మరో పది పన్నెండు రోజులలో రష్యా వ్యాక్సిన్
posted on Jul 30, 2020 @ 1:24PM
కరోనా వైరస్ విలయతాండవంతో ప్రపంచం మొత్తం వణికి పోతోంది. ఈ పరిస్థితుల్లో ఇటు ప్రజల, అటు ప్రభుత్వాల రోజువారీ కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని మానవాళి ఆశగా ఎదురు చూస్తోంది. కొద్ద్ది రోజులుగా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గురించి కొంత పాజిటివ్ న్యూస్ వస్తుండగా.. తాజాగా రష్యా వ్యాక్సిన్ గురించి ఒక తీపి కబురు అందుతోంది.
కొద్ది రోజుల క్రితం రష్యా కు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో తయారైన వ్యాక్సిన్ తో మనుషుల పైన చేసిన ట్రయల్స్ సత్ఫాలితాలు ఇచ్చాయని వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యాక్సిన్ ను రష్యాలో ఆగస్టు 10, 12 తేదీల మధ్య రిజిస్టర్ చేస్తారని, ఆ తరువాత మూడు నుండి వారం రోజుల లోగా దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సమాచారం.
ఇప్పటికే వ్యాక్సిన్ తయారీనే మా టాప్ ప్రయారిటీ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. మనుషుల పై ఈ వ్యాక్సిన్ తో చేసిన రెండు దశల ట్రయల్స్ విజయవంతం కావడం తో ఒక పక్క మూడో దశ ట్రయల్స్ చేస్తూనే మరో పక్క అత్యవసర సర్వీసులలో భాగమైన వైద్య సిబ్బందికి ముందుగా ఈ వ్యాక్సిన్ ను ఇస్తారని తెలుస్తోంది. ఒక సారి మూడో దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తైన తరువాత సెప్టెంబర్ నెలలో దీని ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
అయితే శాస్త్రవేత్తలు అలాగే వైద్య శాస్త్ర నిపుణులు మాత్రం వ్యాక్సిన్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా హడావిడిగా వ్యాక్సిన్ ను పబ్లిక్ లోకి రిలీజ్ చేస్తే దాని వల్ల అనర్ధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దయ వల్ల, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా అన్ని ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని వ్యాక్సిన్ త్వరగా వస్తే ఎవరికి వాళ్ళుగా ఇళ్లలోనే బందీలుగా ఉన్న జనం బయటకు వచ్చి మళ్ళీ యధావిధిగా సాధారణ జీవనం సాగించవచ్చు.