కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్.. నేనే జేసీబీ నడిపి అక్రమ నిర్మాణం కూలగొడతా!!
posted on Jun 8, 2020 @ 2:52PM
జన్వాడలో అక్రమంగా ఫాంహౌస్ నిర్మాణం చేపట్టిన మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, తప్పు చేసి దొరికిపోయాక కూడా ఏమాత్రం సిగ్గుపడడంలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్ అక్రమ నిర్మాణం చేపట్టారని రేవంత్ ఆరోపించారు. ఆ స్థలం కేటీఆర్ లీజుకు తీసుకున్నారని బాల్క సుమన్ చెబుతున్నారని, అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్ కూడా ట్వీట్ చేశారని రేవంత్ గుర్తుచేశారు. అయితే, జన్వాడ ఫాంహౌస్ 301 నుంచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి ఉందన్న రేవంత్.. 301 సర్వే నెంబర్లో కేటీఆర్ సతీమణి పేరిట 3 ఎకరాలు ఉందని తెలిపారు. భూములు లేవని కేటీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారని మండిపడ్డారు. కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
వట్టినాగులపల్లిలో తమకు భూములున్న మాట వాస్తవమేనన్నారు. తన అక్రమ నిర్మాణం ఎక్కడున్నా కూల్చడానికి సిద్ధమని.. మీరు సిద్ధమా? అని రేవంత్ ప్రశ్నించారు. తాను, తన బావమరిది వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఆ భూముల్లో తాను అక్రమంగా ఒక్క అంగుళంలో నిర్మాణం చేపడుతున్నా కూలగొట్టేందుకు తాను సిద్ధమేనని, తన లాగా కేటీఆర్ కూడా అక్రమ నిర్మాణాలను కూలగొట్టగలరా? అని రేవంత్ సవాల్ విసిరారు. "వట్టినాగులపల్లి లో భవనమో, భవంతో ఉందన్నారు కదా. ఒకవేళ, అక్కడేదైనా అక్రమ నిర్మాణం ఉందంటే నేనే జేసీబీ నడిపి కూలగొడతా. ఆ తర్వాత జన్వాడ వెళదాం. మనిద్దరం ప్రజల ముందు పరీక్షకు నిలబడదాం" అంటూ కేటీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా రేవంత్ మండిపడ్డారు. ఆయన కొడుకు చేసిన అక్రమాలపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి అంటూ నిలదీశారు. తండ్రీకొడుకులు కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజల్ని బలిచేసి విలాసవంతమైన ఫాంహౌస్ లు నిర్మించుకొని పత్తిత్తుల్లాగ మాట్లాడుతున్నారు అంటూ కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.