కరోనా పరీక్షల్లో డొల్లతనం.. ఎమ్మెల్సీ కి ఏపీలో పాజిటివ్, హైదరాబాద్ లో నెగటివ్
posted on Jun 25, 2020 @ 9:43AM
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రోజుకి వేలల్లో పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. ఆ పరీక్షల్లో ఖచ్చితత్వం లేదని, డొల్లతనం కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అయితే పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చారని టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
"ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే అంతకన్నా ఆందోళనకర విషయం ఏమంటే... కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ప్రజారోగ్యంతో ఆటలాడటం. కరోనా పేరుతో పరీక్షా కిట్ల కుంభకోణం, బ్లీచింగ్ పౌడర్ స్కామ్ లు చూసాం. ఇప్పుడు తాజాగా కరోనా పరీక్షల డొల్లతనం బయటపడింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చేసిన కరోనా పరీక్షల్లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కి కరోనా పాజిటివ్ అని వైసీపీ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే ఆయన్ను క్వారంటైన్ కు వచ్చేయమన్నారు. కానీ అప్పటికే హైదరాబాద్ లో ఉన్న దీపక్ రెడ్డి అక్కడ రెండు చోట్ల పరీక్ష చేయించుకుంటే రెండు రిపోర్టుల్లోనూ నెగటివ్ అని వచ్చింది. ఏమిటిది? ఎక్కడ తప్పు జరుగుతోంది?. " అని చంద్రబాబు ప్రశ్నించారు.
"రోజుకు వేల పరీక్షలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటే సరా? అందులో ఖచ్చితత్వం ఇదేనా? నెగటివ్ ఉన్న వ్యక్తికి పాజిటివ్ అని ఎలా చెబుతారు? ప్రజల ఆరోగ్యంతో కూడా ఇలాగే ఆడుకుంటున్నారా? పాజిటివ్ అని నిర్ధారణ కాకముందే ఒక ఎమ్మెల్సీని క్వారంటైన్ లో ఎందుకు పెట్టాలనుకున్నారు?. కరోనా పాజిటివ్ అన్న పేరుతో దీపక్ రెడ్డిని క్వారంటైన్ లో ఉంచాలనుకోవడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అనుమానంగా ఉంది. అంతకన్నా ముందు కరోనా పరీక్షల ఖచ్చితత్వం ఏంటన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి." అని చంద్రబాబు జగన్ సర్కార్ ని నిలదీశారు.