సిగ్గు సిగ్గు.. టీకాపై వైసీపీ డర్టీ పాలిటిక్స్ 

నలుగురు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నేతల తీరు. కరోనా మహమ్మారితో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోని పాలకులు... కక్ష రాజకీయాల్లో మాత్రం బిజీగా ఉన్నారు. కోవిడ్ కట్డడిని గాలికొదిలేసి.. వ్యాక్సినేషన్ ను వదిలేసి.. జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వైసీపీ నేతల ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు మరింత జుగుప్సాకరంగా ఉంటున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్లకు కులం కంపు రుద్దుతూ.. దిగజారి వ్యవహరిస్తున్నారు. జనాలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేకుండా చిల్లర వేషాలు వేస్తున్నారు.  ఏపీలో ప్రస్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రాష్ట్రంలో పావుగంట‌కో ప్రాణం పోతోంది. ఆక్సిజ‌న్ కొర‌త‌, హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోయిన వారి సంఖ్య‌లో దేశ రాజ‌ధాని ఢిల్లీ మొద‌టి స్థానంలో ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ యావ‌త్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.  ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌, చేత‌గాని త‌నం వ‌ల్ల‌ే కరోనా విజృంభిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్నా.. చేతులెత్తేస్తోంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. ఆక్సిజ‌న్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతుంటే.. కేంద్రానికి లేఖ‌లు రాస్తూ.. త‌ప్పును ఢిల్లీపైన నెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన ట్వీట్.. జగన్ సర్కార్ నిర్లక్ష్యానికి, చేతగానితనానికి సాక్ష్యంగా నిలుస్తోంది.  డా:ఎల్లా - రామోజీ - బాబు  మీ మధ్య  బాంధవ్యాలు బంధుత్వాలు తెలియనివి కావు.  పిచ్చి రాతలు,పిచ్చి కూతలు మాని రాష్ట్రానికి కావాల్సినన్ని  కోవాక్సిన్  ఇప్పించండి! ఇది అంబటి రాంబాబు చేసిన ట్వీట్. ఈ ట్వీట్ పైనే ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది. అంబటికి సోషల్ మీడియాలో జోరుగా కౌంటర్లు పడుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కోవిషీల్ట్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి చెందిన కృష్ణ ఎల్లాకు చెందిన హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థలోనే కోవాగ్జిన్ తయారవుతుంది. అయినా కొవాగ్జిన్ కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదు జగన్ రెడ్డి సర్కార్. అంతేకాదు కొవాగ్జిన్ పై వైసీపీ నేతలు మొదటి నుంచి పెద్ద ఎత్తున దుష్పప్రచారం చేశారు. కొవాగ్జిన్ ను ఉత్పత్పి చేస్తున్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా కమ్మ సామాజిక వర్గం కావడంతో.. ఆ సంస్థను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడే... సమర్ధవంతంగా పని చేయదంటూ పిచ్చి పోస్టులు పెట్టారు. ట్రయల్స్ అయిపోయాక కూడా ఏడుపు ఆపలేదు. కొవాగ్జిన్ కు అనుమతి ఇచ్చే ముందు ప్రధాని మోడీ ఆలోచించుకోవాలంటూ దిక్కుమాలిన రాతలు రాశారు.  ఇప్పుడు ట్రయల్స్ అన్ని పూర్తయ్యాయి. కొవాగ్జిన్ మార్కెట్ లోకి వచ్చింది. కొవాగ్జిన్  కావాలంటూ డిమాండ్ పెరిగింది. వేరే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. మరోవైపు వ్యాక్సిన్ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ సమకూర్చుకోవడంలో విఫలమైన  జగన్ రెడ్డి సర్కార్.. జనాల దృష్టి మళ్ళించేందుకు కొవాగ్జిన్ పై మళ్లీ కొత్త నాటకాలకు తెర తీసిందని అంటున్నారు. అందులో భాగంగానే ఇలా.. డా ఎల్లాకు చంద్రబాబు, రామోజీకి లింక్ పెట్టి.. వ్యాక్సిన్లు ఇప్పించవచ్చు కదా అంటూ పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు.  కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా కేంద్రం చేతుల్లో ఉందంటూనే ఎల్లాకు చంద్రబాబుకు లింకు పెడుతూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేయడంపై విపక్షాలతో పాటు వైద్య వర్గాలు, జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎట్టా... ఎల్లాతో రామోజీకి బంధుత్వం ఉంటే పద్దతి పాడు లేకుండా వ్యాక్సిన్ ఇవ్వాలా అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు ఏడ్చిన వాళ్లే.. ఇప్పుడు కావాలంటూ కథలు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు.  వైసీపీ ఎమ్మెల్యే వాగినట్లు.. రామోజీతో బంధుత్వం ఉన్నందుకు కృష్ణా ఎల్లా కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే.. మరీ జగన్ అక్రమస్తుల కేసులతో లింకున్న హెటిరో సంస్థ నుంచి ఎందుకు రెమిడిసివర్ ఇంజక్షన్లు తెప్పించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో సంస్థ నుంచి కొవిడ్ మందులు ఫ్రీగా ఎందుకు ఇప్పించడం లేదో చెప్పాలంటున్నారు. రాంకీ సంస్థ ఆళ్ల ఫ్యామీలిది కదా.. పెద్దాయనకు రాజ్యసభ కూడా ఇచ్చారు కదా.. వాళ్లతో రాష్ట్రమంతో ఫ్రీగా మందులు జగన్ రెడ్డి.. ఎందుకు ఇప్పియ్యలేకపోయారని నెటిజన్లు నిలదీస్తున్నారు. వాళ్లను వ్యతిరేకించే వాళ్లకు ఒక రూల్.. సమర్ధించేవాళ్లకు ఒక రూలా అంటూ వైసీపీ నేతలను కడిగి పారేస్తున్నారు నెటిజన్లు.  కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  మోడీ సర్కార్ కూడా మే1 నుంచి మూడో దశలో భాగంగా 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం టీకాలకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. కాని ఏపీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేయకుండా 18 ఏండ్లు పైబడిన వారికి ఇప్పుడే టీకాలు ఇవ్వలేమంటూ  చేతులెత్తేసింది. 13.5లక్షల వ్యాక్సిన్ల కోసం రూ.45 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. పొరుగున ఉన్న కేరళ కోటి వ్యాక్సిన్లు, తమిళనాడు కోటిన్నర, కర్ణాటక కోటి, మహారాష్ట్ర మొత్తం జనాభాకు సరిపోయేంత వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించి వనరులు సిద్ధం చేసుకొన్నాయి. తెలంగాణ సర్కార్ కూడా 2 వేల 5 వందల కోట్లను వ్యాక్సిన్ కోసం ఖర్చు చేస్తామని ప్రకటించింది. అయితే ఐదు కోట్లకు పైగా జనాలున్న ఏపీకి 13 లక్షల టీకాలు ఏ మూలకు వస్తాయి? మొత్తం వనరులన్నీ పోగుచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ చాలినన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.  రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తొలి డోసు తీసుకున్నవారంతా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు.  వ్యాక్సిన్ల సెంటర్లకు క్యూ కడుతున్నారు. అర్ధరాత్రే వెళ్లి క్యూలైన్లలో నిల్చుకుంటున్నారు. గంటలకొద్ది అక్కడే ఉంటున్నారు. వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. అయినా సర్కార్ మాత్రం చోద్యం చూస్తోంది. దీంతో వ్యాక్సిన్ సెంటర్లే కోవిడ్ వ్యాప్తికి హాట్ స్పాట్లుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై జనాలు ఫైరవుతున్నారు. దీంతో నెపాన్ని కేంద్రంపై వేసి చేతులు దులుపుకునే యోచనలో జగన్ రెడ్డి సర్కార్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు, రామోజీకి.. కృష్ణ ఎల్లాతో బంధుత్వం కలుపుతూ కొత్త కుట్రలు చేస్తున్నారనే విమర్శలు ఏపీ జనాల నుంచి వస్తున్నాయి. 

గేట్స్‌-మెలిందా విడాకుల‌కు కార‌ణం అత‌నేనా?

ప్ర‌పంచంలోకే రిచెస్ట్ క‌పుల్స్‌. 27 ఏళ్ల వైవాహిక అనుబంధం. బిల్‌-మెలిందా గేట్స్ ఫౌండేష‌న్‌తో 4 ల‌క్ష‌ల కోట్ల దాతృత్వ‌ కార్య‌క్ర‌మాల‌కు క‌ర్త‌లు. 1994లో వివాహం. ముగ్గురు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు. ఆ అన్యోన్య దంప‌తులు ఇటీవ‌ల విడిపోతున్న‌ట్టు ఉమ్మ‌డిగా ప్ర‌క‌టించారు. యావ‌త్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయింది.  ఇంత‌కీ బిల్‌గేట్స్‌-మెలిందా క‌పుల్స్ ఎందుకు విడిపోతున్న‌ట్టు? 27 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని ఎందుకిలా తెగ‌దెంపులు చేసుకుంటున్న‌ట్టు?  వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు కార‌ణ‌మేంటి?  విడాకులు తీసుకునేంత పెద్ద స‌మ‌స్య ఎందుకొచ్చింది? కొన్ని రోజులుగా ఇదే చ‌ర్చ.   గేట్స్‌-మెలిందా దంప‌తుల విడాకుల నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదట‌. ఏడాదిన్నర కాలంగా గేట్స్‌ దంపతులు విడాకులపై సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిపారట. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలు నెర‌ప‌డం నచ్చక పోవ‌డం వల్లే.. మెలిందా ఆయన నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు "వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌" కథనం.    తమ దాంపత్య బంధం ‘తిరిగి కొనసాగించలేని విధంగా ముక్కలైంది’ అని చెబుతూ మెలిందా 2019 అక్టోబరులోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. మహమ్మారి విజృంభణ సమయంలో దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం విడాకులపై పరస్పర నిర్ణయానికి వచ్చారంటూ "వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌" క‌థ‌నం రాసుకొచ్చింది.  లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలు నెరపడం మెలిందాకు నచ్చలేదని, దీనిపై ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని బిల్ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ కథనం తెలిపింది. 2013లో ఓ దాతృత్వ కార్యక్రమం కోసం గేట్స్‌ దంపతులు ఎప్‌స్టీన్‌ను కలిశారు. అయితే అతడి ప్రవర్తనతో తాను సౌకర్యంగా లేనని మెలిందా అప్పుడే గేట్స్‌కు చెప్పారు. కానీ ఆమె అభ్యంతరాన్ని విస్మరించి గేట్స్‌, కంపెనీ ఉద్యోగులు కొందరు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు కొనసాగించారు. గేట్స్‌, ఎప్‌స్టీన్‌ పలుమార్లు కలిశారని, ఒక రాత్రంతా గేట్స్‌ అతడి నివాసంలోనే ఉన్నాడని 2019లో అమెరికా పత్రికలు కథనాలు రాశాయి. అయితే తనని కలిసిన మాట వాస్తవమేనని, కానీ తమ మధ్య ఎలాంటి వ్యాపార సంబంధాలు, స్నేహ బంధాలు లేవని అప్పట్లో గేట్స్‌ చెప్పారు. ఆ తర్వాత నుంచి దంపతుల మధ్య గొడ‌వ‌లు వ‌చ్చి.. అవి ముదిరి.. విడాకులకు దారితీసినట్లు వాల్‌స్ట్రీట్‌ తన కథనంలో తెలిపింది.    వృత్తిపరంగా ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌.. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జులైలో అరెస్టయ్యాడు. కోర్టులో విచారణ జరుగుతుండగానే అదే ఏడాది ఆగస్టులో జైలులోనే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయ‌న చ‌నిపోయినా.. జెఫ్రీ బ‌తికున్న‌ప్పుడు అత‌నితో బిల్‌గేట్స్ డీలింగ్స్ జ‌ర‌ప‌డాన్ని అంగీక‌రించ‌లేక‌పోయింది మెలిందా. దీంతో.. ఆ ఇద్ద‌రు సుదీర్ఘంగా చ‌ర్చించుకుని.. విడాకులు తీసుకోవాల‌నే ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. ఇలా, ఆ 27 ఏళ్ల బంధం ముగిసిందంటూ అమెరికాకు చెందిన ప్ర‌ముఖ వార్తా సంస్థ "వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌" స్పెష‌ల్ స్టోరీ ప్ర‌చురించింది.

రెజ్ల‌ర్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. సుశీల్‌పై లుక్అవుట్ నోటీసులు

రెండుసార్లు ఒలంపిక్ మెడ‌లిస్ట్‌. ఓసారి ప్ర‌పంచ ఛాంపియ‌న్‌. అనేక జాతీయ స్థాయి ప‌త‌కాలు, అవార్డులు, రివార్డులు. ఇలాంటి ఘ‌న‌కీర్తుల‌తో పాటు ఇప్పుడు ఆయ‌న ఖాతాలో ఓ మ‌ర్డ‌ర్ కేసు, పోలీసుల లుక్అవుట్ నోటీసులు కూడా చేరాయి. ఇండియ‌న్ స్టార్ రెజ్ల‌ర్ సుశీల్ కుమార్ కోసం పోలీసులు ప‌లు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఆయ‌న్ను అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. ఎప్పటిక‌ప్పుడు ప్ర‌దేశాలు మారుస్తూ.. చిక్క‌డు-దొర‌క‌డు టైప్‌లో త‌ప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో, తాజాగా ఆయ‌న‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు పోలీసులు.  ఈ నెల 4న ఢిల్లీలో జరిగిన దాడిలో 23 ఏళ్ల సాగర్‌ దంకర్‌ అనే జాతీయ స్థాయి రెజ్లర్‌ మరణించాడు. ఛత్రశాల స్టేడియం ప్రాంగణంలో సాగర్‌తో పాటు అతడి మిత్రులైన సోను మహల్‌, అమిత్‌కుమార్‌లపై.. సుశీల్ కుమార్‌తో పాటు అత‌ని ఫ్రెండ్స్ క‌లిసి దాడి చేశార‌ని పోలీసులు చెబుతున్నారు. ఆ అటాక్‌లో తీవ్ర‌గాయాల‌తో రెజ్ల‌ర్ సాగ‌ర్ చ‌నిపోయాడు. తమపై దాడికి పాల్పడింది సుశీల్‌, అతడి మిత్రులే అని గాయపడిన ఓ బాధితుడు పోలీసులకు తెలిపాడు. దాడి జరిగినప్పటి నుంచి సుశీల్‌ తప్పించుకొని తిరుగుతుండటంతో పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. దాడి జరిగినప్పుడు రెజ్ల‌ర్‌ సుశీల్ కుమార్‌ స్టేడియంలోనే ఉన్నాడని అనేందుకు టెక్నిక‌ల్ ఎవిడెన్స్ సేక‌రించారు పోలీసులు. అతడిని అరెస్టు చేసేందుకు ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో వెతుకుతున్నారు. తొలుత హరిద్వార్‌లో అతడు ఉన్న‌ట్టు స‌మాచారం అందింది. పోలీసులు అక్క‌డికి వెళ్లే స‌రికి అత‌ను అక్క‌డి నుంచి ప‌రార్ అయ్యాడు. ఆ తర్వాత రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందిన‌ట్టు ఇన్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చింది. అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు అతడు ప్రతిసారీ తన చోటును మారుస్తున్నాడని పోలీసులు అంటున్నారు. అందుకే, స్టార్ రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌ను ప‌ట్టుకునేందుకు తాజాగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. హ‌త్య కేసులో అత‌ని పాత్ర ఉంద‌ని తేలితే.. ఇక సుశీల్ కుమార్‌ రెజ్లింగ్ కెరీర్ ముగిసిన‌ట్టే. 

ఈటలకు సపోర్ట్ ఇచ్చేదెవరు? హ్యాండిచ్చేదెవరు? 

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మంత్రిపదవి నుంచి అవమానకరంగా తొలగించాలని భావిస్తున్న ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని భావించారు. అయితే తన అనచరులు, నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపిన రాజేందర్... రాజీనామాపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సమయం కొంత లేటైనా ఈటల రాజీనామా చేయడం ఖాయమని ఆయన అనచురులు చెబుతున్నారు. జనాలంతా కరోనా భయంలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయడం సరికాదనే భావనలో రాజేందర్ ఉన్నారంటున్నారు. ఈటల అనుచరుల వాదన ఎలా ఉన్నా.. ఆయన భవిష్యత్ కార్యాచరణపై మాత్రం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొత్త పార్టీ పెట్టాలని దాదాపు నిర్ణయించిన రాజేందర్... కొత్త పార్టీ పెడితే తనతో కలిసి వచ్చేవారెవరు అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. బీసీ ఎజెండాగా జనంలోకి వెళ్లాలా లేక తెలంగాణ ఉద్యమకారుడిగా అన్ని వర్గాలను కలుపుకుని పోవాలా అన్న సందిగ్ధంలో ఉన్నారంటున్నారు. బీసీ ఎజెండాతో పార్టీ పెట్టాలని ఆయనపై బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయని అంటున్నారు. అయితే ఈటలకు మాత్రం రెడ్డి వర్గం నేతల నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుందని అంటున్నారు. దీంతో ఏం చేయాలన్న అంశంపై తన అంతరంగీకులతో ఈటల సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.  కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇటీవలే ఈటలను కలిశారు. కొత్త పార్టీపైనే ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది. ఈటల పార్టీ పెడితే తాను మద్దతు ఇస్తానని గతంలోనే ప్రకటించారు రాజేందర్. టీఆర్ఎస్ లో ఉన్న కొందరు అసంతృప్త నేతలు ఈటలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలను కలిసి మద్దతు తెలిపారు. మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలను కలవడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. హరీష్ రావు వర్గంగా చెప్పుకునే నేతలంతా రాజేందర్ తో టచ్ లోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో కొంత కాలంగా హరీష్ రావు సన్నిహిత నేతలను పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. ఈటలతో ఏనుగు సమావేశం తర్వాత మరో చర్చ కూడా జరుగుతోంది. హరీష్ రావు డైరెక్షన్ లోనే ఈటలను రవీందర్ రెడ్డి కలిశారని కొందరు అభిప్రాయపడుతున్నారు.  కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఈటలకు మద్దతుగా ఉన్నారంటున్నారు. మొదటి నుంచి ఈటల మనిషిగా పేరున్న సదరు ఎమ్మెల్యే ప్రస్తుతానికి బహిరంగంగా ప్రకటన చేయకపోయినా... కొత్త పార్టీ పెడితే మాత్రం మద్దతు ఇవ్వడం ఖాయమంటున్నారు. సీఎం కేసీఆర్ సొంత గడ్డ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఈటలతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కొందరు సీనియర్ నేతలు రాజేందర్ తో రాయబారం నడుపుతున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ లో గౌరవం లేదని భావిస్తున్న వరంగల్ జిల్లాలోని ఉద్యమ నేతలు కూడా ఈటల కొత్త పార్టీ పెడితే చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ నేతలంతా ఈటలకు మద్దతుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ సెకండ్ కేడర్ నుంచి ఈటలకు భారీగా సపోర్ట్ వస్తుందని అంటున్నారు.  2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోల్డ్ వార్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల మధ్య ఆదిపత్య పోరు తీవ్రంగా ఉంది. బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్న సందర్భాలున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం వలసొచ్చిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాత టీఆర్ఎస్ నేతలంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాంటి నేతలంతా ఈటల కొత్త పార్టీ పెడితే... అతనితో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కొందరు నేతలు ఇప్పటికే తమ అనుచరుల ద్వారా రాజేందర్ కు సంకేతం ఇచ్చారని అంటున్నారు.  మరోవైపు ఈటల రాజేందర్ పై నిఘా పెట్టిన అధికార పార్టీ... ఆయనను ఎవరు కలుస్తున్నారన్న దానిపై వివరాలు సేకరిస్తోంది. ఈటల పార్టీ పెడితే ఆయనతో వెళ్లేవారెవరు అన్న దానిపై గులాబీ నేతలు ఫోకస్ చేశారంటున్నారు. ఈటలను కలుస్తున్న నేతలను తమదారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ముందుగా ఈటల నియోజకవర్గం హుజురాబాద్ నుంచే ఆపరేషన్ ఈటల స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించిన తర్వాత ఆయనకు మద్దతుగా మాట్లాడిన నేతలకు తాయిలాలలతో ఎరవేస్తున్నారని చెబుతున్నారు. పదవుల్లో ఉన్న నేతలకైతే .. పదవి పోతుందని హెచ్చరిస్తున్నారట. ఆయినా దారికి రాకపోతే ఏదో ఒక కేసులో ఇరికిందే లొంగ దీసుకునే ప్రయత్నాలను అధికార పార్టీ చేస్తుందని అంటున్నారు. అందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని పోలీసు, రెవిన్యూ శాఖల్లో అధికారులను బదిలీ చేస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ నేతల చర్యలతో... గతంలో ఈటలకు మద్దతుగా నిలిచిన  కొందరు నేతలు ఇప్పుడు వెనకాడుతున్నారని తెలుస్తోంది.

లేఖ‌లు రాస్తే వ్యాక్సిన్లు వ‌స్తాయా? నేను తెప్పిస్తే మీరెందుకు?

వ్యాక్సిన్ల‌కు ఆర్డర్లు పెట్టకుండా.. అడ్వాన్సులు చెల్లించ‌కుండా.. కేవ‌లం లేఖలు రాస్తే వ్యాక్సిన్ ఎలా సరఫరా చేస్తారంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. "నేను వ్యాక్సిన్ ఇప్పిస్తే వేస్తామనడం జగన్ దిగజారుడు తనానికి నిదర్శనం. నేను టీకా తెప్పిస్తే మరి మీరెందుకు సీఎంగా ఉండటం?" అని చంద్రబాబు మండిప‌డ్డారు. వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా? టీకా కోసం కేటాయించిన రూ.45 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజల ప్రాణాలంటే జగన్‌‌రెడ్డికి లెక్కలేనితనంగా ఉందన్నారు. ప్రతిపక్షాలపై కుట్రలు ఆపి వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు పెట్టాలన్నారు చంద్ర‌బాబు. సీరం, భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌లో.. 50% రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే విధంగా కేంద్రం విధానం చేసిందని చెప్పారు. కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల వయసు వారికి  ఆయా ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందిస్తున్నాయని తెలిపారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌ను కూడా పిలిచింద‌ని అన్నారు.  క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం వెంట‌నే అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తెరిచి పేదల ఆకలి బాధ తీర్చాలని తెలిపారు. కరోనా బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 500మందికి పైగా వైద్య సేవలు అందించామని ప్రకటించారు. కరోనా దెబ్బకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్ర‌బాబు. 

ప‌ర్మిష‌న్ ఉంటేనే హైదరాబాద్‌కు.. పోలీసుల క్లారిటీ..

కొవిడ్ రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చు పెడుతోంది. ఏపీకి చెందిన క‌రోనా పేషెంట్స్‌ను తెలంగాణ‌లోకి అనుమ‌తించ‌డం లేదు పోలీసులు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌రే రోగుల‌ను, వారి వాహ‌నాల‌ను ఆపేస్తున్నారు. ఎంత‌గా బ‌తిమిలాడుకున్నా తెలంగాణ పోలీసులు త‌మ రాష్ట్రంలోకి నో ఎంట్రీ అంటున్నారు. హాస్పిట‌ల్‌లో త‌మ‌కు బెడ్ రిజ‌ర్వ్ అయింద‌ని చెప్పినా ఖాకీలు విన‌డం లేదు. సోమ‌వారం ఉద‌యం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో ఇదే ఆందోళ‌న‌. దీంతో.. తాజాగా, ఏపీ పోలీసులు హైద‌రాబాద్‌కు వెళ్లే వారికి ప‌లు సూచ‌న‌లు చేశారు.  ప్రైవేట్‌ అంబులెన్స్‌లలో వచ్చేవారికి షరతులతో అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా వీలు కానిపక్షంలో రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని..  సదరు వ్యక్తికి తమ ఆస్పత్రిలో పడక సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆస్పత్రి యాజమాన్యం నుంచి ముందస్తు అంగీకార పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. అలాంటి వారికి తెలంగాణలోకి అనుమతి ఉంటుందన్నారు.   ఉద‌యం నుంచీ ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు.. కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ ద‌గ్గ‌ర కూడా.. తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్‌ రోగులకు తెలంగాణ‌లోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు.  అనంత‌పురం నుంచి హైద‌రాబాద్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను పుల్లూరు టోల్‌ప్లాజా ద‌గ్గ‌ర పోలీసులు అడ్డుకోవ‌డంతో అందులోని క‌రోనా పేషెంట్ ప‌రిస్థితి విష‌మంగా మారడం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు. చికిత్స కోసం తెలంగాణ‌కు వెళ్తున్న వారిని ఆప‌డం బాధాక‌ర‌ణ‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా ఇరు రాష్ట్రాలు శ్ర‌ద్ధ చూపాల‌ని సూచించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు తాజాగా ప‌లు సూచనలు చేశారు. ఏపీ నుంచి తెలంగాణ‌కు వెళ్లాలంటే.. ముంద‌స్తు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌క‌టించారు.

న‌దిలో 48 డెడ్‌బాడీస్‌.. క‌రోనా భ‌య‌మేనా?

న‌దిలో మృత‌దేహాలు తేలుతున్నాయి. ఒక‌టి, రెండు కాదు.. ప‌దుల సంఖ్య‌లో డెడ్‌బాడీస్ నీటిలో కొట్టుకొస్తున్నాయి. ప‌విత్ర గంగా, య‌మునా న‌దులు ఇప్పుడు మృత‌దేహాల దిబ్బ‌లుగా మారాయి. బిహార్‌లోని బ‌క్స‌ర్ జిల్లాలో మృతదేహాల కలకలం చెల‌రేగింది. గంగా నదిలో కిలోమీటర్‌ పరిధిలో 48 డెడ్‌బాడీస్ క‌నిపించాయి. మృత‌దేహాల‌ను చూసి స్థానికులు ఒక్క‌సారిగా బెదిరిపోయారు. వెంట‌నే పోలీసుల‌కు, అధికారుల‌కు స‌మాచారం అందించారు.  మరోవైపు యమునా నదిలో కూడా భయానక దృశ్యాలు కనిపించాయి. పదికి పైగానే కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పుర్‌ జిల్లాలో న‌దిలో మృత‌దేహాలు తేలియాడుతుండ‌టం చూసి స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. హామిర్‌పుర్‌, కాన్పూర్‌ జిల్లాల్లోని గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోతుండటం, శ్మశానవాటికలు నిండిపోతుండటంతో మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారని అంటున్నారు.  కరోనాతో చ‌నిపోయిన వారి మృత‌దేహాల‌కు అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి భ‌య‌ప‌డి.. ఇలా న‌దిలో వ‌దిలేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు, క‌రోనా మృతుల‌కు ద‌హ‌న సంస్కారాలు చేయాల్సిన కొంద‌రు సిబ్బంది సైతం ఇలా బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తూ న‌దిలో ప‌డేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.  యూపీలోని హామిర్‌పుర్‌, కాన్పుర్‌ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం చేయరు. వాటిని నదిలో వదిలేస్తారు. అందుకే, యమునా నదిలో అప్పుడప్పుడు తేలుతున్న మృతదేహాలు కనిపిస్తాయన్నారు. అయితే, ఓవైపు క‌రోనా కార‌ణంగా మృతుల సంఖ్య భారీగా పెర‌గ‌డం.. మ‌రోవైపు,  కొవిడ్ భ‌యంతో అంత్య‌క్రియ‌లు చేయ‌కుండా చాలామంది మృత‌దేహాల‌ను ఇలా న‌దిలో వ‌ద‌ల‌డం వ‌ల్ల‌.. ఇటు గంగా నదిలో, అటు య‌మునా న‌దిలో ఇలా డెడ్‌బాడీస్ తేలుతూ క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. అయితే, గంగ‌లో కేవ‌లం ఒక‌ కిలోమీట‌ర్ ప‌రిధిలోనే 48 మృత‌దేహాలు తేలుతూ ఉండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. 

సీఎం జగన్ మిస్సింగ్! ఏపీలో పొలిటికల్ హీట్..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనా వైరస్ కు పోటీగా రాజకీయ వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడి అంశంలో అధికార, విపక్షాల మధ్య యుద్ధమే సాగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత దూషణలతో లీడర్లు కాక రేపుతున్నారు.  ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. కరోనాతో రోగులు అల్లాడుతున్నా ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. చికిత్స అందక, ఆక్సిజన్ లేక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారని చెబుతున్నారు. కరోనా కేసులు, మరణాల లెక్కల్లో తేడాలున్నాయని, కరోనా వేరియంట్ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. ఇది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని.. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేననేది ఆరోపిస్తోంది. తాజాగా  సీఎం జగన్ కనిపించడం లేదంటూ ట్వీట్ చేసి వాతావరణాన్ని మరింత వేడెక్కించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.  “కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, క‌డుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం వైఎస్ జగన్ వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు. జ‌నానికి నేనున్నాను అని హామీ ఇచ్చి నేడు క‌నిపించ‌కుండా పోయాడు. నేను విన్నాను అని అరిచి చెప్పిన జగ‌న్ రెడ్డి, రాష్ట్రంలో క‌రోనాతో మ‌ర‌ణిస్తున్న వారి ఆర్త‌నాదాలు వినిపించుకోవ‌డం లేదు.” అని లోకేష్ ట్వీట్ చేశారు. రచ్చబండ పేరుతో సీఎం జగన్, ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై మండిపడుతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు... సీఎం జగన్ కనిపించడం లేదన్నారు. చివరిసారిగా తాడేపల్లిలో కనిపించారని.. ఆ తర్వాత ఆచూకీ లేదని ఎద్దేవా చేశారు. పాదయాత్ర సమయంలోనే ప్రజలకు దర్శనమిచ్చిన ముఖ్యమంత్రి.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని.. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పిన సీఎం ఇప్పుడెక్కడని ప్రశ్నించారు. ఇక తనపై కుట్ర చేసి మరీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారని రఘురామ అన్నారు. అలాగే అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన.. తానేమీ భయపడనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రఘురామ కృష్ణం రాజు తెలిపారు.

బెంగాల్లో ఆగని హింస.. మమత ఎక్కడ?

పశ్చిమ బెంగాల్ అస్సెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఇంచుమించుగా వారం రోజుల పైనే అయింది. ముఖ్యమంత్రిగా మంట బెనర్జీ మూడవసారి ప్రమాణ స్వీకారంచేసి కూడా ఐదారు రోజులైంది. అయినా, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మొదలైన హింస ఇంకా ఆగలేదు. తాజాగా వీర్భూమ్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దుబ్రాజ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముక్తినగర్ గ్రామంలో తృణమూల్ బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందార‌ని, మరో ఆరుగురు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు.  ఈ నెల ఐదవ తేదీన ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీఅక్రం చేసిన సందర్భంగా మమత బెనర్జీ,   ఇంతవరకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎన్నికల సంఘం అధీనంలో వుంది, ఈ రోజు నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలకు నాదీ పూచీ, ఇకపై రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక  సంఘటనలు జరగా కుండా చర్యలు తీసుకుంటాను. కరోనా కట్టడి తర్వాత, రెండవ ప్రాధాన్యత శాంతి భద్రతల పరిరక్షణే అని ఘట్టిగా చెప్పారు.అంతే కాదు, రాజకీయ పార్టీలు హింసకు తావీయరాదని విజ్ఞప్తి చేశారు. అలాగే, హింసను కట్టడి చేసందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, కఠిన  చర్యలతో  హింసను అణచి వేస్తామని చెప్పారు.  అయితే, మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రంలో హింస ఆగలేదు, సరి కదా, మరింతగా ప్రబలుతోంది. ఇటు అధికార పార్టీ కార్యకర్తలు, అటు బీజేపీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.  మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే, పశ్చిమ మిడ్నాపూర్’ ప్రాంతంలోని పంచక్కుడిలో కేంద్ర మంత్రి మురళీ ధరన్ కాన్వాయ్’పై తృణమూల్ కార్యకర్తలు కర్రలు, కత్తులతో దాడి చేశారు.కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల వర్షం కురిపించారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అలాగే, మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి ముందు ఎలాంటి పరిస్థితి వుందో, ఈరోజుకు కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందని,తాజా సంఘటన సహా ప్రతినిత్యం జరుగతున్న సంఘటనలే రుజువు చేస్తున్నాయి. మరో వంక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషితున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  ఇదిలావుండ‌గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బృందం శని, ఆదివారాలలో  రాష్ట్రంలో హింస చోటుచేసుకున్న ప్రాంతాల‌ను సందర్శించింది. ఆదివారం  బృందం వీర్భూమ్ జిల్లాలో ప‌ర్య‌టిస్తోంది. మే 2 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత నుంచి ప‌శ్చిమ బెంగాల్‌లో హింసాయుత ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజుల్లోనే 16 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఆ పార్టీ  జాతీయ అధ్యక్షడు నడ్డా ప్రకటించారు.మరోవనక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల విషయంలో ప్రత్యేకదృష్టిని కేంద్రీకరించింది.   అదలాఉంటే, కేంద్ర మంత్రి కాన్వాయ్’ దాడి సంఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేసమాని పోలీసులు చెపుతున్నారు. ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే, అసలు దోషులను వదిలేసి, బాధితులపై కేసులు పెడుతున్నారని, బీజేపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. అలాగే, ఇతర సంఘటనలకు సంబంధించి మమత బెనర్జీ ప్రభుత్వం ప్రేక్షక పాత్రను పోషిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవంక కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడంతో పాటుగా, ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి పంపిన కేంద్ర బలగాలను అవసరార్ధం అక్కడే ఉంచింది. అవసరం అయితే రంగంలోకి దించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని  కేంద్ర హోమ్ శాఖ వర్గాల సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, స్థానిక సమాచారం. మరో వంక  కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా ఓ వంక కరోనా, మరో వంక హింస బెంగాల్’ ను కలవరానికి గురిచేస్తోంది.

కొవిడ్ రోగి ఎక్కడైనా ఆసుపత్రిలో చేరొచ్చు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు 

దేశంలో కల్లోలం స్పష్టిస్తున్న కోవిడ్ మహమ్మారి కొత్త కొత్త సమస్యలు తీసుకువస్తోంది. రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయి.  ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం రాష్ట్రాలు ఘర్షణలు పడుతున్నాయి. లాక్ డౌన్ అంశంలోనే పలు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయి. కొవిడ్ రోగులకు చికిత్స విషయం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. హాస్పిటల్స్ లో బెడ్లు లేకపోవడంతో రాష్ట్రాలన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ రాష్ట్రంలోని హాస్పిటల్స్ లో ఇతర రాష్ట్రాల కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నాయి. అంబులెన్సులను తమ సరిహద్దుల్లోని నిలిపివేస్తున్నాయి.  ఏపీ నుంచి వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దుమారం రేపింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు.. కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ ద‌గ్గ‌ర కూడా.. తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్‌ రోగులకు తెలంగాణ‌లోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ పోలీసుల ఆంక్షలతో ఏపీ నుంచి అంబులెన్సుల్లో వచ్చిన కోవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  పలు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కొవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న నేపథ్యంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చింది. కొవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, కొవిడ్ పాజిటివ్ టెస్టు రిపోర్టు లేకపోయినా కరోనా రోగిని చేర్చుకోబోమని ఏ ఆసుపత్రి నిరాకరించరాదని స్పష్టం చేసింది. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రులు ఈ మేరకు నడుచుకోవాలని పేర్కొంది. కొవిడ్ నిర్ధారణ అయిన, కొవిడ్ అనుమానితుల  అంశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడంచెల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాయలని సూచించినట్టు తన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా దేశంలో పరిమితంగానే వ్యాక్సిన్ డోసుల లభ్యత ఉన్నందున ఒక్క విడతలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అమలు చేయలేకపోతున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించడం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. 

ఏయ్.. ఎవడ్రా నువ్వు.. మ‌హిళ‌తో ట్రాప్ చేస్తావా?

త‌న‌ను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా మ‌నుషుల‌ను కూడా నియ‌మించార‌ని ఆరోపించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై నోటికొచ్చిన‌ట్టు కారు కూత‌లు కూయ‌డం అందులో భాగ‌మేన‌న్నారు. త‌న‌కు రోజూ వంద‌లాది కాల్స్ చేసి.. అస‌హ‌నానికి గురి చేసి.. త‌న‌పై కేసులు పెడ‌దామ‌ని ప్లాన్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌న‌ను ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని చెప్పారు ర‌ఘురామ‌.  ఇదంతా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణా రెడ్డి చేయిస్తున్నారంటూ ఆయ‌న‌పై ప‌రుష ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. "ఏయ్ సజ్జల.. ఎవడ్రా నువ్వు.. ఆఫ్ట్రాల్ నువ్వో జర్నలిస్ట్.. అనధికార హోంమంత్రిలా వ్యవహరిస్తున్నావు. మహిళా హోంమంత్రికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నీ వ్యవహారాలు చేస్తున్నావు. బుద్ధి తెచ్చుకో.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కోర్టులు ఉన్నాయి. మీ వెదవ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహంకారం వద్దు. సజ్జల, వైఎస్ జగన్.. మీ పరిధిల్లో ఉండండి. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోకండి’’ అని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు ‘‘నేను ఖాళీగా ఉంటానా రెడ్డీ. నీ దగ్గర నా మనుషులు కూడా ఉన్నార్రా. సజ్జల... సారీ బిజ్జల దిశానిర్దేశంతో.. నన్ను అసహనానికి గురి చేసి కేసులు వేద్దామని ప్లాన్ చేసినట్టు వాళ్లు చెప్పారు’’ అని ఆయన అన్నారు.  ‘‘నీ ప్రభుత్వం పతనావస్థలో ఉంది. మీ కుట్రలను త్వరలోనే బయటపెడతాను. సైబర్ క్రైమ్ పోలీసులకు నా వ్యక్తిగత కార్యదర్శి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని లేఖలో తెలిపాను. వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశాన‌న్నారు ర‌ఘురామ‌.  మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్‌పైనా ఓ రేంజ్‌లో చెల‌రేగిపోయారు ఎంపీ ర‌ఘురామ కృష్ణరాజు. జ‌గ‌న్ పిచ్చివాడంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. విపక్ష నేతలపై, తనపై కేసులు పెట్టడం పిచ్చి చర్యకాకపోతే మరేంటని ప్రశ్నించారు. ‘‘కాబోయే సీజేఐపై కూడా ఫిర్యాదు చేశావ్‌.. ఇది పిచ్చి చర్య కాదా.. ఎక్కువ కాలం ఇది సాగదు. పాలకుడు పిచ్చివాడైతే పాలించే అర్హత లేదని రాజ్యాంగం చెబుతోంది. జగన్‌ పరీక్ష చేయించుకోవాలి.. పిచ్చివాడని తేలితే పాలించే అధికారం మరొకరికి ఇవ్వాలి. లేకపోతే నువ్వు పిచ్చివాడివని కేసు నమోదు చేసి విచారణ జరపాల్సి ఉంటుంది. ఇది వాస్తవ ఆరోపణ.. నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని రఘురామ అన్నారు. కరోనా విలయతాండవం వేస్తుంటే.. ప్రజలు వ్యాక్సిన్లకోసం పడిగాపులుగాస్తుంటే.. కనీసం సమీక్షంచడం లేదంటూ సీఎం జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు ర‌ఘురామ‌. 

అప్పుడు కాంగ్రెస్ హీరో.. ఇప్పుడు కమల దళం సారధి..

అస్సాం 15 వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన, హేమంత్ విశ్వ శర్మ, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఈశాన్య రాష్టాలపై మంచి పట్టున్న నాయకుడు. అయితే, అదే శర్మ ఇప్పుడు, ఒక్క అస్సాంలోనే కాదు ఈశాన్య రాష్ట్రాలు అన్నింటా, కమల దళానికి అండా,దండా అన్నీ తానై పార్టీని విజయ పథంలో ముందుకు తీసుకు పోతున్నారు. ఒకప్పుడు, ఈశాన్య రాష్ట్రలలో బీజేపీ ఎప్పటికీ, అధికారంలోకి రాదు, రాలేదు అని ఘంటాపథంగా చెప్పిన రాజకీయ పండితుల అంచనాలను శర్మ ఐదేళ్ళు తిరక్కుండానే తల్లకిందులు చేశారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అస్సాంనే కాదు కమ్యూనిస్ట్ పార్టీల పెట్టని కోట త్రిపురలోనూ,బీజేపీ అధికారం హస్తగాం చేసుకుందంటే, అందుకు ఇంకా అనేక కారణాలు ఉన్నా, మూల కారణమా మాత్రం హేమంత్ విశ్వ శర్మ.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చియన్ సమయంలో అయన చేసిన ప్రతిజ్ఞ. ఒక్క అస్సాంలోనే కాదు, సెవెన్ సిస్టర్ స్టేట్స్’గా పిలుచుకునే ఏడు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ ఓక్ బలమైన శక్తిగా ఎదుగిందంటే, అందుకు శర్మ శపధమే ప్రధాన కారణం.  కట్ చేస్తే, ఇంతకీ శర్మ శపధం ఏమిటంటే, ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని నమ రూపాలు లేకుండా చేయడమే అయన చేసిన ప్రతిజ్ఞ. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, అదేపార్టీని భూస్థాపితం చేయాలన్న స్థాయిలో వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమిటి? అదొక కథలా సాగే నిజం. హేమంత్ విశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నరోజుల్లో,ఓరోజు,రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చర్చించేందుక శర్మ, అప్పటి అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తరుణ్ గోగోయి, అస్సాం పీసీసీ అధ్యక్షుడు   రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పెంపుడు కుక్కతో అడుకుంటున్న రాహుల్ గాంధీ, నేతలను ఒక విధంగా నిర్లక్ష్యం చేశారు. పట్టించుకోలేదు. అవమాన పరిచారు. కుక్కకు ఇచ్చిన విలువను నాయకులకు ఇవ్వలేదు.ఇక అప్పుడే,శర్మ ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం వృధా ఆనం నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో  ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పుడే,అ దే రోజున రామ్ మాధవ్ ని కలిసి బీజేపే చేరారు.  ఇక అక్కడి నుంచి బీజేపీ నేతగా, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్’గా అవిశ్రాంతంగా శ్రమించారు. 2016 ఎన్నికల్లో అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపే గెలుపుకు మూలాధారం అయ్యారు. అయిన పార్టీ సర్బానంద్ సోనోవాల్’ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినా, మంత్రిగా సర్దుకు పోయారు. పార్టీ బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు, వరసగా రెండవసారి పార్టీ అధికారంలోకి రావడలోనూ కీలక పాత్రను పోషించిన హిమంత విశ్వ శర్మ.అస్సాం 15వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ జగదీష్ ముఖి ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మణిపూర్ ముఖఅయమంత్రి ఎన్.బీరేన్ సింగ్, నాగాల్యాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

పుట్ట మ‌ధు.. పుట్ట‌లో పాములెన్ని? ఉచ్చు బిగించారా? జెడ్పీ పీఠం ఎవ‌రికి?

పుట్ట మ‌ధు. ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌. కేసీఆర్ టార్గెట్ చేస్తే ఎట్ల‌ ఉంటదో తెలిసేలా చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ జిల్లా ప‌రిష‌న్ ఛైర్మ‌న్‌ను.. ఆ అధికార పార్టీనే వెంటాడుతోంది. వేటాడేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మాజీ మంత్రి ఈట‌ల ఎపిసోడ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మ‌ధును.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు భీమ‌వ‌రంలో ప‌ట్టుకున్నా విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌ధును.. పోలీసులు విచారిస్తున్నారు. లాయ‌ర్ వామ‌న‌రావు దంప‌తుల మ‌ర్డ‌ర్ కేసులో ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. పోలీసుల విచారణలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నోరు విప్పడం లేదు. అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారంటే.. అదే పొరపాటు జరిగిందంటూ స‌మాధానం చెప్పాడ‌ని తెలుస్తోంది. న్యాయవాదుల హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పుట్ట మధు చెబుతున్నట్లు తెలుస్తోంది.  ఇంత జ‌రుగుతున్నా.. ఇప్ప‌టికీ పుట్ట మ‌ధు టీఆర్ఎస్ నాయ‌కుడే. మ‌ధును పార్టీ నుంచి, జ‌డ్పీ ఛైర్మ‌న్ పదవి నుంచి తొలగించే అంశంపై టీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. రేపోమాపో వేటు ఖాయం. మ‌రోవైపు, జడ్పీ చైర్మన్ పదవి కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కందుల సంధ్యారాణిని పెద్ద‌ప‌ల్లి జెడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఎంపిక చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ మేర‌కు త్వ‌ర‌లోకే కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.  ఇక‌, పుట్ట మ‌ధుతో పాటు ఆయ‌న భార్య పుట్ట శైలజను కూడా పోలీసులు విచారించనున్నారు. ఆమెతో పాటు కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌ను కూడా విచారిస్తున్నారు. ఫిర్యాదుదారు గట్టు కిషన్‌రావును కూడా పిలిపించి మాట్లాడారు. ‘‘హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతులను హత్య చేసేందుకు హంతకులకు రూ.2 కోట్ల సుపారీ ఇచ్చిందెవరు? బిట్టు శ్రీను కారు కొనేందుకు డబ్బులు ఎవరిచ్చారు? కుంట శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణం ఎలా జరుగుతోంది?’’ పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ విచారణలో భాగంగా పోలీసులు ఆరా తీస్తున్న అంశాలివి. వీటిపై  నిజానిజాలను రాబట్టేందుకు పుట్ట మధుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా బ్యాంకు మేనేజర్లకు పోలీసులు లేఖలు రాశారు. వారి కాల్‌ డేటానూ క్షుణ్ణంగా పరిశీస్తున్నారు. ఈ కేసులో పుట్ట మధు ప్రమేయం ఉన్నట్లుగా తేలితే ఆయనను రిమాండ్‌ చేయవచ్చని తెలుస్తోంది.  పుట్ట మ‌ధు ఆర్థిక లావాదేవీలు, ఫోన్‌ కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును గత మార్చి నెలలో కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా పుట్ట మధు భార్య శైలజ అక్కడికి వచ్చారు. తన ఫోన్‌ నుంచి ఎవరికో ఫోన్‌ చేసి బిట్టు శ్రీనుతో మాట్లాడించారు. ఈ వ్యవహారంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదు మేరకు ఆమెపై మంథని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఆమె ఎవరికి ఫోన్‌ చేసి బిట్టు శ్రీనుతో మాట్లాడించారనే విషయమై కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు నాలుగు రోజుల క్రితం ముత్తారం, మంథని, రామగిరి ఎస్‌ఐల బదిలీ జరగగా, ఆదివారం మంథని సీఐ జి.మహేందర్‌రెడ్డిని వరంగల్‌ కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం పుట్ట మధు వ్య‌వ‌హారంపై ఎంత సీరియ‌స్‌గా ఉందో అర్థమవుతోంది. పుట్ట మ‌ధు రిమాండ్‌ త‌ప్ప‌దంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఏపీలో వ్యాక్సినేష‌న్ బంద్‌!.. ముఖ్య‌మంత్రి ఏం చేస్తున్న‌ట్టు?

కావ‌ల‌సిన‌న్ని వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో లేవు. ప్ర‌భుత్వ స‌న్నాహాలు స‌రిగ్గా లేవు. అందుకే, ఏపీలో ప‌లు జిల్లాల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్ర‌హ‌స‌నంగా మారుతోంది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎక్క‌డిక‌క్క‌డ వ్యాక్సినేష‌న్‌ను నిలిపి వేస్తున్నారు అధికారులు. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి హామీ లేక‌పోవ‌డం.. టీకాలు నిండుకోవ‌డంతో.. ఉన్న‌ట్టుండి హ‌ఠాత్తుగా వ్యాక్సినేష‌న్‌ను ఆపేస్తున్నారు జిల్లా స్థాయి అధికారులు. ముఖ్య‌మంత్రి స్థాయిలో వ్యాక్సిన్ నిల్వ‌ల‌పై స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఏపీలోని పలు జిల్లాల్లో నిలిచిపోయింది. కొన్ని చోట్ల సోమ‌వారం, మరికొన్నిచోట్ల సోమ‌, మంగ‌ళ‌వారాల్లో కూడా వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.  చిత్తూరు జిల్లాలో ఓ వైపు కొవిడ్‌ టీకా రెండో డోస్‌ వేయించుకోవాల్సిన వారి జాబితా తయారు చేస్తుండగా.. జిల్లాలో రెండ్రోజుల పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపేస్తున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. టీకా కార్యక్రమం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సెకండ్‌ డోస్‌ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు.    కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. జిల్లాలో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రెండో డోసు కోసం గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.  జిల్లా అంతా టీకా వేస్తున్నా గన్నవరంలో వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కలెక్టర్‌, ఎమ్మెల్యేకు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో టీకా వేయలేమని అధికారులు చెబుతుండంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.   విజయనగరం జిల్లాలోనూ సోమ‌వారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. మంగ‌ళ‌వారం నుంచి యథావిధిగా వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పారు. మరోపు తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లోనూ టీకా పంపిణీ నిలిచిపోయింది.   ఇలా, ఏపీ వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం అర్థాత‌రంగా ఆగిపోతోంది. టీకాల కొర‌తే ఇందుకు కార‌ణ‌మని తెలుస్తోంది. కేంద్రం నుంచి స‌ర‌ఫ‌రా త‌గ్గిపోవ‌డం.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌రైన ప్ర‌య‌త్నాలు లేక‌పోవ‌డం.. ప్ర‌స్తుత ఆటంకానికి కార‌ణం అంటున్నారు. ఏపీలో క‌రోనా భారీగా విజృంభిస్తున్న వేళ‌.. ఇంత‌టి ప్రాధాన్య‌మైన టీకా కార్య‌క్ర‌మం ప్ర‌హ‌స‌నంగా సాగుతుండ‌టం సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేత‌గాని త‌న‌మేన‌ని విమ‌ర్శిస్తోంది విప‌క్షం.   

ఏపీకి షాక్‌.. తెలంగాణ‌లోకి నో ఎంట్రీ.. జ‌గ‌న్‌రెడ్డి ఫెయిల్యూర్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా మ‌హ‌మ్మారికి కేంద్రంగా మారుతోంది. నిత్యం 20వేల‌కు పైగా కేసుల‌తో ద‌డ పుట్టిస్తోంది. కొత్త ర‌కం వైర‌స్ అంటూ కూడా వార్త‌లు వ‌స్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌, చేత‌గాని త‌నం వ‌ల్ల‌.. ఏపీలో తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త‌, హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ ప్రాబ్ల‌మ్స్‌, అంత్య‌క్రియ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. ఏపీలో క‌రోనా విజృంభ‌ణ చూసి మిగ‌తా రాష్ట్రాలూ వ‌ణికిపోతున్నాయి. ఏపీ ప్ర‌జ‌ల‌ను అనుమానంతో చూస్తున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీ రాష్ట్రం ఏపీ వాసుల ప్ర‌వేశంపై నిషేధం విధించింది. తాజాగా, మ‌రో తెలుగు స్టేట్ అయిన‌.. తెలంగాణ సైతం ఏపీ ప్ర‌జ‌ల‌ను క‌ట్ట‌డి చేస్తుండ‌టం రాష్ట్రంలో క‌రోనా తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం.   ఏపీ నుంచి వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు.. కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ ద‌గ్గ‌ర కూడా.. తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఏపీలో విస్తృతంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున కొవిడ్‌ రోగులకు తెలంగాణ‌లోకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మిగతా వాహనాలను మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు. ఇదొక్క‌టి చాల‌దా.. ఏపీలో క‌రోనా క‌ల్లోలం ఏ రేంజ్‌లో ఉందో చెప్ప‌డానికి. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ లాంటి రాష్ట్రాల‌తో పోలిస్తే.. సౌతిండియాలో క‌రోనా కేసులు ఓ మోస్తారుగా ఉన్నాయి. కానీ, చుట్టు ప‌క్క‌ల మ‌రే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం కొవిడ్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు పెర‌గ‌డానికి.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఉదాసీన వైఖ‌రే కార‌ణ‌మంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స‌ర్కారు ఆల‌స్యంగా స్పందించ‌డం.. క‌రోనా క‌ట్ట‌డికి స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ విప‌త్క‌ర ప‌రిస్థితులంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో తీవ్ర ఆక్సిజ‌న్ కొర‌త‌, ఆసుప‌త్రిలో వ‌స‌తుల లేమితో.. క‌రోనా రోగులు అల్లాడిపోతున్నారు. అందుకే, హైద‌రాబాద్‌లోనైనా కాస్త బెట‌ర్ ట్రీట్‌మెంట్ దొరుకుతుందేమోన‌నే ఆశ‌తో అటువైపు వెళుతున్నారు. దీంతో.. ఏపీలో కేసులు పెరుగుతుండ‌టం, కొత్త వైర‌స్ అంటూ వార్త‌లు వ‌స్తుండ‌టంతో.. తెలంగాణ పోలీసులు సైతం అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నారు. ఏపీ ప్ర‌భుత్వం చేసిన పాపానికి త‌మ‌కు ఎందుకు రిస్క్ అనుకున్నారో ఏమో.. ఆంధ్రప్ర‌దేశ్ నుంచి వ‌చ్చే కొవిడ్ పేషెంట్స్‌ను స‌రిహ‌ద్దుల్లోనే ఆపేస్తున్నారు. అంబులెన్సుల‌ను వెన‌క్కి పంపించేస్తున్నారు. అయితే, అంబులెన్సుల‌ను వెన‌క్కి పంప‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం అంత‌రాష్ట్ర రాక‌పోక‌ల‌పై నిషేధం ఏమీ లేదు. అయినా, అంబులెన్సుల‌ను తెలంగాణ‌లోకి అనుమ‌తించ‌క‌పోవ‌డం దారుణ‌మంటూ ఏపీ వాసులు మండిప‌డుతున్నారు. మాన‌వ‌తా ధృక్ప‌దంతోనైనా రోగులతో వ‌చ్చే అంబులెన్సుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని అడుగుతున్నారు. అందుకు, తెలంగాణ పోలీసులు స‌సేమిరా అంటుండ‌టం విచార‌క‌రం. ఇటు, ఏపీలో స‌రైన చికిత్స పొంద‌లేక‌, అటు ప‌క్క రాష్ట్రానికి వెళ్ల‌లేక‌.. రాష్ట్రంలోని కొవిడ్ పేషెంట్స్ ప్రాణాల‌తో పోరాడుతున్నారు. త‌మ‌కు ఎందుకీ క‌ష్టమంటూ పాల‌కుల‌పై మండిప‌డుతున్నారు.      అటు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో అత్యవసరంగా ప్రయాణించాలనుకొనే వారికోసం ఈ-పాస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. మ‌రోవైపు, అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుతం ఉన్న షరతులు వర్తిస్తాయని ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ చెప్పారు. కరోనా తీవ్రత, కేసుల పెరుగుదల దృష్ట్యా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదని డీజీపీ స్పష్టం చేశారు. శుభకార్యాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తున్నామన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు. కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌.

క్రికెట్ ఆడుతున్న ఏనుగు.. 

ఏనుగు ఏనుగు నల్లన.. ఏనుగు కొమ్ములు తెల్లన.. ఏనుగు మీద రాముడు.. ఎంతో చక్కని బాలుడు. ఈ పాట అందరికి గుర్తు ఉండే ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ జంతువులు కూడా అప్ డేట్ అవుతున్నాయి. తాజాగా ఒక ఏనుగు క్రికెట్ ఆది తనదైన శైలిలో ఇండియా క్రికెటర్లకు సవాల్ విసురుతుంది.  ఆ ఏనుగు క్రికెట్ ఆడడం చూసిన ప్రముఖ ఇండియా క్రికెటర్లు కూడా స్పందించారు. భలే భలే ఏనుగు. క్రికెట్ ఆడే ఏనుగు గురించి తెలుసుకుందామా..?  ఆఫ్ సైడ్ ముగ్గురు ఫీల్డర్లని ఉంచిన మావటి.. ఏనుగు కాళ్లపైకి బంతిని విసిరాడు. కానీ. తొండంతో బ్యాట్‌ని పట్టుకున్న ఏనుగు లాఘవంగా ఫీల్డర్ల తలపై నుంచి బంతిని హిట్ చేసింది. ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొండంతో బ్యాట్‌ని పట్టుకున్న ఏనుగు.. మావటి విసిరిన బంతిని లాఘవంగా హిట్ చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారగా.. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఫన్నీగా స్పందించారు. కొంత మంది అభిమానులు.. ఇంటర్నేషనల్ క్రికెటర్ల కంటే ఈ ఏనుగు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తోందంటూ జోక్‌లు పేలుస్తున్నారు. ఆఫ్ సైడ్ ముగ్గురు ఫీల్డర్లని ఉంచిన మావటి.. బంతిని విసరగా తొలుత ఫీల్డర్ల ముందు బంతి పడేలా కొట్టిన ఏనుగు.. ఆ తర్వాత బంతిని ఫీల్డర్ల తలపై నుంచి వెనక్కి హిట్ చేసింది. దాంతో.. క్యాచ్ పట్టుకోవడంలో ఆ ఫీల్డర్లు విఫలమయ్యారు. ఏనుగు పక్కన నిల్చొని మరో మావటి దానికి సూచనలు చేస్తూ కనిపించాడు. గతంలో ఓ ఏనుగు ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించింది. కానీ.. ఏనుగు క్రికెట్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఏనుగు క్రికెట్ ఆడటంపై వీరేంద్ర సెహ్వాగ్ ఫన్నీగా స్పందించాడు. ఏనుగు తొండం, కన్ను సమన్వయం పతాకస్థాయిలో ఉందని చెప్పుకొచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. కవర్స్ దిశగా ఆ ఏనుగు కొట్టిన షాట్‌కి ఫిదా అయిపోయాడు. మైకేల్ వాన్ ఏకంగా.. ఆ ఏనుగుకి ఇంగ్లీష్ పాస్‌పోర్ట్ ఉంటుందని జోస్యం చెప్పాడు. దాంతో.. ఇంగ్లాండ్‌కి చెందిన డేవిడ్ మలాన్ టీ20ల్లో చూపిన తెగువ కంటే ఈ ఏనుగు చాలా బాగా ఆడుతోంది. కాబట్టి.. అతని స్థానంలో ఈ ఏనుగుని తీసుకోండి అని ఓ నెటిజన్ చురక అంటించాడు. మొత్తానికీ ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాల్ హల్‌చల్ చేస్తోంది.

మాజీ డీజీపీ ప్రసాద్ రావు మృతి.. 

ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ ప్రసాద్ రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ప్రసాద రావు సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన ప్రసాద్ రావు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఎనలేని కృషి చేశారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా, ఏసీబీ డీజీ, ఆర్టీసీ ఎండీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఆయన కృషి చేశారు. బి.ప్రసాదరావు 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 1997లో ఆయన భారత పోలీసు, 2006లో రాష్ట్రపతి పతకాలు అందుకున్నారు. ‘వర్డ్‌ పవర్‌ టు మైండ్‌ పవర్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన మరణవార్త రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.  

కరోనా కష్టాల్లో భారత్.. 

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,66,317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. వైరస్ బారినపడి కొత్తగా 3,747 మంది మృతిచెందారు. దీంతో మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 2,46,146 కు పెరిగింది. దేశంలో క‌రోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న వారిసంఖ్య 37,41,368కు చేరింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉండ‌గా, దేశంలోని గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది. ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి..  హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు బాధితులు మృతి చెందారు. ప్రాణవాయువు లేక 2 గంటలుగా 20 మంది రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చూపారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఆక్సిజన్‌ రవాణా ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి నిన్న రాత్రే ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రావాల్సి ఉంది. చిరునామా తెలియకపోవడంతో  ట్యాంకర్‌ డ్రైవర్‌ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. దీనిపై నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు  చేయగా.. పోలీసుల సహకారంతో కింగ్‌ కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ చేరింది. అయితే అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేటలో రెండు రోజుల్లో 17 మంది మృతి..  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారినపడి మృతిచెందుతున్న బాధితుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ఆరుగురు కరోనా పేషెంట్లుమృతి చెందారు. శుక్రవారం పదకొండు మంది చనిపోగా, కేవలం రెండ్రోజుల్లోనే పదిహేడు మంది మృతిచెందడంతో కరోనా పేషెంట్లు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ వృద్ధులకు బీపీ షుగర్ ఉండటంతో చనిపోతున్నట్లు సమాచారం.

ప్రేమలో ఫెయిల్.. బీఈడీ విద్యార్థిని సూసైడ్.. 

అమ్మానాన్న నన్ను క్షమించండి. నేను ప్రేమలో మోసపోయాను.  ఈ విషయంలో పోలీసులు కూడా నాకు న్యాయం చెయ్యలేదు. రక్షణ కల్పించలేదు. అందుకే నేను చనిపోతున్నాను. మీరు దైర్యంగా ఉండండి. ఇది ఒక అమ్మాయి చనిపోతూ రాసిన లేఖ.. ఇంతకీ ఏం జరిగింది..? ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది.? దానికి గలకారణాలు ఏంటో తెలుసుకుందాం..   అది బయ్యారం మండలం. మిర్యాలపెంట పంచాయతీ, పత్యాతండా. ఆ యువతి పేరు ధరంసోత్‌ సునీత(21) వరంగల్‌లో బీఈడీ చదువుతున్న రోజుల్లో ఇదే తండాకు చెందిన మాలోతు శివ మాయమాటలతో ప్రేమలోకి దించాడు. ఆ అమ్మాయికి బతుకు మీద ఆశ కలిపించాడు. ఆమె కూడా నిజమే అనుకుంది. ఆ తరువాత ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి కాలేజీ కి వెళ్ళింది. చదువు పూర్తయ్యాక కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పాడు.  కట్ చేస్తే.. సునీత ఏప్రిల్‌ 4న కళాశాల నుంచి  తిరిగి ఇంటికి వచ్చింది.  చాలా రోజులుగా ఉన్న సునీత శివతో మాటాడాలని కలుద్దామని ట్రై చేసింది. శివ అందుకు టైం ఇవ్వడంలేదు. శివలో వచ్చిన మార్పును గమనించి సునీత. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆమెపై అత్యాచారయత్నంతో పాటు కిడ్నాప్‌నకు యత్నించాడు శివ. ఆ విషయం పై  ఇరు కుటుంబాల మధ్య వివాదానికి దారి తీసింది. అనంతరం జరిగిన ఘర్షణలో శివతోపాటు సునీత తండ్రి బిచ్చ గాయపడ్డారు. ఇరు కుటుంబాలు ఏప్రిల్‌ 24న బయ్యారం పోలీసులను ఆశ్రయించగా విచారణ చేపట్టిన పోలీసులు సునీత తండ్రి బిచ్చపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. అండగా ఉండే తండ్రి జైలుకు వెళ్లడంతో పాటు తండాలోని కొందరు కుటుంబాన్ని దూషించడాన్ని తట్టుకోలేక సునీత తీవ్ర మనస్తాపానికి గురైంది.  ఒక వైపు  ప్రేమ వ్యవహారంలో ఎదురైన వేధింపులు,  మరో వైపు ఇరు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు. మరోవైపు ఊర్లో వాళ్ళ సూటిపోటి మాటల తో  మనస్తాపం చెందిన యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తన కుటుంబానికి సరైన న్యాయం చేయలేదని.. రక్షణ కనిపించడం లేదని, ప్రేమ విషయంలో మోసపోయానని.. అమ్మానాన్న క్షమించాలని, మీరు ధైర్యంగా ఉండాలని లేఖలో రాసింది. ఇదిలా ఉండగా సునీతను వేధిస్తున్న శివపై చర్య తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహంతో ధర్నాకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై జగదీష్‌ను వివరణ కోరగా.. సునీత తండ్రిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారించి కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రేమ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. సునీత ఆత్మహత్యపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతికి కారణమైన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.