కార్పోరేట్‌లపై ఉన్న ప్రేమ జనంపై లేదా?
posted on Mar 25, 2020 @ 11:21AM
దేశాజనాభా 130 కోట్లు. 15 వేల కోట్ల కంటితుడుపు సాయం. అంటే తలకు 115 రూపాయలు మాత్రమే. ఇదేనా కరోనా మహమ్మారిపై యుద్దానికి ప్రధాని చేసిన సాయం? అంటూ ఐఎఫ్‌టీయూ ప్రసాద్ (పిపి) ఘాటుగా స్పందించారు.
కేరళ జనాభా ఎంత? కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 కోట్ల సాయం ప్రకటించింది. 130 కోట్ల జనాభాకి అంతకంటే కూడా తక్కువ సాయం! మహమ్మారి వ్యాధి నివారణ, నియంత్రణలకు కాకుండా మరింక దేనికి ఖర్చు చేస్తుంది? దేశ ప్రజలపై శ్రద్ధ ఇదేనా?
ఒక్క కలం పోటుతో RBI నిల్వల నుండి రూ.1,76,000 కోట్లు స్వాహా! బడా కార్పోరేట్ సంస్థలకు టాక్స్ మినహాయింపు ఖరీదు రూ.1,45,000, కోట్లు! గత ఆరేళ్ళ పాలనలో నిరర్ధక ఆస్తుల పేరిట 28 కార్పోరేట్ సంస్థలకు మాఫీ చేసిన బ్యాంకుల సొమ్ము మొత్తం రూ.10,00,000 కోట్లు. ఇంకెన్నో ఇలాంటి మాఫీలూ, రాయుతీలూ, మినహాయింపులూ, మూల్యాలూ! ఓ వందమంది కూడా లేని బడా కార్పోరేట్ కంపెనీలకు ఇంతటి సాయాలూ, ఉద్దీపనలూ! కానీ 130 కోట్ల మంది జనాభాకు మాత్రం తలకు 115 రూపాయలు మాత్రమే! కనీసం యెస్ బాంక్ ఎగవేతల సొమ్ము ని కూడా కేటాయించలేదు మన ప్రధాన మంత్రి.
కార్పొరేట్ల పై ప్రదర్శించే శ్రద్దాసక్తులలో ఇది ఎన్నో వంతు? మోడీ షా సర్కార్ ఒక సారి ఆలోచించుకోవాలి?
కరోనా నియంత్రణ కోసం బడ్జెట్ లో ఎన్ని నిధుల్ని కేటాయించారనేది ముఖ్యమైనది. దేశం యావత్తు ఒకే త్రాటిపై నిలబడి మహమ్మారి పై యుద్ధం చేయాల్సిన కీలక పరీక్షా సమయం లో మంగళవారం రాత్రి ప్రధాని ప్రసంగంలో 15 వేల కోట్ల కంటితుడుపు ప్రకటనను ఎలా అర్థం చేసుకోవాలి?