నిర్లక్ష్యానికి మన బతుకులు సమాధి కాబోతున్నాయా?

ప్రపంచ అభివృద్ధి సైన్స్ తోనే సాధ్య‌మ‌ని తెలిసి కూడా నూత‌న అధ్య‌య‌నం వైపు ప్రయాణించని మన డొల్ల‌త‌నం ముందు మనకేసి మనమే జాలిగా చూసుకున్నా,  బతకని స్థితిలోకి చేరుకుంటున్నామా?   సైన్స్ ఇచ్చే ప్రయోజనాల్ని జుర్రుకుంటూ అడుగడుగునా సైన్స్ ని అవమానించే వైఖరికి,  పుట్టిన రోగాలకు మన బతుకుల్ని మనం అర్పించుకునే దుస్థితిలోకి వెళ్లిపోతున్నాం. సైన్స్ వెలుగులో వెలిగిన దేవుడి  స్వార్ధ పరత్వం ముందు దేవుడే దీనంగా నిలబడి, ఇన్నాళ్లూ లక్షోప లక్షల రకాల పూజలు, సువార్తా ప్రార్థనలు, ఉపవాస దీక్ష‌లు, న‌మాజ్‌లు అందుకుని విర్రవీగి ఇప్పుడు ఒంటరిగా తన గర్భ కుహరంలో తానే బందీ ఐపోయాడు. మాస్కుల్లేని పూజలు, మాస్కుల్లేని ప్రార్ధనలు ఇప్పుడు నిషిద్ధం.  థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో సైన్స్ ని అత్యంతగా  నిర్లక్ష్యం చేసిన ఉపద్రవాన్ని మనం చవి చూడబోతున్నాం. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, ప్రజలందరికీ దక్కాల్సిన సమాన హక్కులు, సమాన ఆక్సిజన్, సరిపడిన వైద్యం  దక్కనీయకుండా చేసినందుకు ప్ర‌తిఫ‌లంగా ఒక్కొక్క‌రిపై దాడి చేస్తూ క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. సైన్స్ రంగాలకు కేటాయింపులు భారీగా తగ్గించడం, శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థల మూల్గులని పీల్చి, సైన్స్ ఆవిష్కరణలని గేలి చేసిన, దుర్మార్గం ముందు మన పాలిపోయిన ముఖం మీద కరోనా ఊస్తున్నది. ఒక్కోసారి ఒక్కో పాలకుడు రాజ్యాంగంలో పేర్కొన్నట్టు  శాస్త్ర సాంకేతిక రంగాల విస్తృతికి తోడ్పాటు అందించ‌డం లేదు.  తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు  విద్య, వైద్యం, సామాజిక శాస్త్రాల, వైజ్ఞానిక శాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక శాస్త్రాలని సమాజంలోని అనేక వర్గాలకు దూరం చేసిన వెధవాయిత్వాన్నికరోనా బట్టలిప్పేసి బజారులో నిలబెడుతున్నది.  ఇప్పుడు సత్వర చావు లేమి వారసత్వం గాళ్ళది.  క్రిటికల్ కేర్ లో చావు వైభోగం సంపన్నులది. ఏమైతేనేం, కరోనా ఇప్పుడు సమాన న్యాయం గెలిచేసిన పాలకుల లత్కోరు స్వభావాన్ని నిరసిస్తూ వెనకా ముందూ  అందరికీ సమాన చావు ప్రసాదించడానికి సంసిద్ధంగా వుంది. గొప్ప ఆయుర్వేద విజ్ఞానం ఇక్కడ వుంది. దానికి దైవత్వం అప్పాదించి విష పూరితం చేశారు.  గొప్ప సంఖ్యా శాస్త్రం, గొప్ప ఖగోళ శాస్త్రం, ప్రపంచానికి మార్గదర్శనం చేయగల గొప్ప విజ్ఞానం వుంది. దానికి హేతువుని దూరం చేసి దాని శాస్త్రీయ దృక్పథం ప్రాణ తీగెని తెంచి నామం బెట్టి, విభూది పూసి దాని స్వభావం నాశనం చేసి వంచించారు. ఈ శతాబ్దాల వెక్కిరింతని కరోనా మరింతగా బట్టబయలు చేస్తున్నది. ఇప్పుడు ఏది చేసినా ఉపశమనమే. ఇప్పుడు ఏమి చేసినా  మరణాన్ని వాయిదా వేయడమే. ఇప్పుడు వ్యాధి నిరోధాన్ని వ్యాప్తి చేయడమే. ఇప్పుడు ఏమి చేసినా  వ్యాధి విస్తృతిని అడ్డుకోవడమే. సైన్స్ విస్తృతిని విస్తృతంగా అడ్డుకున్న దుష్పరిణామాల శిథిలత్వం కింద ఇక పేర్లు లేని సమాధుల్లో చిరునామా వెతుక్కోవడమే.

సింగరేణి భూమిని ఎవరు అమ్ముకున్నారు?

మందమర్రిలో శ్రీకృష్ణ థియేటర్ ముందు ఉన్న సింగరేణి భూమి (గ్రౌండ్)ని ఎవరు అమ్ముకున్నారు? మందమర్రిలోని శ్రీకృష్ణ థియేటర్ ముందు సింగరేణికి సంబంధించిన గ్రౌండ్ ఉన్న మాట మందమర్రి ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. అయితే ఆ గ్రౌండ్ క్రమంగా కనుమరుగైపోతున్నా ఎవరూ నిల‌దీసే ద‌మ్ము ఎవ‌రికీ లేదు. ఎందుకు? దీని వెన‌కాల ఎవ‌రున్నారు? గ్రౌండ్ భూమిని కబ్జా చేసి క్రమంగా తెగ‌న‌మ్ముతున్నారు. అంతే కాదు ఇప్పుడు వారి కన్ను ఆ గ్రౌండ్ ముందు గుడెసెలేసుకొని జీవిస్తున్న పేద కుటుంబాల‌పై ప‌డింది. అదే గత నలభై సంవత్సరాలుగా జీవిస్తున్న సీస కమ్మరి కుటుంబాలపైన పడింది. మేక తలకాయలను కమిరిచ్చి పొట్టపోసుకునే ఈ సీస కమ్మరి కుటుంబాలను ఎందుకు వెళ్ళాగొట్టాలి అనుకుంటున్నారు, వారి గుడిసెలను అక్రమంగా తొలగించిందెవరు? వాళ్ళను ఏ నీడ లేకుండా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బ్రతికేలా చేస్తుందెవరో ఎవరికి తెలియడం లేదు. ఎవ‌రో డ‌బుల్ గేమ్ ఆడుతున్నారని స్థానికులు అనుకుంటున్నార‌ట‌. సీస కమ్మరి కుటుంబాల వాళ్ళను హెల్త్ సెంటర్ సాకుతో గతంలో వెళ్ళాగొట్టాలనుకున్న‌ప్ప‌డు, సాక్షాత్తు ఎమ్మెల్యే బాల్క సుమన్ వెళ్ళవలసిన అవసరం లేదని అభయమిచ్చారట‌. అయినా ఇప్పుడు ఈ నిరుపేద‌ల‌ను భయపెట్టే వాళ్ళకు తెలియదా లేక మర్చిపోయారా? సింగ‌రేణి గ్రౌండ్ భూమికి, వాళ్ళ గుడిసెలకు సంబంధం లేకున్నా వాళ్ళను వెళ్ళగొట్టి ఆ భూమిని ఏం చేద్దామనుకుంటున్నారు. పురపాలక అధికారులు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పౌర‌హ‌క్కుల ప్ర‌జాసంఘం నేత ఎం.వి. గుణ ఆరోపిస్తున్నారు.

టిఆర్ఎస్ నేత‌ దౌర్జన్యం, సింగరేణి క్వార్టర్స్ కబ్జా...

ప్రాణహిత కాలనీ (షిర్కే) క్వార్టర్స్ లో ఉన్న అసలైన లబ్దిదారులు ఎంతమంది? అధికారపార్టీ అండతో ఉంటున్నవాళ్ళు ఎంతమంది? 3వ జోన్ లో క్వార్టర్స్,ప్రభుత్వ భూమిని వదలని నేరచరిత్ర కల్గిన అధికారపార్టీ నాయకుని అరాచ‌కాల‌పై స్పందించాల‌ని పౌర‌హ‌క్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. సింగరేణిలో ఎంతో ఘన చరిత్ర కల్గిన మందమర్రిలో అధికారపార్టీ నాయకుల దౌర్జన్యాలకు హద్దు, అదుపు లేకుండా పోతుంద‌ని పౌరహక్కుల ప్రజా సంఘం నేత ఎం.వి.గుణ ఆరోపించారు. మందమర్రిలో ఒకప్పుడు 14 వేల మంది సింగరేణి కార్మికులు ఉండేవారు. 1964 తర్వాత క్రమంగా సింగరేణి ఉద్యోగుల కోసం 4 వేలకు పైగా క్వార్టర్స్ కట్టించడం జరిగింది. అయితే ఇప్పుడు మందమర్రిలోని సింగరేణి ఉద్యోగుల సంఖ్య దాదాపు 5 వేల మంది మాత్రమే. ఒకప్పుడు సింగరేణి ఉద్యోగుల కుటుంబాలతో కలకలలాడిన క్వార్టర్స్ ఇప్పుడు అధికారపార్టీ నాయకుల కుటుంబాలతో దోపిడీకి గురైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. యువ సింగరేణి ఉద్యోగులు క్వార్టర్ కి ఆప్లై చేసినా సింగరేణి యాజమాన్యం స్పందించట్లేదు కాని అధికారపార్టీకి చెందిన ప్రముఖ కార్మిక సంఘం నాయకుని అండదండలతో అధికారపార్టీకి చెందిన గల్లీ లీడర్ కూడా కాని వాళ్ళు 'కింగ్' లా ఫీలవుతూ క్వార్టర్లలో అక్రమంగా ఉంటున్నారు. గతంలో నేరచరిత్ర కల్గిన ఒక నాయకుడైతే పాలచెట్టు ఏరియాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొత్తగా షటర్లుగా మార్చడం జరిగింది. ఇదే వ్యక్తి అధికారపార్టీ కార్మిక సంఘం ప్రముఖ నాయకుని అండదండలతో 3వ జోన్ లో ఒక క్వార్టర్ ని కబ్జా చేసి ఉండటమే కాక మరొక క్వార్టర్ ని దగ్గరి బంధువుకి ఇప్పించాడని మందమర్రి కోడై కూస్తుంది. ఇదే వ్యక్తి గతంలో ఒకసారి జైలుకు వెళ్ళి రావడమే కాక ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇదంతా చూస్తుంటే మద్దతు ఇస్తే చాలు ఎంత నేరచరిత్ర ఉన్నా మాకు అనవసరం అనేలా అధికారపార్టీ వ్యవహరించడం దుర్మార్గం. అలాగే షిర్కేలో ఉండే అధికారపార్టీకి చెందిన నాయకులు ఇంకా పటేల్ పట్వారి వ్యవస్థ, దొరల పెత్తనం అనుకొని ఎంతమంది ఇల్లీగల్ గా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కబ్జాదారులను వదిలేసి నలభై ఏళ్ళుగా ఉంటున్న సీసకమ్మరి కుటుంబాల గుడిసెలను ఆక్రమణ పేరుతో కూల్చేశారు. అధికారపార్టీ అయితే ఒక న్యాయం, పేదవాళ్ళయితే ఒక న్యాయమా?. ఇప్పటికైనా అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ భూమి కబ్జాలు ఆపాలని, అక్రమంగా ఉంటున్న క్వార్టర్స్ నుండి ఖాళీ చేయాలని పౌరహక్కుల ప్రజా సంఘం నేత ఎం.వి.గుణ డిమాండ్ చేస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన‌ మనోళ్లే శాడిస్టుల్లా!

మ‌రీ దారుణం. ఇంత దరిద్రంగా.. హీనంగా వ్యవహరిస్తారా? అన్న సందేహంతో పాటు.. వారి వ్య‌వ‌హార‌శైలి క‌రోనా వైర‌స్‌లా వుంది. విదేశాల నుంచి వచ్చినోళ్లు మరీ ఇంత భాద్యత లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే క‌రోనా దెబ్బ‌కు దేశంలోని ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డుతూ ఒకొక్క‌రూ రాలిపోతున్నారు. విదేశాలకు వెళ్లిన వారిలో అత్యధికులు బాగా చదువుకొని చక్కటి ఉద్యోగం చేసుకుంటూ, సంపద విషయంలోనే కాదు.. అలవాట్లు.. ఆలోచనలు సైతం అంతో ఇంతో బాగుంటాయన్న భావన మొన్నటి వరకూ ఉండేది. కానీ.. ఎప్పుడైతే వ‌చ్చిన వాళ్ళు ఇంటి ప‌ట్టున వుండ‌క తెగింపుతో ప్ర‌జ‌ల‌తో క‌లవాల‌నుకోవ‌డం వీరి పాడు బుద్ధిని బ‌య‌ట‌పెడుతోంది. వీళ్ల లేకీత‌నానికి ఇంకెంత మంది బ‌లికావ‌ల్సి వుందో. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి 19 వేల 313 మంది అంతర్జాతీయ ప్రయాణీకులు వ‌చ్చారు. వీరిలో చాలామంది స్వీయ నిర్భందనం పాటించ‌డం లేదు. ఎంత అప్రమత్తంగా ఉండాలో అలా వుండ‌టం లేదు. అవగాహన కల్పించేలా ఉండాలే తప్పించి.. బాధ్యత లేకుండా బలాదూర్ తిరుగుతున్న వారి తీరు చూస్తే.. అనవసరంగా విదేశాల నుంచి వారు వ‌చ్చేలా ప్ర‌భుత్వం ఎందుకు స‌హ‌క‌రించింద‌ని పిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ విధిస్తే.. వాటిని వదిలేసి.. ఎక్కడికి పడితే అక్కడకు తిరుగుతున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. చుట్టాల‌తో క‌లుస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లు ఇలా రోడ్ల‌పై కనిపించిన ఇటీవ‌ల విదేశాల నుంచి వ‌చ్చిన వ్య‌క్తుల పాస్‌పోర్టుల శాశ్వ‌తంగా ర‌ద్దు చేసి ఈ విష‌యాన్ని టీవీలో విస్తృతంగా ప్ర‌చారం చేయ‌గ‌లిగితే అలాంటి మూర్ఖుల్లో కొంతైనా మార్పు రావ‌చ్చు. అనవసరంగా దేశంలోకి రానిచ్చి భారీ మూల్యం చెల్లించుకుంటోంది దేశం ఇప్పుడు. ఇంత కాలం విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు ఓపికతో సహించారు. చుట్టుప‌క్క‌ల వున్న ప్ర‌జ‌ల‌కు ఈ విష‌యం తెలుస్తుంది కాబ‌ట్టి ప్ర‌జ‌లే అప్ర‌మ‌త్తంగా వుండి అలాంటి వారి వివ‌రాలు వెంట‌నే పోలీసుల‌కు అందించాలి. లేక పోతే మీ జీవితాలు ఆరిపోతాయ‌న్న అంశాన్ని గుర్తించుకోవాలి. అలాగే విదేశాల‌నుంచి వ‌చ్చిన వారి బంధుమిత్రులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్ళిపోవాలి. వారి స‌మాచారం స్థానిక పోలీసులకు ఇవ్వటం చాలా అవసరం. విదేశాల నుంచి వచ్చినోళ్లు బాధ్యత లేకుండా వ్యవహరించటం కారణంగా.. ఇక్కడి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాన్ని ఇవ్వకూడదన్నది మర్చిపోకూడదు. కరోనా మహమ్మారి బారి ప‌డి ఇంత మంది బాధ‌ప‌డుతున్నారంటే దానికి ప్ర‌ధాన‌ కారణం.. విదేశాల నుంచి వచ్చినోళ్ల పుణ్యమేనన్నది మర్చిపోకూడదు. తాము ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాం అన్న విష‌యాన్ని మ‌రిచి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ కుటుంబ‌స‌భ్యుల జీవితాల‌తో పాటు చుట్టుప‌క్క‌ల వారి ప్రాణాల‌తో చెల‌గాటమ‌డాడం ఎంత వ‌ర‌కు న్యాయ‌మో ఒక సారి ఆలోచించుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన స్వదేశీయులు.. బుద్ధిగా ఎవరిళ్లల్లో వారిని సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోకుండా ఆ విషయాన్ని పట్టించుకోకుండా వుండ‌టం నీచాతి నీచమే, వ‌ళ్లు కొవ్వు ఎక్కితే ఇలాగే వుంటుంది. శాడిజ‌మే అంటే ఇదే మ‌రి.

కార్పోరేట్‌ల‌పై ఉన్న ప్రేమ జ‌నంపై లేదా?

దేశాజనాభా 130 కోట్లు. 15 వేల కోట్ల కంటితుడుపు సాయం. అంటే తలకు 115 రూపాయలు మాత్రమే. ఇదేనా క‌రోనా మహమ్మారిపై యుద్దానికి ప్ర‌ధాని చేసిన సాయం? అంటూ ఐఎఫ్‌టీయూ ప్రసాద్ (పిపి) ఘాటుగా స్పందించారు. కేరళ జనాభా ఎంత? కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 కోట్ల సాయం ప్రకటించింది. 130 కోట్ల జనాభాకి అంతకంటే కూడా తక్కువ సాయం! మహమ్మారి వ్యాధి నివారణ, నియంత్రణలకు కాకుండా మరింక దేనికి ఖర్చు చేస్తుంది? దేశ ప్రజలపై శ్రద్ధ ఇదేనా? ఒక్క కలం పోటుతో RBI నిల్వల నుండి రూ.1,76,000 కోట్లు స్వాహా! బడా కార్పోరేట్ సంస్థలకు టాక్స్ మినహాయింపు ఖరీదు రూ.1,45,000, కోట్లు! గత ఆరేళ్ళ పాలనలో నిరర్ధక ఆస్తుల పేరిట 28 కార్పోరేట్ సంస్థలకు మాఫీ చేసిన బ్యాంకుల సొమ్ము మొత్తం రూ.10,00,000 కోట్లు. ఇంకెన్నో ఇలాంటి మాఫీలూ, రాయుతీలూ, మినహాయింపులూ, మూల్యాలూ! ఓ వందమంది కూడా లేని బడా కార్పోరేట్ కంపెనీలకు ఇంతటి సాయాలూ, ఉద్దీపనలూ! కానీ 130 కోట్ల మంది జనాభాకు మాత్రం తలకు 115 రూపాయలు మాత్రమే! క‌నీసం యెస్ బాంక్ ఎగవేతల సొమ్ము ని కూడా కేటాయించలేదు మ‌న ప్ర‌ధాన మంత్రి. కార్పొరేట్ల పై ప్రదర్శించే శ్రద్దాసక్తులలో ఇది ఎన్నో వంతు? మోడీ షా సర్కార్‌ ఒక సారి ఆలోచించుకోవాలి? క‌రోనా నియంత్రణ కోసం బడ్జెట్ లో ఎన్ని నిధుల్ని కేటాయించారనేది ముఖ్యమైనది. దేశం యావత్తు ఒకే త్రాటిపై నిలబడి మహమ్మారి పై యుద్ధం చేయాల్సిన కీలక పరీక్షా సమయం లో మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌ధాని ప్ర‌సంగంలో 15 వేల కోట్ల కంటితుడుపు ప్ర‌క‌ట‌న‌ను ఎలా అర్థం చేసుకోవాలి?

తెలంగాణలో 39 కేసులు...

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి ఆరుగురిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో కేసుల సంఖ్య 39కి చేరుకుంది. మంగ‌ళ‌వారం బ‌య‌ట‌ప‌డిన 6 కేసుల్లో ముగ్గురు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కాగా..మిగ‌తా ముగ్గురు స్థానికులున్నట్లు తెలుస్తోంది. బాధితులతో కలిసిమెలిసి ఉన్న వారి కుటుంబసభ్యులను స్వీయ నిర్భందనంలో పరిశీనలో ఉంచినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. కరోనా బాధితులను గుర్తించ‌డానికి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. దాదాపు 30 వేల మంది వైద్య, అంగన్ వాడి సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి 19 వేల 313 మంది అంతర్జాతీయ ప్రయాణీకులు వ‌చ్చారు. వీరందరూ స్వీయ నిర్భందనలో ఉంటే వైరస్ కట్టడి అవుతుందని భావిస్తూ..అన్నీ శాఖలను అలర్ట్ చేసింది ప్ర‌భుత్వం. వచ్చే పది రోజులు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల ఆరోగ్య పరీశీలనే లక్ష్యంగా ముందుకెళుతామని వైద్య శాఖ వెల్లడిస్తోంది.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్ టికెట్ 50 వేల రూపాయలు!

స్పైస్ జెట్ మాత్రం డొమెస్టిక్ విమానాలు నడుస్తాయనే తన వెబ్ సైట్ లో చూపెడుతోంది. కరోనా వైరస్ కాదు కానీ...ఎయిర్ లైన్స్ దోపిడీ మాత్రం అప్రతిహతంగా సాగింది. ఏదో ప్రధాని మోడీ పుణ్యం కట్టుకోబట్టి మరో 21 రోజుల పాటు ఎలాంటి ' గాలి ' బాదుడు ఉండదేమో కానీ, ఈ రెండు రోజుల ముందు వరకూ మాత్రం ప్రయివేట్ ఎయిర్ లైన్స్ పాసెంజర్స్ కు ధరల చుక్కల్ని చూపించాయి. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి అత్యవసరంగా హైదరాబాద్ బయల్దేరిన ఎయిర్ పాసెంజర్స్ కు టికెట్ 50 వేల రూపాయల చొప్పున వసూలు చేసి, ఇండిగో ఎయిర్ లైన్స్ కరోనా సంక్షభం నుంచి దండిగా లాభాలు ఆర్జించింది. అలాగే, అదే రోజు బెంగళూరు కు ఢిల్లీ నుంచి టికెట్ ధర 18 వేల రూపాయలు పలికింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా జేబులు ఖాళీ చేసుకుని మరీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు ఓ.ఎస్.డి. లుగా పలువురు మంత్రులు, ఎం.పీ. ల దగ్గర బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆంధ్ర, తెలంగాణా వాసులు. ఈ విషయం పక్కన పెడితే, స్పైస్ జెట్ అయితే మరో అడుగు ముందుకేసింది.  ఈ రోజు అర్ధ రాత్రి నుంచి ( అంటే .. 23 వ తేదీ అర్ధ రాత్రి నుంచి ) డొమెస్టిక్ ఫ్లయిట్స్ ను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, స్పైస్ జెట్ మాత్రం, ఇంకా తన వెబ్ సైట్ లో ...సర్వీసులు నడుస్తూనే ఉన్నాయనీ, అందువల్ల టికెట్ రద్దు చేసుకోదలిస్తే, ఎదో నామమాత్రం డబ్బు వాపసు చేస్తామంటూ జవాబిస్తోంది. ఇహ, నేరుగా కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ రంగం లోకి దిగితే కానీ, ఈ విమానయాన సంస్థల ఓవరాక్షన్ అదుపులోకి వచ్చేట్టు లేదు.

21 రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్: ప్రధాని మోడీ

ఈ రోజు  రాత్రి 12 గంటలనుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో  ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ 21 రోజులు అమల్లో ఉంటుందని ప్రధాని ఎల్లడించారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు దేశమంతా ఒక్కతాటిగా నిలిచిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. జాతిని ఉద్దేశించి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. జనతా కర్ఫ్యూను మనసా వాచా పాటించారంటూ దేశ ప్రజలను అభినందించిన మోడీ, దేశానికి ఇది పరీక్ష సమయమని, సామాజిక దూరం అనేది ప్రతి ఒక్కరూ పాటించటమే కరోనా వైరస్ విసిరే  సవాల్ కు అసలైన జవాబు అన్నారు మోడీ. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి, సామాజిక దూరం పాటించాలని, ఈ లాక్ డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికీ లక్ష్మణ రేఖ లాంటిదని , అందువల్ల ఇది విధిగా పాటించాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 14 వరకూ అమల్లో ఉండే ఈ లాక్ డౌన్ కాలం లో ఇళ్ల నుంచి వెలుపలకు రావద్దని ఆయన సూచించారు. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి లాక్ డౌన్ లో ఉంటుందని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణమని అభివర్ణించిన నరేంద్ర మోడీ, సామాజిక దూరం అనేది ప్రధాని తో సహాఅందరూ పాటించాల్సిన విషయమన్నారు.

నిర్ల‌క్ష్యం చేస్తే పెద్ద ప్ర‌మాదంలో ప‌డ‌తాం

ద‌య‌చేసి ప్ర‌జ‌లంద‌రూ ఇంటి నుంచి బ‌య‌టికి రాకుండా నియంత్ర‌ణ పాటించ‌మ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఒక వ్య‌క్తితో వెయ్యి మందికైనా క‌రోనా వ‌చ్చే ప్ర‌మాదం వుంది. సైన్యాన్ని దింపే ప‌రిస్థితి తీసుకురావ‌ద్దు. ప్ర‌జ‌లే స్వ‌యంగా స్వీయ‌నియంత్ర‌ణ చేసుకోవాలి. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోప‌లే వుండాల్సిందే. మాట విన‌ని షాపుల్ని సీజ్ చేయాండి. అవ‌స‌ర‌మైతే షూట్ అండ్ సైట్ అర్డ‌ర్స్ ఇస్తాం. అవ‌స‌ర‌మైతే 24 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తాం. ముందు జాగ్ర‌త్త‌లు క‌ఠినంగా తీసుకుంటున్నాం. కర్ఫ్యూ అమ‌లులో వుంది. సాయంత్రం 6 గంట‌ల నుంచి షాపుల‌న్నీ బంద్ చేయాల్సిందే. హోం క్వారెంటైన్‌లో వున్న బ‌య‌టికి వ‌స్తే వారి పాస్‌పోర్ట్ సీజ్ చేస్తాం. అవ‌స‌ర‌మైతే వారి పాస్‌పోర్ట్ ర‌ద్దుచేసి నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశాం. ధ‌ర‌లు పెంచి నిత్యావ‌స‌ర‌వ‌స్తువుల్ని అమ్మే వారిపై పి.డి.యాక్ట్ కింద అరెస్టు చేస్తాం. ప్ర‌జ‌ల ర‌క్తం పిండాల‌నుకునే వారి షాప్‌లు శాశ్వ‌తంగా సీజ్ చేస్తామ‌ని సి.ఎం. హెచ్చ‌రించారు. క‌రోనా నియంత్ర‌ణ విష‌యంలో అధికారులే క‌నిపిస్తున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు ఎక్క‌డ వున్నారు. జంట‌న‌గ‌రాల్లోని 150 మంది కార్పోరేట‌ర్లు అంద‌రూ బ‌య‌టికి రావాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. శాస‌న‌స‌భ్యులు త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ళి ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయాలి. ప్ర‌జాప్ర‌తినిధులు బ‌య‌టికి రావాల్సింది. మంత్రులు జిల్లాల‌ల‌కు వెళ్ళండి. శాస‌న‌స‌భ్యులు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌ధాన పాత్ర వ‌హించండి. ఆరోగ్య‌శాఖ మంత్రి, మున్సిప‌ల్‌, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి త‌ప్ప మిగ‌తావారంతా జిల్లాల‌కు వెళ్ళాల్సిందేన‌ని సి.ఎం. ఆదేశించారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గ్రామ‌పంచాయితీలోని స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హ‌కారం తీసుకొని కీల‌క‌పాత్ర వ‌హించాల‌ని సి.ఎం. సూచించారు. ఇప్ప‌ట్టి వ‌ర‌కు 36 కేసులు తెలంగాణాలో బ‌య‌ట‌ప‌డ్డాయి. అంద‌రూ కోలుకుంటున్నారు. తెలంగాణాలో ఇంకా అనుమానితులు 114 మంది వున్నారు. వారిలో 82 మంది విదేశాల నుంచి వ‌చ్చిన‌వారు, మిగ‌తా వారు స్థానికులు. ఎంత మందికి సోకిందో త్వ‌ర‌లోనే తెలుస్తోందని సి.ఎం.చెప్పారు. క‌రోనా వైర‌స్ గురించి క‌వి స‌మ్మేళ‌న‌లు పెట్టి టీవీల్లో చూపించండి. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌మ‌ని సి.ఎం. సూచించారు.

ఏ పీ లో తోపుడు బండ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసరాలు : పీ వీ రమేష్

పారాసిట్ మాల్-650 ఎంజీ వేసుకోవచ్చు కానీ, యా స్ప్రిన్ వేసుకోవద్దని ముఖ్యమంత్రి అదనపు చీఫ్ సెక్రెటరీ డాక్టర్ పీ వీ రమేష్ సూచించారు. కరోనాతో ఆందోళన వద్దని, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. వైద్య సేవలు అందించేందుకు రిటైరైన డాక్టర్లు.. నర్సుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. " గ్రామాల్లో స్వీయ నియంత్రణ ఎక్కువగా ఉంది. నిత్యావసర వస్తువుల దుకాణాలను రోజంతా తెరిచే ఉంచే ఆలోచన కూడాఉందని ఆయన అన్నారు. తోపుడు బళ్ల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసరాలని తెచ్చే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తోన్న  ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు. నిత్యావసర వస్తువుల రవాణ విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, డాక్టర్ల సూచనలు లేకుండా హైడ్రో క్లోరోక్విన్ మెడిసిన్ వాడవద్దని , డాక్టర్ల సూచనలు లేకుండా అమెరికాలో హైడ్రో క్లోరోక్విన్ వినియోగించి భార్యా భర్తలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని కూడా డాక్టర్ పీ వీ రమేష్ గుర్తు చేశారు.  

సి.ఎం రిలీఫ్ ఫండ్ కు క‌రోనా విరాళాలు!

లాక్ డౌన్ ప్ర‌భావంతో తెలంగాణా ప్ర‌భుత్వానికి వ‌చ్చే రాబ‌డి తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడింది. పైగా కరోనా నియంత్ర‌ణ‌ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదంతా ప్రభుత్వానికి తలకు మించిన భారంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో పలువురు వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు స్పందించి మానవత్వం చాటుకుంటున్నారు. త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు. మేము సైతం అంటూ కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. హీరో నితిన్‌ పది లక్షల విరాళాన్ని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌ అందించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఒకరోజు మూల వేతనాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు సీఎం సహాయనిధికి రూ.48కోట్లు విరాళంగా అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యనాదెళ్ల సతీమణి అనుపమ రూ.2కోట్ల విరాళం అందించారు. ఈ సందర్భంగా అనుపమ తండ్రి, విశ్రాంత ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ సీఎంను కలిసి చెక్‌ అందజేశారు.  

ఒక్క తప్పు.. 130 కోట్ల మందికి శిక్ష

ఫ్లయిట్ దిగగానే క్వారంటైన్ చేస్తే ఇపుడు కోట్ల మంది ఇళ్లలో క్వారంటైన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా .. ఇది మన దేశంలో పుట్టిన వైరస్ కాదు కేవలం ఫ్లయిట్ ఎక్కి వచ్చిన ఒక వైరస్.. కరోనా వైరస్ పేరు చెపితేనే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఇప్పటికే చైనా, ఇటలీ లలో వేలాది మంది మృత్యు వాత పడ్డారు. ఇపుడు భారత్ లో కరోనా సెకండ్ స్టేజ్ నడుస్తోందని నిపుణులు చెపుతున్నారు. ఐతే అసలు కరోనా భారత్ లోకి ప్రవేశించకుండా చేసే అవకాశం ఉందా.. ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే ఇపుడు రాష్ట్రాలన్నీ దాదాపుగా లాక్ డౌన్ ప్రకటించేసాయి. దీనితో సామాన్యుడు బయటకు వచ్చి కుటుంబానికి కావలసిన నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వెజిటబుల్స్ నుండి ఉప్పు, పప్పుల వరకు ముందుగానే స్టాక్ పెట్టుకున్న వారి పరిస్థితి పర్వాలేదు కానీ ఈ లాక్ డౌన్ తో చుక్కలనంటుతున్న ధరల తో సామాన్యుడు కొనే పరిస్థితి లేదు అలాగే షాపుల వద్ద క్రౌడ్ ఎక్కువైతే అది మరీ ప్రమాదకరమే కదా.. మరీ ముఖ్యంగా 130 కోట్ల ప్రజలను గడప దాటొద్దనే కంటే అసలు భారత్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో వచ్చే ప్రతి ఒక్కరిని హౌస్ క్వారంటైన్ చేసే కంటే ఎయిర్ పోర్టు దగ్గరలోనే టెంపరరీ క్వారంటైన్ రూమ్స్ లో ఉంచి అవసరం ఐతే పారామిలటరీ దళాల పహారాలో వీటిని మైంటైన్ చేస్తే ఈ తిప్పలు తప్పేవి కదా ఎందుకంటే ఇపుడు హౌస్ క్వారంటైన్ విధించ బడిన వాళ్ళు 14 రోజుల క్వారంటైన్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా జనం లో కలిసి తిరిగేస్తున్నారు. ఒక వేళ ఫారిన్ నుండి వచ్చిన వ్యక్తి బుద్ధిగా హౌస్ క్వారంటైన్ పాటించినా ఇపుడు వెలుగు చూస్తున్న కేసులను బట్టి వారి ఇంటి నుండి మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దింతో ఈ వైరస్ వ్యాప్తి ని ఎలా అదుపు చేయాలా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఒక వైపు లాక్ డౌన్ విధించి బయటకు రావద్దు అన్నా వినిపించుకొని జనాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ పోలీసులు పహారా ఉన్నా మాట వినని జనం. దీనికి అల్తర్నేటివ్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర్లోనే క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేసి ఫారిన్ నంది వచ్చే ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఈ రూముల్లోనే 14 రోజుల క్వారంటైన్ పూర్తీ చేసి వెళ్లాలని డిక్లెర్ చేసి ఉంటె ఈ రోజు నూట ముప్పయి కోట్ల మంది కి ఇబ్బందులు తప్పేవి కదా. అలాగే ఈ రూల్ ముందే డిక్లెర్ చేస్తే గట్టిగ అవసరం ఉన్నవాళ్లే ఇండియా కు వచ్చేవారు. దింతో ఫ్లోటింగ్ కూడా తగ్గేది. మరి ఎందుకో ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకోలేదు .. దేశంలోని 30 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల వద్ద ఇటువంటి పటిష్టమైన చర్యలు తీసుకుని ఉంటె ఈ రోజు 130 కోట్ల మంది బిక్కుబిక్కు మనకంటూ బ్రతకాల్సిన పరిష్టితి వచ్చేది కాదు కదా.  

ప్రతి ఐదుగురిలో ఒకరు క‌రోనా ప‌డ‌గ కింద వున్నార‌ట‌!

ప్ర‌తి ఐదుగురిలో ఒక‌రు క‌రోనా ప‌డ‌గ నీడ కింద వున్నారు. అయితే ఎవ‌రిపై ఎప్పుడు కాటు ప‌డుతుందో! ఏ మాత్రం అప్ర‌మ‌త్తంగా లేకున్నా క‌రోనా కాటుకు గురై బ‌లికావాల్సిందేనంటోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ఐదుగరిలో ఒకరు (20 శాతం మంది) కరోనా ఆధీనంలోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. వైద్యులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటించకుంటే వీరంతా కరోనా బారిన పడతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,78,679 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 16,500 మందికి పైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కాగా, ఇప్పటి వరకు 1,01,000 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొదటి లక్ష మందికి కరోనా సోకడానికి 67 రోజులు పట్టింది. అయితే కేవలం నాలుగు రోజుల్లోనే మరో లక్ష మందిని కరోనా చుట్టుముట్టి జీవితాన్ని దుర్భ‌రం చేస్తోంది. దీంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అవసరమైతే 170 కోట్ల మందిని నిర్బంధంలోనే ఉంచాలని, వారిని బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ప్ర‌పంచ‌దేశాల‌కు విజ్ఞ‌ప్తి చేసింది.

విశాఖ లో కరోనా రెండో స్టేజ్ కు చేరుకుంది

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని నేడు విశాఖలో పరిస్థితిపై నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇప్పటికి మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో 7 పాజిటివ్ కేసులు నమోదు జరిగింది. 220 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా 168 మంది కి నెగెటివ్ వచ్చింది,మిగిలిన వారికి నివేదికలు కోసం వేచి చూస్తున్నాము. విశాఖ జిల్లా లో మూడు కేసులు నమోదు జరిగింది. విశాఖలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చేసిన సేవలు అభినందనీయం. ఎంత చేసిన ఇంకా అప్రమత్తం అవ్వాలి. లాక్ డౌన్ ప్రకటించినా ఇంకా ప్రజలు సహకారం ఇవ్వాలి. లాక్ డౌన్ విజయవంతం చేయాలి అప్పుడే వైరస్ వ్యాప్తి అడ్డుకోగలమన్నారు.  విశాఖ లో కరోనా రెండో దశలో అడుగు పెట్టింది.విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వచ్చింది. మూడో దశలోకి రాకుండా విశాఖ వాసులు ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఉచిత రేషన్ ఇస్తున్నాము. వచ్చే నెల 4 వ తేదీ ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అన్నారు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. "విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలి,వారు గృహ నిర్బంధం లో ఉండాలి. సీతమ్మ ధార, అనకాపల్లి, గాజువాక, అల్లిపురం ప్రాంతాలు హై రిస్క్ లో ఉన్నాయి.విశాఖ లో 20 కమిటీలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పనిచేస్తున్నారు. విశాఖలో 1472 మంది విదేశాల నుంచి నగరానికి వచ్చారు.వైద్య సిబ్బందికి మాస్కలు, పిపిఏ కిట్ లు అందుబాటులో ఉంచుతున్నాము. ఔట్ సోర్స్ ఉద్యోగులకు జీతాలు చెలిస్తాము.విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి గా పాటించాలనీ, " డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచించారు. లాక్ డౌన్ ప్రకటించిన అనవసరంగా రోడ్ల పై తిరిగితే  ఆ వాహనాలు సీజ్ చేస్తాం.ఈ సాయంత్రం నుంచి మరింత కఠిన ఆంక్షలు విధిస్తున్నామనీ చెప్పారు. ఫార్మా పరిశ్రమలు తక్కువ సిబ్బంది తో పని చేయాలి. మీడియా పై నియంత్రణ లేదు , పోలీస్ సిబ్బంది వారి విధులకు ఆటంకం కలిగించవద్దు.జివిఎంసి మరింత గట్టిగా పనిచేయాలి. రైతు బజార్ లను స్కూల్ గ్రౌండ్స్, పెద్ద మైదాన్లలో నిర్వహిస్తాం. నిత్యావసర వస్తువు ధరలు పెరిగితే వారిపై కేసులు పెడతా మన్నారు మంత్రి పేర్ని నాని.

ఖాళీగావున్న‌సెక్రటేరియట్ ను ఐసోలేషన్ కేంద్రంగా వాడండి!

హైదరాబాద్ సెక్రటేరియట్ ఖాళీగా ఉన్నందున ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని తెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో COVID-19 రోగుల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట పరిస్థితులలో, అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమిష్టిగా కృషి చేసి, భయంకర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న చర్యలను, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర శాఖ తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ లేఖ‌రాశారు. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయ‌న స్పష్టం చేశారు. కొంత మంది ఈ విపత్తును అవకాశంగా తీసుకొని స్వలాభం కోసం స్వార్ధంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఫలితంగా సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకొని, ధరల నియంత్రణ చేపట్టగలరని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో వున్న బిజెపి కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఎం.పి.బండి సంజయ్ కుమార్ తెలిపారు.

బుధ‌వారం నుండి విజ‌య‌వాడ న‌గ‌రంలో కఠిన ఆంక్షలు

ఉ. 6 నుండి ఉ.9 వరుకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి. పచారి షాపులు, పళ్లుమార్కెట్, రైతు బజార్లు, కాళేశ్వరరావు మార్కెట్ మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయి. ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి. ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి. ఉ. 7 నుండి సాయంత్రం 7 వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి. ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ , వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి. జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్, రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ అయ్యేవరుకు ఓపెన్ కు అనుమతి లేదు. పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చ‌రించారు.

చైనాలో మరో వైరస్‌.. ఒకరు మృతి.. 32 మందికి వైద్య పరీక్షలు

అసలే చైనా పుణ్యమా అని కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతుంటే.. తాజాగా చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. చైనాలోని యువన్ ఫ్రావిన్సులో 'హంటా వైరస్' బారిన పడి 39 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. అతడు హంటా వైరస్‌తో మృతి చెందినట్లు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అతడు ఓ బస్సులో ప్రయాణించాడని, దీంతో ఆయన ప్రయాణించిన బస్సులో 32 మందిని టెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ హంటా వైరస్ వ్యాప్తికి ఎలుకలే ప్రధాన కారణమని తెలుస్తోంది. 1959 లో ఈ వైరస్ ను మొదటిసారి గుర్తించగా.. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ 2016 నుండి అందుబాటులో ఉంది. అయితే ఓ వైపు కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. ఈ హాంటా వైరస్ రీఎంట్రీ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.