మ‌రో కొత్త వైర‌స్ వ‌చ్చిప‌డింది!

అంతు చిక్క‌ని ఈ వైర‌స్ కోళ్ల నుంచి గబ్బిలాలకు వ‌స్తుంద‌ట‌. అసలే కరోనా భయంతో బిక్కబిక్కుమంటూ ప్ర‌జ‌ల‌కు ఇది షాక్‌కు గురిచేస్తోంది. ఇటీవలి కాలంలో అంతుచిక్కని వైరస్ ప్రభలడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. అంతుచిక్కని వైరస్ వల్ల ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలోనే లక్షకు పైగా కోళ్లు చనిపోవడం అప్ప‌ట్లో సంచలనంగా మారింది. చిక్ సీడ్ తయారు చేస్తున్న కంపెనీల ప్రతినిధులు విజయవాడ , హైదరాబాద్ లోని ల్యాబ్ లకు తీసుకువెళ్లి టెస్టులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైరస్ ను అరికట్టే వాక్సిన్ ను కనిపెట్టలేక పోతున్నారు. వైరస్ తో చనిపోయిన కోళ్ల ను కాల్చివేసి పూడ్చాలని పశువైద్య అధికారులు ఫారాల నిర్వాహకులకు సూచించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కేరళలో నెలకున్నాయి. అయితే అక్కడ కోళ్లు మాత్రమే కాదు గబ్బిళాలు కూడా చనిపోవడం ప్రజలను కలవరపెడుతోంది. కేర‌ళ‌లోని కొజిక్కొడె జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే జంతు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి చనిపోయిన గబ్బిళాల నుంచి శాంపిల్స్ సేకరించారు. పరీక్షల కోసం చనిపోయిన గబ్బిలాల నుండి నమూనాలను సేకరించారు. చనిపోయినవాటిన్నింటిని కాల్చి బూడిద చేశారు. పరీక్ష ఫలితాలకు కొన్ని రోజులు సమయం పడుతుంది 'అని జిల్లా పశుసంవర్ధక అధికారి డిఆర్ కెవి ఉమా అన్నారు. కొజిక్కెడ్ జిల్లాలో రెండు పౌల్ట్రీ ఫామ్స్‌లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోళ్లు వందల సంఖ్యలో చనిపోవడంతో టెస్టులు చేసిన అధికారులు.. Type-A Influenzaకు సంబంధించిన H5, H7 వైరస్‌ అందుకు కారణంగా నిర్ధారించారు. దీంతో వెంటనే అలర్టయిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్, ఆ కోళ్ల ఫామ్స్‌కు ఒక కిలోమీటర్ పరిధిలో సంచరిస్తోన్న 1200వరకు రకరకాల పక్షుల నమూనాలను సేకరించారు. ఆ కోళ్ల ఫారం నుంచే వైరస్ గబ్బిలాలకు సోకిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరం వరకూ షాపుల్లో కోళ్లను, గుడ్లను అమ్మకాలను నిషేదించారు. నష్టపోయినవారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు హామి ఇచ్చారు.

అమ‌రావ‌తిలో ఇక ఐదు జోన్లు

వెనుకబడిన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం రాజధాని అమ‌రావ‌తిలో కొత్తగా జోన్ ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ప్లాన్‌)లో కొన్ని మార్పులు చేశారు. రాజధానిలో ఇప్పటివరకు 4నివాస జోన్లు ఉండేవి. కొత్తగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)/అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ జోన్ ఆర్‌-5 ఏర్పాటు చేస్తూ సీఆర్‌డీఏ ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తున్నారు. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ తాజాగా మరో ముసాయిదా ప్రకటన వెలువడింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలియజేయాలని సూచించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్‌-1(ప్రస్తుత గ్రామాలు), ఆర్‌-2(తక్కువ సాంద్రత గృహాలు), ఆర్‌-3(తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్‌-4(హైడెన్సిటీ జోన్‌) పేర్లతో 4రకాల నివాస జోన్లు ఉండేవి. ఆర్‌-5 జోన్‌లో అనుమతించే నిర్మాణాలు ఇలా వుంటాయి. ఒకదాన్ని ఒకటి అనుకుని నిర్మించిన గృహాలు(అటాచ్డ్‌), వేర్వేరుగా నిర్మించిన గృహాలు(డిటాచ్డ్‌), రో హౌసింగ్‌ అపార్ట్‌మెంట్లు, గ్రూప్‌ హౌస్‌లు. ఏటీఎం వంటి ప్రజోపయోగ సదుపాయాలు, దుకాణా లు. హోం ఆఫీసులు, మత, ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇలాంటి నిర్మాణాల‌ను సీఆర్‌డీఏ నుంచి ముందస్తు అనుమతితో చేపట్టేందుకు వీలుంది. సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, హైపర్‌మార్కెట్‌, షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు ఈ జోన్‌లో అనుమ‌తించ‌రు.

అంపశయ్య మీద 10 జన్ పథ్

అంపశయ్య మీద భారత జాతీయ కాంగ్రెస్. అవునా, ఇది నిజమేనా? ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహా నాయకులు  నడిపించిన పార్టీ ఈ రోజు వయసు మీద పడి మెలమెల్లగా తన పూర్వ ప్రాభవాన్ని కోల్పోతోందా? ఒక్క సరి చరిత్రలోకి వెళితే.... 1960 దశకంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభం. కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటివారు ఒకవైపు. ఇందిరా, జగ్ జీవన్, వై బి చవాన్, సి సుబ్రహ్మణ్యం వంటివారు మరో వైపు. పార్టీ రెండుగా చీలింది. దశాబ్ద కాలంలో పరిస్థితులు మారాయి. తర్వాత ఇందిరా గాంధీ ప్రాబల్యం పెరగడంతో మళ్ళీ ఇందిరను నాయకురాలిగా అంగీకరించారు.  1990 దశకంలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి సంక్షోభం. సీనియర్ నేతలు తివారి నేతృత్వంలో పార్టీలో చీలిక. సోనియా నాయకత్వానికి సవాల్. శరద్ పవార్, మమతా బెనర్జీ వంటివారు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దశాబ్ద కాలంలో పరిస్థితులు మారాయి. నాయకులు సోనియాగాంధీ నాయకత్వాన్ని అంగీకరించలేదు కానీ బయటనుండి బలపర్చారు. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2020 దశకంలో కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం. వయస్సు రీత్యా నాయకత్వం నుండి తప్పుకున్న సోనియా. పార్టీని నడిపించలేక తప్పుకున్న రాహుల్. వృద్ధ జంబూకల మధ్య నిలువలేక వెళ్లిపోతున్న యువతరం.  సమర్ధవంతమైన నేత లేక చేతులెత్తేస్తున్న నాయకత్వం. మరి 2040 దశకం...ఎలా ఉంటుంది ? ఇది ప్రస్తుతం పార్టీ ని కుదిపేస్తున్న ప్రశ్న. జ్యోతిరాదిత్య లాంటి లాయలిస్టుల నిష్క్రమణ తో, మధ్య భారతం లో శూన్యాన్ని కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా ఆహ్వానించింది.  కాంగ్రెస్ కి ప్రాణం పోసిన ఆ నలుగురు నాయకుల కొడుకులే ఆ పార్టీ కి సమాధి కడుతున్నారు. ఏ నలుగురు  నాయకులు అయితే కాంగ్రెస్ కి ప్రాణం పోశారో వారి మరణం విషాదం ... వారి కొడుకులకు అవమానం ---- వారి కొడుకులు ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. మూడో నాయకుడు అయ్యే దారిలో ఉన్నాడు.  నాలుగో నాయకుడు కూడా నిజం తెలుసుకుంటాడు. రాజేష్ పైలట్ 2000 లో తీవ్రమైన రోడ్డు ప్రమాదo లో మరణం  మాధవరావు సింధియా 2001 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం .... వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం  దూర్జీ ఖండూ 2011 లో హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా మరణం ....వీరి మరణం తర్వాత వీరి కుమారులకు  తీవ్రమైన అవమానాలు జరిగాయి. పార్టీ వదిలి వెళ్లే వరకు వేధించారు ... వేధిస్తున్నారు... వెళ్లినా వేధిస్తున్నారు.... ఇప్పటికి ఫెమా ఖండూ, వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు.  ఇప్పుడే జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య మంత్రి అవుతాడు అనే నమ్మకం వచ్చింది. కాదు కాదు.... జోతిరాధిత్య ను పదే పదే అవమానాలకు గురి చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ అవకాశాన్ని కల్పించింది. ఇక సచిన్ పైలెట్ కూడా కాంగ్రెస్ బయటకి వస్తే కాంగ్రెస్ కి సమాధి ఖాయం అనే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది. ప్రజలు మెచ్చే నాయకులకి పదవులు ఇవ్వాలి ... 10 జనపథ్ నుండి వచ్చే వారికి కాదనే డిమాండ్ పార్టీ లో బలంగా వినిపిస్తోంది.

నానక్ రామ్ గూడలో అమెరికా కాన్సులేట్

హైద‌రాబాద్‌లో నిర్మాణం అవుతున్న‌ నూతన అమెరిక‌న్ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాక ఇతర రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉండ‌బోతోంది. వచ్చే ఏడాది నుంచి నూతన భవనం అందుబాటులోకి వస్తుంది. నానక్ రాం గూడలో నిర్మిస్తున్నఅమెరికా నూతన కాన్సుల్ జనరల్ కార్యాలయానికి సంబంధించిన టాపింగ్ ఔట్ కార్యక్రమంలో జ‌రిగింది. వ‌చ్చే సంవ‌త్స‌రం నుంచి మొత్తం కార్య‌క్ర‌మాలు నాన‌క్‌రాం గుడ నుంచి జ‌రుగుతాయి. హైద‌రాబాద్ సంస్కృతిని ప్ర‌తిబింభిస్తూ నిర్మాణ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంతో జ‌రుగుతున్నాయి. అమెరికా అంబాసిడర్‌ కెన్నత్‌ ఐ జస్టర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం హైదరాబాద్‌ నగర సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. దక్కను పీఠభూమి నిర్మాణ శైలిని, హైదరాబాద్‌ సహజత్వానికి దగ్గరగా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని అమెరికా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా తెలంగాణ మధ్య స్నేహపూర్వక బంధం ఉందని, భవిష్యత్తులో ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమెరికా, భారత్‌ మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచానికి మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడికి భారీ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం రావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. పరిశ్రమల ఏర్పా టుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్‌ ఐపాస్‌ బాగుందని అమెరికా అంబాసిడర్‌ కెన్నత్‌ ఐ జస్టర్‌ కొనియాడారు. హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి నగరంలో భారీ కాన్సుల్ జనరల్ కార్యాలయం రావడం ఇక్కడి పౌరులకే గాక ఇతర రాష్ట్రాల పౌరులకు కూడా సౌకర్యంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో అమెరికా మరియు తెలంగాణల మధ్య మరింత దృఢమైన బంధం ఏర్పడుతుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య స్సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత దేశ ప్రధాని మోడీ ఈ దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. తాజాగా ఇండియాలో పర్యటన విజయవంతానికి భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్ జేస్టర్ కృషి చేశారన్నారు.

పరిమళ్ రాజ్యసభ సభ్యత్వం వెనుక పరిమళించిన క్విడ్ ప్రో కో ఏంటి?

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్ధులను ముఖ్యమంత్రి, వైసీపీ అద్యక్షుడు జగన్ ఖరారు చేశారు. శాసన మండలి రద్దు గురించి పట్టుదలగా ఉన్న జగన్ మండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోతున్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ స్థానాలు ఖరారు చేశారు. వీరితో బాటు తనకు అత్యంత నమ్మకస్తుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త, తన ఆదాయ వనరుల పెరుగుదలలో ఒక పాత్ర పోషించిన అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభకు పంపి న్యాయం  చేశారు. ఇక మిగిలిన నాలుగో స్థానంలో కేసిఆర్ బాటలో నడుస్తున్న జగన్ ఆయనలానే కుటుంబసభ్యులకు ప్రాధాన్యమిస్తూ.. చెల్లెలు షర్మిలకు అవకాశం ఇస్తారని అందరూ భావించినా అందుకు భిన్నంగా కొత్త అభ్యర్ధిని, రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని ఖరారు చేశారు. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో సమావేశం సందర్భంగా ముఖేష్ అంబానీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టిక్కెట్ ప్రతిపాదన ఆయన ముందు ఉంచారు. పారిశ్రామికవేత్త ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అయిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ స్థానం కేటాయించాల్సిందిగా ముఖేష్ జగన్ ను కోరారు. తనకు మూడు రోజుల సమయం ఇస్తే ఆలోచించి చెబుతాన్న జగన్ బాగా ఆలోచించి తన చెల్లెల్ని కాదని పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇంతవరకూ అందరికీ తెలిందే..ఇక్కడే కొందరు రకరకాల కొత్త ప్రశ్నలు లేవదీస్తున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణంలో రిలయన్స్ పాత్ర ఉందని అప్పట్లో తన పత్రికలో, చానల్లో కధనాలు రావడమే కాకుండా అప్పట్లో  వైసీపీ కార్యకర్తలు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసిన విషయం కూడా అందరికీ తెలుసు.  జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం ఆ కేసులను ఉపసంహరించుకుంది కూడా. ఇప్పుడు అదే సంస్థ అధినేత సిఫారసుతో రిలయన్స్ కార్పోరేట్ దిగ్గజుడైన పరిమళ్ నత్వానీని వైసీపీ నుంచి రాజ్యసభకు పంపడం చర్చనీయాశం అయింది. ఇప్పటికే క్విడ్ ప్రో కో కేసుల్లో ఉన్న జగన్ ఈ డీల్ ఊరికే కుదుర్చుకుని ఉండడని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడే కొంత మంది ఒక అడుగు ముందుకేసి కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. చరిత్రలో తండ్రి బతికుండగా ఏ కొడుకూ రాజకీయంగా అంతగా రాణించలేదని జగన్ కూడా ఆ కోవకే చెందుతారనీ, అందుకే తండ్రి మరణానికి కారకులని ముద్ర వేసిన సంస్థకు చెందిన వ్యక్తికి పదవి కట్టబెట్టి, కేసులు చుట్టి పెట్టి.. తాను ముఖ్యమంత్రి అవ్వడానికి పరోక్షంగా సాయపడినందుకు ఋణం తీర్చుకున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతి పక్షం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది కూడా. మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయాన్ని జగన్ మరో మారు నిజం చేశారు.

కేరళలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు.. మార్చి ఆఖరు వరకూ అన్నీ బంద్‌!

కరోనా ధాటికి కేరళ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మార్చి ఆఖరు వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయ్ ప్రకటన చేశారు. ఏడో తరగతి పైబడిన విద్యార్థుల పరీక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. ఈ నెల మొత్తం ప్రభుత్వ పరమైన వేడుకలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సినిమా హాళ్లు డ్రామా కంపెనీలు తెరవద్దని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే నిశ్చయమైన పెళ్లిళ్లు మాత్రమే జరపాలని.. అవి కూడా తక్కువ మందితో నిర్వహిస్తే మంచిదని అన్నారు. మత సంబంధమైన వేడుకలు కూడా నిర్వహించొద్దని ఆదేశించారు. ఇప్పటివరకూ కేరళ వ్యాప్తంగా దాదాపు 1116 కరోనా అనుమానితుల వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. క‌రోనా ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్‌లపైనే కాదు.. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్‌లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో చాలా మాల్స్‌తో పాటు థియేటర్స్‌ ఇపుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొత్త సినిమాల విడుదలను కూడా ఆపేశారు.ఎక్కువమంది ఒక్క చోట ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాజాగా కేరళలో కరోనాకు సంబంధించిన మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తక్షణ చర్యల్లో భాగంగా అత్యధిక మంది గూమిగూడే ప్రదేశాలైన థియేటర్స్, మాల్స్, ఎగ్జిబిషన్‌కు సంబంధించిన వాటిని ఈ నెల 31 వరకు నిరవధికంగా బంద్ చేస్తున్నట్టు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలు 

ఏపీలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదలయింది. 13 జిల్లాల జిల్లా పరిషత్తు ప్రాదేశిక, మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో జిల్లాల  వారిగా సోమవారం దాఖలు అయిన నామినేషన్ లు వివరాలు.. రాష్ట్రంలోని 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 9947 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 771 నామినేషన్లు దాఖలు చేశారు.  జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలు: శ్రీకాకుళం38 కి గాను 1, విజయనగరం 34  కి గాను 2,విశాఖపట్నం 39 కుగాను 3, తూర్పుగోదావరి 61 కు గాను 2, పశ్చిమగోదావరి 48 కి గాను 6, కృష్ణా 46 కుగాను 2,  గుంటూరు 54 కుగాను 2, ప్రకాశం 55 కుగాను 6,  ఎస్పీ ఎస్సార్ నెల్లూరు 46 కుగాను 7,  కర్నూలు 53 కుగాను  సున్నా, అనంతపురం 63 కుగాను 9,  చిత్తూరు 65 కు గాను 22, వై ఎస్ ఆర్ కడప 50 కుగాను 6 నామినేషన్ లు దాఖలు అయ్యాయి. మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల వివరాలు: శ్రీకాకుళం  667 కు గాను 40, విజయనగరం 549 కుగాను 14, విశాఖపట్నం 651 కుగాను 38, తూర్పుగోదావరి 1086 కుగాను 93, పశ్చిమగోదావరి  863 కుగాను 71, కృష్ణా  723 కుగాను 50, గుంటూరు(805) కుగాను 32,  ప్రకాశం లో 47,  ఎస్పీ నెల్లూరు లో  39,  కర్నూలు లో 37, అనంతపురం లో 78, చిత్తూరు లో 213, వై ఎస్ ఆర్ కడప జిల్లాలో  19 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.

స్థానిక సంస్థల ఎన్నికల పరశీలకుల్లో ఐదుగురు ఐఎఎస్ అధికారుల మార్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల పరిశీలకులలో ఐదుగురు ఐ ఏ ఎస్ అధికారులను మార్చింది. ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్  ఈ విషయం వెల్లడించారు.ఎన్నికల పరిశీలకులు గా 13 జిల్లాలకు  సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్  ఇప్పటికే నియమించిన విషయం . వారితో పాటుగా మరో నలుగురు ఉన్నతాధికారులను రిజర్వు లో ఉంచింది.  జిల్లాల వారిగా - టి.బాబు రావు నాయుడు - కర్నూలు,  లతకార్ శ్రీకేష్ బాలజీరావు - కృష్ణ జిల్లా , హెచ్. అరుణ్ కుమార్ - తూర్పు గోదావరి జిల్లా,    పి.ఎ.  శోభా - విజయనగరం జిల్లా, కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా, సిదర్ధ్ జైన్ -  చిత్తూరు జిల్లా,  బి. రామారావు -  శ్రీకాకుళం జిల్లా,  వివేక్ యాదవ్  - ప్రకాశం జిల్లా , ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా,  పి. బసంత్ కుమార్  - ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా , పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా,   కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా, హిమాన్షు శుక్లా -  పశ్చిమ గోదావరి జిల్లా లకు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారని  రమేష్ కుమార్ వెల్లడించారు.

హైకోర్టు తీర్పుతోనే అసలైన హొలీ: నారా లోకేష్ 

పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశం  చెడు పై మంచి గెలిచిన రోజున రంగులు చల్లుకొని హోలీ జరుపుకుంటాం. అదే హోలీ రోజున ప్రభుత్వ భవనాలకు వైకాపా వేసిన రంగులు చెరిపేయాలని కోర్టు తీర్పివ్వడం చెడు పై మంచి సాధించిన విజయం, అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. హొలీ పండుగ రోజున ఈ తీర్పు వెలువడటం పై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. పేద వాడికి అన్నం పెట్టడానికి మనసొప్పలేదు. 1400 కోట్ల ప్రజాధనం పోసి వేసిన రంగులు చెరిపేందుకు మరో 1400 కోట్లు? ఇదేనా రివర్స్ పాలన?, అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.  పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

మోషా క‌లిపారు వారిద్ద‌రినీ!

మోదీ, అమిత్‌షా జోక్యంతో అంబానీ జ‌గ‌న్‌ల మ‌ధ్య వున్న వైర్యం తొలిగింది. వారి మ‌ధ్య వున్న శ‌త్రుత్వాన్ని వ‌దులుకుని ఒక్క‌టైయ్యారు. బిజెపి-జ‌గ‌న్ కు ఉన్న అవ‌స‌రాలే వారి బంధాన్ని ప‌టిష్టం చేసిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వైసీపీ-బీజేపీ మధ్య కొన‌సాగుతున్న రహస్య ప్రేమ న‌త్వానీని రాజ్య‌స‌భ‌కు పంప‌డానికి మార్గం సుగ‌మం చేసింది. త‌మ‌ ప్రేమ‌కు గుర్తుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బిజెపికి రాజ్య‌స‌భ సీటు గిఫ్ట్ గా ఇచ్చారు. పార్టీలో రాజ్య‌స‌భ సీటు కోసం తీవ్ర‌మైన పోటీ వున్న‌ప్ప‌ట్టికీ వారంద‌రినీ కాద‌ని నత్వానీ ఎంపిక చేసి తన ప్రేమ‌ను చాటుకున్నారు జ‌గ‌న్‌. రాజ్యసభ ఎన్నికలు బీజేపీ వైసీపీ బంధాన్ని నిజం చేశాయి. రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. ఈ నేపథ్యంలో వైసిపి అవ‌స‌రం బిజెపికి వుంది. జగన్ అయితే కేసుల కోసమైనా, తామ మాట వింటారన‌ది బిజెపి ధీమా. అటు, వైసీపీ అధినేత జగన్‌కూ తనకున్న కేసుల అవసరాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ సహకారం తప్పనిసరి. బీజేపీ జగన్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేదన్నది సుస్పష్టం. జగన్ పార్టీకి లోక్‌సభ-రాజ్యసభలో బలం ఉంది. కాబట్టి ఆయనను వదులుకునేంత తెలివి తక్కువ పని బీజేపీ చేయదు. అంత అవసరం కూడా ఆ పార్టీకి లేదు. వైసీపీతో తెరచాటు స్నేహం చేస్తే, ప్రజలు ఏమనుకుంటారోనన్న భయం కూడా లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఎలాగూ బలం లేదు. కాబట్టి, కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు. రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలి. కమలానికి ఫ్యాను గాలి అవసరం వుంది. అదే బిజెపి లెక్కా. అంబానీల‌కు ప్ర‌భుత్వంలో పనులు చేసి పెట్టే పెద్ద మ‌నిషే నత్వానీ. అయితే బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. నత్వానీని పార్టీ పరంగా, రాజ్యసభకు పంపించే అవకాశాలు లేవు. కాబట్టి, బీజేపీ ఢిల్లీ పెద్దలు జగన్‌తో సంబంధం కలిపారు. నత్వానీకి రాజ్యసభ సీటివ్వడం అనేది ప్రధాన అజెండాగా ప్రధానితో జగన్ భేటీ తర్వాత, అమిత్‌షాతో స‌మావేశం జ‌రిగింది. నత్వానీకి ఏపీ నుంచి రాజ్యసభకు రంగం సిద్ధం చేసి, జగన్‌తో మాట్లాడుకోండని చెప్పిన తర్వాతనే, ముఖేష్ అంబానీ ఆయనను వెంటబెట్టుకుని జగన్‌ను కలిశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్ని చూసి ఏపీ బీజేపి నేత‌లు విష‌యాన్ని అర్థం చేసుకోలేక గిల‌గిల కొట్టుకుంటున్నారు. ఇంత‌కు త‌మ‌కు వైసీపీ మిత్రపక్షమో, శత్రుపక్షమో తేల్చుకోలేకపోతున్నారు. అధికార పార్టీకి వ్య‌తిరేకంగా రాష్ట్ర సమస్యల పై తాము రోజూ యుద్ధం చేస్తుంటే ఢిల్లీ పెద్దలు మాత్రం ముఖ్య‌మంత్రితో తెరచాటు వ్య‌వ‌హారం చేయ‌డాన్ని మింగ‌లేక క‌క్క‌లేక నోరెళ్లబెడుతున్నారు. బీజేపీ నాయకురాలైన సంచయితకు సింహాచలం ఆలయ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే, ఢిల్లీ స్థాయిలో వైసీపి-బీజేపీ మధ్య ఉన్న పవిత్రబంధమేమిటో అర్ధమయి పోయింది. నత్వానీ ని రాజ్య‌స‌భ‌కు పంపి త‌మ నేత జ‌గ‌న్‌ను కాపాడుకోవ‌డానికి మ‌రోసారి పార్టీ నేత‌లు త్యాగం చేయాల్సి వ‌చ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో సీటు కోసం, ఒంగోలులో తన స్థానాన్ని త్యాగం చేసిన వై.వి.సుబ్బారెడ్డి. వైసీపీలో చేరితే ఎం.పీ సీటు ఇస్తారని ఆశపడి చేరిన బీద మస్తాన్‌రావు. విపక్షంలో ఉండగా పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి. కాపు కోటాలో సీటు వస్తుందని ఆశించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. వీరందరికంటే, అన్న జైలులో ఉంటే పాదయాత్ర చేసి పార్టీని బతికించిన చెల్లెమ్మ షర్మిలల‌ ఆశ‌ల్ని అడిఆశ‌లు చేసి పరిమళ్ నత్వానీ అనే గుజరాతీయుడికి ముఖ్య‌మంత్రి జగన్ ఎం.పీ సీటివ్వడం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జగన్ జైలులో ఉండగా, వైవి సుబ్బారెడ్డి ఆయనను, ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడారు. ఆయనకూ ఈసారి నిరాశే ఎదురయింది. అన్న అరెస్టయి జైలులో ఉంటే, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చెల్లెలు షర్మిల చేసిన పాదయాత్ర, పార్టీని బతికించింది. అయినా, ఆమె త్యాగానికి ఇప్పటివరకూ ప్రతిఫలం లేదు. మ‌రో వైపు తన భర్త మృతికి రిలయన్స్ కారణమని ఆరోపించిన వైఎస్ విజయలక్ష్మి ఆరోపణలు, తన తండ్రి మృతిపై సీబీఐ విచారించాలన్న జగన్ డిమాండు, తమ ప్రియతమ నేత వైఎస్ మృతికి అంబానీలే కారణమన్న ఆగ్రహంతో, వారి సంస్థలను తగులబెట్టిన వైఎస్ వీరాభిమానుల వీరంగాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఇంకా మర్చిపోలేదు. ముఖేష్ అంబానీ సీఎం జగన్ నివాసానికి రావడం రాజ్యసభ సీటు కోరడం నత్వానీకి రాజ్యసభ సీటివ్వడం చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. అంతే. తన తండ్రి మృతికి కారణమయ్యారని ఆరోపించిన, అదే అంబానీ కుటుంబ విధేయుడైన నత్వానీకి సీటివ్వడం వైసీపి కార్య‌క‌ర్త‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. ముఖేష్ అంబానీ-జగన్ మధ్య కేజీ బేసిన్ గ్యాస్ యుద్ధం జరిగిందని తెలుసు. వైఎస్ హెలికాప్టర్ మృతి వెనుక, కాంగ్రెస్-అంబానీ కుటుంబ హస్తం ఉందని స్వయంగా జగన్ మీడియా సాక్షి ఆనాడు కోడై కూసింది. స్వయంగా జగన్ మాతృమూర్తి విజయమ్మ కూడా అదే ఆరోపించారు. అటు జగనన్న కూడా అంబానీ కుటుంబంపై అనుమానం వ్యక్తం చేశారు. వాస్త‌వానికి జగన్ మనస్తత్వం ప్రకారం చూస్తే అంబానీకి మాట్లాడే అవకాశమే ఇవ్వడ‌నిపిస్తుంది. వీలైతే రిల‌య‌న్స్ కంపెనీల‌కు ఏపీలో నిలవ నీడ లేకుండా చేస్తాడేమో అనుకునేవారు వైసిపి కార్య‌క‌ర్త‌లు. కానీ, అలాంటి అంబానీ సిఫార్సు చేసిన వ్యక్తికి, ఏకంగా రాజ్యసభ సీటే ఇచ్చారంటే.. జ‌గ‌న్ అవసరం ఏమిటన్నది ఇట్టే అర్ధమవుతుంది. దీన్నిబట్టి, జ‌గ‌న్ చెప్పే మాటలకు, చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదని, జగన్ కూడా ముదిరిన‌ రాజకీయ నాయకుడే అని తేలిపోయింది. మత మార్పిళ్లు, అన్యమత ప్రచారం, స్వాముల యాగీ అంతా ప్రచారానికే తప్ప, దానితో బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. పాపం ఈ లోగుట్టు, తెరవెనుక బాగోతం తెలియక బీజేపీ సంప్రదాయవాదులు చొక్కాలు చించుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఖజానా ఖర్చుతో ప్రకటనల ఫోటోలు, సందేశాల బహిరంగ ప్రదర్శన పై నిషేధం

స్థానిక సంస్థలకు ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ప్రవర్తనా నియమావళి) అమలులో ఉన్న దృష్ట్యా   ఖజానా ఖర్చుతో ప్రకటనలపై ఫోటోలు, సందేశాలను ప్రదర్శించడం, బహిరంగ ప్రదర్సనకు ఉంచడంపై నిషేధం విధించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ప్రకటించారు. అదేవిధంగా  ప్రస్తుతం జీవించి ఉన్న నాయకుల విగ్రహాలను కవర్ (ముసుగువెయ్యడం) చేయడం తప్పనిసరి అన్నారు.  ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న వారికి  చెందిన  ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ల ద్వారా  , ప్రభుత్వ భవనాలపై బహిరంగ ప్రదర్శన లు నిషేధం అమలు రావడం జరిగిందన్నారు. మార్చి 7వ తేదీ  ఎమ్ సిసి  అమల్లోకి వచ్చినందున ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందన్నారు.  ఎన్నికల ను సజావుగా నిర్వహించడానికి ,  మోడల్ ప్రవర్తనా నియమావళి న్యాయమైన, సమతుల్యమైన,  నిష్పాక్షికమైన రీతిలో అమలు చేస్తామన్నారు.   ఎన్నికలను నిర్వహించే కాలంలో ప్రభుత్వ వ్యయంతో విగ్రహాలు, ఛాయాచిత్రాలు,  సందేశాలను ప్రదర్శించడానికి  వీలులేదన్నారు.   ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో లభించే మంత్రులు, రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని ఛాయా చిత్రాలను తొలగిస్తామనీ , వాటి విషయమే చర్యలు తీసుకుంటామని, ప్రక్షాళన లో భాగంగా వాటి తొలగింపునకు ఎన్నికల కమిషన్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  అన్ని రాజకీయ నాయకుల ఛాయాచిత్రాలు రాష్ట్ర విభాగాల అధికారిక వెబ్‌సైట్ల నుండి తొలగించాలని స్పష్టం చేశామన్నారు.   అదేవిధంగా అన్ని హోర్డింగ్‌లు, ప్రకటనలు మొదలైనవి, ప్రభుత్వ నిధులతో, ఏదైనా జీవన రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల విజయాలు సాధించటానికి  అనుకూలంగా ప్రభావం   చూపే వాటిని  వెంటనే తొలగించాలన్నారు.  ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ఇతర రాజకీయ కార్యకర్తల ఛాయాచిత్రాలను ప్రభుత్వ భవనాలు, ప్రాంగణాల్లో ప్రదర్శించడం పై నిషేధం ఉందన్నారు.  ఈ సూచన జాతీయ నాయకులు, కవులు మరియు గతంలోని ప్రముఖ చారిత్రక వ్యక్తుల చిత్రాలకు లేదా భారత రాష్ట్రపతి మరియు గవర్నర్ల చిత్రాలకు వర్తించదని,  వీటిని ప్రదర్శించబడటం కొనసాగించవచ్చు అని స్పష్టం చేశారు . రాజకీయాల్లో ఇప్పటికీ చురుకుగా ఉన్న రాజకీయ పార్టీల జీవన నాయకుల విగ్రహాలను ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. , ప్రజా నిధులతో నిర్మించిన గత నాయకుల విగ్రహాలను కవర్ చేయవలసిన అవసరం లేదు. ఎన్నికల కోడ్ అమలు చేసిన తరువాత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయాల్సిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, మోడల్ ప్రవర్తనా నియమావళిలో రాజకీయ కార్యకర్తలు, పార్టీల ఛాయాచిత్రాలు లేదా సందేశాల చిహ్నాలు ఉండకూడదన్నారు.  ఈ సూచనలు ఇప్పటి వరకు అమలు చేయనట్లయితే, వెంటనే అమలు చేయలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ సూచనలను అతిక్రమించి ,  వాటి అమలులో లోపభూయిష్టంగా వ్యవహరిస్తే  తీవ్రంగా పరిగణిస్తామని  రమేష్ కుమార్ హెచ్చరించారు.

రాజ్యసభకు పరిమళ్ నత్వానీ ఎంపికతో ఏపీ లాభపడుతుందా?

రాజ్యసభ కు వై ఎస్ ఆర్ సి పి  నుంచి ఓ గుజరాతి వాసి అయిన పరిమళ్ సత్వానీ ని జగన్ పంపడం వెనుక  రహస్యం ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ కారిడార్స్ లో ప్రస్తుతం ఈ ప్రశ్న షికార్లు చేస్తోంది.  ఏపి కి ప్రత్యేక హోదా - రాయితీలతో కూడిన విభజన హామీలకు, పోలవరం ప్రాజెక్ట్ కు, ప్రధానం గా కాకినాడ పెట్రో కెమికల్, కాస్మొటిక్ బారి ఇండస్ట్రీ కి , రామాయపట్నం మేజర్ పోర్ట్ కి, కడప ఉక్కు ఫ్యాక్టరీ కి, విశాఖపట్నం రైల్వే డివిజన్ తో కూడిన రైల్వే జోన్ కి, శ్రీకాకుళం, రాజమండ్రి, అనంతపురం ప్రాంతాలలో హై కోర్టు బెంచ్ లకి కేంద్ర ప్రభుత్వం నుండి నత్వానీ సాధించి పెట్టగలరా, అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏపిలో గల అపార గ్యాస్ నిక్షేపాలకు, చమురు సంపద దోపిడీలకు మరింత ప్రమాదం పొంచి వుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ వర్గాలు, పరిమళ్ నత్వానీ మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయం లో ఏ మేరకు నిబద్ధత తో వ్యవహరిస్తారని ప్రశ్నిస్తున్నాయి.  ఏపి లో గల కోనసీమ నుండి వేల కోట్లు విలువ చేసే చమురు, గ్యాస్ నిక్షేపాలను అన్వేషణ కారణంగాను, నిత్యం ఆ నిక్షేపాలు రవాణా కారణంగా నష్టపోతూ ప్రమాదపు అంచులలో వున్న కోనసీమ ప్రాంత  భద్రత కు, అభివృద్ధికి ఒక 1000 కోట్లు  సహాయ నిధిని కేంద్రం నుండి, రిలయన్స్ సంస్థ నుంచి పరిమళ్ నత్వాన్నీ విడుదల చేయించగలరా, అని కూడా పొలిటికల్ కారిడార్లు ప్రశ్నిస్తున్నాయి.  చెన్నై కేంద్రం గా వున్న ఓ ఎన్ జీ సి  ప్రధాన కార్యాలయాన్ని రాజమండ్రి ప్రాంతానికి తరలించ గలరా,  చమురు, గ్యాస్ కాలుష్య  భాదితులైన ఏపి ప్రజలకు వంట గ్యాస్ ధర 250 రూపాయలకే  పంపిణి చేయించ గలరా అని కూడా రాజకీయ పార్టీలు పరిమళ్ నత్వానీ కి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క దానికైనా నత్వానీ ద్వారా  ఏపి కి మేలు జరుగుతుందా, లేక  వైసిపి పార్టీలో రాజ్యసభకు సమర్థులు లేరా అనే వాస్తవాన్ని అంగీకరించే విధంగా ఆ శ్రేణులు బహిరంగ ప్రకటన చేయగలరా అని మరి కొందరు సూటిగా పరిమళ్ నత్వానీ కి ప్రశ్నలు సంధిస్తున్నారు.

వైజాగ్ లో విజ‌య‌సాయిరెడ్డి ప‌రువు నిల‌బ‌డుతుందా?

‘వైజాగ్‌’ మున్సిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. సిటీలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి చెందిన వారు. ఎమ్మెల్యేల‌కు స్థానికంగా గట్టి పట్టు వుంది. అయితే ఇక్కడ అధికార పార్టీకి విజయం అంత సులువేమీ కాదు. పాల‌నా రాజధానిని ఇక్కడకు తెస్తున్నామనే ప్రకటన, నవరత్నాలు తమకు ఓట్లు తెచ్చి పెడతాయని అధికారపార్టీ భావిస్తోంది. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై నెల‌కొన్న అసంతృప్తి తమ విజయావకాశాల‌పై అనుమానాలు క‌ల్గిస్తున్నాయ‌ని స్వంత‌పార్టీ నేత‌లే చెపుతున్నారు. తీసేసిన పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, బీసీ రిజర్వేషన్ల తగ్గింపు, శానిటరీ వర్క్‌ర్ల జీతాలు పెంచకపోవడం, రేషన్‌కార్డుల‌ తొగింపు వంటి అంశాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్ర‌తిప‌క్షం ఆశ పెట్టుకుంది. టిడిపి సీనియర్‌ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెల‌గపూడి రామకృష్ణబాబు. పి.వి.వి.నాయుడు, గణేష్‌కుమార్‌ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. వీరి దూకుడుకు అడ్డుకట్టవేసే బాధ్యతను ‘విజయసాయిరెడ్డి’ తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థును గెలిపిస్తే సి.ఎం. వద్ద ఆయన పరపతి మరింత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే ఆయన పరువుపోవడం ఖాయం. పాల‌నా రాజధానిగా ‘విశాఖ’ను ప్రకటించిన తరువాత కూడా అక్కడ అధికారపార్టీ ఓడిపోతే ప్రతిపక్షం చెప్పినట్లు ‘విశాఖ’ పౌరులు అక్కడకు రాజధాని రావడం ఇష్టం లేదనే విషయం స్పష్టం అవుతుంది. గుంటూరు, విజ‌య‌వాడ‌, వైజాగ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది? రాజధానిని ‘అమరావతి’ నుంచి ‘విశాఖ’కు త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజల‌ నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అయింది. ఇక్క‌డ జ‌రిగే ఎన్నిక‌ల్లో దాని ప్ర‌భావం క‌నిపిస్తుంద‌ని రాజ‌ధాని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని ప్రకటన రావడంతో ‘వైజాగ్‌’ ప్రజల్లోనూ ఆనందం కనిపించింది. అయితే ‘వైజాగ్‌’ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని, అక్కడ అభివృద్ధి జరిగితే చాల‌నే విధంగా ఉన్నారని ప్రతిపక్ష టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘వైజాగ్‌’ మున్సిపాల్టీకి జరుగుతున్న ఎన్నికల‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తినెల‌కొంది. వైకాపా స్థాపించిన దగ్గర నుంచి ‘వైజాగ్‌’ పట్టణం ఆ పార్టీకి క‌ల‌సి రావ‌డం లేదు. 2014లో పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌ స్వయంగా ‘విశాఖ’ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. తరువాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా భారీ స్థాయిలో 151 స్థానాలు గెలిచిన‌ప్ప‌ట్టికీ ‘వైజాగ్‌’ పట్టణంలో ఆ పార్టీకి మళ్లీ షాక్‌ తగిలింది. అసెంబ్లీ స్థానాల్లో సిటీలో ఉన్న నాలుగు స్థానాల్లో ఓడిపోయింది. ముక్కోణపు పోటీలో పార్టీ ఎంపీ విజయం సాధించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ‘మున్సిపల్‌’ ఎన్నికల్లో తమ సత్తా చాటి ‘వైజాగ్‌’లో జెండా పాతాల‌ని వైకాపా ఆశిస్తోంది. విజయసాయిరెడ్డి గత కొంత కాలంగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టిసారించి చక్రం తిప్పుతున్నారు. ‘వైజాగ్‌’ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. విశాఖ‌లో గెలిచి అధికార‌పార్టీ ప‌రువు కాపాడుకుంటుందా?

ప్రియాంక తలకు చుట్టుకుంటున్న హుస్సేన్ పెయింటింగ్ విక్రయ వ్యవహారం!

  కాని కాలం లో పైన వేసుకున్న బట్టే పామై కరుస్తుందని సామెత. అలా అయింది ప్రస్తుతం గాంధీ కుటుంబం పరిస్థితి. అప్పుడెప్పుడో ఎఫ్ ఎం హుస్సేన్ వేసిన పెయింటింగ్ రాజీవ్ గాంధీకి బహుమతిగా ఇవ్వటమేమిటి... దాన్ని తర్వాత ప్రియాంక గాంధీ రాణా కపూర్ కి విక్రయించటమేమిటి ... అది ఈ రోజు ఎస్ బ్యాంక్ వ్యవహారం తో లింక్ అవటమేమిటి..... ఏమిటో పాపం గాంధీల ఫ్యామిలీకి అన్నీ సినిమా కష్టాలే .....  ఎస్  బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌‌కు రెండు కోట్లకు పెయింటింగ్ విక్రయించిన విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.  ప్రియాంక నుంచి ఈ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మిలింద్ దేవరా తనపై ఒత్తిడి తెచ్చారని ఈడీకి రాణా కపూర్ వాంగ్మూలం ఇచ్చారు. పెయింటింగ్ కోసం తాను ఇచ్చిన రెండు కోట్లతో ప్రియాంక సిమ్లాలో కాటేజ్ కొనుగోలు చేసిందని చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఓ కేసులో నిందితుడి నుంచి తీసుకున్న డబ్బుతో ప్రియాంక కొనుగోలు చేసిన కాటేజ్‌ను ‘నేరం ద్వారా వచ్చిన ఆదాయం’గా పరిగణించాల్సి ఉంటుందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆస్తిని తమ అధీనంలోకి తీసుకునే అధికారం ఈడీకి ఉంటుందని  అంటున్నారు. కపూర్‌‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రియాంకకు త్వరలోనే సమన్లు జారీ చేయడంతో పాటు సిమ్లాలోని కాటేజ్‌ను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రియాంక నుంచి రాణా కపూర్ కొనుగోలు చేసిన పెయింటింగ్‌ను  సీజ్‌ చేసినట్టు ఎన్ఫోర్స్‌మెంట్ (ఈజీ) అధికారులు ప్రకటించారు. ముంబైలోని రాణా కపూర్‌‌ నివాసం నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తాను గీసిన చిత్రపటాన్ని 1985లో కాంగ్రెస్‌ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజీవ్ గాంధీకి బహూకరించారు. అయితే, 2010లో దీన్ని ప్రియాంక గాంధీ రెండు కోట్లకు రాణా కపూర్‌‌కు విక్రయించారు. ఈ పెయింటింగ్‌ను కొన్నందుకు ధన్యవాదాలు చెబుతూ రాణా కపూర్‌‌కు అప్పట్లో ప్రియాంక లేఖ రాశారు. ఏది ఏమైనా కమలనాధులు ఉద్దేశ పూర్వకంగా గాంధీ ఫ్యామిలీ ని ముప్పతిప్పలు పెడుతున్నారా అనే సందేహాలయితే ఢిల్లీ 10, జనపథ్ కి బలంగా ఉన్నాయి.

ఎస్ బ్యాంక్ వ్యవహారం నుంచి బయటపడ్డ తిరుపతి బాలాజీ.. పూరీ జగన్నాధుడికి మాత్రం చుక్కలు...

ఎస్ బ్యాంక్ వ్యవహారం పై సోషల్ మీడియా మండిపడిపోతోంది. సత్యం కంప్యూటర్స్ అనే ప్రయివేట్  కంపెనీ సంక్షోభ సమయంలో టెక్ మహీంద్రా అనే ప్రైవేటు సంస్థ ద్వారా అప్పట్లో నష్ట నివారణచర్యలు చేపట్టిన విషయాన్నీ గుర్తు చేస్తున్న నెటిజన్లు, ఇప్పుడు  ఎస్ బ్యాంక్ అనే ప్రయివేట్ బ్యాంక్ తాలూకు ఉద్యోగుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం కోసం కార్పొరేట్ బ్యాంక్ లైన -ఐ సి ఐ సి ఐ, యాక్సిస్, హెచ్ డి ఎఫ్ సి ల సాయం కోరకుండా, ప్రభుత్వం ఇప్పుడు -స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ ఐ సి లాంటి జాతీయ సంస్థల ను రంగం లోకి ఎందుకు దింపుతోందనేది నెటిజన్ల ప్రశ్న. " ఓ పక్కనేమ్మో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చెయ్యాలి అంటారు, ఇంకో పక్కన ప్రైవేట్ సంస్థలు మ్యూనిగిపోతుంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కలపాలి అంటారు. మీరు ఏమాట్లాడుతున్నారో మేకైనా అర్ధమౌతోందా?," అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.  ఇప్పటికే- పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ను మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయటం,  హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలో అక్రమ నగదు చలామణికి పాల్పడినట్టు పీఎంఎల్ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేయటం జరిగిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్ సహా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. యెస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెల పేరుతో నకిలీ కంపెనీ ప్రారంభించిన రూ.600 కోట్లు డీహెచ్ఎఫ్ఎల్ నుంచి తరిలించినట్టు గుర్తించారు. యెస్ బ్యాంకు మొత్తం రూ.4,450 కోట్ల రుణం మంజూరు చేయగా ఇందులో డీహెచ్ఎఫ్ఎల్కి రూ.3,700 కోట్లు, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్కి రూ.750 కోట్లు బదిలీచేశారు. అయితే, రుణాల సకాలంలో చెల్లించకపోయినా యెస్ బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 79 షెల్ కంపెనీలు ఏర్పాటుచేసి మొత్తం రూ.13,000 కోట్లను మనీల్యాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ 4,450 కోట్లు కూడా అందులో భాగంగానే తరలించినట్టు భావిస్తోంది. ఇంత పకడ్బందీ గా వ్యహారం నడిపిన ఎస్ బ్యాంక్ యాజమాన్యం ఈ రోజు లక్షలాది మంది డిపాజిటర్లను, ప్రభుత్వ, ప్రవేట్ సంస్థలను రోడ్డు మీదకు ఈడుస్తుంటే, ఆ సంస్థకు జాతీయ బ్యాంకుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయటం దేనికిసంకేతమనేది నెటిజన్ల ప్రశ్న. తిరుపతి వెంకన్న సొమ్ము ను ముందస్తుగా టీ టీ డీ ఎలాగో విత్ డ్రా చేయగలిగింది కానీ, పూరీ జగన్నాధుడికి మాత్రం ఎస్ బ్యాంక్ సున్నమేసింది. పూరీ ఆలయ అధికారులు ఇప్పుడు తమకు రావాల్సిన 547 కోట్ల రూపాయలు ఎలారాబట్టుకోవాలో అర్ధం కాని పరిస్థితి.... మరో వైపు ఏ పీ ఎస్ ఆర్ టీ సి కూడా ఒక రెండు వందల కోట్ల రూపాయలకు పైబడి ఎస్ బ్యాంక్ నుంచి సొమ్ము రాబట్టుకోవలసి ఉంది.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడంలేదు?

కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గడం లేదు. నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 శాతం మేర తగ్గాయి. బ్యారెల్ ధర 45 డాలర్లకు పడిపోయింది. కానీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆ మేరకు తగ్గలేదు. కరోనా వైరస్ కారణంగా చైనా సహా ఇతర దేశాల్లో ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీంతో ఈ ప్రభావం కనిపిస్తోంది. కరోనా కారణంగా మార్కెట్లు కూలుతున్నాయి. ఇన్వెస్టర్లు బంగారం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72, డీజిల్ రూ.65 వరకు ఉన్నాయి. 2017 సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 54 నుండి 56 డాలర్ల మధ్య ఉంది. అప్పుడు పెట్రోల్ ధర రూ.70, డీజిల్ రూ.58 వరకు ఉంది. ఆ తర్వాత 2018 చివరలో 2019 ప్రారంభంలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల వరకు పెరిగాయి. అయినా పెట్రోల్ ధరలు రూ.71, డీజిల్ రూ.64గానే ఉంది. అంటే అంతర్జాతీయంగా పెరిగిన ధరప్రకారం ఇక్కడి రేట్లు పెరగలేదు అని చెప్తున్నారు. నష్టాలు తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించడంలేదు. దేశంలో చమురు ధరల నియంత్రణ మీద కేంద్ర అజమాయిషీ వదులుకున్నాక ఈ పరిస్తితులు ఎడురౌతున్నాయు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ప్రస్తుతం 45 నుండి 50 డాలర్లుగా ఉంది. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 వరకు తగ్గాలి. అయితే గతంలో అధికంగా ధరలు తగ్గించనందున పెట్రో కంపెనీలు కొంత నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఆ నష్టాలను తగ్గించుకునేందుకు ధరలు తగ్గించడం లేదని భావిస్తున్నారు. గత దశాబ్దాలుగా ఈ నష్టాలను తగ్గించుకే పనిలోనే చమురు కంపెనీలు ఉన్నా ఆ నష్టాలు ఎందుకు తగ్గవో చమురు ధరలు ప్రజలకు ఎందుకు అందుబాటులోకి రావో సామాన్యుడికి ఎన్నటికీ సమాధానం లభించని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.  డాలరుతో రూపాయి మారకం విలువ క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి మరో కారణం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడిందని గుర్తు చేస్తున్నారు. రూపాయి మారకం గత ఏడాది రెండేళ్లలో రూ.68 నుండి రూ.72కి పడిపోయిందని, ఈ లెక్కన ధరలు రూ.2 వరకు అధికంగా ఉండాలని చెబుతున్నారు. భారీ తగ్గుదల కాగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు వరుసగా ఆరో రోజు తగ్గాయి. గత శుక్రవారం ఏడాదిలోనే ఒకేరోజు గరిష్టంగా తగ్గాయి. అదే సమయంలో 2016 తర్వాత వరుసగా వారం రోజుల్లో భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. బ్రెంట్ క్రూడాయిల్ 4 శాతం తగ్గి 49.67 వద్ద ఉంది. 2017 జూలై నుండి ఇది అత్యంత కనిష్టం. ప్రస్తుతం చమురు ధరలు దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో రూ.72.10లు. విజయవాడలో రూ.76.69లు. డీజిల్ ధర  డిల్లీలో 16 పైసలు క్షీణతతో రూ.65.07లు మన దగ్గర రూ.70.91లు ఉంది. దేశ రాజధానికి రాష్ట్రాలకు మద్య ధరల్లో ఈ వ్యత్యాసం ఎందుకుందో మనందరికీ తెలుసు. కేంద్ర రాష్ట్రాలు కొంతమేర పన్నులు తగ్గిస్తే తమకుఊరట కలుగుతుందని  సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు.

కరోనా వైరస్ దెబ్బకి దిగొచ్చిన చైనా కాలుష్యం

ఎంకిపెళ్లి సుబ్బి చావుకి వచ్చిందనేది పాత సామెత. ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేస్తే ....ఒకో సారి ఎంకి చావు సుబ్బి పెళ్ళికి వచ్చిందని కూడా చదువుకోవచ్చు. ఆర్ధిక మాంద్యం కారణం గా చైనా లో నైట్రోజెన్ డయాక్సయిడ్ లెవెల్స్ పడిపోయినట్టు నాసా, యూరోపియన్ స్పెస్ ఏజెన్సీ సంయుక్తంగా విడుదల చేసిన సాటిలైట్ ఇమేజెస్ ఇదే విషయాన్ని విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.  వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారకమైన నైట్రోజెన్ డయాక్సయిడ్  గణనీయంగా తగ్గటానికి చైనా ఎదుర్కుంటున్న ఆర్ధిక మాంద్యమే కారణమనేది నాసా వారి సూత్రీకరణ అన్న మాట. ఇంకాస్త వెనక్కు వెడితే, కరోనా వైరస్ వ్యాధి ఉధృతి కారణంగా 23 జనవరి తర్వాత చైనా లో పరిశ్రమలు, స్థానిక వ్యాపారాలు, రవాణా వ్యవస్థ పూర్తిగా కుదేలయ్యాయి. ఫలితంగా చైనా దేశం లో కాలుష్య శాతం గణనీయంగా తగ్గినట్టు శాస్త్ర వేత్తలు నిర్ధారించారు.  ఏ ఏడాది జనవరి 28 న తీసిన సాటిలైట్ చిత్రాలతో, నిరుడు జనవరి 28 న తీసిన చిత్రాలను పోలిస్తే, కాలుష్యం 30 శాతానికి పడిపోయినట్టు శాస్త్ర వేత్తలు నిర్థారించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యల కారణంగా చైనా లో కాలుష్య శాతం గణనీయంగాపడిపోయిందని ఎయిర్ క్వాలిటీ సైన్ టిస్ట్ బ్యారీ లోఫర్ వివరించారు.  నిజానికి 2008 ఎకనామిక్ ఆర్ధిక మాంద్యం ముందు కూడా చైనా లో నైట్రోజెన్ డయాక్సయిడ్ లెవెల్స్ క్రమేపీ తగ్గటాన్ని ప్రస్తావిస్తున్న శాస్త్రవేత్తలు, 2020 కరోనా వైరస్ ప్రభావం వల్ల  చైనా పాటించిన  జాగ్రత్తల కారణం గా కాలుష్యం తగ్గుతూ వచ్చిందనేది శాస్త్రవేత్తల విశ్లేషణ.  1952 డిసెంబరు మొదట్లో ఒక చల్లని పొగమంచు లండన్ పై పరుచుకున్న విషయాన్ని ప్రస్తావించిన శాస్త్రవేత్తలు, .చలి తట్టు కోవటానికి లండన్ వాసులు మామూల కంటే ఎక్కువగా బొగ్గును కాల్చడం మొదలు పెట్టడం తో ఎదురైన దుష్పరిణామాలను వివరించారు  .దీని వలన తయారైన వాయు కాలుష్యం, ఫాగ్ లోని చల్ల గాలుల సాంద్రత వల్ల బంధింపబడిన పొగమంచు వల్ల, కైవారం 4 రోజుల్లో 4,000 మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఈ విషయం పై విస్తారం గా పరిశోధన చేసిన చైనా శాస్త్ర వేత్తలు, తమ దేశం లో అటు వైరస్ ను నిరోధిస్తూ, ఇటు కాలుష్య కారక నైట్రోజెన్ డయాక్సయిడ్ శాతాన్ని కూడా పర్యావరణం లో తగ్గించగలిగారు.

ఎన్నికల వ్యయ పరిశీలకులుగా అటవీ శాఖాధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా  అటవీశాఖ అధికారులను నియమించడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులు గా 13 జిల్లాలకు అటవీశాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్  నియమించడం జరిగింది. వారితో పాటుగా మరో నలుగురు అధికారులను రిజర్వు లో  ఉంచారు.   జిల్లాల వారిగా  పి.రామ కృష్ణ - కృష్ణా జిల్లా,  బిఎన్ఎన్ మూర్తి - గుంటూరు జిల్లా, ఎం. శివ ప్రసాద్ - కర్నూలు జిల్లా , శ్రీమతి ఆర్. యశోదా బాయి - శ్రీకాకుళం జిల్లా,   అలాన్ చోంగ్ టెరోన్ - వై ఎస్సార్ కడపజిల్లా , సి.సెల్వం తూర్పుగోదావరి జిల్లా,  డాక్టర్ శేఖర్ బాబు గెడ్డం ప్రకాశం జిల్లా, కుమారి నందిని సలేరియా - విశాఖపట్నం జిల్లా, జగన్నాథ్ సింగ్ -చిత్తూరు జిల్లా,  అనంత్ శంకర్ -  పశ్చిమగోదావరి జిల్లా, నరేంథరన్  జిజి - అనంతపురం జిల్లా,  సందీప్ కృపాకర్ గుండాలా - విజయనగరం జిల్లా, ,  సునీల్ కుమార్ - నెల్లూరు జిల్లా లకు నియమించామన్నారు. వీరికి అదనంగా నలుగురు సీనియర్ అధికారులు- టి. జ్యోతి, షేక్ సలాం,  వై.శ్రీనివాస రెడ్డి,  శ్రీకాంతనాథారెడ్డిలను రిజర్వు లో ఉంచినట్టు చెప్పారు.