నన్ను కాపాడండి అంటూ గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ
posted on Jun 25, 2020 @ 11:06AM
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వెంటనే మీరు జోక్యం చేసుకొని.. తనను కాపాడాలని రమేష్ విజ్ఙప్తి చేశారు. తన ఇంటిపై 24 గంటలు నిఘా పెట్టారని, ఒక ఫోర్డ్ కార్, రెండు మోటార్ సైకిళ్లపై తనని ఫాలో అవుతున్నారని లేఖలో నిమ్మగడ్డ తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్‌లో ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన రహాస్య సమాచారాన్ని భద్రపరిచిన కంప్యూటర్లు, ఇతర హార్డ్‌డిస్క్‌లను ప్రభుత్వం సీజ్ చేసిందని, వాటిని విడుదల చేయించాలని విజ్ఙప్తి చేశారు.
ప్రస్తుతం తాను హైదరాబాద్ లో నివాసం ఉంటున్నానని, తన తల్లి విజయవాడలో ఉన్నారని, ఆమెను చూసేందుకు కూడా అవకాశం ఇవ్వడం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయానికి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను పునర్నియమించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఉద్దేశపూరకంగా అడ్డుకుంటోందని, ఈ విషయంపై తాను హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
ఏపీ హైకోర్టు తనను పునరుద్ధరించాలని తీర్పునిచ్చినా, ఇప్పటికీ కనగరాజ్ కు ఎన్నికల కమిషనర్ సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని, ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు.