భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసిన రాఫెల్ ప్రత్యేకతలు
posted on Jul 30, 2020 @ 3:12PM
భారత వైమానిక దళం బలం పెంచుకోవాలని దశాబ్దాల తరబడి చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా పోరాట చరిత్ర ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలు భారత వైమానిక దళంలోభాగం కావడం చారిత్రక అంశం.
భారత్ సరిహద్దు దేశాలతో దోస్తీ చేసిన చైనా లక్ష్యం కేవలం భారత్ భూభాగాలను ఆక్రమించుకోవడమే. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారత్ గట్టి గుణపాఠమే చెప్పేందుకు సిద్ధమవుతుంది. సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తున్న డ్రాగన్ కంట్రీ కుట్రలకు, కుతంత్రాలకు చెక్ పెట్టేందుకు సైన్యానికి కావల్సిన పూర్తి మద్దతు భారత ప్రభుత్వం ఇస్తోంది. అందుకు అనుగుణంగా వైమానిక దళాన్ని శక్తివంతం చేసేందుకు భారత దౌత్య రాయబారాలు ఫలించి రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. అంబాల ఎయిర్ స్టేషన్ లో ల్యాండింగ్ అయిన ఈ ఫైటర్ జెట్లకు దేశ రక్షణ శాఖ స్వాగతం పలికింది. ఫ్రాన్స్ నుంచి ఏడువేల కిలోమీటర్లు గగనయానం చేసిన ఈ లోహ విహంగాలు భారత భూభాగం పై వాలాయి. రాఫెల్ రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతమైంది. 50వేల అడుగుల ఎత్తులో ఎగరగల సామర్ధ్యం ఉన్న ఈ యుద్ద విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ వచ్చే దారిలోనే 30వేల అడుగుల ఎత్తులో ఇంధనాన్ని నింపుకోని తన ప్రత్యేకతను రుజువు చేసింది. అణ్యాయుధాలను మోసుకుని వెళ్లగల సత్తా ఉన్న ఈ విమానాల బరువు పది టన్నులు. దాదాపు తొమ్మిది నుంచి 13 టన్నుల బరువు ఇవి మోయగలవు. మొదటి దశలో వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాల్లో రెండు శిక్షణ విమానాలు కాగా మూడు యుద్ధ విమానాలు.
ప్రపంచ వ్యాప్తంగా గత పదమూడేండ్లుగా రాఫెల్ ను మించిన యుద్ధ విమానం లేదు. అయితే చైనా వద్ద ఉన్న జె 20 యుద్ద విమానం అంతకు మించిన శక్తిని కలిగి ఉందని ఆ దేశం అంటున్నా అందుకు సరైన ఆధారాలు లేవు. గాలిలో నుంచి గాల్లోకి, గాలిలోనుంచి భూమిమీదకు, గాలిలో నుంచి సర్ఫేస్ కు ఈ విమానాల ద్వారా క్షిపణులను ప్రయోగించవచ్చు. 4.5 జెనరేషన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ తరహా యుద్ధ విమానాలు ఫ్రాన్స్, ఈజిప్టు, ఖత్తార్ దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, లిబియా పై ఫ్రెంచ్ వైమానిక దళం రాఫెల్ ను ఉపయోగించింది. పోరాటంతో సత్తా చూపించే యుద్ధ విమానంగా రాఫెల్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉఁది. రాఫెల్.. జె 20 కన్నా ఎక్కువ ఇంధనం , ఆయుధాలను కూడా తీసుకెళ్లగలదు.
2016లో ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాలకు 59వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదిరింది. అంటే ఒక్కో యుద్ధ విమానం ఖరీదు దాదాపుగా రూ.1638 కోట్లపైమాటే. వీటి నిర్వాహణకు మరో నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. ఇందులో సింగిల్ సీటర్ రాఫెల్ డిహెచ్, డబుల్ సీటర్ ను రాఫెల్ ఇహెచ్ గా పిలుస్తారు. రెండు రకాల రాఫెల్ లోనూ డబుల్ ఇంజన్ ఏర్పాటు చేశారు. భారత వైమానిక దళంలో అత్యంత శక్తి వంతమైన యుద్ధ విమానాలుగా ఇవి శత్రుల సైన్యం గుండెల్లో ఫిరంగులు మోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
రాఫెల్ పొడవు 15.30 మీటర్లు, ఎత్తు 5.30 మీటర్లు, రెక్కల పొడవు 10.90 మీటర్లు, గగనతలంలో గంటకు 1.8 మాక్ వేగంతో దూసుకుపోతుంది. రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా అత్యాధునికమైన ఆయుధాలను ప్రయోగించవచ్చు. 9500 కేజీల బరువైన ఆయుధాలను ఈ విమానాలు మోసుకెళ్లగలవు. ఈ యుద్ధ విమానంలో రెండు రకాల క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉన్నది. అందులో ఒకటి 150 కిలోమీటర్ల రేంజ్ కాగా, రెండో రకం క్షిపణులు 300 కిలోమీటర్ల రేంజ్. కంటికి కనిపించని లక్ష్యాలను కూడా అవి ఛేదిస్తాయి. గంటకు 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అంతేకాదు, ఈ యుద్ధ విమానాలలో 360 డిగ్రీస్ లో నిఘా పెట్టగలిగే సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఎటు నుంచి శత్రువులు దాడి చేసినా క్షణాల్లో తప్పించుకునే శక్తి వీటికి ఉన్నది. వీటిలో అమర్చిన రాడార్ శత్రు దేశ కదలికలను పసికట్టండంలో దిట్ట. వందకిలోమీటర్ల రేంజ్ లో కంటికి కనిపించని కదలికలను కూడా ఇవి పసికడతాయి. ఇందులో అమర్చిన ఆధునిక 30ఎంఎం కెనాన్ ఆయుధాలు ఉంటాయి. ఇవి125 రౌండ్ల కాల్పులు జరుపుతాయి.
రాఫెల్ లో అమర్చిన అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ చాలా పటిష్టమైనది. సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటూ శత్రు సైన్యంపై విరుచుకుపడే వ్యవస్థ ఇందులో ఉంటుంది. కాట్ పిట్ డిజైనింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా, సులభంగా ఫైట్ ను టర్న్ చేసేలా కాట్ పిట్ డిజైన్ ఉంటుంది. లైటింగ్, సీటింగ్, టర్నింగ్ మొదలైన అనేక అంశాలు పైలట్ కు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటుచేశారు. ఈ యుద్ధ విమానాలను నడపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం అవుతుంది. ఈ మేరకు ఫ్రాన్స్ పైలట్స్ కు శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మొదటి దశలో వచ్చిన ఐదు యుద్ధ విమానాల్లో రెండు శిక్షణ విమానాలే. భారత దేశ వైమానిక దళంలోని ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భారత్ చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి పైలెట్ గా తన పేరు నమోదు చేసుకున్నారు.
భారత్ సరిహద్దుల వెంట మోహరిస్తున్న పాక్, చైనా సైన్యానికి తగిన బుద్ధి చెప్పేందుకు అతి త్వరలోనే సరిహద్దుల్లోని ఎయిర్ బేస్ లకు ఇవి చేరుకోనున్నాయి.