నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడతాం
posted on Mar 24, 2020 @ 7:59PM
దయచేసి ప్రజలందరూ ఇంటి నుంచి బయటికి రాకుండా నియంత్రణ పాటించమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఒక వ్యక్తితో వెయ్యి మందికైనా కరోనా వచ్చే ప్రమాదం వుంది. సైన్యాన్ని దింపే పరిస్థితి తీసుకురావద్దు. ప్రజలే స్వయంగా స్వీయనియంత్రణ చేసుకోవాలి. ప్రజలంతా ఇళ్లలోపలే వుండాల్సిందే. మాట వినని షాపుల్ని సీజ్ చేయాండి. అవసరమైతే షూట్ అండ్ సైట్ అర్డర్స్ ఇస్తాం. అవసరమైతే 24 గంటల పాటు కర్ఫ్యూ అమలు చేస్తాం. ముందు జాగ్రత్తలు కఠినంగా తీసుకుంటున్నాం. కర్ఫ్యూ అమలులో వుంది. సాయంత్రం 6 గంటల నుంచి షాపులన్నీ బంద్ చేయాల్సిందే.
హోం క్వారెంటైన్‌లో వున్న బయటికి వస్తే వారి పాస్‌పోర్ట్ సీజ్ చేస్తాం. అవసరమైతే వారి పాస్‌పోర్ట్ రద్దుచేసి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించమని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం.
ధరలు పెంచి నిత్యావసరవస్తువుల్ని అమ్మే వారిపై పి.డి.యాక్ట్ కింద అరెస్టు చేస్తాం. ప్రజల రక్తం పిండాలనుకునే వారి షాప్‌లు శాశ్వతంగా సీజ్ చేస్తామని సి.ఎం. హెచ్చరించారు.
కరోనా నియంత్రణ విషయంలో అధికారులే కనిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడ వున్నారు. జంటనగరాల్లోని 150 మంది కార్పోరేటర్లు అందరూ బయటికి రావాల్సిందేనని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. శాసనసభ్యులు తమతమ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేయాలి. ప్రజాప్రతినిధులు బయటికి రావాల్సింది. మంత్రులు జిల్లాలలకు వెళ్ళండి. శాసనసభ్యులు మీ నియోజకవర్గాల్లో ప్రధాన పాత్ర వహించండి. ఆరోగ్యశాఖ మంత్రి, మున్సిపల్, వ్యవసాయశాఖ మంత్రి తప్ప మిగతావారంతా జిల్లాలకు వెళ్ళాల్సిందేనని సి.ఎం. ఆదేశించారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో గ్రామపంచాయితీలోని స్టాండింగ్ కమిటీ సభ్యులందరి సహకారం తీసుకొని కీలకపాత్ర వహించాలని సి.ఎం. సూచించారు.
ఇప్పట్టి వరకు 36 కేసులు తెలంగాణాలో బయటపడ్డాయి. అందరూ కోలుకుంటున్నారు. తెలంగాణాలో ఇంకా అనుమానితులు 114 మంది వున్నారు. వారిలో 82 మంది విదేశాల నుంచి వచ్చినవారు, మిగతా వారు స్థానికులు. ఎంత మందికి సోకిందో త్వరలోనే తెలుస్తోందని సి.ఎం.చెప్పారు.
కరోనా వైరస్ గురించి కవి సమ్మేళనలు పెట్టి టీవీల్లో చూపించండి. ప్రజల్లో అవగాహన పెంచమని సి.ఎం. సూచించారు.