దిగి వచ్చిన జగన్ సర్కార్... ఏపీ ఎన్నికల కమిషనర్ గా మళ్ళీ నిమ్మగడ్డ
posted on Jul 31, 2020 9:08AM
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి నియమించింది. గత అర్ధరాత్రి ఈ మేరకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది. నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అయన నియామకం సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటుందని స్పష్టం చేశారు.
ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ మొన్న మార్చ్ లో కరోనా మహమ్మారి కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ నిమ్మగడ్డ పదవీ కాలాన్ని కుదించి అయన స్థానం లో జస్టిస్ కనగరాజ్ ను నియమించిన విషయం తెలిసిందే. ఐతే దీనికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లగా ఆయనను తిరిగి నియమించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పై జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించింది. ఈ లోగా హైకోర్టులో నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయగా గవర్నర్ ను కలిసి తమ ఆదేశాల గురించి వివరించాలని నిమ్మగడ్డను ఆదేశించి కేసును ఈ రోజు అంటే 31 వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో ఈ కేసు పూర్తి వివరాలు తమకు తెలుసని అసలు గవర్నర్ జోక్యం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా అని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. దీంతో బహుశా అన్ని దారులు మూసుకు పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు.