్థల ను రంగం లోకి ఎందుకు దింపుతోందనేది నెటిజన్ల ప్రశ్న. " ఓ పక్కనేమ్మో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చెయ్యాలి అంటారు, ఇంకో పక్కన ప్రైవేట్ సంస్థలు మ్యూనిగిపోతుంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కలపాలి అంటారు. మీరు ఏమాట్లాడుతున్నారో మేకైనా అర్ధమౌతోందా?," అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.  ఇప్పటికే- పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ను మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయటం,  హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలో అక్రమ నగదు చలామణికి పాల్పడినట్టు పీఎంఎల్ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేయటం జరిగిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్ సహా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. యెస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెల పేరుతో నకిలీ కంపెనీ ప్రారంభించిన రూ.600 కోట్లు డీహెచ్ఎఫ్ఎల్ నుంచి తరిలించినట్టు గుర్తించారు. యెస్ బ్యాంకు మొత్తం రూ.4,450 కోట్ల రుణం మంజూరు చేయగా ఇందులో డీహెచ్ఎఫ్ఎల్కి రూ.3,700 కోట్లు, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్కి రూ.750 కోట్లు బదిలీచేశారు. అయితే, రుణాల సకాలంలో చెల్లించకపోయినా యెస్ బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 79 షెల్ కంపెనీలు ఏర్పాటుచేసి మొత్తం రూ.13,000 కోట్లను మనీల్యాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ 4,450 కోట్లు కూడా అందులో భాగంగానే తరలించినట్టు భావిస్తోంది. ఇంత పకడ్బందీ గా వ్యహారం నడిపిన ఎస్ బ్యాంక్ యాజమాన్యం ఈ రోజు లక్షలాది మంది డిపాజిటర్లను, ప్రభుత్వ, ప్రవేట్ సంస్థలను రోడ్డు మీదకు ఈడుస్తుంటే, ఆ సంస్థకు జాతీయ బ్యాంకుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయటం దేనికిసంకేతమనేది నెటిజన్ల ప్రశ్న. తిరుపతి వెంకన్న సొమ్ము ను ముందస్తుగా టీ టీ డీ ఎలాగో విత్ డ్రా చేయగలిగింది కానీ, పూరీ జగన్నాధుడికి మాత్రం ఎస్ బ్యాంక్ సున్నమేసింది. పూరీ ఆలయ అధికారులు ఇప్పుడు తమకు రావాల్సిన 547 కోట్ల రూపాయలు ఎలారాబట్టుకోవాలో అర్ధం కాని పరిస్థితి.... మరో వైపు ఏ పీ ఎస్ ఆర్ టీ సి కూడా ఒక రెండు వందల కోట్ల రూపాయలకు పైబడి ఎస్ బ్యాంక్ నుంచి సొమ్ము రాబట్టుకోవలసి ఉంది.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడంలేదు?

కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గడం లేదు. నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 శాతం మేర తగ్గాయి. బ్యారెల్ ధర 45 డాలర్లకు పడిపోయింది. కానీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆ మేరకు తగ్గలేదు. కరోనా వైరస్ కారణంగా చైనా సహా ఇతర దేశాల్లో ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీంతో ఈ ప్రభావం కనిపిస్తోంది. కరోనా కారణంగా మార్కెట్లు కూలుతున్నాయి. ఇన్వెస్టర్లు బంగారం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72, డీజిల్ రూ.65 వరకు ఉన్నాయి. 2017 సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 54 నుండి 56 డాలర్ల మధ్య ఉంది. అప్పుడు పెట్రోల్ ధర రూ.70, డీజిల్ రూ.58 వరకు ఉంది. ఆ తర్వాత 2018 చివరలో 2019 ప్రారంభంలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల వరకు పెరిగాయి. అయినా పెట్రోల్ ధరలు రూ.71, డీజిల్ రూ.64గానే ఉంది. అంటే అంతర్జాతీయంగా పెరిగిన ధరప్రకారం ఇక్కడి రేట్లు పెరగలేదు అని చెప్తున్నారు. నష్టాలు తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించడంలేదు. దేశంలో చమురు ధరల నియంత్రణ మీద కేంద్ర అజమాయిషీ వదులుకున్నాక ఈ పరిస్తితులు ఎడురౌతున్నాయు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ప్రస్తుతం 45 నుండి 50 డాలర్లుగా ఉంది. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 వరకు తగ్గాలి. అయితే గతంలో అధికంగా ధరలు తగ్గించనందున పెట్రో కంపెనీలు కొంత నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఆ నష్టాలను తగ్గించుకునేందుకు ధరలు తగ్గించడం లేదని భావిస్తున్నారు. గత దశాబ్దాలుగా ఈ నష్టాలను తగ్గించుకే పనిలోనే చమురు కంపెనీలు ఉన్నా ఆ నష్టాలు ఎందుకు తగ్గవో చమురు ధరలు ప్రజలకు ఎందుకు అందుబాటులోకి రావో సామాన్యుడికి ఎన్నటికీ సమాధానం లభించని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.  డాలరుతో రూపాయి మారకం విలువ క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి మరో కారణం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడిందని గుర్తు చేస్తున్నారు. రూపాయి మారకం గత ఏడాది రెండేళ్లలో రూ.68 నుండి రూ.72కి పడిపోయిందని, ఈ లెక్కన ధరలు రూ.2 వరకు అధికంగా ఉండాలని చెబుతున్నారు. భారీ తగ్గుదల కాగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. గత శుక్రవారం ఏడాదిలోనే ఒకేరోజు గరిష్టంగా తగ్గాయి. అదే సమయంలో 2016 తర్వాత వరుసగా వారం రోజుల్లో భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. బ్రెంట్ క్రూడాయిల్ 4 శాతం తగ్గి 49.67 వద్ద ఉంది. 2017 జూలై నుండి ఇది అత్యంత కనిష్టం. ప్రస్తుతం చమురు ధరలు దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో రూ.72.10లు. విజయవాడలో రూ.76.69లు. డీజిల్ ధర  డిల్లీలో 16 పైసలు క్షీణతతో రూ.65.07లు మన దగ్గర రూ.70.91లు ఉంది. దేశ రాజధానికి రాష్ట్రాలకు మద్య ధరల్లో ఈ వ్యత్యాసం ఎందుకుందో మనందరికీ తెలుసు. కేంద్ర రాష్ట్రాలు కొంతమేర పన్నులు తగ్గిస్తే తమకుఊరట కలుగుతుందని  సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు.

కరోనా వైరస్ దెబ్బకి దిగొచ్చిన చైనా కాలుష్యం

ఎంకిపెళ్లి సుబ్బి చావుకి వచ్చిందనేది పాత సామెత. ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేస్తే ....ఒకో సారి ఎంకి చావు సుబ్బి పెళ్ళికి వచ్చిందని కూడా చదువుకోవచ్చు. ఆర్ధిక మాంద్యం కారణం గా చైనా లో నైట్రోజెన్ డయాక్సయిడ్ లెవెల్స్ పడిపోయినట్టు నాసా, యూరోపియన్ స్పెస్ ఏజెన్సీ సంయుక్తంగా విడుదల చేసిన సాటిలైట్ ఇమేజెస్ ఇదే విషయాన్ని విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.  వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారకమైన నైట్రోజెన్ డయాక్సయిడ్  గణనీయంగా తగ్గటానికి చైనా ఎదుర్కుంటున్న ఆర్ధిక మాంద్యమే కారణమనేది నాసా వారి సూత్రీకరణ అన్న మాట. ఇంకాస్త వెనక్కు వెడితే, కరోనా వైరస్ వ్యాధి ఉధృతి కారణంగా 23 జనవరి తర్వాత చైనా లో పరిశ్రమలు, స్థానిక వ్యాపారాలు, రవాణా వ్యవస్థ పూర్తిగా కుదేలయ్యాయి. ఫలితంగా చైనా దేశం లో కాలుష్య శాతం గణనీయంగా తగ్గినట్టు శాస్త్ర వేత్తలు నిర్ధారించారు.  ఏ ఏడాది జనవరి 28 న తీసిన సాటిలైట్ చిత్రాలతో, నిరుడు జనవరి 28 న తీసిన చిత్రాలను పోలిస్తే, కాలుష్యం 30 శాతానికి పడిపోయినట్టు శాస్త్ర వేత్తలు నిర్థారించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యల కారణంగా చైనా లో కాలుష్య శాతం గణనీయంగాపడిపోయిందని ఎయిర్ క్వాలిటీ సైన్ టిస్ట్ బ్యారీ లోఫర్ వివరించారు.  నిజానికి 2008 ఎకనామిక్ ఆర్ధిక మాంద్యం ముందు కూడా చైనా లో నైట్రోజెన్ డయాక్సయిడ్ లెవెల్స్ క్రమేపీ తగ్గటాన్ని ప్రస్తావిస్తున్న శాస్త్రవేత్తలు, 2020 కరోనా వైరస్ ప్రభావం వల్ల  చైనా పాటించిన  జాగ్రత్తల కారణం గా కాలుష్యం తగ్గుతూ వచ్చిందనేది శాస్త్రవేత్తల విశ్లేషణ.  1952 డిసెంబరు మొదట్లో ఒక చల్లని పొగమంచు లండన్ పై పరుచుకున్న విషయాన్ని ప్రస్తావించిన శాస్త్రవేత్తలు, .చలి తట్టు కోవటానికి లండన్ వాసులు మామూల కంటే ఎక్కువగా బొగ్గును కాల్చడం మొదలు పెట్టడం తో ఎదురైన దుష్పరిణామాలను వివరించారు  .దీని వలన తయారైన వాయు కాలుష్యం, ఫాగ్ లోని చల్ల గాలుల సాంద్రత వల్ల బంధింపబడిన పొగమంచు వల్ల, కైవారం 4 రోజుల్లో 4,000 మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఈ విషయం పై విస్తారం గా పరిశోధన చేసిన చైనా శాస్త్ర వేత్తలు, తమ దేశం లో అటు వైరస్ ను నిరోధిస్తూ, ఇటు కాలుష్య కారక నైట్రోజెన్ డయాక్సయిడ్ శాతాన్ని కూడా పర్యావరణం లో తగ్గించగలిగారు.

ఎన్నికల వ్యయ పరిశీలకులుగా అటవీ శాఖాధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా  అటవీశాఖ అధికారులను నియమించడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులు గా 13 జిల్లాలకు అటవీశాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్  నియమించడం జరిగింది. వారితో పాటుగా మరో నలుగురు అధికారులను రిజర్వు లో  ఉంచారు.   జిల్లాల వారిగా  పి.రామ కృష్ణ - కృష్ణా జిల్లా,  బిఎన్ఎన్ మూర్తి - గుంటూరు జిల్లా, ఎం. శివ ప్రసాద్ - కర్నూలు జిల్లా , శ్రీమతి ఆర్. యశోదా బాయి - శ్రీకాకుళం జిల్లా,   అలాన్ చోంగ్ టెరోన్ - వై ఎస్సార్ కడపజిల్లా , సి.సెల్వం తూర్పుగోదావరి జిల్లా,  డాక్టర్ శేఖర్ బాబు గెడ్డం ప్రకాశం జిల్లా, కుమారి నందిని సలేరియా - విశాఖపట్నం జిల్లా, జగన్నాథ్ సింగ్ -చిత్తూరు జిల్లా,  అనంత్ శంకర్ -  పశ్చిమగోదావరి జిల్లా, నరేంథరన్  జిజి - అనంతపురం జిల్లా,  సందీప్ కృపాకర్ గుండాలా - విజయనగరం జిల్లా, ,  సునీల్ కుమార్ - నెల్లూరు జిల్లా లకు నియమించామన్నారు. వీరికి అదనంగా నలుగురు సీనియర్ అధికారులు- టి. జ్యోతి, షేక్ సలాం,  వై.శ్రీనివాస రెడ్డి,  శ్రీకాంతనాథారెడ్డిలను రిజర్వు లో ఉంచినట్టు చెప్పారు.

ఓటమి భయంతో ఎన్నికలు వాయిదా వేసిందా?

అధికార వైసీపీ పార్టీ తమకు ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాజధాని ప్రాంతంలోని మునిసిపాలిటీలకు ఎన్నికలను వాయిదా వేశాలా చేసింది. రాష్ట్రంలో మొత్తం 29 పుపాలక సంఘాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ మున్సిపాలిటీలలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 7 పుపాలక సంఘాలు ఉండటం విశేషం. వాయిదా పడిన మున్సిపాలిటీలలో అమరావతి రైతుల ఉద్యమ ప్రభావం ఉన్న ప్రాంతాలు కూడా ఉండటం ఇక్కడ చర్చనీయాంశం. ఇది కాకతాళియంగా జరిగిందో..లేక  వైసీపీకి కలిసి వచ్చేలా ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలాచేశారో తెలియదు కానీ వీటన్నింటిపైనా కోర్టు కేసులు ఉన్నాయి. తమ గ్రామాలను మున్సిపాలిటీలలో విలీనం చేయడంపై కొన్ని గ్రామాల వారు కోర్టులకు వెళ్లడం వల్లనే ఆయా మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగడం లేదని అధికార పార్టీ చెప్తుండగా..ఓటమి భయంతోనే వాయిదా పడేలా చేశారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డ మునిసిపాలిటీల వివరాలు  జిల్లాల వారిగా ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం: ఆముదాలవలస, రాజాం, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు, కృష్ణా : గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు: బాపట్ల, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి, గురజాల,దాచేపల్లి, ప్రకాశం: కందుకూరు,దర్శి, నెల్లూరు: గూడూరు,కావలి, బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు: శ్రీకాళహస్తి, కుప్పం, కడప జిల్లా: రాజంపేట, కమలాపురం, కర్నూలు: బేతంచర్ల. అదే విధంగా కోర్టు కేసుల కారణంగా రాష్ట్రంలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అవి: శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరం.

తిక్కలోడు తిరణాలకు వెళ్ళిన చందంగా జగన్ పాలన అంటున్న ప్రతిపక్షం

అవగాహనా లేమితో ముఖ్యమంత్రి అధికారులను, యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అమరావతి నుంచి రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు అత్యంత సంక్లిష్టమైన ఈ మూడు అంశాలను ఒకే సారి నెత్తిన వేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ముఖ్యమంత్రి  జగన్ కు క్లారిటీ ఉందేమో కానీ సంబంధిత శాఖలకు చెందిన ఏ అధికారికీ ఈ మూడు అంశాలపై స్పష్టత లేదన్నది ప్రతిపక్ష పార్టీల వాదన. అన్ని అంశాలనూ ఒకే సమయంలో అమలు చేయాల్సిన పరిస్థితుల్లో అధికార యంత్రాంగం తీవ్ర వత్తిడిలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి స్పష్టతా లేకుండా ఆదరాబాదరా నిర్వహిస్తున్నారు. నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్ధిక సంఘం నిధులు మురిగిపోతాయని కారణాన్ని పైకి తీసుకువచ్చి సత్వర నిర్ణయాలు తీసేసుకున్నారు. అదే విధంగా అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశంపై ఎలాంటి స్పష్టత లేకపోయినా తరలింపు ప్రక్రియను అనధికారికంగా చేసేస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల వంతు వచ్చింది. ఈ నెలాఖరులోకా కొత్త బడ్జెట్ కు ఆమోదం తెలుపకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి తిప్పలు తప్పవు. అందుకోసం ఇప్పుడు ఉన్న రెండు సమస్యలకు తోడు మూడో సమస్యను సైతం నెత్తికెత్తుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండా అమరావతి తరలిస్తున్నట్లు, క్లారిటీ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. మరీ ముఖ్యంగా మండలి రద్దు కోసం కేంద్రాన్ని ప్రతిపాదన పంపినందున మండలిని పిలవకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే వీలు ఉందేమో చూడాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తొలి రోజు ఉభయ సభలు అంటే శాసన సభ, మండలి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటికే మండలి రద్దుకు ప్రతిపాదన పంపినందున మండలిని పిలుస్తారో లేదో అన్న అనిశ్చితి పరిస్తితి ప్రస్తుతం నెలకొని ఉంది. మండలి రద్దు ప్రక్రియకు పార్లమెంటు ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించనందున ఇంకా మండలి ఉందని, అందువల్ల శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేయడం తప్పని సరి అని రాజ్యాంగ నిపుణులు అంటున్నా మండలిని సమావేశపరచకుండా కేవలం అసెంబ్లీనే పిలిచే అవకాశం ఉందా అని ముఖ్యమంత్రి కార్యాలయం రూల్ పుస్తకాలు తిరగేస్తోంది. నిపుణుల సలహాలు అడుగుతోంది. మండలి సమావేశాలు కూడా జరిపితే మార్చి 31 లోపు మండలిలో బడ్జెట్ ఆమోదం పొందకుండా తెలుగుదేశం పార్టీ  ఎలాగూ చూస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదు. ఇప్పటి వరకూ చాలా వివాదాస్పద నిర్ణయాలను ఏకపక్షంగా తీసేసుకున్నట్లు బడ్జెట్ సమావేశాల విషయంలో కుదరకపోవచ్చని రాజ్యంగా నిపుణులు అంటున్నారు.

నాగబాబు కి హొలీ నాడు రంగు పడింది!

తుస్సుమన్న 'బుస్సు' బాబు ట్వీట్ ....  ట్విట్టర్ ఎకౌంట్ ఉంది కదా అని రాసేస్తే, అదేమీ సినిమా కాదు కదా హిట్ అయిపోవటానికి. సరిగ్గా చిరు తమ్ముడు , పవన్ కళ్యాణ్ అన్న అయిన నడిపోడు నాగబాబుకు ఇలాంటి పులుసు కారే వ్యవహారమే మంగళవారం ఎదురైంది. 'లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్లని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు.. ఏమిటో ఈ జనం. దేవుడా ఈ జనాల మనసు మార్చు (ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్)' అంటూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. జనసేనను ఓడించి, వైసీపీని అధికారంలో, టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.   నాగబాబు ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'నువ్వు కేక అన్నా', 'కొన్ని జీవితాలు అంతే మారవు' , 'ఈ అలవాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మాత్రమే ఉంది.. ప్లీజ్ మారండి' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. అయితే, ఆయనకు కాస్తంత ఘాటు ట్వీట్లే సమాధానాలుగా వచ్చాయి. " చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, నా గబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్  , సా యి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్,  నిహారిక,  కళ్యాణ్ దేవ్,  వైష్ణవ్ తేజ్..... వీళ్ళందరికి లైఫ్ ఇచ్చింది ఎవరు సర్ ఆ జనాలు కదా . PK రాజకీయాల్లో గెలవకపోతే  జనాలు మంచోళ్ళు కాదా," అంటూ ఓ ఔత్సాహిక ట్విట్టర్ వీరుడు నాగబాబుని ఉతికి ఆరేశాడు.  మరొక ట్విట్టర్ బాబు అయితే ఏకంగా... " మీ చేతకాని తనాన్ని జనాలపైన ఎందుకు రుద్దుతారు మాష్టారు.... జనసేన   గెలిస్తే జనాలు మంచోళ్ళులేకుంటే కాదా ! పట్టుమని నెలలు  కూడా కష్టపడలేదు మీరు మీ తమ్ముడు పార్టీ కోసం ఎలక్షన్స్ ముందు. అధికారం తుచ్చమ్ అంటూనే ప్రతి సారి అధికారం కోసం వెంపర్లాడుతారు ," అంటూ సీరియస్ సెటైర్ విసిరాడు. మరొక ట్విట్టర్ రాణి అయితే-" ఒకసారి లైఫ్ ఇస్తాము అని చెప్పి టిక్కెట్ లు అమ్ముకుని సొమ్ము చేసుకుంది మీ ఫ్యామిలీ అందరికీ అర్థం అయిపోయి తరిమి కొట్టేరు రాజకీయాల్లో మీరు పనికిరారు టైం వేస్ట్ చేస్కోకండి..." అంటూ నాగబాబుకు సలహా ఇచ్చింది. ఎదో కష్టాల్లో ఉన్న చిన్న తమ్ముడి కి సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చే ఉద్దేశం తో ట్వీట్ చేస్తే, నెటిజన్లు ఇలా ఆడుకుంటున్నారేమిటని పాపం నాగబాబు దీర్ఘ చింతన లో పడ్డట్టు తెలిసింది. అందుకే అంటారు ఊరుకున్నంత ఉత్తమం లేదు.... బోడిగుండంత సుఖం లేదు అని... నాగబాబు గారూ ...ఈ సామెత ఫాలో అయిపోతే బెటర్ కదా మీరు !

సోనియాగాంధీ కి జ్యోతిరాదిత్య హొలీ గిఫ్ట్...

కాంగ్రెస్ కు గుడ్ బై ..... మోడీ, అమిత్ షా లతో భేటీ  మధ్యప్రదేశ్‌లో పరిణామాలు రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత,  మంగళ వారం ఉదయం ప్రధాన మంత్రి మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కలిశారు. ఈ రోజు సాయంత్రం లేదా శనివారం నాడు ఆయన, బీ జె పీ లో చేరే అవకాశం ఉంది. ఆయన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను తమ రాష్ట్ర గవర్నర్‌కు వారు పంపారు. ఇదిలా అండగా, మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు భోపాల్‌లో మంగళవారం సమావేశమయ్యారు. మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్, సీనియర్ నేతలు వీడీ శర్మ, వినయ్ సహస్రాబుద్దే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం బీజేఎల్పీ నేతగా శివరాజ్‌సింగ్ చౌహన్‌ను ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే,  మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ నేతలు వీరి వసతి సౌకర్యాలు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలు చర్చోపచర్చల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఆ పార్టీ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, జితు పట్వారీతో పాటు పలువురు సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2018 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు కూలడం తథ్యంగా కనిపిస్తోంది. గత వారం రోజుల నుంచి అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ ఉదయం అమిత్ షాతో కలిసి ప్రధాని నివాసానికి సింధియా చేరుకున్నారు. మోదీతో దాదాపు అరగంట పాటు చర్చించినట్టు తెలుస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరుతారని ఇటీవల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే సింధియా బీజేపీలో చేరడం ఖాయమవుతోంది. అదే జరిగితే మధ్యప్రదేశ్‌లోని 15 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని పార్టీ విజయపథంలో నడిపించిన సింధియాకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే, సీనియర్ నేత కమల్‌నాథ్‌ను సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం సూచించింది. దీంతో సొంత పార్టీపై సింధియా గుర్రుగా ఉన్నారు. పలుసార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సింధియాను రాజ్యసభకు పంపాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. కానీ, ఆయన స్థానంలో ప్రియాంక గాంధీని నామినేట్‌ చేయాలని పార్టీలోని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది. పార్టీ లోని  అసంతృప్తులను బుజ్జగించేందుకు క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని కమల్‌నాథ్‌ నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 20 మంది మంత్రులతో రాజీనామా చేయించారు. అయినా సింధియా వర్గం మొగ్గుచూపనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది.

నజ్రీబాగ్ నిజాం ప్యాలెస్‌ వేలానికి!

నకిలీ హక్కుదార్లు త‌ప్ప‌డు పత్రాలు సృష్టించి డ‌బ‌ల్ సేల్ కు పాల్ప‌డ‌డంతో వేలం వాయిదా ప‌డింది. నకిలీ పత్రాలు సృష్టించి డ‌బ‌ల్ సేల్ చేసి వంద కోట్లు మింగిన ఉదంతం హైద‌రాబాద్‌లో తాజాగా సంచ‌ల‌నం సృష్టించింది. ఒకరికి అమ్ముకోవడమే కాకుండా, అదే భవనాన్ని వేరొక సంస్థ వద్ద తాకట్టు పెట్టి కోట్ల రూపాయ‌లు నొక్కేసిన కేటుగాళ్ళ‌పై కేసు న‌మోదైంది. కింగ్‌కోఠిలోని నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ను రూ.110 కోట్ల కు బంజారాహిల్స్‌లోని ఎస్‌ఆర్‌ఈఐ ఎక్యిప్‌మెం ట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు తాకట్టుపెట్టారు. అయితే ఆ విష‌యాన్ని దాచి పెట్టి ఆషి రియల్టర్స్‌ నిర్వాహకులు సుఖేష్‌గుప్తా, నీతూగుప్తలు కశ్మీర్‌కు చెందిన ఐరిస్‌ హాస్పిటాలిటీకి దానిని విక్రయించారు. నిజాం వైభవానికి ప్రతీకగా ఉన్న భవనాల్లో కింగ్‌కోఠిలోని నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ (పరాదాగేట్‌) ఒకటి. ఈ భవనానికి జీపీఏగా ఉన్న ఎస్ర్తా నుంచి ముంబైకి చెందిన నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే రియల్‌ఎస్టేట్‌ సంస్థ నాలుగేండ్ల క్రితం రూ.150 కోట్లకు కొనుగోలుచేసింది. ఆ సంస్థలో పనిచేసిన రవిచంద్రన్‌, సురేశ్‌కుమార్‌ ఆషి రియల్టర్స్‌ నిర్వాహకులు సుఖేశ్‌గుప్తా, నీతూగుప్తాతో కుమ్మక్కై నజ్రీబాగ్‌ ప్యాలెస్‌కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి 2018లో ఎస్‌ఆర్‌ఈఐ ఎక్యిప్‌మెం ట్‌ ఫైనాన్స్‌ సంస్థవద్ద తాకట్టుపెట్టి రూ.110 కోట్లు రుణం తీసుకున్నారు. నజ్రీబాగ్‌ ప్యాలెస్‌తోపాటు హఫీజ్‌పేట్‌లోని ఎనిమిదెకరాల స్థలాన్ని కూడా తాకట్టు పెట్టారు. గడువులోగా రుణాన్ని చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థ తాకట్టు ఉన్న ఆస్తులను వేలంవేసింది. హఫీజ్‌పేట్‌ స్థలాన్ని వేలంవేయగా రూ.102 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన అసలు, వడ్డీని రాబట్టుకునేందుకు నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ వేలా నికి ప్రయత్నించింది. అప్పటికే ఆ భవనాన్ని మరో సంస్థకు విక్రయించినట్టు గుర్తించి జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదుమేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే భవనం విక్రయానికి సంబంధించి ముంబై ఆర్థిక నేరాల విభాగంలో కూడా గత ఏడాది రవిచంద్రన్‌, సురేశ్‌కుమార్‌పై కేసు నమోదైంది. కాగా, నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ను మొదట కొనుగోలుచేసిన నిహారిక సంస్థ ప్రతినిధులు గత ఏడాది భవనాన్ని స్వాధీనం చేసుకొనేందుకు హైదరాబాద్‌ వచ్చారు.

ఎన్‌పిఆర్ వివక్షతపై నోరు విప్పని జగన్‌

మైనారిటీల ఒత్తిడికి తట్టుకోలేక ఎన్‌.ఆర్‌.సి.ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన జగన్‌ మోహన్‌ రెడ్డి మరో వైపు దానికి మూలమైన ఎన్‌.పి.ఆర్‌.ను అమలు చేయడానికి పూనుకుంటున్నారు. గెజిట్‌ నోటిఫికేషన్లు ఇచ్చారు. మెమోలు జారీ చేశారు. ఎన్యూమరేటర్లకు శిక్షణ పూర్తి చేశారు. ఏప్రిల్‌ 1 నుండి వారు మన ఇంటి ముంగిట వాలతారు. దీన్ని ఆపడానికి మాత్రం జగన్‌ మోహన్‌ రెడ్డికి చేతులు రావడం లేదు. దీన్ని ఆపకుండా ఎన్‌.ఆర్‌.సి.కి వ్యతిరేకం అని ప్రకటించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. మ‌రో వైపు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమళ్‌ నత్వానీకి రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కల్పించారు. నాల్గ‌వ సీటు ముస్లిం అభ్య‌ర్థికి అదే ఎమ్మెల్సీ రిటైర్డ్ ఐజి ఇక్బాల్‌కు కేటాయిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే ముస్లింకు కేటాయించాల్సిన రాజ్య‌స‌భ స్థానంలో మోదీ, అమిత్‌షా సూచ‌న మేర‌కు పరిమళ్‌ నత్వానీ వైసిపి రాజ్య‌స‌భ‌కు పంపుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్‌.పి.ఆర్‌. వ్య‌తిరేకిస్తూ ముస్లింలు రోడ్ల‌పైకి వ‌చ్చిన నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జగన్‌ ప్రభుత్వానికి గానీ, ప్రతిపక్ష చంద్రబాబుకు గానీ చీమ కుట్టినట్లు కూడా లేదు. మోడీ హుకుంలకు భయపడి నోరెత్తడం లేదు. స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రంలో ముస్లింల‌ను, సామాన్య పౌరులను బలి చేయ‌నున్నారు. బిజెపికి పవన్‌ కళ్యాణ్‌ గులాంగా మారాడు. రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు పై పార్టీల నుండి జవాబు లేదు. దేశంపై మతోన్మాద నిరంకుశత్వ మేఘాలు కమ్ముకొస్తున్నా వీరికి కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఒక్కసారి ఎన్‌.పి.ఆర్‌.లో మన వ్యక్తిగత వివరాలు నమోదైన తరువాత ప్రజల చేతిలో ఏమీ ఉండదు. 73 ఏళ్ళ స్వాతంత్య్రానంతరం 'నేను ఈ దేశ పౌరుడినేనా' అని ప్రశ్నించుకునే దుస్థితిని మోడీ ప్రభుత్వం కల్పించింది. ఇంత జ‌రుగుతున్నా జగన్‌బాబు, చంద్రబాబు, కళ్యాణ్‌బాబులకు మాత్రం ఇవి పట్టవు. ఈ విషయంలో ఎవరికి ఎవరూ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పోటీలు పడి మోడీకి గొడుగు పడుతున్నారు. విదేశీ హిందువుల మీద ఉన్న ప్రేమ స్వ‌దేశంలో వున్న దళితులు, ఆదివాసీలు, బిసిలు, మహిళలపై లో ఒక్క శాతం కూడా లేదు. 2009 నాటికి విదేశాల నుండి వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామని చెబుతున్న మోడీ స్వదేశీ పౌరులకు ఎన్‌.ఆర్‌.సి. పేరిట 1971కి ముందు ఇక్కడున్నట్లు నిరూపించుకోవాలని చెబుతున్నారు.

తండ్రీ కొడుకుల ట్వీట్లేవీ సతీష్ రెడ్డి ని ఆపలేకపోయాయి

మబ్బులు వీడినాయి. మొత్తానికి  తాను టీడీపీని వీడుతున్నట్లు పులివెందుల టీడీపీ సీనియర్ నేత సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నా కూడా  తెలుగుదేశం పార్టీ నుంచి సరైన ఆదరణ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసిన సతీష్ కుమార్ రెడ్డి వేంపల్లె లోని తన సమావేశం లో ఈ ముఖ్య నిర్ణయం వెల్లడించారు. . మనసును చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. టీడీపీపై అసంతృప్తితోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని వర్గీయులకు, కార్యకర్తలకు సతీష్ తెలిపారు. కడపలో టీడీపీకి చాలా కీలకనేతగా సతీష్ వ్యవహరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెండుసార్లు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండుసార్లు సతీష్ రెడ్డి పోటీ ఇచ్చారు. వారి చేతిలో ఓటమి పాలైనప్పటికీ... పులివెందులలో బలమైన నేత కావాలి కాబట్టి టీడీపీ సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మండలి చైర్మన్ను చేసింది. పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు భారీ షాక్ తప్పదని, పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ కాబోతోందని కథనాలు వెలువడ్డాయి. అయితే సతీష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ మారుతారని వార్తలు వస్తున్న తరుణంలో సతీష్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పులివెందుల రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.  పార్టీ మారుతారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సతీష్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్లు చేశారు. ‘‘పులివెందుల గడ్డ మీద ప్రత్యర్థులపై అలుపెరుగని పోరాటం చేస్తూ, ప్రజలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం సైనికుడు.. ఎస్వీ సతీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మీరు కోరుకున్న విజయాలను అందుకోవాలని కోరుతున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘పులివెందుల తెలుగుదేశం నేత ఎస్వీ సతీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సకల సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. అయితే, తెండ్రీ కొడుకుల ట్వీట్లు ఏమీ సతీష్ కుమార్ రెడ్డి ని తెలుగు దేశం పార్టీ వీడకుండా ఆపలేకపోయాయి.

వైసిపిలో తాను చేర‌డం లేదు! 

ఇలాంటి వార్త‌లు ప్ర‌సారం చేస్తే చ‌ర్య తీసుకుంటా: రఘువీరారెడ్డి  ఒక‌ప్పుడు రఘువీరారెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరు పొందారు. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పొసగలేక గ‌త కొంత కాలంగా మౌనంగా వున్నారు. అయితే వైసిపి పార్టీలో మ‌ళ్ళీ ర‌ఘువీరారెడ్డి యాక్టివ్ కాబోతున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్త‌ల ప‌ట్ల ర‌ఘువీరారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదు సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అబద్ధం ఇలాంటి న్యూస్ లు పెట్టే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం మాజీ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి మండిప‌డ్డారు. ఇలాంటి వార్త‌లు ప్ర‌సారం చేస్తే చ‌ర్య తీసుకుంటానని ఆయ‌న హెచ్చ‌రించారు. మ‌రో వైపు వైసిపిలో వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతూంది. స్థానిక ఎన్నిక‌ల్ని స‌వాలు తీసుకున్న అధికార పార్టీ ప్ర‌తిప‌క్షాల‌ను ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఇక ఎవ‌రైనా వైసిపిలోకి రావాల‌నుకునే వారి కోసం జ‌గ‌న్ స‌ర్కార్ ద్వారాలు తెరిచి పెట్టింది. క‌నిగిరి మాజీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ వైసిపి తీర్థం పుచ్చుకోవ‌డానికి ముహుర్తం ఖ‌రారైంది. అంతే కాదు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గలో తెలుగుదేశం పార్టీ నాయకులు జెసి బ్రదర్స్ కు షాక్ ఇచ్చారు. జెసి ముఖ్య అనుచరుడైన యాడికి మండలం మాజీ ఎంపీపీ బాల రవి కిషోర్. మాజీ ఉప సర్పంచ్ బాల రమేష్ బాబు వైఎస్ఆర్ సీపీలోకి చేర‌నున్నారు. అ ధికారికంగా బాల రవి కిషోర్ బాబు రమేష్ బాబు తన అనుచరులతో యాడికి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకోనున్నారు. క‌నిగిరి మాజీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ స‌న్నిహితుడు క‌దిరి బాబురావు తెలుగుదేశం పార్టీ వీడి వైకాపాలో చేర‌నున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి ముహూర్తం ఖ‌రారైంది.

సింథియాకు రాజ్యసభ సీటు, మంత్రి పదవి... మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కారు..! 

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారులో తలెత్తిన సంక్షోభం పతాకస్థాయికి చేరింది. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి యువ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబావుటా ఎగరవేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన సుమారు 20మంది ఎమ్మెల్యేలు... బెంగళూరుకు తరలిపోవడంతో కమల్ నాథ్ సర్కారు కష్టాల్లో పడింది.   అయితే, జ్యోతిరాదిత్య సింధియాను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సోనియా ఆదేశాలతో రంగంలోకి దిగిన అహ్మద్ పటేల్... జ్యోతిరాదిత్యను రాజ్యసభకు పంపుతామంటూ హామీ ఇచ్చారు. అయితే, సింధియా వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ కు సింధియా తలుపు మూసేశారని చెబుతున్నారు. సింథియా స్నేహితుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ను రంగంలోకి దించినా జ్యోతిరాదిత్య స్పందించలేదని అంటున్నారు. జ్యోతిరాదిత్యను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కాంగ్రెస్ ఆశలు వదులుకుంది. దాంతో, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు పతనం అంచుల్లోకి చేరింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోతిరాదిత్య సింధియా... బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన జ్యోతిరాదిత్య సింధియా.... ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, సింధియా.... మోడీ, అమిత్ షాను కలవడంతో బీజేపీలో చేరడం ఖాయమని అంటున్నారు. అలాగే, సింథియాకు రాజ్యసభ సీటుతోపాటు, మోడీ కేబినెట్ లోకి కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. పది రోజుల్లో వైసీపీ రంగులు తొలగించాలని ఆదేశం...

ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఎప్పట్నుంచో వివాదం కొనసాగుతోంది. చెత్త కుండీలను కూడా వదలకుండా వైసీపీ రంగులు వేశారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పెద్దఎత్తున విమర్శలు చేసింది. అంతేకాదు, ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ భవనాలు, పంచాయతీ కార్యాలయాలపై రాజకీయ పార్టీల రంగులు తొలగించాల్సిందేనని ఆదేశించింది. ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు పది రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ప్రభుత్వ భవనాలపై రాజకీయ పార్టీల రంగులను తొలగించినట్లు ఆధారాలతో సహా తమకు నివేదిక సమర్పించాలని సీఎస్ ను ఆదేశించింది. ఇదిలా ఉంటే, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు ఉండటంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కూడా సరైన సమాధానం చెప్పకుండా మాట దాట వేశారు. అయితే, మార్చి 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు... 23న మున్సిపోల్స్... 27, 29న పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలోనే.... కొత్త రంగులు వేయడానికి హైకోర్టు పది రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి, ఈ పది రోజుల సమయంలో... ప్రభుత్వం కొత్త రంగులు వేయగలుగుతుందో లేదో? ఒకవేళ హైకోర్టు ఆదేశాలు అమలుకాకపోతే... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరికొన్ని కొత్త రూట్లలో దూసుకుపోనున్న మెట్రోరైలు

ప్రస్తుతం 55 రైళ్ల ద్వారా రోజు వెయ్యి ట్రిప్పులు నడిపిస్తున్నారు. మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు ఆపరేషన్స్‌ వల్ల ప్రతి నెలా రూ.40 కోట్ల ఆదాయం వ‌స్తుంది. అందులో రూ.30 కోట్లు ప్యాసింజర్‌ టికెట్ల నుంచి సమకూరుతోంది. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో మరో రెండు అదనపు రైళ్లను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఈ రెండు రైళ్లు ప్రయాణికులకు వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశ ప్రాజెక్టులో మూడు కారిడార్లలో దాదాపు 74 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండగా మొత్తం 69 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగతా 5 కిలోమీటర్లు ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే, మార్కింగ్‌ పను లు ప్రారంభం కాగా త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు. తెలంగాణా ప్రభుత్వం రెండో దశలో 62 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసి, దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రెండోదశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రేతీబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాక్‌, లక్డీకాపూల్‌ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో ఒవైసీ దవాఖాన, సైదాబాద్‌, ఫలక్‌నుమా మార్గం మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటుంది. అదేవిధంగా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు గల 5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా కలుపుతారు. ఎలివేటెడ్‌ మెట్రోరైలు నిర్మించాంటే ఒక కిలోమీటర్‌ నిర్మాణానికి రూ.300 కోట్లు అవుతుంది. ప్రస్తుత బడ్జెట్‌లో నగరానికి కేటాయించిన రూ.10 వేల కోట్లలో మెట్రోరైలు కేటాయింపులుండటంతో ఈ పనులు వేగవంతం అవుతాయని ఆశిస్తున్నారు. రెండోదశ విస్తరణ జ‌రిగితే నగరంలోని ఏ మూల నుంచైనా మరోమూలకు మెట్రోద్వారా ప్రయాణించడం మరింత సౌలభ్యం అవుతుంది.

మంత్రి వెలంపల్లిపై సి.ఎం. సీరియ‌స్‌

జ్యోతిషాలయం అడ్డాగా లైంగిక వేధింపులు వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శి వంశీకృష్ణ రెడ్డి, అచ్చిరెడ్డి లీల‌ల‌పై సి.ఎం. ఆరా కేవ‌లం రూపాయి తీసుకుని జోస్యం చెప్పడం మొదలెట్టి...'తాంత్రిక మంత్రాలు' అంటూ అల్లిబిల్లి సోది కబుర్లన్నీ చెప్పీ.. చెప్పి ఏకంగా ఓ డెబ్బై కోట్లు వెనుకేశాడట‌. ఆ మ‌హానుభావుడు ఎవ‌ర‌నుకుంటున్నారా? అదేనండి. కోనాల అచ్చిరెడ్డి. విజయవాడలోనే నివాసం. 'ఆంధ్రా, తెలంగాణ' అనే బేధం లేకుండా ఎంచక్కా మోసాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు కోనాల అచ్చిరెడ్డి భవానీపురంలో జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. కోనాల అచ్చిరెడ్డి, అత‌ని కొడుకు వంశీకృష్ణ రెడ్డికి మంత్రి ఆశీస్సులున్నాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు, వంశీకృష్ణ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడే కాదు. రైట్ హ్యాండ్ కూడా. వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శిగా మంత్రి ఆయ‌న‌కు ప‌ద‌వి కూడా ఇచ్చారు. తండ్రీకొడుకులిద్దరూ కలిసి మహిళలను లైంగికంగా వేధించ‌డం వారికి అల‌వాటుగా మారింది. జాతకాల పేరుతో లక్షలాది రూపాయలు దండుకోవ‌డానికే దుకాణం పెట్టుకున్నారు. ప్రజల బలహీనతలే పునాదులుగా చేసుకొని కోట్ల రూపాయ‌లు సంపాదించారు. నమ్మి వచ్చే భక్తుల్ని దోచుకున్నారు. సాప్ట్ వేర్ కంపెనీలలో 'షేర్ ల‌లో పెట్టుబ‌డులు పెడ్తామంటూ లక్షల రూపాయ‌లు అమాయ‌కుల నుంచి కాజేశార‌ని స్థానిక పోలీసులకు ఫిర్యాదులూ అందాయి. తెలంగాణ ఖమ్మంకు చెందిన ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టిస్తానంటూ రూ.50 లక్షల మేర మోసం చేసిన కేసులో వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శి కోనాల వంశీ కృష్ణారెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అధికార పార్టీ నాయకుడిగా ఉండటం, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు అనుచరుడిగా ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఆంధ్ర పోలీసులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడంతో పలువురు బాధితులు ఆంధ్రప్రదేశ్ పోలీసులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అస‌లు వివ‌రాల్లోకి వెళ్లితే, గ‌త ఏడాది తెలంగాణకు చెందిన ఓ మహిళ జ్యోతిషం చెప్పించుకునేందుకు భవానీపురంలోని జ్యోతిషాలయంకు వ‌చ్చి అచ్చిరెడ్డిని క‌లిసింది. ఆ సమయంలో అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు తనతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టిస్తానని రూ.50 లక్షలు తీసుకున్నార‌ట‌. అంతే కాదు అబ్బా కొడుకులిద్ద‌రూ క‌లిసి ఆమెను లైంగికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించింది. ఇదే విషయంపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీసులను ఆశ్రయిస్తే వారు రాజకీయ ఒత్తిళ్లతో ఎలాంటి కేసులు నమోదు చేయలేదట‌. మంత్రి అండ చూసుకొని వంశీ కృష్ణారెడ్డి ఆ మహిళను బెదిరించడం ప్రారంభించాడు. త‌న‌ వద్ద ఆమె నగ్న చిత్రాలు ఉన్నాయని బెదిరించడంతో బాధిత మహిళ ఏం చేయాలో పాలుపోక కొద్దిరోజుల క్రితం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు వంశీ కృష్ణారెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, న‌గ్న ఫోటోలున్నాయ‌ని బెదిరించ‌డం, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకోవ‌డంతో పాటు ఆమె కారును కూడా లాక్కున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు. భవానీపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని పాత ఎంఐజీ 123 బ్లాకులో జ్యోతిషాలయం నిర్వహించే అచ్చిరెడ్డి అదే బ్లాకులో ఉన్న ఆనం మోహన్‌ రెడ్డి, చెంచులక్ష్మి దంపతుల ఫ్లాటును కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఫ్లాటును మోహన్‌రెడ్డి రిటైర్డ్‌ వీఆర్వో ప్రకాశరావు నుంచి కొన్నారు. అచ్చిరెడ్డి బెదిరింపులకు భయపడే ప్రకాశరావు తన ఫ్లాటును మోహన్‌ రెడ్డికి అమ్ముకుని వెళ్లిపోయారు. మోహన్‌ రెడ్డి కొన్నాక ఆయనకూ అచ్చిరెడ్డి నుంచి వేధింపులు తప్పలేదు. రూ.30 లక్షల విలువ చేసే ఫ్లాటును రూ.10 లక్షలకు తనకు విక్రయించాలని అచ్చిరెడ్డి వేధించ‌డం మొద‌లు పెట్టాడు. 'మంత్రి అనుచరులు' అంటూ కొందరు ఫోన్లు చేసి మోహన్‌ రెడ్డి దంపతులను బెదిరించారు. దీనిపై ఈ దంపతులు గత ఏడాది ఆగస్టు 19న స్పందనలో పోలీసులకు విజ్ఞప్తి చేసినా ఫ‌లితం లేద‌ట‌. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుపేరు చెప్పి అచ్చిరెడ్డి, ఆయన కొడుకు వంశీ కృష్ణారెడ్డి విజ‌య‌వాడ వ‌న్‌టౌన్‌లో అరాచకాలకు పాల్పడుతున్నా మంత్రి చూసీ చూడ‌న‌ట్లు ఎందుకు వుంటున్నార‌ని స్థానిక ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఖ‌మ్మం పోలీసుల జోక్యంతో జాతకాలోడి బండారం బట్టబయలైంది. అందరి జాతకాలు చెపుతాననే ఇతగాడు తెలంగాణ పోలీసుల దెబ్బకు కుటుంబంతో సహా పరార్.

నారాయణా..హరి..జగన్.. నారాయణా..గోవిందా..ఇదీ ప్రస్తుత ఏపీ పరిస్థితి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చిరంజీవిలానే ఉన్నారు. ఏంటి..ఇదేంటి ఈ వెబ్ సైట్ ఇలా రాసింది..అనుకుంటున్నారా.. ఈ వార్త చూసాక కొంతమందికి అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా వచ్చిన ముఠామేస్త్రి సినిమా గుర్తొచ్చినా తప్పులేదు... ఎందుకంటే ఈ వార్త చూస్తే గుర్తు రాక తప్పదు కూడా. ఇంతకీ వార్త ఏంటి అని బుర్ర బద్దలు కొట్టుకోకండి.. ఇదుగో.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్చ్..ఇందులో కొత్త వార్త ఏముంది? అనుకుంటున్నారా.. కాస్త ఆలోచించండి..అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖామాత్యులు. ఆయన ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం సరఫరా నిలిపి వేస్తున్నామని ప్రకటించారు..అదన్న మాట..వార్త. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఏక్సైజ్ శాఖ, దానికి మంత్రి లేరా..ఉన్నారు కదా..ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నారాయణ స్వామి కాదా..అని ఎవరికైనా డౌటానుమానాలు వస్తే.. నారాయణ..నారాయణ.. మాది బాధ్యత కాదు సుమా.. జస్ట్ అనిల్ గారికి ముఠామేస్త్రీలా మారాలనిపించిందేమో..నారాయణా.. ఈ వార్త చదివాక ఏపీ ప్రజలు తమని తాము.. మొన్నామధ్య గ్రామీణ ఎన్నికల నేపథ్యంలో చిరు తనయుడు రాంచరణ్ రంగస్థలం సినిమాలో  గొంతు కొస్తే మాట రాక పెదాలు కదల్చిన చిట్టిబాబు అన్నయ్య క్యారెక్టర్ లో చూసుకుంటే అసలేం చేయలేము..సారీ..