ఇట‌లీలో కరోనా విలయతాండవం పిట్టల్లా రాలిపోతున్న జ‌నం!

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ఉపద్రవానికి దారితీస్తుందో మిగతా దేశాలకు ఇటలీ పరిస్థితి గుణపాఠం నేర్పుతుంది. ఇప్పటికే కోవిడ్-19 మరణాల్లో ప్ర‌పంచంలో అత్యధికంగా 5476 మంది చనిపోయారు. కరోనాను కట్టడి చేయడం కోసం ఆ దేశంలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది శక్తికి మించి పని చేస్తున్నారు. ఇటలీలోని వేలాది మంది డాక్టర్లు, నర్సులు కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌ను అదుపు చేయడం ఇటలీకి తలకు మించిన భారం అవుతోంది. దీంతో ఆ దేశం సాయం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తోంది. 60 వేల మంది కరోనా బారి పడగా.. 5476 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులోనే ఇటలీలో 651 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుండటంతో... శవాలను ఖననం చేయడానికి కూడా వేచి చూడాల్సి వస్తోంది. ఆ ప‌రిస్థితిని చూడ‌లేక ఇట‌లీ అధ్య‌క్షుడు భోరున విల‌పించారు. రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పెరుకుపోతున్న శవాలు,శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు!! కేవలం 6 కోట్ల జనాభా కలిగిన దేశం ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యసాదుపాయలు కలిగిన దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించాడు. ఈ దృశ్యాల‌ను చూసైనా తెలుగు ప్ర‌జ‌ల్లో మార్పు రావాల్సి వుంది. నిర్భంగా బ‌య‌టికి రాకుండా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ఇట‌లీ నేర్పిస్తున్న గుణ‌పాఠం.

ఏపీలోని ప్రైవేట్‌ల్యాబ్‌ల్లో క‌రోనా టెస్ట్‌కు అనుమ‌తిలేదు!

NABL గుర్తింపు పొందిన డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ల జాబితాలో ఎపికి స్థానం ద‌క్క లేదు. CMR మార్గదర్శకాల ప్రకారం క‌రోనా పరీక్షలను నిర్వహించే సామర్థ్యం ఉన్న NABL గుర్తింపు పొందిన డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఒక్క ల్యాబ్ కు కూడా చోటు ద‌క్క‌లేదు. అయితే తెలంగాణాలో ఐదు ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి ఎన్.ఎ.బి.ఎల్. అనుమ‌తిచ్చింది. ఉన్న‌త‌స్థాయి ప్ర‌మాణాలున్న ల్యాబ్‌ల‌కే ఎన్.ఎ.బి.ఎల్‌. గుర్తింపు ఇస్తుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న క‌రోనా టెస్ట్ ల్యాబ్‌ల వివ‌రాలు ఇలా వున్నాయి. 1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి. 2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, 3. జిఎంసి, అనంతపురం. 4. విజ‌య‌వాడ సిద్ధార్థ కాలేజ్ ఈ నాలుగు చోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ శాంపిల్‌ను పరీక్షించిన అనంతరం వచ్చిన ఫలితాలను నిర్ధారించేందుకు పూణేలోని నేషనల్‌ వైరాలజీ లేబొరేటరీకి పంపించేవారు. అక్కడ నుంచి రిపోర్టులు రావడానికి మూడు రోజుల సమయం ప‌ట్టేది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను నిర్ధారించే రియల్‌ టైం పాలీమిరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌) పరికరం ఏర్పాటు చేసింది. కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ విజయవాడ ల్యాబ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కరోనా అనుమానితుల శాంపిళ్లను ఇక్కడకు ప‌రీక్షిస్తున్నారు. ఇక్కడి ఫలితాలు, పూణే ఫలితాలు సరిగా ఉన్నట్లు తేల‌డం వ‌ల్ల పూణే ల్యాబ్‌కు పంపించాల్సిన అవసరం లేకుండానే విజయవాడ ల్యాబ్‌లోనే పరీక్షలు నిర్వహించి కేవ‌లం ఆరు గంటల్లోనే రిపోర్టు ఇవ్వగలుగుతున్నారు. తద్వారా రోగికి అవసరమైన చికిత్స సత్వరమే అందడానికి వీలవుతుంది. కరోనా సోకిన వ్యక్తికి రోజుల్లోనే ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఎంత త్వరగా కనుగొంటే అంత రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే టెస్టులు పూర్తి చేసేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం విజ‌య‌వాడ‌లో వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కేవ‌లం గాంధీ మెడికల్ కాలేజ్‌లోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే 5 ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవ‌డానికి అక్క‌డి ల్యాబ్‌ల‌కు అనుమ‌తి ల‌భించింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌రైన ప్ర‌మాణాలు లేక‌పోవ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రైవేట్ ల్యాబ్‌ల‌కు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ల‌భించ‌లేదు.

కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఊరుకుంటారా?

* పంచాయతీ భవనాలకు వై సి పీ రంగులు వేయడం పై సుప్రీమ్ ఆగ్రహం * హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏ.పి . ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేత సుప్రీమ్ కోర్టులో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఏ.పి . ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  పిటిషన్‍ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.  కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది .  హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‍ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు ఈ నెల 10 వ తేదీన షాక్ ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే.  గవర్నమెంట్ ఆఫీసులకు వైసీపీ రంగులు వేయడంపై కీలక తీర్పు వెలువరించింది. వెంటనే పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి పది రోజుల్లోగా మళ్లీ రంగులు వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలతో సహా నివేదిక రూపంలో సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. వైసీపీ జెండా రంగు తరహా రంగులు వేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమోను రద్దు చేసింది. హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ కూడా చుక్కెదురైంది.  

కరోనా దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్ !

  స్టాక్ మార్కెట్ నేలచూపులు మొదలెట్టింది.  2,600 పాయింట్ల నష్టంతో ఈ రోజు ట్రేడింగ్ మొదలైంది. పలు దేశాల్లో లాక్ డౌన్ తో వృద్ధి తగ్గే ప్రమాదం. 8 శాతానికి మించి పడిపోయిన సెన్సెక్స్. నిఫ్టీ-50లో అన్ని కంపెనీలూ నష్టాల్లోనే. కరోనా వైరస్ భయాలు స్టాక్ మార్కెట్ ను ఇంకా వీడలేదు. పలు దేశాల్లో ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వృద్ధి ప్రభావితం అవుతుందంటూ వచ్చిన విశ్లేషణలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి. ఇదే సమయంలో శుక్రవారం నాటి యూఎస్ మార్కెట్ సరళి, నేటి ఆసియా మార్కెట్ల నష్టాలు కూడా ప్రభావం చూపడంతో, ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభమైన క్షణాల వ్యవధిలో 2,600 పాయింట్లకు పైగా నష్టపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, ఈ ఉదయం 9.40 గంటల సమయంలో 2,460 పాయింట్ల నష్టంతో 8.23 శాతం పడిపోయి, 27,456 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, 679 పాయింట్ల నష్టంతో, 7.77 శాతం దిగజారి, 8,066 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి.  బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ తదితర కంపెనీలు 10 శాతానికి మించి పతనమయ్యాయి. నేటి ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, నిక్కీ మాత్రమే 1.77 శాతం లాభంలో ఉంది. స్ట్రెయిట్స్ టైమ్స్ 7.30 శాతం, హాంగ్ సెంగ్ 3.75 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 2.49 శాతం, కోస్పీ 4.07 శాతం, సెట్ కాంపోజిట్ 6.13 శాతం, జకార్తా కాంపోజిట్ 3.61 శాతం, షాంగై కాంపోజిట్ 1.60 శాతం నష్టపోయాయి.

రాజధాని ప్రాంతం లో ఇతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు స్టే

రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి  ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై హైకోర్టు స్టే ఇచ్చింది.రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించటం సరికాదని రైతులు  హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాది. అయితే ఇక్కడ స్థలాలను దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రధాని మంత్రి ఆవస్ యోజన లో కూడా ఇళ్ల నిర్మాణం జరిగిందని, దుగ్గిరాల, మంగళగిరి సీఆర్డఏ పరిధిలోనే వస్తాయని కోర్టు కి తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది. దీనిపై తీర్పును లోగడ రిజర్వ్ చేసిన హైకోర్టు, నేడు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

నైతిక విలువలుంటే, నీలం సహానీ రాజీనామా చేయాలి: సి పి ఐ నేత రామకృష్ణ

ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. " బాధ్యతాయుత స్థానంలో ఉన్న మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు.  ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో గడగడలాడుతోంది. మన దేశంలో 2వ దశలో ఉంది. మరో వారం రోజుల్లో 3వ దశకు చేరుకుంటుందని, అలా జరిగితే పెను విపత్తే సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో కరోనా తీవ్రతను గుర్తించిన కేంద్రం 75 జిల్లాలలో లాక్ డౌన్ ప్రకటించింది. అందులో మన రాష్ట్రానికి చెందిన విశాఖ, కృష్ణ, ప్రకాశం జిల్లాలున్నాయి. కరోనా ప్రభావం ఏపీలో 3 వారాల పాటు ఉండదని ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు. మీ లేఖని పరిగణనలోకి తీసుకొని ఎన్నికల కమీషన్ స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ఏపీలో జరిగేదికాదు," అంటూ రామకృష్ణ చీఫ్ సెక్రెటరీ కి రాసిన లేఖలో సుదీర్ఘంగా వివరించారు . కరోనా తీవ్రత పెరిగి ప్రపంచంలో అభాసుపాలయ్యేవాళ్ళమన్న ఆయన,  నిన్నటి నుండి నేటి వరకు పోలింగ్ ఏర్పాట్లు జరిగి ఉంటె , బారులు తీరిన ఓటర్లకు కరోనా సోకి లక్షలాది మంది వ్యాధి బారినపడేవారు. దీనికంతా మీరే కారకులై ఉండేవారు. అసలు ఎవరి సలహా ప్రకారం 3 వారాలపాటు కరోనా ప్రభావం ఉండదని ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారంటూ రామకృష్ణ చీఫ్ సెక్రెటరీ ని నిలదీశారు. లేదంటే మీ పదవి కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి చెప్పినట్లుగా లేఖ రాశారా? ఒక చారిత్రక తప్పిదానికి మీరు మూల కారణమయ్యేవారు. ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఇంట్లో ఉన్నంత మాత్రాన కరోనా రాదా?

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్ల వద్దనే ఉండాలని, ఏదైనా అత్యవసరమైతేనే బయటకు రావాలని.. అది కూడా కుటుంబానికి ఒక్కరు చొప్పునే బయటకు రావాలని ప్రభుత్వాలు సూచించాయి. ఇదంతా బానే ఉంది కానీ, మనం ఇంట్లో ఉన్నంత మాత్రాన కరోనా రాదా?. మనం ఇంట్లో ఉన్నా వైరస్ సోకే అవకాశాలున్నాయని అంటున్నారు. మనం ఇంట్లో ఉన్నాం కదా, మనకేం కాదని నిర్లక్ష్యం ఉండకూడదని.. ఇంట్లో ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.   ఇంట్లో ఉన్నా కూడా.. కూరగాయలు, పాలు మరియు కొన్ని నిత్యావసరాలు బయట నుండి తెచ్చుకునే అవకాశముంది. కావున, కూరగాయలు శుభ్రంగా కడగాలి. పాల ప్యాకెట్ కూడా చేతులకి గ్లౌజ్ వేసుకొని తాకాలి. కొందరికి పాల ప్యాకెట్ ని నోటితో కత్తిరించే అలవాటు ఉంటుంది. అలా కాకూండా, చాకు లేదా కత్తెరతో కత్తిరించాలి. రోజుకి రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయాలి. వీలైనన్ని సార్లు చేతులు శుభ్రంగా సబ్బుతో కడగాలి. ఉతికిన బట్టలనే ధరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్నా సరే.. తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు.. కర్చీఫ్ లేదా టిష్యూ అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ చేతిని అడ్డుపెట్టుకుంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి. న్యూస్ పేపర్ అలవాటు ఉన్నవారు కొన్నిరోజుల పాటు ఆ అలవాటుని మానుకుంటే మంచిది. లేదా చేతికి గ్లౌజులు వేసుకొని పేపర్ తాకాలి. ఇలా ఇంట్లో ఉన్నా సరే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట నుండి తెచ్చుకునే వస్తువులను తాకేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అప్పుడే వైరస్ బారిన పడకుండా ఉంటాం.

మోత మోగిపోతున్న కూరగాయల ధరలు... కిలో బెండ కాయలు 120 రూపాయలు..

    * అధిక ధరలపై సి.ఎం. కె సి ఆర్ హెచ్చరికలు బేఖాతర్ * పత్తా లేని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఇదెక్కడో సూపర్ మార్కెట్లలో అనుకుంటే పొరపాటే. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో ధరలు చుక్కలని తాకాయి... నిత్యావసరాలు, పాలు, కూరగాయల ను జనతా కర్ఫ్యూ నుంచి మినహాయించినప్పటికీ, ఆ విషయం మీద నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి  కె సి ఆర్ మాట్లాడుతూ-నిత్యావసరాలు అధిక  ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ -గుడిమల్కాపూర్ మార్కెట్ లో వినియోగదారులను వ్యాపారులు  దాదాపుగా దోచేశారు. మొన్నటి వరకు కిలో 30 రూపాయలు పలికిన బెండకాయల ధర ఈ రోజు కిలో 120 రూపాయలు,  దొండకాయలు కిలో 90 రూపాయలు, బీర కాయలు కిలో 100 రూపాయలు, చిన్న కొత్తిమీర కట్ట 10 రూపాయలు, చిన్న పుదీనా కట్ట 40 రూపాయలు.... వంకాయలైతే ఏకంగా 110 రూపాయలు... నిజానికి, అక్కడి వ్యాపారులకు లేదా రైతులకు, ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది... కానీ, వారిని నియంత్రించటానికి , వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవటం తో అడ్డగోలుగా కూరగాయల ధరలు పెంచేశారు. కె సి ఆర్ సార్.. మీరు కొరడా ఝుళిపించారు సరే.. ఇక్కడి వ్యాపారాలు మాత్రం మీ మాట ఖాతరు చేయటం లేదు... ప్రజల జేబులను దోచేస్తున్నారు.. ఒక్కసారి మీరు నజర్ పెట్టండి.. వీళ్ళు లైన్ లోకి వస్తారంటున్నారు వినియోగదారులు..

ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు మూసివేత

ఏపీలో లాక్ డౌన్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు . అమరావతి లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ప్రజా రవాణా నిలిపివేస్తున్నట్టు  ముఖ్యమంత్రి ప్రకటించారు. " నిత్యావసర వస్తువులు మినహా అన్ని షాపులు క్లొజ్ చెయ్యాలి.విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే సమాచారం ఇవ్వాలి.దేశం మొత్తం కరోనపై యుద్ధం చేస్తుంది.ఏపీ అంతరాష్ట్ర సరిహద్దులు క్లోజ్ చేస్తున్నాం.గోడౌన్లు, ఫ్యాక్టరీలు కార్యాలయాలు పరిమిత సిబ్బందితో నడపాలి.ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలి," అంటూ ముఖ్యమంత్రి సూచించారు .అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలి. విదేశాల నుంచి వచ్చి వారిని గుర్తించేందుకు పోలీసులు దృష్టి  పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఒక కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి,  ఏప్రిల్ 4వ తేదీన ₹1,000 విలువైన నిత్యావసర సరుకులు అందచేస్తామన్నారు. నిత్యవసర వస్తువులను అధిక ధరలకు  విక్రయిస్తే వారిపై కేసులు పెడతామని సి ఎం హెచ్చరించారు. రోజువారీ కార్మికులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవున్నారు. తప్పని సరి పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి  వస్తోందని చెప్పిన సి ఎం, ఏపీలో ప్రస్తుతం కరోన అదుపులో ఉంది.14రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. వృద్ధులను,పిల్లలను బయటకు రాకుండా చూడాలని సి ఎం సూచించారు.

అత్యవసరం లేని సర్జరీలు వాయిదా వేయండి

అత్యవసర సేవలు మినహా, తెలంగాణ అన్ని సేవలు బంద్! కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు అలాగే మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు సి.ఎం. తెలిపారు.  ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని ఆయ‌న సూచించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు.  గర్భిణులను కంటికి రెప్పలా చూసుకుంటామని కేసీఆర్ చెప్పారు. వారి కోసం అమ్మ ఒడి వాహనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అత్యవసరం లేని సర్జరీలు వాయిదా వేయాలని ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించారు. ఒకే రోజు ఆదివారంనాడు 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం తెలిపారు. వీరిలో  ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్, మరొకరు స్కాట్లాండ్ నుంచి వచ్చారని సి.ఎం. తెలిపారు. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 26కు పెరిగినట్లు తెలిపారు. అయితే.. బాధితులెవరికీ ప్రమాదమేమీ లేదని వివరించారు.

పేద‌ల‌కు 12 కిలోల బియ్యం 1500/- ఆర్థిక సాయం!

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతిమనిషికి ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యం,   1500 రూపాయ‌ల‌ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదన్నారు. 20 శాతం ఉద్యోగులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతారని తెలిపారు. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 5 వరకు పాజిటీవ్ కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌ల్గించింద‌ని చెప్పారు. ప్రైవేటు ఉద్యోగులకు ఈ సెలవుల కాలానికి కంపెనీలు వేతనాలు చెల్లించాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింద‌ని ఆయ‌న చెప్పారు. తెలంగాణలోని 5 జిల్లాలు,  హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని సి.ఎం. తెలిపారు.  అంత‌ర్జాతీయ పోర్టులు, అంత‌ర్జాతీయ విమానాశ్రాయాలు ఈ రోజు నుంచి పూర్తిగా బంద్ అయ్యాయి. కాబ‌ట్టి విదేశాల నుంచి వారి భ‌యం ఇక లేదు.  ఇప్పటివరకు తెలంగాణాలో 26 పాజిటివ్ కేసులు నమోదయినట్టు సి.ఎం. తెలిపారు. అయితే వీరు విదేశీయులని పేర్కొన్నారు. దీంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఏవిధంగా బాధ్యతాయుధంగా కర్ఫ్యూని పాటించారో.. మార్చి 31వ తేదీ వరకూ ఈ విధంగానే ఇంట్లో ఉండాలని కోరారు.

దూకుడు గా సాగిన కె సి ఆర్ ప్రెస్ మీట్ అందరికీ భరోసా ఇచ్చింది

రెండు తెలుగు  రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీడియ కాన్ఫరెన్స్ లు చూశారుగా. తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ ఎంత  వేగంగా,  వడగళ్ల వాన లాగా గడ గడా  తాను చెప్పాల్సింది చెప్పేసి, ప్రజలను అప్రమత్తం చేసిన తీరు అందరి ప్రశంసలూ  అందుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ' మనం కూడా ' అంటూ ప్రెస్ మీట్ సాగదీసిన తీరు ఆడియెన్స్ ను, ప్రజలను బాగా నిరాశ పరిచింది. ప్రజలకు సూటిగా, స్పష్టం గా చెప్పటం లో కె సి ఆర్ ఫాలో అయిన టెక్నీక్, ఎందుకో జగన్ మోహన్ రెడ్డి ఫాలో కాలేకపోయారనేది నెటిజన్ల అభిప్రాయం. మొత్తానికి రెండు  తెలుగు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకూ లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే, ఈ విషయాన్నీ కె సి ఆర్ కన్వే చేసినంత  స్పష్టంగా,జగన్ మోహన్ రెడ్డి చేయలేకపోయారనేది  సోషల్ మీడియా అభిప్రాయం. సో, జగన్ సార్.. కొంచెం ' మనం కూడా... " ట్రాన్స్ లోనుంచి వెలుపలకు వచ్చి, కె సి ఆర్ అంత స్పష్టంగా సమాచారం అందచేయండి...

ఈ నెల 31 వరకు తెలంగాణాలో లాక్‌ డౌన్

క‌రోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు.  ఆదివారంనాడు  తెలంగాణలో 5 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సి.ఎం. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  కరోనా నివారణకు ఉన్నత స్థాయి కమిటీ లో చర్చించిందన్నారు. ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం ప్ర‌క‌టించారు. వారం రోజులు ఇళ్ల‌లోనే వుండండి. ఆ ఒక వారం మీ జీవితాన్నే కాపాడుతోంది.  మీమ్మ‌ల్ని, మీతో పాటు దేశాన్ని కాపాడండని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇట‌లీ లాంటి దుర్గ‌తి మ‌న‌కు ప‌ట్ట‌వ‌ద్దంటే మ‌న‌మే మ‌న‌ల్ని కాపాడుకోవాల‌ని సి.ఎం. సూచించారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారు హోం క్వాంరెంటైన్ లోనే వుండండి. దాచి పెట్ట‌వ‌ద్దు. మీకు మీరు నియంత్ర‌ణ పాటించండి. భ‌యోత్పాత స్థితిలో ప్ర‌పంచం వుంది. ద‌య‌చేసి ఆషామాషీగా తీసుకోకుండా స్వ‌యం నియంత్ర‌ణ‌పాటించండి. మ‌న కుటుంబాన్ని, మ‌న దేశాన్ని మ‌నం ధ్వంసం చేసుకుందామా అంటూ ముఖ్య‌మంత్రి సూచించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సీఎస్‌తో పాటు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సీఎంతో భేటీ లో పాల్గొన్నారు.  కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకీ చేజారిపోతుందన్న అనుమానాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలోనే లాక్‌డౌన్ ప్రకటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని కేసీఆర్ సర్కార్ భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  

విశాఖ రాజధాని ప్రతిపాదన ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్ లోకే !

ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన లేనట్టే. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన 75 జిల్లాల్లో , విశాఖపట్నం కూడా ఉన్నందువల్ల, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే . ఇహ, ఉద్యోగులు కూడా ప్రస్తుతానికి ఆ ఆలోచన గురించి భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధాని(ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌)గా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన విశాఖపట్నానికి తరలేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. మే నెలాఖరు నాటికి విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగ సంఘ నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించారు.అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దికాలం కిందట నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయం విశాఖపట్నానికి తరలనుండడంతో ఉద్యోగులూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ ఉద్యోగులందరూ విశాఖపట్నానికి తరలివెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సంబంధిత ఉత్తర్వులు మే నెలాఖరులోపు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి రావచ్చని చెప్పారు. అమరావతి సచివాలయంలో అప్సా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది అనంతరం వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం కొన్ని ప్రాథమిక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో బిల్లులు పాస్‌ కాకపోవడం, కోర్టు కారణాల వల్ల వీటిపై ఉత్తర్వులు రాలేదు. మూడు రాజధానులు అంశం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగులంతా రానున్న విద్యా సంవత్సరంలో తమ పిల్లలకు అడ్మిషన్లు ఎక్కడ తీసుకోవాలంటూ పలు రకాల ప్రశ్నలు అడగడంతో వీటిపై వివరణ ఇచ్చేందుకు అప్సా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాం. ఏ క్షణంలోనైనా విశాఖకు తరలి వెళ్లాలనే ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడతాయని.. దీనికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సమావేశంలో   స్పష్టతనిచ్చాం.’ అని తెలిపారు. 100-200 మంది గుమికూడితేనే కరోనా వస్తుందని అంటున్నారని.. ఉద్యోగులు వేల సంఖ్యలో ఉన్నందునే జనరల్‌ బాడీ నిర్వహించలేదని ఆయన చెప్పారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని, స్పష్టత ఇచ్చాక ఏప్రిల్‌ మొదటి వారంలో అప్సా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తామన్నారు. అయితే, ఇది ఇప్పటికి వాయిదా పడే అంశం గానే కనిపిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ఉద్యోగులను విశాఖకు తరలించాల్సి వస్తే..చదువుకునే పిల్లలు ఎంత మంది ఉద్యోగులకు ఉన్నారో అటువంటివారందరికీ తరలింపులో మినహాయింపు ఇవ్వాలని కోరతామని వెంకటరామి రెడ్డి చెప్పినప్పటికీ, ఇపుడు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదనేది ఉద్యోగులు, అధికారుల వాదన.  అయితే, ఇదంతాకూడా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించాక ముందు పరిస్థితి. తాజా గా కరోనా వైరస్ నేపధ్యం లో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 75 జిల్లాల లాక్ డౌన్ కారణంగా- ప్రస్తుతం విశాఖ లో కార్య నిర్వాహక ప్రతిపాదన ఇప్పటికైతే వెనక్కు వెళ్ళినట్టే !

కేరళ సి. ఎం . ను చూసి నేర్చుకోమని జగన్ కు కేశినేని నాని సలహా !

కేశినేని నాని... ఫైర్ బ్రాండ్ టీ డీ పీ ఎం.పి . జనాలకు అసలు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని నాయకుడు. ఏ ఒక్క చిన్న వకాశం వచ్చినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని దులిపి ఆరేయటానికి అసలేమాత్రం వెనుకాడడు.  వైరస్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేరళ సీఎం పినరయి విజయన్‌‌ను చూసి నేర్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , ఆయన ట్విటర్ ద్వారా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా బాధితులు సంఖ్య ఐదుకు పెరిగింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఏపీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ఏపీలో బస్సులు బంద్ చేసింది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి ఇంటింటికి తిరిగి, విదేశాల నుంచి వచ్చిన వారు, తాజాగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడే వారి వివరాలను సేకరిస్తోంది. అయితే, కరోనా నియంత్రణకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తామనే అంశాన్ని ప్రకటించలేదు. కేరళ ప్రభుత్వం మాత్రం కరోనా నియంత్రణకు రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గతంలో నిఫా వైరస్‌ మీద పోరాడిన అనుభవం ఉన్న కేరళ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. అందులో రూ.500 కోట్లను హెల్త్ కిట్స్ (శానిటైజర్లు, మాస్క్‌లు) వంటి వాటి కోసం వినియోగించనున్నారు. అలాగే, రూ.2000 కోట్లను చిన్న చిన్న రుణాలు , నెలవారీ సరుకులు, రేషన్ వంటి వాటి పంపిణీ కోసం వినియోగించనున్నారు.ఇంతకీ మన ఎం. పి . గారి సూచనను పాటిస్తారో, లేదో చూడాలి మరి. !

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే..

మోదీ పిలుపిస్తే..మేము అమలు చెయ్యాలా? ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారు.. లాంటి లెఫ్టు, రైటు వితండవాదులు.. ప్రతిక్షణం అసహనంతో కొట్టుమిట్టాడుతున్న మేధావులు ఉన్న దేశంలో.. అత్యవసర పరిస్థితుల్లో దేశం మొత్తం ఇంత ఐక్యత ప్రదర్శిస్తుందా అనే అనుమానాలు ఉన్నవారికి వారి సందేహాలు పటాపంచలు చేసే విధంగా జనతా కర్ఫ్యూ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి, దేశంలో విస్తరించకుండా లింక్ చైన్ ను బ్రేక్ చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి జనతా కర్ఫ్యూను  పాటిస్తోంది. కోవిడ్ 19 కేవలం 12 గంటలు మాత్రమే బతికి ఉంటుందని ఈ లోపు దానికి కొత్త ఆసరా దొరక్కపోతే చనిపోతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలు భద్రంగా ఉండాలని ప్రధాని జనతా కర్ఫ్యూను ప్రతిపాదించారు. ఈ రోజు 14 గంటల పాటు ఈ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటే వ్యాధి వ్యాప్తిని దాదాపుగా 80 శాతం అరికట్టవచ్చు.  దేశంలో ప్రస్తుతం 300 మందికి పైగా ఈ వ్యాధితో  ఆసుప్రతుల్లో చేరారు. లక్షలాది మందిని క్వారంటైన్ చేశారు. అయిదుగురు వ్యక్తులు ఇప్పటికే మరణించారు. ఈ ఉపద్రవం నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని మనం ఇంట్లో బంధించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇంత పెద్ద దేశంలో ఇంత జనాభాపై ఆంక్షలు పెట్టి అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. పరీక్షలు చేయడం అంతకన్నా సాధ్యం కాదు. అలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చిన ఈ ఆలోచన అంత సులభమైనదేమీ కాదు. 130 కోట్ల మంది భారతీయులు ఇళ్లలో బందీగా ఉండిపోవడం మామూలు పరిస్థితుల్లో అయితే సాధ్యం కాదు. అయితే వ్యాధి తీవ్రత దృష్ట్యా నో, ప్రధాని పై విశ్వాసంతోనో దేశ ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అందుకు దేశ ప్రజలను అభినందించక తప్పదు. వందల కోట్లు ఖర్చు చేసినా అదుపు కాని ఈ వ్యాధిని ఈ టెంపరరీ లాక్ డౌన్ తో అరికడితే అంత కన్నా కావాల్సింది ఏమీ లేదు. దేశాలకు దేశాలు షట్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో శాశ్వత షట్ డౌన్ కన్నా ఇలా తాత్కాలిక షట్ డౌన్ మేలు కదా. అందుకే దేశ ప్రజలంతా సహకరిస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరో మూడు నాలుగు సార్లు ఈ విధంగా 14 గంటల బంద్ పాటిస్తే చాలు మన దేశం నుంచి పూర్తిగా కోవిడ్ 19 వైరస్ ను తరిమి కొట్ట వచ్చు. ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్లి వచ్చినవారు, విదేశస్తుల ద్వారానే ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పుడిప్పుడే మన పౌరులకు (స్థానికంగా ఉండేవారికి) సోకుతున్నది. స్థానికులకు సోకడం మొదలు పెడితే క్వారంటైన్ చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ ప్రయత్నం. గరిష్టంగా ఈ విధంగా నాలుగు సార్లు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ విధించుకుంటే వైరస్ మాయం అవుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ పై భారం లేకుండా మనం దేశాన్ని దేశ ప్రజలను కాపాడుకోగలుగుతాం. మరీ ముఖ్యంగా మన సైనిక బలగాలలో కొందరికి ఈ వైరస్ సోకింది. అది మరింత ప్రమాదకరం. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. మనందరం సహకరిద్దాం మన భవిష్యత్తు కోసం..