టిఆర్ఎస్ నేత దౌర్జన్యం, సింగరేణి క్వార్టర్స్ కబ్జా...
posted on Mar 25, 2020 @ 11:44AM
ప్రాణహిత కాలనీ (షిర్కే) క్వార్టర్స్ లో ఉన్న అసలైన లబ్దిదారులు ఎంతమంది? అధికారపార్టీ అండతో ఉంటున్నవాళ్ళు ఎంతమంది? 3వ జోన్ లో క్వార్టర్స్,ప్రభుత్వ భూమిని వదలని నేరచరిత్ర కల్గిన అధికారపార్టీ నాయకుని అరాచకాలపై స్పందించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.
సింగరేణిలో ఎంతో ఘన చరిత్ర కల్గిన మందమర్రిలో అధికారపార్టీ నాయకుల దౌర్జన్యాలకు హద్దు, అదుపు లేకుండా పోతుందని పౌరహక్కుల ప్రజా సంఘం నేత ఎం.వి.గుణ ఆరోపించారు. మందమర్రిలో ఒకప్పుడు 14 వేల మంది సింగరేణి కార్మికులు ఉండేవారు. 1964 తర్వాత క్రమంగా సింగరేణి ఉద్యోగుల కోసం 4 వేలకు పైగా క్వార్టర్స్ కట్టించడం జరిగింది. అయితే ఇప్పుడు మందమర్రిలోని సింగరేణి ఉద్యోగుల సంఖ్య దాదాపు 5 వేల మంది మాత్రమే.
ఒకప్పుడు సింగరేణి ఉద్యోగుల కుటుంబాలతో కలకలలాడిన క్వార్టర్స్ ఇప్పుడు అధికారపార్టీ నాయకుల కుటుంబాలతో దోపిడీకి గురైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. యువ సింగరేణి ఉద్యోగులు క్వార్టర్ కి ఆప్లై చేసినా సింగరేణి యాజమాన్యం స్పందించట్లేదు కాని అధికారపార్టీకి చెందిన ప్రముఖ కార్మిక సంఘం నాయకుని అండదండలతో అధికారపార్టీకి చెందిన గల్లీ లీడర్ కూడా కాని వాళ్ళు 'కింగ్' లా ఫీలవుతూ క్వార్టర్లలో అక్రమంగా ఉంటున్నారు.
గతంలో నేరచరిత్ర కల్గిన ఒక నాయకుడైతే పాలచెట్టు ఏరియాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొత్తగా షటర్లుగా మార్చడం జరిగింది. ఇదే వ్యక్తి అధికారపార్టీ కార్మిక సంఘం ప్రముఖ నాయకుని అండదండలతో 3వ జోన్ లో ఒక క్వార్టర్ ని కబ్జా చేసి ఉండటమే కాక మరొక క్వార్టర్ ని దగ్గరి బంధువుకి ఇప్పించాడని మందమర్రి కోడై కూస్తుంది.
ఇదే వ్యక్తి గతంలో ఒకసారి జైలుకు వెళ్ళి రావడమే కాక ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇదంతా చూస్తుంటే మద్దతు ఇస్తే చాలు ఎంత నేరచరిత్ర ఉన్నా మాకు అనవసరం అనేలా అధికారపార్టీ వ్యవహరించడం దుర్మార్గం.
అలాగే షిర్కేలో ఉండే అధికారపార్టీకి చెందిన నాయకులు ఇంకా పటేల్ పట్వారి వ్యవస్థ, దొరల పెత్తనం అనుకొని ఎంతమంది ఇల్లీగల్ గా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కబ్జాదారులను వదిలేసి నలభై ఏళ్ళుగా ఉంటున్న సీసకమ్మరి కుటుంబాల గుడిసెలను ఆక్రమణ పేరుతో కూల్చేశారు. అధికారపార్టీ అయితే ఒక న్యాయం, పేదవాళ్ళయితే ఒక న్యాయమా?. ఇప్పటికైనా అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ భూమి కబ్జాలు ఆపాలని, అక్రమంగా ఉంటున్న క్వార్టర్స్ నుండి ఖాళీ చేయాలని పౌరహక్కుల ప్రజా సంఘం నేత ఎం.వి.గుణ డిమాండ్ చేస్తున్నారు.